కల్పనా శర్మ. హిందూ పేపర్ చదివే వారికి ఈ పేరు సుపరిచితమే. ముంబయ్ హిందూ చీఫ్ బ్యూరో గాను, డిప్యూటీ ఎడిటర్‌గాను పని చేస్తున్న కల్పన మే నెలాఖరుకి తన పదవి నుంచి రిటైర్ కాబోతున్నారు. మే 24 న ఆమె అరవై ఏళ్ళకు చేరుకుంది. ఈ సందర్భాన్ని మహిళా జర్నలిష్టుల నెట్‌వర్క్, బెంగుళూరు విభాగం వారు చక్కగా సెలబ్రేట్ చేసారు. కల్పనా శర్మ గౌరవార్ధం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ముఫ్ఫై నాలుగు సంవత్సరాలు జర్నలిష్టగా పని చేసి అంచెలంచెలుగా అనేక పదవుల్ని అలంకరించిన కల్పన ఎంతో నిబద్ధత కల్గిన జర్నలిస్ట్‌గా ప్రసిద్దురాలు. హిందూ, సండే మేగజైన్‌లో ‘ద అదర్ హాఫ్ “ పేరుతో తను రాసే కాలమ్‌లో భిన్నమైన మహిళా సమస్యల గురించి, జండర్ అంశాల గురించి రాసారు. సీరియస్ చర్యలను లేవనెత్తింది ఆమె కాలమ్.
“హిమ్మత్” అనే మేగజైన్‌లో తన వృత్తిని ప్రారంభించింది కల్పన. ‘హిమ్మత్’ చిన్న పత్రిక ఐనప్పటికీ చాలా గౌరవం పొందిన పత్రిక. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని వ్యతిరేకించి, పత్రికల మీద సెన్సార్‌షిప్‌కిి వ్యతిరేకంగా గొంతు విప్పిన పత్రికగా పేరుంది. అంతేకాదు ప్రధాన స్రవంతి పత్రికలు చేయలేని ఈ ధైర్యాన్ని చేసిన పత్రిక ‘హిమ్మత్’ . ఇలాంటి నిబద్ధత కల్గిన పత్రికలో కల్పనా శర్మ జర్నలిస్ట్‌గా తన జీవితాన్ని ప్రారంభించడం విశేషం.
క్రమంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ పత్రికల్లో ఉన్నత స్థాయిల్లో పని చేసింది. ప్రస్తుతం హిందూలో డిప్యూటీ ఎడిటర్‌గా వుంది. తన 60 సంవత్సరాల జీవితంలో దాదాపు సగం కంటే ఎక్కువే అంటే 34 సంవత్సరాలు తన వృత్తికే అంకితమైంది కల్పనా శర్మ.
అభివృద్ధి అంశాల గురించి, జెండర్, పర్యావరణం గురించి లెక్కలేనన్ని వ్యాసాలు రాసింది. ముఖ్యంగా స్త్రీ సమస్య గురించి, జెండర్ అంతరాల గురించి కల్పన చాలా విశ్లేషణాత్మకమైన, లోతైన పరిశీలనతో రాసిన వ్యాసాలు చాలా ప్రాచుర్యం పొందాయి. కల్పన అమ్ముజోసఫ్‌తో కలిసి రాసిన who’s news? the media and women’s issues పుస్తకం వార్తల్లో స్త్రీల అంశాలనెలా చూపుతారు, మొత్తం వార్తా కధనాల్లో స్త్రీలకు సంబంధించిన విషయాలకు ఎంత ప్రాధాన్యత వుంటుంది లాంటి ప్రశ్నలను సంధించిన ఈ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. 2000 సంవత్సరంలో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ ‘ధారవి’ గురించిన కథలతో ఒక పుస్తకాన్ని కల్పనా శర్మ రచించింది. 2003లో అమ్ము జోసఫ్ సహ సంపాదకత్వంలో “Terror counter – Terror women speakout” పుస్తకాన్ని కల్పనా శర్మ రూపొందించారు.
బెంగూళూరులో ఇటీవల జరిగిన సమావేశంలో మాట్లాడుతూ “ నేను నా ఉద్యోగం నుండి రిటైర్ అవుతున్నాను కాని నా వృత్తి నుంచి కాదు. నేనెప్పటికీ జర్నలిస్ట్‌గానే కొనసాగుతాను. స్వతంత్ర జర్నలిస్ట్‌గా నా కొత్త వృత్తిని ప్రారంభించబోతున్నాను” అన్నారు. “నేను హిమ్మత్ పత్రికలో జర్నలిస్ట్‌గా నా వృత్తిని మొదలు పెట్టినప్పుడు మా సీనియర్‌లు మాకు ఎన్నో కొత్త విషయాల గురించి చెప్పేవారు. మంచి శిక్షణ నిచ్చేవారు. నేను కూడా వృత్తిలోకి కొత్తగా వచ్చిన యువ జర్నలిస్ట్‌లతో ఎక్కువ సమయం గడపాలనుకుంటాను. వారికి నా సహాయ సహకారాలు ఎపుడూ వుంటాయి.”
నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ వుమెన్ జర్నలిస్ట్‌లో కల్పనా శర్మ సభ్యురాలు. ఈ నెట్ వర్క్ ఏర్పాటులో, జాతీయ స్థాయి వుమన్ జర్నలిస్ట్ నెట్‌వర్క్ సమావేశాల రూపకల్పన, నిర్వహణలో అమ్ము జోసఫ్, కల్పనా శర్మల పాత్ర అమూల్యమైంది. ఈ నెట్‌వర్క్‌లో సభ్యులైన మహిళా జర్నలిస్ట్‌లు Responsive, Responsible and gender sensitive జర్నలిజం కోసం కృషి చేస్తున్న విషయం విదితమే.
60 వసంతాలు పూర్తి చేసుకుని, బాధ్యతాయుతమైన జర్నలిస్ట్‌గా 34 సంవత్సరాలు పని చేసి, స్వతంత్ర జర్నలిస్ట్‌గా తిరిగి తన వృత్తికే అంకితం అవ్వాలనుకుంటున్న కల్పనా శర్మ నిజంగానే విశిష్ట కల్గిన పాత్రికేయురాలు. స్త్రీల పట్ల ఎంతో వివక్షత వున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తన ప్రతిభతో, అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన కల్పనా శర్మకి భూమిక అభినందనలు తెలుపుతోంది.
Pingback: కొండవీటి సత్యవతి