శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్. శాంతసుందరి
నేను జైలువదిలి ఇంటికి రాగానే ముందుగా ఆయన గదిలోకే వెళ్లాను. అక్కడ నా ఫోటో గోడకి వేలాడుతోంది. ఆ ఫోటోకి చందనంతో చేసిన ఒక దండా, ఒక పూలమాలా వేసి ఉన్నాయి.
”ఇదేమిటి ఇక్కడ నా ఫోటో ఎందుకు పెట్టారు? నలుగురూ వస్తూ పోతూ ఉంటారు కదా, ఇక్కడ పెట్టారేమిటి? మిమ్మల్ని కలుసుకునేందుకు అందరూ ఈ గదికే వస్తారు, దీన్ని ఇక్కడ పెట్టటం ఏమీ బాగాలేదు, తీసి నాకిచ్చెయ్యండి,” అన్నాను.
”తీసెయ్యటానికి పెట్టానా?” అన్నారాయన నవ్వుతూ.
”బాగాలేదండీ, ఎవరైనా చూస్తే బావుండదు!”
”మరి అందరూ చూడటానికే ఇక్కడ పెట్టింది? పెట్లో పెట్టుకుని దాచుకోటానికా?”
”నాకు చాలా సిగ్గుగా ఉంది మీరీ పని చెయ్యటం.”
”నీకెందుకు సిగ్గుగా ఉందో నాకర్థం కావటంలేదు. నాకేమీ అలా అనిపించటం లేదే! నీ గదిలో నా ఫోటో లేదూ? మరి నా గదిలో నీ ఫోటో ఉండటం నీకెందుకు ఇబ్బందిగా ఉంది?”
”నా ఫోటో నా గదిలో ఉంటేనో, నా అన్నదమ్ముల గదిలోనో, అబ్బాయిల గదిలోనో ఉంటే నాకేమీ అనిపించదు.”
”నా ఉద్దేశంలో నీ ఫోటోని గదిలో పెట్టుకునే హక్కు అందరికన్నా నాకే ఎక్కువ ఉంది. నీ అన్నదమ్ములు, కొడుకులు అన్నావు కాబట్టి పరవాలేదు కానీ నా వయసున్న పరాయి మొగాడెవరైనా తన గదిలో నీ ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నాడని తెలిస్తే నాకతను బద్ధశత్రువై పోతాడు.”
”అంత మాత్రాన ఆరాధిస్తున్నాడని ఎందుకు అనుకోవాలి? మీరు మీ స్నేహితుల ఫోటోలు గోడకి తగిలించుకోవటం లేదూ?”
”స్నేహితుల ఫోటోలు నేను తగిలించుకోవచ్చు, కానీ వాళ్ల భార్యల ఫోటోలు తగిలించుకునే హక్కు నాకు లేదుగా? తల్లీ, చెల్లీ, కూతురూ తప్ప ఇంకో స్త్రీ ఫోటోని ఎలా పెట్టుకోగలను?”
”బైటివాళ్లతో కూడా అలాటి సంబంధమే పెట్టుకోవచ్చుగా?”
”అలా పరాయి స్త్రీ ఫోటో నేను గదిలో పెట్టుకుంటే నీకే నచ్చదు!
”ఏం కాదు. మీరు ఆమెని చెల్లిగానో అక్కగానో భావించి ఫోటో తగిలించుకున్నారని సరిపెట్టుకుంటాను.”
”నిన్ను చూస్తే బుద్ధిలేదనో, పిచ్చిదానివనో అనిపిస్తోంది నాకు. మరో రకంగా ఆలోచించే శక్తి నీలో లేనట్టుంది.”
”అలాగే మహాశయా, నాకు బుద్ధిలేదు, నేను పిచ్చిదాన్నే! ఇంకా నా గురించి ఇష్టమొచ్చినట్టు అనుకోండి, కానీ నా ఫోటో తీసి నాకివ్వండి.”
”సరే, అలా అయితే నువ్వు కూడా నీగదిలో ఉన్న ఫోటో తీసి నాకిచ్చెయ్యి.”
”సరే కానివ్వండి, నలుగుర్లో నవ్వుల పాలు అవుతానంటే ఇక నేను చేసేదేముంది? వాళ్లు మిమ్మల్ని ఆటపట్టిస్తే వినేందుకు నేనక్కడ ఉంటే కదా!”
”వీళ్లూ వాళ్లూ నవ్వుతారని భయపడేంత పిరికివాడినేం కానులే. పైగా వాళ్లకి ఎలా జవాబు చెప్పాలో నాకూ తెలుసు. దాన్ని గురించి నువ్వేం బాధ పడక్కర్లేదు. ఎవరైనా పరిహాసమాడితే బాధ పడేది నువ్వు, నేను కాదు.”
”మీరు మగాళ్లు కదా, మీకేమీ అనిపించదు, కానీ మా ఆడవాళ్లకి అలా కాదు.” అనేసి కోపంగా నేనక్కణ్ణించి వెళ్లిపోయాను.
1931, ‘సీక్లాస్’ ఉద్యమం
ఉప్పు సత్యాగ్రహం బాగా జోరందు కుంది. మా ఆయన చాలా మందికి తన డబ్బుతో ఖాదీ చొక్కాలూ, ధోవతులూ, టోపీలూ కొనిచ్చి, వాళ్లకి నా చేత పూల మాలలు వేయించి, లక్నోలోని గూంగేనదాబ్ పార్క్‌కి పంపారు. పంపిస్తూ, ”వెళ్ళండి వీరులారా! వెళ్లి ఉప్పు చట్టాన్ని ఛేదించండి, నేను కూడా మీ వెనకాలే వస్తున్నాను,” అనేవారు. వాళ్లకి పూలమాలలు వేసేప్పుడు నా కళ్లు చెమర్చేవి. అప్పుడప్పుడు ఉద్యమంలో వీళ్లు దెబ్బలు కూడా తినేవాళ్లు. ఆ దృశ్యం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా నాకు కన్నీళ్లు వస్తాయి. ఈయన కూడా చాలాసార్లు వెళ్లేందుకు సిద్ధమయేవారు. కానీ నేను వద్దంటే వినేవారు. జైలుకెళ్లాల్సి వచ్చినప్పుడల్లా నేను ఆయనకి అడ్డు పడేదాన్ని. చాలా కాలంగా ఆయన ఆరోగ్యం ఏమీ బావుండటం లేదు. అయినా పైకి యువకుడిలా కనిపించేందుకు ప్రయత్నించ ేవారు. జైలుకెళ్తే ఈయన ఆరోగ్యం ఇంకా చెడిపోతుందని నాకనిపించేది. ఆయన వాళ్లతో, మీ వెనకే వస్తున్నాను అనటం విని నేను అడ్డుపడ్డాను. ఆయన్ని జైల్లో చూడటం అనేది నాకు భరింపరాని విషయంగా అనిపించింది.
ఒకరోజు నేను మహిళా ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ అందరూ వాళ్లలో వాళ్లు చర్చించుకుని నన్ను లీడరుగా ఉండమన్నారు. నేనేం చేసేది? ఏడువందల మంది స్త్రీల కోరికని ఎలా కాదనేది? నేను వాళ్లకి కృతజ్ఞతలు తెలిపాను. అదే సమయంలో బాబూ మోహన్‌లాల్ సక్సేనా నన్ను వర్కింగు కమిటీ మెంబర్‌గా కూడా ఉండమని అన్నారు. అక్కడ జరిగిన పనులన్నిటినీ ఆయన ఇంగ్లీషులో రాసుకున్నారు. నా వెంట ఇంటిదాకా వచ్చిన వాలంటీరు చేతికిచ్చి మా ఆయనకి ఒక చీటీ రాసి పంపారు. దీన్ని హిందీలోకీ, ఊర్దూలోకీ తర్జుమా చేసే హక్కు మీకిస్తున్నాను, అని అందులో రాసి ఉంది.
వాలంటీరు వెళ్లగానే ఈయన నాదగ్గరకొచ్చి, ”ఈ లీడర్‌షిప్పు, మెంబర్‌షిప్పు నిన్ను జైలుకి పంపించగలదని తెలుసా?” అని అడిగారు.
”వాళ్లు నా మాట అస్సలు వినిపించు కోలేదు. ఇంకెవరూ వాళ్లకి నచ్చనేలేదు. ఎవరెక్కున బాధ్యత తెలుసుకుని ప్రవర్తిస్తారో వాళ్లకే బాధ్యత అప్పగిస్తారు. వాళ్లు ఆ బాధ్యతని తీసుకోవాలి కూడా.”
”సరే, నేను కూడా జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటానిక.”
”నేను జైలుకి ఎక్కడ వెళ్తున్నాను?”
నాతో ఇదంతా మాట్లాడాక ఆయన కాంగ్రెస్ ఆఫీసుకి వెళ్లి మోహన్‌లాల్ సక్సేనాని కలిసి, ”ఏం పని చేశావోయ్? నువ్వు లీడరు గానూ, వర్కింగు కమిటీ మెంబరుగానూ ఎంచుకున్న మనిషి జైలుకెళ్లిందంటే శవమే మిగుల్తుంది. తన శక్తికి మించి ఇంతకాలం పనిచేస్తూ వచ్చిందామె,” అన్నారు.
”ఆమెని స్త్రీలే ఎంచుకున్నారు. ఇందులో నాదేం ఉంది? అంతమంది కోరికని ఆమె కాదనలేకపోయిన మాట మాత్రం నిజం,” అన్నారు సక్సేనా.
నేను జైలుకెళ్తున్న సమయంలో ఈయన ఇంట్లో లేరు. మర్నాడు ఇంటికొచ్చారు. ఇంటి దగ్గర మా అమ్మాయి, ఇద్దరబ్బాయిలూ, నౌకర్లూ ఉన్నారు. ఆ మర్నాడు వాళ్లందర్నీ వెంటబెట్టుకుని జైల్లో నన్ను కలుసుకునేందుకు వచ్చారు. ఆయన కళ్లనిండా నీళ్లు!
”నేను చాలా సుఖంగా ఉన్నాను,” అన్నాను ఆయనతో.
”ఆహాఁ!” అన్నారాయన.
జైల్లో నన్ను కలుసుకునేందుకు వచ్చిన ప్రతిసారీ ఆయన పరిస్థితి అలాగే ఉండేది. ఎంతో మంది ఆయన్ని కలిసేందుకు ఇంటికెళ్లి, అభినందనలు అందజేసేవాళ్లు. ”నీ పని బావుందోయ్! పెళ్లాం జైల్లో ఉంది, ఇంట్లో కూర్చుని అభినందనలు నువ్వు అందుకుంటున్నావు!” అని వేళాకోళం చేసేవాళ్లు.
”నాకున్న వాటిలో అన్నిటికన్నా అమూల్యమైన దాన్ని నేను సమర్పించాను,” అనేవారాయన.
నేను జైల్లో ఉన్నన్నాళ్లూ ఆయన ఏవేవో పంపించేవారు, అందర్నీ వాడుకోమని అనేవారు. జైల్లోంచి బైటికొచ్చాక, నేను జైల్లో ఉన్నన్నాళ్లూ ఆయన అసలు నవ్వనే లేదనీ, కడుపునిండా భోజనం చెయ్యలేదనీ తెలిసింది. నాకన్నా రెండింతలు ఆయనే చిక్కిపోయారు.
ఆ రోజుల్లో ‘సి క్లాస్’ ఖైదీలనే ఎక్కువగా కొట్టేవాళ్లు, కడుపునిండా తిండి పెట్టేవాళ్లు కాదు. కప్పుకునేందుకు, కింద పరుచు కునేందుకూ దుప్పట్లూ, కంబళ్లూ ఇచ్చేవాళ్లు కాదు. అది చూసి నా మనసు విలవిల్లాడేది. ఒకసారి ఇంటిదగ్గర దాన్ని గురించి చెపుతూ, చాలా అన్యాయం అన్నాను. ఏ, బీ వాళ్ళకి అన్ని సౌకర్యాలూ సమకూర్చి, సీ క్లాసు ఖైదీలైన వాలంటీర్ల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించటం అన్యాయం కదా, అన్నాను. ఏ, బీ, ఖైదీలు దీనికి ఎందుకు అభ్యంతరం చెప్పరు, అన్నాను. ఈ తేడావల్ల ద్వేషం పెరుగుతుంది, అని అన్నాను.
”ఈ గొప్ప, బీద తేడాయే కదా మనదేశాన్ని నాశనం చేసింది!” అన్నారాయన.
”దీన్ని గురించి పోరాడాలని అను కుంటున్నాను,” అన్నాను.
”ఈ సారి నన్ను వెళ్లనీ!” అన్నారాయన.
”మీరొక్కరూ వెళ్లి ఏం చెయ్యగలరు? పెద్ద పోరాటమే చెయ్యాలి. కానీ దీనికి కాంగ్రెస్ ఆఫీసు సిద్ధ్దంగా లేదు. వాళ్లతో నేను ఈ విషయం మాట్లాడి చూశాను. కౌన్సిల్ దగ్గరకి జనాన్ని కూడగట్టుకుని వెళ్లాలని అనుకుంటున్నాను”, అన్నాను.
కానీ హజరత్‌గంజ్‌లో ఇంతకుమునుపు రెండుసార్లు కాల్పులు జరిగాయని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ప్రస్తుతం పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. అక్కడ ఈ విషయం అన్నాను కాని, మీతో చెప్పలేదు. ఏడువందల యాభైమంది స్త్రీలం ఒకచోట చేరాం. వాళ్లలో నాయకత్వం వహించగలవాళ్లు నలుగురే. ఊరేగింపుగా వెళ్లేరోజున తూటాలూ, కర్రలూ మామీద దాడి చేస్తాయేమోనన్న భయంవల్ల ఇంట్లో మీకెవరికీ ఆ సంగతి చెప్పలేదు. మా ఊరేగింపు హజరత్‌గంజ్‌కి చేరుకునేసరికి ఒక వైపు జనం, ఇంకోవేపు పోలీసులూ కనిపించారు, మధ్యలో మా ఆడవాళ్ల పెద్ద ఊరేగింపు ప్రవేశించింది. వెంటనే అసెంబ్లీని మూసేసి అందరూ ఇళ్లకి వెళ్లిపోయారు. మీరు ఈరోజు అసెంబ్లీని మూసేస్తున్నారు, బావుంది, కానీ ఎన్నాళ్లు అలా మూసి ఉంచుతారో మేమూ చూస్తాం, అని గట్టిగా అరిచాం. మేం మళ్లీ రేపు కూడా వస్తాం, మీరేం చేస్తారో చేసుకోండి, అన్నాం. పొద్దున్నే మళ్లీ మేం అందరం గుంపుగా అక్కడికి చేరుకున్నాం. దారిలో నాలుగు వందలమంది పోలీసుల చేతుల్లో లాఠీలు పట్టుకుని నిలబడి ఉన్నారు. నాలుగు లారీలు కూడా ఉన్నాయి. ఆయన ‘మాధురి’ ఆఫీసులో ఉండగా ఈ సంగతి తెలిసింది. ఒక పది మందితో కలిసి మమ్మల్ని చూసేందుకు వచ్చారు. కానీ ఆయన వచ్చి మాత్రం ఏం లాభం? పోలీసులు మమ్మల్ని ఆపేశారు. స్త్రీలం ఐదుగురం కలిసి జట్లు జట్లుగా వెళ్దామని సలహా ఇచ్చాను. మొదటి ఐదుగురిలో నేను వెళ్లబోతుంటే సక్సేనా, మీరు ఇంతకు ముందే కదా జైల్లో ఉండి వచ్చారు? మీరు వెనక రండి,” అన్నారు. ”అది లీడరునైన నాకు అవమానం కాదా?” అన్నాను.
కింద నేల పెనంలా కాలిపోతోంది, పైన సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చాలాసేపు మేమలా నిలబడ్డాక, హోమ్ మెంబర్ ‘ఛతారీ’ ”మీ ఉద్దేశం ఏమిటి?” అని అడిగాడు.
”సీ క్లాసు ఖైదీలతో మనుషుల్లాగ వ్యవహరించండి, పశువుల్లా కాదు!”
”అలాగే, మంచిది.”
”మీవల్ల కాకపోతే తేల్చి చెప్పెయ్యండి. అసెంబ్లీ ఈ విషయమై ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటే దాన్ని దిగిపొమ్మనడమే మంచిది.”
”మీరు రేపు మళ్లీ రండి, ఈ విషయమై మేం ఏదో ఒకటి చేస్తాం. మీరే చూస్తారుగా!”
”సరే, రేపే కానివ్వండి!”
మా ఊరేగింపు వెనక్కి మళ్లింది. మా ఆయన కూడా మావెంటే ఉన్నారు. నేను మహిళా ఆశ్రమానికి వెళ్లాను, సాయంత్రం అక్కడ పబ్లిక్ మీటింగు ఉంది. మీటింగు అమీనాబాద్ పార్క్‌లో జరిగింది. పన్నెండువేలమంది జనం హాజరయ్యారు. ఎందరో మగవాళ్లు కూడా మాట్లాడారు. నా పేరు కూడా అనౌన్స్ చేశారు. నాపేరు వినబడగానే ఆయన హడలిపోయారు. నేను వేదికమీదికి వచ్చాను. రాకుండా ఎలా మరి? నేను చాలా ఉద్రేకంగా మాట్లాడాను. మేమిచ్చిన ఆ ఉపాన్యాసాల ప్రభావం జనం మీద చాలా బాగా కనిపించింది. కొన్ని వందలమంది వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకునేందుకు ముందుకొచ్చారు. నేను బైటికి రాగానే మా ఆయన నా దగ్గరకొచ్చి, ”దేవుడి దయవల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు. లేకపోతే నువ్వీపాటికి సెంట్రల్ జైల్లోనో, ఆసుపత్రిలోనో ఉండవలసింది. కాంగ్రెస్ దీనిని చట్ట విరుద్ధమని తీర్మానించటం గురించి నీకు తెలీదు,” అన్నారు.
”నాకెందుకు తెలీదు?”
”అయితే తెలిసే అంత నిప్పులు కక్కావా?”
”మరేం చేస్తాను? మాట్లాడటానికి ముందుకొచ్చి మౌనంగా ఎలా ఉంటాను? చచ్చేముందు ఏదైనా ఒక మంచి పనిచేసి చావటం మేలు కదా?”
”నువ్వెప్పుడూ నన్ను మోసం చేస్తూనే ఉంటావు. నేను సిద్ధం అయ్యేలోపల ప్రతిసారీ నువ్వు నాకన్నా ఒకడుగు ముందుంటావు. నేనేమో వెనకే ఉండిపోయి ఆగిపోతాను!”
”ఇద్దరిలో ఒక్కరే కదా వెళ్లగలం? మనం లేకపోయినా పిల్లలు సుఖంగా బతకగలగటానికి మనం డబ్బున్నవాళ్లం కాదు కదా? ఇక సాహిత్యం ద్వారా మీరు కూడా మాపని చేస్తూనే ఉన్నారాయే. ఊరికే ఏమీ లేరుగా? నేను ఇంట్లో కూర్చుని చేసేదే ముంది? మీరు ఇంట్లో ఉన్నా ముఖ్యమైన పనులు చేస్తున్నారు. మొత్తం పేరు ప్రతిష్ఠలన్నీ మీరే కొట్టెయ్యాలని చూస్తున్నారా?”
”పేరు ప్రతిష్ఠలు పంచిపెడుతున్నారని తెలిస్తే, అంతా నేను నీకే ఇచ్చెయ్యనూ?”
”అవును, గొప్ప దానకర్ణులు కదా! అలాటి మనసు స్త్రీలకి మాత్రమే ఉంటుంది. పని చేసి పక్కకి తప్పుకుంటారు. పిల్లల్నీ మేమే కనాలి, కష్టాలూ మేమే పడాలి. కానీ పేరు మాత్రం మీదే!”
మా ఇద్దరి మధ్యా ఇలాటి సరదా వాగ్వివాదాలు ఎప్పుడూ ఉంటూనే ఉండేవి.
మునిసిపాలిటీ వాళ్లు వేశ్యలని ఊళ్లోంచి వెళ్లగొడతారనీ, ఆ ప్రతిపాదనని ఆమోదించారనీ తెలిసింది. పాపం వీళ్ళెక్కడికెళ్తారు, వీళ్లు వృత్తి ఎలా చేసు కుంటారు? అనుకున్నాను. వీళ్లని అందరూ అసహ్యించుకుంటారు, ప్రపంచం లో వీళ్లకి ఉండేందుకు చోటే కరువవుతుంది. ఎంతైనా వాళ్లు కూడా మనలాంటి మనుషులే కదా! వీళ్లొక్కళ్లే పాపాలు చేస్తారా? పురుషులు పాపాలు చెయ్యరా? అసలీ వృత్తికి కారణమే మగాళ్లు కదా? అని ఆలోచిస్తూ ఉండగా మా ఆయన గదిలోకొచ్చారు. నేను దిగులుగా ఉండటం చూసి, ”ఏమైంది, ఒంట్లో బాగాలేదా?” అని అడిగారు.
”ఆడవాళ్ల ఆరోగ్యం గురించి చెప్పటానికేముంది?”
”ఏం జరిగిందసలు?”
”తెలుసుకుని ఏం చేస్తారు? దేవుడు స్త్రీల బాధ్యత మొగవాళ్లకి ఇచ్చాడు. వాళ్లు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. అసలు దేవుడు స్త్రీలని ఎందుకు పుట్టిస్తాడో నాకర్థం కాదు! ఈ లోకంలోకొచ్చి వాళ్లు ఏం సుఖపడిపోతున్నారని? మెగవాళ్ల కాళ్లకింద పడి నలిగిపోయేందుకే దేవుడు వాళ్లని సృష్టిస్తున్నాడు. పైగా ఎప్పుడూ మొగవాళ్లకే సేవ చేస్తూ బతుకుతారు ఆడవాళ్లు. నాకే కనక శక్తి ఉంటే ఆడవాళ్లని ఈ లోకంలోకి కాకుండా చేసేస్తాను. పీడ విరగడవుతుంది!” అన్నాను.
ఆయన పగలబడి నవ్వుతూ, ”అసలు విషయం చెపుదూ!” అన్నారు.
పక్కనే వార్తాపత్రిక ఉంది. దీసి ఆయన మొహం ముందు పెట్టి, ”చూడండి మనవాళ్లు చేస్తున్న గొప్ప పని!” అన్నాను.
పత్రిక చదివి ఆయన కూడా నవ్వటం మానేసి గంభీరంగా ఉండిపోయారు. ”రాణీ, ఈ విషయంలో నువ్వూ, నేనూ ఏమీ చెయ్యలేం. అయినా ఏం పెద్ద విషయమని అంత బాధ పడుతున్నావు? పైగా నాదే తప్పని నా మీదికి నెడుతున్నావు? నేను అసహాయుడినని నీకూ తెలుసు!” అన్నారు.
”దీన్ని గురించి మీరు రాయచ్చు, మాట్లాడచ్చు. ఒక తప్పు జరుగుతోందని తెలిసి కూడా, అది అంతే అని ఎలా ఊరు కుంటాం?”
”రాయటం విషయంలో నేనెప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఈ చిక్కు ముళ్లు విప్పేందుకే ‘సేవాసదన్’ నవల రాశాను. ఇంకా కథలూ, వ్యాసాలూ కూడా రాశాను. వాటిని అమలు చెయ్యటం, చెయ్యకపోవటం అనేది వాళ్ల చేతుల్లో ఉంది. నువ్వు తప్పంతా నా మీద మోపి, నువ్వు ఇబ్బంది పడతావు, నన్నూ నానా మాటలంటావు!”
”ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఇది చదివి నా మనసు కకావికలైపోయింది. చాలా కోపం కూడా వస్తోంది!”
”ఇండియాకి స్వాతంత్య్రం వచ్చేదాకా, ఈ సమస్యలు విడవు. ఎవరైనా మహాత్ముడు మళ్లీ పుట్టి పరిష్కారం సూచించాల్సిందే. కొన్ని శతాబ్దాలుగా పాడైపోయి ఉన్న ఈ ప్రపంచం అంత త్వరగా ఎలా బాగవుతుంది?”
– ఇంకా ఉంది
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags