వివాదాల మధ్య స్త్రీవాదం – ఒక స్వేచ్ఛానాదం

– వై. శ్రీరాములు

సంకెళ్ళలోవున్న (Chain) కొలికి (Ring) తొలగించి ఒక సమస్యతోనే విడుదల కావాలనేదే గాకుండా మొత్తం సంకెళ్ళలో వున్న సమస్యల కొలికిల్ని (Rings) కొక్కాల్ని పగులగొట్టాలని చెబుతోంది స్త్రీ వాదం, ఎందుకంటే సంకెళ్ళు (Chain) ఒక చోట తెంపినా, ఒక కొలికి తెగిపోయినంత మాత్రాన సంకెళ్ళు మొత్తం పోయినట్టుకాదు. అందుకే సంకెళ్ళ కొలుకులు మొత్తం ధ్వంసం చేయడమే స్త్రీ వాదం.

ఆర్థిక అసమానతలతో బాటు స్వాతంత్య్రం, విముక్తి, స్వేచ్ఛ, సమానత కావాలని అభ్యర్థించడం లేదు, కోరుకోవడం లేదు స్పష్టంగా చెప్పాలంటే సంపూర్తిగా, ధైర్యంగా అనుభవిస్తామని బాహాటంగా ప్రకటిస్తోంది. దీర్ఘకాల నిద్రావస్థలోంచి, అణచివుంచిన వ్యవస్థలోంచి జూలు విదిల్చి ప్రపంచం మధ్య నిలబడి సంపూర్ణయుద్ధం చేస్తోంది స్త్రీ వాదం.

స్త్రీవాద సాహిత్యం ఒక పార్టీపైనో లేదా ఒక జెండా కిందో, ఎజండా పంచనో చేరిన తరువాత రాసిన సాహిత్యం కాదు. ఒక సంస్థగా ఏర్పడిన తర్వాత వ్రాసిన కవిత్వం కాదు. వ్యక్తిత్వం నిండుగా, సామూహికంగా వున్న సాహిత్యం స్త్రీవాద సాహిత్యం. అంతేగాని ఏదేశంలో ఆదేశం యొక్క స్థితిగతుల్ని, పరిస్థితుల్ని ప్రాంతీయతను మరచిపోయి విదేశీహస్తాల్తో స్వదేశంలో బస్తాలకొద్దీ వ్రాసిన మూకదంపుడు మూస బోసిన సాహిత్యం కాదు స్త్రీవాద సాహిత్యం.

అంతేకాదు.

స్త్రీ వాద సాహిత్యం ఒక విముక్తిని గురించి మాత్రమేగాక ఆర్థిక, సామాజిక, సాంఘిక విముక్తులను స్వేచ్ఛాయుత విముక్తులను గురించి ప్రశ్నించి మాట్లాడుతుంది.ఎదురు నిలిచిపోరాడుతుంది.

”మనుషులలో అంతరంగికంగానూ, బాహ్యంగానూ అణచివుండే ప్రతిదాన్ని, మానవుని స్వేచ్ఛాభివృద్ధిని అరికట్టే ప్రతి విషయాన్ని తీవ్రంగా ద్వేషించి ప్రకృతి శక్తులతో దినదినం పోరాడాలి. ‘స్త్రీ’ ని దైహిక సుఖాన్నిచ్చే వ్యక్తిగా మాత్రమేగాక దుర్గమ జీవిత బాటలో పురుషునితో పాటు ప్రయాణించే ప్రయాణానికి సిద్ధంగా వున్న సహచరిణిగా చూడాలి” అంటాడు గోర్కీ.

ఆధునిక ప్రపంచంలో స్త్రీ వాదం విడదీయరాని ప్రధానాంశం. 1900 నుండి సామాజిక శాస్త్రాలలో, అన్నిరంగాల్లో ఎక్కడా పక్కదోవ పట్టకుండా విశేష కృషిని చేసింది, చేస్తున్నది స్త్రీలే.

తమపై జాలిని, దయని, ఉదారా వాదాన్ని చూపిస్తున్న వారిని స్త్రీ వాదులు అపహాస్యం చేస్తూనే తమ సరైన ఆలోచనలతో అన్నింటా అగ్రభాగాన నిలిచారు, ప్రపంచం అంచుల వరకు తమ భావాల్ని పరిచారు. ప్రతి సంఘటనకు, ప్రతి ఉద్యమానికి, ప్రతి రాజకీయానికి స్త్రీలు స్పందించారు. స్త్రీవాద సాహిత్యం కూడా స్పందించింది. ఆధునిక స్త్రీలు ప్రతి విషయంతో, ప్రతి పరిశీలనతో ప్రపంచాన్ని మరింత శక్తివంతంచేశారు.

తమ సమస్యల్ని, తమ అనుభవాల్ని, అనుభూతుల్ని ధైర్యంగా ఆవిష్కరించింది స్త్రీ వాద సాహిత్యం.

స్త్రీ వాదం తమ దీనహీన స్థితిగతుల్ని, అణచివేతని, పురుషాహంకారాన్ని విలువల్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. ప్రశ్నించింది, విమర్శించింది.

స్త్రీవాద సాహిత్యంలో ఏ కల్తీ లేని, ఏ ఇజంలేని నిజరక్తం సిరాగా మారింది. ప్రాణశ్వాసను తమ స్వేచ్ఛా భాషగా తీవ్రమైన వేగంగా మార్చుకుంది.

స్త్రీ బాహ్య అంతర్‌ సంఘర్షణల ప్రపంచంలో పురుషుని ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ప్రయత్నిస్తున్న పర్యవసానమే స్త్రీవాద సాహిత్యం. అంతేకాక అదేక్రమంలో తమను బాధించే ద్వేషించే ప్రతివిషయాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది స్త్రీవాద సాహిత్యం. మరో విశేషమైన విషయమేమిటంటే ఆర్థిక అసమానతల విషయంలో రాజీలేని పోరాటం చేస్తూనే తన స్వేఛ్చా స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఇక్కడ మనం గమనించా ల్సిన ప్రధానాంశం పురుషుడు వర్గరహిత సమాజ కోసమే ఒక చేత్తో ఒక కత్తితో పోరాటం చేస్తుంటే స్త్రీ ఒక చేతిలోని కత్తితో వర్గరహిత సమాజంకోసం పోరాడుతూనే పురుషాధిపత్యంపై మరో చేతిలోని కత్తితో తమ అస్థిత్వం కోసం, స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం నిరంతర పోరాటం అవిశ్రాంతంగా చేస్తోంది. అంటే పురుషుడు ఒక చేతిలోని కత్తితో పోరాడుతూ ఇంకో చేతిలోని డోలుతో తన్నుతాను కాపాడుకుంటుంటే స్త్రీ మాత్రం రెండు చేతులతో కత్తితోనే పోరాడుతూ డాలు స్థానంలో కూడా కత్తినే ఉపయోగిస్తోంది. కాపాడుకోవడం, యుద్ధం చేయడం, ఆత్మ రక్షణకే కాకుండా తన సంపూర్ణ దృక్పధంగా కొనసాగుతోంది. పురుషునికి తన్ను కాపాడు ఇతరుల్ని కాపాడడానికి రెండు కత్తులు అవసరమయ్యాయి. నేరుగా గాని వెనకవైపు నుంచి గాని శత్రుభయం పురుషునికి వుంటే స్త్రీకి మాత్రం తన చుట్టూ సమూహ దాడి నుండి తన్ను తాను రక్షించుకోవాలని అర్థం అవుతుంది. అందుకే స్త్రీకి రెండు చేతుల స్థానంలో రెండు కత్తులు అవసరమనే దశకు స్త్రీ వాదం వెళ్ళింది.

ఆధునికాంతర స్త్రీవాదులు కోరేది స్త్రీ పురుషుల మధ్య అసమానతల్ని, అణచివేతల్ని, చులకనగా చూసే విధానాన్ని, వాస్తవికతల మధ్య అవాస్తవికతను చేర్చే వ్యవహారాల్ని చూసి తమ అసంతృప్తిని ఆగ్రహాన్ని ఆరోగ్యంగానే వ్యక్తంచేశారు అంతేగాని ఆర్థిక స్వాతంత్య్రం, ఆర్థిక సమానత రానిదే స్త్రీకి స్వేచ్ఛరాదని, స్వేచ్ఛలేదని, అంతవరకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన పనిలేదని, సమసమాజం, ఆర్థిక సమానత వచ్చినప్పుడే స్త్రీకి స్వేచ్ఛ కాబట్టి మొట్టమొదట సమసమాజం కోసం పోరాడి ఆ తర్వాత స్త్రీ విషయం చూద్దాం ఆలోచిద్దాం అనే పిడివాద సాహిత్య రాజకీయ విషవలయ సిద్ధాంతాలతో వున్న పురుషాధికారుల్ని తీవ్రంగానే ఎదుర్కొంది ఆధునికాంతర స్త్రీవాదం.

ఒక విధంగా, ఆవిధంగా ఆలోచించినా భారతదేశంలో ఆర్థికంగా ఎదిగిన కొంతమంది బలహీన, బడుగు వర్గాల వారిని, దళితులన బడే ఎస్‌.టి., ఎస్‌.సి., బి.సి.లకు సంబంధించిన వ్యక్తుల్ని అగ్రవర్ణాలవారు, అగ్రరాజకీయ పార్టీలు, జాతీయ పెట్టుబడిదారీ రాజకీయ పార్టీలు ఏ కుల దృష్టితో, ఏ మత ప్రాతిపధికతో, ఎలాంటి చులకన భావంతో చూస్తున్నారో ఆర్థికంగా, స్వతంత్రాయుతంగా జీవిస్తున్న స్త్రీలను కూడా పురుషాధిపత్య సమాజం ఆవిధంగానే చూస్తోంది. సరిగ్గా అలాంటి భావజాలాన్ని బద్ధలు కొడుతూ పురుషుల అంతరంగంలో వున్న అలాంటి భావజాలం మీద వాతలు పెట్టింది ఆధుని కాంతర స్త్రీవాదం.

స్త్రీవాదులు వర్గపోరాటాన్ని ఏవిధంగా చీలుస్తున్నారో, చీల్చారో, చీల్చడానికి దోహదం చేశారో, చీల్చడానికి కారకులయ్యారో అర్థం కాని విషయం. ఎంత ఆలోచించినా రాతి యుగం నుంచి రాడికల్‌ కాలందాకా అప వాదుల్ని అణచివేతని స్త్రీ మీదే ప్రయోగిస్తోంది పురుషాధిపత్య సమాజం అనే విషయం సత్యం.

వర్గ పోరాటాన్ని చీలుస్తున్నది సిద్ధాంత ప్రాతిపదికన గాక కేవలం వ్యక్తిగత నాయకత్వ లక్షణం కోసం పురుషులు ఆడుతున్న రాజకీయం మాత్రమే అన్నది నానా విధంగా చీలిపోయిన చీలిపోతున్న వామపక్షాల వారికి బాగా తెలుసుకాని అంగీకరించడానికి ఒప్పుకోరు, అడ్డదారుల్ని అమాంతం చూపిస్తారు. ఒకడు ఓటు వద్దంటాడు, ఇంకోడు ఓటు పంచుకుందామంటాడు, మరొకడు అధికార పొత్తుతో మత్తులో మునిగిపోతాడు, మరొకడు బులెట్‌ అంటాడు, ఇంకోడు సీటు ముఖ్యమంటాడు. విచిత్రమేమిటంటే అందరూ మార్క్‌ ్సను కోట్‌ చేస్తారు. మావోను కోట్‌ చేస్తారు. చివరకు నాయకత్వానికి మాత్రమే పోటీపడతారు. అక్కడ కూడా ఎక్కడా స్త్రీకి మాత్రం చెయ్యి కాదుకదా కాలు మాత్రమే చూపిస్తారు. ఇదీ స్త్రీకి మనమిస్తున్న అత్యున్నత అగౌరవ అగ్రస్థానం.

ఆధునికాంతర స్త్రీవాద సాహిత్యంలో వంటింట్లో చుట్టుకున్న నిర్వీర్యతని అసహనంతో భరించే పురుషాధిపత్యాన్ని ఇంకా ఇన్ని తరాలుగా భరించిన విషయ విషాన్ని నిష్కర్కమైన నిర్దుష్టమైన ప్రణాళికతో ఒక్కసారిగా విరుచుకు పడగానే పురుషాధిపత్య సమాజం జీర్ణించుకోలేక సామాజిక ధర్మం పేరిట ఓ ముసుగును స్త్రీ వాదం మీద తగిలించి అతి తెలివిగా వారి చేత వారినే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.

సామాజిక ధర్మం అనే పదంలో ధర్మం అనే పదం బిక్షగాడి లక్షణంగానే ధ్వనిస్తుంది, ధర్మం చేయండి అనే బిక్షనే, అడుక్కుతినే స్వభావాన్నే ఆధునికాంతర స్త్రీవాదులు ఛీత్కరిస్తున్నారు.

పురుషాధిపత్యంతో కొందరు చేసే కొన్ని వ్యాఖ్యల్ని వింటే ఏ సన్యాసుల గుంపులోనో పురుషాధిపత్య కూటమిలోనో వుండాల్సిన వ్యక్తులుగా కనిపిస్తారు. చైతన్యం – విప్లవం – మార్పు – సామాజిక విలువలు అన్ని పదాల్ని అంత్యప్రాసలుగా తగిలించుకుని తిరుగుతున్న గత కాలపు కొలమానాలుగా అగుపిస్తారు.

పురుషులు పీలుస్తున్న స్వేచ్ఛాయుత వాతావరణం, స్నేహితుల సాంగత్యం తాము చూడాలన్న ప్రదేశాలకు, స్నేహితుల దగ్గరకు ఒంటరిగా వెళ్ళి గడపడం, వెన్నెల్లో రాత్రివేళ ఒంటరిగా వీధుల్లో తిరగడం స్త్రీలలో ఎంత మందికి లభిస్తోందో ఆలోచించాలి.

ఒక నూతన మార్గం, కోణం ఆవిష్క రించేటప్పుడు నదులై, వరదలై, ఉప్పెనలై నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం మురికిని, చెత్తని ఊడ్చుకుపోతుంది. అయితే నీటి ప్రవాహం వాటిని ముట్టకూడదు అనడమే ఆధునికాంతర స్త్రీవాదంపై మిడి మిడి జ్ఞానంతో కొంతమంది పురుషాధిపతులు చేస్తున్న అహంకార అసంబద్ధ అసహన వ్యాఖ్యానం. నదులు సము ద్రంలో కలిశాక సముద్రాన్ని చూసి సముద్రం అంటాంకాని చెత్త సముద్రం, మురికి సముద్రం అనం కదా!

తరతరాల బాధల్ని, ఆవేశాన్ని, అసహ నాన్ని పురుషుడు తమని పాదాలకింద తొక్కిన నైజాన్ని, భేషజాల్ని తీవ్రంగా ఎదుర్కొ నడమనేది అడుగడుగునా ఆధునికాంతర స్త్రీవాదంలో సాహిత్యంలో పదంపదంలో దర్శనమిస్తుంది. ఆధునికాంతర స్త్రీవాద సాహిత్య ఆలోచనాసరళి దానిమూలమైన అవ్యక్తీకర ణను వ్యక్తపరచడంలో ఇంకా కొంతమంది అనుకొనే పరుషపదాలు ఎక్కువైనా అభ్యంతరం లేదు… పురుషపదాలు, నినాదాలు లేకుంటే సరి.

ఆధునికాంతర స్త్రీవాదులు ”కేవలం” ఆలోచనలతో పయనించడం లేదు ”సరైన” ఆలోచనలతోనే ప్రవహిస్తున్నారు.

ఆధునికాంతర స్త్రీవాదులు యుద్ధం చేస్తున్నారు. సహకరించు అంతేకాని అది యుద్ధమే కాదంటే ఎలా?

వ్యక్తులుగా వ్యవస్థలో తమ అవస్థలు తెలుపుతూ ఏ సంస్థా లేకుండా తమందరిదీ ఈ పంథా అని చెప్పిన ఏకైక సాహితీవాదం ఆధునికాంతర స్త్రీ వాదం, తమ అస్థిత్వంలోని ఆంతర్యాన్ని ఆవిష్కరించడమే ఆధునికాంతర స్త్రీవాద ఉద్యమం.

స్త్రీ తన అన్ని భావజాలాల్ని, కోణాల్ని ఆవిష్కరించి అందరి మస్తిష్కాల్నీ ఆలోచింప చేసిన అరుదైన అద్భుతమైన అర్థవంతమైన వాదం ఆధునికాంతర స్త్రీవాదం.

అన్ని నీచపు అంచుల్ని ప్రశ్నించి ఎదుర్కొన్న ఏకైక సాహిత్యం ఆధునికాంతర స్త్రీవాద సాహిత్యం. స్త్రీలు ఏపనీ లేకుండా ఏనాడు హక్కుల్ని అడగలేదు. పురుషులు సామాజిక సేవంటూ ముక్కుకు గుడ్డకట్టుకుని సంవత్సరానికోసారి వీధుల్ని శుభ్రంచేసే పనికి పోవడానికి ముందే వారి డ్రాయర్ల, బనియన్ల మురికిని స్త్రీనే శుభ్రపరుస్తోంది. భారతదేశ పురుషులు ఈ విషయం గమనించగలరు.

స్త్రీవాద సాహిత్యం ఎక్కడా శృంగారాన్ని అసహ్యించుకోలేదు. అయితే ఆ శృంగారంలో జరుగుతున్న అపనమ్మకాల్ని, ఘర్షణల్ని, అవాంతారాల్ని, అంతరాలలో పెనుగుతున్న అనుమాన క్రీనీడల్ని గమనించి అత్యున్నత ఆనందసమయంలో పురుషుడు చేసే ఆర్థిక సామాజిక నీచప్రవృత్తిని మాత్రమే అసహ్యించుకుంటున్నారు.

ఒక కవిత, కథ, నవల ఏ సాహితీ ప్రక్రియనైన చదివితే మనం ఏం స్పందించా మనే దానిమీద విమర్శ బయలుదేరుతుంది.

స్త్రీ శారీరక మానసిక గదుల్లోని అనుభవాల్ని అనుభూతుల్ని ఆధునికాంతర స్త్రీవాదం ఆవిష్కరిస్తోంది. జ్వలిస్తున్న తమ గొంతుకతో గుండెలోని లోతుల్ని నూతిలోని గొంతుల్ని విడుదల చేస్తోంది.

ఆధునికాంతర స్త్రీవాదాన్ని నీచంగా విమర్శించే వాళ్ళు ఓ విషయం తెలుసుకుంటే బావుంటుందని ఆశిస్తాను.

“If one wants to educate others, the educationist should first be educated” Mao 20 Oct. 1966

ఆధునికాంతర స్త్రీవాదుల కలం అప్రయత్నంగానైన గురితప్పడం లేదు. కళకి జీవితమే ప్రతిబింబమైనప్పుడు అంతరప్రవృత్తి ప్రదర్శన అద్భుంతంగా జరుగుతుంది.

హక్కులు, సమానత్వం, స్వయం ప్రతిపత్తి, పోరాటం అన్నిటిని మించి వ్యక్తిత్వం నిండుగా నిర్వర్తించేదే ఆధునికాంతర స్త్రీవాదం. ఒకవైపు సమాజ అసమానతలతో పోరాడుతూ స్త్రీ పురుష అసమానతలను బహిరంగంగా వ్యక్తపరచడం ఆధునికాంతర స్త్రీవాదం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో