యుద్ధ సమయంలో రాయటమంటే

– అమీనా హుస్సేన్‌ (శ్రీలంక) (అనువాదం : ఓల్గా)

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే ఎక్కడినుంచి రాస్తున్న రచయితలైనా తాము దాడుల నేపథ్యంలోనే ఘర్షణ సమయాలలోనే రాస్తున్నట్లుగా అనుకుంటు న్నారు. ఘర్షణలు జరగని, అనుభవించని దేశంలో మనం నివసిస్తున్నప్పటికీ ఎక్కడో ఎవరో తాము ఏం రాస్తున్నామనీ, ఎలా రాస్తున్నామనీ భయపడుతున్నారనే అనిపిస్తుంది. చరిత్ర కారులను అడిగితే బహుశ ఎప్పుడూ యిలాగే ఉందనీ, ఉంటుందనీ చెబుతారేమో. అంటే చరిత్రలో ఎప్పుడూ కొందరు రచయితలు సంక్లిష్ట సమయాలలో క్లిష్టమైన సమస్యలతో తలపడుతూనే ఉన్నారన్న మాట. బహుశ యిది కొత్త విషయం కాకపోవచ్చు. కానీ నేనీ వ్యాసం రాయటం మొదలుపెట్టినపుడు నా దృక్పథం యిలాగే ఉందని చెప్పలేను.

మొదట నా గురించి నేను ఘర్షణలు జరిగే సమయాలలో రాస్తున్న రచయిత్రిగా చెప్పుకోలేను. అలా రాస్తున్నవారు జాఫ్నానుంచి తూర్పుతీరంనుంచీ రాస్తున్న శ్రీలంక రచయితలని చెప్పొచ్చు. లేదా శ్రీలంక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న శ్రీలంక జర్నలిస్టులు అలాంటివారని చెప్పొచ్చు. కానీ యింకొంచెం లోతుగా ఆలోచించిచూస్తే ”ఘర్షణ” అనే పదాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చనీ, నాకు అన్వయించుకుంటే దాని అర్థం నన్ను నేను సెన్సార్‌ చేసుకోవటమనీ గ్రహించాను.

నేను ముస్లిం మ్యూనిటీ గురించి, ముస్లిం మతాన్ని గురించి చాలా విమర్శ నాత్మకంగా రాస్తానని శ్రీలంక ముస్లింలు భావించిన సమయాలు ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు నాకు తెలుసు. శ్రీలంకలో పెరుగుతున్న ముస్లిం ఫండమెంటలిజం గురించీ నాకు తెలుసు అందువల్లే నన్ను నేను సెన్సార్‌ చేసుకునే క్రమం మొదలయింది. ఇది ఎక్కువగా వ్యక్తిగత ఘర్షణ. ప్రపంచ వ్యాప్తంగా అనుమానించబడుతున్న కమ్యూనిటీకి చెందిన రచయితలకు తప్పనిది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకు ప్రతిస్పందనగా మరింత మూసుకుపోతూ, దాడులనుంచి రక్షించుకునే పరిస్థితిలో పడిన కమ్యూనిటీ అది.

ఇవాళ ముస్లిం రచయితగా ఉండటం కష్టం. బహుశ ముస్లిం రచయిత్రిగా ఉండటం మరింకొంచెం కష్టం. బయటనుంచి వచ్చే విమర్శల కారణంగా లోపలనుంచి మేము పౌరులుగా మా చోటును కోల్పోతున్నాం. నేను గనక కొన్ని దశాబ్ధాల ముందు రాసివుంటే నా కమ్యూనిటీనీ విమర్శించటంలో మరింత చొరవచూప గలిగేదాన్నేమో. కానీ యివాళ నేను స్వీయ సెన్సార్‌షిప్‌ అనే మబ్బుకింద రాస్తున్నాననేది వాస్తవం.

నేను ముస్లిం కమ్యూనిటీ గురించే రాయనక్కర్లేదని, సాధారణ శ్రీలంక జీవితాన్ని గురించి, మధ్యతరగతి మనుషుల గురించి, ఘర్షణ గురించి, గ్రామాల గురించీ రాయొచ్చనేది నిజమే. కానీ నాకు తెలిసిన కథలను నేను చెప్పాలనుకుంటున్న కథలను రాయలేకపోవటం చాలా పెద్ద సెన్సార్‌షిప్‌ కదా!

నేను 1992లో రాయటం ప్రారంభించాను. 1999లో నా కథల సంపుటిని ప్రచురించాను. అందులో ఫెమినిస్టు దృక్పధం బలంగా ఉండటం వల్ల పురుషద్వేషం ఉందని అన్నారు. శ్రీలంక ప్రజలు మొదటిసారి అలాంటి కథలు చదివి ఉండొచ్చు. ఐతే నా రచనలకు మద్ధతు యిచ్చిన స్త్రీలు చాలామంది ఉన్నారని చెప్పాలి. నా రెండవ కథల సంపుటిలో జాతి ఘర్షణల గురించి, మైనారిటీ దృష్టినుంచి అస్తిత్వ ప్రశ్నలు వేసిన కథలున్నాయి. ముస్లిం మ్యూనిటీలో పిత్రుస్వామ్యం గురించిన కథ కూడా ఉన్నప్పటికీ నేను భయపడినట్లు ఆ కథలకు సామూహిక వ్యతిరేక స్పందన రాలేదు. బహుశ నన్ను నేను విజయ వంతంగా సెన్సార్‌ చేసుకున్నానేమో లేదా అది అనవసరమేమో.

శ్రీలంక ముస్లింల గురించి, ముస్లిం స్త్రీల గురించీ రాస్తున్న రచయిత్రిగా ప్రతి పదమూ స్వీయ అజమాయిషీకి గురయ్యే ప్రాంతంలో నేను బతుకుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి వాక్యం, అందులోని అంతరార్థం ప్రింటర్‌ దగ్గరకు చేరక ముందే విశ్లేషించబడుతుంది. ప్రజలు ఏమను కుంటారు? ఏం జరుగుతుంది? నా తల్లిదండ్రులు ఏమంటారు? దాని పరిణా మాలు ఎలా ఉంటాయి? కొన్నిసార్లు యిది ఊపిరాడనట్లు వుంటుంది.

మీకు ఒక దృష్టిని యివ్వటానికి శ్రీలంక ముస్లింల గురించి వారి నేపథ్యాన్ని గురించి కొంత సమాచారాన్ని యిస్తాను. శ్రీలంక ముస్లింలకు హింసాపూరితమైన చరిత్ర చాలాకాలంనుంచీ ఉంది. వలసపాలన వల్ల అవమానాలు, డచ్‌, పోర్చుగీసు, బ్రిటీష్‌ వారి జాత్యహంకారానికి గురైన నేపథ్యం ఉంది. స్వతంత్య్రం వచ్చాక శ్రీలంక ప్రభుత్వాలు కూడా మైనారిటీలైన ముస్లిం తమిళ, బర్గర్‌ కమ్యూనిటీల మీద వివక్షను కొనసాగించాయి. సమీప చరిత్రలోకూడా ప్రపంచంలోని మిగిలిన మైనారిటీ కమ్యూనిటీల లాగానే ముస్లింలను కూడా వ్యతిరేక దృష్టితో చిత్రించారు. ప్రజలకు వారి గురించి పాపులర్‌గా ఒక నమూనా చిత్రాన్ని చిత్రించి యిచ్చారు. దురాశాపరులు, విలాసాన్ని కోరుకునేవారు, సోమరులు, చంచల మనస్తత్వం గలవారు, తమలోనికి ఎవర్నీ ప్రవేశించనివ్వరు, పిల్లల్ని ఎక్కువ కంటారు, అజ్ఞానులు అని మొత్తం ముస్లిం కమ్యూనిటీ గురించి పాటలు, క్యారికేచర్లు, భ్రమలు, భయాలతో ప్రజలలో బహుళ ప్రచారం చేశారు. సింహళీయులకు, తమిళులకు ఉన్న తగాదాలో తాము ఒక సున్నితమైన అంచున ఉన్నామని గ్రహించిన ముస్లింలు స్పందించిన దాని ఫలితం కూడా అర్థం చేసుకోగలిగినదే. వాళ్ళు ”మరింతగా” ముస్లింలు అయ్యారు. అంటే వాళ్ళు హిజాబ్‌ ధరించటం మొదలుపెట్టారు. ఒక కమ్యూనిటీగా మరింత చిక్కనయ్యారు. మదరసాలలో విద్యను ప్రోత్సహించారు. అలాగే తమను తాము శ్రీలంకకు చెందినవారిగా కాకుండా చెందనివారిగా చూసుకునే దృష్టీ వుంది. ఈ తేడాలతో దూరం మరింత పెరిగింది. ఎల్‌.టి.టి.ఇ. కీ, శ్రీలంక ప్రభుత్వానికి జరిగే శాంతి చర్చలలో ముస్లింలను కొత్త ‘బోగీ మాన్‌’ గా చూడటంలో ఆశ్చర్యమేమీ లేదు.

ఒక ముస్లిం రచయిత్రిగా నేను లోపలి వ్యక్తిగా బైటవుండి రాయటమనే సున్నితమైన పరిస్థితిలో ఉన్నాను. విశ్వాసం గలిగిన ముస్లింగా వుంటూ ఆ మతంలో వైరుధ్యాలు, అసంబద్ధతలను చూస్తూవున్న వ్యక్తిగా మతాన్ని విమర్శిస్తే నన్ను ముస్లిం వ్యతిరేకిగా, శత్రువుగా చూస్తారు. నేను వాటి గురించి మాట్లాడకుండా నిశ్శబ్ధంగా వుంటే నాకు నేనే శత్రువునవుతాను. నేను యింకా యింకా మరింతగా ఈ సందిగ్థతలో పడి పోతున్నాను.

చాలాసార్లు ముస్లిం కమ్యూనిటీ నా రచనలను ద్రోహపూరితమైనవిగా, అతిగా విమర్శించేవిగా చూస్తుంది. నేను మందులు కొనుక్కునే దుకాణదారు ముస్లిం – అతనంటాడు ”నువ్వు ముస్లింగా వుండటానికి యిష్టపడని ముస్లింవి” అని. ఆ రకంగా నా అభిప్రాయాలు ఎంత స్వల్పమైన విమర్శతో కూడినవైనా అవి మతానికీ, కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవని భావిస్తారు. శ్రీలంకలోని మిగిలిన జాతులకు చెందిన ప్రజలు నన్ను, ఆధునిక శ్రీలంక ముస్లిం తత్త్వాన్ని ముందుకు తీసుకెళ్ళున్న దానిగా భావిస్తారు. వాళ్ళు నన్ను ఆమోదిస్తారు. అర్థం చేసుకుంటారు. నేను వాళ్ళు చెప్పాలను కుంటున్న విషయాలనే చెబుతున్నానుగా. ఐతే నేను రాజకీయంగా సరైన విధంగా వుండాలనుకోని చెప్పటం లేదు. ఇది కూడా రచయితగా నన్ను సందిగ్థంలో పడేస్తుంది. మార్పు అనేది లోపలి నుంచి వచ్చినపుడే బాగా బలంగా వుంటుందని నమ్ముతూనే, మిగిలిన కమ్యూనిటీల వాళ్ళు నా మాటలను వుపయోగించుకుని, వేరే విధంగా అర్థాలు చెప్పే ప్రమాదం గురించి కూడా నేను జాగ్రత్తగా, మెలకువతో ఉంటాను. దీనంతటిలో నాకు నేను చేసుకునే సెన్సారింగు ఎంతో ఉంటుందని ఒప్పుకుంటున్నాను.

ఇది నన్ను చాలా చిరాకు పెడుతుంది. ఆందోళనకు గురిచేస్తుంది. రచయితకు ఒక అధికారం ఉంటుంది. 19 శతాబ్ధం మధ్య భాగంలో విట్టన్‌ ఇపుడు మనందరం వాడే సామెతను – ”కత్తికంటే కలం గొప్పది” రాశాడు. ఇవాళ ముస్లిం రచయితగా ఉండటం అధికారాన్ని యిస్తుంది. ఐతే అది ప్రమాదకరం కూడా. కొందరు రచయితల రచనలను నిషేధించారు. కొందరిని జైల్లో పెట్టారు. కొందరు ప్రవాసంలోకి వెళ్ళి పోయారు. మరికొందరు చంపబడ్డారు. నాకీ మధ్య ఒక సంఘంతో పరిచయమైంది. ఆ సంఘం ఇస్లామిక్‌ కల్పనా సాహిత్యాన్ని ఒక సానుకూల దృష్టితో చూపే రచనలను తీసుకురావటానికి అంకితమైంది. కానీ ముస్లిం రచయితలు మసిబారిన తమ గోడలకు సున్నం కొట్టి తెలుపుచేసే పనికే అంకితం కావాలా? కలవరపెట్టే సందేహాల సంగతేమిటి?ఆందోళనకు గురిచేసే వివరాల మాటేమిటి? వాటి గురించి ముస్లిం రచయితలు రాయకూడదా? వాదించ కూడదా? చర్చించకూడదా? ముస్లింగా వుండటమంటే పూర్తిగా ఆమోదించటమేనా? అంతకంటే ముఖ్యమైనది ఎవరు చెప్పేదాన్ని, ఎవరు వాదనను పూర్తిగా ఆమోదించాలి?

రచయితలు తాము రాస్తున్న కాలానికీ, స్థలానికీ సాక్షులు. వాళ్ళు జ్ఞాపకాల స్వరాలు. ప్రజల అంతరాత్మలు. నన్ను నేను రచయిత్రిగానో, ముస్లిం రచయితగానో, శ్రీలంక రచయితగానో అనుకోవటానికి ఇష్టపడను. నేను పైన చెప్పిన అన్నిటికీ చెందుతాను. దేనికీ చెందను.

చివరిగా శ్రీలంక తూర్పుతీరంలో ఒక ముస్లిం పట్టణం ముట్టడిలో ఉన్నపుడు నేను రాసిన చిన్న రచనను చదువుతాను. గత సంవత్సరం ఆగస్టులో జరిగిందిది. నేనే రచనను ఒక ముస్లిం యువతి ఆగ్రహంతో ఊగిపోతూ ముస్లిం సమస్యల గురించి రాయమని సవాలు చేసినపుడు రాశాను. ఆ రచన పేరు ”ముత్తూరులో ఏదో జరిగింది”.

”ముత్తూరు మీద దాడి జరిగిందనీ, ముట్టడిలో వుందని వార్త తెలిసి వారం రోజులవుతోంది. మావిలారు ఆనకట్ట విషయంలో శ్రీలంక ప్రభుత్వానికీ, ఎల్‌.టి.టి.ఇ. కీ మధ్య జరిగిన ఘర్షణ ఫలితంగా ముత్తూరులో పూర్తి విధ్వంసం జరిగింది. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, అంబులెన్సులు పాఠశాలలు యివి ఘర్షణ సమయంలో రక్షణ కల్పించే ప్రాంతాలు. ఇదొక సంప్రదాయంగా వస్తోంది. కానీ ముత్తూరులో ఈ ప్రాంతాల మీదే దాడి జరిగింది. నేను జెనీవా ఒప్పందాన్నో, మానవ హక్కుల సూత్రాలనో వల్లెవేయను.ఎందుకంటే చివరికి వాటికే ఉపయోగమూ ఉండదు. కానీ నేనొక ప్రశ్న అడుగుతాను ”మనం ఏ నాగరికతకు చెందినవాళ్ళం? ఘర్షణల మధ్య చిక్కుకున్న పౌరులను పట్టించుకోకుండా నిత్యం కొనసాగుతున్న ఘాతుకాలను మనం అనుమతించటానికి ఏ కారణాలను చూపుతాం?” మనం నిజాయితీగా ఆలోచిస్తే మనకున్న 2500 సంవత్సరాల నాగరికత ఆటవికత్వానికిది.

నేనెప్పుడూ ముత్తూరు వెళ్ళలేదు. అక్కడ భూమి ఎలా వుంటుందో తెలియదు. అక్కడి ప్రదేశాల గుర్తులేమిటో సంప్రదాయాలేమిటో, సాంస్కృతిక వారసత్వ మేమిటో నాకు తెలియదు. ఇప్పుడొస్తున్న రిపోర్టులను బట్టి ముత్తూరు సముద్రం, నదీ రెండింటి మధ్య ఉన్నదనీ, అక్కడి భూమి ఎల్‌.టి.టి.ఇ. కంట్రోలు చేసే ప్రాంతం పక్కనున్నదనీ తెలిసింది. ముత్తూరు ప్రజలలో మెజారిటీ ముస్లింలు. ఆగస్టు 2వ తారీకున శ్రీలంక సైన్యానికీ ఎల్‌.టి.టి.ఇ.కీ మధ్య పెద్ద యుద్ధం ముత్తూరులో జరిగినందువల్ల మావిలారు ఆనకట్ట గేట్లు తెరిచారు. ఆ రోజునే ముస్లిం మతపెద్దలందరూ కలిసి దువా జరపమనీ, ఖునూత్‌ని చదవమనీ, దానివల్ల ముత్తూరు, దొప్పురు ప్రాంత ముస్లింలకు రక్షణ, భద్రత దొరుకుతాయనీ పిలుపిచ్చారు. సాయంత్రమయేసరికి ప్రజలు ఆ ప్రాంతం ఒదిలి పారిపోసాగారు. ఇవాళ వేలాదిమంది ప్రజలు, ఎక్కువగా ముస్లింలు కాంతాలై ప్రాంతానికి పారిపోయారని తెలుస్తోంది. వాళ్ళంతటవాళ్ళే వెళ్ళిపోయారు. ఘర్షణలు జరుగుతాయనుకున్నప్పుడు ప్రజలను ఆ ప్రాంతంనుంచి ఖాళీ చేయించటంలో నమ్మకమున్న దేశం కాదిది. లేదా అలా ఖాళీ చేయించే శక్తి లేదేమో. ఇలాంటి సమస్యలను చూస్తే యుద్ధ ప్రాంతాలనుండి ప్రజలను రక్షించటానికి కావలసిన వనరులు మనకు లేవనిపిస్తుంది.

కాంతాలై నుంచి వచ్చిన ప్రత్యక్షసాక్షులు చెప్పినదాన్నిబట్టి ముత్తూరు వదిలి వచ్చినవాళ్ళు రోడ్డు పక్కన నివసిస్తున్నారు. చెట్లక్రింద నిద్రపోతున్నారు. పిల్లలకు పాలు లేవు. ఒంటిమీద గుడ్డలతోనే పారిపోయి వచ్చారు. ఆగస్టు 8న ‘డైలీ న్యూస్‌’ అనే దినపత్రికలో 45,000 ఆహారపు పొట్లాలు, 5,000 పాలపొడి పొట్లాలు, 10,000 ప్లాస్టిక్‌ చాపలు, ప్లేట్లు, కప్పులు, 1,250 పైకప్పుకి వాడే రేకులు పంపారనీ, 38.57 మిలియన్ల రూపాయలు ముత్తూరు, కాంతాలై, సెరునువార, కిన్యా ప్రాంతాలలో కొన్ని గంటల్లో ఖర్చుపెట్టారని రాసింది. ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఇది మనకు పరిచయమైన పాత విషయమే కదా.

శ్రీలంకలోని ముస్లిములకు యిది పరిచయమైన సంగతే. కేవలం ఊళ్ళ పేర్లు మాత్రం మారతాయి. జాఫ్నా, మన్నార్‌, కథాన్‌కుడి, ముత్తూర్‌. ఎల్‌టిటిఇ వాళ్ళకు కూడా యిది పరిచయమైన విషయమే – తమిళులు కాని వాళ్ళను, సింహళీయులైనా, ముస్లిములైనా వాళ్ళు తమదనుకున్న నేలనుంచి పంపించటానికి గట్టిప్రయత్నం జరుగుతుంది. జాతిప్రక్షాళన రూపంలో జరుగుతుంది. నేనెవరికి చెప్పుకోవాలి? నేనెవరికి చెప్పుకోగలను? ఎల్‌టిటిఇ వేర్పాటు ధోరణితో వున్న పక్షం, అది యుద్ధసూత్రాలను పాటించని సంఘం. గౌరవప్రదమైన సూత్రాలనన్నింటిని ఉల్లంఘిస్తుంది. వాళ్ళకు చెప్పుకుంటే ప్రయోజనమేముంటుంది. శ్రీలంక ప్రభుత్వానికి చెప్పుకోగలను.

మేము ముస్లింలం ఈ దేశంలో సంపూర్ణ పౌరసత్వంతో ఉన్నాము. కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని తరాలవాళ్ళు ఇక్కడ బతికారు. మేం ఈ దేశ పురోగతికి కష్టపడి మావంతు సహకారాన్నందించాం. విజయా లకు ఆనందించాం. కష్టాలను బాధలను భరించాం. కానీ ఒక ఆపద సమయంలో, అది సునామీ కావచ్చు, సాయుధ సంఘర్షణ కావచ్చు మమ్మల్ని మనుషులుగా చూడరెందు కని నేను ప్రశ్నిస్తున్నాను. ముత్తూరు గనుక సింహళీయులు ఎక్కువగా వుండే ప్రాంతమైతే ఎల్‌టిటిఇ వాళ్ళను వెళ్ళగొట్టటానికి ప్రభుత్వం యింత భీకరంగా ప్రయత్నించి అక్కడి పౌరులను అంత ప్రమాద పరిస్థితుల్లోకి నెడుతుందా?

ముత్తూరు నుంచి వెళ్ళిపోయినవారికి సరైన వసతి లేదు, మరుగుసౌకర్యం లేదు. కనీసపు ఆహారం లేదు. ఈ పరిస్థితికి శ్రీలంక ప్రభుత్వం కనీసం ఆశ్చర్యపడటం లేదు. ఇరవై సంవత్సరాలకు పైగా మేం యుద్ధంలో ఉన్నాం, మా ప్రభుత్వానికి ప్రజలకు ఆపద వచ్చినపుడు సరిగా స్పందించే శక్తి కలిగి ఉండాలని ఆశిస్తాం కదా. కానీ ప్రతిసారీ అదే మొదటిసారి అన్నట్లుగా ఉంటుంది. దేనికీ ఎప్పుడూ సిద్ధంగా ఉండం. ఎప్పుడూ ఆలస్యంగా పొంతన లేకుండా స్పందిస్తాం.

ప్రతిసారీ పౌరసమాజమే పరిస్థితిని చక్కదిద్దటానికి పూనుకుంటుంది. సునామీ వచ్చినపుడు యిలాగే జరిగింది. మళ్ళీ యిప్పుడూ అంతే. సునామీ వచ్చినపుడు అది దైవసంకల్పమనో, ప్రకృతి వైపరీత్యమనో పౌర సమాజం చాలా అంకితభావంతో స్పందించి ంది. చాలా వితరణతో చర్యలు చేపట్టింది. కానీ యుద్ధం వల్ల జరిగే విధ్వంసం గురించి ఎవరికీ పట్టదు. అది మనల్ని తాకకపోతే మనం పట్టించుకోం. అది కొలంబోలో జరగక పోతే దాన్ని పట్టించు కోనక్కర్లేదు. అది మైనా రిటీలకు జరిగితే, యింకేం, వారికి జరగాల్సి నదే జరిగింది.

నేను కఠినంగా మాట్లాడుతున్నానను కోవచ్చు. నువ్వేం చేస్తున్నావని నన్నెవరైనా ప్రశ్నిస్తే నాకు బాగా చేతనైన పని చేస్తున్నానని చెప్తాను. నేనా పరిస్థితి గురించి రాస్తున్నాను. వాళ్ళను మర్చిపోకుండా వుండేలా చేస్తున్నాను. ఇది నిరుపయోగం కావచ్చు. సరిపోక పోవచ్చు. నేనింకా ఎక్కువ పని చేస్తాను.

పౌరులుగా మనం మానవత్వాన్ని పోగొట్టుకోకూడదని కోరుకుంటున్నాను. ముత్తూరులో ఘోరం జరిగింది. అది మీకే జరిగితే ఎలా వుంటుందని ఆలోచించండి. మీ ఇల్లు ధ్వంసమైతే, మీరు ప్రేమించేవాళ్ళు హత్య చేయబడితే కట్టుబట్టలతో మీరు పారిపోవాల్సివస్తే, అడవుల గుండా మైళ్ళకొద్ది దూరం నడవాల్సివస్తే, మందుపాతరల మీదుగా ఘర్షణల మధ్య నడవాల్సి వస్తే, మీకు తింటానికి తిండి, ఉండటానికి కప్పులేకపోతే, వైద్యసదుపాయం లేకపోతే ఎలా వుంటుందని ఆలోచించండి. అన్నిటికంటే ముఖ్యంగా యివన్నీ మీకే జరిగితే, ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరేం చేస్తారు?

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో