సి.హెచ్.సుజాత
అమ్మో! అమ్మాయా?
ఛూ! మంత్రం ఖాళీ
ఏం! ఎందుకనీ?
నో స్పాన్సర్స్ అందుకనీ
కానీ అదృశ్యం కానీ
అబ్బో ! అబ్బాయా!
భళీ రా! భళీ!
ఏం! ఎందుకనీ?
స్పాన్సర్స్ రెడీ అందుకనీ
కానీ అవశ్యం కానీ (కాణీ)
అబ్బాయా! విప్పు మిఠాయిపొట్లం
అమ్మాయా!! తిప్పు కుళాయి
ఓజోన్ పొరకి తూట్లు,
ఓఅమ్మ పొట్టకి తూట్లు,
అరుణా జర భద్రం,
అమ్మాయీ నీవు కాకు పరారు,
ఆ సూర్యుడే పంపే పరారుణాలను
నిన్ను చంపే చేతులకే క్యాన్సర్.
సూర్యుడే అండగా
కాంతలందరూ సూర్యాకాంతాలైరి
అమ్మలందరూ పట్టభద్రులైరి
చుట్టాలన్నీ చుట్టుముట్టాయి చుట్టాలై
నీకేల భయం నీకే జయం.
అంబపలుకులే
జగమంతా అమ్మపలుకులే
అమ్మాయిలదే రాజ్యం
రా అమ్మా! రాజ్యం.
అమ్మాయా, ఆడపిల్లా సెన్సార్.
సెన్సార్ అన్న నోటికిపుడు క్యా ఆన్సర్?
(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)
కృతజ్ఞత
ఎన్. అరుణ
యంత్రానిదేముంది
నువ్వు యంత్రంగా మారకుంటే చాలు
రోడ్డు
ఎన్ని మలుపులైనా తిరగొచ్చు
మలుపు మలుపులో
గాయాల పిలుపులున్నాయి జాగ్రత్త!
ఆకాశాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు
అది చండ్ర నిప్పులను
చెరిగిపొయ్యెచ్చు
లేదా జడివానలతో జడిపించవచ్చు
అరచేతిని అడ్డుపెట్టి
అలా అలా నడిచిపోవడమే ఉత్తమం
ఇక భూమి అంటావా!
చినుకు చినుకునూ దాచుకొని
సముద్రాలను చేతికిస్తుంది.
ఎడారులను ఎండబోసినా
దాని పొరల్లోంచి
ఒక విత్తనాన్ని మొలకెత్తించి
హరితాన్ని కానుకగా ఇస్తుంది.
ప్రకృతి
దేవుడు రచించిన కృతి
నీ దగ్గరేముంది
దానికి కైమోడ్పు తప్ప
ఎంతటి సుడిగాలి అయినా
శ్వాసలో బంధించినప్పుడు సమాధానపడుతుంది.
కాలమూ అంతే!
ముక్కలుగా చేసి వాడుకుంటే
మురిసిపోతుంది.