ఆరడుగుల చోటులేని ఆసియా ఖండంలో…

కొండేపూడి నిర్మల
ఆ రోజు ఏదో పని మీద వైజాగ్‌ వెళ్ళాల్సి వచ్చింది. నా టిక్కెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో వుంది. సీటు దొరకడమే కనా కష్టం ఇక బెర్తు ఆశించడం ఇంకా దురాశ. నా ముందే ఇద్దరు ముగ్గురు ఎన్ని పచ్చ కాయితాలు చూపించినా గాని టి.సి. కరుణించినట్టు కనబడలేదు. అప్పుడు నేను వెళ్ళి, లంచంతో బాటు, నా జెండర్‌ పేరు చెప్పి ప్రాధేయ పడి వాడి షివల్రీగాని, తిరస్కారం గాని ఎదుర్కోవడం ఇష్టంలేక బాత్రూం పక్కన వుండే సింగిల్‌  సీటులో కూలబడ్డాను. చర్మాన్ని కోత పెట్టే చలి, ఆపుకోలేనంత నిద్ర గాల్లోంచి తేలి వచ్చే దుర్గంధం, జానా బెత్తెడున్న సీటులో అయిదడుగుల దేహాన్ని ఎలా మడతపెట్టి వుంచాలో తెలీని నిస్సహాయత, బ్యాగ్‌లోంచి దుప్పటితీసి కిందపరిచి అయినా గాని ఎక్కడో అక్కడ నడుంవాల్చాలని తీవ్రంగా అనిపించింది. కళ్ళతోనే చోటు కోసం వెతుకుతున్నాను. అప్పుడొచ్చిందొక ముసలమ్మ. ”నడిరేయి ఏ జాములో..” పాట పాడి ఎవరో ఇచ్చిన పులిహోర తినేస,ి సరిగ్గా అక్కడ నేను ఎంపిక చేసుకున్న ఆ జాగాలో గోనె పరచుకుని వెంటనే నిద్రపోయింది. టి.సి కంటపడితే ఎలానూ లేపేస్తాడు. కాబట్టి అతను వచ్చే లోపుగా గబగబా కునుకు తీసి లేవాలనే ఆత్రం కావచ్చు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక కూచోవడానికి అలవాటు పడ్డ జీవితాలకి ఎవరో తరిమికొడతారనే భయంతో గబగబ నిద్ర తియ్యడం, గబగబ ముద్ద తినడం, గబగబ కోరిక తీర్చుకోవడం, గబగబ పురిటి నొప్పులు పడి బిడ్డను కనడం, దూసుకుపోయే వాహనాల మధ్యలోంచి గబ గబ నడుచుకుంటూ చావుకి తెగించి ఆ పసిగుడ్డును చూపించి చిల్లర దొరకబుచ్చు కోవడంలోని విషాదం అర్ధం చేసుకోవడం కష్టం. అది ఎత్తువంటి వెలుగు ప్రసరించని ఇంకొక ప్రపంచం, జానెడు చోటు కోసం కూడా హత్యలు జరిగిపోతాయక్కడ. జీవితం మొత్తం చోటు కోసం వెతకడమే సరిపోతుంది వారికి. వ్యక్తిగత సంపద సమాజ పేదరికానికి కారణమనే కారల్‌ మార్క్సు మాట నిజమే అయితే ఆ హత్యలన్నిటికీ పరోక్షంగా మనమే కారణమేమో అనిపిస్తుంది. సంపదా దానివల్ల వచ్చే సుఖాలూ, ఆ సుఖాల మెత్తదనాలవల్ల అబ్బిన విలువలు, రుచులూ, అభిరుచులు మనమైనప్పుడు మన నిరక్ష్యంలోని కరుకుదనాన్నీ, మురికినీ వాళ్ళే మోయ్యాలి కదా. అలాగే మోస్తున్నారు మరి.
ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించినదేంటి? కోటి కోట్ల రూపాయల అవినీతి, డెభ్భై లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాల్లో గల్లంతైనట్టు అంచనా. ప్రభుత్వ శాఖలో జరుగుతున్న అవినీతి కోటి కోట్ల పై మాటే. ఈ సొమ్ముతో మన దేశానికి సంబంధించిన మొత్తం బాకీని వడ్డీతో సహా కొట్టి పారేయవచ్చు. ప్రతి ఊరికి మూడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని సౌకర్యాలతో నెలకొల్పవచ్చు. దేశంలో ప్రతి భారతీయుడికీ ఏభై ఆరు వేల రూపాయలు జీవన భృతి కింద ఇవ్వచ్చు. మన దేశ స్థూల జాతీయ ఆదాయంకంటే స్కాముల్లో పోయినదే ఎక్కువట… వీళ్ళేవర్నీ జైల్లో పెట్టిన వాళ్ళు లేరు. సోయి లేక పడి వున్న బిచ్చగాడిని పెడరెక్కలు విరిచి జైల్లో పడెయ్యడంద్వారా పార్లమెంటు అందం, మందం రక్షించబడతాయి. బంజారాల్ని తరిమికొట్టి, బంజారాహిల్స్‌ కట్టుకున్నంత గొప్పగా, కొంపలు ముంచే కల్తీ పోయించి లాక్కున్న ఆదాయంతో సంక్షేమ పధకాలు రచించినంత నిస్సిగ్గుగా ఈ దేశంలో అభివృద్ధి పెరుగుతున్న కొద్ది బిచ్చగాళ్ళ సంఖ్య పెరుగుతూనే వుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డువార జీవితాలెన్ని? అని ప్రభుత్వం మొక్కుబడి లెక్క ఒకటి తీసి రెండు మిలియన్లు అని ప్రకటించింది. ఒక స్వచ్ఛంద సంస్థ వెంటనే దాన్ని ఖండిస్తూ రెండు వేలు కానే కాదు ఇరవై రెండు మిలియన్లు వున్నారని చెప్పింది.. అంటే షాపు అరుగుల మీదా, పార్కుల్లోనూ, నెక్లెసు రోడ్ల కిందా వున్న వాళ్ళంతా హౌస్‌ ఓనర్లేనని ఏలినవారి అభిప్రాయం కావచ్చు. అసలు వీళ్ళకి ఎక్కడో అక్కడ ఇళ్లు వుండే వుంటాయని, స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని, వడ్డి వ్యాపారాలు చేస్తారని వాదించే పెద్ద మనుషుల్ని కూడా నేను చూశాను.
ఆసియా ఖండం ఎంత విశాలమైనదైనా ఆరడుగుల జాగాకి నోచుకోని భావిభారత పౌరులు అనేకం వున్నారు. వాళ్ళంతా. కూచున్నందుకు,  నుంచున్నందుకు, ఉమ్మినందుకు కూడా పోలీసు జీపులెక్కి వారికే తెలీని కేసుల్లో ఇరుక్కుపోయి అలమటిస్తారు. ఎత్తుకెళ్ళిన యాచకుల్ని ఆమ్ముకోవచ్చు. రక్తాలు తీసుకోవచ్చు. కళ్ళు, కిడ్నీలు మాయం చేసి పంపచ్చు. ఆడవాళ్ళ బాధలు అసలు చెప్పేందుకు లేదు. ఏ మంత్రిగారో మరాఠీగారో వచ్చినప్పుడు గరీబీ హఠావో అన్నట్టుగా ఈ గరీబుల్ని తొక్కి తుంగల్లోకి తోస్తారు. నా ఆలోచన పరి పరి విధాల పోతోంది.
ముసలమ్మ నిద్రలోనే ఇటు నుంచి అటు దొర్లింది. ఉలిక్కి పడినట్టుగా లేచింది. ఏదయినా పురుగు కుట్టిందేమో అనుకున్నాను. కాదు బూట్ల చప్పుడు  వినిపించినట్టుంది. టి.సి. కంటబడకుండా చివాల్న  బాత్రూంలోకి దూరింది. తర్వాత వెంటనే ఏదో  స్టేషన్లో దిగిపోయింది. ”నడిరేయి ఏ జాములో… పాట వినిపించలేదు. చక్రాల చప్పుడులో కలిసిపోయి వుంటుంది.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.