దోపిడీ

– టి. సంపత్ కుమార్

”ఏంటీ?… ఈ సంబంధంకూడా క్యాన్సలయ్యిందా?…” ఆదుర్దాగా, ఆశ్చర్యంగా అడిగాను.

ఆఫీసునుండి వస్తూనే నేను మొదట చేసేపని నా బ్రీఫ్కేస్ని స్టడీరూములో దానికి కేటాయించిన చోటపెట్టి, కారు తాళం చేతుల్ని కీబోర్డుకి తగిలించి, డ్రాయింగ్ రూములో ఉన్న సోఫాలో కూచోని నెమ్మదిగా షూస్ విప్పి ర్యాక్లో పెడతాను. ఆరోజువచ్చిన పోస్టును ఓసారి గమనిస్తాను. విషయం ప్రాముఖ్యతని బట్టి కొన్నింటిని విప్పిచూస్తాను. ఆ తరువాత బ్రష్ చేసుకొని, మొహం కడుక్కొని లుంగీ-అంగీలోకి మారేలోపల మా ఆవిడ నేను పొద్దున ఆఫీసు వెళ్ళివచ్చాక-అంటే సమారుగా పదుకొండుగంటల్లో జరిగిన విషయాలన్నింటిని క్లుప్తంగా ‘ఆన్’ చేస్తుంది. అవి కొత్త సినిమాల రిలీజుకు ముందు ఊహించే సీనుల మాదిరిగా ఉంటాయి. ఒక్కొక్కసారి వార్తల ముందటి మఖ్యాంశాల మాదిరిగానో ఉంటాయి. పైన చెప్పిన పనులన్ని పూర్తిచేయాలంటే నేను మూడు-నాలుగురూముల్లోకి తిరగాలి. ఆవిడ ‘టీ’కి రంగం సిద్ధం చేస్తూనే కబుర్లని వినిపిస్తుంటుంది. నేను తనకి అంటే కిచన్కి దగ్గరగా తిరుగుతున్నపుడు వాల్యుమ్ ఎక్కువగానూ, దూరంగా వెళ్ళినపుడు తక్కువగానూ వినబడుతుంది. విషయాల ప్రాముఖ్యతల్ని బట్టి నా చెవులకి వాల్యూమ్ని అలా ‘కంట్రోల్’ చేస్తుంది మా ఆవిడ. అంటే ముఖ్యమైన విషయాల్ని నేను తనకు దగ్గర్లో తిరుగుతున్నపుడు చెబుతుంది.

వ్యాల్యూమ్ ఎక్కువగా వినబడే దరిదాపులో ఉన్పపుడు జ్యోతికి ఒప్పుకొన్న సంబంధం క్యాన్సలయిన విషయాన్ని బాధతో చెప్పింది.

”వరకట్నపు పేచీనా?… ఇంకేదైనా కారణమా…?” నా పనులను కొనసాగిస్తూనే అడిగాను.

”సరిగ్గా గెస్ చేసారు… డబ్బే!… డబుల్ ఇస్తారా అని అడిగారట… ఇవ్వకపోతే మరోసంబంధం వాళ్ళు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, రెండురోజుల్లో తమ నిర్ణయాన్ని తెలపమని చెప్పారట…”

బాధగా ఆలోచిస్తూ నా పనుల్ని ముగించి స్టడీరూమ్లోకి చేరుకున్నాను. ఆపాటికే మా ఆవిడ టీ-బిస్కట్లని టేబుల్పై సర్దింది. సాయంత్రం కలిసి టీ త్రాగడం, మా ఆవిడ ముచ్చట్లు నేను వినడం, నేను చెప్పే ఆఫీసు విషయాల్ని మా ఆవిడ వినడం -మా జీవితంలో ప్రతి వర్కింగ్డే రోజు జరిగే పసందైన ఘట్టం! మేముండేది ఆంధ్రరాష్ట్రం బయట-ప్రవాసాంధ్రులం!!

”ఈరోజు ఫోనొచ్చింది. జ్యోతి అమ్మ చాల బాధపడుతూ చెప్పింది. సంభాషణ పూర్తయ్యేలోగా రెండు సార్లు ఏడ్చింది. ఏంచేయాలోతోచడంలేదు. ఒప్పుకొన్న మొత్తానికే ఎంతో కష్టంగా ఒప్పుకొన్నాం. జ్యోతి ఇంజనీరింగు చదువుపై ఖర్చు మీకు తెలుసు. ఇపుడు జ్యోతి నెలకు ఇరవైవేలు సంపాదిస్తోంది. అబ్చాయి తరపువారు మీకు బంధువులని తెలిసింది. మీరేమైనా మాట్లాడగలరా? ఒక్కసారిగా డబ్బు అలా పెంచేస్తే ఎలా తెస్తాం? అంటూ గట్టిగా ఏడ్చేసి, చివరకి జ్యోతి అదృష్టం ఎలాఉందో… అంటూ కర్మ సిద్థాంతంతో కంప్యూటర్స్ చదివిన కూతురు భవిష్యత్తు గురించి బెంబేలు పడుతూ పెట్టేసింది.” మా ఆవిడ బాధతో ఫోను సంభాషణని వివరించింది. తన ముఖంపై కాస్త కోపం కూడా చోటు చేసుకుంది.

టీ త్రాగుతున్నాం. మధ్య మధ్యలో బిస్కట్ల కరకరలు, నేను మా ఆవిడ చెప్పిన విషయాల్ని సీరియస్గా విన్నాను. ఈమధ్యే జరిగిన ఇలాంటి రెండుకేసులు గుర్తు కొచ్చాయి. వాటిగురించి మీకు చెప్పాలి…

మాకు దగ్గరి మిత్రుడి కూతురు సంబంధం. అంతామాట్లాడుకొన్నాక, పెళ్ళి ఫలానా నెల్లో అని కూడా అనుకున్నాక- మరెవరో ఒప్పుకొన్న అమౌంటుకంటే ఎక్కువిస్తామని వచ్చారట. దాంతో అబ్బాయి తల్లితండ్రులు ఆ సంబంధంవైపు మొగ్గుచూపి ఏవేవోసాకుల్ని అసరాగా తీసుకొని క్యాన్సల్ చేసారట. ఊహించని ఈ ట్విస్టుతో అమ్మాయి కుటుంబం డిప్రెషన్లోకి పోయింది. నాకీవిషయం తెలిసి వెంటనే మిత్రుడికి ఫోన్ చేసాను. ఓదారుద్దామన్న ఆశతో… నామిత్రుడే ఫోనెత్తాడు. ఆమాటా-ఈమాటా మాట్లాడి విషయాన్ని కదిలించాను. ఏమయిదని అడిగాను.

”అబ్చాయి బెంగుళూరు, హైదరా బాదుల్లో, చిన్నా చితకా ఉద్యోగాలు చేసి ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు. ఇంట్లో పెళ్ళికాని చెల్లిఉంది. ఆ అమ్మాయి ఎక్కువ చదువుకోలేదు. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఇంకో సంబంధంవాళ్ళు ఈ అబ్బాయి ఫ్యామిలీ గురించి బాగా స్టడీ చేసినట్టున్నారు. ప్యాకేజీ డీల్ ప్రపోజ్ చేసారట-అబ్బాయికి అమెరికా వెళ్ళే ఖర్చులు భరిస్తారట. మేమిస్తామనుకున్న అమౌంటుకి మరికొంత కలిపారు. చెల్లి పెళ్ళికి ఉపయోగపడుతుందని ‘ఉచిత’ సలహా ఇచ్చారట. పెళ్ళి గ్రాండ్గా జరిపేందుకు ఖర్చుకూడా వారిదేనని భరోసా ఇచ్చారట….” వాడి గొంతు జీరపోయింది. బాధగా, నెమ్మదిగా వచ్చాయి మాటలు… నేను మధ్యలో ఏంమాట్లాడకుండా విన్నాను.

”మనతో ఒప్పుకొన్నారుకదా! కారణం ఏంచెబుతున్నారు? ఇపుడిలా అంటే ఎలారా? ఒప్పందాన్ని అగౌరపరచడం!… ఎంతటి అనాగరికులురా… వారు!!…” నాకు మెల్లగా కోపం పెరుగుతుండగా అన్నాను.

”నువ్వు ఢిల్లీలో ఉంటావురా… నీకు ఆంధ్రాలో జరిగే తతంగాలు తెలువవురా… ఆడపిల్లల తండ్రులకి కొత్త తరహా సమస్యలొస్తున్నాయిరా… ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పెళ్ళిళ్ళుకాని మన అబ్బాయిలకు లేదా విదేశాలకు వెళ్ళేందుకు సిద్దంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకి వినూత్న ఆలోచనలు వస్తున్నాయిరా… అవి మాలాంటి ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెల్ని సూదులతో పొడుస్తున్నట్టుగా ఉంటుంది…” బాధతో చెప్పాడు. ఫోన్లో మాట్లాడుతున్నాం… వాడిగొంతు, స్వరంతో వాడిముఖం ఎలా ఉంటుందో ఊహించుకొంటున్నాను.

”తల్లితండ్రుల మాట పక్కనపెట్టు. కుర్రాడు ఏమంటున్నాడ్రా? ఇంజనీరంటాం… సాఫ్ట్వేర్ అంటాం… ఉండేది-పోయేది అమెరికా అంటాం… అబ్బాయి ఏమంటాడు?… తల్లిదండ్రులు ఇలా మాటతప్పుతూ, కమర్షియల్గా, ఖర్చుల్ని రాబట్టేందుకు ”కాస్ట్ రికవరీ” లేక ”యూజర్ ఫీ” లాంటి మంత్రాలతో విలువల్ని నాశనం చేస్తుంటే ఎలా ఊర్కుంటున్నార్రా?… ఇలాంటి దరిద్రులు మంచి జీవిత భాగస్వామి అవుతార్రా?… దేశానికి పేరు ప్రతిష్టలు తెస్తార్రా…?

రేపు వాడి చెల్లి సంబంధం విషయంలో ఎవరైనా ఇలా చేస్తే ఎలా ఫీలవుతాడ్రా?..” నాలో కోపం పెరిగి ఉద్రిక్తతతో అన్నాను.

మా ఆవిడ గమనించి నన్ను కంట్రోల్లో ఉండమని, హైపర్గా రియాక్ట్ కావద్దని తన కళ్ళతో, చేతుల కదలికల్తో చెప్పింది…

”వాళ్ళేం చేస్తార్రా?…” గొంతు సవరించుకొని సాగించాడు… ”కాంపిటీషన్ వాతావరణంలో అన్ని మరచిపోతున్నారు. పరీక్షల్లో నెగ్గి మంచి పర్సెంటేజీల్ని తెస్తారు కానీ జీవిత పరీక్షలో నెగ్గుతామన్న విశ్వాసం లోపిస్తుంది. విదేశాలే గమ్యస్థానంకావున మన దేశంలో ఎలాగూ ఉండేది లేదు. సంబంధం కుదిరినవారితో బంధాలేముంటాయి? మూడు-నాలుగేళ్ళ కోసారి చుట్టాలమాదిరిగా వచ్చిపోతారు… మాట తప్పిన సిగ్గుతనంకాని, పట్టింపుకాని అసలే ఉండవు. తన తల్లి తండ్రులకు ఇబ్బందులు తగ్గించి మరో తల్లితండ్రులకి కష్టాల్ని పెంచుతున్నామన్న కనీస ఆలోచనకూడ వారి ఆలోచనా పరిధుల్లోకి రావు. అల్లుళ్ళ (వారి తల్లితండ్రులవి కూడ) కోర్కెల్ని తీర్చేందుకు అత్తమామలు ఫిక్స్డ్డిపాజిట్లతో సిద్దంగా లేరుగా… మంచి నాగరికులవుతారన్న ఆశనాకు ఏకోశానా లేదురా…”

”ఇంతకు అనిత ఏమంటుందిరా? ఎలా ఉంది?” అడిగాను. అందరికంటే ఎక్కువ దెబ్బతింది ఆ అమ్మాయేకదా అని అనిపించింది.

”వాళ్ళ ఫోన్ చేసినపుడు అనిత ఇంట్లోనే ఉందిరా. నేను ఆవైపు సంభాషణవిని మిసెస్కి చెబుతుంటే విన్నది. వెంటనే తన గదికి పోయి తలుపేసుకొంది. కాసేపయ్యాక మేమిద్దరం లోపలికి వెళ్ళాం. పడుకొని ఉంది. మేము కాసేపు కూచొని తలపై నిమురుతూ ”ఆలోచిద్దాం… నువ్వు దిగులుపడకు…” అని తలుపు దగ్గరేసి బయటకొచ్చాం. ముభావంగా కూచునేమాతో డిన్నర్చేసింది. ఆ తరువాత తన స్నేహితులతో చాలాసేపు మాట్లాడింది. పొద్దున టీ తీసుకుంటున్నపుడు ఏ ఉపోద్ఘాతం లేకుండా” వాళ్ళడిగేడబ్బు ఇవ్వమని, ఇలాంటిదౌర్భాగ్యుల సంబంధం వద్దనిగట్టిగా చెప్పమని” నాతోచెప్పి ధైర్యంగా ఆఫీసుకెల్లడానికి లేచింది. మేం ఓదార్చే ప్రయత్నం చేసాం. ఇంకోరోజు ఉందికదా మనం ఆలోచించడానికి… తెలియకుండానే మానుండి భరోసా మాటలొచ్చాయి. అనిత ససేమిరా ఒప్పుకోలేదు. తనకీ సంబంధం అసలేవద్దని నిక్కచ్చిగా చెప్పి వెళ్ళిపోయింది.

”ఒప్పందాలకు విలువ ఇవ్వని మనుషులతో, అలాంటి కుటుంబానికి చెందిన అబ్బాయి ఏం చేయకుండా గంగిరెద్దులా తలతిప్పుతూ, వ్యక్తిత్వంలేని మనిషితో ఎలావేగను నాన్నా… ఆంధ్రాపెళ్ళిళ్ళ గబ్బుల్లోంచి అంతకంటే ఘోరంగా ఉన్న అమెరికా పెత్తందారీ కంపులోకి వెళ్ళాలంటే అసహ్యంగా ఉంది. నాన్నా” అని అందిరా…

”మరి పెళ్ళివిషయం”… అంటే ”సంవత్సరం తరువాత ఆలోచిద్దాం…” అంటుందిరా…

”అనిత వాదనతో నేను ఏకీభవిస్తాను రా… కాని అబ్బాయి వాళ్ళని అలా వదలకూడదురా…మీడియాకి లాగుదామా? ఈవిషయాన్ని…”

”వద్దురా… అలాచేస్తే మనమూ, అనితపేరూ, వార్తల్లోకివస్తుంది. ముందు ముందు సంబంధాలు వెతకాలంటే కష్టాలు మనకేరా…” అని నా సలహాలని కొట్టి పారేసాడు వెంటనే…

”నన్నేంచేయమంటావ్… ఈ సమయం లో నీకు అందుబాట్లో లేనందుకు బాధగా వుందిరా… మళ్ళీ కొత్తవేటకు శక్తిసామర్థ్యాల్ని పుంజుకోడానికి రెండు- మూడు నెల్లుకావాలి రా… పట్టేచేపను బట్టి వలను మార్చినట్టుగా జాలరిలా అబ్బాయిల్ని పట్టుకోడానికి వలల్ని విసిరే నేర్పునాకు లేదురా… అనుకోని విషయం జరిగింది. బుర్రలోకి ఎక్కి, ఇంకి మళ్ళీతేరుకోడానికి టైంపడుతుందిరా…” నిరుత్సాహంగా, జీవంలేకుండా హీనస్వరంతో అన్నాడు.

”అబ్బాయితో ఏమైనా మాట్లాడ మంటావా?… స్వంతగా నిర్ణయం తీసుకునే ధైర్యంఉందా అబ్బాయికి?..”అడిగాను.

”లాభంలేదురా… ఒప్పందం అయ్యాక అనిత-అబ్బాయిలు ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలెట్టారు.. మాటమార్చిన మరునాడు అనిత అబ్బాయికి ఫోన్చేసి డిస్కస్చేద్దామని ప్రయత్నించింది. అబ్బాయి ముభావంగా అంతా ‘మాపేరెంట్స్కు తెలుసు’ అని ఫోన్ కట్చేసాడట. కాసేపయ్యాక అనిత మళ్ళిఫోన్చేసి నీలాంటి ఆత్మవిశ్వాసంలేని వాడితో, బలహీనుడితో, సంస్కారహీనుడితో పెళ్ళిచేసుకోనందుకు సంతోషిస్తున్నానని చెప్పిందట…”

”గుడ్… మంచి పనిచేసిందిరా… అనిత ధైర్యాన్ని తాను హేండిల్చేసిన తీరుని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానురా… నేను అనితని ప్రశంసిస్తున్నందుకు నామీద నీకు కోపం వచ్చినా ఫరవాలేదురా… నీ కూతురు ధైర్యవంతురాలురా… గర్వించరా… ”నానోట్లోంచి మాటలు అలావచ్చేసాయి ఆసమయంలో…

”నీకు కూతురులేదురా. ఉంటే బహుశా ఇలా అనలేవురా”. అని డీలగా నావిడొల్లమాటలనే అర్థంవచ్చేట్టుగా పలికాడు.

”లేదురా… నువ్వు గర్వించాలిరా… మన అమ్మాయి అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేసింది. పిరికివెధవ… వాడు మాట్లాడ కుండా… చ…ఛ…. చికెన్హర్ట్డ్ ఫెల్లో… సాఫ్ట్వేర్ ఇంజనీర్లంటారు. కాని మృదుత్వం లేని మనుషులు… గ్రీన్ కార్డ్హోల్డర్స్ అంటారు. కాని వారి అప్రోచ్లో ఎలాంటి పచ్చదనం కనిపించదు. అక్కడికెళితేకాని అసలు రంగు తెలియదు. అమెరికా అనుసరిస్తున్న ”పాలసీలను” మొదటినుండే బాగా వంటపట్టించుకుంటున్నారు-ఫ్యూచర్ అమెరికా సిటిజన్స్!!… నాలో రగులుతున్న మాటల్ని కక్కేసాను.

ఊరట కలిగించే విషయం చెబుదామని నేనే సంభాషణని కొనసాగించాను.

”ఇక్కడ మాకు బాగా తెలిసిన రెండు మూడు పంజాబీ కుటుంబం వాళ్ళు ‘హమారా బేటాకేలియే ఆప్కా తరఫ్ లడ్కికో దేఖో’ (మా అబ్బాయికోసం మీవైపు అమ్మాయిని చూడండి) అని తరచుగా అంటుంటారు. మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటారు. ఒక అబ్బాయిని చిన్నప్పటినుండి చూస్తునాం. బుద్ధిమంతుడు. స్మార్ట్గా ఉంటాడు.

ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబిఏ చేశాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. వరకట్నం లేకుండా పెళ్ళిచేపిస్తా… చెప్పరా?… అయినా ఈ విషయం నీతోకాదు అనితతో మాట్లాడాలి. ఆదివారం పొద్దున మాట్లాడతానని అనితని సిద్ధంచేయి…” మరికొన్ని ధైర్యపు మాటలు చెప్పి ఫోన్ పెట్టేశాను.

రెండోకేసు. పెళ్ళాయ్యక కూడా పీల్చుకునేకేసు. అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడు. అమ్మాయి ఆంధ్రాలో బి.టెక్చేసింది. ఒప్పదంలో పెద్దమొత్తం డబ్బు, భారీస్థాయిలో పెళ్ళితోపాటు అమ్మాయిని అమెరికాలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చదివించేందుకు పూర్తిఖర్చు… అమెరికా- ఇండియా నూక్లియర్డీల్ స్థాయిలో ఆలోచనలు జరిపి మొత్తానికి అబ్బాయివారు అమ్మాయి కుటుంబంవారితో ఒప్పించు కున్నారు. పెళ్ళి ఘనంగా జరిగింది. వరకట్నం తో పిల్లాడి చదువుమొత్తం ఖర్చు తిరిగి రావడంతో తల్లితండ్రులు ఎంతో సంతోష పడ్డారు. పెళ్ళయిన ఆర్నెల్లకి అమ్మాయి అబ్బాయిని చేరడంతో ఆయనా మహానందంగా ఉన్నాడు. కానీ ఖర్చు లేకుండా తన భార్య తన మామగారి ఖర్చుతో చదివి జీవితాంతం సంపాదించి పెడుతుంది. అత్తామామలు ఇండియాలో ఆస్తుల్ని అమ్మి అల్లుడికి (సారీ… వారి కూతురునే చదివిస్తున్నారు కదా అనాలి సుమా!) పంపుతూ బాగా సంపాదించే ఓ యంత్రాన్ని తయారు చేసేందుకు పూర్తి ఖర్చు భరిస్తున్నారు…

ఇలాంటి అల్లుళ్ళని నడిరోడ్డులో నిలుచోబెట్టి గురువారం రోజు సాయిబాబా గుడికి వచ్చిన భక్తులందరి చెప్పులతో కొట్టిస్తే ఎలా ఉంటుంది?

జ్యోతి విషయం, ఈ మధ్యే జరిగిన ఈ రెండుకేసులు గుర్తొచ్చి నాగుండె బరువయ్యింది. ఢిల్లీలో ఉంటున్న తెలుగు కుటుంబాలని కలిసినపుడో లేక తెలుగు మీడియాద్వారా ఇలాంటి సంఘటనలు తెలుస్తూనే ఉంటాయి మాకు. ”ఆంధ్రాలో అవతరించిన ఈ విచిత్రమైన ‘సాఫ్ట్వేర్’ తియ్యగా దోపిడి చేసేందుకు ‘హార్డ్వేర్’ రూపంలో సంస్కారం లోపించిన మనుషులు బాగా తోడయ్యారు. ఈ సాఫ్ట్వేర్ని పూర్తిగా కబళించే వైరస్వస్తే ఎంతబాగుంటుంది! అదొక రంగుల పగటికలేమో?” అన్నాను ”మనమంతా పెట్టనిగోడలా ఫిల్టర్లమై ఉంటే వైరస్ ఎలా చొచ్చుకుపోయేది? మా ఆవిడ సూటిప్రశ్న.

”అబ్బాయిలూ, అమ్మాయిలూ మారితే ఆ మార్పు చాలా తొందరగా రావచ్చు. అబ్బాయిల్లో ఆత్మవిశ్వాసం ఎందుకు లోపిస్తుందో నాకు అర్థంకావడంలేదు…” అన్నాను.

”అమ్మాయిలు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎంత లాగాల్నో లాగేద్దాం, పెళ్ళే చివరి అవకాశం అన్నట్టుగా అంతా ‘వసూలు’చేస్తున్నారు తల్లితండ్రులనుండి. అమెరికా వెళ్ళే అమ్మాయిలు వడ్డాణాలు, కంకణాలు, అరవంకీలు, రకరకాల నగల సెట్లు అంటూ తల్లుల్ని పిండి మరీ చేయించుకొని వెళుతున్నారు.”

అమ్మాయిలు కూడా ఈ స్థితికి కారణమనే గొంతుతో మా ఆవిడ కొన్ని ఉదాహరణల్ని చదివింది.

”ఏం చేద్దాం? మనఫోన్ కోసం జ్యోతి పేరెంట్స్ ఎదురుచూస్తుంటారు.” మా ఆవిడ నేను చేసే పనిని గుర్తుచేసింది.

నేను మా ఆవిడ జ్యోతి విషయాన్ని ఒక గంటకు పైగానే చర్చించాం. ఎందుకంటే ఈ స్థితిలో వారికి ఓదార్పుతోపాటు ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలి. విలువలు, ఒప్పంద గౌరవాలు పనిచేయవని, ఈ కష్టపరిస్థితుల నుండి, గట్టెక్కడానికి మావంతు సహకారం ఏమందించగలమో కూడా చర్చించి మాట్లాడ్డానికి సిద్దమయ్యాం.

టీ తాగిన ఉషారుతనంతో ఫోన్చేసాను. ఆవైపు నాస్నేహితుడి గొంతు ”ఇపుడే తెలిసింది… జ్యోతి సంబంధం గురించి…” మెల్లగా కదిపాను ఆవైపున నిశ్శబ్ధం….

”ఏం ఆలోచిస్తున్నావ్? రేపు సాయం త్రం వరకు చెప్పాలా? మన నిర్ణయాన్ని… జవాబు రాలేదు.

”ఏరా? మాట్లాడ్డంలేదు… నాకున్న చొరవతో ఆప్యాయంగా అడిగాను.

”…ఏం చేయాలో అర్థకావడం లేదురా… అందుకే ఏమీచెప్పలేకపోతున్నాను.”

”మధ్యాహ్నం అన్నం కూడ తినలేదండీయన…” అంది స్నేహితుడి భార్య. ఎక్స్టెన్షన్ లైన్లో ఉన్నట్టుంది. ఆవిడ మంచి పనిచేసిందనుకొంటూ మా ఆవిడని కూడ స్టడీరూంలోని ఎక్స్టెన్షన్ లైన్ ఎత్తమని సైగలు చేసాను. నలుగురం మాట్లాడితే వారికి ఓదార్పుతోపాటు అందరి సంప్రదింపులతో సమస్యని గట్టెక్కించే ఆలోచన రావచ్చని నాఆశ… ప్రయత్నం….

”చిన్న పిల్లాడిలా ఇందేట్రా?…” మందలించాను. ”ఒప్పుకొని రెండింతలు కావాలట… లేకపోతే ఇంకో సంబంధం రడీగాఉందట… వాళ్ళకి నీవు తెలుసట.. దూరపు బంధుత్వమని మేము సంబంధం కుదుర్చుకొనేటపుడు మాటల మధ్యలో అన్నారు… నీవు మాట్లాడి రెండంతలవకుండా, ఒప్పుకొన్నదానికి మరో రెండులక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పరా… జ్యోతి పెళ్ళవుతే చాలురా.. అబ్బాయి బుద్ధిమంతుడిలా ఉన్నాడురా… పుణ్యం కట్టుకోరా…” హీనస్వరంతో, దీనంగా, ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

”ఈ సంబంధం పోతే మళ్ళీవెదుకు తామన్నా కనుచూపుల్లో ఒక్కటికూడలేదు. గట్టెంకించాలి మీరు…” మిత్రుడిభార్య.

”ఎవరితో మాట్లాడమంటారు- అబ్బాయితోనా? తల్లితోనా?… తండ్రి తోనా?…”

”తండ్రితో” మిత్రుడన్నాడు.

”తండ్రికి బదులు అబ్బాయితో మాట్లాడితే ఎలా ఉంటుంది? బుద్ధిమంతు డన్నావ్… నచ్చచెబితే పేరెంట్స్ని ఒప్పించ లేడా?…”

”నాకునమ్మకం లేదురా… నీకంతగా అనిపిస్తే, విశ్వాసం ఉంటే మాట్లాడి… ఒక్క విషయం గుర్తుంచుకోరా… సంబంధం చెడకుండా చూడు. ఒక్కోసారి నీవు ఎమోషనల్ అయ్యి గట్టిగా మందలింపు ధోరణిలో సూటిగా మాట్లాడుతావు… జాగ్రత్త…

”అలా చేయన్లేరా… వాళ్ళు ఒప్పుకొంటే డబ్బుసర్దగలవామరి…”

”స్వంత ఊర్లో ఇల్లుందిరా. ఎలాగు అక్కడికెళ్ళి ఉండం. ఊరివాళ్ళు అపుడపుడు ఫోన్చేసి ‘అమ్మితేమాకమ్మండిసార్’ అని అడుగుతుంటారు. దాన్ని అమ్మేస్తాను. ఎక్కువేంరాకపోవచ్చు. చిన్నఇల్లు… పాతది…”

”అవసరమైతే నేను ఒక లక్షివ్వ గలనురా… నీ లెక్కల్లోదీన్ని కూడ లెక్కించుకో… అయితే అబ్బాయి నంబరివ్వరా?…”

”హలో… కృష్ణసాయి… నేను… ఢిల్లీనుండి….”

”హలో అంకుల్… ఎలా ఉన్నారు? నాన్నగారు ఇంట్లో లేరంకుల్…” ”ఫరవా లేదు… నీతోనే మాట్లాడాలి – అందుకే చేసాను. నీ పెళ్ళి సంబంధం… వరకట్నవిషయం… నీతోనే మాట్లాడాలి… ఎక్కువడుగుతున్నారని తెల్సింది.” నామాటల పరంపర…

”ఆ విషయాన్ని నాన్నగారు చూస్తున్నారు. నాకు ఎక్కువగా తెలియ దంకుల్…”

”చూడు..కృష్ణా… ఇది నీపెళ్ళిగురించి… నీకు తెలియకుండా ఎలావుంటుంది? నాకు ఆశ్చర్యంగా ఉంది…” ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా నామాటల్లో కొంచెం కోపం మిళితమవుతోంది.

దగ్గర్లో నిలుచున్న నాభార్య తన చేత్తో కోపంతగ్గించమంటూ శాంతించమంటూ వచ్చే అర్థంగా సైగలుచేసింది.

పనిమనదని గ్రహించి గేరుమార్చాను. నాస్నేహితుడి మాటలుకూడ జ్ఞప్తికొచ్చాయి.

”కృష్ణా… నీవు జ్యోతి ఒకర్నొకరు చూసుకున్నారు. ఇష్టపడ్డారు. ఇచ్చిపుచ్చు కోవడాలగురించి ఒక ఒప్పందం జరిగింది. ఇపుడు ఇంకెవరో ఎక్కువ ఆశ చూపితే సంబంధం తెంపుకోడానికి మీరు సిద్ధ మయ్యారు. అంటే నీవూ సిద్ధంగా ఉన్నావు. ఇంతటి ముఖ్య విషయం నీకు తెలియదంటున్నావ్… ఏదైనా ఉంటే ధైర్యంగా, మోహమాటంలేకుండా చెప్పు… మీ తరానికి పిరికితనం పనికిరాదు…”

కాస్సేపటివరకు నిశ్శబ్దం. మాట్లాడ తాడో లేడోనని నాకు అనుమానమేసింది.

”కృష్ణా” పిలిచాను.

”ఆఁ… అంకుల్….”

”ప్లీజ్ కృష్ణా! నీవొక ఇంజనీరువి. ఒక కంపెనీవాడు నీతో కన్సల్టెన్సీ అగ్రిమెంట్ చేసాక, అదే పనిని వేరేవాడు తక్కువ ధరకి చేస్తానన్నాడని వానికి ఇస్తే ఎలా ఉంటుంది? నేను చెప్పేది మంచి ఉదాహరణ కాకపోవచ్చు. కన్సల్టెన్సీలను ఎన్నోచేస్తాం మనజీవితంలో. ఇక్కడ – లైఫ్పార్ట్నర్ గురించి – మనం మాట్లాడేది. మనకు ఇష్టమై ఒక కొత్త బంధాన్ని ఏర్పరచుకునేందుకు ఒప్పుకొన్నాక రద్దుచేస్తే ఎలా ఉంటుందోనన్న విషయాన్ని నీకు సరిపడే చిన్న ఉదాహరణ చెప్పి అడుగుతున్నాను…..”

”అంకుల్… అంకుల్…” తడబడుతూ వచ్చాయి మాటలు… ”అంకుల్… నాన్నగారికి కొంచెం ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాచదువుకు చాలా ఖర్చుచేశారు. అమెరికా ఖర్చులు మీకుతెలుసు.. మీరు తనతోనే మాట్లాడితె….” అంతూపొంతూలేకుండా వచ్చాయి మాటలు.

”కృష్ణా… నీ కభ్యంతరం లేకపోతే కొన్ని ప్రశ్నలడగొచ్చా?…ప్లీజ్…”

”తప్పకడగండి… అంకుల్…”

”నీబట్టల్నెవరు సెలక్ట్ చేస్తారు?”

”నేనే… నేనే సెలక్ట్చేసుకొంటాను”

”నీ షూస్?…” ”నేనే”…

”నీవు ఇంజనీరింగులో చేరినపుడు నీ సబ్జెక్ట్ని ఎవరు సెలక్ట్ చేసారు?” ”నేనే… నాకు ఇంట్రెస్టనిపించిన సబ్జెక్ట్ని ఎన్నుకొన్నాను…”

”ఇన్ని నిర్ణయాలు మీ నాన్నగారి ప్రమేయం లేకుండా నీవే, స్వంతంగా తీసుకుంటున్నవాడివి నీ జీవిత విషయం వచ్చేసరికి మీ నాన్నపై తోసేస్తున్నావ్… అన్యాయంగా, ఆశ్చర్యంగా అనిపించడం లేదా?… కృష్ణా?… మృదువుగా, లాజిగ్గా అడిగాను.

”…” కొన్ని క్షణాలవరకు కృష్ణపలకలేదు. ఆలోచిస్తున్నాడేమో? ఆలోచించలేని స్థితిలో ఉన్నాడా? ఏమో? తీగలద్వారా, గాలితరంగాలద్వారా జరిగే మా సంభాషణలో మోహల్ని చూసుకోలేంకదా? ఎలా ఉందో కృష్ణమోహం ఆక్షణంలో…

”నీవు-జ్యోతి ఒకరినొకరు ఇష్టపడ్డట్టు తెలుసు. తరచుగా మాట్లాడుకుంటూ, అపుడపుడు కలుసుకున్నట్లుగా కూడా తెలుసు. ఇపుడు మీనాన్న అడిగిన అదనపు డబ్బుకు వారు ఒప్పుకోకపోతే నీవు ఇంకో అమ్మాయిని పెళ్ళిచేసుకొంటావు. నీకు నచ్చిన సినిమా చూస్తావా? లేక ఏసినిమా అయినా ఫరవాలేదు అనుకొని మూడు గంటలు సినిమాహాల్లో కూచుంటావా? నీకు ధైర్యంలేదు. నీపై నీకు విశ్వాసంలేదు. మనస్సుతో సంబంధంలేదు. మనదగ్గరిపుడు కొత్త జాతకాలు నోట్లకట్టల్లో, ఫ్రీగా ఇచ్చే ప్లాట్లల్లో, అపార్ట్మెంట్లలో, ఏమాత్రమూ కష్టాలు కలుగకుండా వచ్చే అదనపు సౌకర్యాల్లోంచి పుడుతున్నాయి. అవేపెళ్ళి సంబంధాల్ని కలుపుతున్నాయి – అవలీలగా…”

”లేదంకుల్… నాకు జ్యోతి అంటే ఇష్టమే. నాన్నగారు వచ్చే సంవత్సరం రిటైరవుతున్నారు. అమెరికాలో నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. చెల్లికి సంబంధాలొస్తున్నాయి. ఆదృష్టితో నాన్నగారు ఆలోచిస్తున్నట్లున్నారు. తన స్ట్రాటెజీ బాగానే అనిపించి నేను ఎదురుచెప్పలేకపోతున్నాను…” వాళ్ళనిర్ణయానికి వెనకున్న కారణాలు విప్పాడు.

”ఎక్సలెంట్” వ్యంగ్యంగా అన్నాను.

”నేనేమి మాట్లాడేదిలేదిక… ఆల్ది బెస్ట్… కృష్ణా…” అని ఫోన్ పెట్టేసి సోఫాలో కూలబడ్డాను. మా ఆవిడ స్టడీరూంలో మా సంభాషణంతా విని వచ్చి నా ప్రక్కనే కూచుంది.

”స్కౌండ్రల్స్… బాస్టర్డ్స్… హరాంజాదేఁ… ఇంకా ఎన్నో ఊరితిట్లతో కలిపి బాగానే తిట్టాను. ఢిల్లీ వచ్చి ముప్పైసంవత్సరాలైనా మా ఊరి తిట్లని మరువకుండా అవసరాన్ని బట్టి ప్రయోగించినపుడల్లా మా ఆవిడ ముసిగా నవ్వుతుంది. ఇపుడూ అదేపని చేస్తోంది.

”స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా? ప్రాధేయ పడుతూ అడిగాను. భోజనం వేళ అయ్యింది కదా! కృష్ణతో మాట్లాడాక బుర్రవేడెక్కింది…” బ్లడీ రాస్కల్స్్.. పచ్చి మోసగాళ్ళు…” పళ్ళుపటపట కొరుకుతూనే ఉన్నాను…

మా ఆవిడ కాఫీతో వచ్చింది. ”అందరూ నీలా-నాలా ఉంటారా?” అని నన్ను చల్లబరచేప్రయత్నం చేసింది. ఆవిడ అలా అనడానికి కారణం-మాపెళ్ళి మామూలు పెళ్ళి. ఇచ్చుడు-పుచ్చుడు లేనేలేవు. మా నాన్నగారిని ఒక్క రూపాయిని కూడ ఖర్చు చేయనివ్వలేదు. అది నా కండిషన్! పెళ్ళి పత్రికలు ప్రింట్చేయలేదు. నాలుగు వేల రూపాయలతో పెళ్ళిచేసుకున్నాను-ఇరవై సంవత్సరాల క్రితం… పెళ్ళికి వెళ్ళేటపుడు, పెళ్ళయ్యాక మేమిద్దరం ఢిల్లీకి వచ్చేందుకు రైలు చార్జీలుకూడ ఈనాలుగువేల్లోనే!!

”ఇక జ్యోతితో మాట్లాడతాను” కాఫీ ముగించి నంబర్ నొక్కాను. ”………అమ్మా జ్యోతి….. కొత్త ఉద్యోగంకదా!… వీలు చూసుకొని – లాస్ ఆఫ్ పే అయినాసరే- ఓపది రోజులకి మాదగ్గరకిరా…” ఎన్నో వివరించి మాకు గత పదిహేను సంవత్స రాలుగా తెలిసిన ఒక పంజాబీ కుటుంబం గురించి చెప్పాం. ముఖ్యంగా అబ్బాయి గురించి చెప్పాం మధ్యలో ఫోను లాక్కొని మా ఆవిడ తన అభిప్రాయాల్నీ తెలిపింది. ఎంతో ఉత్సాహంతో జ్యోతితో మాట్లాడింది.

* * *

వారం రోజుల్లో జ్యోతి వాళ్ళ అమ్మతో మా దగ్గరికి చేరింది. పంజాబీకుటుంబానికి జ్యోతి బాగా నచ్చింది. వాళ్ళ అబ్బాయి రణ్ధీర్-జ్యోతికి చూపులు కలిసాయి. మనసులు కలిసాయి. ఉన్న పదిహేను రోజుల్లో ఒకరినొకరు బాగా అర్థంచేసు కొన్నారు.

ఆవకాయ అన్నం-రోటీసబ్జీ ఒక్క పళ్ళెంలో బాగా కలిసిపోయాయి. పెళ్ళిబాగా జరిగింది…

జ్యోతి మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి కోడలిగా రావడంతో మా ఆవిడ తనలో కూతురిని చూసుకొంటోంది.

పిట్స్బర్గ్లో ఉంటున్న మంజులత తనతల్లి మొత్తం బంగారంతో పాటు మరి కొన్ని తులాలు కలిపి చేయించుకున్న నగల్ని అమెరికా వెళ్ళినప్పటి నుండి ఒక్కసారైనా వాడలేదు. తల్లి మెడలో సూత్రాలు లేవని, చేతిగాజులు రోల్డు గోల్డువని మంజులతకి బాగా తెలుసు.

న్యూజెర్సీలో మకాంపెట్టిన సరళ తన భర్తకిచ్చిన ఒప్పందంప్రకారంగా తన తండ్రి పంపిన డబ్బుతో పైచదువు పూర్తిచేసి మాంచి ఉద్యోగం సంపాదించింది. మొగుడికి మహానందంగా ఉంది. తననుండి ఒక్కడాలర్ కూడ ఖర్చుకాకుండా భార్య అమెరికాలో ‘మాస్టర్స్’ చేయడమంటే గొప్ప అచీవ్మెంట్ కాదా!!

కట్నంకింద తాము ఉంటున్న అపార్ట్మెంట్ని ఖాళీచేసింది హైదరాబాద్లో ఉంటున్న ఓ కుటుంబం. నెలకి ముప్పైవేల చొప్పున సంపాదిస్తున్న ఆ అల్లుడు-కూతురు ఎంచక్కా అపార్ట్మెంట్లో ఆనందసముద్రంలో మునిగితేలుతున్నారు. పెళ్ళితో ‘అంతస్తు’ పెరిగిపోయిన కూతురు-అల్లుడు బాల్కనీలో నిల్చోని బయటిలోకాన్ని చూస్తున్నపుడల్లా దగ్గర్లోనే ఓ కిరాయింట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న తల్లితండ్రులు వాళ్ళని చూసి ఆనందపడుతుంటారు..

ఇదొక రకం దోపిడి…
మెత్తని దోపిడి…
తీపి దోపిడి…

మాకు దగ్గరి మిత్రుడి కూతురు సంబంధం. అంతామాట్లాడుకొన్నాక, పెళ్ళి ఫలానా నెల్లో అని కూడా అనుకున్నాక- మరెవరో ఒప్పుకొన్న అమౌంటుకంటే ఎక్కువిస్తామని వచ్చారట. దాంతో అబ్బాయి తల్లితండ్రులు ఆ సంబంధంవైపు మొగ్గుచూపి ఏవేవో సాకుల్ని అసరాగా తీసుకొని క్యాన్సల్ చేసారట. ఊహించని ఈ ట్విస్టుతో అమ్మాయి కుటుంబం డిప్రెషన్లోకి పోయింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.