అబ్బూరి ఛాయాదేవి
శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారిగారు నాకు 1955 ప్రాంతంలో మొట్ట మొదటిసారి పరిచయం అయ్యారు. ఆంధ్రయువతీమండలిలో నేను సభ్యురాలినయాక, స్త్రీగా నా గురించి నేను ఆలోచించడం మాత్రమే కాకుండా, తోటి స్త్రీల గురించి – మన రాష్ట్రంలోని స్త్రీల గురించీ, మొత్తం మన దేశం లోని స్త్రీల గురించి కూడా ఆలోచించేందుకు నాకు స్ఫూర్తి నిచ్చిన ఆంధ్రయువతీమండలిని స్ధాపించిన స్త్రీమూర్తి శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారిగారే.
సీతాకుమారిగారు ఆంధ్రయువతీమండలి కార్యక్రమాలను తీర్చిదిద్దడంలో ఆనాటి అధ్యక్షురాలు అనంత లక్ష్మీదేవిగారికీ, కార్యదర్శి ఎ.శ్యామలాదేవిగారికీ, ఇతర కార్యవర్గ సభ్యులకూ సలహాలిస్తుండేవారు. మండలిని స్థాపించిన తరువాత చాలాకాలంపాటు ఆవిడే కార్యదర్శిగా పనిచేశారు. అందుకే అందరికీ ఆవిడ పట్ల ఎంతో గౌరవం ఉండేది. నేను వయస్సులో ఆవిడ కన్న బాగా చిన్నదాన్నైనా, తెలుగు సాహిత్యంలో నాకు కొంత ప్రవేశం ఉండడంవల్ల్లా, మా పెద్ద ఆడపడుచు సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు అప్పటికే సహాయ కార్యదర్శిగా ఉండడంవల్లా, నన్ను కార్య నిర్వాహక సమితిలో సభ్యురాలిగా చేర్చుకున్నారు. మండలి వివిధ సందర్భాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా మండలి తరఫున ఒక స్త్రీ పత్రికని ప్రారంభించాలనే ఆలోచన కలిగింది. సీతాకుమారి గారి ప్రోద్భలంతో, అందరి ప్రోత్సాహంతో ‘వనిత’ అనే మాసపత్రిక ని 1956 ఏప్రిల్‌లో ప్రారంభించాం. తొమ్మిది నెలల పాటు సంపాదకత్వబాధ్యత వహించారు. ఆఖరిరెండు సంచికలనూ పెద్ద సైజులో ప్రచురించాం. ఆ తరువాత నేను ఆంధ్రాయూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ కోర్సులో చేరడం, అటు తరువాత ఉద్యోగార్థం మావారితో పాటు న్యూఢిల్లీ తరలివెళ్ళడంవల్ల ‘వనిత’ ప్రచురణని కొనసాగించలేదు.
1957 నుంచి దాదాపు పాతికేళ్ళ పాటు సీతాకుమారిగారితో నాకు సంపర్కం లేకపోయినా, 1982లో మేము హైదరాబాదుకి తిరిగివచ్చి స్థిరపడ్డాక, బాగ్‌లింగంపల్లికి పక్క వీధిలోనే సీతాకుమారి గారి ఇల్లు ఉందని తెలుసుకుని చాలా సంతోషించాను. అప్పటికి ఆవిడ చాలా పెద్దవారై పోయారు. మంచంమీద ఉన్నారని తెలిసి ఒకసారి ఆవిణ్ణి చూడటానికి వెళ్ళినప్పుడు, ఆవిడ నన్ను ఇది వరకులాగే ఆప్యాయంగా పలకరించి, నా నెరిసిన జుట్టూ, పెద్దబొట్టూ అదీ చూసి, ”ఎందుకంత పెద్దదానిలా కనిపిస్తున్నావ్? నన్ను చూడు, నేనింకా చెవులకు చక్రాలు పెట్టుకుంటున్నాను” అంటూ తన చెవిని పట్టుకుని చూపించారు. మంచం మీద ఉన్నా, చిన్నప్పటి ఉత్సాహం పోలేదు ఆవిడలో. తనకన్న చిన్న వాళ్ళని ప్రోత్సహించడం మానలేదు.
ఆంధ్ర యువతీ మండలి తరఫున ప్రచురించిన ‘వనిత’ ప్రారంభసంచిక కోసం సీతాకుమారిగారు ‘ఉజ్వల వనిత’ అనే కవిత రాశారు. అందులోని కొన్ని పంక్తులు కొద్ది మార్పులతో ‘ ఉజ్వలనారి’ అనే శీర్షికతో రాసిన కవితలో కూడా ఉన్నాయి. ‘యల్లాప్రగడ సీతాకుమారి – జీవితం-రచనలు’ అనే గ్రంథంలోని కవితలలో ఒకటి ‘ఉజ్వలనారి’, ‘వనిత’ మొదటి సంచికలోనే ఆంధ్ర యువతీ మండలి చరిత్ర గురించి రాసిన వ్యాసంలో మండలి సభ్యుల గ్రూప్ ఫోటోయే కాకుండా, సీతాకుమారిగారి ఫోటోని ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. తరువాత, 1956 జూన్ సంచికలో ఆవిడ రాసిన వ్యాసం ‘వివాహాలలో తెలుగు సంస్కృతి’ ప్రచురితమైంది.
సికింద్రాబాదులోని కీస్ గర్ల్స్ హైస్కూల్లో సీనియర్ తెలుగు పండితురాలుగా ఉద్యోగం చేసిన శ్రీమతి విద్వాన్ యల్లాప్రగడ సీతాకుమారిగారు సాహిత్య, సామాజిక, చారిత్రక అంశాలపైన అనేక వ్యాసాలు రాశారు. కొన్ని వ్యాసాలు ‘మందార మాల’ అనే సంకలనంగా వెలువడింది 60 ఏళ్ళ క్రితమే. ‘వ్యాసమాల’ అనే మరో సంకలనం తొలిసారి 1968 లోనూ, తరువాత 1971లోనూ వెలువడింది.
ఏడవ తరగతి పిల్లలకోసం వివిధ ప్రక్రియలతో కూడిన రచనలతో ‘ప్రభావాచకం’ అనే గ్రంధాన్ని కూడా రచించారు. శ్రీమాన్ కందాళ వేంకట నరసింహాచార్యులు గారితో కలిసి.
సీతాకుమారిగారి అముద్రిత రచనలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని పుస్తకంగా తీసుకురావడంలో కన్న, సంఘసంస్కరణ కార్యక్రమాల్లోనే ఎక్కువ శ్రద్ధ చూపించారు. ఇటీవల ఆమె కుమార్తె డా. విద్యారాణిగారూ, కుమార్తెలాంటి డా. ముక్తేవి భారతిగారూపూనుకుని సీతాకుమారి జీవిత విశేషాలతోపాటు, ఆమె వ్యాసాలూ, నాటికలూ, కవితలూ కూడా చేర్చి ఒక సంకలనాన్ని ప్రచురించారు.
గొప్ప గొప్ప వ్యక్తుల్ని కూడా జనం మరిచిపోతూ ఉంటారు. అందుకే, అటువంటి వారిని అముద్రిత ప్రచురణల ద్వారానూ, పునర్ముద్రణలద్వారానూ ఇటువంటి శతజయంతి ఉత్సవాలద్వారానూ అందరికీ, ముఖ్యంగా కొత్తతరం వారికి గుర్తు చేయవలసి ఉంటుంది.
సీతాకుమారిగారిది ఎంత విశాల హృదయమో తెలుసు కోవడానికి డా. అంకరాజు విద్యారాణిగారి ‘అక్షర నీరాజనం’ చదవాలి. సీతాకుమారిగారి ఇంట్లో ఇటువైపు బంధువులూ, అటువైపు బంధువులూ చదువులకో, ఉద్యోగాలకో వచ్చి ఉండటమే కాకుండా, ఎందరో అనాధలు కూడా ఏళ్ళ తరబడి ఉండేవారుట. వాళ్ళందరికీ అయ్యే ఖర్చులగురించి దంపతులిద్దరూ ఎప్పుడూ గొడవపడేవారు కాదుట. అనాథల్ని పోషించడమేకాదు, ఎవరైనా పేదవారు తమ పిల్లల పెళ్ళిళ్ళకని, ధనసహాయం కోరినదే తడవు ఎలాగో తంటాలు పడి ఇచ్చేవారుట.
కులమత భేదాలు పాటించేవారు కాదు. వంటింట్లోకి కూడా ఎవరికైనా ప్రవేశం ఉండేది. తమ సుఖాన్ని ఎప్పుడూ చూసుకునేవారుకాదు. చేరదీసిన పేద పిల్లలకి చదువు చెప్పించడం, జ్ఞానకుమారి హెడాగారిద్వారా గ్రామ సేవికలుగా ట్రెయినింగ్ ఇప్పించడం, ఎక్కడైనా చిన్న ఉద్యోగాలు ఇప్పించడం చేసేవారు.
ఎందరో బాల వితంతువులకు పునర్వివాహాలు చేయించారు, అని రాస్తూ, డా. విద్యారాణిగారు, ”ఇంత విశాల దృక్పథం ఉన్న మా అమ్మ బహుశా తన పిల్లలు తప్పుత్రోవ తొక్క కూడదని అనుకుందేమో, ఇద్దరికీ 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెళ్ళి చేసేసింది ” అని రాశారు. ఇది సీతాకుమారి గారి బాధ్యతనీ, కర్తవ్యనిష్టనీ తెలియజేస్తుంది. దేశసేవ, సమాజసేవ పేరుతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం సాధారణంగా పురుషులు చేస్తుంటారు. సీతాకుమారిగారు అందరికీ మాతృమూర్తి. ఆవిడ అదృష్టం కొద్దీ మంచి పురుషుడు భర్తగా లభించాడు. నారాయణరావు గారి వ్యక్తిత్వాన్నీ, ఆయన తమ ఆంధ్రా బుక్ హౌస్‌ద్వారా చేసిన సాహిత్యసేవనీ కీర్తించిన వారిలో చేకూరి రామారావుగారూ, ముక్తేవి లక్ష్మణరావుగారివంటి మేధావులు ఉన్నారు. మావారు వరద రాజేశ్వరరావుగారితో పాటు నేను కూడా ఎన్నోసార్లు సుల్తాన్‌బజారులో ఉండే ఆంధ్రాబుక్ హౌస్‌కి వెళ్ళాను.
సంఘసేవ పేరుతో సీతాకుమారిగారు వంటింటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలేదు. ”ఇంటికి వచ్చిన అతిధి అర్ధరాత్రి వచ్చినా, ఆవిడ చేతి వంటగాని, టీ గాని త్రాగకుండా ఉండేవారుకారట. తన తల్లి చేతి పులిహోర అడివిబాపిరాజుగారికి ఎంత ఇష్టమో, ఆవిడ వంకాయకూర ఎంత రుచిగా చేసేవారో సోదాహరణంగా వివరించారు. డా. విద్యారాణిగారు తన వ్యాసంలో.
సీతాకుమారిగారు సామాజిక సేవ, సాహిత్య సేవతో పాటు రాజకీయరంగంలో తొలిరోజుల్లోనే రాణించడం గొప్పవిశేషం. 1957 లో బాన్స్‌వాడ – నిజమాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభకి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళా సభ్యురాలు యల్లా ప్రగడ సీతాకుమారిగారు. అటువంటి చైతన్యవంతమైన మహిళ తమ పిల్లలకే కాకుండా అందరికీ తన మాతృహృదయాన్ని చవి చూపించి, ఎంతోమంది స్త్రీలకూ, బాలబాలికలకూ మార్గదర్శకులై, భావితరాలకు స్ఫూర్తిదాయకులు కావడం స్త్రీలకు గర్వకారణం.
ఈ శత జయంతి సందర్భంగా యల్లా ప్రగడ సీతాకుమారి గారికి జోహరులర్పిస్తున్నాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags