చత్తీస్‌గఢ్‌ పరిణామాల మీద

కె. మురళి
అనివార్యంగా జరగాల్సి వస్తే, యుద్ధాలకూ గౌరవనీయమైన స్థానం వుంటుంది, యుద్ధనీతి పాటించినంత కాలం. దంతెవాడలో మావోయిస్టులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరుగుతున్న హింసను యుద్ధమనడం యుద్ధానికి అగౌరవం. అక్కడ నిరాయుధులను, ఆదమరిచివున్నవారిని, లొంగిపోయిన వారిని, సామాన్య పౌరులను హింసించకూడదు, చంపకూడదు అనే సాధారణ యుద్ధనీతిని ప్రభుత్వమూ పాటించడం లేదు, మావోయిస్టూ పాటించడం లేదు. ఈ పరస్పర హననంలో చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే మొదటి ముద్దాయి అనుకున్నంత మాత్రానా జీవించే హక్కుకు భరోసా ఇచ్చే విప్లవకారులెవ్వరూ లేరు. తమకు అనుకూలమైన సమయంలో, ప్రాంతంలో దారికాచి దెబ్బతీయడం రెండువర్గాలు పాటిస్తున్న యుద్ధనీతి. తమకు వేరే మార్గం లేదని మావోయిస్టు, తమది ఇదే మార్గమని ప్రభుత్వమూ దబాయించవచ్చు, కానీ జవాబుదారీ రాజకీయాలు ఎవరికీ లేవనేది పౌరసమాజానికి అర్థమౌతున్న విషయం.
మావోయిస్టులు తీవ్రమైన హింసకు పాల్పడిన ప్రతి సందర్భంలో వారి ప్రాబల్యం వున్న గ్రామాలనుండి వారికి సహకరిస్తున్న వారిని పట్టుకుని హతమార్చడం ప్రభుత్వాలు ఈ దేశంలో గత నలభై ఏళ్ళుగా కొన సాగిస్తున్న వికృత సంప్రదాయం. దీనికి వ్యతిరేకంగా మొదటినుండి పౌరసమాజం కోర్టుల బయటా, లోపలా గళం విప్పుతూనే వుంది. తాము చేసే చర్యలవల్ల తమ సామాజిక పునాదికి కలిగే హానిని గురించి మావోయిస్టులు ఆందోళన చెందిన దాఖలాలు దరిదాపు లేవు. ఆ విషయాన్ని మావోయిస్టులు ఇటీవల పాల్పడు తున్న హింసాకాండ చెప్పకనే చెబుతూంది. ఈ పరిణామాలను గమనిస్తున్నవారికి జరగబోయే ప్రాణనష్టం గురించిన ఆందోళన, వాటిని ఆపాలనే ఆలోచన సహజంగానే వుంటుంది.
ఏప్రిల్‌ 6న దంతెవాడ జిల్లా తాడిమెట్ల గ్రామం పరిసరాలలో జరిగిన మారణ కాండ పరిణామాలు భయం కరంగా ఉండబోతాయన్న భయం తో ఎదురు చూసిన వారికి ఆశ్చర్యమే మిగిలింది. బహుశా ఆ సంఘటన దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడం వల్ల కావచ్చు, ప్రభుత్వ బలగాలు కావచ్చు, వాటికి మద్దతుగా వున్న సల్వాజుడుంకు చెందిన ఎస్పీఓలు వెంటనే ఎటువంటి హింసాకాండకు పాల్పడ లేదు. అయినా తాడిమెట్ల, చింతగుప్ప, బుర్కపాల్‌ గ్రామాలకు చెందిన ముప్ఫైమంది పారామిలిటరీ బలగాల అదుపులో వున్నారని వార్తలు వచ్చాయి. అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోడానికి ఏప్రిల్‌ 17న డోర్నపాల్‌ వెళ్ళాను. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు చెందిన విలేకరులు అదే సమయంలో నాతో రావడం జరిగింది.
జాతీయ రహదారి నెం.221 మీదున్న డోర్నపాల్‌ పట్టణం మావోయిస్టుల ప్రాబల్యం వున్న జగ్గరగొండ, చింతల్నార్‌, చింతగొప్ప, తాడిమెట్ల అటవీ ప్రాంతానికి ముఖద్వారం లాంటిది. పట్టణమో, గ్రామమో పోల్చుకోలేని డోర్నపాల్‌ వలసానంతరం యుద్ధానంతర దృశ్యాన్ని గుర్తుకు తెస్తుంది. దరిదాపు వూరు దాటిపోతుండగా, సియార్పిఎఫ్‌ బలగాలు, ఎస్పీఓలు మమ్మల్ని ఆపారు. కొద్దిసేపటికి స్థానిక ఎస్సై ప్రేం ప్రకాష్‌ అక్కడికి వచ్చాడు. అతని ఆధ్వర్యంలోనే బలగాలు గాలింపులు చేపట్టాలి.
కేంద్రబలగాలు స్థానిక పోలీసుల, ఎస్పీఓల సహాయంతోనే గాలింపు చర్యలు చేపట్టాలని, తాను గత నెలలోనే సుకుమా నుండి బదిలి అయి వచ్చినట్లు, తనకూ స్థానిక పరిస్థితులు తెలియవని, తాము పూర్తిగా ఎస్పీఓల మీద ఆధారపడతామని చెప్పాడు కుటుంబ పోషణకోసం తాను పోలీసు ఉద్యోగం చేస్తున్నట్టు, అవకాశం వచ్చిన వెంటనే ఆ ప్రమాదకర ఉద్యోగం నుండి వైదొలగుతానని చెప్పాడు. కానీ ఎస్పీఓల శక్తిసామర్ధ్యాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు : ”వీళ్ళను చూస్తే మావోయిస్టులు పారిపోతారు. వీళ్ళు వాళ్ళను సులభంగా గుర్తిస్తారు. వీళ్ళ కుటుంబంలో కనీసం ఒకరైనా మావోయిస్టుల చేతిలో హతమైనారు. వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకోడానికే వీళ్ళు ఎస్పీఓలుగా చేరారు. ఇటీవల వీళ్ళ జీతాలను 1500 నుండి 3 వేల వరకు ప్రభుత్వం పెంచింది.”
గత నాలుగేళ్ళుగా పనిచేస్తున్న ఎస్పీఓలలో ఎంతమంది తమ ఉద్యోగాలకు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారని అడిగాను. ఇంతవరకు ఎవరూ వెళ్ళలేదని, ఎలా వెళ్తారని, ఎందుకు వెళ్తారని ఆందోళనగా ఎదురుప్రశ్న వేశాడు. మీ ఉద్యోగం పట్ల మీకున్న అసంతృప్తి, వాళ్ళకుండదా అంటే ‘లేదు, వాళ్ళకు లేదని’ చెప్పాడు స్థిరమైన గొంతుతో. డోర్నపాల్‌, జగ్గరగొండ, మారాయిగూడెం బేస్‌ క్యాంపులలో సల్వాజుడుం కార్యకర్తల కుటుంబాలు తప్ప, సాధారణ ఆదివాసీలు తమ గ్రామాలకు వెళ్ళిపోయారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈరోజు ఎస్పీఓలు ప్రభుత్వ బలగాల నిర్బంధంలో వుంటూ, మావోయిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో బలవంతంగా పాల్గొంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివాసీలలో ఒక వర్గాన్ని దరిదాపు మానవ కవచంగా వాడుకుంటున్న ప్రభుత్వం దీనికి జవాబు చెబుతుందా?
ఈ హింస జరుగుతున్న ప్రాంతాలలో ఏప్రిల్‌ 17, 18, 19 తేదీలలో తిరిగిన తర్వాత అర్థమైన విషయం ఏమంటే, పటిష్టమైన సమాచారవ్యవస్థ, విస్తృతమైన మందుపాతరల రక్షణ కవచం వున్న మావోయిస్టు ప్రాబల్య గ్రామాలకు ముందుగా గాలింపు పేరుతో పంపబడుతున్నది ఎస్పీఓలే. వాళ్ళు గ్రామాల మీద దాడులు చేసి, ఆదివాసీలను టెర్రరైజ్‌ చేసి, మావోయిస్టులను తప్పించుకుని వచ్చిన తర్వాత, ప్రభుత్వ బలగాలు గాలింపుల గురించి, ఎదురుకాల్పుల గురించి తాపీగా ప్రకటనలు చేస్తే, పత్రికలు ప్రశ్నించకుండా, పరిశీలించకుండా ప్రచారం కల్పిస్తున్నాయి. కేంద్ర బలగాలు చాలా అరుదుగా, అది తాము వెళ్ళే ప్రాంతం ప్రమాదకరం కాదని నిర్ధారించుకున్న తర్వాత గాలింపులకు బయలుదేరుతున్నాయి. అయినా దాడులకు గురౌతున్నాయంటే, అది మావోయిస్టుల దుందుడుకు చర్యల ఫలితమే. ఇది విప్లవ ఉద్యమావసరమైతే కావచ్చు గానీ, నీతిలేని యుద్ధం.
చట్టవిరుద్ధమైన బలగం అయినప్పటికీ, ఎస్పీఓలను గాలింపు చర్యలకు విస్తృతంగా వాడడంలో రెండు ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది ఆదివాసీలైన వాళ్ళ ప్రాణాలకు మావోయిస్టుల దృష్టిలో కాని, ప్రభుత్వ బలగాల దృష్టిలో కాని ఎటువంటి విలువా లేదు. రెండవది – ఇది ఏప్రిల్‌ 6 తర్వాత మరింత పెరిగింది – చాలామంది సియ్యార్పిఎఫ్‌ పోలీసులు రాజీనామా బాటపట్టారు. ప్రాణాలకు తెగించి పోరాడడానికి దంతెవాడేమీ కార్గిల్‌ కాదు. ప్రాణనష్టం అనివార్యమని హోం కార్యదర్శి అనొచ్చు కానీ, మారాయిగూడెంలో వీధుల్లో వున్న శస్త్రసీమ బల్‌కు (ఐఐఔ) చెందిన యువసైనికులు అనుకోవడం లేదు. నేపాల్‌, భూటాన్‌ సరిహద్దును కాపాడడానికి నిర్ధేశించిన ఈ బలగాలు దట్టమైన గుట్టల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. ఏ నైతిక, ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడడానికి, నిలబెట్టడానికి వీళ్ళు ప్రాణార్పణం చేయాలి? అతిసామాన్య కుటుంబాల నుండి పారామిలిటరీ బలగాలలోకి వెళ్తున్న యువకులకు జరుగుతున్న హింసలోని అర్థరాహిత్యం, రాజకీయం స్పష్టంగా అర్థం కాకపోదు. వివిధ దళాల జీతాలు, సౌకర్యాలు అధికారాల మధ్య వున్న అంతరాలు వారిలో తగినంత మనస్పర్థలు సృష్టించినట్లు కనిపిస్తుంది. ”ఇంత గందరగోళం ఎందుకు? మాకు (స్థానిక పోలీసులకు) సంపూర్ణ అధికారం ఇవ్వమనండి – దంతెవాడలోని ఆదివాసీలనందరిని చంపి, మావోయిస్టుల వునికే లేకుండా చేస్తాం” అంటాడు స్థానిక ఎస్సై అసహనంగా. మే 17 సంఘటన తర్వాత మిస్టర్‌ చిదంబరం ఎస్సైకన్నా భిన్నంగా ఆలోచించడం లేదు. ఇంకా అధికారాలు కావాలట. లోహవిహంగాల సాయంతో యుద్ధం చేయదల్చుకున్నాడు ఆయన. అది యుద్ధం చేయడానికి నిరాకరించవు. భయపడవు. వాటికి దేశభక్తి అవసరం లేదు. తన, పరాయి బేధం తెలియదు. నిందుతుడు, నేరస్తుడు, సామాన్యుడు అనే విచక్షణ అవసరం లేదు.
యుద్ధం పేరుతో ఏ చర్యలైనా సమర్ధించుకోవచ్చని మావోయిస్టులు భావిస్తున్నట్టున్నారు. రవాణా సౌకర్యాలు దారుణంగా వున్న ప్రాంతంలో సామాన్య ప్రజలకు, ఎలా, ఏ సమయంలో ప్రయాణం చేయాలని ఎంచుకునే అవకాశమే లేదని తెలిసినా, ప్రభుత్వ బలగాలతోపాటు వుండడం వల్లే ప్రజలు మందుపాతరలో మరణించారని సమర్థించుకో చూస్తున్నారు. సాయుధుడైనా మావోయిస్టు వచ్చి ఆపినా, పోలీసులు వచ్చి ఎక్కినా, బస్సులోని సామాన్య ప్రయాణికులు దంతెవాడలోనే కాదు, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అడ్డుకునే ధైర్యం చేయలేరనే విషయం అందరికీ తెలుసు. అయినా సామాన్యుల ప్రాణాలను తృణప్రాయంగా మందుపాతరలో తీసిన ప్రతిసారి ఇచ్చే ఇలాంటి సమర్థనని మావోయిస్టులు కూడా నమ్ముతారని అనుకోడానికి వీలులేదు. తమతోలేనివారి ప్రాణాలకు ఇంతకంటే ఎక్కువ విలువ ఇవ్వలేమనే తమ ఖచ్చితమైన అభిప్రాయాన్ని పరోక్షంగా చెబుతున్నారనుకోవాలి. ఈ వైఖరిని స్వతంత్ర హక్కుల ఉద్యమం గత రెండు దశాబ్దాలుగా ప్రశ్నిస్తూ వుంది.
గత నలభై ఏళ్ళుగా పౌరసమాజం ప్రభుత్వానికి, చాలా ప్రశ్నలు వేస్తూ వుంది. హింసాత్మకమైనప్పటికీ నక్సలైటు ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమమని, దానితో రాజకీయంగానే వ్యవహరించాలని, వారి హింసను చట్టబద్ధంగానే ఎదుర్కోవాలని, చట్టవిరుద్ధమైన పోలీసు చర్యలను నిరోధించాలని, వాళ్ళను భౌతికంగా నిర్మూలించినా, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు మిగిలేపోతాయని, కాబట్టి వాటికి పరిష్కారం వెతకడమే ప్రజాస్వామ్యాల బాధ్యతని హితవు పలికింది. వీటిలో దేనికి కనీసం సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించని రాజకీయ వ్యవస్థ ప్రతినిధి చిదంబరం, మే 17న దంతేవాడలో జరిగినదానికి పౌరసమాజం జవాబు చెప్పాలని దబాయిస్తున్నాడు. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత ఏమీ లేదనే వాదన ఆయనలోని (అ)న్యాయవాది నైపుణ్యానికి గుర్తయితే కావచ్చు కాని, నీతిగల రాజకీయనాయకుడి లక్షణమైతే కాదు. దంతెవాడలో, లాల్‌గడ్‌లో అభివృద్ధిలేమికి అన్ని రాజకీయపార్టీలు కారణమని గతనెల 7న పార్లమెంటులో చేసిన నిజాయితిలేని ఒప్పుకోలును ఆయన మరిచిపోవచ్చుకానీ, పౌరసమాజం ఎలా మరిచిపోగలదు? బలప్రయోగంతో ఆదివాసీల మీద జరుగుతున్న దమనకాండను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్న పౌరసమాజాన్ని ఆత్మరక్షణలో పడవేయడానికే ఈ దబాయింపు. చిదంబరం కన్నా పెద్ద నియంత లను చూసిన పౌరసమాజం దీనికి లొంగదని ఆయన తెలుసుకోవాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to చత్తీస్‌గఢ్‌ పరిణామాల మీద

  1. Ramnarsimha says:

    మురళి గారు,
    వ్యాసం చాలా బాగుంది..
    ధన్యవాదాలు..

    E-mail: ramuputluri@yahoo.in
    Mobile:8099991076

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.