కొండేపూడి నిర్మల
పాత పేపర్లు తీసుకునే అబ్బాయి వచ్చాడు.
రెండు అట్ట పెట్టెలకు పైగా గుట్టలుగా పేరుకుపోయినవాటిని బోర్లించినప్పుడు పాత హిందూ పేపరులో వచ్చిన ‘సిల్లీ సైడ్ ఆఫ్ ది ఫేస్ బుక్” అనే వ్యాసం కనిపించింది. చదువుతూ అలాగే వుండిపోయాను. (నా పేరు కూడా ఫేసు బుక్కులో నమోదు అయివుంది కాని, దానికోసం నేను కనీస సమయం కూడా ఎప్పుడు పెట్టలేదు. ప్రతిరోజూ నా మెయిల్ బాక్సులోకి పెండింగు నోటిఫికేషన్స్ వస్తూనే వుంటాయి. చాలావాటిని సింపుల్‌గా డిలిట్ చేసి మిగిలిన పని చూసుకుంటూ వుంటాను. కాబట్టి అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలేవి చేసే హక్కు నాకు లేదు..)
”ఇవాళ పప్పు చారు బాగా కుదిరింది. మా చంటాడికి నిన్న పట్టుకున్న విరేచనాలు ఇంకా తగ్గలేదు, కోటిలో పూసలు కుట్టిన చీరలు వున్నాయి చూశావా? నిన్న రెయిన్ డాన్సులో భలే ఫిగరు దొరికింది.. కొలవరి ఫీవర్ ఎలావుంది?” లాంటి ఛాటింగ్సుని మీరు చూసే వుంటారు. నూటికి తొంభై శాతం ఇలాంటి చౌ చౌ కబుర్లే వుంటాయి.
అయితే ఈ మధ్య ఒక యువతి తన గర్భస్థ పిండానికి తీసిన అల్ట్రాసౌండు ఫిల్ముని సర్క్యులే’న్‌లో పెట్టిందిట. భూమ్మీదకి రాకుండానే, అసలు మానవాకృతి అయినా దిద్దుకోకుండానే ”రేట్ దిస్ ఫోటో ఐటెం”గా మారిపోవడం అంటే, అది ఆ పాప (కాబోయే పాప అనాలేమో) పట్ల మనం చేసిన మానవహక్కుల ఉల్లంఘన కాదా అని ఆ వ్యాస రచయిత్రి బాధపడుతూ రాసింది. చదవగానే నాకెందుకో మనసు కెలికి నట్టయింది… మా అమ్మాయి డెలివరికి రావడానికి ముందు నేను యు ట్యూబులో చూసిన నార్మల్, సిజేరియన్, బ్రీచ్ పొజిషన్ – డెలివరి సిడీ లన్ని గుర్తొచ్చాయి. తల్లిగా అది నా ఆందోళనకి చిహ్నం అని ఎంత రివాజయిన జవాబు చెప్పుకున్నాగాని, ఏదో ఒక స్థాయిలో మనమంతా మనకున్న గోప్యతా హక్కుని (రైట్ టు ప్రైవసీ) కాలరాస్తున్నామేమో అని నాకు అనిపిస్తోంది. శాస్త్రీయంగా విషయాలు తెలుసుకోవడం అనే పని అందరం చెయ్యాల్సిందే, కాని అదే సమాచారం మార్కెట్ అవుతుంటే అప్పుడు అది మానవహక్కుల ప్రశ్న అవుతుంది. ఎందుకంటే మనం సీడీలో చూసినవి ఇంకెవరివో శరీరాలే కదా. స్పృహ వున్న శరీరాలా, లేని శరీరాలే అనేది కూడా చర్చనీయాంశమే అవుతుంది.
ఆ మధ్య అంటే రెండువేల ఎనిమిది, మార్చి ఎనిమిది (మహిళా దినోత్సవం) తొమ్మిది గంటల ఉదయం, కలకత్తాలోని మానసిక వికలాంగుల ఆస్పత్రిలో రోగులైన కొందరు మహిళలు వివస్త్రలుగా కనిపించారనే వార్త ఆనంద్ బజార్ పత్రికలో వచ్చింది. కొంచెం ఆలస్యంగా ఇక్కడి పత్రికల్లోను వచ్చింది. జబ్బుగా వున్న తల్లిని చూడడానికి ఒక కూతురు కన్సల్ట్ డాక్టరుతో కలిసి వార్డులోకి వెళ్ళినప్పుడు ఇది బైట పడింది. తల్లితో బాటు ఇంకా కొందరు మహిళలు అలా నగ్నంగా నేలమీద కూచుని కూచుని వుండటం చూసిన ఆమెకు తీవ్రమైన దుఖం వచ్చిందిట. సహజమే కదా. ఆ దృశ్యాన్ని చూసిన డాక్టరు కూడా స్పందించి సిబ్బందిని అడిగాడు.
”పేషెంట్లు కట్టుకున్న బట్టలు ఉతకడానికి తీసుకున్నాం. అంతే…”, అని జవాబు చెప్పారట. ఒక జత విప్పినప్పుడు మరో జత తొడగాలి కదా అనే ప్రశ్నకు సరయిన సమాధానం లేదు. అంటే మతి స్తిమితంలేనివారికి సిగ్గు, గౌరవం ఏమిటనేది వారి ఆలోచన కావచ్చు.
”వాళ్ళు కట్టుకున్న బట్టలు కూడా వుంచుకోరు సార్, చించుకుంటారు,” అనేది ఇంకో జవాబు. కాబట్టి మతిలేని రోగులతో సమానంగా, మతి వున్న సిబ్బంది కూడా ప్రవర్తిస్తారన్నమాట. మానసిక సాంత్వన, చికిత్స పొందడానికే గదా ఆస్పత్రులు వున్నది, వున్న బట్టలు ఊడ దియ్యడానికి కాదు కదా అని అడిగేవారు ఎవరు? అసలది నేరమని ఒప్పుకోవడానికి ఎవరూ అక్కడ లేరే. జరిగిన నేరానికి జవాబు రాబట్టాలని మీడియా చాలా ప్రయత్నించింది కానీ అసెంబ్లీ కార్యక్రమాల తీవ్రతలో ఆరోగ్యశాఖ మంత్రి దొరకలేదు.
”చిన్న విషయాన్ని పెద్దది చేయడం మీడియాకి అలవాటేకదా” అని ఆస్పత్రి అధికారులు బెదరలేదు. మతి ఉన్నప్పుడే మన శరీరాలు, వాటికి కావలసిన గోప్యతా హక్కులు ప్రమాదంలో వున్నప్పుడు ఇక ఇటువంటి కేసులకి ఎలా స్పందించాలో తెలీడంలేదు.
మొదటి కేసులో ఒక తల్లి గొప్పకోసమో మరి దేనికోసమో పుట్టని గర్భస్థ పిండాన్ని ప్రదర్శనకి పెట్టింది. రెండో కేసులో మతిలేని మహిళల శరీరాల్ని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది గాలికొదిలేసింది.
ఐరనీ ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ నాకెదురుగా ఒక ప్రముఖ ఛానల్లో ఇదే విషయం మీద చర్చ జరుగుతోంది. ఇది మతి వున్న స్త్రీల మీద ఇంకోరకమయిన బ్లాక్ మెయిల్. ఇప్పుడు జరుగుతున్న అవమానాలకి అత్యాచారాలకి కారణం స్త్రీలు కట్టుకుంటున్న కురుచ దుస్తులేనట…. ఔను అని డెబ్బై శాతం, కాదు అని మిగిలిన శాతం వారి వారి మొబైల్ జవాబులు వస్తున్నాయి.
ఆహా? మనది ఎంత నాగరిక దేశం. మతిలేని ఆడవాళ్ళకి బట్టలే అవసరం లేదనుకోవచ్చు. మతి వున్న ఆడవాళ్ళు కురచ బట్టలు కట్టుకోవడం వలన అత్యాచారాలకి అనువుగా వుండటమే కాక, ఇలాంటి చర్చలు పెట్టుకుని టివి రేటింగ్సు పెంచుకోవచ్చు. సెల్యులర్ ఫోనులు అమ్ముకోవచ్చు. మతి వున్నా, లేకపోయినా సరే ఎక్కువ గజాల వస్త్రం చుట్టుకోవడం వలన నేరాలు ఘోరాలు ఆగకపోయినా సంప్రదాయాన్ని బాగా నిలబెట్టమని కోరవచ్చు. ఈ మాటలన్నీ ఎవరు చెబుతారంటే లాల్చి పైజమాల్లోనో, లుంగికండువాల్లోనో భారతీయతని ఉట్టిపదేవాళ్ళు కాదు, బ్రిటిష్ వస్త్రధారణ వదలని పురుషులే ఎంతో చక్కగా మనకి చెబుతారు.
చర్చలో పాల్గొన్న సంధ్య ఇదే అడిగింది. ఇంకొక యాక్టివిస్టు ఇంకా బాగా అడిగింది. వొలిచిన అరటిపండు ఎగబడి అందుకోవడం అనే పని కోతి చేస్తుంది. ఎవరు చూడకుండా గిన్నెలు దొర్లించి పెరుగు పాలు తాగడం అనే పని పిల్లి చేస్తుంది. ఎంత విశాలమైన రోడ్డు ఉన్నాగాని బురదలోనే దొర్లడం పని వరాహం చేస్తుంది. ప్రతి జంతువుకి జాతి సహజమైన క్రీడలు కొన్ని వుంటాయి.
మనిషి నాగరికుడు కదా! పొరుగు సొమ్ముకి ఆశపడటం, పరాయి మనిషిని ఆక్రమించడం ఎలా చేస్తాడు. అది జంతు ప్రవృత్తి కదా అని భలే హేతుబద్ధంగా వ్యాఖ్యానించింది. ఈ ప్రశ్నకి స్పందించే రోజు రావాలి కదా…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags