మునుకుంట్ల శ్రీనివాస్, బి. కిషన్
ప్రపంచంలో ఏ సమాజంలోను హోదాలోగాని, ఉన్న అవకాశాలను వినియోగించు కోవటంలో గాని, స్త్రీ పురుషునితో, సమానమైన స్థానం లభించటం లేదు.
కొన్ని సమాజాలలో స్త్రీ వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని అనుభవించే అవకాశాలుకూడా కరువైనాయి. ఇందువల్ల ఆవిడ సామాజిక, కుటుంబ అభివృద్ధికి ఎంత కృషి చేసినా, ఆ కృషి ఫలితం గుర్తింపుకు రావటం లేదు; పైగా ఆ కృషీ ఫలితంలో తనకు న్యాయంగా గిట్టవలసిన వాటా కూడా రావటం లేదు.ఈ స్త్రీ-పురుష అసమానత్వానికి బహుముఖాలు ఉన్నాయి.
స్త్రీల యెడల ప్రదర్శితమవుతున్న అన్ని రకాల వివక్ష అంతరించాలి అని, ”కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్‌ృ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎగైన్‌స్ట్ ఉమెన్” చేసిన తీర్మానాన్ని 1979వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఇది విప్లవాత్మకమైన తీర్మానం. దీని 41 దేశాలు ఆమోదించలేదు. ఆరు దేశాలు సంతకాలయితే చేశాయి; దానికి కట్టుబడి ఉంటాయని మాత్రం ప్రకటించలేదు. 43 దేశాలు కొన్ని మినహాయింపులతో అంగీకరించాయి. ఇలా దాదాపు తొంభై దేశాలు ఇంకా స్త్రీ పురుష సమానత్వాన్ని సూత్రప్రాయంగా నైనా అంగీకరించటం లేదు! ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేసిన దేశాలలో కొన్ని, ఆ తీర్మాన ఆదేశాలను అమలు పరచటానికి ఉత్సాహాన్ని చూపటం లేదు. ఆచరణ ఎలా ఉన్నా, సూత్రరీత్యా కూడా స్త్రీ-పురుష సమానత్వానికి ఆమోదం లభించటం ఇంకా కష్టంగానే ఉన్నది. దీనికి పూర్వమే, 1948వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల రక్షణ మీద ఆమోదించిన తీర్మానపు అమలు కూడా ఇలాగే ఉన్నది.
సర్వజనీన మానవ హక్కుల ప్రకటనను (దీన్ని ”యూని వర్సల్ డిక్లరేషన్ ఆప్ హ్యూమన్ రైట్స్” అని ఇంగ్లీషులో పేర్కొన్నారు) ఐక్యరాజ్య సమితి పారిస్‌లో జరిపిన సమావేశంలో 1948వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ తెల్లవారుఝామున మూడు గంటలకు ఆమోదించింది. మానవ హక్కులను స్త్రీ పురుష, వర్గ, వర్ణం, మతంతో బేధం లేకుండా అందరూ అనుభవించాలని ఆ తీర్మానం పేర్కొన్నది. ఇందులోవిద్య, వైద్యం, ఉపాధి, సమాన జీవనావకాశాలు, వ్యక్తిగత ప్రతిష్ఠ, గౌరవం, భద్రత, స్వాతంత్య్రం వంటి వాటిని అందరూ అనుభవించటంతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో సమానంగా పాల్గొనే అవకాశాలు అందరకూ లభించాలి అనే అంశాలు కూడా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ స్త్రీల హక్కుల రక్షణ పేరిట ఆమోదించిన పలు తీర్మానాలున్నా, పురుషులతో సమానావకాశాలు, సమాజంలో ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో సమాన ప్రతిపత్తి స్త్రీలకు ఇంకా గగన కుసుమాలు గానే ఉన్నాయి.
మంత్రాలకు చింతకాలయలురాలవన్నది ఏనాడో రూపొం దించిన సామెత, స్త్రీ పురుష సమానత్వ సాధనా సమస్య కూడ ఇంత జటిలమైనదే. అంత సులభంగా పరిష్కరించవీలయినది కాదు. సాంస్కృతిక, రాజకీయ,ఆర్థిక విధానాలలో సమూలమైన మార్పులు వచ్చినప్పుడే స్త్రీపురుష సమానత్వ సాధనసాధ్యమవుతుంది. మన ఆలోచనా విధానాలే మారాలి. స్త్రీ అంటే వంటింటి కుందేలనే భావం సామాజికులలో అంతరించాలి. సామాజికాభివృద్ధికి స్త్రీల సృజనాత్మక శక్తుల వినియోగం కూడా అవసరమేనన్న భావం సామాజికులలో అంకురించాలి. అప్పుడే స్త్రీలకు పురుషులతోడి సమానావకాశాలు లభిస్తాయి. ఇప్పుడు చలామణీ అవుతున్న, పురుషాధిక్యత అంతరిస్తుంది. ఇది జరిగినప్పుడే దారిద్య్రం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి జాడ్యాల నుండి స్త్రీలకు మాత్రమే గాదు, ప్రజలందరకూ విముక్తి కలుగుతుంది. మానవ సృజనాత్మక, శక్తుల వికాసానానికీ, లోక కళ్యాణానికీ, స్త్రీ పురుష సమానత్వ సాధన అవసరం. ఇందుకు ప్రభుత్వాలు, కార్యదీక్షను ప్రదర్శించటం అవసరం. దీనికి తోడుగా రాజకీయ ఉద్యమాలు కూడా నడవాలి. అప్పుడే ఈ కార్యసాధన సాధ్యమవుతుంది.
సమానత్వ సాధనకు రాజకీయోద్యం
స్త్రీ పురుష సమానత్వ సాధనకు రాజకీయ ఉద్యమం సాగాలని చెబుతున్న దానిని బట్టి, ఇంత కాలమూ స్త్రీలు చేతులు ముడుచుకు కూర్చున్నారని భ్రమించకూడదు. స్త్రీ విముక్తి ఉద్యమం పద్దెనిమిదవ శతాబ్దంలోనే ప్రారంభమైంది. కాలగతిని అది బలాన్ని పుంజుకొన్నది. పందొమ్మిదవ శతాబ్దంలో మహిళా ఉద్యమం గణనీయమైన విజయాలను సాధించింది. పలుదేశాలలో జరిగిన ఉద్యమాలకు సమన్వయం కుదిరి ఉండకపోవచ్చు. వివిధ దేశాలలోని ఉద్యమస్థాయిలో తర తమ భేేదాలుండవచ్చు. ఈ అంశాలలో ఎన్ని భేదాలున్నా, వాటి ఏకైక లక్ష్యం స్త్రీల పురోగతి; సమాజ కళ్యాణం.
మహిళా ఉద్యమం ప్రారంభమైన కాలంలో వారు దేశంలో నడుస్తున్న రాజకీయ ఉద్యమాలో పాల్గొననారంభించారు. వాటిలో సాంఘిక ఉద్యమాలున్నాయి; రాజకీయ ఉద్యమాలున్నాయి. 19వ శతాబ్దంలో బానిసత్వ విధానపు తొలగింపుకు అమెరికాలో జరిగిన ఉద్యమంలో స్త్రీలు చురుకుగా, పాల్గొన్నారు. పంతొమ్మిదవ శతాబ్దాంత కాలం నుండి పలు వలసదేశాలలో జరిగిన జరిగిన విమోచనోద్యమాలలో స్త్రీలు చురుకుగా పాల్గొన్నారు. రాజకీయ ఉద్యమాలలో పాల్గొనటం వల్ల వారి చైతన్యం, అవగాహనా స్థాయి పెరిగాయి. తామెవరో, తమ స్థితి ఏమిటో వారికి బాగా తెలిసింది. ఈ అనుభవం, అవగాహన వారిని స్త్రీల కోర్కెల సాధనకు, ముఖ్యంగా స్త్రీ పురుష సమానత్వ సాధనకు ప్రోత్సహించాయి. పందొమ్మిదవ శతాబ్ద మధ్యకాలానికి స్త్రీ పురుష సమానత్వ సాధనా నినాదం మహిళా ఉద్యమ లక్ష్యంగా మారింది. పౌరసత్వం, ఓటింగ్, ఆస్థి హక్కు, విద్య, వైద్యము, ఉపాధి, వేతనం వంటి విషయాలలో పురుషులతోడి సమానత్వసాధనకు పలు ఉద్యమాలను, పలుదేశాల మహిళలు నడిపారు. ప్రపంచ శాంతి పరిరక్షణ, పర్యావరణ రక్షణ వంటి ప్రపంచ సమస్యల పరిష్కారంలో కూడా శ్రద్ధనూ, చొరవనూ ప్రదర్శించగలిగిన దశకు మహిళా ఉద్యమం ఎదిగింది. ఈ మార్పు ప్రధానంగా 1950వ సంవత్సరం నుండి కనిపిస్తున్నది. నూటయాభై సంవత్సరాలుగా ఉద్యమం సాగుతున్నా, ఇంకా మహిళలకు అన్ని రంగాలలోనూ పురుషుల తోడి సమానావకాశాలు లభించటం లేదు.
నాగరికత పెంపుతో, దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి పురోగమనంతో ఈ అసమానతలు అంతరిస్తాయన్న భావం, మిధ్యగా మారిపోయింది. అభివృద్ధి ఎంత ఉన్నత స్థాయికి పెరిగినా, ఈ సమానత్వం ఇంకా కుందేటి కొమ్ముగా ఉండటం కనిపించసాగింది. 20వ శతాబ్దపు డెబ్భయ్యవ దశాబ్దం నుండి ఈ అంశపు పునరాలోచన ప్రారంభమైంది. 1970వ సంవత్సరంలో ఎస్తేర్ బొసెరస్ వ్రాసిన ”ఉమెన్స్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్” అన్న పుస్తక ప్రచురణ ఈ అంశం మీద వెలువడిన తొలి స్పష్టమైన అవగాహనగా భావిస్తున్నారు. సమాజంలోని స్త్రీ పురుషుల పనిస్వభావాన్ని పనిభారాన్ని పని విభజనను వివరిస్తూ జరుగుతున్న అభివృద్ధి వల్ల స్త్రీ పురుషులు సమంగా లాభించటం లేదన్న అంశాన్ని స్పష్టంగా వీరు నిరూపించారు. ఆధునీకరణ, ఆర్థికాభివృద్ధి ఫలితాలు స్త్రీ పురుషులకు సమంగా లభిస్తాయని ఇంతవరకూ ఉన్న భావాన్ని ఈవిడ సవాలు చేశారు. ఆర్థికాభివృద్ధి తన పయనంలో స్త్రీలను వదలి వేయటమేగాక, వారికి ఆర్థికావకాశాలు లభించకుండానూ స్వాతంత్య్రం దక్కకుండాను చేసినట్లు ఎస్తర్ వివరించారు.
ఈ పుస్తక ప్రచురణ తర్వాత, అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సహకారంతో కొన్ని దేశాలలో మహిళాభివృద్ధి ప్రాజెక్టుల నిర్వహణ జరిగింది. స్త్రీల వృత్తి విద్య, చూలు – కాన్పు, పరపతి సౌకర్యం వంటి సమస్యల మీద ఇవి పని చేశాయి. వీటి పనివల్ల ఆ ప్రాజెక్టు పరిధిలోని స్త్రీల స్థితి కొంతమేరకు బాగుపడింది. కాని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ఈ ప్రాజెక్టుల నిర్వహణ ఒక్కటే పరిష్కార మార్గం కాదని ఆచరణలో రుజువైంది. వర్తమాన సమాజంలో విద్య, ఆరోగ్యం, ఉపాధి, వేతనం, ఆస్థిహక్కులు, విడాకుల హక్కులు, రాజకీయ రంగ ప్రదేశం వంటి పలు అంశాలలోనూ స్త్రీ పురుష అసమానతలున్నాయి. ఈ సమాజ నిర్మాణ స్వభావము, దాని ఆలోచనలను ప్రభావితం చేసే మత సంప్రదాయాలు మారకుండా ఈ సమానత్వ సాధన సాధ్యం గాదు. ఇల్లాలు అంటే ఇంటి పనులు చేస్తూ, అక్షరాల ‘గృహిణి”గా మనుగడ సాగించే వ్యక్తి అనే భావం సామాజికులలో స్థిరపడిపోయింది. ఇది కొన్ని తరాలుగా వస్తున్న భావన. స్త్రీల అభివృద్ధికి అంటూ కొన్ని ప్రాజెక్టులను నిర్వహిస్తే వారిస్థితి బాగుపడదు. అది కొంత మేరకు, కొందరకు మాత్రం ఉపశమనాన్ని కూర్చగలదేమోగాని, అసలు సమస్యను పరిష్కరించలేదు. పురుషాధిక్యత పోవాలి; స్త్రీని వారి సమానులుగా గుర్తించాలి. ఇది ప్రధానంగా వ్యక్తిగత హక్కులకు, అభిరుచులకూ, స్వేచ్ఛకూ సంబంధించిన అంశం. దీని పరిష్కారానికి సమాజాన్నే సంస్కరించాలి అన్న అంశం రుజువైంది. ఈ విధంగా స్త్రీ, పురుష సమానత్వ సాధనా సమస్య సమాజానికే సవాలుగా తయారైంది.
అన్ని దేశాలకూ అన్వయించదగిన స్త్రీ-పురుష సమానత్వ సాధనా కార్యక్రమ రూపకల్పనకు తాపత్రయ పడకూడదు. రూపొందించే కార్యక్రమం ఆయా దేశాల సంస్కృతీ, సంప్రదాయం, దేశపు అభివృద్ధి స్థాయి వంటి వాటిని బట్టి భిన్నంగా ఉండవలసి ఉంటుంది. కాని దిగువ పేర్కొన్న మూడుఅంశాలు మాత్రం ప్రతి దేశపు కార్యక్రమంలోనూ ఉండాలి.
1. స్త్రీ-పురుష సమానత్వాన్ని రాజ్యాంగ బద్ధమైన హక్కుగా నిర్దేశించాలి. స్త్రీ-పురుష సమానత్వసాధననునిరోధించే లీగల్, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అవరోధాలను తొలగించాలి. ఇందుకు అవసరమైన శాసనాలను రూపొందించి కృతనిశ్చయంతో అమలు జరపాలి.
2. అందరి అభివృద్ధికి అవకాశాలనేవి ఏదో ఒక వర్గానికి దయదలచి ఇచ్చే అవకాశంగా ఉండకూడదు. అది మానవ హక్కు, ప్రతివారికి లభించాలి. మార్పుకు మారుపేరుగా స్త్రీని గుర్తించాలి. మార్పువల్ల వచ్చే లాభాలను స్త్రీలు కూడా పురుషులతో సమంగా అనుభవించే అవకాశాలుండాలి. స్త్రీల సృజనాత్మక శక్తుల వికాసం, దేశ ఆర్థికాభివృద్ధి సాధనకు అవసరం అన్న అంశానికి గుర్తింపు లభించాలి.
3. అమలు జరిగే అభివృద్ధి కార్యక్రమం, పురుషులతో సమానంగా స్త్రీలు లాభించేట్లుండాలి. వ్యక్తిగత అభివృద్ధి సాధనకు పురుషులతోడి సమానావకాశాలుస్త్రీలకు లభించాలి. ఈ విషయంలో సాంస్కృతీక భిన్నత్వాలకు ఎలాంటి మినహాయింపులీయకూడదు.
స్త్రీ పురుష సమానత్వ సాధనకు అనుసరించదగిన పంచ సూత్ర కార్యక్రమాన్ని యుయన్‌డిపి నిపుణులు రూపొందించారు. దీనిలోని ముఖ్యాంశాలను చూద్దాం :
1. చట్టపరమైన అసమానతల తొలగింపు
నియమితకాల ప్రాతిపదిక మీద స్త్రీ పురుష సమానత్వ సాధనకు ఆవరోధంగా ఉన్న చట్టాలను, సమానత్వ సాధనకు అనువుగా సంస్కరించాలి. (ఈ కార్యసాధనకు పది లేక పదిహేను సంవత్సరాల కాలవ్యవధిని నిర్ణయించవచ్చు)
ఇంతకు పూర్వం జరిగిన యుద్ధాలలో సైనిక మరణాలు అధికంగా ఉండేవి. పౌర మరణాలు తక్కువగా ఉండేవి. ఇటీవలి కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. సాయుధ పోరాటం అంటూ ప్రారంభమెతేే, సైనికుల కంటే పౌరులు అధిక ప్రాణ, ఆస్థి నష్టాలకు గురవుతున్నారు. యుద్ద సమయంలో అందరి కంటే స్త్రీలు అధికంగా ఈ బాధలను అనుభవించవలసి వస్తున్నది. స్త్రీలు ప్రధానంగా అత్యాచారాలకు, హింసకూ లోనవుతున్నారు. ఇలాంటి చర్యలను ప్రపంచంలోని అన్ని దేశాలు శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించి, దోషులను శిక్షించటానికి వీలుగా శాసనాలను చేయాలి. ఇలాంటి నేరాల విచారణను అంతర్జాతీయ ట్రిబ్యునల్‌కు నివేదించాలి. చట్టాలు తమకు ఇస్తున్న హక్కు లేమిటో అసంఖ్యాక మహిళలకు తెలియదు. దాదాపు అన్ని దేశాలలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ విషయాలను వారికి తెలియచేయగల అంతర్జాతీయ సేవా సంస్థ నొకదానిని ఏర్పాటు చేయాలి. దానికి ”వరల్డ్ ఉమెన్స్ వాచ్” వంటి పేరును పెట్టవచ్చు. ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమంలో ఇతర అంశాలతో పాటు దిగువ పేర్కొన్న విషయాలు కూడా ఉండటం మంచిది.
దేశపు చట్టాలు స్త్రీ పురుషులకు సమంగా వర్తించని వైనాన్ని బట్టబయలు చేయాలి. దేశంలో కనిపిస్తున్న ముఖ్యమైన స్త్రీ పురుష అసమానతల స్వరూపాన్ని వివరించే రికార్డును దేశాల వారీగా తయారు చేయాలి. స్త్రీ పురుషసమానత్వ సాధనకు దేశాలలో జరిగే ఉద్యమాలను ప్రోత్సహించాలి. పలుదేశాల సంస్థల మధ్య సహకార సమన్వయాల ఏర్పాటుకు కృషి చేయాలి. ఇలాంటి కృషివల్ల సమస్యలు రచ్చకెక్కుతాయి. అమాయకులైన స్త్రీ చైతన్య వంతులవుతారు.
2. సాధించవలసిన సామాజిక మార్పులు
గృహనిర్వహణకే రోజుకున్న ఇరవైనాలుగు గంటల కాలము ఇల్లాలికి చాలని పరిస్థితిని చూచాం. ఇలాంటి స్థితిలో ఆవిడ ఉద్యోగాన్ని చేపట్టటం అంటే ఎంతటి పనిభారాన్ని మోయటమో వేరుగా వివరించనవసరం లేదు. ఈ పని భారం ఆవిడ వృత్తి పరంగా ఎదగటాన్ని, రాజకీయ రంగంలోగాని, వ్యాపార రంగంలోగాని తన శక్తి యుక్తులకు తగినట్లు ఎదగటాన్ని నిరోధిస్తున్నది. పిల్లలను కనటం, పెంచటం, కుటుంబీకులకు సేవలు చేయటం వంటివి సామాజిక, పునరుత్పత్తి కార్యక్రమాలు సమాజం అభివృద్ధి చెందటానికి ఇవన్నీ అవసరమైన కార్యక్రమాలే. ఈ పనులను పూర్తిగా ఇల్లాలికే వదలి, పురుషుడుఈ బాధ్యతా నిర్వహణను, తప్పించుకోవటం, కుటుంబానికి, సమాజానికి నష్టకరం కనుక, ఇల్లాలి పనిభారాన్ని తగ్గించటానికి, గృహ నిర్వహణాభారంలో వీలయినంత అధిక భాగాన్ని పంచుకోవటానికి పురుషులు ముందుకు రావాలి.
గృహనిర్వహణలో పురుషుల భాగస్వామ్యం : ఈ అవసరాలను గుర్తించుకొని అభివృద్ధి చెందిన దేశాలు మెటర్నిటీ లీవ్‌ను పేరెంటల్ లీవ్‌గా మార్చాయి. కాన్పు తర్వాత, భార్యా భర్తలు ఇద్దరిలో ఎవరయినా ఒకరు ఈ సెలవులను తీసుకోవచ్చు. ఈ శెలవును తీసుకొని కొందరు తండ్రులు (పురుషులు) శిశు సంరక్షణా బాధ్యతను నిర్వహించక పోవటాన్ని గమనించి, నార్వే ప్రభుత్వం నియమిత కాలం పాటు తండ్రి పేరెంటల్ లీవ్‌ను విధిగా తీసుకోవాలి అని చట్టపరమైన నిర్దేశాలను జారీచేసింది. కుటుంబ సంబంధమైన పనులను చూచుకోవటానికి వీలుగా కొన్ని నార్డిక్ దేశాలు, ఇటువంటి అవసరాలున్నవారు పనికాలంలో కొద్ది భాగాన్ని వాడుకొనే వీలును కల్పించాయి. ఉదాహరణకు ఫిన్లండ్,స్వీడన్ దేశాల అనుభవాన్ని చూడవచ్చు. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లిదండ్రులలో ఒకరు, పని కాలంలోని రెండు గంటలను తగ్గించుకొని, శిశు సంరక్షణా బాధ్యతా నిర్వహణకు ఇంటికి వెళ్ళవచ్చునని ఫిన్లండ్ 1976వ సంవత్సరంలో శాసనం చేసింది. స్వీడన్ పది సంవత్సరాల లోపు వయస్సు పిల్లలున్న తల్లిదండ్రులు ఇలాంటి వసతిని అనుభవించే అవకాశాలను కల్పించింది. మన దేశంలో కూడా ప్రసూతి సెలవు 6 నెలలకు పొడిగించినారు. మగవారికి పితృత్వ సెలవులు 15 రోజులు ఇస్తున్నారు.
గృహనిర్వహణా బాధ్యతలకు అనువుగా పనికాలపు సవరింపు : రోజుకు ఏడు లేక ఎనిమిది గంటల పనిని ఉద్యోగి చేయవలసి ఉంటుంది. ఏక బిగువున ఈ పని చేస్తుండటం కంటే, ఇంటి పనులను చేయటానికి అనువుగా పని కాలాన్ని సవరించగలిగితే స్త్రీ పురుష ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ భావాన్నే ఫ్లెక్జిబుల్ వర్క్ షెడ్యూల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విధానపు అవలంబన వల్ల సంస్థలకు ఎలాంటి నష్టమూ ఉండదు. స్వీడిష్ ప్రభుత్వం ఉద్యోగి అవసరాన్ని బట్టి పార్ట్‌టైం పనిని చేయటానికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నది. ఫుల్‌టైం ఉద్యోగి, ఇంటి అవసరాల దృష్ట్యా పార్ట్‌టైంకు మారినా, వారు కోరినపుడు తిరిగి ఫుల్‌టైం ఉద్యోగిగా పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం గ్యారెంటీ చేసింది. జర్మనీ, జపాన్ ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు ఫ్లెక్జిబుల్ టైం వసతి నిస్తున్నాయి. ఉద్యోగి ఇంటి వద్దే ఆఫీసు పనిని చేసే సదుపాయాన్ని కూడా కొన్ని వ్యాపార సంస్థలు కల్పిస్తున్నాయి.
ఆస్థి వారసత్వము, విడాకులకు సంబందించిన చట్టాల సవరణ : పురుషునితో సమానమైన సంపాదనా పరురాలుగా స్త్రీకి గుర్తింపు లభిస్తున్నప్పుడు, పైన పేర్కొన్న మూడు విషయాల లోనూ స్త్రీకి చట్టబద్ధమైన హక్కు లుండాలనటం అత్యాశ కాదు. శాసనాలను జారీ చేసినంత మాత్రాననే స్త్రీలకు హక్కులు సంక్రమించని స్థితిని ఇంతకు పూర్వమే చూచాం. వీటి అమలుకు తగిన మహిళా ఉద్యమ నిర్మాణం కూడా అవసరం.
3. రాజకీయ ఆర్థిక రంగాలలో పురుషుల తోడి సమానత్వం
రాజకీయ ఆర్థికరంగాలలో పురుషుల తోడి సమాన ప్రాతినిధ్యాన్ని ప్రతిదేశము కల్పించాలి. ఈ గమ్యానికి స్త్రీ లింకా చాలా దూరంగా ఉన్నట్లు ఇంతకు పూర్వమే వివరించాం. ఈ సమానత్వ సాధనకు కాల నియమ ప్రాతిపదిక మీద ప్రభుత్వాలు కృషి చేయాలి. ఈ కార్యసాధనకు రాజకీయ పరమైన దీక్ష అవసరం. స్త్రీ ప్రాతినిధ్యం మొత్తంలో సగభాగంగా ఉండాలి, మూడవ వంతుగా ఉండాలి అన్నది ఇంకా చర్చనీయ దశలోనున్నది. కాని ఇప్పటికే నార్డిక్‌దేశాలు మూడవ వంతు పరిమాణాన్ని మించి పోయాయి. సమాజంలో విస్తృత ప్రాతిపదిక మీద జరిగే రాజకీయ ఆర్థిక మార్పుల వల్ల మాత్రమే స్త్రీలకు మూడవ వంతు ప్రాతినిధ్యమైనా లభించే వీలుంటుంది.
4. అభివృద్ధి అవకాశాల లభ్యతకు ప్రత్యేక కార్యక్రమం
స్త్రీ జనోద్ధరణకు, విద్య, పరపతి అవకాశాల పెంపు అతి ముఖ్య మైనవి. ఇలాగే సంతాన ప్రాప్తి విషయంలో కూడా స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉండాలి.
స్త్రీ విద్య : ఇతర కార్యక్రమాల మీద కంటే స్త్రీ విద్యావ్యాప్తి మీద పెట్టిన పెట్టుబడికి అధిక ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీ విద్యావంతురాలు గావటం వల్ల ఆ వ్యక్తి మాత్రమే గాక, ఆవిడ కుటుంబం, సమాజం కూడా లభిస్తాయి. కుటుంబాని కంటే కూడా సమాజానికి అధిక ప్రయోజనం చేకూరుతుంది. స్త్రీ విద్యావంతురాలయినప్పుడు ఆ విద్యా వారసత్వం తరువాతి తరాల వారికి కూడా సంక్రమించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు.
సంతాన ప్రాప్తి మీద అదుపు : తాను ఎపుడు కనాలి, ఎందరిని కనాలి అనే విషయ నిర్ణయావకాశాలు స్త్రీలకే ఉండాలి. ఇందువల్ల స్త్రీకి తన కాలవ్యవధి మీద అధికారం లభిస్తుంది. ఎపుడు కనాలి, ఎందరినుకనాలి అనే అంశాన్ని తానే నిర్ణయించుకొంటుంది. ఈ నియంత్రణ వల్ల లభించిన కాలవ్యవధిని తనకు ఉచితమని తోచిన పనులకు వినియోగించు కొంటుంది. సామాజిక జీవనంలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశాన్ని పొందుతుంది. కనుక, దీనిని వారి హక్కుగా గుర్తించి అమలు జరపాలి.
పరపతి సౌకర్యాన్ని పొందే అవకాశాలు : అల్పాదాయ వర్గాల స్త్రీలు దారిద్య్రం నుండి బయటబడే ప్రయత్నం చేయటానికి, పొట్టపోసుకోవటానికి పరపతి సౌకర్యం లభించటం అవసరం. స్వంత వ్యాపారాలను ప్రారంభించే స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉండటానికి పరపతి సౌకర్యం లభించాలి.
5. రాజకీయ ఆర్థిక రంగాలలో స్త్రీలకు అధికావకాశాలు
అన్ని దేశాలు, ఆయాదేశాల ఆర్థిక, రాజకీయ రంగాలలో స్త్రీలకు కూడా సముచిత ప్రాతినిధ్యం లభించేట్లు చూడాలి.
అత్యవసర సామాజిక సేవలు : మానవులు మానవులుగా బ్రతకటానికి అవసరమైన విద్యార్జనావసతులను, ప్రాథమిక ఆరోగ్యరక్షణ, వైద్య చికిత్సా వసతులను, ప్రజలు త్రాగటానికి రక్షిత నీటి సరఫరా ఏర్పాటును కుటుంబ నియంత్రణా సర్వీసులను, పేదలకు పోషకాహార కార్యక్రమాల నిర్వహణనూ ప్రభుత్వాలు విధిగా చేపట్టాలి.
చూలు-కాన్పు కాలంలో ఆరోగ్య రక్షణ : చూలు-కాన్పు కాలపు మరణాలు అధికంగా ఉండటాన్ని, ఈ కాలపు ఆరోగ్య రక్షణాలేమి వల్ల అధిక సంఖ్యాక స్త్రీలు జీవితాంతం అనారోగ్యాన్ని అనుభవిస్తూం డటాన్ని ఇంతకు పూర్వమే చూచాం. స్త్రీల ఈ రోగ భారపు తగ్గింపుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి.
ప్రతి వారికి బ్రతుకు దెరువు : దారిద్య్ర నిర్మూలనకు ప్రతివారికి సంపాదనావకాశాలు లభించేట్లు చూడాలి. అట్లని అందరకూ ప్రభుత్వాలు ఉద్యోగాల నీయాలని భావించనవసరం లేదు. స్వయం ఉపాధికి అవకాశామిచ్చే ఏర్పాట్లను చేయవచ్చు. ప్రతివారూ లేబర్ మార్కెట్‌కు రావటానికి తగిన అర్హతలను సంపాదించటానికి ప్రభుత్వాలు తోడ్పడాలి.
దారిద్య్ర భారపు తగ్గింపు : దారిద్య్ర నిర్మూలన అతి స్వల్పకాలంలో జరిగేది కాదు. కాని, దాని భారాన్ని తగ్గించే అవకాశాలున్నాయి. కాల నియమ ప్రాతిపదిక మీద ఇందుకుపకరించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేబట్టాలి. స్త్రీ జనోద్ధరణకు అనుసరణీయమైన కార్యక్రమాలలో ఇవి కొన్ని మాత్రమే. అవసరాన్ని బట్టి, ప్రభుత్వాల ఆర్థిక స్థోమతను బట్టి కార్యసాధనకు అవసరమైన కార్యక్రమాలను అమలు జరపాలి. స్త్రీ పురుష సమానత్వ సాధనా గమ్యాన్ని చేరటానికి అవసరమైన ప్రతి పనిని ప్రభుత్వాలు దీక్షతో అమలు జరపటం అవసరం.
రెఫరెన్స్ : 1.ఆతిశిబిజిజి చజీరిరీనీదీబి ఖతిజీశినీగి : ష్ట్రళిజిలి ళితీ గీళిళీలిదీ రిదీ బీనీబిదీవీరిదీవీ బీళిదీఖిరిశిరిళిదీరీ ళితీ |దీఖిరిబి. 2. ష్ట్రబిళీ జునీతిశీబి : |దీఖిరిబిదీ ఐళిబీరిబిజి రీగిరీశిలిళీ, ష్ట్రబిగీబిశి చీతిలీజిరిబీబిశిరిళిదీరీ, అబిజిచీతిజీ, 1994. 3. థామస్.పి. : ఉమెన్ దోది ఏజెస్ 4.భోగా చంద్రశేఖర్ : మహిళా సాధికారం, లక్ష్మి పబ్లికేషన్స్, హైదరాబాద్-27, 2005. 5.వివిధ దినపత్రికలు
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Where is the article?