దోర్నాదుల సుబ్బమ్మ
మనసెప్పుడూ ఓదార్పును కోరుకుంటుంది. మనసులో బాధల్ని పంచుకోవడానికి మనసున్నవారికోసం నిరీక్షిస్తుంటాం. నిరీక్షణలో మనుషులు ఆశలు పెంచుకొంటారు. ఫలించనపుడు రోజురోజుకీ కుంగిపోతుంటారు. కొంతమంది ఎంత బాధవున్నా… ఆ బాధను దిగమింగి పైకి బాగానే వున్నట్లు నటిస్తూ కాలం గడుపుతుంటారు.
కొన్ని కొన్ని నిజాల్ని బయట పెట్ట డానికి మనసు అంగీకరించదు. మంచిగా తోచిన దానివైపే మనసు పోతుంటుంది.
విశ్రాంతి తీసుకుంటూ ప్రశాం తంగా వుండాలని మూడు సంవత్సరాల క్రిందట సుభద్రమ్మకు డాక్టరు చెప్పాడు. అయినా ఆవిడ ఎప్పుడూ ప్రత్యేకంగా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీస్కొనేదికాదు. ఎవరెవరి గురించో ఏదేదో ఆలోచన సంక్షేమం కోసం తపించేది. గతం గుర్తొచ్చినప్పుడల్లా సబ్దతగా వుండిపోతుంది. అలా ఆలోచనల్లో కూరుకుపోవడం ఎవరైనా గమనిస్తారేమోనని ఎవరూ తనను గమనించకుండా జాగ్రత్తపడేది.
సుభద్రమ్మది ప్రేమ వివాహం. పాతికేళ్ల క్రిందటే ఒక కార్మికుణ్ణి ప్రేమ పెళ్లి చేస్కుని పుట్టింటికి దూరమైంది. ఒక్కగానొక్క కూతురై వుండి తల్లితండ్రుల మనసు నొప్పించానని ఎన్నోసార్లు తనను తాను నిందించుకునేది.
చచ్చినదానితో లెక్కేసుకొన్నామని తండ్రి నలుగురితో చెపుతున్నప్పుడు తనను తాను చంపుకున్నంతగా బాధపడేది. వాళ్లకి కనిపించి వాళ్లను క్షోభపెట్టడం యిష్టంలేక ఆ ఊరొదిలి వచ్చేసింది. మళ్లీ ఎప్పుడూ వెళ్లలేదు.
సుభద్ర దాంపత్యం ఆనందం ఎంతోకాలం సాగలేదు. గని ప్రమాదంలో భర్తను పోగొట్టుకుంది. వాళ్ల మూడేళ్ల కాపురానికి గుర్తుగా రెండేళ్ల కొడుకుతో బ్రతుకుదెరువు కోసం హైదరాబాదుకు వచ్చింది.
బతుకు సముద్రాన్ని ఈదడానికి సిద్ధమైంది. సుభద్రమ్మ స్వయం ఉపాధిగా ప్రారంభించిన పచ్చళ్లు, పొడుల ఎగుమతి, కుటీర పరిశ్రమలా మారి, మరో నలుగురికి జీవనాధారాన్నిచ్చింది.
ఎవ్వరూ తోడులేరు. తోడు రారు. అనుకునే సమయములో మహేష్‌బాబు, నిర్మల, ఇరవై సంవత్సరాల నుండి సుభద్రమ్మతో కలిసిపోయి గంగాధరం ప్రోడక్ట్‌ని మూడు పువ్వులు అరవై కాయలు చేసేందుకు అహర్నిశలు శ్రమించేవాళ్లు. తెలీని ఆత్మీయత చోటుచేసికొంది ముగ్గురి మీద.
తనకు భగవంతుడిచ్చిన తోబుట్టువులుగా భావించేది. తనను చూసి జాలిపడి వరాలిచ్చిన వాళ్లని చూస్కుంటూ సంతోషపడేది సుభద్రమ్మ.
మనిషిని కొన్ని జ్ఞాపకాలు నడిపిస్తాయి. కొన్ని బంధాలు కుంగదీస్తాయి. పరధ్యానంలో నడుస్తూ ఓరోజు రోడ్డుమీదనే పడిపోయింది సుభద్రమ్మ. అపస్మారకంలో వున్నామెను పరిచయస్థులెవరో చూసి హాస్పిటల్‌కు తీస్కెళ్లారు.
బాగా నీరసించి వున్నందువల్ల మామూలు స్థితికి రావడానికి మరొక ఇరవై రోజులు పడ్తుందన్నారు డాక్టర్లు. ఆలోచిస్తూ, దిగులుపడ్తూ, సరిగ్గా తినకపోవడం వల్లనే నీరసించి, స్పృహ తప్పి పడిపోయివుంటుందనే డాక్టర్ల మాటల్ని బట్టి మహేష్‌బాబు, నిర్మల అర్థం చేసుకున్నారు.
లోకంలో బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలకు అర్థం ఏమిటో ఎలా ఉంటాయోనని ఆలోచిస్తుంటుంది తనలో తనే సుభద్రమ్మ. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కరం ఖచ్చితంగా ఫలానా అని తెలీదా… తెలిసినా చెప్పుకోలేరా… కానీ యివన్నీ యిలా లేకపోతే బ్రతుక్కి అర్థమే లేదా… బ్రతుకంటే నిజాల, అబద్దాల, దాగుడుమూతలా…? నాకేనా యిదంతా?
ఈ లోకంలో పేగు తెంచుకుపుట్టిన బిడ్డల మీద ప్రతి ఒక్కరికి ఎనలేని ప్రేమ… కన్నబిడ్డల కోసం కళ్లల్లో వొత్తులేస్కుని చూస్తుంటాం… రావడం కాస్త ఆలస్యమైతే ఎంతటి కష్టాన్నైన్నా భరిస్తారు పిల్లలకోసం పెంచుతూనే మనసులో ఆశల్ని కూడా పెంచుకొంటారు. సృష్టి సహజమో వైచిత్య్రమో…. ఏమైనా తల్లితండ్రుల ప్రేమల్ని ఎంతమంది పిల్లలు అర్థం చేస్కుంటారు? వాళ్ల త్యాగాల్ని అర్థం చేస్కుంటారు? బాధల్ని పంచుకోకపోయినా… కనీసం అభిమానంగా పలకరిస్తారా? ప్చ్……
ఎడతెరపి లేని కొన్ని ఆలోచన్లు ఊపిరాడనీయవు.
”సుభద్రమ్మ హాస్పిటల్లో వున్న పరిస్థితి తెల్పినా, కొడుకు చూడ్డానికి రాలేదు. వస్తే… చూస్తే… మనసు కుదుటపడేది… ఆమె తనలో తనే ఎట్టా కుములుతూ వుందో గమనించావా… ఏం పిల్లలో ఏమో… అనుకొన్నారు మహేష్, నిర్మలమ్మ యిద్దరూ.
అయినా… ఎంత కష్టపడి పెంచిందో కొడుకుని… మనకు తెలుసా సంగతి… హాస్పిటల్లో వుండే సంగతి తెలిశాక, రెక్కలు కట్టుకురావల్సిందాయె. నాలుగు రోజులైనా రాకుండా వుండడాన్ని ఏం అర్థం చేస్కోవాలో… ఒకవేళ వచ్చినా బాగోగులు చూస్కుంటాడా? తల్లి మనసేమో బిడ్డ చూపులు… పలకరింపులు కోసం అల్లాడుద్దాయే… అనుకొనేవాళ్లు మార్చిమార్చి. ఐ.సి.యు.లోంచి వార్డులోకి మార్చారామెను.
మహేష్ యింకోసారి టెలిగ్రామ్ యిచ్చాడు. ఈపాటికి ఖచ్చితంగా బయలుదేరుంటాడు ”గంగాధరం” – ట్రెయిన్ వచ్చేస్తుంటది. ఎర్రితల్లి… కొడుకు దూరంగా వున్నా దగ్గరున్నట్టే షాపు బోర్డుమీదున్న పేరు చూస్కుని సంబరపడిపోతుంది పాపం…! తల్లులందరూ… ఎర్రోళ్లేనా…? ఆ…….. ఔను… తనకు తాననుకొన్నాడు లోలోపలే మహేష్.
మొత్తానికి టెలిగ్రామ్ యిచ్చి మంచి పన్జేశావ్… పుణ్ణెం కట్టుకొన్నావ్… అసలు – మూడేళ్లైనా అమ్మను సూడాలన్పించలేదేమో కొడుక్కి. ఎట్టా సాకిందో… ఎంతెంత కష్టపడిందో… ఎన్నో ఆశల్లో మనకెన్ని సెప్పుకొచ్చిందో……
”లోకంలో అందరి తల్లులు… బిడ్డల కోసం కష్టపడేవాళ్లే కదా… కొత్త సంగతి కాదులే…” అంటూ ఒకరి మాటను ఇంకొకరు అందుకుంటున్నవాళ్లను చూడాలనుకుంది. మాటాడాలనుకొంది బదులుగా సుభద్రమ్మ.
నిజమే…… కష్టాల నదిని దాటించే పడవలాంటిది అమ్మ…… ఎప్పుడూ అమ్మచేసే పని అదే….. అనుకొంది మళ్లీ తనలో తానే.
గంగాధరం వచ్చేస్తున్నాడు… వస్తూనే ఏం మాట్లాడ్తాడో ఏమో… ఏంచేస్తాడో… ఇన్నాళ్లు రానందుకు ఏం సంజాయిషీ ఇచ్చుకుంటాడో… వినీ విననట్టుండిపోవాలని అనుకుంది కళ్లు తెరవకుండానే సుభద్రమ్మ. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. కొన్ని ఊహలు అందంగా ఆత్మీయులచుట్టూ అల్లుకుంటాయి. ”నువ్వెల్లి గంగాధరం బాబుకి భోజనం తీసుకురా నిర్మలమ్మా అన్నాడు మహేష్. అట్టాగేనయ్యా… గంగాధరం బాబూ ప్రయాణం బాగా జరిగిందా పిల్లలెట్టా ఉన్నారయ్యా… క్యారేజి గిన్నెలు చేతికి తీస్కుంటూ, కూచో బాబూ అంటూ కుర్చీ లాగింది నిర్మలమ్మ.
”ఆ – బాగానే వున్నారు” అన్నాడు ముక్తసరిగా గంగాధరం. ఏంవోయ్ మహేష్… ఏం మునిగిపోయిందని టెలిగ్రాం మీద టెలిగ్రాం” మదర్ సీరియస్ అనేది చూసి మా ఆఫీసరు నిలవనీయకుండా తరిమేసినంత పన్జేశాడు. ఈమె కళ్లే తెరవలేదే… ఇంకెన్నాళ్లు పడ్తుంది? నేనిప్పుడు రావడానికి ఎన్ని తంటాలు పడాల్సొచ్చింది తెల్సా… అదీగాక పిల్లల్ని స్కూల్లో చేర్చే టైం కూడా… విసుగ్గా మాట్లాడ్తున్న గంగాధరం వైపు ఆశ్చర్యం చూసి నోరెళ్లబెట్టాడు మహేష్.
మీ పిల్లలు యూనివర్శిటీలో చదువుతున్నారా? లేక చేరబోతున్నారా… దారిలో ట్రెయిన్ వల్ల ఏమైన యిబ్బంది పడ్డారా…
అలా వ్యంగ్యంగా మాట్లాడకోయ్… స్కూలని చెప్పానుగా. ఫస్ట్‌క్లాస్ బేబీకేర్ పిల్లలే. అయినా మంచి స్కూలేదో తెల్సుకోవాలి. డొనేషన్లు కట్టాలి. వగైరా వగైరా వుంటాయి. సిటీ సంగతులంటే… నీకేంతెల్సు హాయిగా ఈ ఊర్లో కూర్చొని మాట్లాడితే సరిపోద్దా… అతని మాటల్లో ముందున్న అసహనమే దొర్లుతోంది.
ఔన్లే… నిన్ను కన్న తల్లి, ఉన్న ఊరు తరిమేసింది పాపం. అందుకే మర్చిపోయివుంటావ్. నేను టెలిగ్రామ్ యిచ్చేదాకా గుర్తే రాలేదు… నయం… కదిలొచ్చావ్ ఈమాత్రమైనా…
మాటలతో ఆ గది వాతావరణం వెచ్చబడింది.
గంగాధరం మాటలు సుభద్రమ్మ గుండెల్ని తూట్లు పొడుస్తున్నాయి. లోపల ఎక్కడో భయంకరమైన బాధ మొదలైంది. అనూహ్యంగా.
మహేష్ నీకు గుండెల్ని గుచ్చినట్లే మాట్లాడ్డం తెలుసు. అనుభవించేవాళ్లకు అసలు సంగతి తెలుస్తుంది. నే చెప్పేది నిదానంగా విను బాగా ఆలోచించు… నువ్వేదో తెగ మాటాడ్తున్నావ్ నీ యిష్టం వచ్చినట్టు. గానీ అమ్మ నాకోసం ఏం చేసింది. నాగురించి ఏం ఆలోచించింది… మా అత్తగారు మాకు మా పిల్లలకు ఎంతో హెల్ప్ చేసింది. మా పాపకు కాలిగజ్జెలు మొదలు పాపిటిబిళ్ల వరకు నగలు చేయించడంలోగానీ బట్టలు కొనివ్వడంలో కానీ ఎంతో శ్రద్ధ, శ్రమ తీస్కుంటుంది. మా అమ్మ అలా ఏనాడైనా అనుకుందా?… చేసిందా? మీ అమ్మ మనకోసం… పిల్లల కోసం ఏం చేసిందండీ… ఏం చేస్తుండండీ అని నా భార్య అడుగుతుంటే, నోరుండి మూగవాణ్ణయిపోతున్నాను. అంటున్న గంగాధరం మాటలకు మహేష్‌లో అసహనం, అసహ్యం కలగలిశాయి.
నీకా మాటలనడానికి సిగ్గులేదట్రా… నీకు జన్మనిచ్చి, తానెన్నో కష్టాలు పడి, సమాజంలో నీకొక ఉన్నతస్థానం కల్పించేందుకు ఎన్నో బాధలనుభవించిన అమ్మ గురించేనా నువ్ మాట్లాడిన ఈ మాటలన్నీ…? హాస్పిటల్ పాలై, చావుబ్రతుకుల్లో వున్న అమ్మకోసం, నీ ఫ్రెండ్‌తో కబురు పంపినా నీవు రాకుండా, టెలిగ్రామ్ యిస్తే వచ్చినోడివి, కన్నతల్లిని ఆప్యాయంగా, ఆత్రంగా పలకరించాల్సింది పోయి, నువ్విలా మాట్లాడ్తావని కల్లో కూడా ఊహించలేదు. నాకే ఇట్లా అన్పిస్తూ, కడుపులో తిప్పుతావుంటే… అమ్మే నువ్వన్నవన్నీ వింటే గుండె పగిలి చచ్చిపోతుంది… నీకు దణ్ణం పెడతా… దయచేసి నాతో యిప్పుడు మాట్లాడినట్టు అమ్మతో మాట్లాడకు… కోపం పొర్లుకొస్తున్నా అదిమేసి ప్రేమగా బతిమాలాడు గంగాధరాన్ని.
ఇప్పుడామెను ఏం చేశానని…? లోకంలో, తల్లుల్ని యింట్లోంచి తరిమేసిన కొడుకులున్నారని తెలీదా? నేనేమైనా ఆ పని జేశానా? ఆమెకు కట్టుదిట్టాలేమైనా పెట్టానా…? ఇంకేమైనా శాసించానా? ఆమె చేసేవాటికి అభ్యంతరం చెప్పానా…? ఆమె దగ్గర్నుంచి నేనెప్పుడైనా ఆశించానా? ఉన్నదానికే తృప్తిపడి, తన తదనంతరమే యిచ్చినా తీస్కోవాలనుకున్నానే గానీ… అంతకుమించి ఏం కోరాను? ఏం ఆశించాను? తాపీగా అంటున్న మహేష్ మాటలకి ఆశ్చర్యపోతూ సూటిగా చూశాడు.
మహా గొప్ప మనసురా నీది! గొప్ప త్యాగమే చేశావు. అందరికీ ఆదర్శంగానే వున్నావని చెప్పేంతటోడివైనావు. నీ కోసం అమ్మ కళ్లల్లో ఎదురుచూపులు, బాధ చూళ్లేకనే టెలిగ్రామ్ యిచ్చాను. నల్గురి నోళ్లలోనే కాదు…… అమ్మ తృప్తికోసంగానని, వెల్తికాకూడదని అలా చేశా….. అందుకు నువ్వేమనుకొన్నా ఫర్వాలేదు. కాని, నిన్నొకటి అడగాలనుకొంటున్నా ఆ స్వతంత్రం చిన్నప్పట్నుండి నా గుండెల మీద, భుజాల మీద మోసిన వాణ్ణి గాబట్టి ఆ మాత్రం అడిగేందుకు వెనకాడాల్సిన పనిలేదనుకొంటున్నా……. ఇంతకూ అమ్మ శక్తికి మించే నీకు విద్యాబుద్దులు చెప్పించిందనేది నిజమే కదా… డోర్ టు డోర్ తిరిగి డబ్బు సమకూర్చుకొని డొనేషన్ కట్టగలిగింది తన శ్రమే కదా…? చెట్టు పెద్దదై ఫలితానికొస్తే, చూసి ఆనందించడం పెంచినవాళ్లకే తెలుస్తుంది. అసలు బిడ్డకు తల్లి, అమ్మతనానికి మించి యింకేమివ్వాలి? ఆ బిడ్డక్కూడా అంతకంటె ఏం కావాలి? దానికంటె గొప్పది ఏముంది? సర్వప్రాణులూ తల్లి సన్నిధిలో, సంరక్షణలో సంతృప్తి పడడం, తరించి పోవడం చూస్తున్నాం మరినీకది తెలీదా?
”మహేష్…. నువ్వేదేదో మాటాడేస్తున్నావ్…………. తల్లి బిడ్డకు కావల్సినవి సమకూర్చడం కొత్త సంగతేంకాదు”.
ఔను…. బిడ్డ, తల్లికి సమకూర్చడం నేటికాలంలో కొత్త సంగతైందిమరి!
గంగాధరం లాంటి మనుషుల్ని చూడ్డం… యిదే మొదటిసారి చివరిసారి కూడా కావాలని మహేష్ లోలోపలే అనుకొన్నాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలై కదుల్తున్నాయా? మార్తున్నాయా? ఆర్థిక సంబంధం మనిషిలో ఆర్ద్రతకు చోటు లేకుండా చంపేస్తుందా? ఒక హృదయం నుంచి నిజమైన ప్రేమ ప్రవహిస్తున్నంత సేపు జీవితం హాయిగా ఆనందంగా తోస్తుంది. అదే హృదయం స్పందించి, సంఘర్షిస్తే ఒక జీవితమే కాదు… ప్రపంచమే విషాద భరితంగా తోస్తుంది. కంకాళాలు మాత్రమే తిరుగు తున్నట్టనిపిస్తుంది. ఓ నిస్పృహ, ఓ నిర్లిప్తత చోటు చేస్కుంటాయి.
భోజనం తీస్కొచ్చి టేబిల్ మీద సర్దుతూ, నీ గొంతు విన్నాకయినా అమ్మకళ్లు తెరిచిందా బాబూ…… ఇష్టమైనోళ్ల వల్ల సగం జబ్బు నయమవుద్దంటారు గదయ్యా…… భోజనం సెయ్యండయ్యా…. క్యారేజి గిన్నెలు తీస్తూ అంది నిర్మలమ్మ.
వొద్దొద్దు నిర్మలమ్మా…. నేనొచ్చి యింత సేపైనా స్పృహలోకి రాలేదు. ఇంకో పది నిమిషాల్లో ట్రెయినుంది. నాకు చాలా పనులున్నాయి. వెంటనే వెళ్తే, ట్రయినందుకొంటా, ట్రెయిన్‌లో భోంచేస్తాలే…. నేనిప్పుడిక్కడుండి చేసేదేముంది? మీరిద్దరూ వున్నారు కదా…….. వీలు చూస్కొని మళ్లీ వస్తా. అంటూనే అక్కణ్ణుంచి లేచి వెళ్తుంటే అవాక్కై పోయారిద్దరూ అటే చూస్తూ.
ఊహించనవి చూస్తే నోట మాట రాదనేందుకు నిదర్శనంగా వొకర్నొకరు చూస్కున్నారు.
సుభద్రమ్మ భారంగా పక్కకు కదిలింది.
”అరె…. గంగాధరం యిప్పుడే వెళ్లాడే….. అమ్మా నేవెళ్లి వెనక్కు రమ్మంటా ఈ సంగతి చెప్పి…….. అంటూన్న మహేష్ మాటలికి వొద్దన్నట్లుగా చెయ్యి ఊపి కళ్లు తెరిచింది మెల్లగా.
తల్లికి బిడ్డ…… బిడ్డకు తల్లి…….. వొకరికొకరు ఏమి కానట్టుంటారా? ఎక్కడుంటారో ఏమోగానీ….. మన భారతదేశంలో వుండరు. అనుబంధాలు, ఆత్మీయతలు చాలా గొప్పవి. అయితే వొక్కోసారి అవి ఆస్తితో బాటు నడుస్తూంటాయా? వాటి మధ్య మనిషి జీవనం సాగిస్తుంటాడు బతికినంతకాలం. బాధల బరువుని మోస్తున్నా……….. మాతృత్వపు మమకారం జారవిడువదు. మానవ సంబంధాల్లో తల్లి మీద ప్రేమ చూపడం కూడా ఓ పెద్ద సంస్కృతిగా సాగిపోవడం కూడా మన దేశానికే తగు. కాని గంగాధరం లాటోళ్లు ఆపర్వాన్ని మార్చేస్తున్నారా?
ఏమిటో ఈ కాలపు మహిమ….. అలాంటి విషయాలవల్లే ఆధునిక యుగంలో మనిషి అభద్రతా భావంలోకి పడి పోతున్నాడు…….. అలా ఆలోచన్లు మహేష్ మనసులో అలల్లా ప్రకంపించాయి.
సుభద్రమ్మ కళ్లు ధారా వాహినులయ్యాయి. ఆ గుండెల్లో లావా లేచింది. ఆ లావాని ఏ ఫైరింజన్లూ చల్లార్చలేవు. ఒక్క చల్లని ఆత్మీయతా స్పర్శ పలకరింపు తప్ప.
నిర్మలమ్మను, మహేష్‌ని మార్చి మార్చి చూసింది. మరోలా కన్పించారు వాళ్లిద్దరూ చెదిరిన రూపాల్తో…… రెండు నిమిషాల తర్వాత గట్టిగా కళ్లు మూసుకొంది. నిర్మలమ్మ పవిట చెంగుతో కళ్లు తుడిచింది.
ఐదు నిమిషాల తర్వాత కళ్లు తెరచి, మహేష్….. భగవంతుడు కొంతమందిని, కొంత కాలంవరకే తోడు ఇస్తుంటాడు…. ఆ నిజం….. నా సంగతిలో జరిగింది……. ప్చ్…… అవన్నీ ఎందుకు గానీ……. బ్యాంకు నుంచి ఫారం తీస్కురా……. సంతకం చేస్తాను. ఆ ముప్ఫై లక్షలు డ్రా చేసి తీస్కురా….. డామ్ కట్టాలని మన పొలాన్ని తీస్కున్న గవర్నమెంటోళ్లు నష్టపరిహారంగా యిచ్చిన ఇరవై ఐదు లక్షలు….. మనం దాచుకున్న ఇరవై లక్షలు మొత్తం తీసుకురా….. అనేసి, మనసుని, జీవితాన్ని, మొత్తాన్ని ధారపోసినా కన్నబిడ్డలు కన్నోళ్లకేమిస్తున్నారు. భ్రమల్ని తప్ప….. తనలో తనే అనుకొంది. ఇది చాలా అన్యాయం…. గా మనసుకన్పించింది. ఈ విషయంలో, న్యాయం ఏ కోర్టు చెప్తుంది? ఏ తల్లిపోతుంది కోర్టుకి! ఆ తర్జన భర్జన మధ్యే, అంత డబ్బు యిప్పుడు దేనికమ్మా…… అర్థంకాక అడగనే అడిగేశాడు మహేష్.
”వీధిలో ఆ అరుపులేందిరా…..” మహేష్ మాటను దాటేసింది.
”అదా…. భూమాతను కాపాడాలంటమ్మా……… అందుకే…….”
”మాతను కాపాడ్డం తెలీని మనుషులికి భూమాతను కాపాడ్డమేంట్రా”……
సందేహంగా చూసింది. నువ్వినడం పొరపాటేమోన్నట్టుగా.
”భూమాతనేనమ్మా…. మురికినీరు, దుర్గంధాలు, పెద్ద శబ్దాలకు తోడు ప్లాస్టిక్, పాలిథీన్ సంచులతో వాతావరణం భరించలేనంతగా గలీజైౖౖపోతూ అనేక సమస్యల్తో నేలతల్లి ముప్పులపాలౌతోందని చెప్పి, వాటినెట్లా పాటుకి తేవాల్నో… వాటిని వుపయోగించుకొనే మార్గాలేమిటో చెప్తారంటమ్మా. నిన్న మందులషాపు దగ్గర ఎవరో కాగితం యిస్తే… దాన్లో వుంది ఈ సంగతి వివరంగా…”
సుభద్రమ్మ నవ్వింది. వెర్రిగా నవ్వుతుందేమిటన్నట్టుగా కలవరంగా చూశాడు మహేష్. యాభైలక్షలు ”డ్రా” చెయ్యమన్నదెందుకైనదీ చెప్పనే లేదే… అనుకొన్నాడు తనలో తనే.
అది గమనించింది సుభద్రమ్మ. బావుల్లో నీళ్లు లేకపోతే, పిల్లబావిని తవ్వాలని, ప్రాజెక్ట్ నుండి నదుల్లోకి నీళ్లొదలాలని, గాలిలోకి పొగ చేరకుండా, పొగ లేనివే అంటే సైకిళ్లు, బళ్లు లాంటివి వాడాలని వేస్ట్ అనుకొన్నవాటిని ఎరువుగా మార్చుకోవడం, ఇక ప్లాస్టిక్‌వి, పాలిథిన్ లాటివి తాళ్లుగా పేనుకోవచ్చని రాసివున్నారా కాగితాల్లో… అలా అన్నిటికీ నివారణలున్నాయి కానీ… మాతనే… కాపాడేందుకు దారేమైనా వుందా…?” అలా బేలగా వొకదానికొకటి పొంతన కూర్చి చెప్పడం చూసి, కాసేపు ఆశ్చర్యంతోబాటు అనుమానంతోడైంది మహేష్‌లో.
ప్రేమ, అభిమానం, భయం, భక్తి, బాధ్యత, కృతజ్ఞత, గౌరవం అనేవి ఏ మాత్రం బిడ్డల మనసుల్లో లేకుండా కేవలం స్వార్థంతో నిండుకొనున్న కాలుష్యాన్ని ఎలా తొలగించాలి? ఎలా తొలగిపోతుంది. తల్లి మనసుని క్షోభపెట్టడంకంటె హాని కల్గించేదేముంటుంది? పిచ్చిగా ప్రశ్నించుకొంది అంతరాత్మ.
”గంగాధరం బాబుకి, అవసరానికని యిస్తారేమోనని, ముందుగానే ఫారం తెచ్చి వుంచానమ్మా…”
”అందుకొని సంతకం చేసింది సుభద్రమ్మ వేదాంతిలా నవ్వుతూ…
”ఈపాటికి ట్రెయినెక్కేసి వుంటాడమ్మా…” అంది నిర్మలమ్మ.
”నిన్ను తీస్కెళ్లి యివ్వమని చెప్పానా?” అంది సుభద్రమ్మ.
”మరైతే… ఎందుకింత…” నసుగుతూ ఆగాడు మహేష్.
ఏమైనా సుభద్రమ్మ మనసు మహోన్నతమైంది. సున్నితమైంది. ఎంతోమందికి చేయూతగా వుంటోంది. కష్టాల కొలిమిలో కాలుతున్నవారిని బైట పడెయ్యాలని ఎన్నోసార్లు తనతో అనే వుంది. అయితే ఎప్పుడు, ఎవర్ని ఎలా బైటేస్తుందో… అందుకోసం ఏంచేస్తుందో అడిగే ధైర్యం లేదు మహేష్‌కి. కొన్నికొన్ని నేచెప్తేనే వినండి. నన్ను అడగొద్దు అని చెప్పి ఉన్న మాటలు గుర్తొచ్చాయి. చేసేది చూడండనేదీ గుర్తొచ్చి సుభద్రమ్మ కళ్లలో మెదిలే భావాన్ని సూటిగా తెల్సుకోలేక ఫారాన్ని, పేనాను చేతికందించాడు.
(2010 భూమిక కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించింది)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ఓపెనవటం లేదు.