డా|| మల్లెమాల వేణుగోపాలరెడ
”కొరకుంట రోడ్ మీద టిఫిన్ చాలా బాగుంటుంది సార్! అక్కడ కారు ఆపుతాను… టిఫిన్ చేద్దురుగానీ” డ్రైవర్ శంకర్ అన్నాడు.
”అవును. నేనూ విన్నాను. అక్కడ ఒకావిడ దోసెలకి చాలా గిరాకీ అని ఫోటోలతో సహా ఈ మధ్య పేపర్లో వేసారు” మా ఆవిడ అంది. నేనూ తలూపాను.
శంకర్ కారు ఆపాడు. కారు దిగాము.
చిన్నపాక, అందులోనే టిఫిన్ సెంటరు. బోర్డు లేదు పాక ముందు దోసెలు పోస్తూ ఒక స్త్రీమూర్తి. చుట్టూ పది కుర్చీలు… కుర్చీలనిండా కూర్చుని దోసెలు తింటున్నారు. కొందరు నిల్చుని… రోడ్డుప్రక్క లోడెడ్ లారీలు, ట్రక్కులూ. చెన్నైకి వచ్చేపోయే వాహనాల డ్రైవర్లూ, క్లీనర్లూ, తిరుపతి నుండి ఎక్స్‌ప్రెస్ బస్సు వచ్చి ఆగింది. డ్రైవరూ, కండెక్టరూ దిగి టిఫిన్ ప్లేట్లు పట్టుకున్నారు, కొందరు ప్రయాణీకులూ వరుస కట్టారు.
”శంకరయ్యా! మీ సార్ వాళ్ళకు లోపల రెండు కుర్చీలున్నాయి. తీసుకెళ్ళి కూర్చోబెట్టు… సార్ ఒక అరగంట ఆగండి. ఆవిడ అంది. శంకర్‌కు ఆ దారి, ఆమె, ఆమె దోసెలు బాగా పరిచయమున్నట్టు అర్థమైంది. మావద్ద చేరకముందు శంకర్ ఓ టాక్సీ డ్రైవర్.
”బీబీజాన్! నాకు రెండు ఎగ్ దోసెలు.”
”అమ్మీ! నాకు రెండు మసాలా దోసెలు… ఆలూ ఎక్కువెయ్యి”
”నాకు ఓ కారం దోసె, రెండు అలసంద వడలు. బస్” ఒంటిచేత్తో, నాలుగు దోసెలు పట్టే పెనుమ్మీద, కట్టెల పొయ్యి ఎగదోసుకుంటూ, ముఖం మీద కారే చెమటలు చున్నీతో తుడుచుకుంటూ పంజాబీడ్రెస్‌లో ఓ మధ్యవయస్సు స్త్రీ.
”రే! రంతుమియ్యా! ఎక్కడ సచ్చావురా. కస్టమర్లకు నీళ్లివ్వూ… ఆ పక్కన టీకొట్టువాణ్ణి రాజస్థాన్ టీ రెడీగా పెట్టుకోమను. ఇదిగో చిన్నక్కా! ఆ ప్లేట్లు కడిగిపెట్టు. ఆ కోడిగుడ్ల బాక్స్ యిట్టాతే! అవునండీ… అందరూ ఐదొందల నోట్లే యిస్తే చిల్లరెక్కడుందీ… ఒకచేత్తో దోసెలు, ఇంకోచేత్తో గల్లాపెట్టెలో మనీ… అన్నీ చూసుకుంటూ అష్టావధానం చేస్తున్న ఆమెను చూస్తే ఆశ్చర్యమేసింది.
”ఎగ్స్ పగులుతూనే వున్నాయి. మసాలాలు దట్టిస్తూనే వుంది. కారం పూసిన దోసెలు ప్లేట్లలోకి… ఇంకోపక్క అలసంద వడల బాణాలి… శనగపప్పుల పచ్చడి… మధ్యమధ్య రంతుమియ్యా చిన్నక్కలకు ఆర్డర్లు… ఓహ్… రోడ్డు నిండా సందడే… సందడి.
”అమ్మా! సార్‌వాళ్లు తిరుపతికెళ్లాలి… మరి” శంకర్ అన్నాడు.
”అయిపోయింది… ఇంకో పది నిమిషాలు… సార్ వాళ్లకు స్పెషల్‌గా నెయ్యిదోసె తీసిస్తా… చిన్నక్కా… ఆ అల్లసందల పిండి కొంచెం తీసి లోపల పెట్టు… మేడమ్ వాళ్లకేసిస్తా” లారీలు, ట్రక్కులూ, బస్సూ బయలుదేరాయి. మేమూ, శంకర్, చిన్నక్కా, రంతు మిగిలాం.
ఆమె లేచి చేతులు కడుక్కుని, లోనికి వచ్చి ”సార్! క్షమించండి. ఆలస్యమైంది. మేడమ్ మీకూ సార్‌కూ రెండేసి నెయ్యిదోసెలేసిస్తా… నాలుగు అలసంద వడలు చాలా!”
మా సమాధానం కోసం చూసుకోకుండా దోసెలు వేయ సాగింది… వడలూ కాల్చింది.
”సార్! మీకూ మేడమ్‌కీ చెరో ఎగ్ కొట్టి పొయ్యమంటారా! చాలా బాగుంటాయి” మేమూ సరేనన్నాం.
లోపల్నించి రెండు సిల్వర్ ప్లేట్స్ తెచ్చి అరిటాకు వేసి దోసెలు, వడలూ సర్వ్ చేసింది.
మా ఆవిడ తెచ్చిన మినరల్‌వాటర్‌తో ఆరగింపు అయిపోయింది.
శంకర్‌కూ టిఫిన్ యిచ్చింది.
”శంకరయ్యా! ఇప్పుడు చెప్పు సార్ వాళ్లను గురించి.” అందామె.
”సార్… గోపాల్‌రెడ్డిగారు కడపలో పెద్ద సర్జను. మేడమ్ డాక్టరు వరలక్ష్మిగారు. కడపలో ప్రముఖ వైద్యురాలు.”
”ఆఁ…ఆఁ విన్నాను. అప్పుడెప్పుడో ఎల్లాయపల్లె ఆశ్రమంలో చూసాను. మరచిపొయ్యాను.”
”సార్ పెద్ద కవి కూడా. కథలూ, నవలలూ రాస్తారు” శంకర్ అన్నాడు.
”అవునవును… మా నిస్సార్, నా కొడుకు చెప్తుంటాడు మీ గురించి… వాడు కథలూ, నవలలూ బాగా చదువుతాడు.”
”నిస్సార్ ఏంజేస్తుంటాడు” అడిగాను.
”తిరుపతిలో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌కు కోచింగ్ తీసుకుంటున్నాడు.”
”నీ పేరు… మస్తానీ కదూ పేపర్లో చదివిన గుర్తు” వరలక్ష్మి అంది.
”అబ్బా! మీరు భలే మేడమ్… ఎంతగా గుర్తుపెట్టుకున్నారు…” అవును మేడమ్. మేం తురకోళ్ళం… ఇదో… ఆ పక్క కిలోమీటర్ దూరంలో ముక్కావారి పల్లె మావూరు.”
”ముస్లింవైవుండి కూడా ఇంతమంచి తెలుగు మాట్లాడు తున్నావే!” అడిగాను.
మా ఊర్లో రెడ్లు ఎక్కువ… తెలుగులోనే పుట్టాము… తెలుగిళ్లలోనే పెరిగాం… ఉర్దూ కూడా వచ్చు. అరబ్బీ చదువుకున్నాను. ఖురాన్ చదవగలను. కసుమూరు మస్తానయ్య దర్గాలో సేవజేస్తే మా అమ్మకు నేను పుట్టానంట. అందుకే నేను మస్తానయ్యాను. మేము లేచాము. ”సార్! సార్! ఒక్కనిమిషం. కూర్చోండి. మీరు కతలు రాస్తారు గదా! నా కత రాయరా సారూ!” ప్రాధేయపూర్వకంగా అడిగింది మస్తానీ.
”నాకూ మస్తానీ కథ రాయాలనిపిస్తూంది : నీ భర్త ఏం జేస్తుంటాడు?” అడిగాను.
”అయ్యో సార్! అది పెద్ద కథ… మీకు టైం లేదు… మీరు మళ్లీ తిరుపతి నుండి తిరిగి ఎప్పుడొస్తారు మేడమ్?”
”రేపు సాయంత్రానికి కడపకు చేరాలి” వరలక్ష్మి చెప్పింది.
”అయితే… రేపు మాయింటికి రండి సార్! నేను రంతుని రోడ్ మీద పెట్టి పెడతాను. మిమ్మల్ని మావూరికి తీసుకొస్తాడు… మీరు నాకత తప్పక వినాలి… కత రాయాలి… దయచేసి కాదనకుండా రావాలి… అల్లా మిమ్ముల్ని సల్లగా సూత్తాడు.”
శంకర్ కారు స్టార్ట్ చేసాడు.
మర్నాడు ముక్కావారిపల్లె మస్తానీ యింటిముందు కారు ఆపాడు శంకర్.
పెంకుటిల్లు. ఇంటిముందు వెదురు తడికెల దడి, గేటు. బోగన్‌విల్లియా చెట్లు, మల్లెపందిరి.
”రండి సార్! రండి మేడమ్!” సాదరంగా ఆహ్వానించింది మస్తానీ. లోపల మూడు గదులు. వెనక వరండా… వంటిల్లు. వంటింటి నిండా వంట సరుకులు, వంట చెరుకులు, గ్రైండరూ, మిక్సీ, వంటపాత్రలూ… హాల్లో పాత సోఫాసెట్, ఎదురుగా కడప అమీన్ పీర్ దర్గా, కసుమూరు దర్గా, దర్గాల పీఠాధిపతుల ఫోటోలు, వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి పటాలు. వాటికి మల్లెపూల సరాలు… అగరొత్తులు, అగ్గిపెట్టె – ఖురాన్ పుస్తకం. ”కూర్చోండి సార్!” సోఫా చూపించి అంది. కూర్చున్నాం. కుర్చీ తెచ్చివేసింది. మా అమ్మను పిలుస్తాను సార్… ఆమెకే యీ కుర్చీ… లోపలి గదిలోంచి దగ్గు…
”అమ్మీజాన్! సారోళ్లొచ్చారు. లేచి వచ్చి కూర్చో.”
ఆయాసపడుతూ ఆమె వచ్చి కూర్చుంది… పెద్దగా దగ్గింది.
”నిన్నట్నుంచీ మా మస్తానీ మీరొస్తారని బహుత్ ఖుషీగా వుంది సార్! మేడమ్ మీరు నాకు బాగా తెలుసు. నాపేరు ముంతాజ్‌బేగం. మా చెల్లెలు నూర్జహాన్ కడపలో అంగడివీధిలో వుంటుంది. ఇరవైఏళ్ల ముందు దానికి కాన్పు మీరే చేశారు. కాన్పు కట్టమైతే మీరే బతికించారు. నేనే దగ్గరున్నాను.”
”ఔను… గుర్తుకొచ్చింది. నూర్జహాన్ కూతురు ప్యారీజాన్ యిప్పుడు కాన్పుకి నా దగ్గరికే వస్తూ వుంది” వరలక్ష్మి అనింది.
”మీ హస్తవాసి మంచిది మేడమ్” రెండు చేతులెత్తి నమస్కరించింది ముంతాజ్.
మస్తానీ చల్లటి ‘మజా’ మామిడిపండ్లరసం తెచ్చి యిచ్చింది.
”నువ్వూ కూర్చో మస్తానీ! సారు, నీ కథ రాయాలి కదా! కథ ప్రారంభించు” వరలక్ష్మి అంది.
”మానాయన ఖాదర్‌భాషా! మంగంపేట ముగ్గురాళ్లగనిలో పనిజేస్తూ కరెంటుషాక్‌తో చనిపోయాడు. మా నాన్నకు నేనూ, నాకంటె పెద్దోడు మా అన్నా ఇద్దరిమే.”
”మీ అన్న ఎక్కడున్నాడు?”
”వాడు కువైట్ ఎల్లిపోయాడు సార్! అక్కడే ఒక మళయాళీ పిల్లను చేసుకున్నాడంట… వాడు నాయన సావుకు కూడా రాలేదు” ముంతాజ్ చెప్పింది.
”నీ భర్త?” అడిగాను మస్తానీని.
”మా మేనత్త కొడుకుతోనే నిఖ్ఖా కట్టించాడు మానాన్న… వలీమా ధూంధాంగా జరిపించాడు. ఐదొందల మందికి రెండు తూముల బియ్యం పలావు, ఒక పొట్టేలు కూర…” చున్నీతో మస్తానీ కంటితడి తుడుచుకుంది.
”అల్లుడికి ఫ్యాక్టరీలోనే వర్క్సు మేనేజరుగా వేయించాడు. వాచీ, ఉంగరం, గొలుసు బాగా చదివింపులూ… రెండేళ్లకే సౌదీకెళ్లాడు. వీసా ఖర్చులన్నీ నాయనే”
”ఆ తర్వాత…”
”నాయన చనిపోయాడు. మాయన్నా… నా మొగుడూ యిద్దరూ ఆయన సావుకు కూడా రాలేదు. వాళ్లిద్దరి వీసాలకు, నా పెళ్లికి నాయన దేవసానికీ పోగా మాకు మిగిలింది ఈ పెంకుటిల్లు. ఆనాటికి రెండేళ్ల నిస్సార్… నా కొడుకు… అమ్మీ! మాట్లాడతావుండు… వస్తా” చెప్పి లోనికెళ్లింది మస్తానీ.
”మరి మీ అల్లుడితో మాటలు లేవా!” ముంతాజ్‌ని అడిగింది వరలక్ష్మి.
”మాటాలేదూ…మంతీలేదు. కోదూరు బేల్దారి సుబ్బన్న కూతురు, మొగుడొదిలేస్తే, సౌదీ వెళ్లింది. దాన్ని కట్టుకున్నాడంట మస్తానీ మొగుడు” సాధారణంగానే అంది ముంతాజ్.
లోపల్నిండి మూడు సిల్వర్ ప్లేట్లలో డబుల్‌కామీఠా, చక్కిలాలు పెట్టుకుని తీసుకొచ్చి మాకిచ్చింది.
”సార్ స్వీట్ తినరు మస్తానీ” చెప్పింది మా ఆవిడ.
”ఏం సార్! షుగరా! ఫరవాలేదు సార్. ఈరోజుకు సగం తినండి. మీరు డాక్టర్లు… ఇంకో రెండు మాత్రలు లేసుకుంటే సరి.”
మస్తానీలోని ఆప్యాయత నాచేత స్వీట్ తినిపించింది.
”ఆ తర్వాత… కథ సాగించు మస్తానీ” అన్నాను.
”ఏముంది సార్! అన్న, నిస్సార్ అబ్బ మమ్మల్ని గాలికొదిలేశాడు. మా నాయన చావుతో మాయింటి మీద వడగళ్లవాన, మా నెత్తిన పిడుగులూ పడ్డాయి… ఒక నెలరోజులు ఏడ్చాం. నిస్సార్‌ని చదివించాలి… కష్టపడి పొట్టలు పోషించుకోవాలి. అప్పటివరకూ రోడ్డు ముఖమెరగని నేనూ, మా అమ్మా బురఖాలు తీసేసి, బ్యాంకు లోనుతో యిదో… ఈ దోసెలు పోస్తున్నాం. నిస్సార్ కోసం కూడబెట్టుకోసాగాను. ఇంతలో అమ్మకు క్షయ… మందులు, మంచి ఆహారం… ‘కూడబెట్టిన వారు మేడ కడతారు’ అంటారు. మేడలూ మిద్దెలూ మాకొద్దు మేడమ్… తలదాచుకోడానికి ఈ గూడుంది. పైసాపైసా కూడబెట్టి రెండు లక్షలు బ్యాంక్‌లో వేసాను. నిస్సార్‌కు ఇంజనీరింగ్‌లో గవర్మెంటు సీటు రాకపోతే డొనేషన్ కట్టాలి గదా!” నిస్సార్ బాగానే చదువుతున్నాడన్నావు గదా! సీటు వస్తుందిలే.”
”వాడు నమ్మకంగా వున్నాడు. పెద్ద దర్గాలో చదివింపులిచ్చాడు. గండి ఆంజనేయసామి గుడిలో వడమాల సేవకు మొక్కుకున్నాడు. కాలినడక కొండ మీదికెళ్లి వెంకటేశ్వరస్వామికి తలనీలాలిస్తానని మొక్కుకున్నాడు. నేనూ కసుమూరు సామికి ముడుపుకట్టాను… చూడాలి… అల్లా మాకు అన్యాయం చేయడులే మేడమ్! వాడు పరీక్ష రాసి వచ్చిన తర్వాత మీ దగ్గరికి పంపుతాను ”కొంచెం ధైర్నం చెప్పండి సార్.”
మస్తానీ లేచి వెళ్లింది.
”మస్తానీకి మీమీద మంచి గురి కుదిరింది మేడమ్” ముంతాజ్ అంది.
”నిస్సార్ వాళ్ల నాయనకు కొడుకుని చూడాలనిపించదా” అడిగింది వరలక్ష్మి.
”అయ్యో మేడమ్! వాడు నా కూతురు మీద కూడా నిందలేసాడు. మస్తానీకి ఇక్కడ మిండ మొగుడున్నాడన్నాడు. వాడితో కాపురం చేసుకోమన్నాడు.”
”ఎంత దారుణం” వరలక్ష్మి అంది.
”దాంతో మస్తాన్ కంటికి కడవడు ఏడ్చింది… గుండెదిటువు చేసుకున్నాం. ఇది చిన్నపిల్ల… మగతోడు లేకుంటే ఊరోళ్ల పిలగాళ్లు దీన్ని రోడ్డున పడేస్తారనే భయంతో కొర్లకుంటరెడ్డి కొడుకుతో జతకట్టింది… నిస్సార్‌ని ఆ రెడ్డి కాన్వెంటులో చేర్పించాడు. మా దురదృష్టం… నాలుగేళ్లకే ఆయన్ని ఎదురు పార్టీవోళ్లు అత్య చేసారు” ముంతాజ్ కంటనీరు.
మస్తానీ వచ్చింది. ఒక సంచి పట్టుకొచ్చింది.
”కత అంతా ఈమె చెప్పేసిందా సార్!” నవ్వుతూ అంది. ఆ నవ్వులో ఎంత ఆత్మవిశ్వాసం. ఎంత మనోధైర్యం.”
”నాకింకేమీ దిగులులేదు సార్! నిస్సార్ ఇంజనీరైతే వాడికీ ఒక ఇంజనీర్ని చూసి కట్టబెట్టితే ఇద్దరూ ఉద్యోగం చేసుకుని బతుకుతారు… వాళ్లు బాగుంటే చాలు… ఈమె కడతేరే దాకా నేను ఒళ్లు దాచుకోకుండా కష్టపడతాను… ఆ తర్వాత ఏముంది నేను కసుమూరు దర్గాలో కసువూడ్చుకుంటూ సేవ చేసుకుంటాను” సంచిలో మంచి ఆపిల్స్, ద్రాక్ష, దోసపండు, జాకెట్‌పీస్, ఆకువక్కా. ట్రేలో పెట్టి వరలక్ష్మికి బొట్టుపెట్టి యిచ్చి మాయిద్దరి కాళ్లకు మొక్కింది మస్తానీ.
కారెక్కాం. ”సార్! నాకత రాయరూ! పేపర్లో ఎయ్యించండి. ఈ జిల్లా వోళ్లంతా సదువుకోవాల” చేతులూపుతూ అంది ముంతాజ్ చేతులెత్తి నమస్కరించింది.
మస్తానీ కథ రాయాలని మొదలెట్టాను. కథకు ఎత్తుగడ… ముగింపు అంతా మస్తానీ ఇంట్లోనే జరిగిపోయింది. కథకు వస్తువు, వాస్తవికత, శైలి, శిల్పం, భాష వెతుక్కోకుండా కుదిరిపొయ్యాయి. ఇక నేను ఏ మసాలా దట్టించాలి? ఏ కాల్పనికతను జోడించాలి? మస్తానీ జీవితానికి నేనింకేమి తీర్పు చెప్పగలను. ఆమె ఆత్మవిశ్వాసం మీద ఆమె అల్లుకున్న కథ ఆమెకే స్వంతం… ఆమెకు ఆమే ఆదరవు.
నా కలానికి నా రచనాచమత్కృతిని నూరిపోసినా కలం కదలడం లేదు. పేపర్లు మడిచేసాను.
”అయిదేళ్లతర్వాత…”
టీ.వీ సీరియల్స్‌లోలాగా… కథను పొడిగించవచ్చు.
అప్పటికి నిస్సార్ ఇంజనీరైపోయి, వాడు పెళ్లి చేసుకుని బెంగుళూరులో కాపురం పెడితే… ఎటూ సెకండ్‌హాఫ్ కథ మొదలౌతుంది కదా… అప్పుడు మళ్లీ మస్తానీ కసుమూరు దర్గాకు పోకముందే కథ రాసేస్తా… ఆమె కడగండ్ల మీద.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags