డా. నళిని
(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాస, కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన వ్యాసం)
అటు పల్లెటూరు – ఇటు పట్టణం. ఒక విషయంలో మాత్రం అది సమానం అని చెప్పవచ్చు. ఎన్ని బాలికల దినోత్సవాలు జరిగినా, ఎన్ని మహిళా సంవత్సరాలు గడిచినా ప్రతిచోటా ఆడ జనాభా మగ జనాభా కంటే తక్కువే. పనిలో సగం కన్నా ఎక్కువ సమయాన్ని, శక్తిని కేటాయించే స్త్రీ జనాభాలో మాత్రం సగం కంటే తక్కువ!
మిస్సింగ్! మిస్సింగ్! మిస్సింగ్! ఎందుకు మిస్సింగ్? ఎక్కడికి మాయమైపోతున్నారు ఈ స్త్రీలు? వీరు చీమూనెత్తురు లేని గాలి తెమ్మెరలా? రంగు రూపం లేని మరీచికలా? చేతికందని అనాకార నీడలా? మరి ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ మాయమైపోయారు?
ఆకాశంలో సగంగా విలసిల్లవలసిన స్త్రీ, భర్త అర్థాంగిగా సగభాగం ఆక్రమించవలసిన స్త్రీ ఒక భారంగా, వదిలించుకోవలసిన, విదిలించుకోవలసిన భారంగా ఎందుకు తయారయింది? ఆమెకి తెలివి లేదా? కార్యదక్షత లేదా? కళాపిపాస లేదా? కార్యాచరణ నేర్పు లేదా? ఎందులో వెనుకబడి వుందని ఈ వివక్ష? దేనిలో పురుషుడి కంటే తక్కువని ఈ ఏరివేత?
అలనాడు వేటాడి పిల్లల కడుపునింపింది స్త్రీ. మొదటి మొక్క నాటింది స్త్రీ. బిడ్డకి వేరునిచ్చింది స్త్రీ, పేరునిచ్చింది స్త్రీ. సొంత ఆస్తి లేని ఆ సమూహ జీవనానికి జవం జీవం స్త్రీ. సంపద పెరిగి, స్వార్థం హెచ్చి, వారసత్వ హక్కు అవసరం కలిగేసరికి స్త్రీ ఓడిపోయింది. బానిసకొక బానిసగా మారింది. మగవాడికి వారసుల్ని కనే యంత్రంగా, స్వయంగా స్వంత ఆస్తిలో భాగంగా దిగజారిపోయింది.
ఈ ఓటమికి పరాకాష్టగా నేడు ఆమె ఉనికే ప్రశ్నార్థకమై పోయింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని తాండాల్లో మేము వైద్యసహాయం అందిస్తున్న క్రమంలో ఎదురైన కొన్ని అనుభవాలు ఈ వాస్తవాన్ని ఎత్తిచూపుతాయి.
”ఇంత బలహీనంగా వున్నావు. ఇంకా ఎందుకమ్మా పిల్లల్ని కంటున్నావు?”
”ముగ్గురూ ఆడపిల్లలే. ఈసారయినా మగపిల్లవాడు పుడతాడని ఆశ.”
”ఎందుకమ్మా ఏడుస్తున్నావ్? నీ బిడ్డ చూడు మూడున్నర కిలోల బరువుతో తెల్లగా మెరిసిపోతూ ఎంత ముద్దొస్తోందో!”
”నాకీ పిల్లొద్దు. పదిమంది ఆడపిల్లల్ని కన్నాను. నలుగురిని పురిట్లోనే చంపేశారు. ఇప్పుడు దీన్నిమాత్రం ఎంతకాలం దక్కించుకుంటాను?”
”బిడ్డకి పాలివ్వమ్మా. చూడు ఎలా చల్లబడిపోతోందో.”
”నేనివ్వ, నేనివ్వ. దాన్ని బతకనిస్తే నాకు బతుకులేదు.”
”ఏమమ్మా, నిన్న మంచిగున్న పాప ఇవాళ ఎలా చనిపోయింది?”
”నాకు తెల్వది.”
ఆడపిల్లని బతకనిస్తే తనకే బతుకులేని దౌర్భాగ్యాన్ని ఎదుర్కొంటున్న తల్లులు తమ కడుపు చించుకుని పుట్టిన పిల్లల్ని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నోట్లో వడ్లగింజ వేసో, గొంతు మీద కాలితో తొక్కో, బస్సు కిటికీలోంచి విసిరేసో, పురుగుమందు నాలుకకి రాసో, పాలు ఇవ్వక కడుపు మాడ్చో, ఊరి చివర పందులకి ఆహారంగా వేసో, చెత్తకుండీలోకి విసిరేసో, కాగుతున్న సారా ఆవిరి గొట్టాన్ని పిల్ల ముక్కులోకి పెట్టో ఇప్పటికీ ఆడపిల్లల్ని చంపుతున్న ప్రబుద్ధులు వున్నారు.
ఇవి కళ్ళకి కనిపించే హత్యలు. పల్లెటూరి పేదజనం తమ పేదరికాన్ని దాచుకోలేక, అభద్రత నించి బయటపడలేక, బతుక్కి హామీలేక, నిరాశా నిస్పృహలతో తీసుకుంటున్న తీవ్రమైన నిర్ణయం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ భ్రూణహత్యల్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘ఉయ్యాల పథకం’ అలాంటిదే. ఐ.సి.డి.యస్. కార్యాలయం ఎదుట కట్టిన ఉయ్యాలలో బిడ్డని పడుకోబెట్టి గంటకొట్టి పారిపోతే, ఆ బిడ్డని ప్రభుత్వం రక్షించి, దత్తత కోరుకునేవారికి అందిస్తుంది. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. గాయానికి మందు పూయడం లాంటిదే. కానీ గాయాన్ని నిరోధించడం ఎలా? స్త్రీలలో అభద్రతా భావాన్ని తొలగించడం ఎలా?
పట్టణాల్లో వీధివీధినా వెలసిన స్కానింగ్ సెంటర్లు నాలుగైదు నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకి వరంగా మారాయి. శిశువు ఎదుగుదలని, అవయవాల తయారీని, మాయస్థితిని అంచనాకట్టే నెపంతో స్కానింగ్ చేసి, ఆడపిల్ల అని నిర్ధారించగానే కడుపు తీయించుకోవడం పరిపాటయింది. చాటుమాటు వ్యాపారంగా ఎన్నో జేబులు నిండుతున్నాయి, ముదరకముందే పేగులు తెగుతున్నాయి. ఇవి పరోక్ష హత్యలు.
ఇదికాక, ఇంట్లో వేధింపులు భరించలేక పారిపోయే భార్యలు, కూతుళ్ళు. వారు ఏమైపోయారో ఆచూకీ లేదు, లెక్కలూ లేవు. వారు అనాథ శవాలయ్యారా, రెడ్‌లైట్ ఏరియాలకు బలిపశువులయ్యారా; షేకుల పడకటింటి వింజామరలయారా ఆధారాలు లేవు. ఈ మిస్సింగ్ జనాభా పెరుగుతూనే వుంది. భయపెడుతూనే వుంది.
నేటి జనాభా లెక్కలు చూస్తే అధోజగత్ సహోదరులు అనుభవిస్తున్న స్థానం ఏమిటో అర్థమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మన స్త్రీల స్థితి దిగజారుడుగానే వుంది. ‘మెయిన్‌స్ట్రీమ్’ అనేది ‘మేల్ స్ట్రీమ్’ అయిందంటే అతిశయోక్తి కాదు అని చెప్పవచ్చు.
ఏ దేశ పురోగతినయినా అంచనా కట్టాలంటే ఆ దేశంలో స్త్రీల స్థాయిని ప్రమాణంగా తీసుకోవచ్చుననే నెహ్రూ మాటలు చూస్తే, మనదేశం చాలా వెనుకబడే వుందని చెప్పవచ్చు. మచ్చుకి కొన్ని గణాంకాలు చూస్తే ఇది అర్థమవుతుంది. గర్భిణీ స్త్రీలలో 88 శాతానికి రక్తహీనత. పేదరికంలో మగ్గుతున్న ప్రజల్లో 70 శాతం స్త్రీలే వున్నారు. ప్రతి ఐదు నిముషాలకి ఒక మహిళ కాన్పులో చనిపోతోంది. దాదాపు గంటకు ఒకరు కట్నం చావుకి బలవుతున్నారు. భ్రూణహత్యలు, మాయమవుతున్న మహిళల పట్ల సెక్స్ రేషియో పడిపోయింది. ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది పురుషులకి 927 మంది మహిళలు మాత్రమే వున్నారు. సమానమైన పనికి సమాన వేతనం లేక ఇంటా బయటా చాకిరీతో మహిళలు కృశించిపోతున్నారు. ఆరోగ్య సమస్యలే కాక మానసిక సమస్యలతో మగ్గిపోతున్నారు. ఇవికాక గృహహింస, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, శ్రమ దోపిడీలకు లెక్కేలేదు. లైంగిక సమానత్వ సూచికలు (జెండర్ ఇండికేటర్లు)గా ఉనికి, విద్య, ఆహారం, ఆరోగ్యం, ఉపాధి, భద్రత, భావప్రకటన స్వేచ్ఛలను చూస్తే, అన్నిట్లో స్త్రీ వెనుకబడే వుంది. అణచివేతకి గురవుతూనే వుంది.
పుట్టిన దగ్గరనించి గిట్టేవరకు ఈ వివక్ష స్త్రీని వెంటాడుతూనే వుంటుంది. గర్భస్థ శిశువుగా స్కానింగ్ – గర్భస్రావం. పుట్టిన వెంటనే చావు, లేదా వీధిపాలు. పెరుగుతుంటే ఆహార లేమి, అవిద్య, సాంఘిక కట్టుబాట్లు. యుక్తవయసులో ఆరోగ్య సమస్యలపై అవగాహన లోపం, సరైన శిక్షణ, చేయూత లేకపోవడం, నిరక్షరాస్యత, వయసు ముదరక ముందే పెళ్ళి, పిల్లలు. గృహహింస, వరకట్న చావులు, గర్భిణీగా ఆరోగ్య సమస్యలు, రక్తహీనత, ముసలితనంలో కూడా రెక్కాడినంత కాలం పనిమనిషి అవతారం, తరువాత నిర్లక్ష్యం. వేతనాల్లో వివక్ష. రాజకీయాల్లో వెనుక వరుస.
ఆర్థిక, సామాజిక, రాజకీయ వివక్షలతో పాటు పురుషపెత్తనం అనే అదనపు గుదిబండ కింద నలిగిపోతున్న స్త్రీ వీటినించి బయటపడటం కోసం నిరంతరం ఇంటాబయటా పోరాడవలసే వుంది.
ఈ లైంగిక అసమానత్వం వల్ల వ్యక్తుల ఎదుగుదల కుంటుపడుతుంది. దేశాభివృద్ధి దెబ్బతింటుంది. సమాజోన్నతి వెనుకబడుతుంది. అంతిమంగా, స్త్రీపురుషులిరువురి ప్రగతి దెబ్బతింటుంది.
”దేముడా, స్త్రీ తన రాతని తను రాసుకునే హక్కు ఎందుకివ్వలేదు? తల దించుకుని బాట పక్కన నిలబడి, ఓర్పు నశిస్తుండగా, రేపు ఏదో ఒక అద్భుతం జరిగి తన గతి మారుతుందనే ఆశతో ఆమె ఎందుకు వేచి చూడాలి?” అని టాగోర్ ఆక్రోశించాడు.
మరొకకవి -”నిన్ను దేవిగా కొలుస్తారు
కానీ నువ్వొక శాపానివంటారు,
నిన్ను సరస్వతి అంటారు
కానీ నీకు తిండి మాత్రం పెట్టరు,
నీకు గుళ్ళు కట్టిస్తారు
కానీ నీ గర్భాన్ని ఛేదిస్తారు,
నీకు దైవత్వాన్ని ఆపాదిస్తారు
కానీ నీ ప్రాణాన్ని తీస్తారు!” – అంటూ మన సమాజంలో వున్న లోపాన్ని వ్యంగ్యంగా ఎత్తిచూపాడు.
ఇలాంటి వివక్షల మధ్య స్త్రీలు నిరంతరం పోరాడుతూనే బతకాలి. పుట్టాలంటే పోరాటం, అన్నదమ్ములతో సమానంగా తినాలన్నా, తిరగాలన్నా, చదవాలన్నా, ఆడాలన్నా, నవ్వాలన్నా పోరాటం. పెళ్ళయిన గిరిజన స్త్రీ రవికె తొడుక్కోవలనుకుంటే పోరాటం. పురుషుడితో సమానంగా చేస్తున్న పనికి సమాన వేతనం కావాలంటే పోరాటం. చట్టసభల్లో గొంతు వినిపించాలంటే పోరాటం.
ఇలాంటి ఎన్నో రకాల వత్తిళ్ళకు గురై, ఏదో ఒక దశలో ఓరిమి గట్టు తెగితే – మానసిక సమస్యలు. అవి ముదిరితే – హిస్టీరియా. కష్టాలను భరించి భరించి, వాటిని సహజమైనవిగా స్వీకరించి, చివరికి రాజీపడలేక మథనపడి మతితప్పితే – అదే హిస్టీరియా. అనారోగ్యం, కట్నం వేధింపులు, పనిచేసేచోట వివక్ష, మగపిల్లవాడికి జన్మనివ్వలేకపోవడం, చదువు లేకపోవడం, దేశ సంపదని పెంచే దిశగా శ్రమశక్తిని వినియోగించలేక పోవడం, ఎటువంటి స్వేచ్ఛ లేకుండా తండ్రి, భర్త, కొడుకుల అదుపాజ్ఞల కింద బతకడం – ఇవన్నీ ఆమె ఓర్పుని పరీక్షిస్తాయి. ఒకోసారి ఆత్మహత్య వైపుకి పురికొల్పుతాయి.
పుట్టడమే బలహీనంగా పుట్టిన ఆడపిల్ల ముందు ముందు అనారోగ్యంతో, రక్తహీనతతో బలంగా ఎదగలేదు. వయసు ముదరక ముందే పెళ్ళి, పిల్లలు, చాకిరీ, బాధ్యతలతో ఇరవైఐదేళ్ళ మిసమిస వయసులోనే ముసలితనం ఆవరించి నీరసంగా బతుకులీడ్చే స్త్రీలే ఎక్కువ. అవిద్య, అతిశ్రమ, ఎలాంటి అధికారం లేనితనం, వివక్ష – అన్ని కలిసి ఈ అనారోగ్యానికి తోడై ఆమె నీరసపడిపోతోంది. ఆమె చేయూతనివ్వవలసిన సమాజం, ప్రభుత్వం నిశ్శబ్దంగా వుండిపోతే, గతిలేనితనం వల్ల భ్రూణహత్యలకు పాల్పడుతోంది. తనకే భద్రత లేకపోతే తనకి పుట్టే ఆడపిల్లకి ఏమి భద్రతనిస్తుంది? చదువుకున్న స్త్రీలు కూడా నిస్సహాయులే. వారిది ”లర్న్‌డ్ హెల్ప్‌లెస్‌నెస్!” గృహహింసతో తల్లడిల్లిపోతూ, ఆశలను ఆశయాలను మర్చిపోయి, బతకాలనే ఇచ్ఛ నశించి, ఎందులోనూ క్రియాశీల పాత్ర వహించలేకపోవడం వారి దౌర్భాగ్యం.
తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తలెత్తుకుని బతికే దశకి స్త్రీలు చేరుకోవాలంటే ఎంతో కృషి చేయవలసి వుంది. ముందుగా, భ్రూణహత్యల్ని ఆపాలి. స్త్రీల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచాలి. వారి ఆకలి తీర్చాలి. వారికి భద్రతనివ్వాలి. లైంగిక అత్యాచారాలు ఆపాలి. వరకట్నాన్ని నిషేధించాలి. అక్షరాస్యతని పెంచాలి. ”పేదరికానికి ఒక ముఖాన్ని ఇవ్వాలంటే అది స్త్రీముఖమే అవుతుంది!” అనే నానుడిని మార్చాలి.
నేడు గొంతెత్తి ప్రతిఘటిస్తున్న స్త్రీలు మార్పుని, స్వేచ్ఛని కోరుతున్నారు. తక్కువ స్థాయిలో చూసే చట్టాలను ధిక్కరిస్తున్నారు. పురుషపాలనని అంతం చేసే సామాజిక నీతిని కోరుతున్నారు. శ్రామిక జనుల పీడనలో భాగంగానే స్త్రీల పీడన వుందని గుర్తెరిగి, శ్రామికులతో భుజం భుజం కలిపి పోరాడుతున్నారు. ఉత్పత్తి, పునరుత్పత్తి అనే రెండు స్థంభాల మీద నిలబడిన సమాజానికి సమతౌల్యాన్ని చేకూర్చి, మానవోన్నతి కోసం పాటుపడుతున్నారు.
ఈ ప్రయత్నాన్ని వ్యక్తిగతంగానే కాక సామూహికంగా కొనసాగిస్తూ, ఉద్యమిస్తూ ముందుకు పోవలసి వుంది. వ్యక్తిగత సమస్యలపైనే గాక, సమాజ శ్రేయస్సుకి అడ్డుతగులుతున్న అన్ని ప్రతీఘాత శక్తులపైన దృష్టి కేంద్రీకరించవలసి వుంది. అందుకే సారా వ్యతిరేక పోరాటం గాని, భూసంస్కరణ పోరాటాలు గాని, ఇతర ప్రజా ఉద్యమాలు గాని ఎంతో ప్రాచుర్యం పొందాయి.
”నాది ఒక్కటే విన్నపం
నేను డబ్బు కావాలనను
నాకు అది అవసరమున్నా అడగను.
నాకు ఆహారం కావాలనను
నాది ఒక్కటే విన్నపం.
నేను అడిగేది ఒక్కటే
నా దారికి అడ్డంగా వున్న
పెద్ద బండరాయిని
తొలగించండి!”
– అని ఒక ఆఫ్రికన్ మహిళ కోరినట్టు, ఉద్యమిస్తున్న స్త్రీలకు అవరోధాలు కల్పించవద్దు. వారికి అన్ని విధాలా చేయూతనిద్దాం. అసమానత్వం నించి సమానత్వంలోకి, పీడనల నించి స్వేచ్ఛలోకి, విషాద జీవితంలోంచి విముక్తిలోకి పయనిస్తున్న స్త్రీ జనావళికి అండగా నిలుద్దాం. స్త్రీ విముక్తి కోసం మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. పోరాడటానికి సాహసిద్దాం. సంఘటితపడదాం. మాయమైపోతున్న మహిళలకు ఒక అడ్రసునిద్దాం, ఆనవాలునిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ప్రథమ బహుమతి పొందిన డా. నళిని గారి ఈ వ్యాస0 చదివాక,నిర్ణేతలు దీన్ని బహుమతికి ఎ0పిక చెయ్యట0 చాలా సబబుగా ఉందని అనిపించింది. భాషా పరంగా,వస్తుపరంగా, చాలా చక్కగా తమ అభిప్రాయాలని,ఉదాహరణలిస్తూ,వివరించారు నళిని.
డా.నళినిగారికీ,భూమిక కీ,న్యాయనిర్ణేతలకీ అభినందనలతొ…
శాంతసుందరి.