సెక్సువల్ పాలిటిక్స్

– పి. సత్యవతి

స్త్రీవాద ఉద్యమ రెండవ ప్రభంజనం లోని సంచలనాత్మక గ్రంధం కేట్ మిల్లెట్ వ్రాసిన ”సెక్సువల్ పాలిటిక్స్”. 1968 లో దీనిని తన పరిశోధనా పత్రంగా సమర్పించి 1970లో గ్రంధంగా వెలువరించినప్పుడు అమెరికాలోనూ ఇంగ్లండ్లోనూ కూడా సంచలనం సృష్టించింది. లైంగిక రాజకీయాల స్వరూప స్వభావాలని స్త్రీవాద ధృక్పధంలో నించీ విస్తృతంగా చర్చించిన ఈ పుస్తకానికి అప్పట్లో విమర్శలూ ప్రసంశలూ సమానంగా వచ్చినా ఇప్పుడు ఒక చారిత్రాత్మక గ్రంధంగా Ground breaking book గా శ్లాంఘిస్తున్నాం. మార్క్సిష్ట్ విమర్శకురాలు ఎవ్లీన్ రీడ్ కూడా జెర్మేన్ వ్రాసిన ఫీమేల్ యూనక్ కన్న మిల్లేట్ పుస్తకమే వాస్తవిక విశ్లేషణతో కూడినదని ప్రశంసించింది.

1970లో వచ్చిన ఈ పుస్తకం పితృ స్వామ్యాన్ని, రొమాంటిక్ ప్రేమల్ని, మోనోగామస్ వివాహాలని నిర్మొహమాటంగా నిర్భయంగా విమర్శకు పెట్టింది. స్త్రీలు తమని గురించి తాము ఏర్పరుచుకున్న అభిప్రాయాలని, తారుమారు చేసింది. పేరుపొందిన రచయితల రచనల్లో ప్రస్ఫుటం గానో అంతర్లీనంగానో వున్న పితృస్వామ్య భావజాలాన్ని బహిరంగం చేసింది. ”రాజకీయం అనేది, అధికారం ఆధారంగా నిర్మితమైన సంబంధంగా, ఒక తెగ మరొక తెగని అదుపులో పెట్టుకోడానికి ఉపయోగపడే సంబంధంగా ఉన్నపుడు ఒక తెగ అధికారంలోను, ఇంకొకటి ఆధీనంలోను ఉండటం సహజం. ఈ పరిస్థితులలో సమాజంలో కొనసాగుతున్న స్త్రీ పురుష సంబంధాలను కూడా రాజకీయ సంబంధాలుగానే చూడాలి. ఎందుకంటే మనది పితృస్వామ్యసమాజం. పరిపాలనా యంత్రాంగంలోని సమస్త శాఖలూ, అంటే సైన్యం, పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, విశ్వవిద్యాలయాలు రాజకీయతంత్రాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైనవన్నీ పురుషుల ఆధీనంలోనే వుండడం దీనికి రుజువు. ఇక పనివిషయంలోకొస్తే స్త్రీలుగా పుట్టినందువల్ల వాళ్ళు ఇంటిపని పిల్లలపోషణకు మాత్రమే పరిమితమై పోయారు. ఈ కర్తవ్యాలు ఆమెను జీవశాస్త్రసంబంధమైన విధులకు మాత్రమే పరిమితం చేశాయి. మానవ సాధ్యమైన మేధోసంబంధమైన కార్యాచరణలన్నిటికీ దూరం చేశాయి.

వ్యక్తులు నిర్వహించే పాత్రని బట్టే వారి సాంఘిక స్థాయి, హోదా నిర్ణయించబడు తుంది. కనుక దీనిని బట్టి స్త్రీల హోదాని అంచనా వేయ్యవచ్చు. సామాజికంగా అమలు లో వున్న కథలూ గాధలూ, జానపదకధలూ మతసంబంధమైన కధలూ, ఆఖరికి చిరకాలంగా బహుళ ఆదరణ పొందుతున్న కొన్ని గొప్ప సంబంధాలు కూడా ఏదో ఒక ముసుగులో పితృస్వామ్యాన్ని సమర్థిస్తాయి. పితృస్వామ్యపు మొదటి పాలక సంస్థ కుటుంబంఅంటూ ప్రారంభించి, భావుక ప్రేమ, దంపతి వివాహాలు యాడం ఈవ్ల కథ, ఈడెన్, నిషిద్ధ పలం మతాలలో స్త్రీల గురించి చెడుగా ప్రచారం చెయ్యడం, స్త్రీల శారీరక ధర్మాలను మలినమైనవిగా చిత్రించడం, మొదలైన విషయాలన్నీ విస్రృతంగా చర్చకు పెట్టి సాహిత్యంలో చిరకాలం నిలిచిన క్లాసిక్స్ డి.హెచ్.లారెన్స్, ”లేడీచాటర్లీస్ లవర్”, నార్మన్ మైలర్ ”నేకెడ్ అండ్ ది డెడ్”, హెన్సీమిల్లర్” ట్రాపిక్ ఆఫ్ కాన్సర్”, పుస్తకాలను, జీన్ గెన్నెట్ పుస్తకాలతో పోలుస్తూ, ఫ్రాయిడ్, జె.ఎస్.మిల్ల పుస్తకాలనుకూడా విశ్లేషిస్తూ సాగిన, ఈ గ్రంధం, సారాంశంలో ఒక లైంగిక విప్లవాన్ని కోరుతుంది. సాంప్రదాయంగా వస్తూన్న సంకోచాలు, నిషేధాలకు స్వస్తి చెప్పాలి.

పితృస్వామ్యానికి కొమ్ముకాచే దాంపత్య వివాహాలకు స్వలింగ సంపర్కం, ”అక్రమ సంబంధాలు”, వివాహేతర సంబంధాలు, మొదలైనవాటిమీద వుండే ఆంక్షల్ని తొలగించాలి. లైంగికత చుట్టూ అల్లబడిన వ్యతిరేకతా వలయాన్ని చేధించాలి. సమాజంలో నెలకొన్న ద్వంద్వనీతిని వ్యభి చారాన్నీ కూడా అంతమొందించాలి. లైంగిక స్వేచ్చకు సంబంధించి స్త్రీ పురుషులిద్దరికీ ఒకే నీతి అమలు కావాలి. ఆవిధమైన లైంగిక విప్లవం రావాలంటుంది కేట్ మిల్లెట్… ఇప్పుడున్న తత్వశాస్త్రం, మనోవైజ్ఞానిక శాస్త్రం అన్నీ కూడా. పితృస్వామ్య భావజాలజనితాలే కనుక, మనం మరింత స్పష్టమైన, వివేకవంతమైన తత్వశాస్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనీ, వాటన్నిటినీ తిరగరాయాలనీ అంటుంది.

ఈ పుస్తకాన్ని ఇంకాస్త వివరంగా పరిచయం చేసుకునే ముందు కేట్ మిల్లెట్ని పరిచయం చేసుకోవాలికదా! కేట్ మిల్లెట్ 1934లో మిన్నిసోటాలో జన్మించింది. 1956లొ మిన్నిసోటా యూనివర్సిటీ నించీ డిగ్రీ తీసుకుంది. 1970లో కొలంబియా యూనివర్సిటీనించి ”సెక్సువల్ పాలిటిక్స్” పరిశోధనాగ్రంధానికి డాక్టరేట్ లభించింది. పాశ్చాత్య సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలాన్ని, ముఖ్యంగా సాహిత్యంలోని పితృస్వామ్య భావజాలాన్ని తీవ్రంగా విమర్శించిన గ్రంధం ఇది. 1961లో ఆమె జపాన్ వెళ్ళింది. స్త్రీవాదోద్యమ కార్యకర్త, రచయిత్రీ అయిన మిల్లెట్ శిల్పి కూడా. జపాన్లో తన తోటి శిల్పి అయిన ఫ్యూమియో యోషిమూరా ని 1965లో వివాహం చేసుకుంది. తిరిగి అమెరికా వచ్చి స్త్రీవాద ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించింది. 1971లో నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ విమెన్ లో సభ్యురాలైంది. అప్పట్లోనే యోషిమూరా తో విడిపోయిన మిల్లెట్ 1985లో అతనితో విడాకులు తీసుకుంది. న్యూయార్క్ దగ్గర వున్న పవ్కీపీలోని పొలాలను కొని వాటిని పొలాలుగానే ఉంచి రక్షించడం మొదలుపెట్టింది. అవే ఇప్పుడు విమెన్ ఆర్ట్ కాలనీ ఫార్మ్గా రూపొందాయి. రచయిత్రులూ కళాకారిణిలు ఎవరైనా అక్కడ వెళ్ళి వుండవచ్చు.

1979లో ఆమె స్త్రీలహక్కులకోసం పనిచేయడానికి ఇరాన్ వెళ్ళింది. కానీ ఆ దేశంలో ఆమెను ఉండనివ్వలేదు. ఆ అనుభవాలనే ఆమె పుస్తకంగా వ్రాసింది. సెక్సువల్ పాలిటిక్స్ ఆఫ్ క్రూయాలిటీ, ఫ్లయింగ్, సీటా, ప్రాస్టిట్యూషన్ పేపర్స్ మొదలైన పుస్తకాలు వ్రాసింది. లైంగిక రాజకీయాలనుగురించిన ఈ పుస్తకం గురించి…. ఈసారి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to సెక్సువల్ పాలిటిక్స్

  1. rapetiprasad says:

    బెస్త్సిత్సితె

Leave a Reply to rapetiprasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.