భూమిక
”భూమిక” ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ స్కిల్స్ మరియు గృహహింస నిరోధక చట్టం మీద, సికింద్రాబాద్‌లోని యూత్ హాస్టల్‌లో జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు గృహహింస చట్టం అమలుకోసం స్త్రీశిశు అభివృద్ధి శాఖ వారు నియమించిన రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న లీగల్, సోషల్ కౌన్సిలర్స్ హాజరయ్యారు. ఒక నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న ఈ కౌన్సెలర్‌లు, నేరుగా బాధిత స్త్రీలకు కౌన్సెలింగ్ నిర్వహించడం, కోర్టులో డి.ఐ.ఆర్. (ఈళిళీలిరీశిరిబీ |దీబీరిఖిలిదీశి ష్ట్రలిచీళిజీశి)ను మెజిస్ట్రేట్‌కు సమర్పించడం, బాధితుల కోరిన పరిహారం అంటే, హింసనుండి రక్షణ ఉత్తర్వులు, మనోవర్తి ఇప్పించడం, నష్టపరిహారం, స్వంత ఇంటిలో వుండే హక్కును కల్పించడం లాంటి ముఖ్యమైన కర్తవ్యాల నిర్వహణలో ఉండటం వల్ల, చాలాకాలంగా ‘భూమిక’ వీరితో కలిసి పనిచేయాలని భావించింది.
పై అంశం గురించి వివరిస్తూ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సంచాలకులకు ఈ కౌన్సెలర్లకు ఒక వర్క్‌షాప్ నిర్వహించే విషయమై చర్చించడం ఆవిడ వెంటనే ఒప్పుకుని వారందరినీ హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు.
మొదటిరోజు ప్రతినిధులను ఆహ్వానిస్తూ, ఈ వర్క్‌షాప్‌ను ఎందుకు డిజైన్ చెయ్యాల్సి వచ్చిందో కొండవీటి సత్యవతి వివరించారు. ముఖ్యంగా భూమిక హెల్ప్‌లైన్‌కు వస్తున్న అసంఖ్యాకమైన కాల్స్‌ను గురించి చెబుతూ, బాధిత స్త్రీలను వివిధ జిల్లాల రక్షణాధికారుల కార్యాలయాలకు పంపుతున్న క్రమంలో అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని గురించిన ఫీడ్ బ్యాక్ రావడం లేదని, అసలు రక్షణాధికారుల కార్యాలయాల్లో కౌన్సెలర్‌ల బాధ్యతలేమిటో అవగాహన లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి గందరగోళం జరిగిన సంఘటనలు కూడా వున్నాయి. రక్షణాధికారుల కార్యాలయాలన్నింటిలోనూ ఒకేవిధమైన పద్ధతులు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసం, అలాగే కౌన్సిలర్స్ ఎదుర్కొంటున్న సాధకబాధకాలు, సమస్యల గురించి అర్థం చేసుకోవడానిక్కూడా ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు.
మొదటగా కౌన్సెలింగ్ నైపుణ్యాలమీద డా|| కిరణ్మయి చాలా విపులమైన, ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు. బాధిత స్త్రీలకు కౌన్సెలింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా శరీరభాష, కంటి కదలికలు, బాధితులను ఆహ్వానించే తీరు, కుర్చీలో కూర్చునే పద్ధతి, వారు తమ బాధను వివరిస్తున్నప్పుడు చూపించవలసిన ఏకాగ్రత మొదలైన అంశాల గురించి చాలా వివరంగా చెప్పారు. ప్రతినిధులచేత రోల్ ప్లే కూడా చేయించి వారిలో ఒకరిని కౌన్సిలర్‌గా, ఒకరిని బాధిత స్త్రీగా అభినయం చేయించి వారు చేసినదానిలో లోటుపాట్లను వారిచేతనే విశ్లేషింపచేసే పద్ధతి వల్ల, వారు కనబరిచే లోపాలను సులభంగా అర్థం చేసుకొనే తీరులో వివరించారు. డా|| కిరణ్మయి సెషన్ జరుగుతున్నప్పుడే స్త్రీ శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ సంచాలకులు ఉషారాణి ఐ.ఎ.ఎస్.సమావేశంలోకి వచ్చారు. ఆవిడకు వేరే సమావేశం వుండటం వల్ల త్వరగా వెళ్ళాల్సిన తొందర ఉన్నందున కిరణ్మయిగారి సెషన్‌ను కొంతసేపు ఆపి ఉషారాణిగారు ప్రసంగించారు. కౌన్సిలర్‌లుగా పనిచేస్తున్నవారి కష్టసుఖాలు తనకు తెలుసునని, దాదాపుగా ఎనిమిది నెలలుగా వారు జీతం లేకుండా పనిచేస్తున్నారనే విషయం తనకు చాలా బాధ కల్గించిందనీ, వివిధ సాంకేతిక కారణాలవల్ల జీతాలుచెల్లించలేక పోయామని, అందువల్లనే వారితో సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బందిగా అన్పించి పెట్టలేకపోయామని అన్నారు. ఇప్పుడు ఈ సమావేశానికి వస్తూ ఒక శుభవార్తను తీసుకువచ్చానని, ఆర్థికశాఖకు వెళ్ళి వారి జీతాల విషయమై చర్చించి, విడుదల చేయించామని, త్వరలో వారికి జీతాలు చెల్లిస్తామని, ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇలాంటి సమావేశం తమ శాఖ నిర్వహించాల్సి వుండగా, భూమిక లాంటి సంస్థ ముందుకు వచ్చి ఇంత పెద్ద బాధ్యతను మీదేసుకుని రెండు రోజులు వర్క్‌షాప్‌ను నిర్వహించడం అభినందనీయ మని ప్రశంసించారు.
ఉషారాణిగారి ప్రసంగానంతరం ప్రతినిధులు తమకున్న అన్నిరకాల సందేహాలను ఆమె ముందుంచారు. రెస్పాండెంట్లకు సమన్లు చేరవేయడంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ప్రయాణ ఖర్చులు లేకుండా జిల్లా అంతా తిరగాల్సి రావడం గురించి, వివిధ కోర్టులకు కేసుల కోసమై హాజరవడం గురించి ఆమెకు నివేదించారు. తాము కూర్చోవడానికి కొన్ని చోట్ల కనీస వసతి లేదని, స్టేషనరీ లాంటివి కూడా అందుబాటులో లేవని వివరించారు. వీటన్నింటికీ ఉషారాణిగారు ఓపిగ్గా సమాధానాలు చెబుతూ, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి నివేదికను తమకు అందచేయమని తప్పనిసరిగా వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
ఉషారాణిగారు వెళ్ళినతర్వాత డా|| కిరణ్మయిగారు తమ ప్రసంగాన్ని కొనసాగించారు. భోజనవిరామ సమయం తర్వాత రెండవ సెషన్ ప్రారంభమైంది., జుడీషియల్ ఎకాడమీలో సీనియర్ ఫ్యాకల్టీగా వున్న సీతారామ అవధానిగారు గృహహింస నిరోధక చట్టం – 2005′ గురించి వివరించారు. ఈ సెషన్‌లో చట్టంలోని వివిధ అంశాల గురించి మిగతా చట్టాలకన్నా ఈ చట్టం ఎంత ఉన్నతమైందో ఉదాహరణ పూర్వకంగా వివరించారు. భారతీయ చట్టాలలో ఇంతవరకూ లేని, ఉన్న ఇంటిలోనే వుండే హక్కును ఈ చట్టం ప్రసాదించిందని, అలాగే పోలీసుల, న్యాయవాదుల జోక్యాన్ని చాలా వరకు తగ్గించిన సివిల్ చట్టంగా ఇది రూపొందించారని తెలిపారు. ఇంతమంచి చట్టం అమలులో వున్న విషయం చాలామందికి తెలియదని, ప్రభుత్వం దీనికి సరైన ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం వుందని, తెలియచేసారు. సీతారామావధానిగారు మాట్లాడు తున్నంతసేపు చాలా సావధానంగా విన్న ప్రతినిధులు, అసంఖ్యాకమైన ప్రశ్నలను ఆయనపై సంధించారు. గృహహింస చట్టం అమలుకోసం పని చేస్తున్న తమకి ఈ చట్టం పట్ల చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయని తమకు ఇలాంటి వర్క్‌షాప్ ఇంతవరకూ జరగలేదని చెబుతూ, ఒక్కొక్క కేసు విషయంలో ఒక్కొక్క సందేహం తమకు వస్తుంటుందని, ఎవరిని అడగాలో ఇంతకాలం తమకు తెలియలేదని పేర్కొన్నారు. దాదాపు ఒక గంటసేపు ఈ చర్చలు, ప్రశ్నలు సమాధానాల సెషన్ నడిచింది. ఒకదశలో సీతారామావధాని గారు ఆశ్చర్యపోతూ క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో ఇన్ని లొసుగులు, సందేహాలు వుండడం ఆశ్చర్యం కల్గిస్తుందనీ ఈ ప్రశ్నలన్నింటినీ గుదిగుచ్చి భూమిక వారి సహకారంతో జుడీషియల్ ఎకాడమీ సౌజన్యంతో ఒక పుస్తకాన్ని ప్రచురించాల్సిన అవసరం వుందని, దీని కోసం తను తప్పకుండా ప్రయత్నిస్తాననీ, ప్రతినిధుల చప్పట్ల మధ్య ప్రకటించారు.
స్వార్డ్ సంస్థ నుంచి శివకుమారి మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా వుందని చెబుతూ, గృహహింస చట్టం అమలులో చాలా సమస్యలు ఎదురౌతున్నాయని, ముఖ్యంగా మేజిస్ట్రేట్లు అవగాహన లేకుండా కేసుల్ని కొట్టేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా దీన్నొక తలనొప్పి చట్టంగా చూస్తున్నారని, జిల్లా యంత్రాంగం కూడా సరిగా రివ్యూ మీటింగ్‌లు పెట్టడం లేదని, ఒకవేళ పెట్టి నా సాయంత్రం ఓ అరగంట టైమిచ్చి తూతూమంత్రంగా ముగిస్తున్నారని చెప్పారు. న్యాయమూర్తులకు తప్పనిసరిగా జండర్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. గృహహింస చట్టం అమలులో ప్రముఖ బాధ్యతను నిర్వహిస్తున్న లీగల్, సోషల్ కౌన్సిలర్స్ అందరిని ఒక చోట చేర్చి, మంచి వర్క్‌షాప్‌ను నిర్వహించిన భూమిక అభినందనీయ మన్నారు.
రెండోరోజు మొదటి సెషన్‌లో ‘సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ’లో పనిచేస్తున్న సుచరిత, ఆంధ్రప్రదేశ్‌లో గృహహింస చట్టం – 2005 అమలు తీరుతెన్నుల గురించిన నివేదిక సారాంశాన్ని ప్రతినిధులతో పంచుకున్నారు. తమమధ్యవున్న వివరాలకు, ప్రతినిధులు చెపుతున్న వివరాలకు పొంతన లేకపోవడం కొన్ని చోట్ల గమనించి, ఒక్కో జిల్లా వారినుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గృహహింస చట్టం రావడం వెనుక బిల్లు రూపం నుండి దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు చేసిన కృషిని చెబుతూ ప్రభుత్వం స్త్రీలమీద ప్రేమతో ఈ చట్టం తీసుకురాలేదని, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒప్పందాల వల్ల (సీడా) స్త్రీల కోసం ప్రత్యేక చట్టాలు వచ్చాయని, ఐతే అమలులో చాలా నిర్లక్ష్యవైఖరి వ్యక్తమౌతోందని చట్టం అమలుకు కావల్సిన వనరుల్ని కనీస సౌకర్యాలను కేటాయించడం లేదని అన్నారు. రక్షణాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న మీ అందర్నీ కలుసుకోవడం, మాట్లాడటం తనకు చాలా ఆనందాన్నిచ్చిందనీ, చాలా కొత్త విషయాలను తాను తెలుసుకోగలిగానని చెప్పారు.
వర్క్‌షాప్ ముగింపు దశకు వస్తున్న సమయంలో ప్రతినిధులందరూ తమతమ వ్యక్తిగత నేపథ్యాల గురించి వివరిస్తూ పరిచయం చేసుకుంటూ, తమ లాగానే వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నవారిని తొలిసారిగా ఇలా కలుసుకోవడం చాలా ఆనందాన్నీ, బలాన్ని ఇచ్చిందనిచెప్పారు. ఈ వర్క్‌షాప్ వల్ల తమలోపల సుడులు తిరుగుతున్న ఎన్నో సందేహాలు నివృత్తమయ్యాయని, కౌన్సిలింగ్ గురించిన ఎన్నో క్రొత్త అంశాల్ని తాము నేర్చుకోగలిగామని, అలాగే ”డీవీ’ యాక్ట్‌కి సంబంధించిన తమ అనుమానాలు కూడా తీరాయని, దీని ప్రభావం తమపనిపై పాజిటివ్‌గా పడుతుందని సంతోషంగా చెప్పారు.తమందరినీ ఇలా ఒకే గొడుగు కింద తీసుకొచ్చిన ‘భూమిక’కు ఎప్పటికీ రుణపడి వుంటామని ప్రకటించారు. మీరంతా ఒక సంఘంగా ఏర్పడితే బాగుంటుందన్న కొండవీటి సత్యవతి సూచనను వెంటనే ఆమోదించి ప్రాంతీయ కన్వీనర్‌లుగా ఈ క్రింది వారిని ఎన్నుకుని రాష్ట్ర స్థాయి కన్వీనర్‌గా కొండవీటి సత్యవతిని ఎంచుకున్నారు.
కన్వీనర్ కొండవీటి సత్యవతి, ఫోన్.9618771565
జె. విజయభాస్కర్ హైద్రాబాద్, నిజమాబాద్ ఫోన్ 9160144144
పి. రేవతి దేవి వరంగల్, కరీంనగర్, నల్గొండ, అదిలాబాద్ ఫోన్.9866137006
ఎం. ఉమాదేవి కడప, కరీంనగర్, అనంతపూర్, చిత్తూరు ఫోన్.9441959430
ఎస్.సరళ గుంటూరు, ప్రకాశం,నెల్లూరు ఫోన్.9440591634
జి. మాధవి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఫోన్.9441336240
ఎల్.సుధ తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ ఫోన్.9666654154
డి.ఎ.గౌరి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ ఫోన్.9703019441
చక్కటి ఆశావహమైన వాతావరణంలో మొదలైన రెండురోజుల వర్క్‌షాప్,చాలా నిర్మాణాత్మకంగా, ఉత్సాహంగా జరిగింది. షుమారు వందమంది పాల్గొన్న ఈ సమావేశం విజయవంతంగా ముగిసి, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు తెరతీసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags