పసుపులేటి గీత
‘ఒక మహిళగా నా ఆత్మగౌరవం మీద, నా పరిపూర్ణత మీద నాకెలాంటి సందేహాలు లేవు. నా వృత్తిని పురుషులే కనిపెట్టారని తెలుసు. ఆ పురుషులే రెండు ప్రపంచాల్ని పరిపాలిస్తున్నారని నాకు తెలుసు. ఒకటి భూమి, రెండోది స్వర్గం. ఆడవాళ్ళు తమ శరీరాలకి వెలకట్టి అమ్ముకునేలా మగవాళ్ళే వాళ్ళని తయారు చేస్తారు. అతి తక్కువ ధరకు లభించే శరీరం పేరు భార్య. ఒక రకంగా కాకపోతే మరో రకంగా…, ఏదో ఒక రకంగా ఆడవాళ్ళందరూ వేశ్యలే…’
– నవల్ అల్ సాదవి నవల ‘ఉమెన్ ఎట్ పాయింట్ జీరో’ నుంచి కొన్ని వాక్యాలు
ఆ రాత్రి తలుపు తట్టిన చప్పుడు…, నాలుగోసారి…, ఐదోసారి…, (అప్పటికే మూడు సార్లు ఆ చప్పుడు వినిపించింది. అయినా ఆమె తన రాతబల్ల దగ్గర్నుంచి ఒక్కడుగు కూడా కదల్లేదు. తనకిష్టమైన నవలా రచనలో ఆమె మునిగి పోయింది.) తలుపును బాదడం ఎక్కువైంది. ఇక తప్పనిసరి అన్నట్టు ఆమె తలుపు దగ్గరకి వెళ్ళింది. ఇంత రాత్రప్పుడు ఎవరై ఉంటారు? దొంగలా?… కాదు, ఎందుకంటే దొంగలు తలుపులు తట్టి రారు. ఇంట్లో తన భర్త కూడా లేడు. అతను ఉదయమే తన స్వగ్రామానికి వెళ్ళాడు. పిల్లలు కూడా ఇక ఆ రాత్రికి ఇంటికి వచ్చేలా లేరు. స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. ఫ్లాట్‌లో ఆమె ఒంటరిగా ఉంది. అసలే రోజులు బాగాలేవు. గొంతు సవరించుకుని నిబ్బరంగా ‘ఎవరది?’ అని ప్రశ్నించింది. అవతలివైపు నుంచి ‘పోలీస్’ అనే జవాబు వచ్చింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత రాత్రి వేళ పోలీసులా, ఎందుకు తన పిల్లలకు కానీ, భర్తకు కానీ యాక్సిడెంట్ అయిందా? ఒక్క క్షణం పాటు కలవర పడింది. తలుపుకు ఉన్న గాజు కిటికీని కొద్దిగా తొలగించి చూసింది. బయట తుపాకులు పట్టుకుని బోలెడు మంది నిలుచుని ఉన్నారు. ఆమెకి ఏమీ అంతుబట్టలేదు. ‘తలుపెందుకు తెరవాలి?’ అని ప్రశ్నించింది. ‘మీ ఇంటిని సోదా చేయాలని ఆదేశాలు వచ్చాయి’ పోలీసుల జవాబు. ‘మిమ్మల్ని చూస్తే పోలీసుల్లా లేరు, యూనిఫారాలు లేవు, ఆ ఆదేశాలేమిటో చూపించండి….’ అంటూ ఆమె మొండిగా బదులు చెప్పింది. ‘ఆదేశాలు ఇప్పుడు మా దగ్గర లేవు, అయినా మీరు తలుపు తెరవాల్సిందే’ అని వాళ్ళు పట్టుబట్టారు. ఆమె ససేమిరా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుంది. పర్సులో గుర్తింపు కార్డు, కొద్దిగా డబ్బును ఉంచుకుంది. చెప్పులు తొడుక్కుంది. ఏం జరిగినా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడింది. పెద్దగా చప్పుడైంది. వాళ్ళు తలుపును బద్దలు కొట్టారు. ఆమె వాళ్ళని ప్రతిఘటించింది. వాళ్ళు చట్టవ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అరిచింది. వాళ్ళు ఆమె రాస్తూ, రాస్తూ బల్లమీద వదిలేసిన నవలను కూడా సంచిలో కుక్కుకున్నారు. తన నవలను ముట్టుకోవద్దని ఆమె గర్జించింది. అయినా వాళ్ళు ఆమె మాటల్ని లక్ష్య పెట్టలేదు. బలవంతంగా జీపులో ఎక్కించుకుని, బయలుదేరారు. పరిచితమైన రోడ్లన్నింటినీ దాటుకుని జీపు అపరిచిత బాటల మీదుగా పరిగెడుతోంది. వీళ్ళు తనను ఎక్కడికి తీసుకువెళుతున్నారు? జైలుకా లేక చంపేయడానికా? తిరిగి తాను ఇంటి ముఖం చూస్తుందా?…. ఆమె మనసులో ఎన్నెన్నో సందేహాలు సుళ్ళు తిరిగాయి. ఇలా రాత్రిళ్ళు, మరీ ముఖ్యంగా అందరూ గాఢనిద్రలో ఉండే తెల్లవారుఝామున వచ్చి తలుపు తట్టే, లేదా ఎవరూ తెరవక పోతే తలుపుల్నిబద్దలు కొట్టే ఈ వ్యక్తులు తమను తాము ‘విజిటర్స్ ఆఫ్ ది డాన్’ (వేకువ అతిథులు) అని పిలుచుకునే వాళ్ళు. సాదవికి ఇలాంటి వేకువ అతిథుల వేధింపులు క్రమంగా అలవాటై పోయాయి.
‘నేను నా అనుభవాల్ని అక్షరబద్ధం చేస్తున్నాను. ఈజిప్టును వదిలిపెట్టిన తరువాత నేను రాయడాన్ని ప్రారంభించాను. చంపేస్తామన్న బెదిరింపులు నా జీవితానికి ఒక ప్రాధాన్యాన్ని సంతరించి పెట్టాయి. అందుకే ఈ జీవితాన్ని రాయడానికే అంకితం చేయాలి. నేను చావుకు దగ్గరగా వెళుతున్నానని నాకు తెలుసు. చావుకు ఎంతగా దగ్గరైతే జీవితం విలువ అంతగా పెరిగిపోతుంది. చావును జయించడానికి రాత కన్నా మంచి ఆయుధం మరోటి లేదు. మోజెస్, జుడాయిజం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ‘రాయడం’ వల్లనే. క్రీస్తు మహాశయుడు కొత్త నిబంధనల కోసం, ఖురాన్ కోసం మహమ్మద్ ప్రవక్త జీవించారు. ఇవాల్టికీ వాళ్ళు మనలో భాగమయ్యారంటే ‘రాయడం’ వల్ల మాత్రమే సాధ్యమైంది. అందుకే రచన నుంచి మహిళల్ని, బానిసల్ని మినహాయించారు… నా జీవితమంతా దెయ్యాలతో సాహచర్యంలోనే గడిచిపోయింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను వాటికోసం వెదికాను. కైరోలో పెరిగి పెద్దదాన్ని అయిన తరువాత అవి నాకోసం వెదకడం మొదలుపెట్టాయి. ‘విజిటర్స్ ఆఫ్ ది డాన్’ అనే పేరుతో అవి నా తలుపుల్ని బాదుతూనే ఉన్నాయి…’ అంటారు సాదవి. ‘నువ్వొక అనాగరిక, ప్రమాదకర మహిళవి అని వాళ్ళంటారు. నేను నిజాన్నే మాట్లాడుతున్నాను. నిజమెప్పుడూ అనాగరికమైందే, ప్రమాదకరమైందే’ అంటూ నిర్భయంగా చెబుతారామె.
ఈజిప్షియన్ నవలాకారిణి, వ్యాసకర్త అయిన నవల్ అల్ సాదవి అరబ్బు నవల సరిహద్దుల్ని విస్తృతపరిచిన స్త్రీవాద రచయిత్రి. సాదవి రచనల్లో మహిళలపై సాగుతున్న అణచివేత, హింసే ప్రధాన భూమికగా ఉంటాయి. అందుకే అవి ఈజిప్టు సహా పలు అరబ్బు దేశాల్లో సహజంగానే నిషేధానికి గురయ్యాయి.
నవల్ అల్ సాదవి 27, అక్టోబర్, 1931న కఫర్ తహ్లా అనే కుగ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేసేవాడు. తల్లి కులీన వంశానికి చెందిన మహిళ, వాళ్ళిద్దరూ తమ తొమ్మిది మంది సంతానాన్ని ఆడ, మగ తేడా లేకుండా, అందర్నీ పాఠశాలకు పంపించి చదివించారు. కానీ చిన్నవయసులోనే తల్లిదండ్రులు మరణించడంతో సాదవి ఆ కుటుంబానికి ఆధారమయ్యారు. ఆమె 1955లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డాక్టరుగా పట్టా పుచ్చుకున్నారు. వృత్తి బాధ్యతల్ని నిర్వహిస్తూనే సాదవి మహిళల కష్టనష్టాల్లోకి తొంగి చూశారు. సామ్రాజ్యవాద అణచివేతలో సాంస్కృతికపరమైన వివక్షకు గురై మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆమె దృష్టి సారించారు. కఫర్ తహ్లాలో వైద్యురాలిగా పనిచేస్తున్న సాదవిని మళ్ళీ కైరోకి పంపించారు. అప్పటికే ఆమె రెండుసార్లు వివాహమాడి, విడాకుల్ని పొంది ఉన్నారు. కైరోలో తోటి రచయిత షెరిఫ్ హెటాటా ఆమెకు పరిచయమయ్యారు. వాళ్ళిద్దరూ 1964లో వివాహమాడారు. వారికి ఒక అమ్మాయి, అబ్బాయి కలిగారు. ఇప్పుడు వారిద్దరూ కూడా రచయితలుగా ఎదిగారు.
సాదవిలోని తిరుగుబాటు ధోరణి ఆమెను ఈజిప్షియన్ ప్రభుత్వానికి శత్రువుగా మార్చింది. ఆమె 1972లో ‘ఉమన్ అండ్ సెక్స్’ అనే రచనను ప్రచురించారు. ఇందులో ఆడపిల్లలకు చిన్నతనంలోనే జననాంగాలను కత్తిరించే సంప్రదాయంతో పాటు సంస్కృతి పేరిట వారి శరీరాలపై జరుగుతున్న అక్రమాలన్నింటినీ ఆమె ఎండగట్టారు. దాంతో ఆమె తన పదవిని కూడా పోగొట్టుకోవలసి వచ్చింది. ఈజిప్టులోని ‘హెల్త్’ అనే పత్రికకు సంపాదకురాలిగా ఆమె వ్యవహరించారు. ఆ పదవిని కూడా తన రచనల్లోని ఘాటైన విమర్శల కారణంగా పోగొట్టుకోవలసి వచ్చింది. ‘ఉమెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్’కు సంబంధించిన ఐక్యరాజ్యసమితి విభాగానికి ఆమె 1979-80లో సలహాదారుగా వ్యవహరించారు. ప్రభుత్వంతో శత్రువైఖరి వల్ల సెప్టెంబర్, 1981లో ఆమె జైలు పాలయ్యారు. అక్కడే ఆమె ‘మెమొయిర్స్ ఫ్రమ్ ది ఉమెన్స్ ప్రిజన్’ అనే పుస్తకాన్ని రచించారు. ఇస్లాం ఛాందసవాదులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించడంతో 1988లో ఆమె ఈజిప్టు నుంచి సీటెల్‌కు పారిపోయారు. తిరిగి 1996లో ఆమె స్వదేశానికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆమె ఎన్నో పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సాదవి 2005 వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. కొత్తతరానికి అవకాశమివ్వడం కోసం ఆమె అటు తరువాత రాజకీయాలకు కొంచెం దూరమయ్యారు. కౌన్సిల్ ఆఫ్ యూరప్ 2004లో ఆమెను నార్త్-సౌత్ ప్రైజ్‌తో సత్కరించింది. ‘మెమొయిర్స్ ఆఫ్ ఎ ఉమన్ డాక్టర్’, ‘ఉమన్ ఎట్ పాయింట్ జీరో’ లతో పాటు పలు నవలలు, కథలు, ఇతర సాహిత్యాల్ని ఆమె రచించారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags