పి.సత్యవతి
”నాకు చిన్న నాటి నించీ ప్రకృతి అంటే చాలా ఇష్టం. మనుషులూ, జంతువులూ, పక్షులూ ఎంతో ఇష్టం. నాలో నేను ఏడవగలను. ఏ కళారూపాన్నైనా నన్ను నేను మరచి అను భవించగలను… అతి బాల్యంలో పెద్దావుు దూడ మూతి చిక్కం ఎవరూ చూడకుండా విప్పేశాను- మనసు బాధ కలిగి… మరునాడు గొడ్ల సావిట్లో దూడ చాలా బాధ పడుతున్నది. మన్ను తిన్నదట. నేను మా బామ్మగారి కొంగు పట్టుకుని ఏడుపు ఆపుకుంటూ నించున్నాను. ”బుల్లెమ్మ గారేనండి ఇప్పే సింది నేను చూశా” అన్నాడు ఉగాది. మా బామ్మ నన్ను నిమ్మళంగా ఎత్తుకుని నాముఖంలోకి చూస్తూ కంట్లో నీళ్ళు తెచ్చుకుంది. ఈనాటికీి ఆ కన్నీళ్ళకి నాకు అర్థం తెలియడం లేదు”.
ఇలా చెప్పుకోగల అవకాశం అదృష్టం పల్లెసీమల్లో పుట్టి పెరిగిన వాళ్లకే వుంటుంది. పుట్టి, ఆ పల్లె సీమల అమాయకత్వాన్నీ అందాన్నీ పరిశీలిస్తూ, ఆస్వాదిస్తూ పెరిగిన వాళ్ళ హృదయం ఎప్పుడూ ఆ అద్భుతమైన కాలాన్ని నెమరు వేసుకుంటూనే వుంటుంది. అందుకే, తను విన్న తను కన్న ఆంధ్ర భూమి, తన ”అలరాసపుట్టిళ్ళ”ను తలచు కుంటూ ఈ రచయిత తన పుస్తకాన్ని మన హృదయాలలో ప్రవేశపెట్టారు. 1941కి ముందున్న పల్లెటూర్లే తెలిసిన ఈమె మనసులో ఆనాడు పచ్చని చేలతో పల్లెపడుచుల నవ్వులతో, లేగల పరుగులతో అలరారిన తెలుగునాటి పల్లెసీమలే నిలిచి వెలిగాయి. వివాహమౌతూనే మద్రాసు మహానగరంలో పాదం పెట్టిన ఆమెకి తన పుట్టిల్లు ఒక పచ్చని జ్ఞాపకం. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలతో విస్తృత పరిచయం కల కళ్యాణసుందరి భాష, అచ్చం పుట్టింటి భాషే… దానిపై ఏ ప్రభావమూ లేదు. ఒక్కొక్క రచయిత పేరు చెప్పగానే ఆ రచయిత వ్రాసిన ఒక అద్భుతమైన కథ పాఠకుల మనసులో తళుక్కున మెరుస్తుంది. ఆ రచయిత ఎన్ని కథలు వ్రాసినా ఏదో ఒక కథే ఆమెని పదే పదే గుర్తు తెస్తుంది. ”అలరాస పుట్టిళ్ళు” అటువంటి కథ. స్త్రీ రచయితలు వ్రాసిన కొన్ని మంచికథలు అనే అంశాన్ని తీసుకున్నా ఈ కథ గుర్తు రావాల్సిందే. గ్రంథాలయాలను మెరుగు పర్చుకునే సంస్కృతిని కోల్పోయినాక చాలా మంది రచయితల పుస్తకాలు వ్యక్తిగత సేకరణలలో గానీ దొరకని సందర్భంలో సదాశివరావుగారు పూనుకుని మళ్ళీ ఆమె కథలన్నీ సేకరించి అందుబాటులోకి తెచ్చారు. లేకపోతే ఒక మంచి రచయిత కథలు చదివే అవకాశం ముందు తరాలకు వుండేది కాదు. ఎనభైలకి ముందే స్త్రీ రచయితలు మంచి కథలు రాసి వున్నారు. మనకు వాళ్ల రచనల్ని గురించి తెలుసు కోడమూ వాటిని సేకరించడమూ చారిత్రక అవసరం. స్త్రీల రచనలలో వచ్చిన పరిణామాలను తెలుసుకోడానికి కూడా. అవసరం. ఈ వరసలో ముందు కళ్యాణసుందరిని తలుచుకుందాం. ఈమె వ్రాసిన ఇరవై కథల్లోకి వెళ్ళేముందు ఆమె జీవన నేపథ్యాన్ని తెలుసుకోవాలి కదా? అది కొంతవరకూ ఆమె తన పుస్తకానికి వ్రాసుకున్న ”నామాట”లోనూ కొంత వఖలిబిజీరీ ళితీ ఙరిరీరిళిదీవ అనే గ్రంథంలో కృష్ణాబాయిగారు వ్రాసిన వ్యాసంనుంచి సేకరించాను. విశాలాంధ్ర వారు ప్రచురించిన ”తెలుగు కథకులు కథన రీతులు” పుస్తకంలో ఆమె గురించిన వ్యాసంలో వ్యక్తిగత వివరాలు లేవు.
1922 జూన్ 22లో జన్మించిన కల్యాణసుందరి గారిది కృష్ణా జిల్లా. ఆమె వివాహం చేసుకున్న ఎన్. జగన్నాథ్ గారిది గోదావరి జిల్లా. కులాంతర వివాహం. జగన్నాథ్ గారు కమ్యూనిష్ట్… శ్రీశ్రీ, కొడవటిగంటిలకు మిత్రుడు. ఆహుతి సినిమా నిర్మాత. ఇద్దరి భావజాలాలో తేడాలున్నప్పటికీ. వీరిది స్నేహమయ దాంపత్యం. కుటుంబ స్నేహితుడైన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ప్రోత్సాహంతో భారతి పత్రికలో తొలికథ వ్రాశారు. అది దుఃఖాంత కథ. ఎందుకంటే ”జీవితంలో కష్టాలే నా కంట పడతాయి. కష్టాలంటె నాకు అభిలాష కాదు బాధ” అంటారు. 1941లో అలా కలం చేతపట్టిన కల్యాణసుందరి కుటుం బంలో జరిగిన కొన్ని విషాదాల వలన కథలకి దూరంగా ఉండిపోయారు. తరువాత మళ్ళీ జగన్నాథ్ గారి ప్రోత్సాహంతో కథలు వ్రాయడం మొదలుపెట్టారు. వరసగా అద్భుతమైన కథలు ”మాడంతమబ్బు”, ”అలరాస పుట్టిళ్ళు” వచ్చాయి. ఆమె కథలు ఆమె జ్ఞాపకాలలో నించీ ఊహాప్రపంచంలో నించీ రూపుదిద్దుకుని సహజ సుందరంగా కలంనించీ జాలువారతాయేగానీ ప్రయత్నపూర్వకంగా వ్రాసినవి కావు. అలా వ్రాయగలగడం తన సుకృతమంటారు. స్వచ్ఛ సుందరమైన తెలుగు నుడికారం, మనుషుల పట్ల ప్రేమ, ప్రకృతిలో చిన్న చిన్న విషయాలను సైతం విడచి పెట్టని పరిశీలన ద్వేషరహితమైన ఆంతర్యం. ఏ పాత్ర పట్లా తొణకక నిర్మమకారంగా కథ చెప్పుకు పోవడం కల్యాణసుందరిని కథకులలో ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. పల్లెవాసుల జీవితాలను ఎంత పరిశీలనాత్మకంగా చిత్రిస్తారో నగరవాసుల అలవాట్లనూ అంతే శ్రద్ధగా చిత్రిస్తారు. ఈమె కథలన్నిటిలో (జిలిరిశిళీళిశిరితీ) ప్రధాన వస్తువు ప్రేమ… ఎక్కువగా విషాందాంత ప్రేమ. ఇరవై కథలతో 1997లో మనకి అపు రూపంగా అంది వచ్చిన ఈ కథా గుచ్ఛంలో దాదాపు కథలన్నీ ప్రేమకి సంబంధించినవే. అలరాస పుట్టిళ్ళు. మాడంత మబ్బు, చిరుచెమటలు చందనం, సాయంకాలే వనాంతే, అనిల జ్యోతి, మనచేతుల్లో ఏముంది, సముద్ర జ్వాల మొదలైనవి. ఈ కథలన్నిటిలో తలమానికం అనుకునే కథ అలరాసపుట్టిళ్ళు. తరువాత మాడంతమబ్బు.
భూస్వామ్య కుటుంబాలలో పరువు ప్రతిష్టలకుండే ప్రాధాన్యత ఆపేక్షలకీ అంతః కరణలకీ ఉండదు. అందులోనూ పరువు ప్రతిష్ఠలను నిలిపి వుంచే బాధ్యత స్త్రీల మీదే వుంటుంది. ఆస్తులు అంతస్తులు, కులగోత్రాలు ఇవ్వన్నీ జాగ్రత్తగా కాపాడుతూ తమ మనసుల్లో ఎక్కడ స్రవించిన చెమ్మని అక్కడ ఇగరబెట్టుకునే బాధ్యత కూడా వాళ్ళదే. చిన్నప్పటినించీ ఆ ఎరుకతోనే పెరుగుతారుకనుక విధికి తలవంచే వుంటారు. కానీ ఎక్కడో సత్యవతి లాంటి నూటికొక్కరు మనసు చెప్పేమాట విని అలా విన్నందుకు శిక్ష అనుభవిస్తారు. సత్యవతిది స్పందించే హృదయం. అందుకే ముక్కూ మొహం తెలీని చెంగల్వరాయుడు మొదటిసారి గాయాలతో వస్తే తలుపు చాటునించే రక్తం తుడుచుకోడానికి గుడ్డ అందించింది. అన్న కన్నెర్ర చేస్తే లోపలికి పోయింది. చెంగల్వ రాయుడు తమ అంతస్తుకు తగడని తెలిసీ అతన్ని హృదయంలో పదిలపర్చుకుంది. మరొకరితో కాపురం చెయ్యలేక మళ్ళీ మళ్ళీ పుట్టింటికొచ్చింది. పరువుగల కుటుంబంలో స్త్రీలు అలా రావడాన్ని ఏ కుటుంబపెద్ద సహిస్తాడు? ఆమె అన్న కూడా సహించలేక పోయాడు బల్లకట్టెక్కించి గోనలేరులో తోసేశాడు. అంత దుర్మార్గానికి ఒడిగట్టిన అన్న చేతులు కడిగేసుకుని కాలు మీద కాలేసుకుని చుట్ట కాలుస్తూ కూచోలేక పోయాడు. అపరాధ భావంతో కృశించి పోయాడు. సిరిసంపదలు పరువు ప్రతిష్ఠలతో తులతూగిన అలరాస పుట్టింటి శిధిల చిత్రంతో కథ మొదలై పొరలు పొరలుగా ముడులు వీడి నిజం చెప్పి భార విముకుడైన అన్న మరణంతో ముగుస్తుంది… ముందు అరుగులతో మొదలుపెట్టి అన్న మరణ శయ్య వున్న గదిలో ప్రవేశించేవరకూ శిధిలమైన ఆ ఇంటిని వర్ణించడం కల్యాణసుందరికే సాధ్యం అనిపిస్తుంది”…. గడ్డివాములు వున్న చోట వరిగడ్డి కుళ్ళి మోకాటిలోతున పడివుంది. గచ్చుపగిలి సగం విరిగిన చావడిలో ఒకమూలన నులక మంచాలూ, విరిగిన గోనెమడత మంచాలూ మేటగా పడివున్నాయి. మరొకవైపున తుప్పుపట్టిన నాగటికర్రలూ, కొడవళ్ళూ, గొడ్డళ్ళూ, విరిగిన నాగలికొయ్య లూచీకిపోతున్న గోనెలూ పలుపులూ మేటగా పడివున్నాయి. కట్టుకొయ్యలన్నీ ఖాళీ.. పైకప్పు మీద పెంకులు లేచిపోయినయి. చాలా చోట్ల పెద్దగాలివానకి విరిగిన కొబ్బరిచెట్లు, బాదంచెట్టు పడినవి పడినట్లే ఎండి పోయినయి. సగం విరిగిన కమ్మరేగు చెట్లు విరిగినంతవరకూ తల్లి చెట్టునించి వేళాడుతూ అట్లాగే ఎండిపోయాయి. కుంకుడు బూరుగ చెట్ల కింద రాలిన పండాకులు మోకాళ్ల ఎత్తున రాలి ఎండుతున్నాయి. చుట్టూ ఉమ్మెత్త జిల్లేడి చెట్ల మయం.” ఒకప్పటి వ్యవసాయ వైభవం నిర్లక్షానికి గురై ధ్వంసమైన దృశ్యం. కంటి చూపుతోనే కుటుంబాన్నీ ఊరినీ శాసించిన సుబ్బారాయుడు చెల్లెలి హత్యతరువాత మంచంపట్టి ఆస్తీ అంతస్తూ పోగొట్టుకుని ఇంటిని గబ్బిలాలకు నిలయంగా చేసుకున్న వికృత విషాదాన్ని, రాచపుట్టిళ్ల క్రౌర్యాన్ని, వయోలిన్ మీద విషాద గీతాన్ని ఆలాపించి నట్లు ఈ కథని వినిపిస్తారు కల్యాణసుందరి. ఈమె కథలన్నీ ఆమె మనముందుకూచుని ”ఇహను ఆ తరవాత ఏంజరిగిందంటే” అని చెబుతున్నట్లుంటాయి. భాషా, వస్తువూ, కథనం, శిల్పం విడదీయలేనంత చిక్కగా కలిసిపోతాయి.. ప్రేమను వ్యక్తం చెయ్యడం ఎరిగిన భాగ్యాన్నీ, ప్రేమకూ అనుమానానికీ తేడా తెలియని పెద్దిరాజునూ కరువు విడదీసింది. పెద్దిరాజు వలసకూలీగా వెళ్ళిపోవలసి వచ్చింది. అతనొస్తున్నాడని తెలిసి అతనితో కలిసి భోజనం చెయ్యాలని ఆశపడి ఆకూ వక్కతో సహా అన్నీ అమర్చి, అతనికి అన్నం తిన్నాక బెల్లం ముక్క నోట్లో వేసుకోడం అలవాటని గుర్తొచ్చి వర్షంలో కొట్టుకు వెళ్ళి తెచ్చేలోగానే ఇంటికొచ్చిన పెద్దిరాజు కిటికీ లోనించి రెండు కంచాలనూ లోటాలనూ చూసి అనుమాన పడి వెళ్ళిపోతాడు ”మాడంత మబ్బు”లో. ఈ కథలో కూడా గ్రామీణ వ్యవసాయ నేపథ్యాన్ని అద్భుతంగా చిత్రించారు రచయిత. ”తొలకరికి ముందు పక్క వూళ్లో వున్న చుట్టాలను చూసి వస్తుంటే కొల్లేరు ఎండి వుంది అందులో గుంటలలో అక్కడక్కడ నీళ్లున్నాయి. జమ్ము నిలువెత్తుకు పెరిగి వుంది. జమ్ములో కొంగలు నిలువెత్తు గూళ్లు కట్టుకున్నాయి. పెద్దిరాజు నిలబడి పోయాడు.” ఈ ఏడు ముంపు వస్తుందే!! మన గతి ఏమిటో!! గూళ్ళు చూడు ఎంత ఎత్తుగా కట్టాయో పిట్టలు!! అన్నాడు. భాగ్యం కృంగిపోయింది.” ముంపు వచ్చే సంగతి ముందు పిట్టలకీ, వాటిని బట్టి గ్రామీణులకీ తెలిసి పోతుందన్నమాట.
”మాడంత మబ్బు పట్టె మంగళగిరి మీద,
కురిసేను తిరుపతిలో కుంభ వర్షాలు,
కుంభవర్షాల్ కురిసే, స్థంబాలే తడిసే
వెంకన్న వెండరుగు తడిసె,
మంగమ్మ కూచున్న మండపమే తడిసే” అని పాడకుంటుంది భాగ్యం
పెద్దిరాజు అనుమానమే మాడంత మబ్బు. అది కుంభవర్షం కురిస్తే గానీ తెరిపివ్వదు. ఎప్పటికప్పుడంతే!! చిరుచెమ టలు చందనం కథలో అలిమేలు సత్యాన్ని గాఢంగా ప్రేమించింది. అంతస్తులు తేడా వల్ల ఆమెకు అతనితో పెళ్ళి కాలేదు. కానీ జబ్బులో వున్న అతని బాగుకోసం దైవాన్ని ప్రార్థిస్తూనే తన వైవాహిక జీవితాన్ని ఆమోదిస్తుంది… సాయంకాలే వనాంతే కథలో, మొదటి వివాహాల వల్ల వంచితులైన స్త్రీ పురుషులు దగ్గరై, క్తొత జీవితం ప్రారంభించి అర్థవంతంగా ప్రేమాను రాగాలతో జీవిస్తారు. అతను ఆకస్మికంగా పోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. సౌభాగ్యవతిలో తల్లి, అనిలపుష్పంలో భార్య మూర్ఖులు. జీవించడం. జీవించనివ్వడం తెలియని వాళ్ళు…. తండ్రీ కూతుళ్ళ ప్రేమ, తండ్రీ కొడుకుల అనురాగం, తల్లీ కొడుకుల ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఇవ్వే ఆమె కథలనిండా వుంటాయి. వాద వివాదాలు, సిద్ధాంత నిరూపణలు, ఆవేశాలు, కాగడాలకి కూడా అందవు. రచయితకి మానవత్వం పైన, ప్రేమ పైన, జీవితం పైన అమిత గౌరవం. ఆమె విధిని నమ్ముతారు.” ”జిలిశి తిరీ బిబీబీలిచీశి తీబిశిలి, దీళిశి తీబిశిబిజిరిరీళీ’ అని రాస్తూవచ్చానంటారు. ”మానవ ప్రయత్నాలు అన్ని వేళలా ఫలితాలనివ్వవు. కానీ మానవులు ప్రయత్నాలు మానకూడదు” అనేది ఆమె నమ్మకం. థామస్ హార్డి ఆమె అభిమాన రచయిత. కథా రచన ఆమెకొక కమనీయ అనుభవం. తలవంపులు తెచ్చే అజ్ఞానాలూ, మూఢత్వాలూ, తప్పులను మినహాయించి, మన పూర్వపు నాగరికత ఔన్నత్యమూ, సంప్రదాయాలూ, నమ్మకాలు, అర్థవంతమైనవనీ వాటిని యువతకు పరిచయం చెయ్యాలనీ ఆమె ఆకాంక్ష.
అలరాస పుట్టిళ్ళు కథ ఆమె కుటుంబంలోనే ఆమె పూర్వీకుల కుటుంబంలోనో జరిగివుండాలనీ లేకపోతే ఆ కథ పాఠకుల హృదయాలలో నిలిచిపోలేకపోయేదనీ ఆమె మేనకోడలంటే ”మేరీ షెల్లీ, ఫ్రాంకెన్ స్టెయిన్ ఎలా వ్రాయగలిగింది?.ఖబిదీగి తీబిబీశిళిజీరీ బీళిదీశిజీరిలీతిశిలి శిళి రీతిబీనీ ఖిలిలిచీ రీశిళిజీరిలిరీ, రీతిబీళిదీరీబీరిళితిరీ, చీరీగిబీనీలి, ళితిజీ ళిగీదీ రీశితిఖిరిలిరీ… జిరిదిలి శినీలి జిరిరీశి వీళిలిరీ ళిదీ.” అని సమాధానమిచ్చారట కల్యాణసుందరి. ఆమె కథా కథన చాతర్య రహస్యం అదే కావచ్చు. 2000 సంవత్సరంలో చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో కల్యాణసుందరిని కలిశాను. జీవితంలోని ఆటుపోట్ల ప్రభావం వయస్సు ప్రభావం ఆమె తనువుపై చాలా కనిపించినా, మనో సౌకుమార్యం, నమ్రత నిరాడంబరత, ప్రేమతత్వం మాత్రం చెక్కు చెదరలేదు. 2002 జులై 19న ఆమె శారీరకంగా మనకు లేకుండా పోయారు. నా కెప్పుడూ ఆమె ఒక కథలో అన్నమాట గుర్తుకొస్తుంది.” ”గర్వం వుండటం గర్వకారణం కాదుకదా?” అని. ఆ ఎరుక ఎంతమందికుంటుంది?
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags