శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్. శాంతసుందరి
”ఎంత డబ్బు వస్తుందిట?”
”పాతిక రూపాయలు.”
”ఆమె చిరునామా తీసుకో. ఆ పాతికా నేను పంపిస్తాను.”
”ఇదేం ఒకటి రెండేళ్లతో అయిపోయే విషయం కాదు. జీవితాంతం ఇవ్వాలి.”
”నేను బతికున్నన్నాళ్లూ ఇస్తాను.”
నేనా విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాసుదేవ్‌కి మాత్రం చెప్పాను. అతను మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
లక్నోలో హోలీ
వాసుదేవ్ ప్రసాద్ అలహాబాద్‌లో వకీలు కోర్సు చదువుతున్నాడు. అతన్ని కూడా హోలీ పండగకి రమ్మని పిలిచాం. పెద్దవాడు ధున్నూ రంగులు పూస్తారని భయపడి బైటికి పరిగెత్తాడు. వాసుదేవ్ ప్రసాద్, బన్నూ పైకెళ్లి గది తలుపులు బిగించుకుని లోపల కూర్చున్నారు. మా ఆయన ఆయన గదిలోనే ఉండిపోయారు. ఎవరెవరో వచ్చి ఆయన మీద రంగులు జల్లి వెళ్తున్నారు. అప్పుడు ఆయనకి తరచు దగ్గు వస్తోంది. చాలామంది వచ్చి ఆయన్న నిలువునా రంగుల్లో తడిపేసి వెళ్లాక, ”మీకు దగ్గొస్తుందన్న భయం లేదా?” అన్నాను.
”అబ్బాయిలూ, అల్లుడూ తలో మూలా దాక్కున్నారాయె. నన్నూ అలాగే చెయ్యమంటావా? అయినా ఈ ముగ్గురూ ఏరి?” అన్నారు.
”ధున్నూ ఎటో పరిగెత్తాడు. మిగతా ఇద్దరూ గది తలుపులు మూసుకుని పైన కూర్చున్నారు,” అన్నాను.
”వాసుదేవ్, బన్నూ, ఇద్దరూ కిందికి రండి!” అని కిందినించే పిలిచారు.
వాళ్లిద్దరూ కిందికి దిగి రాగానే, ”అరె, రంగుల్ని చూస్తే అంత భయమా? అవి ఉత్త రంగులేనా? పైగా ఈ రోజుల్లో హిందువులు మాత్రమే హోలీ పండగ చేసుకుంటారు. మీరిద్దరూ కింద ఉండి ఉంటే మీమీద కూడా చల్లేవారు, నేను కొంచెం తప్పించుకునేవాణ్ణి. చూడండి మీరిద్దరూ లేకపోయేసరికి, నేనే కుర్రాడిలా తయారయాను! ఇంత చిన్న వయసులోనే ఉత్సాహం లేకుండా ఇలా తయారయారేమిటి?” అన్నారు.
వాసుదేవ్ తల వంచుకుని ఆయన మాటలు వింటూ నిలబడ్డాడు. ధున్నూ కూడా ఆయనచేత చివాట్లు తిన్నాడు.
తలుపుని చూస్తే భయం
1928లో ఒకసారి ఆయన మాంసం కొనేందుకు బజారుకెళ్లారు. ఏ తొమ్మిదిన్నరకో ఇంటికి తిరిగొచ్చారు. పిల్లలిద్దరూ స్కూలుకెళ్లి పోయారు. నేను బైట కూర్చునున్నాను. తెచ్చిన మాంసం నా చేతికిచ్చి, ”పరుపు లోపల పెట్టించావు కదా?” అని అడిగారు.
”అయ్యో, మర్చిపోయాను! ఇప్పుడు పెట్టి వస్తాను ఉండండి!” అన్నాను.
”నువ్వేం వెళ్తావులే, నేను పెడతాను,” అన్నారు.
పరుపులోపల పెట్టి తలుపులు ముయ్య బోయారు. తులపులు లాగగానే అవి వచ్చి మీద పడ్డాయి. అదృష్టం కొద్దీ ఇనుపకమ్ములు అడ్డం ఉన్నాయి. తలుపులు ఆ కమ్ముల మీద పడ్డాయి. పెద్ద చప్పుడయింది. తలుపులు కింద పడగానే తెరుచుకున్నాయి. ఈయన గబుక్కున లోపలికి తప్పుకున్నారు, కానీ కాలికి దెబ్బ తగిలింది. నాకూ దెబ్బ తగిలింది. నాకు దెబ్బ గురించి పెద్దగా ఏమీ అనిపించ లేదు. నేను పరిగెత్తి ఆయన దగ్గరకెళ్లాను. అక్కడ గదిలోపల ఒక మూల నిలబడి ఆయన భయంతో వణికిపోతూ కనిపించారు. నేనాయన్ని గట్టిగా పట్టుకున్నాను. కాసేపటికి కుదుటపడి, ”ఇవాళ మనం అదృష్టం బావుండి బతికి పోయాం. ఇద్దరం ఒకేసారి పోవలసింది!” అన్నారు.
”ఎన్నాళ్లు రాసి పెట్టి ఉంటే అన్నాళ్లూ బతికే ఉంటాం, ఏమీ జరగదు!” అని ధైర్యం చెప్పాను.
కానీ ఆనాటినుంచీ ఆయనకి తలుపు లంటే భయం పట్టుకుంది.
లక్నోలో బాణాసంచా
1928లో నవంబర్ మాసం. లక్నోలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు వైస్‌రాయ్ వచ్చాడనుకుంటా. ఈయన ఆఫీసునించి వచ్చారు. ”ఇవాళ లక్నోలో నలభైవేల రూపాయలు బాణాసంచాకోసం, లైట్లకోసం ఖర్చవబోతోంది. నీ జీవితంలో ఇలాటిది ఎప్పుడూ చూసి ఉండవు!” అన్నారు నాతో.
”అంత డబ్బు ఎవరి దగ్గర మూలుగు తోంది? అంత నిర్దయగా ఎలా ఖర్చు పెడుతున్నారు?” అన్నాను.
”ఎవరు ఖర్చు పెట్టేది? చూడడానికి వెళ్తావా అని అడుగుతున్నాను. పిల్లల్ని కూడా వెంట పట్టుకెళ్ళి చూపించు.”
”మీరు కూడా వస్తారా?”
”ఆఁ, వస్తాను, ఎందుకురాను? పేదవాళ్ల ఇళ్ళు తగలబెట్టి తమాషా చూడద్దా? కళ్లారాచూసి, నిట్టూర్చి, సిగ్గూ ఎగ్గూ లేకుండా నవ్వుతాను! అంతకన్నా నేను చెయ్యగలిగిందే ముందు కనక?”
నాకు ఇంకా అంత డబ్బు ఎక్కణ్ణించి వస్తుందో తెలీలేదు. ఈయన మాటలు కూడా నాకేమీ అర్థం కాలేదు. నేను నవ్వుతూ, ”ఇప్పటివరకూ మీరు రచయిత మాత్రమే, ఇంత కవిత్వం హఠాత్తుగా ఎక్కణ్ణించి వచ్చింది మీలో?” అన్నాను.
”లేదు, నేనేమీ కవిత్వ భాష మాట్లాడ్డం లేదు. ఏడవలేక నవ్వుతున్నాను, అంతే!”
”మీరిలా ఏమేమో డొంకతిరుగుడుగా మాట్లాడితే నాకర్థం కాదు. సరిగ్గా అర్థమయేట్టు చెప్పండి!”
”ముందు నాకొక గ్లాసు చల్లటి మంచినీళ్లియ్యి.”
నేను లోపలికెళ్లాను. కొన్ని బాదం పప్పులూ, చల్లటి మంచినీళ్లూ తెచ్చి ఆయనముందు పెట్టాను. నేను ఆయన పక్కనే కూర్చున్నాను. ఇంతలో పిల్లలు కూడా వచ్చి మా పక్కన చేరారు. పిల్లలు బాదం పప్పులు, చిల్లోజా పప్పులూ తినసాగారు. ఆయన చిల్లోజాలు ఒక్కొక్కటే ఒల్చుకుతింటుండడం చూసి, నేను ఒలిచి ఇద్దామనుకున్నాను. ”వద్దు, నువ్వు ఒలిచిస్తే నేను అన్నీ ఒకేసారి తినేస్తాను, నన్నిలా ఒక్కొక్కటీ ఒలుచుకుని తిననీ. ఊఁ, ఇంకా విను బాణాసంచా సంగతి. రాజులూ, మహారాజులూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొంత డబ్బు ఇచ్చి వెళ్తారు, ఎందుకో తెలుసా? వైస్‌రాయ్‌గాని, బ్రిటిష్ రాజకుమారుడుగాని వచ్చినప్పుడు వాళ్లకి స్వాగతం చెప్పేందుకు ఖర్చు చెయ్యడానికి. ఏమైనా లోటుంటే దాన్ని భర్తీ చెయ్యడానికి రైతులు దగ్గర వసూలు చేస్తారు. వాళ్లు రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు గడ్డి గాదంలాగ ఈ బాణాసంచాలో నింపుతారు, తగలబెడతారు. దేశంలో సగటు మనిషి సంపాదన రోజుకి ఆరు పైసలు అయినప్పుడు, అలాంటి దేశంలో ఒక్కో ఊళ్లో నలభై యాభై వేలు అలా తగలబెట్టేందుకు వీళ్లకి హక్కు ఎవరిచ్చారు? ఒంటినిండా బట్ట కూడా లేని మన దేశంలో, రెండు పూటలా ఒక ముద్ద కూడా దొరకని పేదవాళ్లున్న ఈ దేశంలో, ఇంత క్రూరంగా డబ్బుని బూడిద చెయ్యడం, అదీ వైస్‌రాయ్ గారిని ఆనందింపజేయటానికి, ఈ బొర్రలు పెంచిన ఆసామీలకి ఆయన బిరుదులిస్తాడని, ఇలా చెయ్యడం ఎంతవరకూ న్యాయం?”
పిల్లలు దీపాలగురించి విని, పదండి నాన్నా, చూద్దాం అని గొడవచెయ్యడం మొదలుపెట్టారు. వాళ్లని ఊర్కోమని చెపుతూ, ”ఇప్పుడే కాదు, మీరు వెళ్లి ఆడుకోండి. రాత్రి పెడతారు దీపాలు,” అన్నారు. పిల్లలిద్దరూ వెళ్లాక,” అయితే వీళ్లు డబ్బులెందుకిస్తారు?” అని అడిగాను.
”ఇవ్వకపోతే ప్రాణాలతో వదుల్తారా? ఈ బొర్రలు పెంచిన వాళ్లు వాళ్లని మింగేస్తారు కాని వదిలేస్తారా?” అన్నారు.
”సరే ఎలాగూ చావాల్సి ఉంటే ఏమైన చేసి చావచ్చు కదా?” అన్నాను.
”ఇక్కడున్న వాళ్లలో ఎనభైశాతం రైతులే, మిగిలిన వాళ్లు ఇరవై శాతం. వీళ్లలోనే చదువుకున్న వాళ్లు, ఉద్యోగాలు చేసుకునే వాళ్లూ, డబ్బున్నవాళ్లూ, ఉంటారు. వీళ్లకే కనక అంత బుద్ధి, అంత శక్తీ ఉంటే ఇంగ్లీషువాళ్లు మన దేశాన్ని నూటయాభై ఏళ్లుగా పాలిస్తారా? వీళ్లకి బుద్ధీలేదు, శఖ్తి అంతకన్నా లేదు.”
”అయితే అందరూ పనికి మాలిన వాళ్లేనా?”
అప్పుడాయన గంభీరంగా, ”చూస్తే అలాగే ఉంది. దేశం ఇంకా దేనికీ సిద్ధంగా లేదు!” అన్నారు.
”వీళ్లే ఎప్పుడో ఒకప్పుడు తయార వుతారా?” అని అడిగాను. ”కానీ అందరూ సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తున్నారే?” అన్నాను మళ్లీ.
”అంటే ఏమిటర్థం? మనం ఎంత మొద్దుబారిపోయామంటే, దాని తాలూకు బాధ కూడా మనకి తెలీటంలేదన్నమాట!” అన్నారు.
”అయితే ఈ జబ్బుకి మందు లేదా?”
”గాంధీ మహాత్ముడు ఏమైనా చెయ్యగలడేమో చూడాలి. లేకపోతే ఇలా బాధల్ని భరిస్తూనే కాలం గడిచిపోయి, పరిస్థి తులు ఇంకా దారుణంగా తయారవుతాయి. మనిషి తను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మరొకరిని చంపే శక్తి అతనికి వస్తుంది,” అన్నారు.
”తనే చనిపోతే ఇంక ఇంకొకర్ని ఏం చంపగలడు? తను ఉంటే కదా ఏమైనా చేసేందుకు”.
”నీకు తెలుసుకదా, మృత్యువు వెంటాడు తోందని తెలిసినప్పుడు మనిషి దేనికైనా తెగిస్తాడు, అంటారే, అలాగే ప్రమాదం ముంచుకొస్తే మనిషి అన్నిటికీ సిద్ధపడతాడు. కాస్తంత సుఖం దొరుకుతున్నంతవరకూ మనిషి దాన్ని వదులుకోవటానికి ఇష్టపడడు. ఇంకా కావాలనిపిస్తుంది. ఇక చావు తప్పదని తెలిసిపోయాకగాని చావుకి సిద్ధపడడు,” అన్నారాయన.
”మరి తెల్లవాళ్లు డబ్బు లాక్కోడానికనే వస్తున్నారా?”
”అలా అని అనలేం. కానీ బలవంతుడే ఎప్పుడూ బలహీనుణ్ణి పీడిస్తాడు అనేది మాత్రం నిజం.”
”అయితే స్వరాజ్యం వస్తే, ఈ పీడించడం ఆగిపోతుందా?”
”అన్నిచోట్లా కొద్దోగొప్పో ఈ పీడించడం అనేది ఉంటూనే ఉంటుంది. బలహీనుణ్ణి బలవంతుడు దోచుకోవడం అనేది ప్రపంచమంతటా పరిపాటిగా మారింది. కానీ, రష్యాలో ధనవంతుల్ని చావగొట్టి సాపుచేసి పారేశారు. ఇప్పుడక్కడ పేదవాళ్ల జీవితాలు ఆనందంగా గడుస్తున్నాయి. బహుశా ఇక్కడ కూడా కొన్నాళ్లకి రష్యాలో ఉండే పరిస్థితిలాంటిది రావచ్చు,” అన్నారాయన.
”అలాటి ఆశలేవైనా ఉన్నాయా?” అని అడిగాను.
”ఇంత తొందరగా అలాటి ఆశలేవీ పెట్టుకోలేం.”
”ఒకవేళ తొందరగా అలా అయిందనుకోండి,మీరెవరి పక్షం ఉంటారు?”
”కూలీవాళ్ల పక్షం, రైతుల పక్షం ఉంటాను. ముందే అందరికీ నేను కూలివాడినని చెప్పేస్తాను. మీరు పారతో పనిచేస్తారు, నేను కలంతో పనిచేస్తాను, అని చెపుతాను. మనిద్దరం సమానమే, అంటాను.”
నేను నవ్వి, ”అలా అన్నంతమాత్రాన సరిపోదు. వాళ్లు మీమాట నమ్మరు,” అన్నాను.
”అప్పటికీి అందరికీ చదువుసంధ్యలు అబ్బుతాయి. రష్యాలో రచయితలు లేరా? అక్కడి రచయితల పరిస్థితి ఇక్కడి వాళ్లకన్నా మెరుగ్గా ఉండటమే కాదు, ఎన్నో రెట్లు బావుంది. ఆ రోజు త్వరగా రావాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను.”
”అయితే రష్యావాళ్లూ ఇక్కడికి కూడా వస్తారా?” అని అడిగాను.
”వాళ్లిక్కడికి రారు, కానీ వాళ్ల శక్తి మనలోకి వస్తుంది.”
”వాళ్లిక్కడికొస్తే మన పని త్వరగా అవుతుందేమో!”
”వాళ్లు రారు, కానీ వాళ్ల శక్తి మనలో కూడా చోటు చేసుకున్న రోజున మన జీవితాలు సుఖంతో నిండుతాయి. అప్పుడు ఇక్కడ కూడా కార్మికులదీ, రైతులదే రాజ్యం అవుతుంది. నా ఉద్దేశంలో మనుషుల సగటు ఆయుష్షు కూడా రెండింతలవుతుంది.”
”అదెలా సాధ్యం?”
”విను, చెపుతాను మరీ! ప్రస్తుతం రాత్రనక పగలనక ఎంత కష్టం చేసినా కడుపునిండా తిండే దొరకటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక దిగులు ఉంటూనే ఉంటోంది.”
”కానీ ఆ దిగులుకి మనమేగా కారణం? కార్మికుల రాజ్యం వస్తే మనకిక దిగులనేది ఉండదా?”
”ఉండదు. మగాడు చనిపోయాక కూడా పెళ్లాం పిల్లలకి ఎటువంటి కష్టాలూ ఉండబోవని తెలిసిందనుకో, ఆ బాధ్యత మగాళ్లది కాదనుకో, దేశమే వాళ్ల బాధ్యత తీసుకుంటుందని తెలిస్తే పిచ్చిపట్టినట్టు ఇలా అలవిమీరిన శ్రమ చెయ్యక్కర్లేదు కదా? సంపాదనలో కొంత విడిగా దాచుకోవాలన్న తపన ఉండదు కదా? అప్పుడు మగాళ్లు కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోరూ? ఇక చింతలేని జీవితం ప్రాణాలని బలితీసుకోదు కదా?”
”ముసలితనంలో పెళ్లిచేసుకున్న వాళ్ల పేర్లు ఒక డజను మీకు నేను చెప్పగలను. మొదటి భార్యకి ఆడపిల్లలూ, మగపిల్లలూ ఉన్నా కూడా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సంపాదించిందంతా ఖర్చుపెట్టేసినా వాళ్లు చనిపోయాక కర్మలన్నీ సక్రమంగా జరిపించుకున్నారు. మరి వాళ్లు చీకూ చింతా లేకుండా దేవుడిమీద భారం వేసి బతకలేదా? మరోపక్క బోలెడంతమంది ధనవంతులు దేన్నిగురించీ ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, దేన్నో ఒకదాన్ని గురించి ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటారే!” అన్నారు.
”ఈ రోజుల్లో, అన్నివైపులా హాహా కారాలు మారుమోగిపోతూంటే, తన కుటుంబం గురించి ఎటువంటి దిగులూ లేకుండా, దేన్నీ పట్టించుకోకుండా, భారమంతా దేవుడిమీద వేసి ఆనందంగా బతికేవాళ్లని, బొత్తిగా సిగ్గూ లజ్జా వదిలేసిన బాపతు అనే అనుకోవాలి. పిల్లలుండగా ముసలితనంలో పెళ్లి చేసుకునేవాళ్ల గురించి ఏమైనా అనడానికి నాకు మాటలు కూడా దొరకటం లేదు. ఇక తన గురించి కాక, అందరి గురించీ ఆందోళనపడేవాళ్లూ, గాంధీగారిలాంటివాళ్లూ, నా దృష్టిలో అందరి కన్నా గొప్ప వ్యక్తులు.”
ఇలా ఏవేవో విషయాలు మాట్లాడుతూ కూర్చునుండగా, పిల్లలు మళ్లీ వచ్చి, ”పదండి నాన్నా, టైమయింది. అందరూ వెళ్తున్నారు,” అన్నారు. అందరం కలిసి బైలుదేరాం. అందరూ ఆనందంగా బాణాసంచాలు కాల్చటం చూస్తున్నారు, కానీ ఈయన దిగులుగా ఒక పక్కన కూర్చుండిపోయారు. తన ఇంట్లో ఆస్తినే ఎవరో తగలబెడుతున్నంత బాధ ఆయన మొహంలో కనిపించింది.
గంటా గంటన్నర పోయాక అందరం ఇంటికి తిరిగి వచ్చేశాం. పిల్లలు రావడానికి ఇష్టపడకపోతూంటే, ”నాకు తలనొప్పిగా ఉంది,” అన్నారు. ఇంటికొచ్చేశాక కూడా కొన్ని నెలలపాటు టపాకాయలు కాల్చి నందుకు బాధ పడుతూనే ఉన్నారు. ఇంట్లో ఎన్నో సార్లు ఈ సంగతి ఎత్తారు, మన దేశం డబ్బు ఇలా వృథా అయిపోతూంటే చూస్తూ కూర్చుని బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేం కదా, అని మనసు కష్టపెట్టుకునే వారు.
”మరి మీరు దాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చెయ్యరు?” అన్నాను.
”అరే, నా వల్ల జరిగే పనే అయితే ఈరోజు నాకాళ్లు నేలమీద నిలిచేవా? ఆకాశంలో ఎగురుతూ ఉండేవాణ్ణి కానూ? అసలు బాధ ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయామనేదే కదా!”
”మనం చేసేదేమీ లేదని తెలిసినప్పుడు బాధపడటంలో అర్థం లేదు,” అన్నాను.
”ఏదేమైనా మన మనసుకి బాధ కలిగించే విషయాన్ని అంత త్వరగా మర్చిపోవటం సాధ్యం కాదులే.”
”ఆ బాణాసంచా కాల్చడం ఎంతో మంది చూసి ఉంటారు. చూసి ఆనందించి ఉంటారు. అవి ఎంత బావున్నాయో అని కూడా అనుకుని ఉంటారు. కానీ మీరేమో వాటిని కాల్చారని బాధపడుతూ విమర్శి స్తున్నారు.”
”ఆలోచన లేకుండా స్తబ్ధుగా ఉండటమంటే అదే మరి. అందరిలోనూ ఉన్నది అదే. ఇంటికి నిప్పంటించి తమాషా చూడ్డం అంటే ఇదే!”
”ఆనందిస్తున్న వాళ్లే మీకన్నా తెలివైన వాళ్లు. మీకు రెండు రకాలుగా నష్టం కలుగుతోంది. ఒకటి టాపాకాయలకి ఖర్చు పెట్టటం, రెండోది మీరు ఇరవై నాలుగ్గాంటలూ దాన్ని గురించి బాధపడటం. రహీమ్ దోహాని ఒక్కసారి గుర్తుచేసుకోండి – ‘రోజులెలా మారుతున్నాయో, మౌనంగా కూర్చుని గమనించండి మంచి రోజులు వచ్చేందుకు అట్టే సమయం పట్టదు’ అనలేదూ?”
”ఈ దేశంలో నీలాంటి బుర్రలే ఎక్కువగా ఉండి ఉంటాయి, అందుకే మన స్వాతంత్య్రా న్ని లాగేసుకున్నారు వాళ్లు. నేను మరో కవిత చెపుతాను విను, ‘పిరికి మనసున్న వాడికి ఒకటే దారి దేవుడా నీదే భారం అనేది బద్ధకస్తుల ధోరణి.’
”అయితే ఏం చెయ్యాలి? అసాధ్యమైన పనిని చేసెదెలా?”
”అంటే నీ ఉద్దేశం ఏమీ మాట్లాడకుండా కూర్చోమనా?”
”ఊరికే ఆలోచించినంత మాత్రాన ఏమీ జరగదు. ఊరికే వాగటానికి ఎవరికి తీరికుంది?” అనేసి నేను లేచి వెళ్లిపోయాను.
1929 : హోలీ
హోలీ రోజున మా ఆయన్ని కలుసుకునేందుకు చాలా మంది ముస్లిములు వచ్చారు. పూల దండలూ, బుక్కా రంగులు తెచ్చారు. ఈయన గదిలో కూర్చుని ఉన్నారు. వచ్చిన వాళ్లు ఈయనకి రంగులు పూసి, పాన్ ఇచ్చారు. ఈయన కూడా వాళ్లకి రంగు పూసి, కావలించుకున్నారు. వాళ్లు చాలాసేపు కూర్చున్నారు. ఆ తరవాత ఈయన వాళ్లతో కలిసి కూర్చుని భోంచేశారు. తింటూనే కబుర్లు చెప్పుకోసాగారు. నాకథ ‘కూర్బానీ’ (బలి) ఆ మధ్యనే అచ్చయింది. దానికి ఆయన్ని అభినందించి, పూలమాలలూ, ఉర్దూలో రాసిన ఏదో కాయితం ఇచ్చారు. వాళ్లని సాగనంపి వచ్చి, ఆ పూలదండలతో, రంగులతో నాతో హోలీ ఆడారు.
”అబ్బ, చాలా ఆలస్యం చేశారే!” అన్నారు.
”రాసింది నువ్వు, పొగడ్తలు నాకూనా?” అన్నారు నవ్వుతూ.
”ఏమయింది, చెప్పరూ?”
”నువ్వు రాసిన ‘కుర్బానీ’ కథ గురించి మాట్లాడుతూ మధ్యలో నన్ను అభినందించారు!” అన్నారు.
”అయితే ఉండండి, ఈ సారి ఎలాటి కథ రాస్తానో చూద్దురుగాని. ఆకథ మీ పేరు చెడగొట్టకపోతే అడగండి!” అన్నాను, నవ్వుతూ.
ఆయన నవ్వి, ”అంత ఉడుక్కుంటా వేం? మగాళ్లు గొప్ప వాళ్లు, వాళ్లకే అన్నీ దొరుకుతాయి,” అన్నారు.
”అదే, ఈసారి తిట్లూ, శాపనార్థాలు దొరకుతాయంటున్నాను. ఇక ఆ తరవాత నేను కథలు రాయకపోయినా పరవాలేదు.”
”ఎంతైనా హిందువులు తమాషా మనుషులు!” అన్నారు ఉన్నట్టుండి.
”మీరు హిందువా, ముస్లిమా?”
”రెండూ కాదు,” అన్నారు నవ్వుతూ.
”ఏం కాదు, మీరు హిందువే!”
”ఒక మతాన్ని నమ్మినంత మాత్రాన ఇంకొకరు ముట్టిన నీళ్లు తాగమని అనే వాళ్లున్న మతంలో నేనుండటం ఎలా సాధ్యం? అసలు హిందూ మతం దేని మీద ఆధారపడి ఉందో, నాకెంత మాత్రం అర్థం కావటం లేదు.”
నేను ఆయన్ని ఏడిపించేందుకు, ”అది ఆడవాళ్ల చేతుల్లో ఉంది!” అన్నాను.
”హిందూ మతం అందరికన్నా ఆడ వాళ్లనే నాశనం చేస్తోంది. ఆడది ఒక చిన్న తప్పు చేస్తే చాలు, హిందూ సమాజం వాళ్లని వెలి వేస్తుంది. వేశ్యవాడల్లో ఎక్కువగా ఉండేది హిందూ స్త్రీలే. అందరికన్నా ఎక్కువగా హిందూ స్త్రీలే ముస్లింలుగా మారుతున్నారు. మన దేశంలోని ఎనిమిది కోట్లమంది ముస్లింలు బైటినించి వచ్చిన వాళ్లు కారు. వీళ్లందరూ నీ అక్క చెల్లెళ్లే. అసలు అటువంటి సంకుచితమైన మతంలో ఉండడమే తప్పని అంటాను. ప్రస్తుతం ఉన్న హిందూ మతం పునాదులు పడినప్పుడు వ్యవహారమంతా మగాళ్ల చేతుల్లోనే ఉండింది. వాళ్లు తమకి అనువుగా అన్ని నియమాలూ తయారు చేసుకున్నారు. హిందూ స్త్రీలని ఒక చిన్న పరిధిలో ఉంచేశారు. అలాటప్పుడు హిందూ మతానికి విశాలమైన దృష్టి ఎక్కడినించొ స్తుంది? ఆడవాళ్లు దేవతలూ కాదూ, మట్టి బొమ్మలూ కాదు. మగ వాళ్లలో ఉండే మంచి చెడ్డలన్నీ ఆడవాళ్లలో కూడా ఉంటాయి. ఇద్దరికీ అన్నీ సమానంగా అందకపోతే ఇక జీవితం ఆనందంగా ఎలా గడుస్తుంది? మగవాళ్లకి అందే సౌకర్యాలన్నీ ఆడవాళ్లకి కూడా అందాలి. చిన్న చిన్న తప్పులకే ఇంట్లో ఆడవాళ్లని బైటికి గెంటేస్తారు. అప్పుడు వాళ్లిక ఎక్కడో ఒక చోట తల దాచుకోవాలి కదా? హిందువులు వాళ్లని ఈ లోకం నించే పంపించెయ్యాలని ప్రయత్నిస్తారు. ప్రభుత్వం అంటే ఉండే భయం వల్ల జంకుతారు. ఇక ముస్లిముల మతం చాలా విశాల దృష్టి కలది. అందర్నీ తనలో కలుపుకునే శక్తి దానికి ఉంది. హిందువులు తమకోసం తామే గోతులు తవ్వుకుంటూ ఉంటే, వాటిలో ఎవరు పడతారు? వాళ్లే కదా? ఒక గర్భవతిని ఇంట్లోంచి వెళ్లగొడితే ఆమె ఎక్కడికి పోతుంది? ఒక గర్భవతిని గెంటేస్తే నువ్వు ఇద్దర్ని ముస్లింలుగా మార్చినట్టు లెక్క. ఇక ఆ తరవాత ఆమెకి పుట్టే పిల్లలందరూ ముస్లిములే అవుతారరు. నీ మతంలో స్త్రీ పురుషుల సమానత్వం లేకపోయాక, ఇంకో మతంలో ఉండటం ఎలా సాధ్యం? అసంభవం కదూ! అయినా హిందువులు తమ పిడివాదం మానరు. ఇలాటి పిడివాదాన్ని భరించలేక హిందువుల ఇళ్లలోని అమ్మాయిలు బైటి సంబంధాలు చేసుకోవాలని అనుకుంటే దాని వల్ల జరిగే నష్టం ఎంత పెద్దదో ఆలోచించు. ఇక వీళ్లల్లో మూఢత్వం కూడా బాగా పెరిగి పోయింది. ఆవుని బలిచ్చారన్న కారణానికి కొన్ని వందల మంది ఏటా ప్రాణాలు పోగొట్టుకుంటారు.
”ఎక్కువ మంది హిందువులే కదా అలా చేసేది?”
”ఎవరైనా అవనీ, చనిపోయేది నీ అన్నదమ్ములే కదా? నీ వాళ్లే అటు వెళ్లి ముస్లిములుగా మారారు. దానికి కారణం కూడా నీ మూర్ఖత్వమే. ఒక ఆవు కోసం మనుషుల ప్రాణాలు తియ్యడం సబబేనా అని అడుగుతున్నాను. ఆ ఆవు హిందువులు, ముస్లిములు, ఇద్దరిదీ కదా? వాళ్లూ ఇక్కడే పుడుతున్నారు, ఈ మట్టిలోనే కలిసి పోతున్నారు. దేని వల్ల వాళ్లకి లాభం గాని హాని గాని కలుగుతాయో, అదే నీకు కూడా లాభం, నష్టం కలగజేస్తుంది. తాపీగా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించు, సాధ్యం కాదను కుంటే వదిలెయ్యి. అసలు మన దేశంలో పోరాటం ఒక వ్యాధిగా మారింది.”
”మీరు తెలివైనవారేగా, నచ్చ చెప్ప కూడదూ?”
”నేను నచ్చచెప్పేవాళ్లకి సొంత తెలివితేటలున్నాయి. వాళ్లు ఆవులని చంపటం లేదు.”
”మరి చంపేదెవరు? ఎవరికి నచ్చ చెప్పాలి?”
”ఈ పోట్లాటల వల్ల లాభం ఉన్న వాళ్లకి, దీన్నే తమ వృత్తిగా చేసుకున్నవాళ్లకి చెప్పాలి. అటువంటి వాళ్లలో పండాలూ, ముల్లాలూ, నాయకులూ ఉన్నారు. వాళ్లకే ఇందులో మజా వస్తుంది. ఈ కొట్లాటలవల్ల జనం ఏమవుతారు, దాంతో వాళ్లకి పనిలేదు. వాళ్లకి పొగడ్తలు కావాలి, ఆ తరవాత మజా చేసుకునేందుకు డబ్బు కావాలి. మనకి పండాల వల్ల ఎంత ఇబ్బందిగా ఉందో, తెలివైన ముస్లిములకి ముల్లాల వల్ల అంతే ఇబ్బంది కలుగుతుంది.”
”అయితే వాళ్లని మీరు బైటికెందుకు పంపించెయ్యరు?”
”ఆరోజు ఎప్పుడో ఒకప్పుడు రాక పోదు. ఇంగ్లీషు వాళ్ల కోసం కొన్ని వేల దూడల్ని నరికి పంపిస్తారు. వాటిని పంపవద్దని వాళ్లకి ఎవరూ అడ్డు చెప్పరు. మనం అమ్మకపోతే ఎవరైనా బలవంతంగా లాక్కో గలరా? అక్కడ వాళ్ల ఒత్తిడికి తలవంచేస్తారు. ఎక్కడ పోరాడాలో అక్కడ పోరాడరు.”
”ఆవుని మనం పూజిస్తాం కదా?” అన్నాను.
”మీరు మాత్రం ముస్లింలకేం తీసి పోయారు గనక! గొర్రెల్నీ, మేకల్నీ అమ్మవారికి బలివ్వటం లేదా? ఏం ఆ మేకది మాత్రం ప్రాణం కాదా? అందుకే అంటాను, ఏ మతమూ పూర్తిగా మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. ఆవు కోసం ప్రాణాలు ఇవ్వటానికి వెనకాడని ఆ హిందువులే తలిదండ్రులకి ఒక ముద్ద అన్నం పెట్టలేరు. ఆ హిందువులే ఆడపిల్లల్ని ఇంట్లోంచి గెంటేస్తారు. ఇవన్నీ మానవత్వానికి విరుద్ధం కావా? అయినా జనం గర్వంగా, ఆవుని మేం పూజిస్తాం, అని చెప్పుకుంటారు, తల్లికి ముద్ద పెట్టనివాడు ఆవుకి మేత మాత్రం ఏం వేస్తాడు?
ఇంకా ఉంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags