డా. కొమర్రాజు రామలక్ష్మి
”మన గురించి మనం ఆలోచించుకోవడం మరచిపోతే పప్రంచమూ మనల్ని మరచిపోతుందని
చరితల్రో చాలాసార్లు రుజువైంది” – స్త్రీల గురించి జర్మన్ రచయిత్రి లూయిస్ ఓటో పీటర్స్‌వందేళ్ళ క్రితం మహిళల పట్ల సమాజ దృక్పథం వేరుగా ఉండేది. అసమానత, అణచివేతలు భరించలేని స్థాయికి చేరడంతో మహిళలు తమ గొంతులు విప్పక తప్పని పరిస్థితి నెలకొంది. తమ పరిస్థితులలో ‘మార్పు’ను కోరుతూ మహిళలు రోడ్డెక్కిన తొలి ఘటన 1908 సం||లో జరిగింది. దాదాపు 15 వేల మంది మహిళలు సరైన వేతనం, తక్కువ పని గంటలు, ఓటుహక్కు కోరుతూ న్యూయార్క్ నగరంలో ప్రదర్శన నిర్వహించారు. అమెరికన్ సోషలిస్టు పార్టీ 1909 ఫిబ్రవరి 28ని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. 1910 సం||లో కోపెన్‌హెగన్‌లో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిగింది. ఈ సదస్సులో జర్మనీకి చెందిన మహిళా ఉద్యమకారిణి ‘క్లారా జెట్కిన్’ ప్రతి దేశంలోనూ ఈ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించారు. వివిధ దేశాలకు చెందిన సోషలిస్టు పార్టీ నేతలు, మహిళాసంఘాలవారు హాజరైన ఆ సదస్సులో క్లారా జెట్కిన్ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏదో ఒక రోజును మహిళా దినోత్సవంగా జరుపుకోవడం అన్ని దేశాలూ ప్రారంభించాయి. అయితే 1908లో జరిగిన మొదటి ప్రదర్శన మహిళా ఉద్యమాలకు స్ఫూర్తి కావాలన్న ఉద్దేశ్యంతో ‘మార్చి 8’ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆచరణలోకి వచ్చింది. ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా మార్చి 8 ప్రకటించబడిన ఈ నెల (మార్చి) మహిళాభ్యుదయం దిశగా సాగిన చారిత్రాత్మక ఘట్టాలన్నింటినీ గుర్తుచేస్తుంది.
శతాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలు, అద్భుతాలు అపారం. స్వేచ్ఛాగీతం పాడుతూ, స్వావలంబన సాధించడానికి మహిళలు నిత్యసమరం సాగిస్తున్నారు. అయితే భారత సమాజంలో 90 శాతం మహిళలు బతుకులు వెళ్ళదీయడానికే పోరాటం చెయ్యాల్సివస్తుంటే తమ అస్తిత్వాన్ని చాటుకునేదెప్పుడు? అన్న ప్రశ్నతోపాటు వందేళ్ళ చరిత్రను పరిశీలిస్తే విజయం సాధించిన స్త్రీల కంటే సమరం సాగిస్తున్నవాళ్ళే ఎక్కువ. అందుకే కొద్దిమంది కాదు అనేకమంది మహిళల ముఖాల్లో నవ్వుల పువ్వులు పూసిననాడే మహిళాలోకం విజయం సాధించినట్లు అన్నది అన్ని తరాల మహిళల భావన.
వంటింటిని అలంకరించిన పరికరంలాగా మారిన జాతి గొంతు పెగుల్చుకొని, స్వంత అస్తిత్వాన్ని చాటుకునే క్రమంలో ఇప్పుడొక చేయూత కావాలి. సంకెళ్ళు తెగతెంచుకునే పోరాటంలో ఇప్పుడొక బాసట కావాలి. వ్యక్తిత్వం చాటుకునే తరుణంలో ఇప్పుడొక దన్ను కావాలి. అందుకే మార్చి 8 పైనా, మహిళా సాధికారత పైనా చర్చోపచర్చలు, ప్రశ్నోపప్రశ్నలు.
‘మహిళా సాధికారత’ అంటే ”సమాజంలో మహిళలకు సముచితస్థానం కల్పించడానికి విధానాలలో మార్పుతేవడం మాత్రమే కాదు, సమాజ వైఖరిలోనూ మార్పు రావడం.”
మానవాభివృద్ధి నివేదిక ప్రకారం ”మహిళా సాధికారత అంటే మహిళలు కుటుంబంలో, సమాజంలో, రాజకీయ రంగంలో చురుకైన నిర్ణాయక పాత్రను నిర్వహించడం.”
మహిళా సాధికారత వల్ల కేవలం వారు అభివృద్ధి చెందడమే కాదు. సమాజం కూడా పురోగతి చెందుతుంది. స్థిరమైన వృద్ధి సాధనకు మహిళల శక్తి సామర్ధ్యాలు చాలా అవసరం. స్త్రీల సంక్షేమం, అభివృద్ధి, సాధికారత – ఈ మూడు అంశాలు ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనవిగా, అభ్యుదయకరమైనవిగా అనిపిస్తాయి. వీటి ప్రాతిపదికన సామాజిక, ఆర్థిక రంగాలను పరిశీలించినప్పుడు మహిళాభివృద్ధికి సంబంధించి పరిమాణాత్మక మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులు గుణాత్మక మార్పుల కోసం ఎంత మేరకు దారితీస్తాయి అనే విషయం ఆలోచనను కలిగిస్తుంది.
గత అరవై ఏళ్ళుగా భారతదేశంలో అమలయిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, సాధికారతా వ్యూహాలు మొదలైన వాటివల్ల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యం అధికమవుతున్నట్లుగా వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇన్నేళ్ళలో మహిళల జీవితాలలో మౌలికమైన మార్పులేమైనా వచ్చాయా అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానం రాదు. ఎందుకంటే మహిళా సాధికారతకు ప్రధాన అవరోధమైన పితృస్వామ్య భావజాలాన్ని ఈ అభివృద్ధి నమూనాలేవీ సవరించలేకపోయాయి. కుటుంబ యాజమాన్యం, ఆస్తిపై, పిల్లలపై హక్కులు పురుషుడివి కాగా, ఆ కుటుంబ నిర్వహణ బాధ్యత మాత్రం మహిళదిగా ఉన్న స్థితి ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. స్త్రీలు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ప్రవేశించినప్పటికీ కుటుంబ పరిధికి భిన్నంగా మహిళలను స్వతంత్ర వ్యక్తులుగా పరిగణించకపోవడం వల్ల వనరులపైనగానీ, ఆదాయాలపైనగానీ వాళ్ళకు అధికారం, నియంత్రణ లేదనేది వాస్తవం. అన్నింటా మహిళలు కార్యకర్తలుగా మిగిలిపోయారే తప్ప నిర్ణాయక పాత్రను వహించే స్థాయికి ఎదగలేకపోయారు. సాధికారత భావన ప్రచారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ పరిస్థితి యథాతథంగా కొనసాగుతూనే ఉండడాన్ని గమనించవచ్చు. భారత రాజ్యాంగం అన్ని రకాల వివక్షతలను రద్దుచేస్తూ మహిళలకు సమానత్వ హామీ ఇచ్చినా అది ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. స్త్రీపురుషుల మధ్య సమానత్వ సాధన సమాజానికి ఒక సవాల్. సమానత్వం దిశగా మహిళా ప్రస్థానం విషయంలో వెలుగునీడలను చర్చించుకునే సందర్భమిది. వివక్ష, అసమానతలు వెనక్కి లాగుతున్నా పట్టుదలగా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సఫలీకృతులవుతున్నారు నేటి మహిళలు. అవాంతరాలు ఎదురవుతున్నా అభివృద్ధి సాధన వైపు మహిళల పయనం సాగుతూనే ఉంది. మగువలు ప్రధానమంత్రులయ్యారు. దేశాధ్యక్షులయ్యారు. అంతరిక్ష యాత్రలు చేశారు. బడిలో చేరిన బాలికను విశ్వవిద్యాలయం దాకా తీసుకొనిరావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగం చేస్తూ, కుటుంబ బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వహించగలుగుతున్నది. ఎంచుకోవడానికి ఆమెముందు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. అయితే సామాజిక భద్రత మాత్రం గాలిలో దీపమయింది. మహిళలపై జరుగుతున్న హింస, అత్యాచారాలే ఇందుకు నిదర్శనం. కుటుంబంలో, సమా జంలో మహిళలపై వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.
రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతూ ఏళ్ళయినా బతుకుల్లో మార్పులేనివాళ్ళు మా పల్లెల్లోనే ఎంతోమంది ఉన్నారు. మరి నిజంగానే మహిళలు విజయం సాధించినట్టా? అని ప్రశ్నిస్తున్నారు మన గ్రామీణ మహిళలు. ప్రపంచమంతా కాలంతో పోటీపడుతుంటే వాళ్ళకు ఆసక్తినిచ్చే గింజలను పండించడానికి మేము మట్టితో కుస్తీ పట్టాల్సిందే. అందుకే విత్తనాలు అలికిన క్షణం నుండి పండిన పంటను ఎడ్లబండ్లలో, ట్రాక్టర్లలో వేసుకొని మార్కెట్‌కు తరలించేదాకా ఊపిరాడదు అంటున్నారు మన మహిళా రైతులు. నా చుట్టూ ఉన్న తోటి ఆడవాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడే, వాళ్ళు కష్టపడి సంపా దించిన పైస వాళ్ళ చేతుల్లో ఇమిడినప్పుడే మనం విజయం సాధించాం అని అనుకోవచ్చు అన్నది ఒక శ్రామిక మహిళ అభిప్రాయం. నిజంగా ఇవి ఆలోచన రేకెత్తించే అంశాలే.
ఇంటా బయటా పితృస్వామ్య అధికారపు ఒత్తిడుల మధ్య జీవించే మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో తమ శక్తినంతా కూడదీసుకొని పనిచేయాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి, అలసట వల్ల వ్యక్తులుగా వివిధ రకాల శారీరక, మానసిక రుగ్మతలకు లోనుకావడం, ఒక జాతిగా అభివృద్ధి క్రమంలో తమ శక్తిసామ ర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవడం అనేది జరుగుతున్నది. ఇది ఒక సాకుగా మారి సామాజిక రంగాలలోకి మహిళల ప్రవేశాన్ని, వారి క్రియాశీలక పాత్రను అవహేళన చేసి, ఈ పనులు మహిళలకు అనవసరం అనిపించే భావనను కలిగిస్తుంది. కాబట్టి స్త్రీల పని భాగస్వామ్యాన్ని అంచనా వేయడానికి కుటుంబపరమైన, సామాజికపరమైన ఒత్తిడులు, ఇంటి పనిభారం, పిల్లల పెంపకం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే అభివృద్ధి కృషిలో స్త్రీల పాత్ర, దాని విలువ తెలుస్తుంది.
అణచివేత నుండి విముక్తి, స్వతంత్ర వ్యక్తిత్వం ఏ సమాజంలో అయినా మహిళలకు ప్రాణావసరాలు. అయితే అత్యంత లింగవివక్ష ఉన్న మొదటి పది ఆర్థికవ్యవస్థలలో భారత్ ఒకటి అని ప్రపంచ ఆర్థికసంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మనదేశంలోని మహిళల్లో కనీసం 40 శాతం తీవ్రమైన కుటుంబ హింసకు గురవుతున్నవారేనని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితులలో మహిళలకు కావలసింది మెరుగైన విద్యావకాశాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఆర్థిక చేయూత – ఇవి గౌరవంగా బతకడానికి మహిళలకు ఉపయోగపడే మార్గాలు. స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మనుషులుగా, మగవాళ్ళతో సమాన గౌరవం గల వ్యక్తులుగా ఎదిగే క్రమంలో మహిళలకు ఎదురవుతున్న సవాళ్ళు అనేకం. వాటన్నింటినీ అధిగమిస్తూ ‘నేటి మహిళలం మారుతున్న సమాజానికి ప్రతీకలం’ అంటూ అన్ని రంగాలలో తమ ప్రతిభాపాటవాలను చాటు కుంటున్నారు.
వందేళ్ళ అంతర్జాతీయ మహిళాదినం సందర్భంగా మనం ఎక్కడున్నాం? అని సమీక్షించుకుంటున్న ప్రస్తుత సమయంలో జనాభాలో సగమైన మహిళలకు రాజకీయాలలో భాగస్వామ్యం లేనప్పుడు అది ప్రజాసామ్యమెలా అవుతుంది అని ప్రశ్నించుకోక తప్పదు. రాజకీయాల్లో మహిళల పాత్ర సమాజంలో సాంస్కృతికపరమైన మార్పును తీసుకొస్తుంది. ఆలోచనల్లోనూ, దృక్పథాల్లోనూ చైతన్యమొస్తుంది. మహిళలను పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్థానిక సంస్థలలో భాగస్వామ్యం మాత్రమే సరిపోదు. శాసననిర్మాణం జరిగే శాసనసభల్లో సరైన ప్రాతినిధ్యమున్నప్పుడే మహిళల రాజకీయ సాధికారత అర్థవంతమవుతుంది. 33 కోట్ల మహిళా ఓటర్లున్న దేశంలో వారి ప్రాతినిధ్యం 9 శాతం కంటే తక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాలి.
ఆడ పిండాలు, ఆడ శిశువులు, వరకట్నం మృతులను పరిగణించి 5 కోట్ల మహిళలు అదృశ్యమయినట్లు చెపుతూ రోజురోజుకూ తగ్గిపోతున్న స్త్రీలను మిస్సింగు జాబితాల్లో చేర్చారు నోబుల్ బహుమతి గ్రహీత డా|| అమర్త్యసేన్. ఎన్ని మహిళా దినోత్సవాలు వచ్చిపోతున్నా ఆడవాళ్ళ బతుకు చిత్రంలో మార్పు లేదని స్పష్టం చేస్తున్నాయి ఈ వివరాలు.
మహిళా సాధికారత పరంగా విద్యతోపాటు, వారికి అందుతున్న పౌష్టికాహారంపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. అభివృద్ధి పథకాల ప్రయోజనాలు మహిళలందరికీ అందుబాటులోకి రావడానికి సానుకూలత, ఆశ, ప్రోత్సాహం, ఉత్సాహంతో కూడిన వాతావరణ పరిస్థితుల గురించి కూడా ఆలోచించాలి.
యాసిడ్ దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అనారోగ్య సమస్యలు, భ్రూణ హత్యలు, ఆడపిల్లల అమ్మకాలు, త్రాగడం, గుడుంబా, గుట్కాలాంటి మత్తుపదార్థాల వాడకం లాంటి దుర్వ్యసనాలతో ఆడవాళ్ళను శారీరకంగా మానసికంగా బాధించడం, వస్తువినిమయ సంస్కృతిలో భాగంగా ఆడంబరాలకు అలవాటుపడి అప్పులపాలై ఆ భారాన్ని మహిళలపై మోపుతున్న మగవాళ్ళను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తున్న మగవాళ్ళు ఉన్నంతకాలం మహిళాసాధికారత మహిళలకొక పెద్ద సవాల్.
మార్చి 8కి వందేళ్ళు – మహిళా సాధికారత ఎక్కడ? అని చర్చించే దశలో ముందు మహిళలు తాము చైతన్యవంతులవుతూ, తమ చుట్టూ ఉన్నవారిని చైతన్యపరిచే కార్యక్రమంలో నిమగ్నం కావాలి. మహిళను చూసే దృష్టిలో మార్పు కోసం మహిళలే కాదు మహిళాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాల్సి ఉంటుంది.
ఇది శత వసంతం – సమస్యలనధిగమిస్తూనే ఆ క్రమంలో ధైర్యం తెచ్చుకోవాలి, స్ఫూర్తి పొందాలి. మహిళలపై జరుగుతున్న హింస, దాడులను గురించి కృంగిపోవద్దు. ఆత్మస్థయిర్యం కోల్పోవద్దు. మహిళలను కాదు, వాటిని అంతం చేయాలి అని సమాజంలోని ప్రతి ఒక్కళ్ళూ ప్రతిన బూనాలి.
కుటుంబ హింస, సామాజిక హింస నుండి మహిళలను రక్షించడంలో భాగంగా ఆయా అంశాలపై సామూహిక చర్చలు జరపడంతో పాటు తగిన పరిష్కార మార్గాలను అన్వేషించి, ఆచరించాలి.
మహిళలను కించపరిచే విధంగా కార్యక్రమాలను రూపొంది స్తున్న మీడియా వైఖరిలో తక్షణమే మార్పు రావాలి.
అపారమైన సృజనాత్మకశక్తి సామర్ధ్యాలు ఉండీ కృంగిపోయిన ఒక జాతి మనోధైర్యాన్ని నిలబెట్టడానికి, సరికొత్త నైతిక శక్తితో అది పురోగమించడానికి ఒక అండ కావాలి. అందుకవసరమైన చర్యలను చేపట్టడంలో అందరూ భాగస్వాములు కావాలి.
”వనిత పరిపూర్ణ వ్యక్తి. ఆమెలోనే సృష్టించగల, పోషించగల, మార్చగల శక్తులన్నీ సంఘటితమై ఉన్నాయి.
– డయానే మారిచైల్డ్.
మహిళల సమస్యల పట్ల సానుకూలత, సానుభూతి కలిగినవారందరూ అన్ని రంగాలలో లింగవివక్ష లేని సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలి. వారి శక్తిసామర్ధ్యాలను సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ‘నావల్ల కాదని చాలామంది చాలా పనులు వదిలేయడానికి కారణం తమ శక్తి సామర్ధ్యాలను వాళ్ళు మరచిపోవడమే’ అంటారు అలైన్ వాకర్.
అదే విధంగా ‘ధైర్యం మన శరీరంలోని కండరాల్లాంటిది. ఎంతగా వాడితే అంతగా పటిష్ఠమవుతుంది’ అన్న రూత్ గోర్డాన్ మాటలను మహిళలు, మహిళా సమస్యల పట్ల స్పందించేవారందరు ఆలోచించాలి, ఆలోచింపజేయాలి.
”ప్రపంచాన్ని మహిళలు నడిపిస్తే కనుక… ఎక్కువ ఖర్చు ఆయుధాల మీద, సైన్యం మీద పెట్టరు. శాంతికోసం పెడతారు. కన్నబిడ్డలు ప్రాణాలు కోల్పోవడం ఏ తల్లి చూడగలుగుతుంది?”
– మెరిల్ స్ట్రీప్, హాలీవుడ్ నటి
ఈ అంశాలన్నింటినీ ఆలోచింపజేస్తూ మహిళాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న వందేళ్ళ మార్చి 8కి వందనం చేస్తూ, అన్ని రంగాలలో మహిళా సాధికారతను సంపూర్ణంగా అనుభవించే రోజు, మరుగునపడుతున్న మానవ సంబంధాలు మళ్ళీ చిగురించి, అందరూ సక్రమ మార్గంలో ఎదిగేరోజు వస్తుందని ఆశిద్దాం. రావాలని ఆకాంక్షిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags