ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -28

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
మరో నౌకర్ని పెట్టుకున్నాం కానీ అతని చేత నేను వంట చేయించేదాన్ని కాదు, నేనే చేసుకునేదాన్ని. ఒక పదిహేను ఇరవై రోజులయాక భోంచేస్తూ, మా ఆయన, ”నౌకరు వెళ్లిపోయినప్పట్నించీ యజమాని పాత్ర వెయ్యటం నాకు తప్పని సరైంది చక్కగా లింగూలిటుకూ మంటూ ఇద్దరం, వండుకుంటాం, తింటాం, కబుర్లు చెప్పుకుంటాం. నౌకరుమీద ఆజమాయిషీ చెయ్యలేక చచ్చాను!” అన్నారు.
”వాణ్ణి పనిలోంచి తీసేప్పుడు నామీద అరిచారుగా, మరిప్పుడు ఇలా మాట్లాడతారేం?”
”నలుగురితో నారాయణా అనక తప్పుతుందా, అందరూ ఎలా బతుకుతున్నారో మనమూ అలాగే బతకాలి. మనకిష్టం ఉన్నా లేకపోయినా అలా బతక్క తప్పదు. పైగా పాపం వాడెక్కడికి పోతాడు, అనే బాధ కూడా ఉండింది. ఎన్నాళ్లుగానో మననే నమ్ముకుని ఉన్నాడు!”
”కానీ వాడితో వేగటం నా వల్ల అయ్యేది కాదు! అయినా… మీరు మాత్రం ఎన్ని పనులని చేస్తారు?”
”పాపం, వెళ్లిపోయాడుగా!”
”వెళ్లనివ్వండి!”
”ఎవరైనా ఇంటికొస్తే, బాగానే బతుకుతున్నారుగా, ఒక వంటవాణ్ణి పెట్టుకోలేరూ, అనుకుంటారని నాకు సిగ్గేస్తుంది.”
”అయితే ఏమైంది? వంట చేసుకోవటం నేరమా?”
”మనం ఎటువంటి సమాజంలో బతుకుతున్నామో దానికి తగ్గట్టు ఉండాలి.”
”మీరే అంటారుగా, పెద్దవాళ్లని చూసే చిన్నవాళ్లు నేర్చుకుంటారని? నౌకర్లు ఉన్నా మీ పనులు మీరే చేసుకుంటారాయె! మరి నాకు మాత్రం వంటవాణ్ణి పెట్టుకునేంత అవసరం ఏముంది?”
ఆయన నవ్వుతూ, ”లేదు, నీకు అవసరమే. మగాడు కూలిపని చెయ్యటానికి వెనకాడడు కానీ పెళ్లాం కూలీపని చెయ్యటం అతనికి ఇష్టం ఉండదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఒకప్పుడు ఇంగ్లీషువాళ్లు కూడా తను ఇళ్లల్లోని స్త్రీలు ఉద్యోగాలు చెయ్యటాన్ని ఇష్టపడేవారుకాదు.”
”కానీ ఇక్కడ ప్రస్తుతం చాలామంది ఆడవాళ్లు ఉద్యోగాలు చెయ్యటం చూస్తున్నాను.”
”అవును, చేస్తున్నారు, కానీ అది మంచిది కాదు, నా ఉద్దేశంలో అది మంచిది కాదు. దీని వల్ల జరుగుతున్నదేమిటి? ఆడా, మగా ఇద్దరూ పని చేస్తే ఏమవుతుంది? డబ్బులెక్కువ సంపాదిస్తారు. మగవాళ్ల నిరుద్యోగ సమస్యకి ఇది కూడా ఒక కారణమే.”
”అయినా స్త్రీలకి తమకంటూ సంపాదన ఉంటుంది కదా?”
”ఈ సంపాదన అనేసమస్య గురించి కొంత కాలంగానే వింటున్నాం. మునుపటి రోజుల్లో ఆడవాళ్లు ఒక్క పైసా సంపాదించేవాళ్లు కాదు. అయినా ఇంట్లో పెత్తనమంతా వాళ్లే చేసేవాళ్లు, వాళ్లమాటే చెల్లేది. అప్పుడు మరి వాళ్లు సంపాదించలేదే?”
”ఇప్పుడంతా మగాళ్లు తమ సంపాదనని తమ దగ్గరే ఉంచుకుంటున్నారు. పాపం ఆడవాళ్లకి డబ్బు అవసరమైనప్పుడు, అడుక్కోవలసి వస్తోంది. వాళ్లకి ఇష్టముంటే ఇస్తారు, లేకపోతే లేదు పొమ్మంటారు, అలాంటప్పుడు ఇద్దరూ సంపాదిస్తేనే మంచిదని నా ఉద్దేశం.”
”ఈ దేశంలో అలాంటి పురుషులు తయారవుతున్నారంటే అది అవలక్షణమే అనాలి.”
”అవలక్షణమో, కాదో తెలీదుకానీ, ప్రస్తుతం మనం చూడవలసింది ఆడవాళ్ల అవసరాలు తీరేదెలా అనే.”
”అవును, నిజమే. కానీ ఒక సంగతి మర్చిపోకూడదు, ఈరోజుల్లో ఒకరే సంపాదిస్తూ ఇంకొకరు ఆ సంపాదనమీద బతకటమనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. నిమ్న జాతివాళ్లలోనూ, రైతుకుటుంబాల్లోనూ చూడు, ఇద్దరు సమానంగా పని చేస్తారు. అసలు ఆడవాళ్లే మగాళ్లకన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తారనాలేమో. కానీ మగాళ్లు దొంగవెధవలు, భార్యల సంపాదన లాక్కుని వాళ్లమీద అధికారం చెలాయిస్తారు. ఇద్దరికీ సమాన హోదా ఎలా కల్పించటం, మగాళ్లని ఎలా మార్చటం అనేదే ప్రస్తుతం మనం ఆలోచించాలి. దీనికి స్త్రీలు చదువుకోవటం అవసరం, అంతేకాదు, మగాళ్లకి దొరికిన హక్కులన్నీ స్త్రీలకీ దొరకాలి. అంతేకాని, ఇవన్నీ దొరకనంత కాలం సమానంగా శ్రమించినా ఏమీ లాభం ఉండదు.”
”మరి అదెలా సాధ్యం?”
”అన్నీ నెమ్మది మీదే జరగాలి. ఈ సమాజం భ్రష్టు పట్టటానికి ఇన్నాళ్లు పట్టింది, మరి బాగయేందుకు కూడా చాలా కాలమే పడుతుంది.”
”మరి అంతవరకు ఆడవాళ్లు ఇలా బాధ పడవలసిందేనా?”
”అంతటా చెడ్డవాళ్లే ఉండరుకదా? ఇప్పటికీ ఆడవాళ్లని నెత్తిమీదపెట్టుకునే మగాళ్లు ఉన్నారు. అసలు మొదట మనుస్మృతి రాసినవాళ్లు నా ఉద్దేశంలో పురుషులకన్నా స్త్రీలే గొప్పవాళ్లని చెప్పారు. మగవాళ్లుకూడా స్త్రీలని తమకన్నా అధికులని భావించేవాళ్లు. మనుస్మృతిలో తండ్రికన్నా తల్లికే ఎక్కువ హక్కులు ఇచ్చారు. స్త్రీలేనిదే పురుషుడు ఏపనీ ఒంటరిగా చెయ్యకూడదు. అన్నదమ్ములు ఎంత కొట్టుకు చచ్చినా అక్కచెల్లెళ్ల దగ్గర కొచ్చేసరికి మగాళ్లు వాళ్లని సమానంగా చూసేవాళ్లు.”
”మునుపు అలా ఉండేదేమో, కానీ ఈ రోజుల్లో ఎంతమంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్లని ప్రేమగా చూసుకుంటున్నారు? ఎంతమంది కొడుకులు తల్లిని పూజిస్తున్నారు? మరోపక్క ఎందరు భర్తలు తమ భార్యలని చెప్పులతో పూజిస్తున్నారు!”
”అలాంటి వాళ్లకోసమే చట్టంలో ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి. గాంధీ యుగంలో స్త్రీల పరిస్థితి మెరుగైంది, ఇంకా అవుతుందని నా నమ్మకం.”
”మనం పోయాక ఏమైనా అవచ్చేమో!”
”అప్పుడు మళ్లీ నువ్వు ఈ భూమ్మీదికి వస్తావు. నీకు ఇవే కోరికలు అప్పుడు కూడా ఉంటాయి.”
”మీకెప్పట్నించీ పునర్జన్మలో నమ్మకం కలగటం మొదలైంది?”
”నాకు నమ్మకంలేదు, కానీ నీకుందిగా? నీకు నమ్మకం ఉంది కనకే ఈ కోరికలు మళ్లీ జన్మలో కూడా నీ వెంటే ఉంటాయంటున్నాను.”
”చాలా బావుంది!”
1934లో మేం బొంబాయిలో ఉన్నాం. ఒకసారి బెనారెస్‌ నించి బొంబాయికి వెళ్తున్నాం. రెండురోజుల ప్రయాణం, మా అమ్మాయి ఆయన ఉన్నారన్న సంకోచంతో పిల్లాడికి పాలుయివ్వ లేదు. ఆ రెండు రోజులూ ఆయన మనవణ్ణి తన దగ్గరే పడుకోబెట్టుకుని, రెండు గంటల కొకసారి బుడ్డీ పాలు పట్టారు. ఆ పని నాకు కూడా చెప్పలేదు. బొంబాయి చేరుకున్నాకగాని వాణ్ణి తల్లికి ఇవ్వలేదు.
నాలుగు నెలల తరవాత వాసుదేవ ప్రసాద్‌ వచ్చి అమ్మాయిని తీసుకెళ్లాడు. అంతకుముందునించి ఈయన నాతో ఒకటే గొడవ, ”పసివాణ్ణి ఎందుకు తీసుకెళ్లటం? మనిద్దరికీ ఎలా తోస్తుంది?” అని.
వాడుమాకు బాగామాలిమి అయాడు. మాఆయన స్టూడియోనించి ఇంటికి ఎప్పుడు వస్తారో వాడికి ఎలాతెలిసేదో, ఆ సమయానికి కుర్చీలో కూర్చుని, ”తాత…. తాత…” అనేవాడు. ఆయన ఇంట్లోకి వచ్చీ రాగానే చంకనెక్కేవాడు. వాణ్ణికాసేపు ముద్దుచేశాకే ఆయన బట్టలు మార్చుకునేవారు. తనపక్కనే కూర్చోబెట్టుకుని అన్నం తినిపించేవారు. కానీ అల్లరిచేస్తే మాత్రం ఊరుకునేవారుకాదు, శిక్షించాల్సిందే!
అమ్మాయి పోస్టులో రాఖీ పంపేది, ఆ రాఖీ ఆయన నా చేత కట్టించుకునేవారు. రెండేళ్లు అబ్బాయిలిద్దరూ అలహాబాద్‌లో ఉండిపోయేసరికి, వాళ్లకి కూడా రాఖీలు పార్సెల్‌చేసి అమ్మాయిని పంపమనేవారు, లేదా తనే పంపేవారు.
అమ్మాయి బొంబాయిలో ఉన్నప్పుడు, రాఖీపండగకి ఇంకా పదిహేను రోజులుందనగా ఈయన, ”చెప్పమ్మా, నీకు పండక్కేం కావాలి?” అని అడిగారు.
”మీ ఇష్టం నాన్నా,” అంది అమ్మాయి.
ఈయన నాతో, ”రవ్వల ముక్కు పుడక అడగమని దానికి చెప్పు,” అన్నారు.
”విన్నావామ్మా?” అన్నాను.
”నాన్నే స్వయంగా ఇస్తానంటూంటే నేనేం అడిగేది?” అంది అమ్మాయి.
ఈయన బెనారెస్‌కి వచ్చినప్పుడు బజారుకి నన్ను వెంట బెట్టుకుని వెళ్లి, అమ్మాయికి 135 రూపాయలు పెట్టి ముక్కుపుడక, అబ్బాయిలిద్దరికీ చెరి 45 రూపాయలకి వాచీలు కొన్నారు. నన్ను కూడా చెవి దుద్దులు కొనుక్కోమని బలవంతపెట్టారు.
”నాకవి ఇప్పుడెందుకు?” అన్నాను.
”చాలా బావున్నాయి, తీసుకో!”
”నా బ్యాంకులో డబ్బుంది, చాలు. పెట్టుకోనప్పుడు ఇవి కొనుక్కుని ఏం చేసుకోను?” అని మొత్తం మీద పడనివ్వలేదు నేను. కొన్న ఏడు చున్నీల్లో మూడు మేనకోడళ్లకోసం కొన్నారు.
”ఇన్నెందుకు కొన్నారు? ముగ్గురికేగా ఇవ్వాలి?” అన్నాను.
”తక్కువైతే ఏంచేస్తాం? ఉండనీ, బోలెడంతమంది ఆడపిల్లలున్నారు.”
సినిమా ఉద్యోగం వదిలేద్దామనుకుంటూండగా ఎవరో ఒకాయన ఈయనతో దినపత్రిక పెడదామని అన్నాడు.
”బానే ఉంటుంది. ఆయన దినపత్రిక మొదలుపెడదామని అంటున్నాడు. ఏడువందలిస్తాట్ట, నలుగురు ఎడిటర్లని కూడా పెడతాడట. నువ్వు సరేనంటే చేద్దామనుకుంటున్నా. నాకిష్టమే. ఇంటికెళ్లినా ”హంస్‌,” ”జాగరణ్‌” పనేగా చేస్తాను? అక్కడైతే మన డబ్బు ఖర్చవుతుంది. ఇక్కడ సంపాదకత్వం మాత్రం చేస్తే చాలు. ఆ పత్రికలు అక్కడ నడుస్తూ ఉంటాయి, ఇక్కడ నేనీపని చేస్తాను.”
”నాకిక్కడ అసలు ఉండాలనే లేదు,” అన్నాను.
”సరే, పోనీ ఒక పని చేద్దాం, ఇద్దరం అక్కడికెళ్లి, నెలా రెణ్ణెల్లు ఉండి, మళ్లీ వద్దాం.”
”లేదు, నాకిక్కడ ఉండాలనే లేదు!” అన్నాను మళ్లీ.
”నీకిక్కడ ఇబ్బందేముంది?”
”ఎందుకులేదు? పిల్లలక్కడా, మనిద్దరం ఇక్కడా, ఇలా ఉండటం ఏం బావుంది?”
”కానీ మనింటికెళ్తే మాత్రం మనిద్దరమేగా ఉండేది? ధున్నూ ఈ ఏడాదికూడా అలహాబాద్‌లోనే చదవాలి, మనం బెనారెస్‌లో ఉంటాం. మళ్లీ రెండు చోట్ల కాపరాలేగా?”
”కానీ అక్కడ పిల్లలకి దగ్గరగా ఉంటాం. అలహాబాద్‌కీ బెనారెస్‌కీ ఎంత దూరమని? ఒంట్లో ఎవరికి బాగాలేకపోయినా వెంటనే సహాయం అందుతుంది. ఇక్కడైతే అలా కాదుగా, మూడు రోజుల ప్రయాణం చేస్తేగాని కలుసుకోలేం.”
”అంటే పనీపాటా మానేసి ఇంట్లో చేతులు ముడుచుకుని కూర్చోవాలి, అంతేగా?”
”ఉద్యోగం ఉంటే తప్పదు. మీరిక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారో అదిఎలాగూ నెరవేరటం లేదు. మరిక్కడ ఉండటం ఎందుకు, దండగ?”
”ఇంకేమీ కాకపోయినా ఈ డబ్బుతో ”హంస్‌”, ”జాగరణ్‌” బతుకుతాయి.”
”బతక్కపోతే ఏమైందిప్పుడు? ఇప్పుడు మహా డబ్బుల్లో ఓలలాడుతున్నామా? ఆగిపోతే ఆకలితో మాడి చస్తామా?”
”జీవితంలో సిద్ధాంతాలు కూడా ఉండాలికదా? అదీగాక, మనిషన్నాక చేతులారా తయారుచేసినవాటిని ప్రేమించటం సహజమేగా! ఒంట్లో శక్తి ఉన్నంతకాలం అని పాడవుతూంటే చూస్తూ కూర్చోలేడుగా. నువ్వు పిల్లల గురించి ఆలోచించినట్టే. పిల్లలు మనని సుఖపెడతారని ఆశిస్తామా? కానీ మన పిల్లలు కాబట్టి వాళ్లమీద ప్రేమ పుట్టుకొస్తుంది. వాళ్లకోసం మనం పగలనక రాత్రనక ఎంత శ్రమిస్తాం? సన్యాసులు అన్నీ త్యాగంచేస్తారని అందరూ అంటారు, కానీ వాళ్లు చేసేది త్యాగమా? సుబ్బరంగా తిని హాయిగా ఉంటారు. ఇల్లూ, వాకిలీ, తిండీ తిప్పలూ ఏవీ అక్కర్లేదు. సుఖ దుఃఖాల గురించి చింతలేదు. ప్రపంచంలో ఏం జరుగుతోందన్నది వాళ్లకి పట్టదు. అదే గృహస్థు అయితే, కుటుంబం కోసం ఎదుర్కోని కష్టాలు లేవు, జీవితం ఒక తపస్సులా, ఎక్కడికక్కడ త్యాగాలతో నిండి ఉంటుంది. డబ్బున్న కుటుంబాల సంగతి కాదు నేను చెప్పేది, పేదవాడింట్లో పట్టెడన్నమే ఉంటే, ముందు పిల్లల కడుపు నింపేందుకే ప్రయత్నిస్తాడు. ఏ మిఠాయో ఎప్పుడైనా దొరికినా తను తినకుండా పిల్లలకే పెడతాడు. తన ఒంటిమీద బట్టలు చిరుగులు పట్టినా, డబ్బు చేతికందితే ముందు పిల్లలకి కొనాలన్న ఆలోచనే వస్తుంది. ఈ విషయంలో అసలు ఆడవాళ్లే ముందుంటారు. కానీ ఆ పిల్లలే పెద్దవారై మంచి హోదాలో ఉంటే వీళ్లేే మా అమ్మానాన్నా అని పరిచయం చేసేందుకు కూడా సిగ్గుపడతారు, ఇక వాళ్ల సౌకర్యాలగురించి ఏమాలోచించగలరు?”
”అందరు పిల్లలూ అలాగే ఉండరు!” అన్నాను.
”కాకపోవచ్చు, కానీ ప్రపంచం అటుకేసే పోతోంది.”
”మరి దాన్ని మీరు మార్చకూడదూ?”
”మార్చేందుకే ఇక్కడికి వచ్చాను. సాధ్యంకాకపోతే ఏం చెయ్యను?”
బొంబాయిలో ఉండగా రాత్రి ఒకసారి ఆయనకి జ్వరం వచ్చింది, మర్నాడు సాయంత్రం ఐదుగంటలక్కూడా తగ్గలేదు. నేనాయన దగ్గరే కూర్చున్నాను. రాత్రి ఒక్కదాన్నీ ఏం తింటానులే అని భోజనం కూడా చెయ్యలేదు. ఏ ఆరుగంటల ప్రాంతానో ఆయనకు జ్వరం తగ్గింది.
”నువ్వు అన్నం తిన్నావా?” అన్నారు.
”నిన్న సాయంత్రంనించీ అసలు వంటే చెయ్యలేదు,” అన్నాను.
”ఓ! నాకు కొద్దిగా వేడి పాలు ఇయ్యి. హల్వా కూడా చెయ్యి.”
ఆయన అడిగినవి రెండూ తెచ్చిచ్చాను. పాలు తాగేసి, ”ఆ హల్వా నువ్వు తిను,” అన్నారు. ఇద్దరం కలిసి హల్వా తిన్నాక నేనాయన దగ్గర కూర్చున్నాను.
”ఏదైనా చదువు, వింటాను. ఆ పాటల పుస్తకం తీసుకురా. నేను పాటల పుస్తకం తెచ్చాను. అందులో ఆడపిల్ల పెళ్లికి పాడే పాటలున్నాయి. నేను పాడుతూ ఉంటే ఆయన ఏడవసాగారు. ఆ తరవాత ఆయనవైపు చూడకుండా నేను పాడటంలో మునిగిపోయాను. ”ఆపెయ్యి! చాలా బాధగా ఉంది ఆ పాట వింటే. ఆడపిల్లల జీవితాలు చూడు ఎలాఉంటాయో! పాపం ఎక్కడో పుడతారు, ఇంకెక్కడికో, తనవాళ్లంటూ ఎవరూ లేనిచోట వెళ్లి స్థిరపడతారు. చూశావా, ఈ పాటలు రాసిన స్త్రీలు పొట్టపొడిస్తే అక్షరమ్ముక్క రానివాళ్లే! ఈ రోజుల్లో ఒక్క కవిత రాస్తే చాలు, కవిసమ్మేళనాల్లో పాల్గొంటే చాలు, అబ్బో ఎంత విర్రవీగుతారు! పాపం ఈ పాటలు రాసిన వాళ్ల పేర్లు కూడా ఎక్కడా కనబడవు!”
”ఇవి రాసింది పురుషులా, స్త్రీలా?”
”స్త్రీలే! మగవాళ్లు ఆడవాళ్ల మనసుల్లోని బాధని అర్థం చేసుకోలేరు, వాళ్లకి ఆ భావుకత ఉండదు. ఈ పాటల్ని రాసింది తమలాంటి స్త్రీల బాధల్ని అర్థం చేసుకోగలిగిన స్త్రీలే.”
”కానీ ఈ పాటల్ని చదువుతూంటే నాకేం ఏడుపు రాలేదే, మరి మీరెందుకు ఏడ్చారు?”
”నువ్వు ఊరికే వీటిని పైపైనే చదువుతున్నావు కానీ లోతుగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం లేదు. నాకు ఒంట్లో బాగాలేదని నువ్వు లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నావని నా అనుమానం.”
”అదేం కాదు, మీరు అసహాయులనుకుంటున్న ఈ స్త్రీలు నిజానికి అసహాయులు కారు. అసహాయత స్త్రీ పురుషులిద్దరిలోనూ ఉండచ్చు, పరిస్థితిని బట్టి ఉంటుంది అది. పరిస్థితుల చేతుల్లో ఇద్దరూ కీలుబొమ్మలే. మగాళ్లకి మాత్రం వాళ్ల వాళ్లందరూ దగ్గర ఉంటున్నారా? ఎవరి జీవితం వాళ్లదేగా?”
”సరే, నీ వాదన ఒప్పుకుంటాను. కానీ ఆడైనా, మగైనా సర్దుకుపోవాలి. ఒకరికోసం ఒకరు అనేట్టు ఉండాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ అలా లేనప్పుడు మాత్రం నష్టం పురుషుడి కన్నా స్త్రీకే ఎక్కువ. ఆమె ఎక్కువ నిస్సహాయురాలవుతుంది.”
1934లో మేం బొంబాయిలో ఉండగా, ఈయన పనిచేసే కంపెనీ తరపున ఒకాయన సినిమా తీశాడు. ఆయన భార్య నాదగ్గరకొచ్చి, తన గోడు వెళ్లబోసుకుంది. కంపెనీ యజమాని వాళ్లాయనికి ఐదువందలు అడ్వాన్స్‌ ఇచ్చి, మిగతాది సినిమా పూర్తిచేశాక ఇస్తానని చెప్పి, మొత్తం రెండు వేలకి అతన్ని కుదుర్చుకున్నాడు. సినిమా అయిపోయింది కానీ కంపెనీ యజమాని మిగతా సొమ్ము చెల్లించకుండా కుంటి సాకులు చెప్పటం మొదలుపెట్టాడు. ఎన్నో నెలలు గడిచిపోయినా డబ్బు ఇవ్వకపోయేసరికి సినిమా తీసినాయన కంపెనీయజమానికి నోటీసు పంపాడు. నోటీస్‌అందగానే కంపెనీ యజమాని అతనిమీద ఐదువందలకి దావా వేశాడు. పాపం సినిమా తీసినాయనా వాళ్ళాయన ఊరికి కొత్త, పైగా భారీ కంపెనీతో వ్యవహారం చెడింది. అతని దగ్గర ఐదు వందలు కాదుకదా, చిల్లిగవ్వ లేదు. అందుకే మా ఆయన సాయం కోరి వచ్చింది.
”ఆ సినిమాసంగతి మా ఆయనకి తెలుసా? వాళ్లాయన స్టూడియోలో సినిమా తియ్యటం మా ఆయన చూశారా?” అని అడిగాను.
”అదేమో నాకు తెలీదు, కానీ మీ ఆయన పనిచేసే స్టూడియోలోనే మా ఆయన సినిమా తీశారు. పగలూ రాత్రీ అక్కడే ఉండేవారు,” అంది.
”సరే, ఆయనవస్తే అడుగుతాను లెండి,” అన్నాను.
మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆయన వచ్చారు. నేను విషయం ఆయనకి చెప్పేసరికి, ”ఆ సినిమా తియ్యటం నేను చూడలేదు,” అన్నారు.
”కానీ ఆయన పగలూ రాత్రీ మీరు పనిచేసే స్టూడియోలోనే సినిమా తీస్తూ ఉండేవారని ఈవిడ అంటున్నారు.”
”అమ్మా, మీరు మీ ఆయన్ని నా దగ్గరకి పంపండి. వాళ్లిద్దరి గొడవనీ సర్దుబాటు చెయ్యటానికి కావాలంటే ప్రయత్నిస్తాను కానీ, అబద్ధం చెప్పలేదు. నేను చూడని విషయాన్ని చూసినట్టు ఎలా చెప్పను?” అన్నారు.
”అయ్యా! అతను కొట్లాటకి సిద్ధంగా ఉన్నాడు. మీరు మధ్యలో కల్పించుకుంటే, మీకేమైనా అవమానం జరిగితే మేం భరించలేం,” అందావిడ.
”నాకా విషయం గురించి బెంగేమీ లేదు. మీకీ సాయం చెయ్యమంటే చెయ్యటానికి నేను సిద్ధమే.”
ఆమె వెళ్లిపోయింది.
”పాపం చాలా కష్టాల్లో ఉంది,” అన్నాను.
”వీళ్లాయన పని చేసిన కంపెనీ యజమాని చాలా డబ్బు, పలుకుబడీ ఉన్న వాడు,” అన్నారు.
”వీళ్లకి మీరు చేతనైనంత సాయం తప్పకుండా చెయ్యండి.”
”నేను చేస్తాను, కానీ ఆయన వినాలిగా?”
కొంతసేపటికి అతను వచ్చాడు.
”రేపు ఉదయం మీరు మా ఇంటికి రండి. మనిద్దరం కలిసి వెళ్లి మాట్లాడదాం,” అన్నారీయన.
”అలాగే, కానీ నేను మీ వెంట లోపలికి రాను, బైటే ఉంటాను, మీరు పిలిచాకే లోపలికొస్తాను,” అన్నాడు అతను.
మర్నాడు పొద్దున్నే వాళ్లిద్దరూ కంపెనీ యజమాని దగ్గరకెళ్లారు. ఈయన లోపలికెళ్తూనే, ”ఏమిటండీ, ఇంత పెద్ద గొడవ తెచ్చిపెట్టారు?” అన్నారు.
”గొడవేమిటి? మీరు అంటున్నది దేన్ని గురించి?” అన్నాడతను.
”మీరు సినిమా తీయించారు, తీసిన వ్యక్తి డబ్బిమ్మని అడిగితే ఇవ్వకపోగా ఐదువందలకి దావా వేశారేమిటి? మీరిలా చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు.”
”ముందు మీరు నేను చెప్పేది కూడా వినండి. అతను చాలా మోసగాడు. మంచిగా మాట్లాడకుండా నాకు నోటీసు పంపాడు. మీరు వెంట రాకపోతే ఈరోజు అతనికి బేడీలు పడేవి. నాకు మీరంటే చాలా గౌరవం. కారణం, మీరు హిందీ సాహిత్యంలో అందరికన్న గొప్ప రచయిత. అతన్ని రాజీ చేసుకోటానికైతే లోపలికి రమ్మనండి. అతనికి నేను బాకీ ఉన్నది ఇంక రెండు వందల యాభై రూపాయలే. చెక్కు రాసి ఇచ్చేస్తాను.”
మా ఆయన అప్పుడు సినిమా తీసినతన్ని లోపలికి పిలిపించి, ఇద్దరికీ రాజీ కుదిర్చాడు, కంపెనీ యజమాని చేత అతనికి డబ్బులిప్పించి మరీ ఇంటికి వచ్చారు. వచ్చాక నాకు అన్ని విషయాలూ చెప్పి, మా ఇద్దర్నీ అవాళ సాయంత్రం సినిమా చూసేందుకు రమ్మన్నారని చెప్పారు. సాయంత్రం స్వయంగా ఇద్దరూ వచ్చి తీసుకెళ్తారనీ, తనుకూడా ఇంటికి పెందలాడే వచ్చేస్తాననీ అన్నారు.
– ఇంకా ఉంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.