‘శాంతి’ వీరి ప్రాణమంత్రం

పసుపులేటి గీత
‘ఇవాళ మీరు సాధించిన ఈ విజయం ప్రపంచంలో శాంతి, న్యాయం, సమానత్వాల కోసం పరిశ్రమిస్తున్న అనేకానేక మంది మహిళలకు స్ఫూర్తిదాయకం…’
– జోడీ విలియమ్స్‌ (1992 నాటి నోబెల్‌ పురస్కార గ్రహీత)
లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్‌ జాన్సన్‌ సర్లీఫ్‌, లైబీరియా శాంతి ఉద్యమ కార్యకర్త లేమా బోవీ, యెమెన్‌ ప్రతిపక్షనేత తవక్కుల్‌ కర్మన్‌లకు అత్యున్నత నోబెల్‌ శాంతి బహుమతి లభించిన సందర్భంగా గతంలో నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీతలైన జోడీ విలియమ్స్‌, షిరిన్‌ ఎబదీ, మైరీడ్‌ మాగురీ, రిగోబెర్టా మెంచూ తమ్‌లు పంపిన అభినందన లేఖలో జోడీ వెలిబుచ్చిన అభిప్రాయమిది.
నూట పదేళ్ళ నోబెల్‌ బహుమతుల ప్రస్థానంలో కేవలం 43 మంది మహిళలు మాత్రమే ఈ అత్యున్నత పురస్కారాన్ని పొందగలిగారు. మహిళలు నోబెల్‌ బహుమతిని గెలుచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒకటే మాట వినాల్సి వస్తోంది. ‘ఇదంతా రాజకీయమే…!’ ఇవాళ ఈ ఏటి నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ముగ్గురు మహిళలు పంచుకున్న సందర్భంలో కూడా మనకు ఈ మాట యధావిధిగానే వినిపించింది. ‘ఒక పురుషుడు విజేత అయితే అతణ్ణి పుట్టుకతోనే నాయకత్వపు లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా శ్లాఘించే ఈ సమాజం నేటికీ ఒక మహిళను విజేతగా గుర్తించాల్సి వస్తే అదేదో అసహజ పరిణామం కిందనే భావిస్తుంది’ అన్న మార్గరెట్‌ అట్‌వుడ్‌ మాటల్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాల్సిందే. మనసును ముల్లులా తొలిచే ఇలాంటి ప్రేలాపనల్ని పక్కనబెడితే, ఇది నిజంగా అందరం ఆనందించాల్సిన సందర్భం. ఎందుకంటే ఈసారి నోబెల్‌ శాంతి పురస్కారం, ‘మహిళల భద్రత కోసం, మహిళల హక్కుల కోసం’ కేవలం మహిళలు మాత్రమే చేయగలిగిన అహింసాయుత పోరాటాన్ని వరించింది కాబట్టి. శాంతి కోసం, మనకోసం, మన క్షేమం కోసం ఉద్యమించిన  మనకాలపు ముగ్గురు యోధుల గురించిన కాసిని మాటలు పంచుకుందాం.
ఉక్కుమహిళ
ఎలెన్‌ జాన్సన్‌ సర్లీఫ్‌ (67)ని లైబీరియా ప్రజాస్వామిక ఉద్యమకారులందరూ ప్రేమగా ‘ఉక్కుమహిళ’ అని సంబోధిస్తుంటారు.
‘మీ కలలు మిమ్మల్ని భయపెట్టలేదంటే, ‘అవి గొప్ప కలలేమీ కావు’ అంటారు ఎలెన్‌. రమారమి ముప్ఫై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. ‘నేను పుట్టినపుడు ఒక వృద్ధుడు మా అమ్మని పరామర్శించి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. మేము నివసించే మోన్రోవియాలో ఇది ఆచారం. ఊయల్లో కాళ్ళూ, చేతులూ ఊపుతూ కేరింతలు కొడుతున్న నన్ను చూసి అతను సంభ్రమాశ్చర్యాలతో, మార్తా (మా అమ్మ) నీ బిడ్డ ఈ దేశాన్ని ఏలుతుంది అన్నాడట. మా అమ్మ, అక్కాచెల్లెళ్ళు నన్ను చాలాసార్లు ఈ కథ చెప్పి ఏడిపిస్తుంటారు. మోన్రోవియాలో పిల్లలందరూ బడికెళ్ళే వయసులో నేను నా పదిహేడో ఏట పెళ్ళి చేసుకుని, మొగుడి చేతిలో చావుదెబ్బలు తింటున్నపుడు మా అమ్మ ఆనాటి వృద్ధుని మాటల్ని తలచుకుని దిగులుపడేది. చదువుకోసం, జీవితంకోసం నేను నాభర్తనుంచి విడాకుల్ని పొందడానికి పోరాడాను. విముక్తి పొందిన తరువాత ఒక చదువుకున్న మహిళగా సమాజంలో అడుగుపెట్టినపుడు, ముఖ్యంగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినపుడు అమెరికా-లైబీరియన్‌గా నా పుట్టుకే వివాదాస్పదమైనప్పుడు, జైళ్ళ పాలైనపుడు, ప్రవాసాలకు పరుగులు పెట్టినపుడు కూడా మా అమ్మ ఆ వృద్ధుని జోస్యాన్ని తలచుకుని విచారించేది’ అంటారు ఎలెన్‌.
లైబిరియాలో సైనిక నియంత శామ్యూల్‌ డో అరాచక పాలనకు వ్యతిరేకంగా 1980ల్లో చార్లెస్‌ టేలర్‌తో కలిసి ఉద్యమించినపుడు ఎలెన్‌ కారాగారవాసాన్ని అనుభవించారు. అదే చార్లెస్‌ టేలర్‌ అధ్యక్షునిగా దేశాన్ని పాలించి, యుద్ధనేరస్తునిగా చరిత్రపుటల్లోకెక్కిన తరువాత, అతడిని సమర్ధించిన నేరానికిగాను ప్రజల దృష్టిలో ‘ముప్ఫై ఏళ్ల వరకు ఏ పదవినీ చేబట్టకుండా నిరోధించాల్సిన రాజకీయనేతల జాబితా’లో ఆమె పేరు కూడా చేరింది. ఇలాంటి సంక్షోభం కూడా ఎలెన్‌ ఉక్కు సంకల్పాన్ని ఎంతమాత్రం దెబ్బతీయలేదు. ముప్ఫైఏళ్ల రాజకీయ చరిత్ర కలిగి ఉన్నప్పటికీ సొంత పార్టీలోనే ఆమెను ‘బామ్మ’ని చేసి, మూల కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది. ప్రతిపక్ష ప్రభుత్వాలు వేధింపులకు పాల్పడినప్పుడు ఎలెన్‌ రెండుసార్లు దేశాన్ని విడిచి, ప్రవాసబాట పట్టాల్సి వచ్చింది. ఇన్ని సవాళ్ళ మధ్య కూడా గమ్యం వైపు ఆమె సాగించిన ప్రయాణం ఆగిపోలేదు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన ఆఫ్రికా డైరెక్టర్‌కి ఆర్థికమంత్రిగా ఆమె 1970ల్లో పనిచేశారు. అంతఃకలహాలతో నిరంతర యుద్ధభూమిగా మారిన లైబీరియా ఆర్థికపరిస్థితి పూర్తిగా అస్థవ్యస్తమైన దశలో ఆమె దేశాధ్యక్ష పదవిని చేబట్టారు. ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామిక పద్ధతిలో ఒక దేశానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ ఎలెన్‌. అప్పటికీ లైబీరియా సమాజం ఒక మహిళను అధ్యక్ష పదవిలో ఊహించుకోలేని స్థితిలోనే ఉంది. ‘ఇప్పటి స్థితిని ఎదుర్కుని తిరుగుబాటుదారుల్ని దారికి తేవాలంటే అది ఒక మగవాడి వల్లనే సాధ్యమవుతుంది కానీ, ఒక స్త్రీవల్ల సాధ్యం కాదు’ అని విద్యావేత్తలైన వ్యక్తులే వ్యాఖ్యానించే పరిస్థితిలో ఎలెన్‌ లైబీరియాని ఒక శాంతి ధామంగా మార్చే బాధ్యతని భుజాలకెత్తుకున్నారు. ప్రభుత్వ భూసంస్కరణల సమాఖ్య అధ్యక్షురాలిగా 2003లో పనిచేసిన సమయంలో ఆమె భూసంస్కరణల్ని సమర్థవంతంగా అమలు చేశారు. విలియం టోల్బెర్ట్‌, విలియం టబ్బాన్‌ల ప్రభుత్వాల్లో ఆమె ఆర్థికమంత్రిగా వ్యవహరించారు. ప్రపంచ బ్యాంకులో కూడా ఎలెన్‌ పనిచేశారు. పధ్నాలుగేళ్ళ అంతఃకలహాలతో విద్యుత్‌, ప్రజాపంపిణీ, తదితర వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమైన లైబీరియాకి కోట్లాది రూపాయల ఆర్థిక రుణభారం నుంచి విముక్తి కల్పించారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించిన ఎలెన్‌ విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేసి, దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి, యుద్ధగాయాలతో కునారిల్లిన ఆ దేశ మహిళల అభ్యున్నతికి అహరహం శ్రమిస్తున్నారు. ఈ శ్రమే ఆమెను నోబెల్‌ శాంతి బహుమతికి అర్హురాలిని చేసింది.
తల్లుల పోరాటం
ఒకానొక పదకొండో తారీఖునాటి ఉదయం, సిటీహాల్‌ మెట్ల మీద శ్వేత సముద్రం ఉప్పొంగింది. వేలాదిమంది మహిళలు అక్కడ గుమికూడారు. యుద్ధతాంత్రికుడు, దేశాధ్యక్షుడు చార్లెస్‌ టేలర్‌ అనుయాయులతోపాటు, సైనికులు కూడా ఆ మహిళల సమూహంలో కలగలిసిపోయారు. మహిళలు తమ జీవన్మరణ పోరాటాన్ని క్షణక్షణం ఉధృతం చేస్తున్నారు. వారిలో పిల్లల్ని కోల్పోయిన మహిళలు, టేలర్‌ పాలనతో విసిగిపోయిన మహిళలు, ఇంకా ఇంకా ఎందరో కలగలిసిపోయారు. ‘మా డిమాండ్‌ ఒక్కటే, సైనికుల కాల్పుల విరమణను ప్రకటించాలి. ప్రభుత్వమూ, తిరుగుబాటుదారులూ చర్చల్లో పాల్గొనాలి’ అని ముక్తకంఠంతో మహిళలు నినదిస్తున్నారు. ‘ఇన్నాళ్ళూ నోళ్ళు మూసుకుని పడి ఉన్నాం కానీ, హత్యలకీ అత్యాచారాలకీ గురై, రోగగ్రస్తులమై, మా పిల్లలు, కుటుంబాలు సర్వనాశనమైన ఈ తరుణంలో మాకు యుద్ధం ఒక్కటే నీతిని బోధించింది. హింసని వ్యతిరేకించాలి, శాంతిని ఆహ్వానించాలి, శాంతి పునరుద్ధరణ జరిగేవరకు మా పోరాటం ఆగదు’ అంటూ లేమా బోవీ ఆ ఉద్యమకారుల సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతటి ప్రతిఘటననూ టేలర్‌ లక్ష్యపెట్టలేదు. రాజధాని మోన్రోవియా నగరంలోని ఒక చిన్న చేపల మార్కెట్‌ దగ్గర మళ్ళీ మహిళలు వేలాదిగా గుమికూడారు. ‘విమెన్‌ ఆఫ్‌ లైబీరియా మాస్‌ యాక్షన్‌ ఫర్‌ పీస్‌’కు ఆ చేపల మార్కెట్‌ నాందీ క్షేత్రమైంది. ఆ మహిళలంతా అక్కడే కూర్చున్నారు. రోజులు గడుస్తున్నాయి. వందలు, వేలు దాటి ఇంకా ఇంకా మహిళలు ఆ ప్రతిఘటనలో చేరుతూనే ఉన్నారు. ‘విమెన్‌ ఇన్‌ పీస్‌ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌’ కార్యకర్తలు వాళ్లందరికీ తెల్లని టీషర్టుల్ని పంపిణీ చేస్తూనే ఉన్నారు. లైబీరియా మహిళలకు ఇప్పటికిప్పుడు కావలసింది శాంతి మాత్రమే. మూడు రోజులు, ఆరు రోజులు గడిచిపోయాయి. టేలర్‌ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా లేదు. ‘ఎన్నాళ్ళయినా ఎండలో, వానలో ఇలాగే కూర్చుంటాం. మాకు అధ్యక్షుడు జవాబు చెప్పి తీరాలి’ ఇదీ ఆ మహిళల రణన్నినాదం. చిట్టచివరికి ఒకరోజు స్పీకర్‌ దగ్గరినుంచి లేమా బోవీకి సందేశం వచ్చింది. ‘ఏప్రిల్‌ ఇరవైమూడున ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌కు రండి, ఆయన (టేలర్‌) అక్కడ మిమ్మల్ని కలుసుకుంటారు!’ ఇదీ ఆ సందేశ సారాంశం. సామాన్య మహిళలతో కలిసి, ‘సెక్స్‌ స్ట్ట్రయిక్‌’ను పాటిస్తూ లేమా సాగించిన ఈ అహింసాయుత పోరాటం లైబీరియా చరిత్రలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
‘ఈస్ట్రన్‌ మెన్నోనైట్‌ విశ్వవిద్యాలయం’ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసిన లేమా బోవీ మధ్య లైబీరియాలో జన్మించారు. ఆమె 2002లో సామాజిక కార్యకర్తగా ‘విమెన్‌ ఆఫ్‌ లైబీరియా మాస్‌ యాక్షన్‌ ఫర్‌ పీస్‌’ని నెలకొల్పారు. లేమా బోవీ ప్రధానపాత్రగా 2008లో ‘ప్రే ద డెవిల్‌ బ్యాక్‌ టు హెల్‌’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. శాంతికి చిహ్నంగా తెల్లని టీషర్టులు ధరించిన సామాన్య లైబీరియా మహిళల్ని శాంతియోధులుగా తీర్చిదిద్దిన ఘనత ఆమెది.
పదిహేడేళ్ళ బాలికగా లేమా బోవీ మోన్రోవియాలో అడుగుపెట్టారు. అప్పటికే అక్కడ మొదటి లైబీరియా అంతఃకలహం పతాకస్థాయిలో ఉంది. చిన్నప్పటినుంచి యుద్ధం మధ్య పెరిగిన ఆమెకు ఆ యుద్ధానికి విరుగుడు తల్లుల పోరాటమేనని మోన్రోవియాలో అడుగుపెట్టిన తొలి క్షణంలోనే అర్థమైంది. టేలర్‌ సైన్యంలో పనిచేసిన బాలసైనికులకు మానసిక చికిత్స అందించే కౌన్సిలర్‌గా ఆమె తన సేవలను అందించింది. విమెన్‌ ఇన్‌ పీస్‌ బిల్డింగ్‌ నెట్‌వర్క్‌లో చేరి, లైబీరియాలోని క్రైస్తవ, ముస్లిం మహిళల్ని సంఘటితపరిచింది. ఘనాలో శాంతి చర్చలు జరిగిన సందర్భంగా అధ్యక్షుడు టేలర్‌ మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆమె లైబీరియా మహిళల్ని ఘనాకి తీసుకువెళ్ళింది. లేమాని ఎన్నో ప్రజాసంస్థలు పలు అవార్డులతో సత్కరించాయి. ‘జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ప్రొఫైల్‌ ఇన్‌ కరేజ్‌’ అవార్డు, ‘గ్రబర్‌ ఉమెన్స్‌ రైట్స్‌ ప్రైజ్‌’ అలాంటి వాటిలో కొన్ని మాత్రమే. ‘విమెన్‌, పీస్‌ అండ్‌ సెక్యూరిటీ నెట్‌వర్క్‌ ఆఫ్రికా’కు ఆమె ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లైబీరియాలో ద్వితీయ అంతఃకలహాలకు 2003లో తెరదించి, ఎలెన్‌ జాన్సన్‌ సర్లీఫ్‌ను అధ్యక్షురాలిగా చేయడానికి దోహదం చేసిన పరిణామాలకు లేమా బోవీ (30) కారకురాలు. ‘సమాజంలో ఏ మార్పు రావాలన్నా అది తల్లుల ద్వారానే సాధ్యమన్నది’ ఆమె ప్రగాఢ విశ్వాసం.
శృంఖలాలకు చెల్లుచీటీ
‘ఒక ముస్లిం మహిళగా మీ పోరాటంలో మీరు ఎంతటి కఠిన పరీక్షల్ని ఎదుర్కొన్నారో, ఎన్ని కష్టనష్టాల్ని అనుభవించారో నేను అర్థం చేసుకోగలను…, అనితరసాధ్యమైన మీ పోరాట పటిమను నేను అభినందిస్తున్నాను. వివక్షకు, అణచివేతకు గురవుతున్న కోట్లాది ముస్లిం మహిళలకు మీ విజయం ఒక ఆశావహమైన హామీనిస్తోంది…’ అంటూ యెమెన్‌ మానవహక్కులు, మహిళా హక్కుల నేత తవక్కుల్‌ కర్మన్‌ను షిరన్‌ ఎబదీ (2003 నాటి నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత) అభినందించారు. దేశంలోని ప్రజాస్వామిక శక్తులపై యెమెన్‌ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్‌ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను ఎదిరించి పోరాడుతున్న కర్మన్‌ (32) నోబెల్‌ బహుమతి గ్రహీతల్లో అతిపిన్నవయస్కురాలు.
యెమెన్‌ రాజధాని నగరం ‘సనా’లోని ‘ఫ్రీడమ్‌ స్క్వేర్‌’ దగ్గర ప్రతి మంగళవారం మానవహక్కుల ఉద్యమకారులతో కర్మన్‌ ధర్నాల్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ప్రజాపోరాటాలు, ప్రజల భాగస్వామ్యం లేని శాంతియుత ఉద్యమాలన్నీ డొల్లకబుర్లేనంటారు ఆమె. ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాంతియుత నిరసన ప్రదర్శనలే కర్మన్‌ ఆయుధం. యెమెన్‌లో మానవహక్కులకు ప్రతీఘాతుకంగా మారిన నిరంకుశ సలేహ్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే కర్మన్‌ లక్ష్యం. ఈ మంగళవారపు ధర్నాలు 2007 నుంచి క్రమం తప్పకుండా నడుస్తున్నాయి. యెమెన్‌ సమాజంలో మహిళలు బహిరంగంగా ప్రజాసమస్యలపై పోరాడడం చాలా అరుదైన విషయం. ‘యెమెన్‌లో ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛను పొందేదాకా మా పోరాటం ఆగదు’ అని అంటారామె. వాక్స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రాల విలువ తెలిసిన కర్మన్‌ 2005లో ‘విమెన్‌ జర్నలిస్ట్స్‌ వితవుట్‌ చైన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. ‘మహిళా సమస్యల్ని విశదీకరిస్తూ విద్యని, సంస్కృతిని, సమాజాభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో మేము అన్ని రకాలైన ప్రసార మాధ్యమాల్ని వినియోగిస్తున్నాం. ఫోన్‌కాల్స్‌, ఉత్తరాలు, ఇంకా అనేకానేక మార్గాల్లో నాకు నిత్యం బెదిరింపులు వస్తుంటాయి. అరెస్టు చేస్తామని, చంపుతామని బెదిరిస్తుంటారు. భావప్రకటనా స్వేచ్ఛని హరించడమన్నది ఏ ఇతర హింసకన్నా తక్కువేమీ కాదు. అందుకే నేను రాజీ పడను’ అంటారు కర్మన్‌. జర్నలిస్టులు, మీడియా హక్కుల కోసం పోరాడే నిమిత్తం విమెన్‌ జర్నలిస్ట్స్‌ వితవుట్‌ చైన్స్‌ ప్రారంభమైనప్పటికీ, అది క్రమేణా ప్రజాహక్కులు, మానవహక్కుల పోరాటానికి కూడా విస్తరించింది. ప్రభుత్వంతో ముఖ్యంగా, సమాచార మంత్రిత్వశాఖతో కర్మన్‌ గట్టిపోరాటమే చేస్తున్నారు. ఇటీవలే ఆ ప్రభుత్వం మీడియా హక్కుల్ని కాలరాస్తూ ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. పాత్రికేయుల్ని నేరస్తుల్ని చేసి, విచారించడానికే ప్రత్యేకంగా యెమెన్‌ ప్రభుత్వం ఒక కోర్టును నెలకొల్పిందంటే అక్కడి పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక పత్రికను స్థాపించాలన్నా, ఛానెల్‌ను ప్రారంభించాలన్నా కొత్త చట్టాల ప్రకారం లక్ష డాలర్లకు పైగానే రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులెవ్వరూ నోరెత్తకుండా చేయడానికే ప్రభుత్వం ఇటువంటి పన్నాగాలకు పాల్పడుతోందని కర్మన్‌ ఆరోపిస్తున్నారు.
ఎన్నో సందర్భాల్లో కర్మన్‌ మరణాన్ని తృటిలో తప్పించుకున్నారు. ఇస్లా ప్రతిపక్ష పార్టీకి చెందిన సురా కౌన్సిల్‌లో కేవలం 13 మంది మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. వారిలో కర్మన్‌ కూడా ఒకరు. తనపై జరిగిన హత్యాయత్నాల్ని పార్టీ సహచరుల సహాయంతో తిప్పికొట్టారు కర్మన్‌. యెమెన్‌లో మహిళలు ఆపాదమస్తకం బురఖా కప్పుకుని కనిపిస్తారు. ప్రజాఉద్యమాల్లో పాల్గొనే ఒక మహిళకు అది చాలా ప్రతిబంధకంగా ఉంటుందని భావించిన కర్మన్‌ కేవలం తల మీద స్కార్ఫ్‌ని మాత్రమే కప్పుకోవడం మొదలుపెట్టారు. యెమెన్‌ సంప్రదాయవాదులకు ఇది కంటగింపుగా మారింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన కర్మన్‌ ఒక జర్నలిస్టు మాత్రమే కాదు యెమెన్‌లో విప్లవ వృక్షానికి తల్లివేరు వంటి వ్యక్తి. ‘నువ్వొక నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నావంటే నువ్వు ఇదివరకు చూడని మహాద్భుతాన్ని చూడబోతున్నావన్న మాట. పాటలతో, నినాదాలతో వందలాది మహిళలు గుడారాల్లో కంటిమీద రెప్ప వాల్చకుండా కొత్త జీవితం కోసం పోరాడుతున్నారు. ఇది రాజకీయ ఉద్యమం కాదు, ఇదొక సామాజిక ఉద్యమం’ అంటారు కర్మన్‌. సలేహ్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి, అరబ్‌ జాతుల భావిచరిత్రలో ఇక నిరంకుశత్వానికి చరమగీతం పాడాలన్న కర్మన్‌ ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.
‘శాంతి స్థాపన కోసం నువ్వెంత చెమటను చిందిస్తావో, యుద్ధంలో నువ్వంత తక్కువ రక్తపాతాన్ని చూస్తావు’ అన్న చైనీస్‌ సామెతను కార్యాచరణలోకి అనువదిస్తున్న ఈ ముగ్గురు శాంతియోధుల అవిశ్రాంత పోరాటం గమ్యం వైపుగా విజయపథంలో పయనించాలని కోరుకుంటూ…

Share
This entry was posted in గౌరవసంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.