ఎం. శ్రీధర్
గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామిక శక్తులు మరణించాయి, కాకపోతే మిస్సింగ్ అయ్యాయి. నిరంతరాయంగా తెలంగాణా కొరకు జరుగుతున్న ఆత్మహత్యలు దానికి నిదర్శనం. ఇన్ని ఆత్మహత్యలు జరిగినా మనం చలించకుండా వున్నామంటే, మనం అతీత శక్తులమైనా అవ్వాలి లేదా విలువలులేనివారమైనా అవ్వాలి. ప్రజాతంత్ర శక్తుల ‘నిశ్శబ్దం’ యీ రెండు కూడా వాస్తవాలని నిరూపిస్తుంది. ఇంకేమి ఆధారాలు కావాలి? ఒకవేళ ఇవి మరణించి ఉండకుంటే, వీనిని ఎవరు వెతికి తెస్తారు? ఇకనైనా ‘నిశ్శబ్దాన్నుండీ’ బయటపడుదాం.
తెలంగాణా కోసం సమిధలైన వారిని రాజకీయాల కోసమే స్మరించుకోవడానికి పరిమితమవ్వకుండా, వానిని ప్రజాతంత్ర ప్రపంచానికి వెల్లడిచేసి ప్రశ్నిద్దాం. ఏడు వందలకు పైగా అసువులు కోల్పోయిన కుటుంబాల గురించి, అంతకన్నా లెక్కకు మించిన అరెస్ట్‌ల గురించి, వాని కుట్రల గురించి మాట్లాడుకుందాం. సంఘర్షణల్లో సంవాదం లోపించి వాద-ప్రతివాద దాడుల్లో సమస్యను దాటవేస్తున్న సందర్భంలో కొట్టుకుపోకుండా, బహిరంగంగా అమరత్వం అంటే, సమైక్య-విమోచన ద్వయాల పరిమితుల గురించి మాట్లాడుకుందాము.
స్థూలంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత రాష్ట్రంలోని, తెలంగాణా ప్రాంతంలోని అన్ని ప్రజాస్వామిక సంఘాలకు సంఘీభావం చేకూరింది. ఇది ఒక రకమైన ఏకాభిప్రాయం అనుకుంటే, తెలంగాణా గురించిన ఆవశ్యకత, వ్యతిరేక ఆలోచనలు తెలంగాణా ఏర్పాటు సమాజంలో పాతుకుపోయిన అనేక రకాల రుగ్మతలకు సంజీవిని అని భావిస్తున్నాయి. నిజానికి అలాంటి దొడ్డిదారులు (షార్ట్ కట్స్) ఏమి లేవు. అలా తెలిసి చేసిన, తెలియక చేసిన తెలంగాణా ప్రజాస్వామిక హక్కును ప్రక్కద్రోవ పట్టించినవారమే అవుతాం. ఇలాంటి ఆలోచనలు విచక్షణను చంపేసి, దౌర్బల్యాన్ని పెంచి ఆత్మహత్యలకు కారణాలయ్యాయి. ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం, రోజు క్రమం తప్పకుండా దినపత్రికలలో తెలంగాణకు సంబంధించి ఎవరో, ఒకరికంటే ఎక్కువగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సవివరంగా, ఇంకా కొన్ని సందర్భాలలో డాక్యుమెంటరీలతో సహా, వార్తలు వస్తూనే వున్నాయి. యీ విషయంలో మన మీడియాముందు పీప్లి లైవ్ సినిమా దిగదుడుపే. చాలా సందర్భాలలో సూసైడ్ నోటులను కూడా యదాతథంగా ప్రచురించారు. దీనిని కొందరు రాజకీయపార్టీలు తెలంగాణావాదం కొరకు వుపయోగించుకొన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియతత్వంను ప్రశ్నించడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఇంకొంతమంది ముందుకు వెళ్లి తమ మానసిక వికారాన్ని ప్రదర్శించుకున్నారు. అవి ఆత్మహత్య చేసుకున్నవారు రాయలేదు అని, (ఆత్మహత్యలే కాదు అనలేదు). సమైక్య వాదమనే ముసుగులో ప్రజాతంత్ర విలువలను నాశనము చేయడం కోసం, ధ్వంసం చేయడం కోసం పుట్టిన అవకాశవాదం. తరతరాల కుల అహంకారాన్ని, అగ్రకుల ఆధిపత్యాన్ని, కుటిల ఆక్రమణ వాదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ముందుకు తెచ్చినది. చాలావరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలూ, వాటి అనుబంధ టీవీ ఛానల్లు, ఇంకా దుర్మార్గమైన టీవీ 9 సృష్టించినవి. బాలన్సు/సమ అభిప్రాయాలు పేరుతో, అన్యాయం, ఆక్రమణలు కాకుండా వార్తల సంఖ్యకు దానిని కుదించి అత్యంత దుర్మార్గమైన అభిప్రాయాలను, కనీస ప్రజాస్వామిక దొరని లేని వాక్యాలను సంచలనాల పేరుతో అభిప్రాయాల సమతూకం పేరుతో ప్రచురితం, ప్రస్సారం చేసి దౌర్బల్యకరమైన స్వభావాలను పెంచి ఆత్మహత్యలకు కారణమయ్యాయి.
అటూ ఇటూ వున్న రాజకీయ ప్రగల్భ శూరులు, ఆచరణకు ప్రత్యామ్నాయంగా ఆవేశ ప్రకటనలను ఒక పద్ధతిగా పాటిస్తున్న వారు అన్నివైపులా ఉన్నారు. ప్రాణాలిస్తామని చెప్పేవాళ్లు పదవులు కూడా వదలరని, పెట్రోలు మీద పోసుకునేవాడికి ఆమడ దూరములో కూడా అగ్గిపెట్ట దొరకకుండా ఉండడం, ఆత్మాహుతి దాడులు చేస్తామనేవారి కాళ్లు గడప కూడా దాటవని, దళాలు ఏర్పాటు చేస్తామనడం, ఊచకోతలు కోస్తామనడం, నాలుక తీస్తామనడం – కేవలం వేదికలమీద వాగాడంబరాలేనని జనానికి తెలియదా? కానీ ఉద్యమ ప్రజలు సంయమనం, నిగ్రహం కోల్పోలేదు. ఇన్ని శ్రేణులు, ఇన్ని సంఘాలు, ఇన్ని ఐక్యవేదికలు ఒకే ఉద్యమంలో అంతర్భాగంగా వున్నా, ఏవైపు నుంచి కూడా హద్దుమీరిన దాఖలాలు లేవు. కానీ, ఉద్యమమే మిథ్య అనేవారు ఒకవైపు, ఉన్న ఉద్యమం ఉద్రేకాలను రెచ్చగొడుతున్నదనేవారు మరోవైపు – వీరికి మాత్రం కొదవలేదు? వీని విష ఫలితాలే దౌర్బల్యాలు పెరిగి, ఆత్మహత్యలు పెరిగిపోవడం.
ఇక మన ప్రజాసంఘాలు, ప్రజాతంత్ర సంఘాలు అంతకు ఏమి తక్కువ కాదు. ఆత్మహత్యల గురించి మాట్లాడితే తమ అవగాహన లోపాలు ఎక్కడ బయటపడతాయో అని, ఉద్యమాన్ని బలహీన పరచడమో, ఎదురువెళ్లడమో అని ‘భయపడి’ కొత్త సిద్ధాంతాన్ని ప్రయోగించాయి – అమరవీరులు, ఆత్మబలిదానాలు కాకపోతే ‘నిశ్శబ్దంగా’ వుండి అలాంటి వాదాలకు తోడయ్యాయి – యీ ముసుగులు చాలా బాగా వారి బౌద్ధిక లోపాలను, వారి ఉద్యమ అవగాహనా లోపాలను కప్పిపెట్టాయి. ఇంకా ఇవి తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే గాని ఆగిపోవని తమ చేతులు కట్టుకొని కూర్చోవడానికి సరిపడే సిద్ధాంతీకరణ చేసుకొని కూర్చున్నారు. ఇదంతా ఆత్మవంచనా ధోరణే తప్ప ఇంకేమి కాదు. ఆత్మహత్యలను ప్రమాదకర సూచిని ఒక పోరాట రూపంగా ఆమోదించడమే. సత్యాన్ని వివరించలేక, అబద్ధాలను ఖండించలేక భావనైరాశ్యంతో అవకాశవాదులుగా, ‘భయస్తులుగా’ మిగిలిపోయారు. ఈ రెండు బాలగోపాల్ చెప్పినట్టు హక్కుల సాధనకు అడ్డంకులే.
ఆత్మహత్యలకు కారణాలు చాలా ఆలోచనలు ప్రవహి స్తున్నాయి. ఇప్పటివరకు మనకు చాలా అధ్యయనాలు వున్నా, మన ప్రస్తుత తెలంగాణా సందర్భానికి నిరుపయోగంగా మిగిలిపోయాయి. స్థూలంగా ప్రస్తుత ఆత్మహత్యలు రాజకీయాల – ప్రజాతంత్ర శక్తులు, అధికార, మీడియా చేసిన హత్యలు అని చెప్పవచ్చు. యీ ఆత్మహత్యలన్నీ ప్రగల్బాల రాజకీయ నాయకులు, సంచలనాత్మక ధోరణిగల మీడియా, మేధావుల వైఫల్యము, ప్రజాతంత్ర శక్తుల నిష్క్రియతత్వం కారణాలు. వీటన్నిటికీ వూతమిచ్చినది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణులు, వాటి అక్కరకురాని నీతిలేని కమిటీలు, ప్రకటనలు ముఖ్యాలు.
జ జ జ
చరిత్రకారుడు ఫెర్నాండ్ బృదేల్ తన 3వ, చివరి సంపుటం అయినటువంటి – సివిలైజేషన్ అండ్ కాపిటల్‌లో చెప్పినట్టు, ”ప్రపంచ చరిత్రలో మనం ఎప్పటికీ చేరుకోనటువంటి అస్పష్ట ప్రాంతాలు/విషయాలు, అభేద్యమైన అజ్ఞానం రాజ్యమేలుతూ వుంటాయి” ఈ అంశం మనకు జరుగుతున్న తెలంగాణా ఉద్యమ సందర్భానికి, అందులో చొచ్చుకునిపోయిన కొన్ని అనైతిక – అన్యాయమైన సూత్రీకరణాలను వివరించడానికీ వుపయోగ బడుతుంది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రప్రతిపత్తి కోసం జరిగిన, జరిగే పోరాటాలకు ఒక విడ్డూరమైన పోలిక వుంది – ఈ ఉద్యమాలు తెలంగాణా రాష్ట్రంగా ఉండగానే దానిని నిలుపుకోవడానికి మొదలయ్యాయి. ప్రస్తుతం కూడా అదే పునఃప్రారంభమైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 9, 2009 కేంద్ర ప్రభుత్వ ప్రకటనానంతర పరిణామాలు దానినే ప్రతిబింబిస్తున్నాయి. 1950లలో ఐనా, 1969లో ఐనా, ప్రస్తుతం జరుగుతున్న పోరాటములోనైనా, యీ ఉద్యమాలన్నీ తెలంగాణా ప్రజల ఆరోగ్యకరమైన అభివృద్ధిని ఆశించే జరిగాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం నుండి పాల్గొంటున్న ప్రజలకు యీ ఉద్యమం ఏమి ప్రయోజనం చేకూర్చగలదు, ఏమి ఉపయోగం అనే ప్రశ్నలు తప్పకుండ ఉదయించాలి. మన గత అనుభవాలను చూసుకున్నట్టయితే ప్రతిఒక్కరికి తట్టవలసిన ప్రశ్ననే ఇది. వివిధ వర్గాల ప్రజల శ్రేయస్సు నుద్దేశించి జరిగిన ప్రజాతంత్ర మరియు సామాజిక పోరాటాలు – వేతనాలు, భూమి; రకరకాల వివక్ష – కులం, జెండర్ మొదలైన పేరుపై, రకరకాల బంధుప్రీతి ఫలితాలైన అవినీతిపై జరిగిన పోరాటాలకు, సాధించిన ఫలితాలకు పొంతనే లేదు. యీ విషయాలన్నీ కూడా తెలంగాణా పోరాట సందర్భంలో తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్నలు మరియు అనువైన కనీస ప్రజాస్వామిక డిమాండులపై ఓడిపోని ఒప్పందాలు ఎలెక్షను వాగ్దానాలవలె కాకుండా సాధించాల్సిన అవసరమెంతైనా వున్నది.
ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమ స్వభావము చూస్తే తప్పకుండా అలాంటి కొన్నైనా గ్యారంటీలు వివిధ సంఘాలు, పార్టీల మధ్య జరిగినట్టుగానే భావించవలసి వుంటుంది. కాని వానికి జరుగవలసి నంత ప్రచారం కాని, బహిరంగపరచడమూ కాని జరుగలేదు. ఎప్పుడు తమ స్వంత ప్రయోజనాలకే పరిమితమయ్యే ఉద్యోగులు కూడా ఉద్యమంలో క్రియాశీలక పాత్రధారులు కావడము అలాంటి వీగిపోని ఒప్పందాలు జరిగివుంటాయనే అవకాశాన్ని తెలియబరుస్తాయి. ఇంకా వివిధ సందర్భాలలో ఉద్యమ నేతలు, ఉద్యమ మేధావులు ఇచ్చిన విజన్ యీ విషయాన్ని దృఢపరుస్తాయి. ఇంకా ప్రజాతంత్ర శక్తులు తప్పకుండా ఆ విజన్‌ను ఎలా అమలుపరుస్తారని ప్రశ్నించి సమాధానాలు రాబట్టాల్సిందే. మన కర్తవ్యము పాటించకుండా, అలాంటివి ఏమి జరుగలేదని అంతా ఒక పిచ్చిలో ఫాసిస్టు ధోరణిలో చేరిపోయారనుకోవడము కూడా వాస్తవాన్ని చూడలేకపోవడము, భ్రమలాంటిదే అవుతుంది. అలాంటి అవగాహనకు రావడాన్ని ప్రజాస్వామిక పోరాటాల్లో భాగంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంగా గుర్తించలేమా? ఐతే ప్రజాస్వామ్య రాజకీయాలపై మన అవగాహనను ప్రశ్నించుకోవాలి. ఏ రకమైన విషతత్వాలకు మనము బానిసలమో తవ్వి చూసుకోవాలి. ఇంకా ఉద్యమాలు ఎట్లా జరుగుతాయో, ఏ ఏ సంసిద్ధతలతో జరుగుతాయో తెలియని అజ్ఞానమే అవుతుంది.
అయినా ఇంకా మనకు అభిప్రాయబేధాలుంటే – (తెలంగాణా రాష్ట్రం ఒక ప్రజాస్వామిక హక్కు అని అంగీకారం వున్న తర్వాత) – ఉద్యమం ఇంకా ఎలా వుంటే బాగుంటుంది, దానిని ఏ విధంగా అమలుచేయవచ్చు అని ప్రశ్నించుకోవచ్చు. మనకు తెలిసిన, బహుశా గత చరిత్ర అంతా తీసుకున్న అలాంటి ప్రత్యామ్నాయం వేరొకటి కనిపించదు (తప్పకుండా హింసాత్మక ఉద్యమాలు ప్రత్యామ్నాయం కాదని మాత్రము చెప్పవచ్చు.)
జ జ జ
రాజకీయ ఉద్యమాలలో హింస మరియు అహింసాత్మక విధానాల పాత్ర గురించి వివరిస్తూ, బాలగోపాల్ ఈ విధంగా సూచించాడు, ”ప్రభుత్వమూ, దాని వికృత విధానాలను భౌతికముగా అడ్డుకోవడమే మార్గము. సద్విమర్శతో కూడిన వ్యతిరేకతను భారత ప్రజాస్వామ్యం పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి, విమర్శించే పాలసీ విధానాలను అడ్డుకోవడమొక్కటే మార్గం. దీనికి ఒకే ఒక పద్ధతి మనముందుంది అది – విధానాలకు, ప్రాజెక్టులకు బాధితులను కూడగట్టి ప్రభుత్వానికి, పెట్టుబడికి అడ్డుగా నిలబడడమే. దీనికి దొడ్డిదారులు గాని, షార్టుకట్స్ గాని ఏమి లేవు.” ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా ఉద్యమం బాలగోపాల్ ఆశించిన ఉద్యమాలకు మంచి నిరూపణ, కనీసం గత రెండు సంవత్సరాలు చూసినా ఇది ముఖ్యంగా శాంతియుత మరియు ప్రయోగాత్మక – పోరాటరూపాలతో కూడుకొనివున్నది. యీ కారణం వల్లనే అనూహ్యమైన ప్రజాస్పందనే కాకుండా, దీర్ఘకాలిక పోరాట అవకాశాన్ని కల్పించింది. ఇది విప్లవ రాజకీయాలలో భాగమైన వారి అభివ్యక్తీకరణల నుంచి, ఒక పోలీసుబాసు వరకు అంగీకరించిన సత్యం (తను చేసిన తప్పును, హింసను ఏ విధంగానైన సర్దిచెప్పుకునే కరెక్టు అని వాదించే తత్వం గల పోలీసులు కూడా ఒప్పుకున్నా సత్యం). ప్రభుత్వమూ, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకునే శక్తులు ఎంత బలంగా ప్రయత్నించిన చేష్టలుడిగి వున్నారు. ఇది ఉద్యమం సాధించిన, అది అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాటరూపాలే కారణం. (తప్పకుండా రాజశేఖర్‌రెడ్డి మరణం తెలంగాణా ఉద్యమానికి అదృష్టమయ్యింది. లేకపోతే ప్రపంచం ప్రజల, ఉద్యమాల యీ శక్తిని చూసివుండేవి కాదేమో, ఎందుకంటే తన ప్రత్యర్థి వర్గాన్ని దుర్మార్గంగా చంపేసి ఆధిపత్యాన్ని నిలుపుకొనే ఫ్యాక్షనిస్ట్ కాంట్రాక్టు కిల్లరు)
సకల జనుల సమ్మెలో ఓవైపు ప్రభుత్వం ఘోరమైన నిర్బంధకాండను అమలుచేస్తున్నా… మొక్కవోని ధైర్యంతో శాంతియుతంగా ముందుకు దూసుకుపోతూ తన విలక్షణతను చాటుకుంటున్నది. రోజురోజుకూ సమ్మె కడుతున్న కొత్త సెక్షన్‌లతో… నానాటికీ మరింత ఉధృతమవుతూ… ఎదుగుతోంది. ఉద్యోగులు, కార్మికులు, వృత్తి సంఘాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు… సమ్మేళనంతో సాగిపోతున్నది. మూడున్నర లక్షల మంది రాష్ట్రప్రభుత్వద్యోగులు, లక్షన్నరమంది ఉపాధ్యాయులు, అరవైఏడు వేల మంది సింగరేణి కార్మికులు, యాభైఎనిమిదివేల మంది ఆర్టీసీ కార్మికులు, అబ్కారి ఉద్యోగులు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, ఇంకా ప్రభుత్వాసుపత్రుల వైద్యులు సమ్మెలో ఉన్నారు. (ఒక్క పోలీసుశాఖ తప్ప అన్ని ప్రభుత్వరంగాల ఉద్యోగులు సమ్మెలో భాగమయ్యారు). ఇంకా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఆటోడ్రైవర్లు, పూజారులు, రజకులు, భవన నిర్మాణ కార్మికులు, ప్రభుత్వ డ్రైవర్లు సంఘీభావ సమ్మెలు చేస్తున్నారు. రోజుకో సమూహం కొత్తగా వచ్చి ఆందోళనలో చేరుతున్నది.
ఏకకాలంలో సమ్మెచేసి జనజీవనాన్ని స్తంభింపజేసిన ఇటువంటి ఉద్యమం గతంలో ఎప్పుడైనా ఏ సమస్యల పరిష్కారం కోసమైనా జరిగిందా? ఇన్ని రోజులు నిలకడగా సాగిందా? ఉద్యమం తీరు మీద, నాయకత్వం మీద ఎన్ని విమర్శలు, విభేదాలు ఉన్నప్పటికీ – సమాజంలోని ఇన్ని వర్గాలు, శ్రేణులు ఒక్కుమ్మడిగా ఒక ఆకాంక్ష సాధన కోసం ఉద్యమించడం మునుపు ఎన్నడైనా విన్నామా? తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకత వున్నవాళ్లైన యీ ఉద్యమ రూపాలను గౌరవించాలి, బలపరచాలి. తెలంగాణా ఉద్యమం ప్రజాతంత్ర శక్తులకు అందించిన అపురూప భ్రమలు లేని ఉద్యమ రూపం. బాధితుల సానుభూతితో తమకు జరిగిన ‘విజయాలను’ నెమరేసుకొని సంబరాలు జరుపుకునే యీ శక్తులకు గుణపాఠం కూడా. బాలగోపాల్ సూచించిన పోరాటరూపానికి ఇది అద్భుతమైన సజీవమైన ఉదాహరణ.
ఇంకా ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని కొంతమంది స్వప్రయోజనాలకు జరుగుతున్న దానికిందే భావించే ప్రబుద్ధులు, అనుమానపరులు మనలో లేకపోలేదు. వాళ్ళు విలువైన అనుమానాలతో, మరొక పీడకలకు దారితీస్తుందేమోననే అనుమానాలు ఉండివుండవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణా కోసం జరిగిన పోరాటాల అనుభవం అలాంటి అనుమానాలకు తావిస్తుంది. కాని వాళ్ళు నిశ్శబ్దముగా ఉండడం మాత్రము క్షమించరానిది. తప్పకుండ వారు తమ ప్రశ్నలను చర్చకు పెట్టి, కనీస డిమాండులను సాధించినట్లయితే అది యీ ప్రాంత ప్రజలకు, వారి భవిష్యత్తుకు కూడా మేలు చేసినవారవుతారు.
యీ కనీస ప్రజాస్వామిక డిమాండులు సాధించడం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసాధ్యం కాదు. కాని వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వేరెక్కడ అది సాధ్యము కాదు అనే ధోరణిలో – కనీస ప్రజాస్వామిక హక్కుగా తెలంగాణాను గుర్తిస్తూ, లేని అనుమానాలతో నిశ్శబ్దముగా ఉండడం క్షమించరానిది. యీ ద్వంద్వ స్వభావం మేలు కన్నా కీడే ఎక్కువచేసే అవకాశముంది. విలువైన ప్రశ్నలు అడుగకుండా, నిశ్శబ్దంగా వుండి అనవసరమైన చర్చలకు వీరు కారణమవుతున్నారు.
దళితులు, బహుజనులు ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణా కావాలని డిమాండ్ తెచ్చినపుడు యీ శక్తులు వాని ఆవశ్యకతను వివరించి ఉద్యమ భాగం చేయడంలో నిశ్శబ్దంగా వున్నాయి. కాని యీ తరహా ప్రజాస్వామిక ఆకాంక్షలను చర్చించి, ఒక రూపం ఇచ్చి, కనీస గ్యారంటీలు సాధించినట్లయితే, ఉద్యమంలో రాజకీయనాయకుల, పార్టీ మేధావులు చూపించిన ప్రగల్భాలకు కొంతవరకైనా కట్టడి చేసేవారు. తద్విరుద్ధంగా వానిని రకరకాలుగా కీర్తించి, కమిట్మెంట్, స్ఫూర్తి అని ఇంకా అనవసర ప్రత్యయాలు పుట్టించారు, కాకపోతే నిశ్శబ్దంగా వుండి ఆ దొరలను బలపరిచారు. దీనితోపాటు అసలు సమస్య సత్వరంగా పరిష్కారం అవుతుందన్న నమ్మకమూ పోయేసరికి లేదా గంటలో లేదా రోజులో సమస్య పరిష్కారం అవుతుందని గాలిలో ప్రమాణాలు పెరిగిపోయి యువతలో, విద్యార్థుల్లో నైరాశ్యం పెంపొందడానికి, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి దోహదపడినాయి. దీనిలో ప్రజాతంత్ర శక్తులు తీరని నష్టాన్ని చేసాయి. దశాబ్దాలవారి పోరాటాలకు, విలువలకు తీరని ద్రోహం చేశాయి, చేస్తున్నాయి.
జ జ జ
పైపెచ్చు అవకాశవాదుల, ‘మేధావుల’ అనైతిక, అన్యాయ మైన సూత్రీకరణలు తోడయ్యాయి. అభేద్యమైన వారి అజ్ఞానానికి నెలవులయినాయి. ఉదా.. హైదరాబాదు విషయం తీసుకుంటే, తెలంగాణా రాష్ట్రము ఏర్పడితే అది మతతత్వం పెరిగిపోవడానికి, బిజేపి ప్రాబల్యము పెరిగిపోవడానికి, మరి గ్లోబల్ సిటీ కావలసినటు వంటి హైదరాబాదు ఆ అవకాశం కోల్పోతుందని, ప్రాంతీయ ప్రభుత్వాలు యీ పెరుగుతున్న ఆకాంక్షలకు అడ్డము అని సూత్రీకరించాయి.
ప్రాంతీయ అజెండాలతో ‘గ్లోబల్ సిటీ’ కావలసినటువంటి ప్రామిస్‌ను నిలబెట్టలేననడం, (అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాంతీయం కానట్టు); భూమి, నీరు, కరెంటు లేకుండా యీ ‘గ్లోబల్ సిటీ’ మనగలదా (అదేమన్నా ద్వీపమా?) ప్రాంత కనీస అవసరాలను కూడా నెరవేరనీయకుండా, ‘ప్రాంతం’ పేరుపై వనరులను దౌర్జన్యంగా అనుభవిస్తున్న నగరానికి హక్కు అన్నట్టుగా. యీ శాస్త్రీయ అధ్యయనాలు వాని ప్రచారాలకు ఆధారాలు చూపించగలవా? ఇవి ఎవరు తీసిన లెక్కలు? ఎప్పుడు తీసినవి? ఒక కొత్త రాష్ట్రం, ఇంత ప్రజాస్వామికంగా పోరాటం చేస్తూ, రాష్ట్రం వచ్చాక ప్రజల, వస్తువుల, భావాల రాకకు గ్రేట్ వాల్‌లు ఏమైనా కట్టగలదా? యీ అధ్యయనాలు, ప్రేరక శక్తులు సరైన ఆచారాలు చూపించగలిగితే, ఒక్క తెలంగాణాకే గాదు, యావత్ భారతదేశం, దాని రాష్ట్రాలు స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి కారణాలు తెలియక బాధబడుతున్న సందర్భంలో, ఎంతో మేలు చేసినవారవుతారు. నిజానికి ఇవి మనను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న సమస్యలైతే, ఇవి ఒక్క తెలంగాణాకు మాత్రమే సమస్యలు కావు. యావద్భారత దేశం, స్వాతంత్య్రానంతరం ఎదుర్కొంటున్న నిరంతర సమస్యలు. (ఇంకా తెలుగుజాతి ఐక్యత, వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నవారి భద్రతా, రాడికల్ ప్రభావం, రకరకాల వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎన్నో ఇదే దారిలోకి వస్తాయి.)
అసలు సత్యమేమంటే అభద్రతను ప్రేరేపించడవీ. తెలంగాణా పోరాటవీ జరిగినప్పుడే వీనిని తవ్వడవీ, తెలంగాణా ప్రజాస్వామిక హక్కును కాలరాయడము వీరి ముఖ్యోద్దేశ్యం. వీనిని ప్రజాతంత్ర శక్తులు సరైన బౌద్ధిక అవగాహనతో తిప్పికొట్టకుండా నిశ్శబ్దంగా తమ అంగీకారాన్ని నిస్సిగ్గుగా తెలియపరిచాయి. ఇది ఏవైతే ప్రజాతంత్ర విలువల కోసం యీ ప్రజాతంత్ర శక్తులు కృషి చేశాయో వానిని విస్మరించి, వానికి తీరని ద్రోహం చేయడంలో భాగమే. అయినా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న పోరాటం యీ సమస్యలను అర్థము చేసుకోలేదా.
జ జ జ
పైగా యీ ఊహాజనిత అసందర్భ ఆరోపణలు – అభేద్యమైన అజ్ఞానంతో కూడిన కువిమర్శలకు విలువైన, సాధించాల్సిన ప్రజాస్వామిక డిమాండులను వెలికి రాకుండా, కనీస గ్యారంటీలను సాధించకుండా ఆధిపత్య శక్తులకు సహాయపడుతున్నాయి. సెజ్‌లు కావచ్చు, ఓపెన్ కాస్ట్ మైనింగ్, భారీ డ్యాములు వానివల్ల నిర్వాసితులయ్యే నిరుపేద జీవితాలకు జరిగే నష్టాలు చర్చకు రాకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా, ప్రజాతంత్ర శక్తులు తమ ‘నిశ్శబ్దాన్ని’ వీడి, యీ విషపు ఆలోచనలకు అడ్డు నిలువకపోతే, మనకు జరుగుతున్న నష్టాలకు అంతముండదు, ఆ విధంగా మనం ప్రజాతంత్ర భావాలకు తీరని ద్రోహం చేసినవారవుతాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
వ్యాసము ఒపెన్ కావడము లెదు, ఒకసారి సరిగా లొడ చెసారా లెదా చూడగలరు