అబ్సెసివ్‌ ఎక్స్‌ సిండోమ్ర్‌

కొండేపూడి నిర్మల
నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో అర్థంకానిదీ, ఆలోచిస్తున్న కొద్దీ అవేదనకు గురిచేసేదీ అయిన పదం ఒకటి వుంది. దానిపేరు విడాకులు. ఈ మాట మొదటిసారి మామేనత్త నోటివెంట పరమ దుర్మార్గమైన వ్యాఖానంలో విన్నాను. అత్త మాయింటికి ఒక పెద్ద కారులో, గుళ్ళో దేవతలా బండెడు నగలు గలగల మోగించుకుంటూ వచ్చేది. కన్నతల్లితోనూ, అన్నతోనూ మాట్లాడుతున్నా సరే డబ్బు వాసనే వేసేది. ఆవిడ డాబుకీ దర్పానికీ మా చిన్న పెంకుటిల్లూ, పక్కింట్లోంచి తెచ్చి వేసిన కుర్చీలూ వెల వెలబోతూ వుండేవి. ఆవిడ తాగే బుర్రు కాఫీ దగ్గర్నించీ, నేతి బాదం హల్వా వరకూ అన్నీ ఘుమఘుమ లాడిపోవాల్సిందే. అంత మర్యాద మళ్ళీ మా చిన్నత్తకు వుండేది కాదు. ఎందుకంటే మాకు వరసయ్యే ఒక్క మగ నాకొడుకునీ ఆవిడ కనలేకపోయింది. పెద్ద ఆవిడకి మత్రమే అటువంటి భాగ్యం దక్కింది. తీరా ఇంత భాగ్యశాలీ తన ఆడపడుచును గురించి మాట్లాడే మాటలు మాత్రం పరమ యాబ్రాసిగా వుండేవి.
”ఏం చెయ్యనురా చిన్నన్నయ్యా… పోషించలేక కాదు పరువు కోసం చస్తున్నాననుకో. ఆడది అన్నాక మొగుడే దిక్కు కదా, మరి ఆ ముండకి (తన ఆడపడుచు మహాలక్ష్మి.) ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఆ విడాకుల కేసు తెమిలి చావదు. మనోవర్తి అయినా వస్తే ఆ తల్లీ (తన అత్తగారు) కూతురూ ఏ చెట్టుకిందో వొండుకు తింటారు కదా వాడేం మనిషో గాని దీన్ని ఏలుకోడూ, విడాకులూ ఇవ్వడు.. ఇప్పటికి ఏడేళ్ళయింది.. మేనత్త ఇలాంటిదని తెలిస్తే అసలు ఈ జన్మలో దీనికి పెళ్ళవుతుందా చెప్పు” అంటు ఒళ్ళొ కూచున్న ఎనిమిదో పిల్లని చరాచరా కిందకి ఈడ్చేది. ఏడాది వయసు కూడా లేని ఆ పిల్ల భవిష్యతులో తనకి రాబోయె ముప్పు గుర్తించినట్టు, దీనాతిదీనంగా. ఏడుస్తూ లాగులో ఉచ్చ పోసుకునేది. ఇంటిముందు ఆగివున్న కారుమీద ఇసక పోసి పారిపోయే మాకు ఈ గొడవంతా పట్టేదికాదు. ఎంత తొందరగా చుట్టాలు వెళ్ళీపోతే అంత చప్పున మిగిలిన మిఠాయిలన్నీ డబ్బా బోర్లించుకుని తినచ్చు కదా అనుకుని పిల్లలమంతా ఆశగా ఎదురుచూసేవాళ్ళం..
తర్వాత తర్వాత.. నాకు కొంత బుద్ధీ జ్ఞానం వచ్చాకా అర్థమయింది ఏమిటంటే మహాలక్ష్ష్మి మొగుడు వరాహరావు పెద్ద శాడిస్టు. తను ఇంకో అమ్మాయితో తిరుగుతూ భార్యకు కాపలా కాసేవాడట. మ్యాటనీ సినిమా నుంచి వస్తుంటే ఒకసారి మోటారు బండి మీదికి తిప్పి హత్యా ప్రయత్నం కూడ చేశాడట. అటువంటి మొగుడితో ఆవిడ అన్యోన్య దాంపత్యం వెలిగించనందుకు విజయవాడ మహాపట్టణం గగ్గోలు పెడుతూ వుండేది.
పెళ్ళినీ, విడాకుల్నీ, తేలిగ్గా తీసుకునే అమెరికా మీద మనకి చాలా హేళన వుంది. మన బంధాల్లో మోత బరువు గురించి హింస గురించి ఎప్పుడూ మాట్లాడుకోం… ఎవర్ని కదిలించినా సంస్కృతి సంప్రదాయం అంటూ గంటలకొద్దీ ఉపన్యాసాలిస్తారు… అవి తప్ప మానవహక్కులూ, ప్రాథమిక హక్కులు వుండవా..?
లాయరు వనజా నేను ఒకసారి సుప్రభాతం కోసం ఇలాటివారి సర్వే ఒకటి చేశాం.
విడిపోయిన తర్వాత కూడా వెంటాడి విసిగించే భర్తలకుండే జబ్బు పేరు ”అబ్సెసివ్‌ ఎక్స్‌ సిండ్రోమ్‌” అంటార్ట. నిజానికి ఇది జబ్బు కాదు పర్సనాలిటీ డిజార్డర్‌. గృహ హింసకు తట్టుకోలేక విడాకులకు పిటీషన్‌ పెట్టుకుంటే, ప్రధాన మంత్రితో సహా ప్రతి అధికారి ముద్దాయికి మద్దత్తు ఇయ్యడానికి చూస్తాడని మనకెవరూ చెప్పనక్కర్లేదు..గృహాల్లో ఎంత హింస పెడతారో, విడిపోయిన తర్వాత కూడా అంత హింస పెడతారని ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు బాగా తెరుచుకున్నాయి.
కనీసం ప్రజాస్వామికంగా మాట్లాడటం కూడా రాని ఒక సగటు భర్త భార్యపై ఎన్ని అఘాయిత్యాలు చేస్తాడంటే…? అటువంటి ధోరణి ఈ ప్రపంచంలో ఇంకెవరిమీద చూపినా సున్నంలోకి ఎముక మిగలకుండా చావగొడతారు.
విడాకులకోసం భార్య కేసు ఫైలు చేస్తే, లక్షలయినా ఖర్చుపెట్టి దర్జాగా బైటికి రావచ్చు.
ప్రతిరోజూ వదలకుండా ఆఫీసుకొచ్చి గొడవ చేయచ్చు. నెలజీతం లాక్కోవచ్చు. స్కూలుకెళ్ళి పిల్లల్ని ఎత్తుకుపోవచ్చు.
తల్లి గురించి దుష్ప్రచారం చెయ్యడం దగ్గరనుంచి, హింస పెట్టడం, చివరికి చంపెయ్యడం దాకా తండ్రి పాత్రను రకరకాలుగా చెలామణీ చెయచ్చు. భార్య కుటుంబం మీద దాడులు చేయచ్చు. అసలు పుట్టిన పిల్లలే తనకి పుట్టలేదనవచ్చు. కట్నం రూపంలో ఇచ్చిన ధన వస్తు కనకాలను దుర్వినియోగం చేస్తూ భార్యకు దక్కకుండా చేయచ్చు. అన్నిటికంటె ముఖ్యంగా ఆమె ఇక ఈ జన్మలో స్థిరపడకుండా కాపలా కాయచ్చు. సమస్యను నేను సాధారిణీకరించడం లేదు. తక్కువ శాతంలో అయినా భర్తల్ని మోసగించు ఆడవాళ్ళు వుండచ్చు. నేను ఇక్కడ మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను. దోమలు ఎన్నిసార్లు తరిమికొట్టినా కుడుతూనే వుంటాయి. భర్తలు భిన్నంగా వుండాలి కదా. ఎందుకోగాని అలా వుండరు.
నాకంటే ముందు తరంలో పుట్టిన మహాలక్ష్మికీ జీవితం పట్ల ఎన్నో కలలు వుండే వుంటాయి. అవి తీరకుండా కుక్క కాపలా కాసిన వరాహరావు ఇంకా వున్నాడు. మహాలక్ష్మి పోయింది. సంతానం లేదు కాబట్టి పున్నామ నరక ప్రసక్తి లేదనుకుందో ఏమో, పార్ధివ శరీరాన్ని మెడికల్‌ కాలేజీ పరిశోధనలకు రాసి ఇచ్చింది… వరాహరావు వున్నాడు విడిపోయిన భార్య శీలం మీద అతడు చల్లిన బురద అలాగే వుంది. ఆడపిల్లకు ఆస్తి హక్కు దక్కకుండా మనోవర్తితో బతకమని నీతులు చెప్పిన మా మేనత్తలాంటి వాళ్ళూ వున్నారు. ఇది ద్వంద విలువలతో గబ్బు కంపు కొట్టే పుణ్య భూమి. ఇక్కడ ఈగలదీ, దోమలదే రాజ్యం.
మనిషిగా పుట్టిన వాళ్ళు జీవితాల్ని కప్పంగా కట్టాల్సిందే.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.