వెలమకన్ని మధుమతి
(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాస, కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ)
”నమస్తే సార్! నా పేరు నవ్య… హోమ్ వాళ్ళు పంపారు.””ఆఁ! రామ్మా! సెక్రట్రీ గారు ఫోన్ చేసి చెప్పారు, నువ్వు వస్తున్నావని… హైమా” అంటూ భార్యని పిల్చాడు రామ్మూర్తి. లోపలికి రాబోతూ ఎదురుగుండా గోడకి ఉన్న, సినిమా హీరోలా ఫోజిచ్చిన కుర్రాడి ఫోటో చూసి ‘వీళ్ళింటికా తనొచ్చింది’ అని మనసులో అనుకుంటూ, తటపటాయిస్తూ ఆగిపోయింది నవ్య. అంతలోనే ‘వాడిక్కడ లేడు కనుకనేగా తను ఇక్కడికి వచ్చే అవసరం పడింది’ అని తమా యించుకుని లోపలికొచ్చింది. హైమవతి చేత్తో మోకాలు రుద్దుకుంటూ మెల్లగా కుంటుతూ లోపల్నించి వచ్చింది.
”నమస్తే” అంటూ నవ్వుతూ చేతులు జోడించింది నవ్య. చీరకట్టులో పొందికగా ఉన్న పాతికేళ్ళ నవ్యను చూసి సంతృప్తిగా నవ్వుతూ ”కూర్చో మ్మా… నవ్య కదూ… ఎక్కడుం టావ్? ఏం చదువుకున్నావు?” అంది హైమవతి.
”నేను…” అంటూ తన వివరాలు చెప్పబోయి, అంతలోనే చెప్పడం ఇష్టం లేనిదానిరా ”హోమ్ రూల్స్ ప్రకారం మా వివరాలు చెప్పకూడదు మాడమ్. మీకు వాళ్ళు చెప్పే ఉంటారుగా! ప్రతి శనివారం నేను మీతో ఉంటాను. ఆ రోజు మీకెటువంటి సహాయం కావాలన్నా నిర్మొహమాటంగా అడగండి.”
”ఇదేం కొత్త రూలూ? ఇంటికొచ్చినవాళ్ళ గురించి మనకు తెలియద్దటండీ?” సాగదీస్తూ భర్తనడిగింది హైమ.
”ఆశ్రమం ద్వారానే కదా వచ్చింది. వాళ్ళు అన్నీ చూసుకునే పంపిస్తార్లే” న్యూస్‌పేపరులో నుండి తలత్రిప్పి నవ్యను గమనిస్తూ అన్నాడు రామ్మూర్తి.
కొంత సమాధానపడి ”రామ్మా! లోపలికెళ్దాం… నాకు మోకాళ్ళ నొప్పులు. తొందరగా నడవలేను. మావారికి ఏడాది క్రిందట యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. ఇప్పుడు కాస్త వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారనుకో.”
ఇల్లంతా పరిశీలిస్తూ ”మీ ఇల్లు బాగుంది మాడమ్” అంది నవ్య.
”అలా మాడమ్ అనకు. నాకేదో ఆఫీసులో ఉన్నట్లుంటుంది. ఆంటీ అను.”
”అలాగే! ఈ పూట వంట నేనే చేస్తాను. ఏం చెయ్య మంటారు?” అంటూ చీరకొంగు దోపి చకచకా పనిలో పడింది నవ్య.
”మాకు ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ అమెరికాలోనే ఉన్నారు. బాగా సంపాదిస్తున్నారు. మాకు డబ్బు సమస్య లేదు. కానీ ఈ ఒంటరితనాన్ని భరించడం కష్టంగా ఉంటోంది. ప్రతిరోజూ ఎంతో భారంగా గడుస్తుంది. ఆ మాటకొస్తే మా కాలనీలో సగం మంది ఇలాంటి ఒంటరి దంపతులే. విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండలేక, వయసు మీరుతుంటే ఒంటరిగా ఉండలేక బాధపడు తున్నవాళ్ళే.”
”మంచి జాబ్స్ వదిలి రాలేరు కనుక మీరే అక్కడికెళ్ళండి ఆంటీ! వాళ్ళ పిల్లలతో కాలక్షేపం అవుతుంది కదా.”
”మా పెద్దాడు విజయ్ గొడవ భరించలేక మేము కూడా ఒకసారి అమెరికా ప్రయాణం అయ్యాము. నాకైతే భర్తా, పిల్లలూ ఎక్కడుంటే అదే నా యిల్లు అనిపించింది. అక్కడ కూడా వంటింటి బాధ్యత నేనే తీసుకున్నా కనుక అమెరికానా, అండమానా అని నాకేం తేడా కనిపించలేదు. మా కోడలు డిష్ వాషర్‌లో గిన్నెలు కడిగిపెట్టేది. నేను వంటచేసి మనవడితో ఆడుకునేదాన్ని. కానీ ఆయన మాత్రం వారం రోజుల్లోనే జబ్బు పడ్డట్లు అయిపోయారు. ఆర్నెల్లుందామని వెళ్ళినవాళ్ళం నెలరోజుల్లోనే తిరిగొచ్చేశాం. తరువాత ఆయనకి యాక్కిడెంట్… నా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పుల్తో ఎలాగో తిప్పలు పడి బజారు పన్లు చేసుకునేదాన్ని. పిల్లల్తో ఈ విషయాలన్నీ ఫోన్లో చెప్తుంటే ”నీకు ఒంట్లో బాగుండకపోతే దగ్గర్లో ఉన్న డాక్టరు దగ్గరికెళ్ళాలి కానీ దూరంగా ఉన్న నీ కొడుకేం చేయగలడు?” అంటూ ఆయన నా నోరు నొక్కేస్తారు.”
”మీ బంధువు లెవరూ లేరా ఆంటి?”
”లేకేం. చాలామందే ఉన్నారు. కానీ రోజూ ఎవరొస్తారు? ఏం సహాయం చేస్తారు?”
”నిజమే”
”చివరికి మావారు అడపాదడపా డబ్బు పంపే వృద్ధాశ్రమంలో చేరదామనుకున్నాం. ఎంతో ఇష్టంగా కట్టుకున్న పొందికైన ఇల్లు వదిలి వెళ్ళడానికి ఇద్దరికీ మనసొప్పలేదు. పైగా, ఎంత డబ్బైనా, పనివాళ్ళని పెట్టుకోండి గానీ ఎవరూ లేనట్లు హోమ్‌లో చేరొద్దని అక్కడినుండి కొడుకులు విరుచుకుపడ్డారు. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాం.”
”ఒకరోజు వృద్ధాశ్రమం వాళ్ళిచ్చిన ప్రకటన నన్నాకర్షించింది. ఆశ్రమంలో చేరలేక ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులతో ఒక రోజంతా గడపడానికి ఇష్టమున్నవారు ముందుకు రాగలరు. ఇలాంటి సదుపాయాన్ని కోరుకునే మా మెంబర్లు కూడా వారి సమ్మతి మాకు తెలియచేయగలరు.”
వెంటనే ఆయనకి చూపించి ‘మనక్కూడా అలా ఎవర్నైనా పంపమని ఆశ్రమం వాళ్ళకి చెప్పండి’ అన్నాను.
‘ఎందుకూ? అడ్డమైనవాళ్ళంతా వచ్చి రోజంతా మన బుర్ర తినిపోడానికా?’ అంటూ నీరుకార్చారు.
నేను చిన్నబుచ్చుకోవడం చూసి ‘సరేలే! అంతగా నచ్చకపోతే అప్పుడే వద్దందాం’ అంటూ హోమ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు.
”నేనూ ఆ ప్రకటన చూసే పేరిచ్చాను ఆంటీ.”
”ఓహో! రోజుకొకళ్ళు వస్తున్నారు. వారిలో ఎక్కువగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నవాళ్ళు, చిన్నతనంలోనే బాధ్యతలు తీరి ఓపిక ఉన్న ఆడవాళ్ళు, నడివయస్సులో ఉన్నావారు. నువ్వే అందరిలోకి చిన్నదానివి. చక్కగా సినిమాలకీ, షికార్లకీ తిరగాల్సిన పిల్లవి ఇది పెట్టుకున్నావేంటి?” ఉండబట్టలేక అడిగేసింది హైమవతి.
”అలా తిరగడంలో ఆనందం కొన్నాళ్ళే ఆంటీ. విలువైన టైమ్‌ని వేస్టు చేస్తున్నాననిపించింది. నలుగురికీ ఉపయోగపడే పనేదైనా చెయ్యాలనిపించింది. డబ్బు సహాయం చేసి ‘సోషల్ సర్వీస్’ అంటూ చేతులు దులిపేసుకోబుద్ధికాలేదు. నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేలా ఏదైనా చెయ్యాలనుకున్నాను. ఆ టైమ్‌లో ఆశ్రమం వాళ్ళ యాడ్ చూసి శనివారం దీనికి కేటాయిద్దామని నిర్ణయించుకున్నాను. మిగతా రోజుల్లో నాకు వేరే ఉద్యోగం ఉంది ఆంటీ.”
జ జ జ
అలా నవ్యతో పరిచయమై సంవత్సరం కావస్తోంది. కేవలం లొడలొడా మాట్లాడడమే తోడుగా ఉండడం అని కొందరనుకుంటే, వచ్చినప్పటినుండీ టీవీ సీరియళ్ళు వరసపెట్టి చూసి ఇంటికెళ్ళినవారు కొందరు. ఏ ఉద్దేశ్యంతో అయితే ఆశ్రమం వాళ్ళు ఈ సదుపాయాన్ని కల్పించారో, ఇలాంటి ఒంటరి వృద్ధులకు కావాల్సిన అవసరం, అంశం ఏమిటో సరిగ్గా గ్రహించింది నవ్య. ఒక వారం టెలిఫోన్ బిల్లు, కరెంట్ బిల్లులు కట్టడం, సరుకులు తెచ్చిపెట్టడం లాంటి బయటి పన్లు చేసుకొచ్చేది. వంటమనిషిని కుదిర్చిపెట్టింది. ఇంకొక వారం పనివాళ్ళతో ఇల్లు శుభ్రం చేయించేది. రామ్మూర్తితో చెస్సూ, కారమ్సూ ఆడేది. హైమవతికి కంప్యూటర్ ఆన్ చెయ్యడం, మనవల ఫోటోలు చూసుకోవడం నేర్పింది. నవ్య అలవాటు పడ్డాక వేరే ఎవర్నీ పంపొద్దనీ, ఒక శనివారం నవ్య వస్తే చాలని ఆశ్రమం వాళ్ళకి చెప్పేశారు. శనివారం కోసం ఎదురుచూడడం అలవాటై పోయింది. పిల్లల ఇష్టాయిష్టాలు, వాళ్ళ చిన్నతనపు అల్లరి, మనవడి విషయాలు, అత్తగారితో పడ్డ కష్టాలు అన్నీ ఏకరువుపెట్టేది హైమవతి. ఇంకొకవైపు రామ్మూర్తి ఆఫీసు విషయాలు, విజయాలు ఆ అమ్మాయితో పంచుకునేవాడు. అన్నీ ఓపిగ్గా వినేది నవ్య.
”ఇప్పుడు తెలిసిందమ్మాయి. మాక్కావల్సింది మాతో మాట్లాడేవాళ్ళు కాదు, మా గోడు వినేవాళ్ళు అని” అంటూ నవ్యని మెచ్చుకుంటుంది హైమవతి. ఇదొక మొక్కుబడిగానో, లేక గొప్ప కోసమో అన్నట్లు కాకుండా పూర్తి సేవాభావంతో చెయ్యడం వలన త్వరలోనే వాళ్ళ మన్ననలనందుకుంది నవ్య. జీవితంలో నిత్యం ఎదురయ్యే కొన్ని మానవ విలువలకి సంబంధించిన సమస్యలను వారి ముందుంచి పరిష్కారం సూచించమని హోంవర్క్ ఇచ్చేది. ఆ పనిలో నిమగ్నం అయిపోవడంతో వాళ్ళకి వారం ఇట్లే గడిచిపోయేది. అలాంటి సమస్యలముందు వాళ్ళ సమస్య చాలా చిన్నది అనిపించేలా చేసేది. మెల్లగా బాంక్ లావాదేవీలు చూసే పని కూడా ఆమెకి అప్పగించేంత చనువు, నమ్మకం కలిగింది ఆ దంపతులకి.
జ జ జ
అప్పుడప్పుడు ఇంట్లోకొచ్చే ముందు తన చిన్నకొడుకు వినయ్ ఫోటోని నవ్య తదేకంగా చూడడం గమనించింది హైమవతి.
వెంటనే భర్త దగ్గర ఆ ప్రస్తావన తెచ్చింది.
”ఏవండీ! నవ్యని మన వినయ్‌కి అడిగితే ఎలా ఉంటుంది?”
”బేషుగ్గా ఉంటుంది.”
”కానీ ఆ అమ్మాయి గురించి వివరాలు మనకి తెలియాలి.”
”మనం తెలుసుకోవాలంటే అదంత కష్టమైన పనా? మనింటి విషయాలు పూర్తిగా తెలిసిన పిల్ల… అంతకంటే ఏం కావాలి మనింటి కోడలవడానికి?”
భర్తతో ఏకీభవించింది. ”మరి ఆలస్యం ఎందుకు? రేపే అబ్బాయి అభిప్రాయం కనుక్కుందాం. ఆ తరువాత నవ్యని అడగవచ్చు.” నవ్య శాశ్వతంగా ఆ యింటి మనిషవుతుందనే ఆలోచన వారిద్దరికీ ఆనందాన్నిస్తోంది.
జ జ జ
నవ్య లోపలికొస్తుంటే ఎవరిదో మూడో గొంతు వినిపించింది లోపల్నించి. పైగా ఆ సంభాషణలో తన పేరు వినపడగానే సభ్యత కాదని తెలిసే వింటూ అక్కడే ఆగిపోయింది.
”మాతో ఎంతో బాగా కలిసిపోయింది. చూస్తే నీకు నచ్చుతుంది చక్కగా ఉంటుంది” హైమవతి గొంతు.
”అబ్బ! ఎన్నో మంచి మాచెస్ ఉండగా ఈ పనిపిల్ల మీకెలా నచ్చిందమ్మా?”
”ఊర్కో! పనిపిల్లంటావేంటి? జీతానికి చేస్తోందా? ఆ వయసు వాళ్ళెవరూ చేయని సేవ చేస్తోంది.”
”అదే! ఈ వయసులో చక్కగా పెళ్ళి చేస్కోకుండా, ఇలా ముక్కూమొహం తెలియని ముసలాళ్ళతో గడపాలని ఎవరనుకుంటారు చెప్పు? కారెక్టర్ లూజ్, ఏదో తప్పుడు పని చేసి ఉంటుంది. ఇలా సేవ అంటూ బయల్దేరింది.”
”ఆ అమ్మాయిని చూస్తే అలా అనవు.”
”మిమ్మల్ని బాగా పడేసిందమ్మా. చూపులకి కారెక్టర్ ఎలా తెలుస్తుంది చెప్పు? అసలింత కాలం ఆ అమ్మాయి వివరాలు ఏమీ తెలియకుండా ఇంట్లోకి రానీయడమేకాక, ఏకంగా సంబంధం కలుపుకుందామనుకుంటున్నారు.”
”అసలు నువ్వంటున్న ఆ ‘కారెక్టర్’ ఏంటిరా?” కారెక్టర్ అనే మాటని నొక్కి పలుకుతూ రామ్మూర్తి కల్పించుకున్నాడు.
”మీకు తెలీదా డాడీ, నేనే కారెక్టర్ గురించి మాట్లాడుతున్నానో? మీకే ఒక కూతురుంటే ఇలా సేవ అంటూ బయటికి పంపుతారా? దాన్ని బట్టి తెలీడం లేదా వాళ్ళ ఫామిలీ ఎలాంటిదో? ఇంక ఈ విషయం ఇంతటితో ఆపేయండి. ప్లీజ్…”
వింటున్న నవ్యకి ఒళ్ళు వేడెక్కిపోయింది. లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. గిరుక్కున వెనుదిరిగి ఇంటికెళ్ళిపోయింది.
జ జ జ
ఆలోచించిన కొద్దీ మనసు కుతకుతలాడిపోతోంది నవ్యకి. వినయ్ ఇంజనీరింగ్ కాలేజిలో నవ్యకి రెండేళ్ళ సీనియర్. అందగాడు కావడంతో అమ్మాయిలు పడి చచ్చేవారు. అతను కూడా ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేవాడు. నవ్యతో పరిచయాన్ని పెంచుకోడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ అతని కంట పడకుండా తప్పించుకు తిరిగేది నవ్య. తన గురించి పుకార్లు కూడా రాకుండా జాగ్రత్తగా మసులుకుంది. తరువాత అతను అమెరికా వెళ్ళాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. ఆమెకి మంచి ఉద్యోగం వచ్చింది. పెద్ద జీతం, ఇంట్లో బరువుబాధ్యతలు లేవు. స్నేహితులూ, షికార్లూ… ఇదేనా జీవితం అంటే అనిపించి, తల్లిదండ్రులను ఒప్పించి, శనివారం ఆశ్రమం వాళ్ళకి కేటాయించింది. మొదటిరోజు వినయ్ ఫోటోని చూసి, అతని ఇల్లు అని తెలియగానే కొంచెం తటపటాయించింది. అందుకే హోమ్ పేరు చెప్పి తన వివరాలు వాళ్ళకి తెలియనివ్వలేదు. తనకి ఎప్పుడు ఇబ్బంది కలిగితే అప్పుడే మానేయవచ్చనుకుంది. ఆ దంపతులకి వినయ్ తప్ప బుట్టాడనీ, వాళ్ళకి తన అవసరం ఉందనీ గమనించి అనుబంధాన్ని పెంచుకుంది. అతని మాటల్ని విన్నాక అతని మీద ఏమూలో ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా తుడిచిపెట్టుకుపోయింది. అతను తిరిగి అమెరికా వెళ్ళిపోయే వరకు ఆ ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకుంది. కానీ దీని మూలాన ఆ దంపతులు బాధపడడం ఖాయం. ‘తనని చూస్తే తప్పకుండా పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఆ విషయం తనకి తెలుసు. అందుకే తప్పించుకోవడం కంటే ఎదుర్కోవడమే మంచిది. విషయం తేలిపోతుంది.’ ఆ ఆలోచనతో వెళ్ళడానికి నిర్ణయించుకుని బయల్దేరింది.
జ జ జ
”హలో! భాను! నువ్వేంటి… ఇక్కడ?” ఆశ్చర్యం, ఆనందంతో అడిగాడు వినయ్.
”భానేంటిరా? ఈ అమ్మాయే నవ్య. నీకు ముందే తెలుసా?”
”ఓఁ! నవ్య భాను… కాలేజీలో భానుగానే తెలుసు. అమ్మా వాళ్ళు నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అది నువ్వేనని నేనసలు ఊహించలేదు” గాల్లో తేలిపోతూ చాలా ఆనందంగా మాట్లాడేస్తున్నాడు వినయ్.
నవ్య మాత్రం కోపాన్ని అణుచుకుని ముఖాన నవ్వు పులుముకుని గడిపింది. కొడుకు ఏం తూలనాడుతాడో, ఆ అమ్మాయిని ఏం బాధపెడతాడో అని భయపడుతున్న హైమకి కొంత నిశ్చింతగా అనిపించింది. వినయ్ తమ కోరికను మన్నిస్తాడేమోనని కొంత ఆశగా కూడా అనిపించింది. ఆమె అనుకున్నట్లే ”నవ్య అయితే నాకేం అభ్యంతరం లేదు” అంటూ తన మనసులోమాట బయటపెట్టేశాడు వినయ్.
నవ్యను పక్కకి పిల్చి హైమవతి అంతా వివరంగా చెప్పి ”నువ్వు ఒప్పుకుంటే మా అంత అదృష్టవంతులు ఉండరు” అంటూ ముగించింది.
”నేనొకసారి మీ అబ్బాయితో మాట్లాడాలి ఆంటీ!”
”ఓఁ! అలాగే… ఆ గదిలో ఉన్నాడు. ఈ కాఫీ తీసుకెళ్ళు.”
జ జ జ
”కూర్చో నవ్యా!”
”ఆంటీ అంతా చెప్పారు. నాకేం అభ్యంతరం లేదు. తెలిసినవాడు దొరకడం నా అదృష్టం.”
”వాఁవ్! నువ్వేమంటావో నని నాక్కొంచెం భయమేసింది. ఐయామ్ వెరీ హాపీ!”
”కానీ, నీకొక విషయం చెప్పాలి…”
”చెప్పు. నీ పేరెంట్స్‌ని అడగాలా?”
”కాదు… నా కొలీగ్ ఒకతనితో కొంతకాలం నేను చాలా క్లోజ్‌గా తిరిగాను. పరిచయం చాలా దూరం వెళ్ళాక తెలిసింది అతను మారీడ్ అని. వెంటనే ఎబార్షన్ చేయించుకున్నాను.”
”వ్వాట్? నువ్వు అబద్ధం చెప్తున్నావ్…”
”కాదు వినయ్! ఆ బాధ మర్చిపోవాలనే ఇలా ఓల్డేజ్ హోమ్ ద్వారా సర్వీస్ చేస్తున్నాను. ఆంటీవాళ్ళ అభిమానంతో నా గాయం చాలా త్వరగా మానిపోయింది.”
”ఇదంతా దాచిపెట్టి మా వాళ్ళను మోసం చేశావు.”
”అలా అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తాను?”
”కాలేజ్‌లో పెద్ద పతివ్రతలా ఫోజిచ్చిన నువ్వు, నన్ను చూసి ఒప్పుకోగానే అనుకున్నాను, ఇలాంటిదేదో ఉంటుందని…” కోపం, అవమానభారంతో ఊగిపోతున్నాడు వినయ్.
”ఇప్పుడు అతనితో నాకేం సంబంధం లేదు వినయ్!” వినయంగా అంది.
”ఛ! హౌ డేర్ యు…” పళ్ళు పటపట లాడిస్తూ” అన్ని పూలూ పూజకి పనికిరావు, నువ్విక వెళ్ళొచ్చు” అన్నాడు.
”సారీ! అమెరికా వెళ్తే ఆధునిక భావాలు వచ్చాయనుకున్నాను. కనిపించిన ప్రతి రాయీ దేవుడు కాడని కూడా తెలుసు. థాంక్స్!” నింపాదిగా బయటికొచ్చేసింది నవ్య.
జ జ జ
”నేనప్పుడే చెప్పాను. సేవ గీవ అనుకుంటూ వచ్చిందంటే ఆ అమ్మాయి ఎలాంటిదై ఉంటుందోనని. అనవసరంగా పెళ్ళి మాట లేవదీసి నా పరువు తీశారు.” నవ్య వెళ్ళాక నిప్పు తొక్కిన కోతిలా తల్లి మీద అరిచాడు.
”నిన్ను వదిలించుకోడానికి వేరే మార్గం లేక నవ్య చిన్న అబద్ధం చెప్పింది” మెల్లగా అంది హైమవతి.
”అబద్ధం అని నువ్వెలా అంటున్నావు?”
”మీ డాడీ ఎప్పుడో వాకబు చేశారు. మేమెలాంటివాళ్ళమో తెలుసుకోకుండా వాళ్ళ నాన్న మటుకు కూతుర్ని ఇలా పంపుతాడా?”
”నన్నెందుకు వదిలించుకోవాలనుకుంది?” దెబ్బతిన్నట్లుగా అడిగాడు.
”ఏం నీకు తెలియదా? కాలేజీ రోజుల్లో నువ్వెన్ని వేషాలు వేశావు? నీ కారెక్టరేంటో నీకు తెలియదా? అలాంటి నీకు భార్య మాత్రం పవిత్రంగా ఉండాలా? సేవాకార్యక్రమాలు చేసే ఆడవాళ్ళంటే చిన్నచూపా? వాళ్ళు తప్పకుండా శీలం పోగొట్టుకున్నవాళ్ళేనని నీ నమ్మకమా? లేడీ కానిస్టేబులంటే చులకన, లేడీ కండక్టరంటే అలుసు. నిన్ను మార్చాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. కేవలం నీ అహం దెబ్బ తీయడానికి, మర్యాదగా నిన్ను వదిలించుకోడానికి అలా చెప్పింది. అబద్ధం చెప్పినంత మాత్రాన తనకి ఏ కళంకం అంటుకోదని తనకి తెలుసు. కానీ తల్లిగా నా కొడుకు మారాలని నేను ఆరాటపడుతున్నాను. పెళ్ళే చేసుకోనక్కరలేదురా. ఏ బాంధవ్యం లేకుండా మాలాంటివారికి తోడుగా ఉండి సేవ చేస్తున్న ఆ అమ్మాయిలాంటి వారిని కనీసం గౌరవించడం నేర్చుకో. ఎప్పుడు మార్తార్రా? బుద్ధి వికసించనప్పుడు అమెరికా వెళ్తేనేంటి? అంతరిక్షానికెళ్తే ఏంటి?” దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఓదార్పుగా భార్య భుజం మీద చెయ్యేసాడు రామ్మూర్తి.
జ జ జ
వినయ్ వెళ్ళిపోయాడని తెలిసి చాలా మామూలుగా వచ్చింది నవ్య. ”సారీ ఆంటీ! నేను మిమ్మల్ని బాధపెట్టాను. నేనింక రాలేను ఆంటీ…”
ఆమె మాట పూర్తికాకముందే ”జరిగిందంతా మనసులో పెట్టుకుని మా ఇంటికి రావడం మానేయకు తల్లీ… ఈ నవ్యానుబంధాన్ని ఇలా కొనసాగనీ…” ఎక్కడో నూతిలో నుండి వచ్చినట్లున్నాయి రామ్మూర్తి మాటలు.
”ఛ! అదికాదు అంకుల్! నాకు పెళ్ళి కుదిరింది. నన్ను చూసి ఇన్‌స్పైర్ అయిన నా స్నేహితురాలు ఇకనుండి మీ బాధ్యత తీసుకుంటుంది. ఈ బంధం ఇలాగే సాగుతుంది అంకుల్…” అంటుంటే నవ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. హైమవతి కూడా కన్నీళ్ళతో నవ్యను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags