వి. ప్రతిమ
ఆమెను నేను ఒంటరిగానూ
అప్పుడపుడూ జంటగానూ చూశాను.
తొలిసంధ్య ముచ్చట్లని మనసులోకి
వొంపుకోకుండానే మలిసంధ్య మబ్బులా వాలిపోయింది.
దిండు కింద దాచివుంచిన
కలలన్నీ గడ్డకట్టుకుపోయినా
కళ్ళెదుట లేని ప్రకృతినంతా
హృదయపు అరల్లో నిక్షిప్తంచేసి
కోయిల రాగాలను ఆలపిస్తుంది.
చీకిచీకి తుంటలవుతోన్న
అనుబంధాల తాళ్ళని ఒడిసిపట్టి
దారంలేని సూదితో
స్వస్థ్టత కోల్పోయిన కళ్ళతో
కలిసి ముడేయాలనుకుంటుంది
ఒకటి కుడివైపుకి లాగితే
మరోటి ఖచ్చితంగా ఎడమవైపుకే.
నిరంకుశత్వపు నిర్ణయాధికారాలతో
మిలటరీ కవాతు చేయించిన
యజమాని నుదుట కూడ యిప్పుడు పొద్దువాటారింది
రసికారుతోన్న తలపుండుమీద
పిల్లకాకులు వాలి కావుకావుమంటుంటాయి.
వాటికి ప్రేమ నేర్పే క్రమంలో, తుట్టమర
ఎండిపోయిన జీవనచలమని
తడితడిగా నిమురుతుంటుందామె
తుమ్మల్లో కూలిన బతుకు మిగిలిన
విషాదాల్ని తట్టుకోవడానికి
ఆమె ఓర్పుగనుల్ని తవ్వి తవ్వి
తీరా సహనపు ఖనిజాన్ని వెలికితీస్తుంది
అయితేనేం?
ఘనీభవించిపోయిన మంచు అరలో నిలబడి
కూలిపోతోన్న కాలాన్ని కౌగలించుకుని
వెచ్చటి సూర్యకిరణాలను ఆమె
శ్వాసిస్తూనే వుంటుంది…
మూసుకుపోయిన ప్రేమకవాటాలను
ఒడుపుగా తెరుస్తూనే వుంటుంది.
ఒక కంట దుఃఖపుతెరని,
మరోకంట ఆశల చివుళ్ళని ధరించి
సగమా? మొత్తం
ఆకాశమంతా పరివ్యాప్తమవుతుంది.
జంటగా చూశానని అంటున్నాను కానీ
ఆమె ఎప్పుడూ ఒంటరే.నానీలు
డా|| ఇ. విష్ణువందనాదేవి
”అమ్మకు వంటింట్లో
పది చేతులు
ఆమెకు మొక్కడానికి
ఒక్క చెయ్యీలేదు” –
ఎప్పుడు
అలుగుతుందో తెలియదు
వేళకానివేళ
మబ్బుపట్టినట్లు” –
”ఆహార్యంపై
ఆహారంపై
ఉన్న శ్రద్ధ
అంతరంగంపై లేదెందుకో” –
”ఉత్పత్తే ముఖ్యం
నాణ్యత ఊసెక్కడా?
పిల్లల విషయమూ
అంతే -”
”క్షమయా ధరిత్రి
ఎంతసేపు
ఓపిక
ఉన్నంత వరకు -”
”బాపు బొమ్మకు
వంపులే కాదు
ఇంపైన వ్యక్తిత్వం
కూడా -”
”ఒకరికొకరు
తోడైయినప్పుడు
విజయకారకుల
గోలెందుకు -”
”తోడు దూరమైందన్న
బాధ ఒకవైపు
సంప్రదాయాల
హడావిడి అదనం”వాస్తవ…కల!
మాలతి (సతారా)
నేనొక ఇంటిని నా కలలోకి తెచ్చుకున్నాను
గజిబిజి ఆ ఇరుకు వీధిలో రెండో ఇల్లు
చక్కటి చతురస్రంలో పొందికగా ఉంటుంది
ఇల్లు పాతదే, సున్నం రాలిపోయిన గోడలే
అయితేనేం ఆవరణంలో మల్బరీ చెట్లమీద ఎగిరే
సీతాకోకచిలుకల వింత శోభ
మేడమెట్లు తిరిగి తిరిగి పైకి ఆకాశంలోకి పోతున్నట్లు… అనుభూతి
స్నానపు గదుల్లో తొలగిన టైల్స్
సరిచేయాల్సిన ఎన్నో అవకతవకలు…
హారం అమ్మేసి మరి ఎప్పుడు ఖర్చుపెట్టానో ఏమో ఇంటికి?
కొత్త యవ్వనంతో మిసమిసలాడింది
ఆ దశలోనే ఓసారి అమ్మను తీసుకెళ్ళి చూపించుకుందామనుకున్నాను
మధ్యలో ఏమైందో గుర్తులేదు
ఓరోజు ఇల్లు ఓ మహిళకు అద్దెకిచ్చాను
కాని, అద్దె తీసుకోవడం మరిచేపొయ్యాను
ఎందుకో గుర్తుకొచ్చి గతరాత్రి కలలో
ఆమెను అద్దె అడిగాను –
ప్రతినెలా నా భర్త క్రమం తప్పకుండా వచ్చి
తీసుకెళుతున్నాడని ఆమె చెప్పింది.
తెలుగు : డా. దేవరాజు మహారాజు
( ప్రముఖ తమిళ కవయిత్రి మాలతి (సతారా) కవిత్వం అతిసాధారణంగా అనిపిస్తూనే, అసాధారణమైన స్త్రీవాదాన్ని వినిపిస్తుంది. ఈవిడ కొన్నేళ్ళ క్రితమే కన్నుమూశారు.)సెక్స్ గర్ల్స్, రెడ్‌లైట్ ఏరియాలో…
బుచ్చిరెడ్డి.జి
పేదరికం,ఆకలి, దారిద్య్రం..నిరుద్యోగం
అవసరాలు
అనేక కారణాలతో
బ్రతుకును నిలబెట్టుకోవడంకోసం
దిగజారిన కాలుజారిన బ్రతుకులు
రెడ్‌లైట్ ఏరియాస్‌లో…సెక్స్‌గర్ల్స్
అక్కడివాళ్ళు అలంకరింపబడిన బొమ్మలు
రేకులు రాలిన పువ్వులు
కరిగిపోయిన కాటులు
చమక్‌చీరలు..చీఫ్ సెంటు వాసనలు
ప్రతిరోజు
వాళ్ళ గుండెల్లో సుడిగుండాలు
వాళ్ళ మనసుల్లో సునామీలు
రోజు దేవులాట
అక్కడ మేడమ్ ఉంటుందీ
ఆమె పర్యవేక్షణలో నడుస్తున్న భోగమందిరం
కాములకు…రంగేలీ వాళ్ళకు
స్వాగత మందిరాలు
అనేక గదులు ఆ గదులలో నలిగిపోతున్న పువ్వుల్లా
కరిగిపోతున్న దివ్వెల్లా
మాంసపు ముద్దల్లా అర్థనగ్నంగా వెలిసిపోయిన
అలసిపోయిన కన్నె పిల్లలు
రోజు వాళ్ళ ఆదాయంలో
మేడంకు కొంత, పోలీసులకు కొంత
నెలవారీగా ఎన్ని లెక్కలు వేసినా
మిగిలేది తక్కువే??
అవి గదులా
మందిరాలా
ప్రాణం ఉన్న మార్చురీలా…
విటులకు… ఎవరి గుర్తింపు వాళ్ళదీ
వ్యభిచార సమస్య…నేటిదికాదూ
వందల వేల ఏండ్లనుండి.. ఉంటూ
పెట్టుబడి సమాజాలు
ఈ సమస్యను మరింత పెంచుతూ
పాలక వర్గమే ఆ సభ్యతను పోషిస్తుందీ
దేవాలయాలపై పై బూతు బొమ్మలు
నేటి సినిమాల్లో
సెక్స్ ప్రోవోక్ చేసే డాన్స్‌లు-ద్వంద అర్థాల పాటలు
మార్కెట్‌లో సెక్స్ డివిడిలు
టివి ఆడ్స్‌లలో స్త్రీల శరీర భాగాలను
కొనుగోలు వస్తువుగా
మార్కెటింగ్ చేస్తూ..చూపిస్తూ
అంగడి చూపులు..అంగడి మాటలతో
నేతల మాటల్లో సాంప్రదాయం
చేతల్లో దారి తప్పిస్తున్న సంస్కృతి??
ధర్మం..న్యాయం..నీతి…నియమం…అంతా
మగవాడు స్పృశించిన బంగారు సంకెళ్ళు…బాటలు
మొగవానికి ఒక న్యాయం
స్త్రీకి మరి ఒక న్యాయం
స్త్రీకి మరి ఒక న్యాయం
ఉన్నోళ్ళకు ఒక న్యాయం
లేనోళ్ళకు ఒక న్యాయం
ఈ వ్యత్యాసాలు…తేడాలు..భేదాలు
ఉన్నంతకాలం
సమస్యలు పరిష్కారం కావు
వ్యభిచార చట్టాలతో
వొరిగేది ఏమి లేదు
వ్యభిచారం…అది ఒక వృత్తికాదూ..కాకూడదూ
అన్ని పార్టీలనేతలంతా
న్యాయం..ధర్మం…నిజంకోసం
నిలబడాలి
మనిషిని మనిషి దోచుకుంటున్న
ఈ దోపిడీ వ్యవస్థలో
ఎక్కడ వుంది లోపం ఈ తీరుకు
ఈ స్థితికి
ఇలా భయాలతో
రోజు దేవులాటతో
అన్ని వదులుకొని
సమాజానికి దూరంగా
తిరస్కరింపబడుతూ
వెలివేయబడ్డ
సెక్స్‌వర్కర్స్‌లకు దశ దిశ ఏమిటి??
నిజానిజాలను గుర్తించాలి
సమాజం సెక్స్ వర్కర్స్‌ను
ఒక నేరస్థులుగా చూడకుండా
మనలో ఒకళ్ళుగా గుర్తించాలి
వాళ్ళబాధలను…సమస్యలను
ఇతరులతో పంచుకునేలా చేయాలి
ఈ రొంపిలోకి దిగుతున్న వాళ్ళకు
ప్రభుత్వ సంస్థలు..కార్మిక ప్రజాసంఘాలు
గౌరవంగా బ్రతికే దారి చూపించాలి
పునరావాసం కలిపించాలి
వ్యభిచారం గురించి.. వచ్చే వ్యాధుల గురించి…ఏడ్స్ గురించి
జనాభా అందరికి విజ్ఞానం ఇవ్వాలి
మన ఆలోచనల్లో
మన ఆచరణలో
మన మాటల్లో
మన తీరులో…మార్పు రావాలి
చదువు..అన్నింటిని మార్చి వెస్తుందీ
మార్పురాక తప్పదు
లెట్ అస్‌సీ…
(నళిని జెమిలా కథ-ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ …
చదివి)