– డా|| మానేపల్లి
ఇంకా ఈనాడు బాల్యవివాహాలు విరివిగా జరుగుతున్నాయి. ఇవి మన కంప్యూటరైజ్‌డ్ అజ్ఞానానికి సజీవ నిదర్శనాలు. ఒక యదార్థ సంఘటన – ఎదుర్కొని ఆపిన ప్రజా సంఘాలు.. వాస్తవ కథనం.
రాజా రామమోహన రాయ్ సతీ సహగమనాన్ని నిరసిస్తూ, బ్రిటీష్ పాలకుల చేత చట్టం చేయించాడు. కానీ 1980లో రూప్‌కన్వర్ సతీసహగమన దుర్మార్గానికి గురయింది.
కందుకూరి వీరేశలింగం బాల వితంతువులకు వివాహాలు జరిపించాడు. 32 సంస్కరణ వివాహాలు చేసి ఆ జంటలకు ఉపాధి కల్పించాడు. సరోజినీ దేవిని ముల్వాల గోవిందరాజులుకు ఇచ్చి పెళ్లి లేని – ఒక బెంగాలీ / ఇంగ్లీషు కవయిత్రిని (నైటింగేల్ ఆఫ్ ఇండియా) తెలుగింటి కోడల్ని చేశాడు. గురజాడ ‘కన్యాశుల్కం’ అనే వజ్రాయుధంతో అగ్రవర్ణాల్లోని కన్యాశుల్క దురాచారాన్ని ఖండించాడు. అది వరకట్నంగా రూపు మార్చుకుని స్త్రీలని ఈనాటికీ బలితీసుకుంటు న్నది. శారదా ముఖర్జీ 1920-30 ప్రాంతాల్లో రజస్వలానంతర వివాహ చట్టం తెచ్చాడు. సనాతన ఛాందస కుటుంబాల గుండెల్లో రైళ్ళు పరుగెత్తేలా చేశాడు. ఐనా సమాజంలో మార్పు ఇంకా సమగ్రంగా రాలేదు. పట్నాల్లో అక్కడక్కడ, పల్లెల్లో కొంత విరివిరిగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
ఒక జరిగిన సంఘటన
విశాఖ జిల్లా దక్షిణాన-ఎలమంచిలి అనే చిన్నపట్నం వుంది. గురజాడ జన్మించింది ఎలమంచిలి తాలుకా సర్వసిద్ధి రాయవరం. సర్వసిద్ధి గ్రామం చాలా పురాతన చరిత్రగల ఊరు. ఇక్కడ ముఫ్పయి సంవత్సరాల క్రితమే జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలలో అప్పికొండ రూప అనే అమ్మాయి ఆరవ తరగతి చదువు చున్నది. తండ్రిపేరు సూర్యవెంకట రమణ. తల్లిపేరు వరలక్ష్మి. ఆమెకు తమ్ముడు ఉన్నాడు. అతని పేరు కలగా రమణ పదవ తరగతి చదివానని చెబుతున్నాడు.
రూప వయస్సు స్కూలు రికార్డు ప్రకారం పది నిండి పదకొండు నడుస్తున్నది. (పుట్టిన తేది 21-6-1996) ఆ యింట్లో డెభ్బయ్య యిదు – ఎనభయ్ దగ్గర వయస్సు వున్న వృద్దురాలు ఉన్నది.
కోట్లాది మంది సగటు మనుషుల్లాగే తాను బ్రతికుండగానే మనుమరాలి పెళ్లి తన కొడుకుతో జరగడం కళ్లారా చూడాలనుకుంది.
ఐతే ఆ అమ్మాయి చదువుతున్న గరల్స్ హైస్కూల్లో టీచర్లు ఈ పెళ్ళిని ఖండించారు. ఆరవ తరగతిలో ఇది తగదన్నారు. వినలేదు. ఆ స్కూల్ ఇన్‌చార్జ్ హెడ్ మిస్ట్రెస్ 16-4-2007 సోమవారం నాకు ఫోన్ చేశారు. నేను పౌర హక్కుల సంఘాల మహిళా సంఘాల మిత్రులకు (విశాఖ పట్నం) ఫోన్ చేశాను. ఈలోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాను.
పెళ్ళి కొడుకు – కలాగా రమణ. ఆ వూరు ఎలమంచిలికి మూడు కిలో మీటర్ల దూరంలో వుంది గనుక ఎలమంచిలి మండలం అనుకుని సదరు తహసీల్దారు శ్రీ ధర్మలింగా రెడ్డి గార్ని కలిశాం. ఆయన తక్షణమే స్పందించి విచారణ జరిపి, ఆ గ్రామం నుంచే సరిగ్గా కశింకోట మండలం ప్రారంభమనువుతుందన్నారు. మే కాశిం కోట తహశీల్దారు గార్ని కలిశాం. ఆయన పేరు మాణిక్యం. వారు వెంటనే సంబంధిత రెవిన్యూ ఇన్ స్పెక్టర్ని సబ్‌ఇన్‌స్పెక్టర్ని విషయం విచారించి – వారిని తీసుకురావలసిందిగా మా ముందే ఆదేశాలు జారిచేశారు.
పెళ్లి కూతురు రూపను – చెర్లో పాకెం అనే గ్రామంలో నుండి 18/4న (బుధవారం) పెళ్లికూతుర్ని చేసి – అచ్యుతాపురం తీసుకు వస్తారు. ఆవూరు మునగ పాక మండలంలో వుంది. ఆ మండలం సంబంధిత రెవెన్యూ ఇన్ స్పెక్టరు, సబ్ ఇన్ స్పెక్టరు – ఇద్దరికీ ఈ విషయం చెప్పి తగు చర్య తీసుకోవలసిందిగా హెచ్చరికలు వెళ్లాయి. బుధవారం సాయంత్రం బాగా పొద్దు పోయాక – ఇరుపక్షాల పెద్దల్ని కూర్చుండ బెట్టి ఇది తగదు – చట్టరీత్యా బాల్య వివాహం నేరం అని పోలీసులు రెవెన్యూ అధికారులూ, పౌరహక్కుల సంఘం, మహిళా సంఘాల ప్రతి నిధులు అందరూ చెప్పగా అందుకు వారు అంగీకరించారు. ముసలమ్మ తన కళ్ళముందు పెళ్లి జరగాలని కోరడం ఒక కారణం చెప్పారు. ఆస్తి పాస్తుల సమస్యలు కావు. ఒక డాబాయిల్లు తప్ప వేరే ఏమి లేదు.
ఇది ప్రజా సంఘాలు సాధించిన ప్రజా విజయం. న్యాయం గెలిచింది. చట్టం, న్యాయం వీటన్నిటి కంటే సంఘ నియమాలు, కుల కట్టుబాట్లు బలమైనవి. దీనికి చదువుతో, డిగ్రీలతో సంబంధం లేదు. మనలో అక్షరాస్యులున్నారు గాని, శాస్త్రీయ ధృక్పథం, ప్రజాస్వామ్య విలువలు, ఉన్నత మానవ సంబంధాల కోసం కృషి ఇవేవీ లేవు. టీవీ – తప్పుడు సీరియల్స్‌ని చూపిస్తున్నంతగా శాస్త్రీయ విలువలని చూపడం లేదు. మైనర్ అయిన అబ్బాయి అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎవరూ ఆపడం లేదు. పైగా అవే మంచివనీ – లేకపోతే కుర్రకారు పోతారనీ – వక్రపు ఆలోచనలు చేస్తున్నారు. సరిదిద్ధ వలసినది పోయి సపోర్టు చేస్తున్నారు. ఆడ పిల్లలకు 18, మగపిల్లలకు 21 వయసు వచ్చే వరకు పెళ్ళి చేయరాదు. (ఇది 20, 23 కు పెంచారని తెలుస్తుంది)
కేవలం 13, 14 సం||ల ఆడపిల్లలకు – రజస్వలానంతరమే పెళ్ళి చేసేస్తే – వాళ్ళు కాపురాలు చేసి 15, 16 ఏళ్ళ వయసు లోనే తల్లులవుతారు. పాతికేళ్ళు వచ్చేసరికి ఆరోగ్యం, యౌవనం పోయి అకాల వృద్ధాప్యానికి గురయ్యే అవకాశాలున్నాయి.
మన ప్రభుత్వాలూ, పెద్దలూ – ఎయిడ్స్ గురించి ఊరూ వాడా గగ్గోలు పెట్టేంతగా – బాల్యవివాహాలు పట్టించుకోవడం లేదు. కేవలం మగ పిల్లవాడు లేడని రెండవ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వధూ వరుల మధ్య ఉండకూడనంత వ్యత్యాసం ఉంటున్నది. విశాఖ జిల్లాలోనే 54 సం||ల వ్వక్తితో 18 సం||ల అమ్మాయిపెళ్ళిని కుటుంబం మొత్తం అంగీకరించారట! ఉభయ పక్షాల అంగీకారం తోనే జరుగుతుంది గదా – మీ గొడవ ఏమిటి మధ్యలో అని అడగవచ్చు. అమాయకత్వం, అజ్ఞానం రెండూ తప్పే. మనం ఎంతో గొప్ప నాగరికత సాధించిన మాట నిజమే కానీ పాత రాతి యుగపు అవశేషాలు పూర్తిగా పోలేదు. అపుత్రస్య గతిర్నాస్థి, పుత్ర సంతానం లేకుంటే పున్నామనరకానికి పోతారు – అనే నమ్మకాలు విద్యా వంతులని చెప్పుకునే వాళ్ళలో ఇప్పటికీ బలంగా వున్నాయి.
మహిళా సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీసు – ఈ యంత్రాంగం మొత్తం ఏమీ చేయడం లేదు. ప్రజా సంఘాల గొడవ చేస్తే తప్ప కదలడం లేదు. దుస్తులు, అధునాతన పరికరాలు ఉండగానే సరికాదు. ఆలోచనలు శాస్త్రీయంగా వుండాలి. ప్రభుత్వాలు మౌనం వహిస్తున్న చోట, కొన్ని ప్రజా సంఘాలు గట్టిగా నిలబడటం అభినందించవలసిన అంశం. రాజకీయ నాయకులు పార్టీ కుమ్ములాటలాపి ప్రజల్ని పట్టించుకోవాలి.
విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలో ఒక ఆరవ తరగతి అమ్మాయికి జరపతలపెట్టిన పెళ్ళి వివరాలు ‘అవగాహన’ ఆరాతీసింది. వివిధ ప్రజా సంఘాల సహకారంతో, తహసీల్దారు, పోలీసు వారితో కలిపి ఆపుచేశారు. మనచుట్టూ జరుగుతున్న ఈ దుష్టసంప్రదాయాన్ని వ్యతిరేకిద్దాం. శాస్త్రీయ దృక్పధాన్ని ప్రజాస్వామ్మ విలువల్ని ఎత్తి చూపుదాం. ఆచరణలేని ఆశయాలు వ్యర్థం అని ఎలుగెత్తి చాటుదాం.
ఆగిన పెళ్లి
కశింకోట మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో బుధవారం మహిళాసంఘాలు అడ్డుకోవడంతో మరో బాల్యవివాహాం నిలిచిపోయింది. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్దాలను వధూవరులకు, వారి తల్లిదండ్రులకు వివరించడంతో వివాహ వయసు వచ్చాకు పెళ్లి చేసుకుంటామని వధూవరులు అంగీకరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.
(వ్యాసకర్త ప్రముఖ కవి విశాఖజిల్లా ఎలమంచిలిలో ‘అవగాహన’ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. విరసం, పౌరహక్కుల సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు.)