అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం- ఒక పరిశీలన

శివలక్ష్మి
బాలల ప్రేమికుడు చాచా నెహ్రూ 1955లో చిల్ట్రన్‌ ఫిలిం సొసైటీకి రూపకల్పన చేశారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్ళకొకసారి దేశంలోని వివిధ నగరాల్లో బాలల సినిమా పండుగలు జరుగుతున్నాయి.
1995 నుంచి ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రోత్సావాలకు హైదరాబాదీను శాశ్వత వేదిక చేసి మన రాష్ట్రానికి మార్చారు. 17 వ అంతర్జాతీయ బాలల సినిమా పండుగలు హైదరాబాద్‌లో నెహ్రూ జన్మదినం రోజు నవంబరు 14న మొదలై 20న ముగిశాయి. 7 రోజుల్లో 13 థియేటర్లలో, 37 దేశాల నుంచి ఎంపిక చేసిన 152 చిత్రాలతో, లక్షా యాభై వేలమంది ప్రేక్షకులతో ఈ సంబరాలు జరిగాయి.
1.    కాంపేటేషన్‌ ఇంటర్నేషనల్‌ 2. ఇండియా కాంపిటేషన్‌ 3. షార్ట్స్‌ కాంపిటేషన్‌ 4. లిటిల్‌ డైరెక్టర్స్‌ 5. చిల్డ్రన్స్‌ వరల్డ్‌ 6. ఇన్‌ ఫోకస్‌ చైనా, 7. ఆన్‌ చిల్డ్రన్స్‌ వరల్డ్‌ అనే విభాగాలున్నాయి. పేరుకి 13 థియేటర్‌లని చెప్తున్నప్పటికీ పేద మధ్య తరగతి పిల్లలకి వాళ్ళ ఏరియాలలో అందుబాటులో ఉన్న సినిమా హాళ్ళు ఒక్క ప్రసాదు ఐ మాక్స్‌ తప్ప మిగిలినవన్నీ పాత పాతవే! మా మిత్ర బృందమంతా ఒక్కొక్క రోజు ఒక్కో సినిమా హాలుకెళ్ళి చూశాం. 152 సినిమాలని చెప్తున్నప్పటికీ ఒక స్కూలు పిల్లలకి ఒక సినిమా చూపించగలిగితే చాలా గొప్ప. పిల్లలందర్నీ స్కూలు బస్సుల్లో తెచ్చి సినిమా చూపించి ఇళ్ళకి చేర్చడం చాలా శ్రమతో కూడుకున్న పని. దానికోసం టీచర్లు పడిన అష్టకష్టాలు చూశాం. కొన్ని డొక్కు ధియేటర్లలో స్క్రీనింగులు సరిగా లేనే లేవు. ఇంటర్వెల్‌ తర్వాత  అరగంటదాటినా సినిమా వెయ్యకపోతే ఒక బాబు నన్ను ”ఇంటర్వెల్‌ అంటే గంట సేపుంటుందా? ” అని అమాయకంగా అడిగాడు. ఇంకో పాప ” అసలు సినిమా పండుగ ఇక్కడ కాదంటగా, అక్కడికి మమ్మల్నెందుకు తీసికెళ్ళరు?” అని అడిగింది. వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద బాలలు. నా మనసు అర్ధ్రమై పోయింది. ”ఈ అంతర్జాతీయ చిత్రోత్సవం డబ్బున్న గొప్ప అంతర్జాతీయ స్కూల్‌ పిల్లల కోసమే”నని చెప్పలేకపోయాను. యోగ్యత పరిశుభ్రత లేని పిల్లలను తెస్తే వివిధ రాష్ట్రాల, విదేశీ ప్రతినిధుల ముందు మన రాష్ట్రం పరువు పోతుందని ఆలోచించిన ప్రభుత్వం మురికి వాడల బాలల్ని తేవద్దని విద్యాశాఖకి ఆదేశాలిచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. సంవత్సరమంతా మర్చిపోయినా కనీసం బాలల దినోత్సవాలలోనైనా ఇది సంక్షేమ ప్రభుత్వమని చూపించుకోవడానికైనా ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలాంటి జంకూ గొంకూ లేకుండా యూనిఫాముల్లేని , చెప్పుల్లేని పేద బాలల్ని తేవడానికి వీల్లేదని బాహాటంగా ఉత్తర్వులిచ్చింది. ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి పిల్లలతో వెళ్ళి డెలిగేట్‌ పాస్‌ కోసం పదే పదే అడిగినా అందరికీ ఉచిత ప్రవేశం అని చెప్పారు. మీడియాలోనూ అదే వచ్చింది. కానీ ప్రతి థియేటర్‌లోనూ పాస్‌అడిగి అడ్డుకున్నారు. ఇక ప్రారంభ, ముగింపు సమావేశాలకు పేద, మధ్య తరగతి వాళ్ళు సరే కార్లున్న ధనికులు కూడా వెళ్ళలేని స్థితి గచ్చిబౌలిలోని గ్లోబల్‌ పీస్‌ ఫౌండేషన్‌ ఆడిటోరియంకి ట్రాఫిక్‌లో వెళ్ళడమంటే ఆషామాషి కాదు. కొన్ని కోట్ల ఖర్చుతో అంగ రంగ వైభవంగా జరిగిన సంబరాన్ని కేంద్ర,రాష్ట్ర సమాచార శాఖలు, ఫిలిం సొసైటీ వారు, వెలుగు జిలుగు తారలు, విదేశీ ప్రతినిధులు, సమాజంలోని ఉన్నత వర్గాల వారి పరిమిత బాలలు (హైటెక్‌ సిటీలోని శిల్పారామంకి వెళ్ళగలిగినవారు) మాత్రమే చూడగలిగారు. ఇంతకు ముందు జరిగిన చిత్రోత్సావాలలో ప్రభుత్వ పాఠవాలల పిల్లలు ఓపెన్‌ ఫోరమ్‌లో సినీ ప్రముఖుల్ని, ప్రభుత్వ ప్రతినిధుల్ని దిమ్మతిరిగే ప్రశ్నలు వేసి తమ అద్భుతమైన తెలివి తేటలు ప్రదర్శించారు. చాలామందికి యూనిఫామ్స్‌ ఇవ్వలేదని, ఇచ్చినవాళ్ళకి ఒక జతే ఇచ్చారనీ, అందులోనూ కొందరికి చొక్కా వుంటే లాగు ఇవ్వలేదనీ లాగూ ఉన్న వాళ్ళకి చొక్కా ఇవ్వలేదనీచెప్పారు. చిన్నచిన్న సౌకర్యాలకే మాకు కష్టమౌతుంటే సినిమాల గురించి ఆలోచించే స్థాయి ఎలా వస్తుందని అడిగారు. మళ్ళీ అలాంటి పరిస్థితినెదుర్కోవడం కష్టమనుకున్నారో ఏమో ఈ సారి వాళ్ళు పిల్లల్ని ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలామంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ”ఫిల్మ్‌ ఫెస్టివలా? అదేమిటో మాకు తెలియదు . అవన్నీ పైసలున్న వాళ్ళథకే మాకు కాదు” అని అన్నారు. బాలల పట్ల ఎంతో ప్రేమ నటించే ప్రభుత్వం ఏ బాలల కోసం కోట్ల ఖర్చు చేసిందో ఈ ఉత్సవాలను చూసినవారికి తెలిసింది.
1995 నుంచి వరుసగా తొమ్మిదో సారి జరుగుతూ శాశ్వత వేదికగానున్న హైద్రాబాద్‌ నుంచి 2013లో రాబోయే చిత్రోత్సవాలకు వేదిక మారిపోవాల్సిందేనన్నారు నందితాదాస్‌. అస్సాం దర్శకుడు హేమన్‌దాస్‌ కూడా చిత్రోత్సవ వేదిక మారాల్సిందేనన్నారు. అన్ని ప్రాంతాల సినిమాలు అందరూ చూడాలన్నా, అస్సాంలాంటి చోట్ల వేదికలు బాగుపడాలన్నా అంతర్జాతీయ చిత్రోత్సవ వేదికను మార్చాలన్నారు. దానివల్ల అందరి మధ్యా సమైక్య భావం పెంపొందుతుందన్నారు. వేదికలు ఎక్కడైనా ఫరవాలేదు. బాలలు మన జాతి సంపద- నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఉపన్యాసాలు దంచే మన పాలకులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశంలోని బాలలందరికీ మంచి సినిమాలు అందుబాటులోకి తేవాలన్న సద్భుద్ధి ఉండాలి. మంచి సినిమా దగ్గరకి బాలలు కాకుండా బాలల దగ్గరకే సినిమా రెక్కలు గట్టుకుని ఉరికి రావాలి! మేజిక్‌లాండ్‌, వండర్‌లాండ్‌, డ్రీమ్‌లాండ్‌ అనే మూడు తాత్కాలిక ఏసి థియేటర్‌లను లక్షల ఖర్చుతో ధనికుల కోసం క్షణాల్లో నిర్మించగలిగిన ప్రభుత్వం తలచుకుంటే ఇది అసాధ్యం కానే కాదు!!!
ఇక సినిమాల విషయానికొస్తే గత చిత్రోత్సవంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు చిత్రాలున్నాయని సినిమా పెద్దలు చెప్పినప్పటికీ రాశి తప్ప వాసి లేదు.ఇంతకు ముందు ప్రాతినిధ్యం లేదని ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలనుంచి ఎంపిక చేయడం మంచిపనే గాని ప్రపంచం మొత్తం మీద ఆశగా ఎదురుచూసే ఇరాన్‌ (రెండు మాత్రమే) నుంచి ఎక్కువ సినిమాలు లేకపోవడం బాలలతో సహా సినిమా ప్రేమికులందరినీ అసంతృప్తికి గురి చేసింది. ప్రపంచం మొత్తం మీద అక్కడక్కడ చైనా లాంటి వేరే దేశాలనుంచి మంచి సినిమాలొచ్చిన్నటికీ, ఇరాన్‌ దర్శకులు బాలల కోరికలు, ఇష్టాయిష్టాలు, లక్ష్యాలను అర్ధం చేసుకుని  సినిమాలు వారి జీవిత సంఘర్షణలోనుంచి ఆలోచించి తీస్తారు.
ఈ సారి భారత్‌ సినిమాలు విలువల పరంగా బాగున్నాయి. బస్సు, ఆసుపత్రి, ఫోనూ లేని కుగ్రామాల్లో వైద్యం గురించి చర్చించిన సినిమాలు రెండున్నాయి (శిఖరం, గంటల బండి) అందరిలా బడికెళ్ళి చదువుకోవడం కోసం తపన పడి సాధించిన ఇద్దరు పేద బాలల చిత్రాలు-గట్టు (ప్రారంభ చిత్రం) ఐయామ్‌ కలామ్‌. పర్యావరణ స్పృహకు సృజనాత్మకతను జోడించి తీసిన చిత్రాలు బర్డ్‌ కాచర్‌, బర్డ్‌స్‌ నెస్ట్‌, ది గ్రేట్‌ బేర్‌, గేటెడ్‌ కమ్యూనిటీలో కలిసి మెలిసి బతికే పిల్లలు ఒక బాల కార్మికుడి కుక్కను మునిసిపాలిటీ వారికి చిక్కకుండా కాపాడుకునే ఇతివృత్తంతో వచ్చిన చిత్రం (చిల్లర పార్టీ అవార్డు గెల్చుకుంది) గ్రామీణ భారతాన్ని తెర కెక్కించిన సినిమా ”దేఖో ఇండియన్‌ సర్కస్‌’, హిమాలయాల్లోని 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న గమ్యాన్ని చేరుకోవడానికి చిన్నారులు చేసిన సాహసయాత్రే ‘లోటస్‌పాండ్‌’, ఉద్యోగులు పిల్లల్పి పెంచుతున్న క్రమంలో వారి కోరికలు తీర్చడంకోసం అవినీతికి పాల్పడకూడదని చెప్పిన చిత్రం – ఐలండ్‌ ఆఫ్‌ స్టార్స్‌.
ఆరేళ్ళ వయస్సున్న చిట్టి దర్శకులు కూడా బుల్లి బుల్లి సినిమాలు తీశారుకానీ ఎక్కువ సినిమాలన్నీ పదేళ్ళ పైబడి ఉన్న బాలలకే ఉద్దేశింపబడ్డాయి. ఇక ప్రపంచ బాలల సినిమాల విషయానికొస్తే తల్లిని కలవాలని తపన పడే పిల్లలు (అలాఫ్‌ జార్‌) తండ్రిని వెతుక్కుంటూ బయల్దేరిన కొడుకులు (డేవిడ్‌ అండ్‌ కమాల్‌, ది స్ట్రాంగెస్ట్‌ మాన్‌ ఇన్‌ హాలండ్‌) కనిపించారు. గురజాడ అడుగడునా గిరీశాలు రాబోతున్నారు- గుర్తించండి అని మనకి హెచ్చరిక చేసినట్లే విచ్ఛిన్నమవుతున్న వివాహ సంబంధాల గురించి పిల్లలద్వారా చెప్పడం ఆ దర్శకులకి అనివార్యమయింది. అన్ని దేశాల్లో పిల్లలు సవతి తల్లి దగ్గర్లో- సవతి తండ్రి దగ్గరో పెరగవలసిన పరిస్థితి మామూలై పోయింది.
ఒక సినిమాలో పదమూడేళ్ళ కొడుకు ”నాన్న ఎవరో చెప్పమ్మా” అనడుగుతాడు.   ఇద్దరు భర్తలు, ఒక బాయ్‌ఫ్రెండ్‌లో ఎవరూ నీ తండ్రి కాదు. ఎవరో ఒకాయన వీర్యంతో ఇంజ్షెెన్‌ వల్ల నువ్వు పుట్టావంటుంది తల్లి. ఇలాంటి విడ్డూరపు పోకడలు, రేప్‌లు, పాశ్చాత్య జీవన శైలితో కొన్ని చిత్రాలున్నాయి. చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియా ఛైర్‌ పర్సన్‌ నందితాదాస్‌, దేశ దేశాల చిత్రాల ఎంపిక కోసం ప్రతినిధులను పంపి స్క్రీనింగ్‌ కమిటీ వేసి బాలలకు బరువైన సందేశం లేకుండా, కొన్ని విలువలను కట్టుబడి వినోదాత్మకంగా విభిన్నంగా సంపన్నంగా ఉన్న సినిమాలకోసం తమ కమిటీ ఎంతో శ్రమించిందని చెప్పారు. గుజరాత్‌ మారణకాండ  కష్టాల కడగండ్ల గురించి కాలేజీల కెళ్ళి ఎంత చెప్పినప్పటికీ ఆ బాధ తీరక ఇంకా చెప్పాలనిపించింద ఫిరాక్‌ అనే సినిమా ద్వారా చెప్పారు నందిత. సమాజంలోని బాహాటంగా రావడానికి పురిటి నొప్పులు పడుతున్న ముఖ్యమైన, న్యాయమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రేక్షకులకు సమాజం జీవితంలోని వివిధ కోణాల పట్ల లోతైన అవగాహన కలిగించాలి తప్ప డబ్బు కోసం సినిమా వ్యాపారం చెయ్యగూడదన్నారు. ఆమె ఈ కమిటీ ఛైర్‌ పర్సన్‌ అయినప్పటికీ ఇలాంటి చిత్రాల ద్వారా ఏ విలువల్ని ప్రతిపాదించదల్చుకున్నారో కమిటీ పెద్దలకే తెలియాలి!!!
నేను పాతికేళ్ళకి పైగా హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌ మెంబర్ని వివిధ దేశాల సినిమాలు చూస్తున్నరప్పుడు స్త్రీలు-బాలికల జీవితాలు జీవన స్థితి గతులు మన దేశంలో కంటే ఏ దేశంలోనైనా ఏ కొంచమైనా మెరుగ్గా ఉన్నాయా అనే కుతూహలంతో విమర్శనాత్మకంగా గమనిస్తుంటాను. ఆ దృష్టితో చూసినప్పుడు నాకు బాగా నచ్చిన ఇరాన్‌ చిత్రం  చిల్డ్రస్‌ వరల్డ్‌్‌ విభాగంలోని ”హయాత్‌” ఇది. ఇరాన్‌లోని ఒక చిన్న గ్రామంలోని 12 ఏళ్ల హయాత్‌ అనే పాప సంవత్సరాంతంలో రాయవలసిన పరీక్షకోసం చేసిన జీవన పోరాటం సినిమా చూస్తున్న వారందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. హయాత్‌ అంటే జీవితం అని  అర్థం. పరీక్ష ముందు రోజు రాత్రి హయాత్‌ వాళ్ళ నాన్నకి ప్రమాదకరమైన జబ్బు ముంచుకు వస్తుంది. ఇంట్లో హయాతే పెద్ద పిల్ల. ఒక తమ్ముడు. పాలుతాగే చిట్టి చెల్లెలు. ఉంటారు. ఇంటి పనుల్లో మునిగిపోయిన వాళ్ళమ్మకి హయాత్‌ నాన్న ఉలుకూ పలుకూ లేకుండా కట్టెలా పడి ఉన్నాడని ఏడుస్తూ చెప్తుంది. వాళ్ళమ్మ డాక్టర్‌ని పిలుచుకురమ్మంటుంది. డాక్టర్‌ ఇంటికి వెళ్ళడంకోసం మొదలెట్టిన పరుగు ఆగకుండా సినిమా మొత్తం ఊపిరి తీసుకునే సమయం కూడా లేకుండా పరుగుతు పెడుతూనే ఉంటుంది. డాక్టర్‌ వచ్చి వెంటనే పట్నం తీసికెళ్ళమంటాడు. వాళ్ళమ్మ  హడావుడిగా వెళ్తూ , పాలిచ్చే పశువులూ, తమ్ముడూ, చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బండెక్కి వెళ్ళిపోతుంది. తరుముకొస్తున్న టైమ్‌, నెత్తి మీదొచ్చిపడ్డ అలవికాని పనులు, స్కూల్‌కెళ్ళాల్సిన తమ్ముడు, ఏడ్చే చిట్టిపాపాయి, తను రాయాల్సిన ఫైనల్‌ పరీక్షలు. వీటన్నిటి మధ్య తండ్రి అనారోగ్యం గురించి ఆలోచించే తీరికే ఉండదు. ఎవరో  మీ నాన్నకెలా ఉందంటే నాకు తెలియదంటుంది. ఇల్లంతా ఉరుకుతూ పనులు రాకెట్‌ స్పీడ్‌తో చక్కబెడుతూ ఉంటుంది. పక్క బట్టలు సర్దేస్తుంది. తమ్ముడికి రొట్టె ఇచ్చి స్కూలుకి పంపిస్తుంది. పాలు పిండి పాపాయికి సీసాలో నింపుతుంది. అంతేనా? పనులు వేగంగా చేస్తూ రాత్రి చదివిన పాఠాలన్నీ వీధిబడిలో చదివినట్లు పైకి నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఇంటికి తాళం వేసి పాపాయిని చంకనేసుకుని ఇంటింటికి వెళ్ళి ఒక్క గంటలో పరీక్ష రాసిి వస్తా. మా చెల్లిని చూడమని బతిమిలాడుతుంది. ఒక ఇంట్లో వున్న వృద్థురాలు నాకు దగ్గు వస్తుంది. మంచినీళ్ళు ఇమ్మంటుంది., పాపనీ, పాల సీసానీ వదిలి మంచినీళ్ళు తెచ్చే లోపు ఆమె పాప పాలలో సగం పైగా తాగేస్తుంది. అక్కడ వద్దనుకుని ఇంకో ఇంటికి, మరో ఇంటికి పరిగెత్తుతూనే వుంది.చివరకు ఎవరూ తన గోడు వినరు. మళ్ళీ ఇంటికొచ్చి పాలు కలిపి ఉయ్యాల తాడూ, కంబళ్ళు తీసుకుని స్కూలువైపు ఉరుకుతుంది.  మధ్యలో ఎన్నెన్నో ట్విస్ట్‌లుంటాయి. హయాత్‌ పరుగులతో ప్రేక్షకుల కళ్ళు కూడా ఇష్టంగా పరీక్ష రాయగలుగుతుందా లేదా అని ఆత్రంగా చూస్తుంటాయి. పరీక్ష హాలులో ఇద్దరు ఫ్రెండ్స్‌ ఒక టీచర్‌ తప్పకుండా వస్తుందని హయాత్‌కోసం ఎదురుచూస్తుంటారు. టైం దాటిపోయి పరీక్ష మొదలవుతుంది. కిటికి పక్కన కూర్చున్న ఒక ఫ్రెండ్‌ ముందుకి బైటినుంచి ఒక తాడు లోపలికొస్తుంది. ఇంకో ఫ్రెండ్‌ ఆ తాడుని అందుకుని ఊపమని సైగలతో చెప్తుంది హయాత్‌ లోపలికికొచ్చి పరీక్ష పేపర్‌ అందుకుని రాయబోతుంది. కానీ దృష్టంతా ఏడుపు లంకించుకున్న చెల్లెలిమీదే ఉంటుంది. అంతవరకూ స్ట్రిక్ట్‌గా పిల్లల్ని అదిలిస్తున్న టీచర్‌ నెమ్మదిగా ఉయ్యాల తాడందుకుని చక్కని చిరునవ్వుతో ఊపడం మొదలెడుతుంది. మన హీరోయిన్‌ నిశ్చింతగా పరీక్ష రాయడానికి ఉపకమ్రిస్తుంది. ప్రేక్షకులు హాయిగా  ఊపిరి పీల్చుకుంటారు. బాలికలతో మొదలై మహిళలకి ఊపిరి సలపని సరే కొన్ని కీలక సమయాల్లో కూడా ఈ రకంగానైనా సహకారం  లేకపోవడం బాధ కలిస్తుంది. మన ఇళ్ళల్లో ఎక్కువ చూస్తే అక్కడ పేరుకు పోయి ఎంత చేసినా తరగని భూతం లాంటి ఇంటిచాకిరితో సతమయ్యే 13 ఏళ్ళ హయాత్‌ని చూస్తున్న మహిళలకి సహానుభూతితో ఊపిరి సలపదు.
హయాత్‌ దీక్ష పట్టుదల, జీవితంపట్ల అలుపనేది లేకపోవడం ముచ్చట కల్గిస్తాయి. స్ఫూర్తి కలిగించే చక్కటి ఇతి వృత్తాలను జీవితం నుంచే ఎన్నుకోవడంలో ఇరాన్‌ దర్శకులకి ఎవరూ సాటి రారు. చిత్రోత్సవం పట్ల ఎన్ని ఈ సంతృప్తులున్నప్పటికీ మన పాపల్ని ఈ అంతం లేనిపని నుంచి ఎలా తప్పించాలా అనే ఆలోచనలతో తపిస్తున్న  మహిళలందరూ తప్పకుండా చూడవలసిన సినిమా  హయాత్‌.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.