డా|| వీణాశతృఘ్న, నిర్మల సౌందరరాజన్, పి. సుందరయ్య, లీలారామన్
అనువాదం : సరయు కల్యాణి
వెన్ను నొప్పి అన్నది స్త్రీలలో వచ్చే ఏ ఆరోగ్య సమస్యతోనైన వెన్నంటి వచ్చిపడే సమస్య. సాధారణంగా ముప్ఫై ఏళ్ళ వయసులో కనిపిస్తుంది. ఎక్కువ సమయం పనిచేసే వాళ్ళకు, అంటే బీడీ కార్మికులు, యిళ్ళలో పనిమనుషులు, రాళ్ళు కొట్టేవాళ్ళు, కూరలమ్మేవాళ్ళు, వ్యవసాయకూలీలు, టీచర్లు, నర్సులు, ఆఖరికి గృహిణులు కూడా ఈ బాధ నుండి తప్పించుకోలేరు. ఈ విషయమై స్త్రీలు వైద్యనిపుణులతో సంప్రదించినా, అది కూడా ఒక నిరాశాపూరితమైన అనుభవం అవుతుంది తప్పించి ఉపయోగం లేదు.
ఆడవారు ఎప్పుడూ వెన్నునొప్పి సమస్యను వెలిబుచ్చడం, డాక్టర్లు మాత్రం దాన్ని పట్టించుకోకుండా, ఇంకేదో కారణమై వుండవచ్చునని వాటికై మందులు యివ్వడం, ప్రాముఖ్యత ఇవ్వవసరంలేని సమస్యగా జమకట్టి వదిలేయటం జరుగుతుంది. ఒకటి రెండు సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత అసలు యీ సమస్య గురించి చెప్తున్నా డాక్టర్ల మనసుకు పట్టనే పట్టదు. ఒకవేళ ఎవరైనా తరచి తరచి ‘వెన్ను నొప్పి’ అన్న విషయం చెప్పినా, దానికే చికిత్స కావాలని పట్టుపట్టి అడిగితే ఏవో తాత్కాలికంగా నొప్పి తగ్గించే మందులిచ్చి పంపేస్తారు. వాటి ప్రభావం ఐదారు గంటలకు మించి ఉండదు. కొద్దిగా సానుభూతి పరులైన డాక్టర్లు మాత్రం గైనికలాజికల్ కారణాలు గానీ, ఎముకలకు సంబంధించిన కారణాలు గానీ ఏమైనావున్నాయా అని ముందుగా తేల్చుకోవటం మంచిదని భావిస్తారు. ఎక్కువ మంది డాక్టర్లు మాత్రం వెన్నునొప్పికి ఆడవాళ్ళు తమ పనివేళలో సరైన భంగిమలో కూర్చోకపోవడమే కారణమని భావించి, వీళ్ళనే అశ్రద్ధ చేస్తారని కోప్పడతారు. అంతేగానీ, సరైన భంగిమ ఏదన్నది మాత్రం చెప్పరు. ఎందుకంటే డాక్టర్లకు ‘వెన్నునొప్పి’ తమలోని అవగాహనా లోపాన్ని సూచించే ఇబ్బందికరమైన విషయం. స్త్రీల వ్యాధులు వైద్య రంగానికిగానీ, వైద్యులకు గానీ ఆసక్తికరమైన విషయాలు కావు, ఐతే స్త్రీలకు సంబంధించిన జబ్బులు వైద్య విజ్ఞానం నిర్దేశించిన కోవలోకి రానట్లయితే, ఆ రుగ్మతనే అర్థరాహిత్యం (ఖిలిజిలివీరిశిరిళీరిరీలి) చేస్తాయి గానీ విజ్ఞానాన్ని మాత్రం కాదు.
అసలు వెన్నునొప్పి అంటే ఏమిటి?
చిన్న చిన్న ఎముకలతో కూడినదే వెన్నుపూస. వెన్నుపూసకు లంబంగా చిన్న ఎముకలను ఒకదానిపై ఒకటిగా కండరాలు, పీచులాంటి లిగమెంట్లతో బలంగా పట్టి వుంచేది వెన్నెముక. ఆ ఎముకలకు పరస్పర ఆలంబన కల్పిస్తూ కండరాలు వాటిని ఆ స్థానంలో పట్టి వుంచుతాయి. కండరాల ఆసరాలేనట్లయితే ఎముకలన్నీ ఒక దాని చుట్టూ మరొకటి మెలిబడి, ఇటుకల కుప్పలాగా కూలిపోవచ్చు. దాని సమగ్రత కూడా వెన్నెముక ఆ స్థానంలో పట్టుతో ఉండటానికి మరొక కారణం. పేరుకు మాత్రం కండరాలు బలంగా, పటిష్టంగా వున్నాయన్నా కూడా, ఒక సన్నని కోమలమైన ఎముకను పట్టి వుంచటమన్నది కండరాల వలన సాధ్యపడదు. ఎముకలో చీలిక రావచ్చు. వెన్నుపూసలోని ఎముకలకు వాటిని సమగ్రపరిచే కండరాలకూ మధ్య సమన్వయానికి తేడా కలిగినట్లయితే, వీపు నిర్మాణ స్వరూపానికి మార్పు సంభవించి, నొప్పికి దారి తీస్తుంది. వెన్నెముకలో వుండే నరాలు, పట్టు లోపించిన ఎముకల మధ్య చిక్కుకోవడం ఫలితంగా భరించశక్యం కాని నొప్పిగా పరిణమిస్తుంది. ఈ నరాలన్నీ వెన్నెముక మూలంగా మొదలై చాలా దూరం సాగి చేతులు, కాళ్ళు యితర శరీర భాగాల కండరాల వరకూ చేరతాయి. అందువల్ల వెన్నెముక వద్ద నరాలపైన ఒత్తిడి కలగటమన్నది వెనుక నుండి కండరాల గుంపుకు అన్ని వైపుల నుండి విస్తరింపచేసే (జీబిఖిరిబిశిరిదీవీ చీబిరిదీ) నొప్పిగా మారుతుంది. ఈ నొప్పి ప్రభావం వల్ల కండరాలు బిరుసుగా/పెళుసుగా (రీళీబిజిజి తీబిరిశి) లొంగకుండా తయారై, వెన్ను నిర్మాణాన్ని మరింత దెబ్బతీస్తాయి.
వెన్నుపూసలోని ఎముకల ఆకృతిని నిర్దేశించే కారణాలు
వెన్నులోని ఎముకలను పట్టి వుంచే కండరాల బిగువు
వెన్నుపూసలోని ఎముకల సమగ్రత
వెన్నులోని ఎముకలకు వచ్చే వ్యాధులు (ప్రొలాప్స్ డిస్క్, కాన్సర్ మరే యితర ఇన్ఫెక్షన్లు లాంటివి ఈ అధ్యయనంలోని అంశాలు కావు).
వెన్ను నిర్మాణానికి దోహదకారులైన అన్ని రకాల కండరాలకూ తగిన వ్యాయామాలతో కండరాల గట్టిదనాన్ని సాధించవచ్చు. అంటే అన్ని వైపులకూ కదలికలు, ప్రత్యేకించి ఎదురు శక్తి చూపటం లాంటివి చేయటం వలన కండరాలకు స్ఫూర్తి నివ్వటానికి చాలా సహాయపడతాయి. యువతుల్ని ఒకే భంగిమలో కూర్చుని పని చెయ్యాలని నిర్దేశించడం వలన ఎన్నో రోజులు ఉపయోగంలోకి రాని కండరాలు పట్టులేక జారిపోతాయి. ఉదా|| అగర్‌బత్తులు, బీడీల తయారీ, వంటపని, బట్టలు ఉతకడం లాంటి పనులన్నిటిలో రోజుకు దాదాపు 10-14 గంటల కాలం ఒకే భంగిమలో కూర్చుని, శరీరాన్ని ముందుకు ఒంచటం జరుగుతుంది. పక్కకు, వెనక్కి కూడా తిరగవలసిన కండరాలు నెమ్మదిగా ఉపయోగం పోయి చిన్న ఎముకల క్షీణతకు దారితీస్తుంది. అంతేకాక వ్యాయామమన్నది ఆ ఎముకలకు రక్తప్రసరణను, పోషకతను పెంచి, తద్వారా సాగదీయగలిగే శక్తిని వృద్ధి చేసేందుకు ఎంతో అవసరం. ఏ శరీరభాగమైనా ఎక్కువ కాలం కదల్చకుండా వుంటే, (ఫ్రాక్చర్ అయినపుడు) ఆ భాగంలోని ఎముకలు సన్నబడి పోతాయన్న విషయం తెలిసినదే. ఎముకను అంటిపెట్టుకుని వుండే కండరాల కదలికలు దాన్ని ‘జీవం’తో ‘బలం’గా వుంచేందుకు సహకరిస్తాయి.
వ్యాయామమొక్కటే కాక ఎముకల సమగ్రతకు తోడ్పడే యితర కారణాలు
1. ఎముకల సమగ్రతకు తోడ్పడే అతి ముఖ్యమైన ఖనిజం కాల్షియం. శరీరానికి కావల్సిన కాల్షియం సరఫరా ఆహారం నుంచే రావాలి. ఏ మాత్రం కాల్షియం తీసుకోవటం తగ్గినా, కాల్షియంను నిలువ చేసేందుకు తోడ్పడే ముఖ్యమైన భాగం ఎముకలే కాబట్టి వాటి నుంచి శరీరానికి సరఫరా అయ్యే కాల్షియం మోతాదుకు లోపం వాటిల్లుతుంది. ఎన్నో యితర ప్రయోజనాలు నెరవేర్చే మిగిలిన శరీర భాగాలన్నిటికీ కూడా చిన్న మోతాదులో కాల్షియం అవసరం. ఎముకలలోని కాల్షియం ద్వారా ఈ అవసరాలన్నీ తీరటం జరుగుతుంది. ఐతే ఒకసారి ఈ నిలువ తగ్గిపోతే, ఎముక సన్నబడి పెళుసుగా అవుతుంది. యిదే ఆస్టియో పోరోసిస్‌కు నాంది. దీర్ఘకాలం ఆహారంలో కాల్షియం లోపించినట్లయితే ఎముకలు చిక్కిపోయి సన్నమై తగిన కారణమేమీ లేకుండానే పుటుక్కున విరిగిపోవచ్చు. కాల్షియం లభించటమన్నది ఆహారంలో కాల్షియం వల్లనే సాధ్యమౌతుంది. సాధారణంగా శరీరానికి ఒక రోజుకి అర గ్రాము నుంచి గ్రాము వరకు కాల్షియం అవసరం. కాగా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు అదనంగా మరో అరగ్రాము తీసుకోవాల్సిన అవసరం వుంటుంది. స్త్రీలకు ఆహారం ద్వారా లభించే కాల్షియం 200-300 గ్రా|| మాత్రమే. నిజానికి మన దేశంలో ప్రతి స్త్రీ రోజుకి తీసుకునే కాల్షియం మోతాదు భౌతిక అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. అంటే రోజువారి అవసరాలకే ఎముకలలోని కాల్షియం కరిగిపోవటం ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాల్షియం లభించే పాలు, పెరుగు, మీగడ, పప్పు లాంటి ఆహార పదార్థాల ధర ఎక్కువ. పచ్చని ఆకు కూరలు కూడా కాల్షియం లభ్యమయ్యే ముఖ్యమైన ఆహారం. ఆకుకూరలు రోజూ చాలా ఎక్కువ మోతాదులో తినవలసిన అవసరం వుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే మసాలా దినుసులైనటువంటి జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కరివేపాకు, మిరియాలు, అల్లం, ఎండుకొబ్బరి మొదలైన వాటిల్లో కూడా కాల్షియం ఎక్కువ వుంది. అంటే సుగంధానికై వాడే ఈ పదార్థాలలో ముఖ్యమైన ఉపయోగాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
ఎక్కువమంది స్త్రీలు తినే ఆహారపదార్థాలు కాల్షియం తక్కువ మోతాదులో వుండేవే. పెద్దగా మార్పు లేకుండా ధాన్య పదార్థాలపైనే ఆధారపడి, కొంచెంగా కూర కలుపుకుని లేకపోతే ఏ మిరపకాయతోనో తినటం జరుగుతుంది. కాల్షియం లభ్యమయ్యే ఒకే ఒక్క మార్గం కిళ్ళీ నమలడం. కిళ్ళీలోని తమలపాకులు, సున్నం వల్ల లభ్యమయ్యే కొద్ది కాల్షియం వారికి బొత్తిగా సరిపోదు, అందువల్లనే వీరి యిళ్ళల్లో పెరిగే పిల్లలకు కూడా తగినంత కాల్షియం లేక, మొదట్నుంచీ పిల్లల ఎముకలు శక్తీహీనమై వుంటాయన్నది ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. ఇది పెరిగే పిల్లలు పొడవులో సూచించే అవకాశం వుంది. ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో, వంశపారంపర్యంగా వారికి పొడవు ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆడపిల్లలు తల్లికంటే పొడవు పెరగటం లేదన్న విషయం గమనింపుకు వచ్చింది. అదేగాక మళ్ళీ మళ్ళీ వచ్చే గర్భాలు, ఎప్పుడూ పిల్లలకు పాలిస్తూ వుండటం, గంటలు గంటలుగా కొనసాగుతూ వుండే ఇంటిపని యివన్నీ పరిస్థితిని విషమింపచేస్తాయి. ఫలితంగా మరింత బలహీనమయ్యే ఎముకలు, జారిపోయే వెన్ను కండరాలు. అందుకే వెన్నునొప్పి చిన్న వయస్సులోనే ప్రారంభం అయిందంటే ఆశ్చర్యంలేదు.
దక్షిణ భారతదేశంలో పేదప్రజల ఆహారమైన ‘రాగులు’ కాల్షియం లభించేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆహార పదార్థం. యిది కూడా కొత్త వ్యవసాయ పద్ధతుల కారణంగా మటు మాయమౌతోంది. మన వ్యవసాయ విధానాలు ప్రత్తి, యూకలిప్టస్, పొగాకు లాంటి ‘వ్యాపార పంటల్ని’ ప్రోత్సహిస్తున్నాయి. యిక్కడ్నించి వచ్చిన ఆదాయం బియ్యం, గోధుమలువంటి ‘పై హోదా’ ధాన్యం కొనుగోలుకు పోతుంది. నిజానికి రాగి ఉత్పత్తి కూడా గత పదిసంవత్సరాలలో తగ్గిపోతోంది. ఆహారం ద్వారా లభ్యమయ్యే కాల్షియంను, ప్రేవుల నుండి ఎముకలు, యితర శరీర భాగాలు లీనం చేసుకోవటానికి, ఎముకలకు అందుబాటులో వుంచటానిక విటమిన్ ‘డి’ చాలా ముఖ్యం. ఆహారంలో తగినంత కాల్షియం ఉన్నప్పుడే విటమిన్ ‘డి’ తన పని చేయగలుగుతుంది. పారాథైరాయిడ్ హార్మోన్ కూడా కాల్షియంను నిలువ చేసేందుకు తోడ్పడే మరొక కారకం. ఆహారం నుంచి లభించే కాల్షియం మోతాదు తగ్గినట్లయితే, ఎముకల్లోని కాల్షియం నిల్వను ఈ హార్మోన్ పూర్తిగా హరించి వేస్తుంది. విటమిన్ ‘డి’ చేసే పనిని నియంత్రించే ముఖ్యమైన హార్మోన్ ఈస్ట్రోజన్. కాని నిజానికి, మన డాక్టర్లు, ఈ ఈస్ట్రోజన్‌కు కావల్సిదానికంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఆపాదించి, బహిష్టు ఆగిపోయే క్రమంలో (మెనోపాజ్ సమయంలో) ఇది యివ్వడం జరుగుతోంది. భారతదేశంలో ఈ విషయానికొస్తే, జాగ్రత్త చాలా అవసరం, ఎందుకంటే విటమిన్ ‘డి’ తన పని సక్రమంగా నిర్వర్తించాలంటే, ఆహారంలో తగినంత కాల్షియం వున్నప్పుడే సాధ్యపడుతుంది. అప్పుడే ఈస్ట్రోజన్ల ఉపయోగం కూడా వుంటుంది. లేకపోతే విటమిన్ ‘డి’ సమృద్ధిగా వుండి, ఈ హార్మోన్ల లోపం అంటే (ఉదాహరణకు మెనోపాజ్ సమయంలో జరిగేటట్లుగా) అదంత కీలకమైన విషయం కాదు. అయినప్పటికీ ఆస్టియోపోరోసిస్‌కి సంబంధించినంత వరకూ మనదేశంలో ఈస్ట్రోజన్ల పాత్రను గురించిన సమాచారం లేదు.
ముఖ్యంగా ఉన్నత కుటుంబాలలోని వారికంటే పేద స్త్రీలలో ఆహారం ద్వారా లభించవలసిన కాల్షియం అతి తక్కువ మోతాదులో లభ్యం కావటం వలన పిన్న వయసులోనే వారి ఎముకలు సన్నబడటం గమనార్హం. ఇంకా ప్రాముఖ్యత సంతరించుకునే కారణాలు చిన్న వయసులోనే వచ్చే మెనోపాజ్, కృత్రిమ మెనోపాజ్ (ఏ కారణం చేతనైనా ఆపరేషన్ చేసి గర్భ సంచి తీసినప్పుడు) ప్రత్యేకించి బడుగు వర్గాల్లో కొన్ని యితర కారణాల వలన) ఎముకలు సన్నబడతాయి. కొన్ని యితర రుగ్మతలకై కార్టికోస్టెరాయిడ్ వాడకం ఎక్కువైన ఫలితంగా కాల్షియం పూర్తిగా హరించి పోయి ఎముకలు అరిగిపోయే ప్రమాదం వుంది.
2. రక్తహీనత, మాంసకృత్తులు-శక్తి ఉత్పాదక పదార్థాల లోపం కూడా కాల్షియం కొరత పరిస్థితిని క్లిష్టపరచటం వలన ఎముకల సమగ్రతకు మరింత ప్రమాదం వాటిల్లుతుంది. పేద స్త్రీలలో ఎక్కువగా మాంసకృత్తులు, కాల్షియం రెండూ లోపించి రక్తహీనత కలిగిన వారిలో వారి ఎముకలపై పలువిధాలైన ఒత్తిడి వుంటుంది. ముఖ్యంగా ఎముకలకు గట్టి ఆధారానికై ప్రొటీన్లు, కేలరీలు ఎంతైనా అవసరం. కాల్షియం నిలువ మాంసకృత్తుల స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
3. సన్నగా పీలగా వుండే ఆడవారి శరీరంలో కొవ్వు పదార్థం లోపించి ఎముకలు అరిగి సన్నబడే అవకాశం ఎక్కువ. కొవ్వు పదార్థాలు మెనోపాజ్‌లో ఈస్ట్రోజన్లను చిన్న పరిమాణంలో నిలువ చేయటానికి తోడ్పడతాయి.
4. అసలు చలనం లేకపోవడం వలన గానీ లేక మరే కారణం చేతనైనా మంచం పైన చాలా కాలం వున్నట్లయితే ఎముకలు సన్నవై సాగిపోతాయి. ముసలివారు ఏదో ఒక కారణం చేత మంచం పట్టినపుడు ఇలా జరగవచ్చు. వయస్సు పైబడుతున్న కొద్దీ ఆహారంలోని కాల్షియంను శరీరంలోకి లీనం చేసుకునే శక్తి తగ్గి కాల్షియం తరలింపు పెరుగుతుంది. ఈ వ్యతిరేక ప్రవాహాన్ని తట్టుకోవటానికి సన్నబడిన ఎముకలలో చాలా కొద్ది కాల్షియం మాత్రమే మిగిలి వుంటుంది. సన్నబడిన ఎముకలలోంచి మిగిలి వున్న కాల్షియం కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషుల కంటే స్త్రీలు ఎముకలలో కాల్షియం లోపానికి ఎక్కువ గురి అవుతారన్న భావం వుంది.
ఈ కాల్షియం క్షీణగాథ, ఆ బాధ నాటకీయం కాదు గానీ మనం గమనించకుండానే యిది జీవితమంతా సాగి, 40 సంవత్సరాలు దాటగానే, ఆ ఎముక పుటుక్కున విరిగిపోతుంది. సాధారణంగా ఈ వయస్సులో సంభవించే ఫ్రాక్చర్లు అన్నిటికీ, గతంలో జరిగిన ఎన్నో సంఘటనల ప్రభావం అంతాకలిసి చివరికి ‘ఆస్టియో పోరోసిస్’ అన్న వ్యాధిగా పరిణమించి, స్త్రీలను యిక జీవితాంతం నిర్వీర్యుల్ని చేసి, కుటుంబ సభ్యులపై నిరంతరం ఆధారపడేటట్లుగా, అతి ఖర్చుతో కూడిన ఆరోగ్య సహాయాన్ని పొందుతూ కాలం గడిపేలా చేస్తుంది.
కాల్షియం లోప నిర్ధారణ
మామూలుగా ‘నమ్మదగిన వారు కాదని, ఆవేశపరులని, పని తప్పించుకోవటానికి జబ్బు వున్నట్లుగా నటించే వారని’ ముద్ర వేయుంచుకున్న స్త్రీలలో కాల్షియం లోపం గురించి, వెన్ను నొప్పిని గురించి నిష్పక్షపాతమైన అధ్యయనమన్నది చెయ్యటం కష్టం. అంతేకాక శరీరంలో కాల్షియం నిలువతెలుసుకోవటం లాబ్‌పరీక్షల వల్ల సాధ్యపడదు. ఈ ముఖ్యమైన ప్రయోజనాల నిర్వర్తింపుకు ఎముకలలో కాల్షియం యిటు తరలింపు జరగటం వలన రక్తంలోని కాల్షియం స్థాయి మామూలుగానే వుంటుంది. అందువలన ప్రయోగశాలలో చేసే పరీక్షల వలన కాల్షియం కొరతను అంచనా వేయటమనేది కష్టమౌతుంది. కాబట్టి అసలు ఈ కాల్షియం స్థాయి కోసం చేసే రక్త పరీక్ష ‘ఆస్టియో పోరోసిస్’ వుందో లేదో నిర్ధారించుకోవటానికి చేయతగిన పరీక్ష కాదు. ఎముకల సాంద్రత (బోన్ డెన్సిటీ) ను అంచనా వేయటానికి చాలా ఖరీదైన పరికరాలు, రేడియేషన్ పంపించేందుకు ఉత్పత్తి సాధనం కావాలి. రేడియో ధార్మిక యాక్టివ్ కిరణాలు ఎముకల నుండి చొచ్చుకొని పోవడమన్నది ఎముకల మందంపై ఆధారపడి ఉంటుంది. యిదే ఎముకల సాంద్రతను కూడా సూచిస్తుంది. దీన్ని గురించి ఇంకా సూక్ష్మంగా అధ్యయనం చేయాలంటే బోన్ బయోప్సీతో చేయవలసిన పని. ఇవన్నీ శస్త్రచికిత్సతో జరిగేవే కాని సాధారణంగా వున్నవారిపై చేయవలసిన పరీక్షలు కావు.
అందుకని స్త్రీలకు వివిధ రకాలైన ఆస్టియో పోరోసిస్ వచ్చే విధానాలను పరిశీలించి, పరిశోధించటానికి మేము ఒక హాస్పిటల్ వార్డ్‌ని ఎంచుకోవటం జరిగింది. ఆస్టియో పోరోటిక్ ఫ్రాక్చర్ల ప్రత్యేక గుణాన్ని బట్టి, ఈ అధ్యయనం కోసమై ఆ కేసులను గుర్తించడం సులభమైంది. ‘ఆస్టియో పోరోటిక్ ఫ్రాక్చర్’ అనేది కింద పడితే తగిలే దెబ్బల వలన, స్వల్పమయిన గాయం వల్ల, ఒక్కోసారి అసలు పెద్దగా కారణం ఏమీ లేకుండా కూడా వయసు పైబడిన వారిలో సంభవించే అవకాశం వుంది. నిజానికి కొందరు స్త్రీలు అనుకోవటమేమిటంటే నడుస్తూ నడుస్తూ వుండగానే, వున్నట్లుండి వారి ప్రమేయం ఏమీ లేకుండానే క్రింద పడిపోయారని. ఎముకలు అరిగిపోయి పుటుక్కున విరిగిపోయినందువలన హఠాత్తుగా పడిపోవడం జరుగుతుంది కానీ పడటం వలన ఫ్రాక్చర్ అవటం కాదు.
ఈ కింద పేర్కొన్న ఫ్రాక్చర్లు ఆస్టియో పోరోటిక్ ఫ్రాక్చర్ల జాబితాలోకి వస్తాయి.
1. తొడ ఎముకలు విరగటం. యాక్సిడెంట్ కావటం, శారీరక హింస ద్వారా జరిగే ప్రమాదాలు
2. పెల్విస్ (పొత్తి కడుపు చుట్టూ వుండే అస్థిపంజరం, పిరుదులు) విరగటం
3. వెన్నెముకలు విరగటం
4. మోచేయి పై భాగం విరగటం (ఫ్రాక్చర్ హ్యుమెరస్)
5. మణికట్టు చేయి విరగటం
ఈ అధ్యయనం రెండు భాగాలుగా నిర్వహించటం జరిగింది. 1. గతంలో జరిగిన వాటిని గురించి పునఃపరిశీలన, 2. హైద్రాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ వార్డ్‌లో ఈ పరిశోధనా కాలంలో చికిత్స పొందిన స్త్రీలు.
1987 జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఈ పది నెలలలో ఆసుపత్రిలో చేరిన స్త్రీలలో వివిధతరహాల ఫ్రాక్చర్లు ఎలా సంభవించాయన్నది ఈ అధ్యయనం ఉద్దేశ్యం. ఈ కాలంలో ఆసుపత్రిలో చేరిన 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్కులైన స్త్రీల కేసుల తాలూకు కాగితాలు ఆసుపత్రి గణాంక విభాగం నుంచి తీసుకుని పరిశీలన చేశాము. వాటిలో సమాచారం యీ కిందివిధంగా వుంది 1. పేరు, 2. వయస్సు, 3. వృత్తి, 4. ఆదాయం, 5. నివాస స్థలం, 6. రోగ లక్షణాలు, 7. ఫ్రాక్చర్‌ని అంటిపెట్టుకుని వున్న సమస్యలు (ఉదా|| రక్తపోటు, మధుమేహం, రక్తహీనతలాంటివి) 8. సాంప్రదాయ పద్ధతులతో విరిగిన ఎముకలను అతికించే వైద్యుల వద్దకు వెళ్ళారా లేదా అన్న సమాచారాన్ని గ్రహించటం.
ఈ పది నెలల కాలంలో హాస్పిటల్‌లో చేరిన 297 మంది స్త్రీలలో 289 కేసుల రికార్డులు సంపాదించగలిగాం. 8 రికార్డులు మాత్రం దొరకలేదు. పోలిక చూపటానికి అదే సమయంలో ఒక పది శాతం పక్క వార్డులోని పురుషుల నమూనాను ఉపయోగించుకుని ఈ పరిశోధన నిర్వహించాం. పది నెలలలో మొత్తం పురుషుల ప్రవేశ సంఖ్య 1112 కాగా కేవలం 107 రికార్డులు మాత్రమే దొరికాయి.
అప్పుడు వార్డ్‌లో చేరిన స్త్రీలను గురించి మరింత విశిష్టమైన అధ్యయనం చేయడానికి ఆ సమయంలో (సెప్టెంబర్-అక్టోబర్ 1987) ఆర్థోపెడిక్ వార్డ్‌లో చేరిన 37 మంది స్త్రీలను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒకటి రెండు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. స్త్రీలు తామే యీ ప్రసంగాలలో పాలు పంచుకోవటానికి విముఖత చూపారు. మేము వారి అనుభవాలను క్రోడీకరించే ప్రయత్నంలో రోగితో పాటు వచ్చిన స్త్రీల దగ్గర నుండి కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం చేసాం. ఆస్పత్రిలో పరిస్థితులు ఎలాంటివంటే, రోగితో వచ్చిన దగ్గర బంధువులు కూడా రోగితో సమానంగా భరించాల్సి నటువంటి పరిస్థితులు. కొన్నిసార్లు రోగి అవసరాలను తీర్చి ఆమెకు సంరక్షణ యివ్వడంలో వారు కూడా తిండికిగానీ, స్నానానికీ గానీ ఎన్నో బాధలు తట్టుకోవలసి వచ్చేది. ఈ అధ్యయన కాలంలో మాకు పూర్తిగా అర్థమైంది ఏమిటంటే – రోగి వెంట వచ్చి వారికి పరిచర్యలు చేసే వారి సమస్యలను ఆరోగ్య సంరక్షణ విభాగం వారు గుర్తించనే గుర్తించరని. నిజానికి నర్సుల అవసరం వున్న చోట కూడా వాళ్ళు అసలు లేకపోవటం, ఒకవేళ ఉన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉండటం జరుగుతుంది.
గణాంక విషయ విశేషాలే (ఖిలిళీళివీజీబిచీనీరిబీ ఖిలిశిబిరిజిరీ) కాక రోగులతో ఈ కింది విషయసేకరణకు అనుగుణంగా చర్చించటం జరిగింది. 1. ఈ ఫ్రాక్చర్‌కు జరిగే చికిత్సలో ఆమెకు సహాయపడుతున్న వ్యక్తిని గురించి, 2. సాధారణంగా గర్భవతిగా వున్నప్పుడు చేసే పనుల గురించి, ప్రసవ స్థలం, ఏ భంగిమలో బిడ్డకు పాలిచ్చేది, 3. ఆహారపు అలవాట్లు (ఆహారంలో కాల్షియం ఎంత లభ్యమౌతుందో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో, 4. హాస్పిటల్ వారు యిచ్చే ఆహారం వలన వచ్చే సమస్యలు, 5. ఆసుపత్రిలో ఎదుయ్యే యితర సమస్యలు. వార్డ్‌లోని కేసు రికార్డులను పరిశీలిస్తే రోగ లక్షణాలు, శస్త్ర చికిత్సలు (ఆపరేషన్లు) యితర చిక్కు సమస్యలు మొదలైన ప్రాథమిక సమాచారం లభ్యమైంది.
పరిశీలించిన 289 కేసు రికార్డులలో, 209 రికార్డులు 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలవైతే, మిగిలిన 80, 18-39 సంవత్సరాల మధ్యనున్న స్త్రీల రికార్డులు. పెద్ద వయసు స్త్రీలలో ఎక్కువగా ఈ ఫ్రాక్చర్లు చిన్న చిన్న గాయాల వలనగానీ లేక మామూలుగా నడుస్తుండగానో హఠాత్తుగానో జరుగుతాయి. వీరిలో 40 పై బడిన 145 మంది స్త్రీలు మెడ దగ్గర ఫ్రాక్చర్ వలన హాస్పిటల్‌లో చేరారు. ఇది ఆస్టియో పోరోటిక్ ఫ్రాక్చర్ అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీరిలో దాదాపు 70 శాతం స్త్రీలు 40 ఏళ్ళు పైబడిన వారైతే 14 శాతం యితర రకాల ఫ్రాక్చర్లకు, యిక మిగిలిన వారు (15.9 శాతం) బాహ్య గాయాలవలన ఫ్రాక్చర్లు (ప్రమాదాలవలన గానీ, హింసల వలన గానీ) అయిన వారు. ఆసుపత్రిలో చేరిన మొత్తం స్త్రీలలో చిన్న వయస్సులో వున్నవాళ్ళు (అంటే 40 సంవత్సరాల లోపు వారు) 27.7% ఉన్నారు. అందరూ వారి వారి వృత్తి పనులు చేస్తూ వుండగా ఫ్రాక్చర్లు జరిగి హాస్పిటల్‌లో చేరినవారు. వృత్తులంటే – వ్యవసాయం, కట్టడాల పని మొదలైనవి. స్త్రీల వృత్తులను గురించిన రికార్డులు లేనందున, వృత్తి సంబంధమైన ప్రమాదాలను గురించి అంచనా వేయడం కష్టం. కాని వారి కేసు హిస్టరీని బట్టి మాత్రం ప్రమాదాలన్నీ కూడా వాళ్ళ పనుల సందర్భంగా ఐనవనే సూచిస్తాయి.
అంటే బావిలో పూడిక పని జరుగుతున్నప్పుడు పడిపోవటమో కట్టడాల ప్రదేశంలో సంభవించే ప్రమాదాలలోనో, రాళ్ళు పగులగొట్టే యంత్రం వద్దనో, చెట్టుపై నుంచి కిందపడి, ఎద్దుబండి కిందకు పడటం లాంటివి. ఎక్కువగా యిలాంటి ప్రదేశాలలో జరిగే ప్రమాదాలను మెడికోలీగల్ కేసులుగా పేర్కొన్నప్పటికీ ఆసక్తికరమైన విషయమేమిటంటే, యజమానుల వద్ద నుండి వారికి ఏ విధమైన నష్టపరిహారం లభించకపోవడం. ఈ మెడికోలీగల్ కేసులను, వాటి ఫలితాలపై నమ్మకం లేక స్త్రీలు వాటి గురించి పట్టించుకోకపోవడం. అంతకంటే ముఖ్యంగా వీలైనంత త్వరగా కోలుకుని యింటికి తిరిగి వెళ్ళానుకోవడం.
ఆస్టియో పోరోటిక్ ఫ్రాక్చర్లు సంభవించడం అన్నది నలభై ఏళ్ళ తర్వాత అన్ని వయసుల వారికీ సాధారణమైనప్పటికీ అన్నింటినీ మించి 60 ఏళ్ళ వారు మిగిలిన వాటికంటే ఈ తరహా ఫ్రాక్చర్లకే ఎక్కువగా లోనవుతారన్నది ఆశ్చర్యంతోపాటు కలవరం కూడా కలిగించే విషయం. ఒకసారి ఆస్టియో పోరోసిస్ ఫ్రాక్చర్ అయిన తర్వాత యిక ఆ స్త్రీ తరచూ ఫ్రాక్చర్లకు గురి కావటం పరిపాటి అవుతుందన్న విషయాన్ని గుర్తించాం. పురుషులలో ఎక్కువగా వాహన ప్రమాదాల వలన, వృత్తిరీత్యా జరిగే ప్రమాదాల వలన గాయాలు ఈ ఫ్రాక్చర్లకు కారణాలు. అందువలన వార్డ్‌లో చేరిన వారిలో చిన్న వాళ్ళు (40 ఏళ్ళ లోపు వారు) 57 శాతం వున్నారు.
మొత్తం 107 మంది పురుషులలో 31 మందికి ప్రమాద స్థలంలోనే ఫ్రాక్చర్లు జరగగా, ఆ ఫ్రాక్చర్లు ఆస్టియోపోరోటిక్ తరహాగా కనపడింది. వారి వయస్సులపై, ప్రమాదాల ప్రవృత్తిపై దృష్టి సారిస్తే (31 మందిలో 18 మంది) ఎక్కువ మంది పురుషులు ప్రమాద స్థలంలో తగిలిన దెబ్బ వల్ల ఫ్రాక్చర్లకు గురి అయిన వారు. 13 మంది మాత్రమే ఆస్టియోపోరోసిస్ కోవకి వచ్చేవారు. వీళ్ళలో ఎవ్వరూ కూడా చికిత్స కాలం పూర్తి కాకుండా హాస్పిటల్ వదిలివెళ్ళలేదు.
వెన్నులోని ఎముకలకు ఫ్రాక్చర్ అవటం అన్నది సర్వసాధారణ మైన విషయం. అయితే అది త్వరగా గమనించి చికిత్స చేయవల్సినంత ముఖ్యమైనదిగా తలచి ఆస్పత్రిలో చేరాలన్న ఉద్దేశ్యంతో స్త్రీలు రానేరారు. అందువలన ఆస్పత్రి వారూ దానికి తగినంత ప్రాముఖ్యత యివ్వరు. ఆస్టియో పోరోసిస్ వలన సంభవించే మార్పులతో ఆస్టియో పోరోసిస్ మొదలైందన్న విషయం ఎక్స్‌రే ఫిల్మ్ ఉపయోగించి తెల్సుకోవచ్చు. చిన్న ఎముకలు ఒకదానిపై ఒకటి ఒత్తుకుపోవటాన్ని (వెడ్జింగ్) ఎక్స్‌రేద్వారా గమనించవచ్చు. తరచూ వీపు నొప్పితో బాధపడే స్త్రీలలో, యిటువంటి చిత్రం కనపడుతుంది. ‘వెడ్జింగ్’ వలన మనిషి పొడవు, దాదాపు ఒకటి నుండి నాలుగు సెంటీమీటర్లు తగ్గవచ్చు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆసుపత్రిలో చేరిన 176 మంది స్త్రీలలో 55 మంది హాస్పిటల్‌లో వుండి, ఆస్పత్రిలో దాదాపు 15-45 రోజుల పాటు వుండి చికిత్స పూర్తి చేసుకోవాల్సిన అవసరం వున్నప్పటికీ (ఫ్రాక్చర్ తరహాలో తేడాల వలన, ఆపరేషన్ చేయవలసిన కేసులు కొన్ని, వాటిని అంటిపెట్టుకుని వున్న సమస్యలు ఇలా వివిధ కారణాల వల్ల చికిత్స 15 నుంచి 45 రోజుల వరకు అవసరం) ముందుగానే ఆస్పత్రి నుండి చెప్పకుండా వెళ్ళిపోయిన వారు. ఇదేకాక, యింకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కొంత మంది స్త్రీలకు ట్రాక్షన్, ఆపరేషన్ లాంటి చికిత్స చేయించుకోవల్సిన అవసరం వున్నప్పటికీ ఆస్పత్రి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన వారి జాబితాలోకి చేరిన వాళ్ళు వుండగా 49 (అంటే 28 శాతం) స్త్రీలు ఆస్పత్రికి రావటమో, వారికి ఫ్రాక్చర్ అయిన తర్వాత చాలా రోజులకు వచ్చిన వారు. అంటే ‘తప్పించుకుని వెళ్ళిపోయిన’ వారు, ‘ఆలస్యం’గా నమోదు చేసిన వారు (59 శాతం). పాత పద్ధతులతో ఎముకల్ని సరిచేసే వైద్యుల దగ్గరికో, లేకపోతే తప్పనిసరిగా ఆస్పత్రిలోనే వుండి చికిత్స చేసుకోవాలని పట్టుపట్టని డాక్టర్ల దగ్గరకో వెళ్ళి వుండవచ్చునని భావించటానికి అవకాశం వుంది. యిటువంటి వృత్తి నిపుణులు అందిస్తున్న సేవలను గుర్తించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. వారికే ఆధునిక ఆరోగ్య సంరక్షణా విధానాలతో తగినంత ఆసరా ఇచ్చినట్లయితే వారి చికిత్సకు ప్రాముఖ్యతను కల్పించిన వారై, స్త్రీ యీ ఫ్రాక్చర్ల నుంచి త్వరగా కోలుకోవటానికి దోహదపడవచ్చు.
రోగికి సంబంధించిన ఇతర వివరాలు వారి కేసు షీట్లలో లభ్యం కాలేదు. 30 – 50 శాతం రోగులు మాత్రం అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మధుమేహం, రక్తహీనత మొదలైన వాటికి పరీక్షించబడ్డారు. నిజానికి ఇలాంటి ఇతర వ్యాధులు వుండటం వలన ఆపరేషన్‌ని వాయిదా వేయవలసి రావచ్చు. ఎందుకంటే ఇతర క్లిష్ట సమస్యల వలన కోలుకోవటం ఆలస్యం కావచ్చు.
కొన్ని రకాల సమాచారం మెడికల్ రికార్డులలో లేకపోవటం ఆశ్చర్యకరం కానేకాదు. చికిత్స, ఆపరేషన్లు – వీటిమీదే శక్తుల్ని కేంద్రీకరించే వైద్య విధానం రోగి యొక్క సామాజిక, సాంస్కృతిక స్థితిగతుల నుంచి దూరంగా వుండిపోతాయి. చికిత్సపైన, ఆపరేషన్లపైన ఆధారపడి పని చేసే వైద్య రంగానికి రోగి సామాజిక స్థితిగతులపై సదవగాహన లేదు. రాత్రింబవళ్ళు, ఆర్థోపెడిక్ వార్డుల్లో పనిచేసే స్త్రీలు, పురుషులు (సమర్థవంతంగా) పనిచేసారనటానికి ఇదొక్కటే మార్గం. కొద్దిమందితో ఎక్కువ పనిని చేయించుకునే వైద్య వ్యవస్థ ‘జబ్బులు’, ‘సమస్యలు’ మాత్రమే గాక రోగికి సంబంధించిన ఇతర సమస్యలు అంటే ఆమె అనారోగ్యానికి దారి తీసిన సాంఘికార్థిక ప్రభావాలను, దీర్ఘకాల ఉపేక్షను అర్థం చేసుకున్నట్లయితే, స్త్రీలకు ఒక వేరే తరహా ఆసుపత్రి కొత్త రకమైన వాతావరణం అవసరం అన్న విషయం వారు తెలుసుకోగలుగుతారు. అందువల్లనే మనకి ఈ కింద పేర్కొన్న సమాచారం వారి కేసు షీటుల్లో లభ్యమవ్వలేదు. 1. వృత్తులు, ఆదాయం, 2. అబార్షన్ల సంఖ్య, మృత శిశువుల సంఖ్య, జీవించి వున్న పిల్లల సంఖ్య, 3. పిల్లలకు తల్లిపాలిచ్చిన కాల పరిమితి, 4. ఋతుక్రమం ఆగిపోయిన వయసు, 5. గతంలో వాడిన మందుల వివరాలు (ఏమైనా వాడి వుంటే), 6. ఆహారపు చరిత్ర (కాల్షియం నిలువని అంచనా వేయటానికి).
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags