హేమ
జార్ఖండ్‌లో భూనిర్వాసితుల పోరాటానికి మద్దతుగా నిల్చిన సిస్టర్ జాన్ వల్సను మైనింగ్ మాఫియా హతమార్చిందని వార్తాపత్రికలో (18.11.11) చూసి హతాశురాలినయ్యాను. భూవనరులను ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపోనీలకు దోచిపెట్టకుండా ప్రజలతో కలిసి జాన్‌వల్స పోరాడింది. భూమి నుండి స్త్రీలను వేరు చేయడానికి దానిపై ఆధిపత్యానికి పురుషాధిక్య వ్యవస్థ ప్రయత్నిస్తున్నా స్త్రీలు ప్రతి భూపోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కాని వారి మనోభావాలు, ఆవేదన పాలకవర్గాల నిర్ణయాధికారంలో చోటు చేసుకోలేదు. ఫెడరిక్ ఏంగిల్స్ అన్నట్టు ‘ప్రపంచ మహిళలు చారిత్రక ఓటమికి గురయ్యారు’ ఈ నేపథ్యంలో జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు ఒకసారి పరిశీలిద్దాం.
పట్టణీకరణ-పారిశ్రామికాభివృద్ధి, వాటి మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మూడింట రెండొంతులు స్త్రీలు పాల్గొనే గ్రామీణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి కార్పొరేటు సంస్థలకు భూమిని అప్పగించడానికి ప్రభుత్వం పూనుకుంది. వలస పాలనతో 1894లో చేసిర భూసేకరణ చట్టానికి ప్రతిగా ఈ చట్టం రాబోతుంది. ప్రజల్నుంచి ఎలాంటి అడ్డంగి లేకుండా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను భూ సేకరణ జరపవచ్చు. ప్రేవేటే కంపెనీల కోసం అయితే 80% అనుమతి వుంటేచాలు. కాని ఈ 80%లో ఎంత మంది స్త్రీలు పట్టాదారులు? దళిత బహుజన వర్గాల్లో భూమి సాగుకు స్త్రీలే అధికంగా పాల్గొంటారు. యిక 20% మంది నిర్ణయాలు అసలు పరిగణనలోకి రావు. భూమి విలువను కట్టేదపుడు మార్కెట్టు వ్యవస్థ, దాని వినియోగం బట్టి ధరను నిర్ణయిస్తున్నారే తప్ప స్త్రీల అభిప్రాయాలకు తావే లేదు. స్వాధీనం చేసుకునే భూమి 100 ఎకరాలు మించితేనే సామాజిక పర్యవసానం గురించి ఈ బిల్లు మాట్లాడుతుంది. అంతకంటే తక్కువైతే ఈ భూ యజమానుల సంగతేమటన్న దానికి జవాబు లేదు. నీటివనరుల భూమి, బహుళ పంటలు పండే భూమి స్వాధీనపరుచుకోమని చెప్పినా కాకినాడ, సోంపేట, నందిగ్రాం తదితర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. భూ సేకరణకై గుర్తించబడ్డ స్థలాన్ని బాధిత స్థలంగా నిర్వచించారే కాని ఆ ప్రాజెక్టు ఉత్పత్తుల ఫలితంగా నష్టపోయే ప్రాంతాన్ని గుర్తించలేదు. దాని మూలంగా వెలువడే కాలుష్యం అనారోగ్య పరిణామాలు ప్రసక్తే లేదు. ఎవరి భూమిని సేకరించారో వారినే బాధితులుగా గుర్తించారే తప్ప వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలుదార్ల వర్గం, వారి స్త్రీల గురించి ప్రస్తావన లేదు.
భూమి ఒక వనరుగా కాక ఒక వస్తువుగా మారినక్రమంలో భూవనరులను పోగొట్టుకోవడమే కాకుండా దానితో జీవనాధారమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోగోట్టుకుంటారు. అప్పటివరకు శ్రామిక వర్గంగా వున్న స్త్రీలు కొత్త ప్రాజెక్టులలో స్థానం లేక మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ బిల్లు భూమికి సంబంధించిన పంచాయితీ ఎక్స్‌టెన్షన్ అయి షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టానికి, 2006 అది హక్కుల చట్టానికి, గిరిజనులు అధికంగా వుండే 5వ షెడ్యూల్ ప్రాంతంలోని భూముల బదలాయింపు చట్టానికి లోబడి వుంటుందని పేర్కొన్నా వాటి అతిక్రమణ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల్లో ఆహార రక్షణ, భద్రత అనేది యు.పి.ఏ కూడమి ప్రజలకు యిచ్చిన వాగ్ధానం. అందుకు మరింత భూమిని సేద్యానికి వినియోగించకుండా ఉన్న భూమిని పారిశ్రామీకరణ పేరుతో కంపెనీలకు బదలాయిస్తున్నారు. దేనికి అనువుగానే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆహారాన్ని బదులుగా నగదు చెల్లిస్తామని ఆహార భద్రతా చట్టాలలో పేర్కొన్నారు. దీనివలన ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి చిల్లర వ్యాపారంలో కూడా విదేశీ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూనుకుంది. యిప్పటివరకు కాస్తో కూస్తో అందుతున్న కుటుంబాలకు అందదు.
యిక ‘పునరావసం’ ఒక రాజకీయ అవసరంగా గుర్తించి జాతీయ విధానాన్ని పొందుపరిచారు ఈ బిల్లులో. భూమి విలువతో పాటు యిల్లు, 20 వ సంవత్సరాలు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి లేనట్లయితే 2 లక్షల రూపాయిలు యివ్వబడతుంది. రవాణాఖర్చులు, సెటిల్‌మెంటు, తాత్కాలిక ఉపశమన గ్రాంటు, పశుశాల, చిన్న దుకాణాల నిర్మాణం చేపడతారు. భూ విలువలో 25% షేర్లరూపంలో యివ్వబడుతుంది. యిల్లు భార్యభర్తల పేరు మీద యివ్వొచ్చు కాని యివ్వాలన్న నిబంధనలేదు ప్రభుత్వం నుంచి కల్పింపబడిన ఏ నష్టపరిహారమైనా, సదుపాయాలైనా పితృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి పోరాటం చేయకుండానే పురుషునికి దక్కుతాయి. పురుషులు వస్తు వినిమయ వ్యామోహంలో పడి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత డబ్బు యిబ్బందితో వాటికి అమ్మి సరైనా ఉపాధి దొరకక మరింత పేదరికంతో కూరుకుపోవడం కాకినాడ సెజ్‌లో అనుభవమే. ఆదివాసి సమాజంతో, సహా నష్టపరిహారాన్ని విందులు, వినోదాలు, తాత్కాలిక అవసరాలకే హెచ్చిస్తున్నారు.
ప్రజాభిష్టం, కుటుంబాలపై సాంఘిక, ఆర్థిక అంశాల ప్రభావం, భూపరిధి తదితర అంశాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినా అందులో స్త్రీలు ఉండాలన్న నిబంధన లేదు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు జనాభావున్న అసంఘటిత కార్మికులు దేశానికి రెండొంతుల ఆదాయాన్ని అందిస్తున్నారు. అధిక శాతం వీరిలో వ్యవసాయ, అనుబంధిత మహిళా కార్మికులే.
ఈ మొత్తం క్రమాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలను భూమిక, దాని వనరులు నుండి గెంటివేసి ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయేలా చేస్తుంది. పితృస్వామిక భావజాలం ఉన్న సమాజంలో పురుషుల హింస ఈ పేట్రేగి కుటుంబభారం మొత్తం స్త్రీమీద పడుతుంది.కాబట్టి దేశాన్ని కబళించబోయే ఈ భూసేకరణ బిల్లులో మానవీయ ముఖ్యంగా స్త్రీకోణం లోపించింది. అత్యవసర పరిస్థితులలోనే భూసేకరణ పరిమితులతో జరగాలి. భూమికి భూమి యితర సదుపాయాలు కల్పించాలి. కుటుంబాన్ని యిద్దరి కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాల ప్రభావిత యూనిట్‌గా గుర్తించి స్త్రీలకు ప్రాధాన్యం యివ్వాలి. స్త్రీలను ఉత్పత్తి చేసే మనుష్యులుగా చూసి శ్రమ ఆధారిత పరిశ్రమలు ప్రభుత్వ పరంగా తెరవాలి. వికేంద్రీకరణ, వనరులు, స్థానిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకొని నడిపే పరిశ్రమలు కోసం ఉద్యమించాలి. భూమిని వాటి వనరులను బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికి రూపొందించబడిన భూసేకరణ పునరావసం పునర్మిర్మాణం బిల్లు 2011ను వ్యతిరేకించడం పురుషుల కంటే దేశపౌరులుగా మనదే ఎక్కువ బాధ్యత!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags