– వేములపల్లి సత్యవతి
లచ్చువమ్మ కత కణ్వమహర్షి ఆశ్రమంలో పెరిగిన అమాయకపు మునికన్య శకుంతల కథకాదు. హంస రాయబారం నడిపిన రాజకుమారి దమయంతి కథ కాదు. పురూరవుని వెనుకనే అదృశ్యంగా వుండి అతని ముందు ప్రేమలేఖను జారవిడిచిన అప్సరస ఊర్వశి కథలాంటిది కాదు. సలీమ్‌ని ప్రేమించి అక్బర్ చక్రవర్తిచేత జీవసమాధి చేయబడిన అనార్కలి కథలాంటిది కూడ కాదు. నేటి యువతీ-యువకుల ప్రేమకథ లాంటిది అస్సలు కానేకాదు. ఆపై వాటిలో ఏ కోవకు చెందని కథ లచ్చువమ్మ కత.
నాలుగు పడగల హైందవం చేత పంచములని కాటు వేయబడి, అంటరాని వారిగా ముద్రవేయబడి వూరుబయట గూడెంలోని ఒక గుడిసెలో పుట్టి పెరిగిన కత లచ్చువమ్మది. లచ్చువమ్మ అమ్మ-అయ్య గూడెంలోని అందరోలెనే కూలీనాలీసేసి రెక్కల కట్టంతో పోరగాల్లను సాకి పెద్దసేసిండ్రు. గూడెంలోని అందరి ఆడపోరిలకు సేసినోలెనే లచ్చువమ్మ పెల్లికూడ సిన్నతనంలోనే సేసిండ్రు. (ఆ కాలంలో అన్ని కులాలలోను ఆడపిల్లలకు బాల్యవివాహాలే జరిగేవి) పెల్లయినాంక సమర్తాడకుండనే అత్తొరిల్లకు తొల్కపోయేటోల్లు. అత్తసేతికి మూకుడు-ముంత అందిస్తరని కసువూడ్చి (పాచి) సాన్పి (కళాపి) సల్తరని, పొయ్యిలోనికి పుల్లపుట్ర ఏరుకొస్తరని, ఏడనన్న పెండ (పేడ) కానొస్తె తెచ్చి నాలుగు పిడకలు సేసి గోడకు గొడతరని, పెద్దోల్లు పనికిపోతే యింటిలో సిన్నపోరగాల్లను సూత్తరని, యింటోల్లందరితో మసులుకోవటం అలవాటయితదని తొల్క పోయేటోల్లు – అమ్మ-అయ్యలు కూడ తోలె టోల్లు. లచ్చువమ్మని వాల్ల మామ వచ్చి తోల్క పోయిండు. కొన్ని దినాలయినాన్క పుల్లలేరటానికి పోయిన లచ్చువమ్మ అమ్మోల్ల వూరు బాట బట్టినాది. వూరుకూడ శానా దూరం నేదు. లచ్చువమ్మని సూసి అమ్మ- అయ్య నెత్తి బాదుకో బట్టిండ్రు. ”ఇదేంది బిడ్డా! గిట్టసెప్పసెయ్యకుండవత్తె మీ అత్తోరింటోల్లందరూ పరేశాన్ అవుతరాయె. ఎందుకిట్టసేసినవని కోపమయిండ్రు.” లచ్చువమ్మ అయ్య వీరయ్య ఆల్ల వూరెల్లి, సిన్నతనం తెల్వక వచ్చినాది. పెద్దయినొన్క దానికే ఎరకవుతాది. తప్పు పట్టుకోకండ్రని బతిమిలాడి, సమ్జాయించి వచ్చిండు. వాల్లు కూడ వూరుకుండి పొయిండ్రు.
లచ్చువమ్మ పెద్దదయినాది. సమర్తాడినాది. అత్తింటోల్లు వచ్చిండ్రు. సీర, రవిక తెచ్చిండ్రు. రాములమ్మ సుట్టాలను కూడ పిలిసినాది. సేతనైన సంబరం సక్కంగనే సేసినాది. వూరుకు పోతప్పుడు లచ్చువమ్మ మామ పోలయ్య కొన్నిదినాలు పొయినాన్క కోడలిని తొల్కపోతనని సెప్పి పోయిండు. గా పొద్దుసంది లచ్చువమ్మ వుసారుగా వుంటనేదు. బువ్వ సక్కగా తింటనేదు. నవుత మాట్లాటనేదు. మునుపటోలే సావాసగాల్లకాడ్కి పోతనేదు. బిడ్డ వాలకం సూసి మల్లమ్మ మదిలో గుబులయినాది. (లచ్చువమ్మ కులంలోను మరికొన్ని కులాలలోను శోభనం వరుని యింటిలో జరిపే సాంప్రదాయం వున్నది.) బిడ్డను ఒల్లో కూకోబెట్టుకొని, గడ్డంపట్టుకొని మల్లమ్మ పేమతో ”ఏంది బిడ్డా! బువ్వ సక్కంగా కడుపునిండ తింటనేవు. నవుతనేవు. సావాసగాల్లకాడ్కి పోతనేవు” అని అడిగినాది. లచ్చువమ్మ అమ్మను సుట్టేసుకొని ఏడ్చసాగింది. జరసేపు ఏడ్చనిచ్చి మల్లమ్మ బిడ్డ తలను ఒల్లో పెట్టుకొని ఎందుకేడ్చబట్టినవని అడిగినాది.
లచ్చువమ్మ ”అమ్మా! మా మామ తోల్కపోటానికొత్తె నన్ను తోలవద్దె. నాకెందో కడుపులో గుబులవుతున్నాది. భయమేత్తున్నా దని సెప్పింది.” బిడ్డ మాటలకు మల్లమ్మ మొద్దునాగయినాది. మాట రానేదు. జరయినాన్క మల్లమ్మ సుతరాయించుకొని లచ్చువమ్మ యీపుమీద సెయ్యేసి ”ఎందుకు బిడ్డా! భయమెందుకేత్తాంది. గుబులెందుకు? మీ అత్త సక్కగా సూడదనా? సక్కగా బువ్వ బెట్టదనా? తిడతదా? కొడతదా?” అని అడిగినాది. దానికి లచ్చువమ్మ తల అడ్డంగా తిప్పినాది. మల్లమ్మ బిడ్డని ”మరిగట్లయితే ఎందుకు పోనంటున్నవు? మన గూడెంలో నీ సావాసగాల్లంతా పెల్లిల్లయ్యి అత్తోరిల్లకు పోయి సంసారాలు సేత్తలేరా? నీవు సూత్తనేవా? మమ్మల్ని పరేశాన్ సెయ్యకు. నీవు సక్కగుంటవని వాల్లు యిట్టపడి చేసుకుండ్రు. నీ పెల్లికి సేసిన అప్పు యింక కడతనే వున్నం. నువ్వు సుకంగా బతకాలని మీ అయ్య అప్పుసేసి పెల్లిసేసిండు. మనకు బువ్వ తినే కంచమంత సెలకనేదు. జానెడు జాగనేదు. ఆల్లకు రెండేసెకరాల లెక్కన సెలకాత్తది. ఈ తేపకు నామాట విన్కొని పోవాలి బిడ్డా. పొయ్యినంక నీకే ఎరకయితది. మమ్మలను యింకా కట్టాలపాలు సెయ్యకమని” బతిమిలాడినాది. వానికి లచ్చువమ్మ తన సెయ్యి తల్లి తలపై పెట్టి ”అమ్మా! నీతోడే. ఎందుకు భయమేత్తాందో, గుబులవుతాందో నాకే ఎరికతవలేదే. నీ పున్నముంటాది. అయ్యకి నీవే తోలొద్దని సమ్జాయించి చెప్పవే” అన్నాది. మల్లమ్మకెటూ సుతరాయించక తల్లిని పిలవనంపుకున్నాది. పుల్లమ్మ వచ్చి మనుమరాలి కతంతా యిని దిగాలయినాది. ఎట్టా సమ్జాయించితే పోరి మాట యినుకుంటదాని సోచాయించ సాగినాది.
మల్లమ్మ తల్లికి, బిడ్డకి బువ్వపెట్టినాది. లచ్చువమ్మ నాకాకలిగనేదు. తిననన్నాది. పుల్లమ్మ మనుమరాలి పక్కన కుక్కిమంచంలో కూకుని సిన్ననాటి సంగతులు కతలు- కతలుగా సెప్పినాది. లచ్చువమ్మని సిన్నప్పుడు గూడెంలో అందరూ సక్కగుంటవని ముద్దాడే వారని, దిట్టి తగుల్తదని (దిష్టి) మీ అమ్మ సేత ఎండుమిరపకాయలు, ఎంటికలు (వెంట్రు కలు) ఉప్పు కలిపి నీసుట్టూతా తిప్పి పొయ్యిలో వేయించేదానినని వుబ్బేసే మాటలు సెప్పినాది. లచ్చువమ్మ పుల్లమ్మతో కూకుని బువ్వ తిన్నాది. తిన్నాన్క మల్లా కుక్కి మంచంలో మనుమ రాలితో కూకుని తన సిన్ననాటి సంగతులు, తన కత సెప్పసాగినాది. నా పెల్లయినాన్క మీతాత తొల్కపోటానికొచ్చిండు. నేను పోనని పేసీ పెట్టినాను. మా అమ్మ – అయ్య సమ్జాయించి తోలిండ్రు. ఊరుదాటి శానా దూరం పోయినం. ఇసుక బాటకాన్కి వచ్చినాన్క మీతాత మీదున్న పైపంచె తోసిండు. రెండేపులా యిసుకమూటలు కట్టిండు. దానిని నా మెడలో యేసి వూరుదాన్క నడిపించిండు. ఈ తేప రాననకుండ వుండటానికని గట్ట బరువు మోయించిననిండు. మేమంత గట్ట యాష్టలుపడి, దెబ్బలుతిని సంసారాలు సేసినాము. సమర్తాడక మునుపే సంసారానికి తొల్కపోయెటోల్లు. మీ అత్తోల్లు శానా మంచోల్లు. పోవాలి బిడ్డా. పోనని మీ అమ్మ-అయ్యకు కట్టాలు ఎక్కువ సెయ్యకు. నిన్నెంతో ముద్దుగా సాకిండ్రు. అమ్మ-అయ్యని ఏడిపిత్తె మంచిదిగాదని సుద్దులు సెప్పింది. దానితో లచ్చువమ్మకి తాసుపాము కొచ్చినోలె బుస్సుమని కోపమొచ్చినాది. ”ఏందే ముసలిదానా. లెస్స జెప్పబట్టినవు. తేపతేపగా మాటలు యినియిని నా పానం యాష్టకొస్తున్నాది. నే సచ్చినా పోనన్నాది పుల్లమ్మ”. ఏందే పోరీ! సక్కగా సెపుతుంటె సెవుల కెక్కటం నేదా? ఎందుకు పోవే? సిన్నపిల్లవా? సమర్తాడినావు. పోనంటానికి సిగ్గునేదా? సోమయ్య (లచ్చువమ్మ మొగుడు) నల్లగుంటడని యిట్టం నేదా? నాకెరికక అడుగుతా. సక్కదనం బువ్వపెడతాదె పోరీ? మీకాన ఏమున్నాదే? బొక్కలు తప్ప. ఆల్లకు రెండేసెకరాల సెలకొస్తాది. నీ పెల్లికి సేసిన అప్పు యింక కడతనే వుండ్రి. మీ అయ్యకి ఎరికయితే సంపేత్తడు” అనినాది. ఆ నాతిరి బువ్వ తిన్నాన్క మల్లమ్మ వీరయ్య సెవిలో వూదినాది. యినంగనే వీరయ్య అగ్గిమీద గుగ్గిలమయినాడు. ఏందే పోరీ! గప్పుడు పారిపోయి వత్తుంటె ఏదో చిన్నతనమని వాల్లు-మేము వూరుకున్నబట్టినాము. గిప్పుడు పోనంటానికి ఏమి రోగం పుట్టినాదే? సిన్నపోరల ఆటలోలే వుందా? పరాసికంగా వుందా? పెయ్య (వల్లు) దగ్గరుంచుకొని మసులుకో. ఈ తేప గిట్టా మాట్లాడితే పల్లు రాలగొడతా. కాల్లు-సేతులు కట్టి పారేసొస్తా. ఏందనుకుంటున్నవో అని అరిచిండు.
తెల్లవారి గూడెంలోను-వూల్లోను లచ్చువమ్మ కత గుప్పుమన్నాది. ఒకల్లతో ఒకల్లు కలసినపుడు యిదేమి సిత్రమమ్మాని సెప్పుకో పట్టిండ్రు. సెప్పిపోయినట్టుగానే ఎల్లయ్య కోడలిని తొల్కపోవటానికొచ్చిండు. బాటలో ఎదురయిన వూల్లోలెవరో ఎల్లయ్య సెవిలో లచ్చువమ్మ కత వూదిండ్రు. వీరయ్య-మల్లమ్మ ఎల్లయ్యకి మరియాదలు సేసిండ్రు. కోడికూరతో, కల్లుతో బువ్వ పెట్టిండ్రు. రేపు పొద్దుటేల కోడల్ని తొల్కపోతనని ఎల్లయ్య సెప్పిండ్రు. వీరయ్య-ఎల్లయ్య రెండు సేతులు పట్టుకొని యియ్యి సేతులు కావు. కాల్లనుకో. మాకు యిద్దరు పోరగాల్ల ఎనకాన ఈ పోరి పుట్టినాది. జర ముద్దు సేసినం. భయపడుతున్నాది. నాల్గుదినాలు పోయినాన్క నేనే తోలుకొస్తా. ఈ తేపకు మాతప్పు కాయమని కాల్లవెల్లాపడి బలుమిలాడిండు. కాని ఎల్లయ్య యిన్కొనేదు. తోలితే రేపు తోలుండ్రి. లేకపోతే నేదు. తెల్లారినాన్క పటేలుదొరకాన్కి పోవాలని పట్టుపట్టిండు. సేసేదినేక వీరయ్య-మల్లమ్మ లచ్చువమ్మని యిద్దరు-ముగ్గురు కులపోల్లను తోల్కొని పటేలుదొర కచేరి సావిడికాన్కి పోయి నిలబడిండ్రు. (దేశముఖ్‌లు, జాగీర్దార్లు, భూస్వాములు లేని వూళ్లలో పటేలు-పట్వారీ (మున్సబు-కరణం) అదే రాజ్యం నిజాం పాలనలో తెలంగాణా గ్రామాలలో) వూల్లో ఏతంట్లాట (తన్నులాట-కొట్లాట) జరిగిన పటేల్‌దొరకాన్కి పంచాయితీకి రావాలసిందే. పటేల్‌దొర కచేరి సావిడిలోనికి వచ్చి బల్లమీద కూకుండు. పటేల్‌దొర తురకోల్ల బాస (ఉర్దూ, ముస్లింలను గ్రామాలలో తురకొల్లు అనేవాళ్లు) మన బాస తెలుగు సదివిండు. పటేల్‌దొర అందరెంక తేరపార సూసిండ్రు. వీరయ్యతో ”ఏందిరా యీరిగా! అందరిని తోల్కవచ్చిన వని అడిగిండ్రు. (ఉన్నతకులాల వారు తక్కువ కులాల వారిని వాళ్ల అమ్మ-అయ్య పెట్టిన పూర్తి పేరుతో పిలవరు.) వీరయ్యని, యీరిగా అని, పోలయ్యని పోలిగా అని, కిష్టయ్యని కిష్టిగా అని, అదే మాదిరి ఆడవారిని మల్లమ్మని మల్లి అని, మంగమ్మని మంగి అని, రాములమ్మని రామి అని పిలుస్తారు. వారి యిండ్లలో పెంచుకొనే కుక్క పిల్లలను మాత్రం జాలీ అని, టామీ అని, పప్పీ అని రకరకాల ముద్దులపేరులతో పిలుస్తారు. వీరయ్య కన్న ముందే పోలయ్య కోడలి కతంతా సెప్పి ఈ తిరకాసు మీరే తేల్చాలి దొరా. మీ కాల్మొక్కుతా ననిండు. పటేల్‌దొర ఈ కథలూ విని వీరయ్యని, వాడు చెప్పిందంతా నిజమేనారా అని అడిగిండ్రు. వీరయ్య, నిజమే దొరా. పోరి భయపడతన్నాది. మేమెంత సెప్పినా యింటనేదు. మీరే జర సొచాయించి నాయం సెప్పాలి. నీ బాంచను దొరా అనిండు. పటేల్‌దొర లచ్చువమ్మ వంక చూచి ”ఏమే లచ్చీ! మీ మామ తొల్కపోవటానికి వస్తే పోవాలిగందనే! పెండ్లయిన ఆడపిల్లలు అత్తోరిళ్లకు పోక యాడికి పోతరే? మీ గూడెంలోను, వూళ్లోను పెండ్లయిన ఆడపిల్లలు అత్తోరి యిండ్లకు పోవటం నీవు చూస్తలేవా? మరి నీవెందుకు పోనంటున్నవే? అని అడిగిండ్రు.
లచ్చువమ్మ : లచ్చువమ్మ మాటాడనేదు.
పటేల్‌దొర : చెప్పవే. చెప్పకపోతే ఎట్ట ఎరకవుతది? ఎందుకు పోనంటున్నవు?
ల : మాటాడదు
ప : దెయ్యంలెక్క నిలబడితె ఎట్టా? పోతవా? పోవా? అని గద్దించిండ్రు.
ల : పోను దొరా.
ప : అదే, ఎందుకు పోవో చెప్పాలి. వట్టిగ పోనంటె కుదరదు.
ల : నాకిట్టం నేదు దొరా.
ప : ఎందుకిష్టం లేదే? నీకిష్టమయ్యె చేసినాడె మీ అయ్య నీ పెళ్లి? ఇట్లయితే ముందుముందు ఆడపిల్లలు నీలెక్కనే అత్తోరిళ్లకు పోమంటరు. నీవు నీ మామ వెంట పోవాలి.
ల : ఎందుకిట్టం నేదో నాకే ఎరికవత నేదు దొరా. నా సెమెడా వొలిసినా నేపోను దొరా.
ఈ మాట యినగానే పటేల్‌దొరకి అరికాలిమంట నెత్తికెక్కినాది. సర్రున కోపమొచ్చినాది. అక్కడేవున్న వెట్టివానికి నాలుగు చింతబరికెలు తెమ్మని పురమాయించిండ్రు. చింతబరికె లచ్చువమ్మ పెయ్య (వల్లు) మీద తైతక్కలాడింది. సీర, రవిక వున్నతాన తప్పించి పెయ్యంతా చింతబరికెల దెబ్బలు వాతలు తేలినాయి. (పటేల్-పట్వారీల, దేశముఖ్‌ల, జాగీర్దార్ల, భూస్వాముల చేదుల్లొ చింతబరికె దెబ్బలు తినటం, ఎర్రని ఎండలో వంగబడి యీపుమీద రాళ్లు మొయ్యటం తెలంగాణ బక్కరైతులకు, బడుగుజీవులకు మామూలే) లచ్చువమ్మ నోరు తెరిసి ఏడ్చనేదు. కల్లల్లో నీల్లు కాలవలువోలే పారినాయి. అయినా గాని లచ్చువమ్మ ”కొట్టకు దొరా, పోత దొరా అనలేదు. పటేల్ దొర సేతిలో సింతబరికె ముక్కలు ముక్కలయి నాది. పటేల్‌దొర పేనం యాష్ట కొచ్చిందో నేక జాలిపుట్టినాదో ఎరకనేదు. మల్ల సింతబరికె పట్టనేదు. వీరయ్య వంక సూచి ఈరిగా! ”ఈ పంచాయితీ మీకులపోళ్లే తేల్చు కోండిరా”అని చెప్పి లోపలికి పోయిండ్రు.”
అందరూ గూడెంలోని గుడిసెలకు వచ్చిండ్రు. కులపంచాయితీ పెట్టి సెల్లుసీటి (విడాకుల్లాంటివి) యియ్యమని ఎల్లయ్య పట్టుపట్టిండు. కులతప్పు అంటే మాటలా? పదిమంది కులపోల్లకు కల్లు పోయించాలె. మాంసం కూరతో బువ్వపెట్టాలె. సేతిలో సిల్లిగవ్వనేదు. గౌండ్ల మంగమ్మ కాన్కి పోయి బతిమిలాడి అప్పుసేసి కల్లుముంతలు తెచ్చిండు వీరయ్య. ఏడనో కోడిపుంజును కొనితెచ్చిండు. ఆ నాతిరి పదిమంది కులపోల్లకు బువ్వపెట్టిండు. తెల్లారినాన్క పటేల్‌దొరకాన్కి పోయి సెల్లుసీటి రాయించుకొని పోయిండు ఎల్లయ్య. ఆ నాతిరి లచ్చువమ్మ బువ్వ తిననేదు. సింతబరికె దెబ్బలకు జరమొచ్చినాది. మూడునాల్గు దినాలు కుక్కిమంచం దిగనేదు. బయటకుపోయి సెలకల్లో పనిచేసే ఆడవాల్లు సీరను కుస్సిల్లు పాదాలదాకా వచ్చేనాగ కట్టుకోరు. ఆట్ట కట్టుకుంటె సెలకల్లో, పొలాలల్లో పనిసేయడానికి అడ్డమవుతాది. సీరను కాసెపోసి మోకాల్లపైకి వున్నెలాగ రెండుకాల్ల సందులోంచి ఎనకఏపు ఎగసెక్కి దోపుకుంటరు. కుడిమోకాలుపైన ఎడమమోకాలుపైన మూడునాలుగు మడతలు వున్నేనాగ (నేటి హ్యాండ్‌బ్యాగులకు లోపలవుండే భాగాలవలె) కడతరు. ఒక్కొక్క మడతలో పావుకిలో, అరకిలో ధాన్యం తేలికగా నింపవచ్చు. దొరల యిల్లల్లో వడ్లు దంపటానికి పోయినప్పుడు జెల్లించినాక వచ్చిన నూకలను రెండు-మూడు గుప్పెల్లు ఆ మడతల్లో పోసుకునేటోల్లు. కొంచెం ఎక్కువగా పోసుకుంటె ఎత్తుగా కానబడి దంపించుకున్న దొరసానులు వాటి సేటల్లో పోయించుకునేటోల్లు. పోరలు నమలటాని కనో, కోడిపిల్లలకనో తీసుకున్నమని సెప్పి సేటల్లో పోసెటోల్లు. కటికదరిద్రం వాల్ల చేత ఆ పనిచేయిస్తాది. అదే వున్నోల్లు నాగుల లెక్కన తవ్వెడుగింజలిచ్చి, మానెడు గింజలు, ఒక కుండ గింజలిచ్చి రెండు కుండల ధాన్యాన్ని బక్కరైతుల నుంచి, బడుగుజీవుల నుంచి వసూలు చేసేటోల్లు. అది దొరతనం గాను, గుప్పెడు నూకలు దొంగతనంగాను చలామణి అయ్యేది. ఇప్పుడు కూడ దోపిడీ చేసే పద్ధతులు మారినయ్యేగాని దోపిడి ఆగలేదు. లచ్చువమ్మ దెబ్బలు నయమయి నాయి. అమ్మ-అయ్య తానేవున్నాది. లచ్చువమ్మ పెల్లిగట్ల పెడాకులయినాది.
లచ్చువమ్మ అమ్మతోపాటు కూలీనాలీ పనులకు పోబట్టినాది. వరిసేలనాట్లకు, కలుపు తీయటానికి, కోత కోయటానికి ఎల్లినాది. జొన్న సేలల్లో, సద్ద (సజ్జ) సేలల్లో కంకులేరి, సొప్ప కోసినాది. ఏరుశనక్కాయలు పీకటానికి, కోయటానికి, యిత్తనాలకి గింజలు వల్చటానికి పోయినాది. మిరపతోటల్లో మిరపపల్లు ఏరినాది. కందిసేలలో కంది కాయలుకోసి, కందికంప కోసినాది. ఏ పనైనా జడ్చకుండ సేయటానికి వుసారుగా ముందు వుండేది. నాలుగు రోకళ్ల వడ్లదంపుడుకు, వరిసేలలో నాట్లు ఏసేతప్పుడు తమ గుంపులో సేకమని లచ్చువమ్మని అడిగేటోల్లు. సక్కని గొంతు. పాటలు సక్కగా పాడతాది. పాటలు పాడతా పనిసేస్తె అలుపు ఎరికగాదు. ఏ పనైనా సురాంగ చేస్తాది. లచ్చువమ్మ అన్నలు పెద్దోలయినారు. వాల్లకు పెల్లిల్లు సేయాలె. వీరయ్య-మల్లమ్మ సోచాయించుకున్నరు. లచ్చువమ్మని మారుమనువు (మళ్లీ పెండ్లి లాంటిది) యియ్యాలనుకుని గామాటే లచ్చువమ్మకి సెప్పిండ్రు. లచ్చువమ్మ మారు మనువు పోనన్నాది. (లచ్చువమ్మ కులంలోనే కాకుండ మరికొన్ని కులాలలో మారుమనువు ఆచారమున్నాది.) భర్త వదిలివేసినా, చచ్చి పోయినా, లేక భార్య వదిలివేసినా మారుమనువు యిచ్చెటోల్లు. మొదటి భర్త వలన ఒకరిద్దరు పిల్లలున్నా మారుమనువు చేసుకున్న పురుషుడు ఆ పిల్లలను కూడ సాకాలి. వాల్లతో కలిసివుండాలి. (ఈ సాంప్రదాయం ఉన్నతకులాలలో మహాప చారం) లచ్చువమ్మకి అమ్మ-అయ్య సమ్జాయించి సెప్పిండ్రు. ”వదినలొత్తరు. వాల్లతో నీకెట్ట పొసుగుతాది? ఎట్టా మసులుకుంటావు? మేము సచ్చినాన్క నీగతి ఏమయితాది. గిప్పుడైనా మామాట ఇన్కోమని బతిమిలాడిండ్రు. లచ్చువమ్మ యిననేదు. వాల్ల యింటి దగ్గరనే సుట్టిల్లు ఏసుకున్నాది (గుండ్రంగా వుంటుంది) మన్ను-వరివూక నాన బెట్టినాది. బాగా నాని నాన్క ఎండయేసి అన్నల సాయంతో బంకలాగ మన్ను తొక్కినాది. అన్నలు గోడలు పెడుతుంటె మట్టి ముద్దలు అందిచ్చినాది. యింటిపైన కంప గట్టయేసి కందికంపతోను, జొన్నసొప్పతోను కప్పి గుడిసె ఏసుకున్నాది. అన్నల పెల్లిల్లకు ముందగనే గుడిసెలో ఒక్కతే వుండబట్టినాది. కొన్నాల్లు నాతిరిపూట ఆల అమ్మ వచ్చి పడుకునేది.
ఒక్కతే వుంటున్న లచ్చువమ్మతో గూడెంలోని యే మొగానికి ఎకసక్కా లాడటానికి, పరాసికాలాడటానికి దయిరం సాలనేదు. లచ్చువమ్మ చెడు తిరుగుల్లు తిరగనేదు. నిప్పువోలే బతుకుతున్నాది. కాలం ఎప్పుడూ ఒకనాగ వుండదుకదా! మనిసిలో మారుపు రావటం సత్తెమే. కొన్నాల్లు పోయినాన్క లచ్చువమ్మలో మారుపు వచ్చినాది. వాల్ల గూడెంలోనే వుంటున్న వెంకని మీద మనసు పారేసుకున్నాది. గప్పటికే వెంకనికి పెల్లయినాది. పెల్లాం పేరు కూడ వెంకమ్మ. వాల్లిద్దరిని సూసినోల్లు సూడసక్కని జంట అనుకునేటోల్లు. వెంకమ్మని ఒకసారి సూసినోల్లకు మల్లీ సూడాలనిపిస్తాది. ముక్కు, కల్లు, నొసలు సిత్రంలో గీసిన గీతల లెక్కనుంటాయి. అప్పటికింకా వాల్లకు పిల్లలు పుట్టనేదు. మనసయినపుడు లచ్చువమ్మ-వెంకడు లచ్చువమ్మ గుడిసెలో కలిసెటోల్లు. వెంకమ్మ దొరల యిండ్లకు గాసాని కెల్లినపుడు (జీతము వున్నందుకు నెలకింతని జొన్నలుగాని, వడ్లుగాని, సజ్జలుగాని యిచ్చెటోల్లు. దానిని గాసమంటరు) దొరల యిండ్లలో వున్న వయసొచ్చిన ఆడపిల్లలు పెద్దోళ్లను చూడకుండ వెంకమ్మని ”ఏమే ఎంకీ! నీవింత సక్కగుంటవు గందా! ఎంకడు గా లచ్చితో పోతడెందుకే? నీ కోపం రాదా” అని అడిగేటోల్లు. దానికి వెంకమ్మ ”నాకెందుకు ఈ తంట్లాట దొరసాని. నన్ను సక్కంగ సూసుకుంటడు గంద. తిట్టడు, కొట్టడు. గాసంలో గిద్దెడు గింజలు దానికి యియ్యడు” అని జవాబు సెప్పేది. నిజంగానే లచ్చువమ్మ వెంకని ముందు సేయిసాపి రాగిపైసా అడగ నేదు. గాసంలో గిద్దెడు గింజలకు ఆసపడ నేదు. ఇద్దరో-ముగ్గురో పిల్లలు పుట్టిండ్రు. తన రెక్కల కట్టంతోనే ఆ పోరగాల్లను సాకి పెద్దసేసినాది.చదువుసంధ్యలు లేనివారి లోను, బడుగువర్గాల ప్రజల్లోను యిష్టాలు-అయిష్టాలు వుంటవని – యిష్టం లేనిదానిని ఎదిరించ టానికి ప్రాణాలను సయితం లెక్కచేయకుండ ఎదుర్కొంటారని లచ్చువమ్మ కత వలన తెలుస్తూంది. మరి ఈ కథ ఏ కోవకు చెందుతుందో పాఠకులే నిర్ణయించుకోవాలి.
తెలంగాణాలో ఒక గ్రామంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా రాసిన కథ.