ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్‌తో ‘తెహెల్కా’ కోసం ‘షోమా చౌదరి’ చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగు పాఠకుల కోసం…
దేశవ్యాప్తంగా హింసా వాతావరణం పెరుగుతోంది. ఈ సంకేతాలను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? వీటిని ఏ నేపథ్యంలో చూడాలి?
సంకేతాలను అర్థం చేసుకోవటానికి ఒకరు తెలివైన వాళ్ళే, ప్రతిభావంతులే కానవసరం లేదు. తీవ్ర వినియోగదారీతత్వం, పేరాశ మీద పెరుగుతున్న మధ్యతరగతి మనకుంది. పాశ్చాత్య దేశాలు పారిశ్రామికీకరణ చెందుతున్న దశలో వనరులను దోచుకోటానికి, ఈ ప్రక్రియకు బానిసల శ్రమను అందచెయ్యడానికీ వలస ప్రాంతాలు ఉండేవి. కాని మనకి అలా కాదు. మనం మనల్నే వలస ప్రాంతాలుగా చేసుకోవాలి, మనఅట్టడుగు ప్రాంతాలను ఆక్రమించుకోవాలి. మన కాళ్ళను మనమే తినటం మొదలు పెట్టాం. ఇప్పుడు ప్రేరేపింపబడుతున్న పేరాశ (దీనిని ఒక విలువగా, జాతీయవాదానికి పర్యాయపదంగా ప్రచారం చేస్తున్నారు) బలహీనులనుంచి భూమి, నీరు, వనరులను లాక్కుంటేగానీ తీరదు. మనం ఇప్పుడు స్వాతంత్య్రం తరువాత జరుగుతున్న అత్యంత విజయవంతమైన వేర్పాటు ఉద్యమానికి సాక్షులుగా ఉన్నాం – మధ్య, ఎగువ తరగతి ప్రజలు మిగిలిన దేశం నుంచి వేరుపడుతున్నారు. ఇది ఒక నిట్టనిలువు చీలిక, అడ్డంగా జరుగుతున్న చీలిక కాదు. అక్కడెక్కడో ఆకాశంలో ఉన్న ప్రపంచ సంపన్న వర్గాలతో కలవటానికి వాళ్ళు పాకులాడుతున్నారు. తమకు కావలసిన వనరులు, బొగ్గు, ఖనిజాలు, బాక్సైట్, నీళ్ళు, విద్యుత్తు వంటివి సాధించుకోగలిగారు. ఇప్పుడు వాళ్ళకి మరిన్ని కారులు, మరిన్ని బాంబులు, మరిన్ని గనుల కోసం భూములు కావాలి. – ఇవన్నీ కొత్త అగ్రరాజ్యంలోని, కొత్త అగ్రపౌరులకు పెద్ద పెద్ద ఆటవస్తువులు. కాబట్టి ఇది ఒక యుద్ధమే – రెండు వైపులా ఉన్న వాళ్ళు తమ ఆయుధాలను ఎన్నుకొంటున్నారు. వ్యవస్థాగత మార్పులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అనుకూలమైన కోర్టు ఆదేశాలు, అనుకూలమైన విధాన నిర్ణేతలు, ‘సన్నిహితులైన’ కార్పొరేట్ మీడియా నుంచి సహాయం వీటన్నింటిని ప్రజల గొంతుకల్లోకి బలవంతంగా నెట్టే పోలీసు దళం వంటి వాటిని ప్రభుత్వాలు, కార్పోరేషన్లు ఎంచుకుంటున్నాయి. వీటిని వ్యతిరేకించాలని అనుకుంటున్న వాళ్ళు ఇప్పటి వరకు ధర్నాలు, నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు, కోర్టులు, సహాయంగా ఉంటుందని వాళ్ళు అనుకున్న మీడియాను ఎంచుకున్నారు. కాని ఇప్పుడు ఇంకా ఎక్కువమంది తుపాకులను అందుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. హింస పెరుగుతుందా? ప్రజల ప్రగతి, వాళ్ళ సంక్షేమాన్ని కొలవటానికి ‘వృద్ధిశాతం’, సెన్సెక్స్‌లు మాత్రమే ప్రభుత్వం ఉపయోగించే కొలబద్దలైతే హింస పెరుగుతుందనటంలో సందేహం లేదు. ఈ సంకేతాలను నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను? ఆకాశంలో రాసి ఉంది చదవటం ఏమంత కష్టం కాదు. అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ‘పెంట ఫ్యానును తాకింది నాయనా’ అని రాసి ఉంది.
మీరు స్వయంగా హింసకు పూనుకోకపోయినా దేశంలో పరిస్థితులరీత్యా దానిని ఖండించటం అనైతికం అవుతుందని మీరు ఒకసారి అన్నారు. ఈ దృక్పథాన్ని కొంచెం వివరిస్తారా?
నేను గెరిల్లాగా మారితే ఒక పెద్ద భారమవుతాను! ‘అనైతికం’ అన్న పదాన్ని ఉపయోగించినట్లు గుర్తుకురావటం లేదు. – నైతికత అన్నది చేతికి చిక్కేది కాదు, వాతావరణం లాగా నిరంతరం మారుతూ ఉంటుంది. నా అభిప్రాయాలు ఇవి : ఈ దేశంలోని అన్ని ప్రజాస్వామిక. సంస్థల తలుపునీ అహింసాపూరిత ఉద్యమాలు కొన్ని దశాబ్దాలపాటు తడుతూనే ఉన్నాయి. వాళ్ళకి చివరికి మిగిలింది తిరస్కారం, అవమాన భారాలే. భోపాల్ గ్యాస్ పీడితుల్ని, నర్మదా బచావో ఆందోళనని చూడండి. నర్మదా బచావో ఆందోళనకి అనుకూలంగా ఎన్నో అంశాలు ఉన్నాయి – ప్రముఖ నాయకత్వం, పతిక్రలలో వార్తలు రావటాలు, ఇతర ఏ ప్రజా ఉద్యమానికి లేనన్ని వనరులు దీనికి ఉన్నాయి. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? తమ వ్యూహాలను పునరాలోచించుకోవాలన్న భావం ప్రజలకు తప్పకుండా కలుగుతుంది. దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక ఫోరం ఎదుట సత్యాగ్రహాన్ని సోనియాగాంధి ప్రోత్సహించటం మొదలుపెడుతుంది. మనం చేతనులమై ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఉదాహరణకు ప్రజాస్వామిక జాతీయ ప్రభుత్వ నిర్మాణంలో పెద్ద ఎత్తున సహాయ నిరాకరణోద్యమానికి అవకాశం ఉందా? ప్రసారసాధనాలన్నీ కార్పొరేట్ సంస్థల ద్వారా నియంత్రించబడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ఈ కాలంలో ఇటువంటిది సాధ్యమా? నిరాహార దీక్షలకు, ప్రజాదరణ రాజకీయాలకు ఏదైనా అవినాభావ సంబంధం ఉందా? నంగ్లా మచ్చి లేదా భట్టి గనుల ప్రజలు నిరాహారదీక్షకు కూర్చుంటే ఎవరికైనా పడుతుందా? ఇమాం షర్మిలా ఆరు సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తోంది. ఇది మనలో చాలామందికి గుణపాఠంలాంటిది. రోజూ ఎంతోమంది ఆకలికి మాడే ఈ దేశంలో నిరాహారదీక్షను రాజకీయ ఆయుధంగా ఎంచుకోవటం నాకు హాస్యస్పదమనిపిస్తుంది. ప్రస్తుతం మనం మరో స్థానంలో, మరో కాలంలో ఉన్నాం. మనం పోరాడుతున్న ప్రత్యర్థి కూడా ఎంతో భిన్నమూ, సంక్లిష్టమూ అయినవాడు. మనం ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల యుగంలో ఉన్నాం – దీనిని పెంపుడు పులుల యుగం అని కూడా అనవచ్చు – ఇక్కడ ప్రజాచర్య అన్నది ఒక కుట్రపూరిత వ్యాపారం కావచ్చు. మనకి ఇప్పుడు ప్రదర్శనలకి నిధులు అందుతున్నాయి, ధర్నాలకి స్పాన్సర్లు ఉన్నారు. సోషల్ ఫోరాలు చాలా తీవ్రవాద భంగిమలు పెడతాయి; కాని అవి చెప్పినవి జరుగుతున్నాయో లేదో పట్టించుకోవు. అన్ని రకాల సైబర్ (వర్చువల్) తిరుగుబాట్లు మనకున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ళను ప్రోత్సహించే బడా సంస్థే వాటికి వ్యతిరేక సమావేశాలను స్పాన్సరు చేస్తుంది. జీవావరణ వ్యవస్థల సమూల నాశనానికి కారణమయిన కార్పోరేషన్ల పర్యావరణ యాక్టివిజానికి, ప్రజల కార్యాచరణకు నిధులు, బహుమతులు ఇస్తుంటాయి. ఒరిస్సా అడవులలో బాక్సైట్ గనులను తవ్వే వేదాంత అనే కంపెనీ ఒక విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టాలని అనుకుంటోంది. దేశవ్యాప్తంగా కార్యకర్తలకు, ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులు సమకూర్చటానికి టాటా సంస్థలకి రెండు దాతృత్వ ట్రస్టులు ఉన్నాయి. అందుకేనా నందిగ్రాంతో పోల్చుకుంటే సింగూరుపై వ్యతిరేకత అంత ఎక్కువగా లేదు? టాటాలు, బిర్లాలు గాంధీకి కూడా నిధులు సమకూర్చారన్నది వాస్తవమే – బహుశా అతడే మన మొదటి స్వచ్ఛంద సంస్థ అయ్యుండాలి. కాని ఇప్పుడు మనకున్న స్వచ్ఛంద సంస్థలు ఎంతో అల్లరి చేస్తాయి, ఎన్నో నివేదకలు తయారుచేస్తాయి. వీటితో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దీనినంతటినీ ఎలా అర్థం చేసుకుంటాం? నిజమైన రాజకీయ చర్యలను నీరుగార్చే నిపుణులతో దేశమంతా నిండిపోయింది. సైబర్ (వర్చువల్) తిరుగుబాట్లు భారమైనవిగా పరిణమించాయి.
ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు న్యాయంకోసం కోర్టుల వైపు చూసేవి. కానీ ఇటీవల కాలంలో పేదలను అవమానించే, పేదలకు అన్యాయం చేసే తీర్పులను కోర్టులు వెలువరించాయి; కోర్టు మాటల్లోనే చెప్పాలంటే ఇవి నోట మాట రాకుండా చేస్తాయి. తగిన ఆమోద పత్రాలు లేకుండానే వసంత్ కుంజ్ మాల్ నిర్మాణాన్ని కొనసాగించ వచ్చని తీర్పుని ఇస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కార్పోరేషన్లు అవకతవకలకు పాల్పడే ప్రసక్తి లేదు అన్న అర్థం వచ్చే మాటలను ఉపయోగించింది! కార్పొరేట్ ప్రపంచీకరణ, కార్పోరేట్ భూ ఆక్రమణల ఈ కాలంలో, ఎన్రాన్, మాన్‌శాంటోలు, హాల్లిబర్టన్, బెచైల్‌ల కాలంలో ఈ రకమైన వ్యాఖ్య కోర్టునుంచి రావడం ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది. దేశంలో అత్యంత బలమైన సంస్థ సైద్ధాంతిక దృక్పథాన్ని ఇది తెలియచేస్తుంది. కార్పోరేట్ పత్రికారంగంతో పాటు న్యాయ వ్యవస్థ నయా సరళీకృత పథకానికి గుండెకాయలా పనిచేస్తుంది.
ఇటువంటి పరిస్థితులలో అంతులేని ‘ప్రజాస్వామిక’ ప్రక్రియలతో ప్రజలు అలసి, సొలసి పోయి చివరికి అవమానాలే గతి అయితే వాళ్ళు ఏం చేయాలి? ప్రజల ముందున్నది అహింస, హింస అన్న రెండే మార్గాలు కాదనుకోండి. తమ మొత్తం రాజకీయ ఎత్తుగడలలో ఒక భాగంగా సాయుధ పోరాటాన్ని నమ్మే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ పోరాటాల్లోని రాజకీయ కార్యకర్తలను తప్పుడు అభియోగాల మీద జైళ్ళపాలు చేశారు, దారుణంగా హింసించారు, చంపేశారు. ఆయుధాలను చేపట్టడం అంటే భారత రాజ్యపు వివిధ హింసా రూపాలను ఆహ్వానించటమేనని ప్రజలకి తెలుసు. సాయుధ పోరాటం మొదలైన మరుక్షణం నీ ప్రపంచం ఎంతో కుంచించుకుపోతుంది, రంగులన్నీ మాయమై నలుపు, తెలుపు మాత్రం మిగులుతాయి. మిగిలిన అన్ని అవకాశాలు నిరాశనే మిగల్చగా చివరికి ఈ మార్గాన్ని ఎన్నుకున్న ప్రజలను మనం ఖండిద్దామా? నందిగ్రాం ప్రజలు ధర్నాలు చేసి పాటలు పాడి ఉంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉండేదని ఎవరైనా నమ్ముతున్నారా? మనం నివసిస్తున్న ప్రస్తుత కాలంలో అశక్తంగా వుండటమంటే యథాతథస్థితిని సమర్థించటమే. (నిశ్శంసయంగా ఇది మనలో కొంతమందికి చాలా అనుకూలమైనదే.) ప్రభావవంతంగా ఉండాలంటే ఎంతో మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ మూల్యం చెల్లించటానికి సిద్ధపడిన ప్రజలను నేను ఖండించలేకపోతున్నాను.
మీరు పల్లెల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇటీవల మీరు వెళ్ళిన సమస్యాత్మక ప్రాంతాలు ఏవి? ఇక్కడ పోరుకి ఇరువైపులా ఉన్నది ఎవరు?
చాలా పెద్ద ప్రశ్న – ఏం జవాబు చెప్పగలను? కాశ్మీరులో మిలటరీ ఆక్రమణ, గుజరాత్‌లో నయాఫాసిజం, ఛత్తీస్‌గఢ్‌లో పౌర యుద్ధం, ఒరిస్సాని దోచుకొంటున్న బహుళజాతి సంస్థలు, నర్మదా లోయలో మునిగిపోతున్న వందలాది గ్రామాలు, ఆకలి దప్పుల అంచున బతుకుతున్న ప్రజలు, అటవీ భూముల వినాశనం, డోవ్ కెమికల్స్‌గా పేరు మార్చుకున్న యూనియన్ కార్బైడ్‌ని నందిగ్రాంకి తీసుకురావటానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పడుతున్న తాపత్రయాన్ని చూడటానికి, బతికున్న భోపాల్ గ్యాస్ బాధితులు. ఇటీవల కాలంలో నేను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళలేదు. కాని అక్కడ వేలాదిగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లోని బూటకపు ఎన్‌కౌంటర్లు, దారుణ అణచివేత గురించి మనకు తెలుసు. ఈ ప్రాంతాలన్నింటికీ తమదైన జీవావరణం, ఆర్థిక పరిస్థితి, చరిత్ర ఉన్నాయి. దేనినీ అంత తేలికగా విశ్లేషించలేం. అయినా వీటన్నిటిని కలిపే దారం ఒకటి ఉంది – వీరందరిపై అతిపెద్ద విషం వ్యాపింపజేస్తూ మరోసారి పేలటానికి సిద్ధంగా ఉన్న హిందూత్వ పథకం గురించి మాట్లాడకుండా ఎలా ఉండను? అన్నిటికంటే దారుణమైన విషయమేమిటంటే ఇప్పటికీ అస్పృశ్యత అన్న భావనను ఆచరించి, పోషించి, కొనసాగిస్తున్న సమాజం, సంస్కృతి, దేశం మనది. అభివృద్ధి శాతం గురించి గొప్పలు చెబుతూ మన ఆర్థిక వేత్తలు అంకెలు వల్లిస్తూ ఉంటే ఇంకోవైపున పదిలక్షల మంది ప్రజలు పారిశుద్ధ్యం పనులు చేసేవాళ్ళు – ఇతరుల పియ్యని రోజూ తమ నెత్తిమీద మోయటం ద్వారా తమ జీవికను ఆర్జించుకుంటున్నారు. ఈ పని చెయ్యకపోతే వాళ్ళు ఆకలికి మాడి చావాల్సిందే. అంత బాగా ఉంది మన అగ్రరాజ్య పరిస్థితి.
ఇటీవల బెంగాల్‌లోని రాజ్యహింస, పోలీసుల హింసను ఎలా చూడాలి?
ఇతర ప్రాంతాలలోని రాజ్యహింస, పోలీసుల హింస కంటే భిన్నంగా ఏం లేదు. అన్ని రాజకీయపార్టీలకు మాదిరే ప్రధాన స్రవంతిలో ఉన్న వామపక్షాలు కూడా ద్వంద్వవైఖరి, రెండు నాల్కల ధోరణిలో ఆరితేరాయి. పెట్టుబడిదారీ బుల్లెట్లకూ, కమ్యునిస్టు బుల్లెట్లకూ ఏమైనా తేడా ఉంటుందా? చాలా వింత ఘటనలు జరుగుతున్నాయి. సౌది అరేబియాలో మంచు కురిసింది. పట్టపగలు గుడ్లగూబలు సంచరిస్తున్నాయి. వ్యక్తిగత ఆస్తి హక్కును కల్పించే బిల్లును చైనా ప్రభుత్వం రూపొందించింది. వాతావరణ మార్పులకీ ఈ పరిణామాలకీ ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు. 21 వ శతాబ్దంలో అతి పెద్ద పెట్టుబడిదారులుగా చైనా ప్రభుత్వం అవతరించేటట్లు ఉంది. మనదేశంలో పార్లమెంటరీ పంథాని అనుసరిస్తున్న వామపక్షాలు ఇంతకంటే భిన్నంగా ఉంటాయని ఎలా ఆశిస్తాం? నందిగ్రాం, సింగూరు స్పష్టమైన సంకేతాలను పంపిస్తున్నాయి. ప్రతి విప్లవపు చివరి మజిలీ ఆధునిక పెట్టుబడిదారీ విధానమేనా అన్న అనుమానాన్ని ఇది కలిగిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి – ఫ్రెంచి విప్లవం, రష్యా విప్లవం, చైనా విప్లవం, వియత్నాం యుద్ధం, జాత్యహంకార వ్యతిరేక పోరాటం, గాంధేయ స్వాతంత్య్ర పోరాటం అని చెప్పుకున్న భారతదేశంలో – ఇవన్నీ చివరికి చేరుకున్న మజిలీ ఏది? మన ఊహలన్నీ అంతమైపోయాయా?
బిజాపూర్‌లో మావోయిస్టుల దాడిలో 55 మంది పోలీసులు చనిపోయారు. తిరుగుబాటుదార్లను రాజ్యానికి ఆవలిముఖంగా పేర్కొనవచ్చా?
తిరుగుబాటుదార్లు రాజ్యానికి ఆవలి ముఖం ఎలా అవుతారు? జాత్యహంకారంపై పోరాడిన వారిని – వాళ్ళ పద్ధతులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ – రాజ్యానికి ఆవలిముఖమని ఎవరైనా అనగలరా? అల్జీరియాలో ఫ్రెంచిపై పోరాడిన వారి సంగతి ఏమిటి? లేదా నాజీలపై పోరాడిన వారి సంగతేమిటి? వలస పాలకులపై పోరాడిన వారి సంగతి ఏమిటి? లేదా ఇరాక్‌లో అమెరికా ఆక్రమణపై పోరాడుతున్న వారి మాటేమిటి? వీరు రాజ్యానికి ఆవలి ముఖమా? నివేదికల ఆధారంగా పైపైన చేసే ‘మానవ హక్కుల’ చర్చలు, అర్థరహితమైన ఖండనలు చెయ్యమనే వత్తిళ్ళ ఫలితంగా మనందర్ని కూడా రాజకీయ నాయకులుగా మార్చివేస్తోంది. అన్నింటి నుండి నిజమైన రాజకీయాలను నీరుకారుస్తోంది. మనం ఎంత పవిత్రులమైనా కావచ్చు, మన కిరీటాలకు ఎంతైనా మెరుగు పెట్టుకోవచ్చు. అయితే విషాదం ఏమిటంటే సరైన పరిష్కారాలు ఇప్పుడు మనకి గోచరించటం లేదు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూపొందించి, బలపరుస్తున్న పౌరయుద్ధం ఇప్పుడు చత్తీస్‌గఢ్‌లో రేగుతోంది. మీరు మా పక్షాన లేకపోతే తీవ్రవాదుల పక్షాన ఉన్నట్లే అన్న బుష్ విధానాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బహిరంగంగా అనుసరిస్తోంది. ఈ యుద్ధంలో ప్రభుత్వ భద్రతాదళాలు కాకుండా ప్రధాన పాత్రను పోషిస్తోంది సాల్వాజుడుం – ప్రభుత్వ మద్దతు ఉన్న ప్రజాసైన్యం ఇది; ఆయుధాలు చేపట్టమని, ప్రత్యేక పోలీసు అధికారులు అవ్వమని సాధారణ ప్రజలను ప్రభుత్వం వత్తిడి చేస్తోంది. కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లో భారత ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించింది/అనుసరిస్తోంది. వేలాదిమంది చనిపోయారు, లక్షలాదిమంది చిత్రహింసలకు గురయ్యారు, వేలాదిమంది కనపడకుండా పోయారు. ఉత్తుత్తి గణతంత్రమైన ఏ దేశమైనా ఈ రికార్డుని చూసి గర్వపడేది. విఫలమైన ఈ వ్యూహాలను ప్రభుత్వం ఇప్పుడు దేశం నడిబొడ్డున అమలు చెయ్యచూస్తోంది. ఖనిజ సంపదలకు నిలయమైన తమ భూముల నుంచి వేలాది ఆదివాసీలను తొలగించి అక్కడ పోలీసు శిబిరాలు ఏర్పాటు చేశారు. వందలాది గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించారు. ఇనుప ఖనిజం అధికంగా ఉన్న ఈ భూములపై టాటా, ఎస్సార్ వంటి కార్పొరేషన్లు కన్నువేశాయి. అవగాహన పత్రాలపై సంతకాలు జరిగిపోయాయి. కానీ వాటిల్లో ఏముందో ఎవరికీ తెలియదు. భూసేకరణ మొదలయ్యింది. ఇటువంటిది కొలంబియా వంటి దేశాల్లో లోగడ జరిగిందే (ప్రపంచంలోకెల్లా అత్యంత వినాశనానికి గురయిన దేశం కొలంబియా) ప్రభుత్వ మద్దతు ఉన్న మలేషియా, గెరిల్లా దళాల మధ్య పెరుగుతున్న హింసపై అందరి దృష్టి కేంద్రీకరింపబడి ఉండగా బహుళజాతి కార్పోరేషన్లు మెల్లగా ఖనిజ సంపదను కొల్లగొట్టేస్తూ ఉంటాయి. ఛత్తీస్‌గఢ్ నాటకరంగంపై వెయ్యడానికి మనకందించిన స్టెప్పు ఇదే.
55 మంది పోలీసులు చనిపోవటం దారుణమైన విషయం అనటంలో సందేహంలేదు. ఇతరుల విధానాల వల్లనే కాకుండా ప్రభుత్వ విధానాల ఫలితంగా కూడా వాళ్ళు బలయ్యారు. ప్రభుత్వానికి, కార్పోరేషన్లకీ వాళ్లు మందు గుండు మాత్రమే. వాళ్ళ వంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఈ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. మొసలి కన్నీరు కారుస్తారు, చక్కగా సింగారించుకున్న టీవీ యాంకర్లు మనల్ని కొంతకాలం మభ్యపెడతారు, కొంతకాలానికి మరికొంతమందిని చనిపోయిన వారి స్థానంలో సమకూరుస్తారు. తాము చంపిన పోలీసులు, ప్రత్యేక పోలీసు అధికారులు మావోయిస్టుల దృష్టిలో భారత రాజ్యం యొక్క సాయుధ అంగాలు; అణచివేత, చిత్రహింసలు, నిర్బంధంలో హత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లు కొనసాగించే ప్రధాన పాత్రధారులు. ఏ రకంగానూ వాళ్ళు అమాయక పౌరులు మాత్రం కానేకాదు. (అటువంటి వాళ్ళు అసలంటూ ఉంటే)
భీభత్సాన్ని, బలప్రయోగాన్ని తీసుకువచ్చే అవకాశం మావోయిస్టులకు ఉందనటంలో నాకు సందేహం లేదు. మాటలకందని ఘోరాలను వాళ్ళు చేశారనటంలో నాకు సందేహం లేదు. ప్రజల మద్దతు తమకు మాత్రమే ఉండాలని వాళ్ళు అనుకోవటం తప్పనటంలో నాకు సందేహం లేదు. ప్రజల అవిభాజ్య మద్దతు ఎవరికి మాత్రం లభిస్తుంది? అయితే ఏ గెరిల్లా సైన్యమూ స్థానిక ప్రజల మద్దతు లేకుండా మనలేదనటంలో సందేహం లేదు. తర్కబద్దంగా అది అసాధ్యం. మావోయిస్టులకు మద్దతు పెరుగుతోంది, కాని తగ్గటంలేదు. ఇది చాలా విషయాలను వెల్లడిచేస్తోంది. ఉన్న వాటిల్లో తక్కువ ప్రమాదకరమయిన దానితో కలిసి పనిచెయ్యటం తప్పించి ప్రజలకు మరో మార్గం లేదు.
అయితే ఒక తీవ్ర అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక తిరుగుబాటు ఉద్యమాన్ని ఆ అన్యాయానికి కారణభూతమైన ప్రభుత్వంతో పోల్చటం అర్థరహితమైనది. అహింసాయుత ప్రతిఘటనకు ఉన్న అన్ని తలుపులను ప్రభుత్వ మూసివేసింది. ప్రజలు ఆయుధాలు చేతబట్టినప్పుడు అన్ని రకాల హింసలుంటాయి – విప్లవాత్మకమైనవి, అరాచకమైనవి, పచ్చి నేరపూరితమైనవి. తాను సృష్టించిన భయానక పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
‘నక్సల్స్’, ‘మావోయిస్టులు’, ‘బయటివాళ్ళు,’ వీటిని ప్రస్తుతం ఒకదానికి బదులు ఒకటి పర్యాయపదంగా వాడుతున్నారు.
తమ ప్రచారాన్ని తామే నమ్ముతూ, తమ ప్రజలే తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని నమ్మలేని ప్రభుత్వం అణిచివేత తొలిదశలో ‘బయటివాళ్ళు’ అన్న సాధారణ నిందను ఉపయోగిస్తుంది. బెంగాల్‌లో ప్రస్తుత సిపిఎం పరిస్థితి ఈ దశలో ఉంది. అయితే బెంగాల్‌లో రాజ్యహింస కొత్త ఏమీ కాదనీ, ఇప్పుడు అది తీవ్రతరమయ్యిందనీ అంటారు. అయినా, బయటి వాళ్ళు అంటే ఎవరు? ఎవరు సరిహద్దులను నిర్ణయిస్తారు? అవి గ్రామ సరిహద్దులా? మండలమా? తాలూకానా? జిల్లానా? రాష్ట్రమా? సంకుచిత ప్రాంతీయ, జాతి రాజకీయాలు కొత్త కమ్యూనిస్టు మంత్రమా? ఇక నక్సల్స్, మావోయిస్టుల గురించి; భారతదేశం పోలీసు రాజ్యం కానున్నది. ఇక్కడ జరుగుతున్న దానితో విబేధించే వారు ఎవరైనా తీవ్రవాదులని పిలవబడే ప్రమాదముంది. ఇస్లామిక్ తీవ్రవాదులు ఇస్లాం మతానికి చెందినవారై వుండాలి. కాబట్టి మనలో చాలామందిమి దాని కిందకు రాము. కాబట్టి మనల్నందరినీ పట్టుకునే వల కావాలి. కాబట్టి ఆ పదాన్ని అస్పష్టంగా, నిర్వచించకుండా వదిలివేసే విధానం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మనల్నందరినీ నక్సలైట్లని, మావోయిస్టులని, తీవ్రవాదులనీ, లేదా తీవ్రవాద సానుభూతిపరులనీ ముద్రవేసే రోజు ఎంతో దూరంలో లేదు. మావోయిస్టులు, నక్సలైట్లు, అంటే ఎవరో తెలియని వాళ్ళు లేదా ఎవరైందీ పట్టించుకోని వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు. ఈ ప్రక్రియ పల్లెల్లో ఇప్పటికే మొదలయ్యింది. రాజ్యాన్ని కూలదొయ్యటానికి ప్రయత్నించిన తీవ్రవాదులన్న అభియోగంతో దేశవ్యాప్తంగా వేలాదిమంది జైళ్ళల్లో వున్నారు. అసలు నక్సలైట్లు, మావోయిస్టులు ఎవరు? ఈ విషయం గురించి నాకు మొత్తం తెలుసని కాదు. కాని క్లుప్తంగా వాస్తవమిది.
భారత కమ్యునిస్టు పార్టీ, సిపిఐ, 1925లో ఏర్పడింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) (దీనినే సిపిఎం అంటున్నాం.) 1964లో సిపిఐ నుంచి వేరుపడి కొత్త పార్టీగా రూపొందింది. రెండూ పార్లమెంటరీ ప్రజాస్వామిక పార్టీలే. 1967 లో కాంగ్రెసులోని ఒక చీలిక వర్గంతో సిపిఎం పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని రైతాంగం కరువు, ఆకలి పీడితులై పెద్ద ఎత్తున ఉద్యమించసాగారు. స్థానిక సిపిఎం నాయకులైన కానూ సన్యాల్, చారుమజుందార్ నక్సల్‌బరీ జిల్లాలో రైతాంగ తిరుగుబాటుకి నాయకత్వం వహించారు. నక్సలైట్లు అన్న పదం అక్కడి నుంచే వచ్చింది. 1969లో ఆ ప్రభుత్వం పడిపోయి సిద్దార్థ శంకర్‌రే నాయకత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. నక్సలైట్ల తిరుగుబాటును దారుణంగా అణచివేశారు. ఆ రోజుల గురించి మహాశ్వేతాదేవీ తన రచనల్లో బాగా వెల్లడిచేశారు. 1969లో సిపిఎం నుంచి సిపిఐ (ఎంఎల్) మార్క్సిస్ట్, లెనినిస్ట్ వేరుపడింది. కొన్ని సంవత్సరాల తరువాత 1971 ఆ ప్రాంతంలో సిపిఐ (ఎంఎల్) అనేక పార్టీలుగా విడిపోయింది. సిపిఐ-ఎంఎల్ (లిబరేషన్) ప్రధానంగా బీహార్లో కేంద్రీకృతమయ్యింది. సిపిఐ-ఎంఎల్ (న్యూడెమోక్రసీ) ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బీహార్‌లోనూ పనిచేస్తోంది. సిపిఐ-ఎంఎల్ (క్లాస్‌స్ట్రగల్) ప్రధానంగా బెంగాల్‌లో పనిచేస్తుంది. ఈ పార్టీలన్నింటినీ నక్సలైట్లు అన్న సాధారణ పేరుతోనే వ్యవహరిస్తారు. వీళ్ళు తమని తాము మార్క్సిస్టు, లెనినిస్ట్‌గా పేర్కొంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే మావోయిస్టులు కాదు. వీళ్ళు ఎన్నికల్లోనూ, ప్రజాచర్యలోనూ నమ్ముతారు – తప్పనిసరి అయినప్పుడు, దాడికి గురయినప్పుడు మాత్రమే సాయుధపోరాటానికి దిగుతారు. ఎంసిసి – మావోయిస్టు కో ఆర్డినేషన్ సెంటర్ 1968లో ఏర్పడి అప్పట్లో ప్రధానంగా బీహార్‌లో కేంద్రీకృతమై ఉంది. పీపుల్స్‌వార్, పిడబ్ల్యు, 1980లో ఏర్పడింది. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేది. ఇటీవల అంటే 2004లో యంసిసి, పిడబ్లు కలిసి సిపిఐ (మావోయిస్ట్)గా ఏర్పడ్డాయి. వీళ్ళు సాయుధ పోరాటంలోనే విశ్వసిస్తారు, రాజ్యాన్ని కూలదొయ్యాలంటారు. వీళ్ళు ఎన్నికలలో పాల్గొనరు. బీహార్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలో గెరిల్లా పోరాటం చేస్తున్నది ఈ పార్టీయే.
భారత రాజ్యమూ, ప్రసార సాధనాలు మావోయిస్టులను ‘అంతర్గత భద్రతా ముప్పు’గా పేర్కొంటాయి. వారిని ఈ దృష్టికోణం నుంచి చూడటం సరైనదేనా?
ఈ విధంగా అనుకోవడం మావోయిస్టులు మాత్రం గర్వకారణంగా భావిస్తారని నా నమ్మకం.
మావోయిస్టులు రాజ్యాన్ని కూలదోయాలని అంటారు. వాళ్ళు నమ్మే సిద్ధాంతం మూలాలు నియంతృత్వ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ పాలన ఎలా ఉంటుంది? వాళ్ళ పాలన కూడా దోపిడీతో, నియంతృత్వంగా, హింసాపూరితంగా ఉండదా? ఇప్పటికి వాళ్ళ చర్యలు సాధారణ ప్రజలను దోపిడికి గురిచెయ్యటం లేదా? సాధారణ ప్రజల మద్దతు నిజంగా వాళ్ళకి ఉందా?
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags