పురుషుని భోగలాలసతకు చెక్కిన బొమ్మలు వీరు

వేములపల్లి  సత్యవతి
హైందవంలో చతుర్వర్ణవ్యవస్థలోని మహిళలకు సమానహక్కులు, సమానన్యాయాలు, సమానగుర్తింపు, సమమైన గౌరవమర్యాదల సాధికారిత గేట్లు పురుషాధిక్య సమాజంలో మూసివేయబడ్డాయి.
మహిళలు ప్రాణమున్న మనుషులన్న స్పృహకూడ పురుషాధిక్య సమాజానికి లేదనటంలో అతిశయోక్తి లేదు. సమాజంలో డబ్బు పుష్కలంగా వున్నవారు, పరపతి కలిగివున్న పురుషులు మిగతా సంపద సాధనాలను అనుభవించినట్లుగానే తమ భోగవిలాసాలకు, విలాసవంతమయిన శృంగార జీవితాలను గడపటానికి మహిళల్లోనే మరో కులాన్ని సృష్టించారు. వారే వేశ్యలని, సానులని, భోగంవాళ్లని పిలవబడ్డారు. తిన్నతర్వాత ఎంగిలి విస్తళ్లను విసిరివేసినట్లుగానే వారు సమాజం నుండి వేశ్యవాటికలకు విసిరివేయబడ్డారు. హైందవ సమాజంలో సతీసహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం మొదలగు ఎన్నో దురాచారాలు వ్యాప్తిలో వుండేవి. అన్ని దురాచారాల కంటె మహిళల ఎడల పాటించబడిన అత్యంత భయానక, పాశవిక క్రూర దురాచారం సతీసహగమనం. దానిని మతపరంగా అత్యంత పవిత్ర ధర్మకార్యంగా తలచేవారు. ఆ దురాచారాన్ని రాజారామమోహన్‌రాయ్‌ పడరానిపాట్లుబడి బ్రిటిషు పాలకుల నొప్పించి చట్టం చేయించి దానిని నిర్మూలింపజేశాడు. అందుకు మహిళలందరూ ఆ సంఘసంస్కర్తకు అన్ని కాలాలలోను కృతజ్ఞతతో నీరాజనాలర్పిస్తారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ వితంతువుల వివాహాలు చేయటమేకాక తన ఆస్తినంతా వితంతు వివాహిత కుటుంబాల కొఱకు ఖర్చు చేశాడు. కార్వే మహాశయుడు, మహాత్మా ఫూలే దంపతులు స్త్రీల సంస్కరణోద్యమాలలో ఎనలేని కృషిచేశారు. ఫూలే దంపతులు బాలికల పాఠశాలను స్థాపించారు. సావిత్రిబాయిఫూలే ఆ పాఠశాలలో పంతులమ్మగా పనిచేశారు.
తెలుగువారిలో రఘుపతి వెంకటరత్నంనాయుడు, వీరేశ లింగంపంతులుగారు సంఘసంస్కర్తలుగా పేరుగాంచారు. పంతులు గారు యుగపురుషుడుగా పిలవబడ్డారు. పంతులుగారు సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని సాధనంగా స్వీకరించారు. ‘వివేకవర్ధని’ పత్రికను స్థాపించారు. బాల్యవివాహాలకు, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా, స్త్రీవిద్యకు, వితంతువివాహాలకు ప్రోత్సాహకరంగా పత్రిక ద్వారా ప్రచారం చేశారు. బాలికల పాఠశాలను స్థాపించారు. మహిళల కొరకు సంచాలక గ్రంథాలయాన్ని నడిపారు. ఈ పనులను పంతులుగారు నల్లేరు మీద బండిలాగ సునాయాసంగా చేయలేదు. ఛాందస సనాతనుల నుండి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని అష్టకష్టాల పాలయ్యారు. కులం నుంచి వెలివేయబడ్డారు. అయినా మొక్కవోని ధైర్యసాహసాలతో ముందుకు నడిచారు. ఎంతోమంది వితంతువుల వివాహాలు చేసారు. పంతులుగారి దగ్గర చదువుకున్న మహిళలు పక్షపత్రికలకు, మాసపత్రికలకు సంపాదకులుగా పత్రికలను నడిపారు. రచయిత్రులు, కవయిత్రులు తయారయ్యారు. అన్ని దురాచారాలలాగే వేశ్యావృత్తి (పడుపువృత్తి) కూడ ఆనాటి సమాజంలోవున్న దురాచారం. అన్ని దురాచారాలను దూరం చేయటానికి కంకణం కట్టుకున్న పంతులుగారు వేశ్యల వద్దకు వచ్చేవరకు వెనకడుగు వేశారు. ముందుకు సాగలేదు. పైగా వారిని కించపరచారు. వేశ్యలవలన సంసారాలు ఛిద్రమవుతున్నవని వేశ్యలపై ద్వేషం పెంచుకున్నారు. వేశ్యల దగ్గరకెళ్లే పురుషులను అడ్డగించలేదు సరికదా అలాంటి ప్రయత్నంకూడ ఎందుకు చేయలేదో అర్థం కాదు. భోగం మేళాలకు తోకల్లాగ పురుషులపేర్లు శాస్త్రులవారి భోగంమేళమని, శెట్టిగారిదని, నాయుడుగారిదని, చౌదరిగారి భోగంమేళాలని పేర్లుండేవి. వారంతా అగ్రకులాలకు చెందినవారే. స్త్రీలయిన వేశ్యలే వారి కళ్లకు దోషులుగా కనిపించటం, వారి దగ్గరకెళ్లే పురుషపుంగవులు దోషులుగా కనిపించకపోవటం విడ్డూరంగానే వుంది. మిగతా దురాచారాలవలె పడుపువృత్తిని మాన్పించటానికి కృషి చేయవలసి వుంది. అధోగతి పాలయి పడుపువృత్తిని చేపట్టిన మహిళోద్ధరణకు ఎందుకు పూనుకోలేదో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు.
ఆ కాలంలో దక్షిణాది నాలుగు రాష్ట్రాలకు మద్రాసు ఉమ్మడి రాజధానిగా వుండేది. ముద్దుపళని అనే తెలుగు వేశ్య బెంగుళూరువాసిని. ఆమె తెలుగులో తొలితరానికి చెందిన కవయిత్రులలో ఒకరు. బెంగుళూరుకు చెందిన నాగరత్నమ్మ అనే దేవదాసి దానిని అచ్చు వేయించి గ్రంథంగా తీసుకొచ్చారు. దానిని పంతులుగారు ఎందుకో సహించలేకపోయారు. తన పలుకుబడిని వుపయోగించి అప్పటి పాలకులు బ్రిటీషువారి ప్రభుత్వం చేత నిషేధింపచేశారు. నాగరత్నమ్మగారు కోర్టులో కేసువేసి గెలిచారు. వేశ్యల జీవితాలలో వెలుగు నింపటానికి కృషిచేసినవారిలో దర్శి చెంచయ్య గారు ముఖ్యులని చెప్పుకోవచ్చు. చెంచయ్య గారు ఆంధ్రదేశమంతటా విస్తృతంగా పర్యటించారు. సభలు-సమావేశాలు ఏర్పాటుచేసి ప్రసంగించారు. పడుపువృత్తి మానుకొని చదువుకోవాలని విద్యావంతులయి వివాహాలు చేసుకోవాలని ప్రచారం చేశారు. వారి ప్రచార ప్రభావంతో కొంతమంది ఆ వృత్తి మాని చదువుకున్నారు. విద్యావంతులై వివాహాలు చేసుకున్నారు. పంతులుగారి ప్రభావంతో వితంతువులను వివాహం చేసుకోవటానికి యువకులు ముందుకొచ్చినట్లుగానే చెంచయ్యగారి ప్రభావంతో చదువుకొని విద్యావంతులయిన వేశ్యయువతులను వివాహం చేసుకోవటానికి యువకులు ముందుకొచ్చి వివాహాలు చేసుకొన్నారు. నాగరత్నమ్మ గారితోను, ఆమె కూతురు యామిని పూర్ణతిలకంతోను కలసి ఒక పత్రికను చెంచయ్యగారు స్థాపించారు. వారి కృషి ప్రశంసనీయమైనది. యామిని పూర్ణతిలకంగారు మద్రాసులో వేశ్యల పిల్లల కొఱకు ‘యువతీ శరణాలయం’ స్థాపించారు. దర్శిలను చక్కదిద్దడానికి నిజామాబాద్‌లో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. తుదిశ్వాస విడిచేవరకు ఆమె జోగినులు మాతంగులు మొదలగు మహిళలంతా పురుషాధిక్య సమాజపుకోరల్లో చిక్కుకున్నవారే. కొన్ని మాసాల క్రితం పత్రికలో చదివాను. అన్నాబత్తుల వంశంలో (పేరు గుర్తులేదు) ఆరవతరానికి చెందిన దేవదాసి మహిళ నేటిసమాజానికి కొన్ని సవాళ్లను సంధించింది. మావలన సమాజం చెడిపోతుందన్నారు. మాకిచ్చిన మాన్యాలను ప్రభుత్వం తీసేసుకుంది. మా వృత్తితోపాటు వుపాధిని కోల్పోయాము. మేము దేవాలయాలలో దేవవిగ్రహాలముందు నిత్యం నృత్యం చేసేవాళ్లం. ఆడేవాళ్లం. పాడేవాళ్లం. (అంటే వారి వృత్తి సంగీత-నృత్యకళలని అర్థం చేసుకోవాలి) దేవుళ్ల వుత్సవాలలో, వూరేగింపులలో ముందుండి ఆడేవాళ్లం. పాడేవాళ్లం. నాటకాలలో వేషాలు వేసుకొని రంగస్థలం మీద (స్టేజీమీద) పురుషులతోపాటు ధీటుగా నాటకం పూర్తయేవరకు నిలబడి వుండేవాళ్లం. మా పాటలు, పద్యాలు మేమే నటిస్తూ పాడేవాళ్లం. మా వస్త్రధారణ వంటినిండ కప్పబడి వుండేది. యక్షగానం, భామాకలాపం, గొల్లకలాపం లాంటివి ఒక్కరాత్రితో పూర్తయేవి కావు. ఒక్కోసారి వారంరోజులవరకు పాల్గొనవలసి వచ్చేది. దాని కొఱకు మేము అయిదు, ఆరు సంవత్సరాలు కఠోరశ్రమ పడేవాళ్లం. దీక్షతో సాధనచేసి సాధించేవాళ్లం. మా శ్రమకు, మా కళలకు గుర్తింపు లేకుండ పోయింది. మా బ్రతుకులు రెంటికి చెడిన రేవళ్లయ్యాయి. మా మాన్యాలను తీసుకున్న ప్రభుత్వం మరో వుపాధిమార్గం చూపలేదని వాపోయింది. మావలన సమాజం చెడిపోతుందనేవారు నేటి సినిమాలలో, టి.విలలో పాల్గొని ఆట, పాటలాడేవారిని, వారి వస్త్రధారణను గురించి ఏమంటారు? సమాజం చెడిపోతుందంటారా? లేక బాగుపడుతుందంటారా అని ఈలాంటివే అనేక ప్రశ్నల పరంపర కురిపించింది.
వాస్తవానికి దేవదాసీలు, వేశ్యలు సంగీత-నృత్యకళలకు ఆద్యులని చెప్పవచ్చునేమో! ప్రాచీనకాలం నుంచి మనదేశంలో రాజుల ఆస్థానములలో రాజనర్తకీలుండేవారు. వారు రాజుల వరకే పరిమితమయి వుండేవారు. నేటి మన హైదరాబాద్‌ నగర నిర్మాత మహ్మద్‌అలీ కులీకుతుబ్‌షా ఆస్థానంలో యిరువురు నర్తకీమణులుండేవారు. వారిలో ఒకరు నాట్యమయూరి, మరొకరు సంగీతసామ్రాజ్ఞి. ఆ యిరువురు కవల సోదరీమణులు ఏ రాజుల ఆస్థానంలో ఏ రాజనర్తకీ పొందని అపురూప గౌరవమర్యాదలకు పాత్రులయ్యారు. వారిలో ఒకరిని మహ్మద్‌అలీ వివాహమాడి కొత్తగా నిర్మించిన నగరానికి భాగ్యనగరమని ప్రియురాలి పేరుతో నామకరణం చేశాడు. ఆ నవాబు తన సమాధుల ప్రక్కనే తారామతి-ప్రేమావతుల సమాధులను కట్టించాడు. ప్రేమావతి సమాధిపై ”స్వర్గధామంలోని స్వర్ణకమలాలు” అని పార్శీభాషలో చెక్కించాడు. క్రీ.పూ. బుద్ధుని కాలంలో కూడ వేశ్యలున్నారు. ఆమ్రపాలి అనే వేశ్య అతిలోకసౌందర్యవతిగా, సంగీత-నృత్య కళలలో ఆరితేరి సాటిలేని నర్తకీమణిగా పేరుప్రఖ్యాతులు గడించింది. వారి నివాసాలు రాణివాసాలను తలపింపజేసేవి. ఆ మహా నర్తకీమణికి పురుషాధిక్య సమాజం ‘వైశాలినగరవధువు’ అని ముద్దుపేరును ప్రసాదించింది. చివరకు ఆమ్రపాలి బుద్ధుని వద్ద దీక్ష తీసుకుని బౌద్ధంలో చేరింది.
1957 ప్రథమ భారత స్వాతంత్ర పోరాటపు రోజులు. ఝాన్సీరాణి లక్ష్మీబాయి. బేగం హజరత్‌ ఆంగ్లేయుల నెదిరించి పోరాడి వీరమరణం చెందారు. ఝాన్సీ, గ్వాలియర్‌, కాన్పూరు, మీరట్‌ మొదలగు రాజ్యాలు, నగరాలు పోరాటానికి ముఖ్యకేంద్రాలు. ఆ సమయంలో కాన్పూరు పట్టణంలో ఒక వేశ్య వుండేది (పేరు గుర్తులేదు). ఆమె మదిలో దేశభక్తి దాగివుంది. సంగీత-నృత్యాలు ఆమెకు కరతలామలకాలు. ఆమె అందచందాలతోపాటు కళల కీర్తి చంద్రికలు నలుదిశల వ్యాపించాయి. విప్లవవీరులను అంత మొందించటానికి ఆంగ్లేయ అధికారులు సైన్యంతో డేరాలు వేసుకొని కాన్పూరులో దిగారు. ఆంగ్లేయ కంపెనీ అధికారులలో అందరికంటె వున్నతాధికారి ఆ వేశ్య దగ్గరకు వచ్చేవాడు. అతన్ని ప్రసన్నుని చేసుకొని వారి యుద్ధవ్యూహ రచనలు తెలుసుకొని విప్లవకారులకు చేరవేసేది. తన యింటిలో విప్లవకారులకు ఆశ్రయమిచ్చేది. తమ వ్యూహరచనలు వేశ్యవలన ముందుగానే విప్లవకారులకు తెలుస్తున్న వని తెలుసుకొని ఆమెను ఫిరంగి గుండ్లతో కాల్చి చంపారు. ఇది నిజమైన ఘటన. ఆ పోరాటంలో అమరులయిన దేశభక్తులతోపాటు ఈ వేశ్య దేశభక్తురాలుకు కూడ మనం నీరాజనాలు అర్పిద్దాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.