‘భూమిక’ను తొలిరోజుల్లో చూసినా ఇప్పుడు చూస్తున్నా ‘మానుషి’ గుర్తొస్తుంది

ఇంటర్వ్యూ  :  సీతారాం
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.తెలుగు (1986) చదువుతూ ఉండగా టైబ్రరీ రాక్స్‌లో ఓ రోజు ‘మానుషి’ అనే పత్రిక కనపడింది. ఆసక్తిగా ఆ పత్రిక చదివాను. ఎడిటర్‌ పేరు మధుకిష్వర్‌. ఆ పేరు ఇప్పటికీి నాకు చిత్రంగా ధ్వనిస్తుంది. ఆమె సంపాదకీయాలు సునిశితంగా ఉండేవి. ఆర్టికల్స్‌ గ్రామీణ భారత స్త్రీల సమస్యలకు అద్దం పట్టేవి. వచ్చీ రాని ఇంగ్లీషు భాషతో వాటిని చదివి అన్వయించుకునేవాడిని. క్రమంగా ఆ పత్రికను ఇష్టంగా చదవటం అలవాటైంది. అదే సమయంలో ఖమ్మం మిత్రులు రావులపల్లి సతీష్‌, ఐ.వి. రమణారావు స్త్రీవాదం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉండేవారు. వారి విశ్లేషణలు వింటానికి బావుండేవి. ఐ.వి. చేతిలో చాలా సంవత్సరాలు సిస్టర్‌ హుడ్‌ ఈస్‌ పవర్‌ఫుల్‌ అనే పుస్తకం ఉండేది. ఏనాటికైనా ‘మానుషి’లాంటి పత్రికను చూడగలమా అనిపించేది. ‘భూమిక’ను తొలిరోజుల్లో చూసినా, యిప్పుడు చూస్తున్నా నాకు ‘మానుషి’ గుర్తొస్తుంది.చిన్న పత్రికలు పెద్ద పనులు దీర్షకాలం చేయడం గొప్పే. ‘భూమిక’ రెండు దశాబ్దాలపాటు తెలుగు సాహిత్య సమాజాలలో కొంతైనా మర్పుని తెచ్చింది. ఇటువంటి పత్రికలపట్ల రిజర్వేషన్స్‌ మనకెన్ని ఉన్నప్పటికీి వీటి అవసరం, వీటి ఉనికి ముఖ్యం. అలాగే హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌పై ఒక ప్రత్యేక సంచికను తేవడంలో సత్యవతి గారితో కొంత పనిచేయడం నాకు ఇష్టమైంది. భూమికను 20 ఏళ్ళపాటు నడిపిన ఆమెను ఇంటర్వ్యూ చేయాలని చాలా సాధారణమైన ప్రశ్నలతో వెళ్ళాను. ఆమె మాటల్లో ‘భూమిక’ గురించి…..
1. భూమిక అనే పేరు ఎవరు సూచించారు?
‘భూమిక’ పేరును ఎవరో ఒకరు సూచించలేదు. అన్వేషిలో జరిగిన అనేక సమావేశాలంతరం భూమిక  కు నామకరణం జరిగింది. తొలిరోజుల్లో భూమిక ‘అన్వేషి’ కార్యాలయం నుండే వెలువడేది. భూమికకు పేరిచ్చింది, పనిచేసుకోవడానికి ఓ గదినిచ్చిందీ అన్వేషి రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌.
2. ప్రారంభ సంచికను తొలిసారి చూసుకున్నపుడు ఏమనిపించింది?
భూమిక ప్రారంభ సంచిక 1993 మార్చిలో వెలువడింది. మొదటిి సంచిక రావడానికి ముందు అన్వేషి టీమ్‌తో నేను కూడా సారా వ్యతిరేక ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగిన నెల్లూరులోని గ్రామాలకు వెళ్ళి వచ్చాను. ఆ ఉద్యమ స్ఫూర్తి గుండెల్నిండా వుంది. అదే సమయంలో భూమిక మొదటి సంచిక వచ్చింది. స్త్రీవాద పత్రికను ప్రారంభించినందుకు అందరం చాలా సంతోషపడ్డాం. అంతకు ముందు (1989) నేను జయప్రభతో కలిసి స్త్రీవాద కరపత్రిక పేరుతో ‘లోహిత’ నడిపాను. కొన్ని కారణాలవల్ల ‘లోహిత’ ఆగిపోయింది. తెలుగులో తొలి స్త్రీవాద కరపత్రికను, తొలి పూర్తిస్థాయి స్త్రీవాద పత్రికను ప్రారంభించడంలో, నడపడంలో నేను భాగస్వామినవ్వడం నా జీవితంలో మర్చిపోలేని అంశం. సహజంగానే ప్రారంభసంచికను చేతుల్లోకి తీసుకున్నపుడు ఓ ఉద్విగ్న కెరటం నన్ను కమ్మేసి ఉంటుంది. ఇరవై సంవత్సరాల తర్వాత ఆ భావోద్వేగాన్ని గుర్తుచేసుకోవడం కష్టమే.
3. భూమిక ఇన్నేళ్ళపాటు కొనసాగడానికి దోహదపడ్డ అంశాలేంటి?
భూమిక ఇన్నేళ్ళపాటు కొనసాగడం వెనుక వున్న ముఖ్యమైన అంశం భూమిక అవసరం సమాజంలో వుండడం. అందరితో పాటు నేనూ వదిలేసి వుంటే ‘భూమిక’ 2000లోనే ఆగిపోయేది.  మొదట్లో కార్యనిర్వాహక వర్గంలో చాలామంది వుండేవారు. ప్రతి అంశం మీద సామూహిక నిర్ణయాలుండేవి. కానీ డి.టి.పి చేయించడం, ప్రెస్‌కెళ్ళడంలాంటి పనులు ఎక్కువగా నేను, సజయ చేసేవాళ్ళం. క్రమక్రమంగా ఒక్కొక్కరూ భూమికను వదిలి పోవడం మొదలై 2000 నాటికి నేను ఒక్కదాన్ని మిగిలాను.  భూమిక ఆర్థిక పరిస్థితి దిగజారి వుంది. అలాంటి సమయంలో ఒక నిబద్ధతతో, ఒక సామాజిక బాధ్యతగా భూమికను నేను తలకెత్తుకున్నాను.  నా ఆలోచనల్లో నిరంతరం భూమికే వుండేది. ”ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒక్కడివే పదవోయ్‌” అని ఠాగూర్‌ చెప్పినట్లు నా పట్టుదలే భూమికను కొనసాగిస్తోంది. దానికి ఎందరిదో తోడ్పాటు వుంది.
4. రెండు దశాబ్దాల భూమిక ఏమి సాధించింది?
రెండు దశాబ్దాల భూమిక ఏం సాధించిందో నేను ఎలా చెప్పగలను? నేను పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దాని ప్రభావం ఏమిటి? సమాజం మీద ఎలాంటి ముద్ర వేసింది. అని తేల్చాల్సింది నేను కాదనుకుంటాను. భూమిక ప్రారంభ సంచికలో ఏవైతే లక్ష్యాలుగా మేము ప్రకటించుకున్నామో ఆ లక్ష్యాల కనుగుణంగానే భూమిక నడుస్తోంది. సమాజాన్ని, సాహిత్యాన్ని స్త్రీల దృష్టిికోణంతో విశ్లేషించడంలో భూమిక విజయం సాధించిందనే నేను భావిస్తున్నాను. ”మనకు తెలియని మన చరిత్ర”తో మొదలైన చరిత్రను స్త్రీల దృష్టికోణంతో తిరగరాసే కార్యక్రమాన్ని భూమిక ముందుకు తీసుకెళుతోంది. ముఖ్యంగా తెలుగులో మొదటి ఆధునిక కథ రాసిన భండారు అచ్చమాంబను తెరవెనుక నుంచి, చరిత్ర చీకటిలోంచి  వెలుగులోకి తెచ్చింది భూమిక. ఈ రోజు తెలుగులో తొలి కథ రాసింది భండారు అచ్చమాంబేనని సప్రమాణంగా రుజువు చేసి, తెలుగు కథకు వందేళ్ళు కాదు 110 ఏళ్ళు అని ఢంకా బజాయించి చెప్పగలిగింది భూమిక. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందని చెప్పిన గురజాడ మాటను భూమిక ఆచరించి చూపించింది.
ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ప్రస్తుతం భూమిక అంటే ఒక పత్రికే కాదు. భూమిక పేరుతో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. భూమిక హెల్ప్‌లైన్‌ ఈ రోజు ఎందరో బాధిత మహిళలకి ఆసరాగా వుంది.స్త్రీల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసే ఎన్నో సామాజిక సమస్యలపై ప్రత్యేక సంచికలు తేవడంతో పాటు, ఆయా అంశాల మీద రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించాం. ముఖ్యంగా ప్రేమ పేరిట జరుగుతున్న ఆసిడ్‌దాడులు, పనిచేసేచోట లైంగిక వేధింపులు, లింగనిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిండాల హత్యలు, ఐపిసి 498ఏ కి వ్యతిరేకంగా జరుగుతున్న విష ప్రచారంలాంటి అంశాల మీద రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాం. సమాజంలోని అన్ని రంగాలలోను – న్యాయవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, పోలీస్‌ వ్యవస్థలలో వేళ్ళూనుకుని వున్న ”జండర్‌ ఇన్‌సెన్సిటివిటీ ” తగ్గించడానికి ఆయా శాఖలకి జెండర్‌ శిక్షణనివ్వడం, స్త్రీలకు అందుబాటులోకి వుండేలా సపోర్ట్‌ సిస్టమ్స్‌ని పనిచేయించడం లాంటి కార్యక్రమాలను భూమిక చేపట్టింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో గృహ హింస నిరోధక చట్టం 2005 పకడ్భందీగా పనిచేయడం కోసం కృషి చేస్తున్న సంస్థల్లో భూమిక అగ్రభాగాన వుందని నేను సగర్వంగా చెప్పగలను. భూమిక ఏం సాధించింది అని అంచనా వేసేటపుడు పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.
5. భూమికకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
భూమికలాంటి సీరియస్‌, స్త్రీవాద, ప్రత్యామ్నాయ పత్రికకు అన్నీ ఇబ్బందులే వుంటాయి. భూమిక ప్రయాణం నల్లేరు మీద బండి ప్రయాణం కాదు. ఆర్థిక ఇబ్బందులతో పాటు భూమిక స్థాయికి నిలబడే రచనల కొరత ఎపుడూ వుంది. ఎనభైలలో ఉవ్వెత్తున ఎగిసిపడిన స్త్రీవాద ఉద్యమస్ఫూర్తితో వందలాది మంది స్త్రీలు రాయడం మొదలుపెట్టారు. ఆ ఉధృతి ఇప్పుడు లేదు. ఆంగ్ల భాషలో వచ్చినట్టుగా ప్రపంచీకరణ విధ్వంశం గురించి తెలుగులో విశ్లేషణాత్మకంగా రచనలు రావడం లేదు. ప్రపంచీకరణ పరిణామాలు కథలో, కవిత్వంలో వ్యక్తమైనంతగా వ్యాసంలో రావడం లేదు. ‘అభివృద్ధి’ విధ్వంశ నమూనా గురించి, సెజ్‌ల గురించి రావాల్సినవన్ని రచనలు రావడం లేదు. ఈ అంశాలపై భూమిక ఎన్నో  రచనలను ప్రచురించింది. ఇంకా లోతైన రచనలు రావాలి. కానీ విషాదం ఏమిటంటే తెలుగులో ఎక్కువమంది ఈ అంశాలపై రాయడం లేదు. అది భూమికలాంటి పత్రికలకు చాలా ఇబ్బందికరమైన అంశం.
ఇక ఆర్థిక ఇబ్బందుల విషయానికొస్తే తొలినాటి నుంచి వున్నవి ఇంకా కొనసాగుతూనే వున్నాయి. పుస్తకం కొని చదివే అలవాటు, చందా కట్టి సగౌరవంగా ఇంటికి పత్రికను తెప్పించుకునే అలవాటు మన తెలుగువాళ్ళల్లో చాలా తక్కువ. చందా కట్టగలిగిన వాళ్ళు కూడా ”కాంప్లిమెంటరీ” కాపీలు ఆశిస్తారు. చందా కట్టమంటే కోపాలొస్తాయి. అయినప్పటికీ భూమికను ఆర్థికంగా ఆదుకుంటున్నవారు చాలామంది వున్నారు. వారి గురించి సంపాదకీయంలో ప్రస్తావించాను.
6. సంపాదకురాలిగా భూమిక మీకు ఏమి నేర్పింది?
ఇరవై సంవత్సరాల పాటు ఒక స్త్రీవాద పత్రికకి సంపాదకురాలుగా వుండడం సామాన్య విషయంకాదు. నేను భూమికకు ఎడిటర్‌నే కాదు. భూమిక స్వంతదారును. అంటే యాజమాన్యంకూడా నేనే. యాజమాన్యపరమైన సమస్యలతోపాటు, సంపాదకురాలిగా రచనలు విషయం,ఎంపిక, ఎడిటింగ్‌ నేను చూసుకోవాలి. నా జీవితానికి సరిపడిన అనుభవాన్నిచ్చిందీ సంపాదకత్వం. అసలు భూమిక తొలి సంచికలో సంపాదకురాలిగా నా పేరు రావడానికి ముందు ఎవరు సంపాదకులుగా వుండాలనే దానిమీద అప్పటి బృందంలో ప్రత్యేకంగా చర్చ జరగలేదు. నన్ను ఏకగ్రీవంగా, సంపాదకురాలుగా ఎంపిక చేసారు. ఇంతటి ఉన్నత స్థానాన్ని నాకు అందించడం వెనుక ఆనాటి బృందం ఆలోచన ఏమిటో నాకు తెలియదు. బహుశ అప్పటికే ”లోహిత” నడిపిన అనుభవాన్ని, స్త్రీవాద చర్చల్లో పాల్గొంటూ, విస్తృతంగా రాస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వుండొచ్చు.
7. స్త్రీవాద సాహిత్యానికి ఈ పత్రిక చేసిన దోహదమేమిటి?
స్త్రీవాద పత్రిక పేరుతో వెలువడుతున్న భూమిక ఫక్తు స్త్రీవాద పత్రికే. ఎనభైలలో తీవ్ర ఉధృతితో సాగిన స్త్రీవాద ఉద్యమానికి, స్త్రీవాద రచయిత్రులకు భూమిక వేదికైంది. స్త్రీవాద సిద్ధాంతాన్ని, స్త్రీవాద రచనలను సామాన్య పాఠకుల్లోకి ముఖ్యంగా గ్రామీణ స్థాయి మహిళా సంఘాల సభ్యుల్లోకి భూమిక తీసుకెళ్ళగలిగింది. ఈ ఇరవై సంవత్సరాలలో స్త్రీవాద సాహిత్యాన్ని విశేషంగా వృద్ధి చేసింది భూమిక. భూమికలో ప్రతి రచన స్త్రీవాద దృష్టికోణంతోనే వుంటుంది. మామూలు స్త్రీల పత్రికల్లో వుండే అందచందాలు, కుట్లు అల్లికలు, గృహాలంకరణలు, కేశాలంకరణలు లాంటి అంశాలకు భూమికలో చోటు లేదు. స్త్రీవాద సాహిత్యానికి భూమిక గొప్ప దోహదం చేసిందనే నేను భావిస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. భూమికలో వచ్చిన రచనల మీద, సాహిత్య, సమాజాల మీద వాటి ప్రభావం ఏ విధంగా పడింది అనే ఆంశం మీద ఇప్పటికే పద్మావతి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎం.ఫిల్‌, పి.హెచ్‌డి కోసం పరిశోధన పత్రాలు సమర్పించారు.
8. భూమిక నిర్వహణలో తోడ్పాటునిచ్చినవారెవరు?
భూమిక నిర్వహణ కోసం మొదట్లో కార్య నిర్వాహక వర్గం వుండేది. క్రమంగా అది ఉనికి కోల్పోయింది. ప్రస్తుతం అలాంటి కార్యనిర్వాహక కమిటీ లాంటిదేదీ లేదు. ప్రారంభం నుంచి వున్న అడ్వయిజరీ కమిటీ ఉంది. సంపాదక మండలి వుంది.కానీ భూమిక నిర్వహణలో వీరి పాత్ర పరిమితంగానే వుంటుంది.  ఇటీవల శిలాలోలిత వర్కింగ్‌ ఎడిటర్‌గా చేరింది. తను ఉద్యోగస్థురాలు కాబట్టి నెలకు రెండు మూడు రోజులు భూమిక పనిని పంచుకుంటుంది. అయితే అబ్బూరి ఛాయాదేవి, పి. సత్యవతి, వి. ప్రతిమ, సమత లాంటి ఆత్మీయ మిత్రుల మాట సాయం ఎపుడూ వుంటుంది. ఛాయాదేవి గారు చాలాసార్లు ఫ్రూప్‌లు దిద్దిపెడుతుంటారు. అలాగే ఆర్‌. శాంతసుందరిగారు కూడా చాలా సహకరిస్తుంటారు.
9.  భూమికకు ఉన్న బలం/ బలహీనతలేమిటో చెప్పండి?
భూమికకు వున్న బలహీనత బహుశా స్త్రీవాద పత్రిక అనే ట్యాగ్‌లైన్‌. చాలామంది ఆ ట్యాగ్‌లైన్‌తీసేసి స్త్రీల పత్రిక అని పెట్టమని సలహాలు కూడా యిచ్చారు. కానీ అదే భూమిక బలం కూడా. ఎక్కడా రాజీ పడకుండా, కమర్షియల్‌ ఛాయ భూమిక మీద పడకుండా సంపాదకీయం మీద ఎవరి వొత్తిడి తగలకుండా నిలబెట్టుకోగలగడంలోనే భూమిక బలముంది.
10. భూమిక వ్యక్తిత్వాన్ని మీరెలా అంచనా వేస్తారు?
భూమిక వ్యక్తిత్వం…అంటే…ఇరవై ఏళ్ళ క్రితం ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన భూమిక ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను దాటి, అన్వేషి మీద అన్నింటికీ ఆధారపడిన స్థితిని దాటి ఈ రోజు స్వయంపోషకంగా, స్వయం ప్రకాశంతో ధీమాగా నిలబడింది. తడబడిన అడుగుల్ని నిగడదన్ని మరీ నిటారుగా నిలబెట్టుకుంది. నా స్వభావంలో వున్న ధిక్కారం, నదురు బెదురులేని తనం సహజంగానే భూమికలోకి ప్రవహించాయి. దానికి రుజువులు నేను రాసిన సంపాదకీయాల్లోనే వున్నాయి. భూమిక ఈ రోజు బాధిత స్త్రీల పక్షాన అక్షరాన్నే కాదు, ఆచరణని ఆవిష్కరిస్తోంది. సమస్యల నెదుర్కొంటున్న స్త్రీలకి చేయూత నిచ్చే స్థితికి భూమిక ఎదిగింది. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో కూడిన వ్యక్తిత్వాన్ని నేను భూమికలో చూస్తాను.
11.ఈ రెండు దశాబ్దాలలో ప్రత్యేక సంచికల్లో మీకేది నచ్చింది?
నాకు నచ్చిన ప్రత్యేక సంచిక ఏదని చెప్పమంటారు. అన్నీ నాకు యిష్టమైనవే. తెలంగాణా ప్రత్యేక సంచిక మరింత యిష్టమైంది. ఆ సంచిక కోసం జరిగిన ఉమ్మడి కృషిి ఆ సంచిక ప్రతి పేజీలోను కనిపిస్తుంది. మీ తోడ్పాటుతో తెచ్చిన హెెచ్‌ఐవి/ఎయిడ్స్‌ ప్రత్యేక సంచికలు నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. మొదటి సంచిక చేస్తున్నపుడు, సెక్స్‌వర్కర్లు, హెచ్‌ఐవి బాధితులు చెప్పిన కథనాలు విన్నాక, వాటిల్లోని విషాదానికి, దు:ఖానికి తట్టుకోలేక నాకు మెంటల్‌ బ్రేక్‌డవున్‌ వచ్చింది. సైకియాట్రిక్‌ హెల్ప్‌ కూడా తీసుకున్నాను. నల్గొండలో యురేనియం ప్రాజెక్టును ప్రతిపాదించినపుడు తెచ్చిన ప్రత్యేక సంచిక, జడుగోడ అనుభవాలు, వ్యవసాయ విధ్వంశం, చేనేత కుంగుబాటు, ప్రపంచీకరణ పరిణామాలు- ఇలా  ఒక్కో ప్రత్యేక సంచిక ఒక్కో అనుభవాన్ని నాలో మిగిల్చింది. రచయిత్రుల ప్రత్యేక సంచిక కోసం పడిన శ్రమ మరి దేనికీ పడలేదు. దశాబ్ది ప్రత్యేక సంచికకోసం కూడా ఎంతో కష్టపడ్డాను.
12. భూమిక ఇంకా చేరవలసిన పాఠకులెవరు?
ఇంకా ఎంతోమందిని భూమిక చేరవలసి వుంది. ప్రింట్‌ ఎడిషన్‌ తెలుగునేల నలువైపులా విస్తరించలేదు కానీ భూమిక వెబ్‌ మాగజైన్‌ మాత్రం ప్రపంచం నలుదిక్కులా వున్న తెలుగు వారిని చేరింది. దాదాపు అన్ని ఖండాలలోని తెలుగు వాళ్ళు వెబ్‌ మ్యాగజైన్‌ని చదువుతారు. రోజుకి కనీసం ఏభైమంది చదివినట్టు వెబ్‌సైట్‌లో నమోదు అయివుంటుంది.అయితే ప్రింట్‌ ఎడిషన్‌ చదివేవాళ్ళు తక్కువే. అయితే ఇక్కడ ఒక విశేషం వుంది. ఆంధ్రప్రదేశ్‌లోని స్వచ్ఛంద సంస్థలన్నింటికీ భూమిక వెళుతుంది. సంఘాల మహిళలు ఒక్క కాపీని ఇరవై మంది లెక్కన చదువుతారు. ఒకరు చదివితే మిగతావారు వింటారు. ఆ విధంగా భూమికకి రీడర్‌షిప్‌ వుంది. భూమిక ఇంకా చాలామందిని, చాలా వర్గాలని చేరాల్సి వుంది.
13. భూమిక ద్వారా సాహిత్యంలోకి వచ్చినవారెవరైనా వున్నారా?
భూమిక ద్వారా సాహిత్యంలో వచ్చినవారు చాలామందే వున్నారు. భూమిక ప్రతి సంవత్సరం నిర్వహించే కథ, వ్యాసం, కవిత్వం పోటీలద్వారా ఎందరో కొత్త రచయిత్రలు సాహిత్యంలోకి వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఒక అంశం పేర్కొవాలి. 1999 లో భూమిక , అన్షేషి సంయుక్త ఆధ్వర్యంతో ”తెలుగు కథ-గమనం-గమ్యం ” మీద మూడు రోజుల పాటు ఒక వర్క్‌షాప్‌ నిర్వహించాం. ఆ వర్క్‌షాప్‌ సందర్భంలో ఎంతో మంది కొత్త రచయితలు వెలుగులోకి వచ్చారు.  అపుడే కొత్తగా రాయడం ప్రారంభించిన  వి. ప్రతిమ, అనిశెట్టి రజిత, తుర్లపాటి లక్ష్మి, శిలాలోలిత లాంటి వాళ్ళు ఈ వర్క్‌షాప్‌కి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళంతా చాలా ఉధృతంగా రాయడం మొదలుపెట్టారు. రచయిత్రుల మధ్య మంచి స్నేహసంబంధాలు ఏర్పడ్డానికి కథా వర్క్‌షాప్‌ చాలా దోహదం చేసింది.
14. భూమికకు ఇతర స్వచ్ఛంద సంస్థల దోహదం ఏమైనా ఉందా?
భూమికకు  చాలా స్వచ్ఛంద సంస్థలు సాయపడ్డాయి. ముందుగా చెప్పుకోవాల్సింది అన్వేషి గురించి, ఆ తర్వాత ‘నిర్ణయ’ అనే సంస్థ, ఆ సంస్థ బాధ్యులు ఇందిరాజెన. అలాగే సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ సంస్థ. వారి కోసం ”స్త్రీల రాజకీయ భాగస్వామ్యం” ప్రత్యేక సంచికను కూడా తీసుకొచ్చాం. ప్రస్తుతం ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా, భూమిక హెల్ప్‌లైన్‌ ఏర్పాటుద్వారా భూమికకు సహకరిస్తున్నది ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థ. నిజానికి 2006లో ఏర్పాటైన హెల్ప్‌లైన్‌ బాధిత మహిళలకే కాకుండా, భూమిక పత్రికకి ఎంతో ఊరట నిచ్చింది. ఇంతకన్నా దీని గురించి వివరంగా చెప్పలేనండి.
15. భూమిక స్టాఫ్‌ గురించి మీ మాటల్లో?
భూమిక స్టాఫ్‌?? ప్రసన్న తప్ప భూమికకి వేరే సిబ్బంది ఎవరూ లేరు. భూమికకి గొప్ప టీమ్‌ వుంది. అందులో వాలంటీర్స్‌, అడ్వకేట్లు, రచయితలు వున్నారు. సర్క్యులేషన్‌ చూసుకునే లక్ష్మి ప్రకటనల వేటలో తిరుగుతుంటుంది.  ప్రసన్నకి తప్ప ఎవ్వరికీ జీతాలిస్తున్నది కూడా లేదు. రచనల సేకరణ, ఎంపిక, డి.టి.పి, లే అవుట్‌, కవర్‌పేజీ డిజైన్‌, ప్రింటింగ్‌, పోస్టింగ్‌ ఈ పనులన్నింటిని అందరం కలిసి చేసినా ఎనభైశాతం ప్రసన్నే చేస్తుంది. భూమిక పత్రిక తేవడంలో, ఎన్నో కార్యక్రమాల నిర్వహణలో, యాత్రల ఏర్పాటులో భూమిక టీమ్‌ సమిష్టి కృషి అద్వితీయంగా, అనితర సాధ్యంగా వుంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు.
16. భూమిక తెలుగు సమాజానికిచ్చిన చైతన్యం ఎటువంటిది?
తెలుగు సమాజం మీద, సాహిత్యం మీద స్పష్టమైన ముద్ర వేసింది భూమిక. దాని మీద లోతైన అధ్యయనం చెయ్యాల్సింది మీలాంటివాళ్ళు. భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా ఎక్కడో మారుమూల ప్రాంతంలో హింసకు గురయ్యే స్త్రీని రక్షించగలం. ఆ ప్రాంత పోలీసులతో, రక్షణాధికారులతో, న్యాయాధికారులతో మాట్లాడగలం. జిల్లా కలెక్టర్లతో, జిల్లా ఎస్‌పిలతో సైతం ధైర్యంగా మాట్లాడగలం. స్త్రీలు, చట్టాలు, సహాయ సంస్థల పేరుతో తెచ్చిన భూమిక ప్రత్యేక సంచికను పన్నెండువేల కాపీలు వేసి అంగన్‌వాడి నుండి కలెక్టర్‌ వరకు పంచాం. ఈ రోజు భూమిక గురించి చాలా మందికి తెలుసు. అలాగే ”లాడ్లీమీడియా” ప్రాజెక్టుద్వారా గత నాలుగు సంవత్సరాలుగా మీడియా మీద స్పష్టమైన ముద్ర వేయగలిగాం. ఆడపిల్లల హక్కుల గురించి, లింగ నిర్థారణ  పరీక్షలకు వ్యతిరేకంగా ‘లాడ్లీ’ ద్వారా చేసిన ప్రచార ప్రభావం ఎన్నో తెలుగు ఛానళ్ళలో చూడొచ్చు. ఆడపిల్లల మీద ప్రసారమౌతున్న అర్థవంతమైన ప్రకటనల్ని, జండర్‌ స్పృహతో వస్తున్న కొన్నికార్యక్రమాలను గమనించవచ్చు. తెలుగు సమాజంమీద, సాహిత్యం మీద , పరిపాలన వ్యవస్థ మీద, న్యాయవ్యవస్థమీద, పోలీసువ్యవస్థమీద ముఖ్యంగా మీడియా మీద భూమిక ప్రభావం వుందని నేను నమ్ముతున్నాను.
17. భూమిక భావజాలం/సిద్ధాంతం/దృక్పథం?
భూమిక భావజాలం స్త్రీవాద భావజాలమే. స్త్రీల దృష్టికోణమే భూమిక ఆచరణ. హింస లేని సమాజం స్త్రీల హక్కు అని భూమిక నమ్ముతుంది. అన్నింటా సమానత్వం- కుటుంబంలో, సమాజంలో, ఆస్తిలో, పరిపాలనలో, సమస్తంలోను 50:50. స్త్రీల అంశాలను స్త్రీవాద దృష్టికోణంతో విశ్లేషించడమే భూమిక దృక్పథం.
18. భూమిక స్థాపనా లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి?
భూమిక స్థాపనా లక్ష్యాలు చాలా వరకు నెరవేరాయనే నేను అనుకుంటున్నాను. భూమిక తొలి సంచికలో మేము ప్రకటించిన భూమిక ఉద్దేశ్యాలు, లక్ష్యాలు మీరు పరిశీలిస్తే, మేము ఈ ఇరవై సంవత్సరాల్లో చేసిన కృషిని వాటి పక్కన పెట్టి అంచనా వేస్తే మేము చాలావరకు మా ఉద్దేశ్యాలను నెరవేర్చామనే అనుకుంటున్నాను. మిగిలిపోయినవేమిటో సమీక్షించుకోవడానికి కూడా ఈ ప్రత్యేక సంచిక సందర్భం ఉపకరిస్తుంది. తప్పకుండా వాటికోసం కృషి చేస్తాం.
19. పట్టణ పాఠకులను దాటి భూమిక ఎందుకు విస్తరించలేకపోయింది?
ఈ ప్రశ్నని నేను ఒప్పుకోనండి. భూమిక పాఠకులు పట్టణాల్లోకన్నా, పల్లెల్లో ఎక్కువ వున్నారు. అట్టడుగు స్థాయిలో   పనిచేసే  మహిళా సంఘాలలోకి భూమిక వెళ్ళింది. ఒక్కొక్కరు  ఒక కాపీని చదవకపోవచ్చు కానీ ఒక్క కాపీని ఇరవై మంది చదువుతారు, చదువొచ్చిన వాళ్ళు చదివితే వింటారు. దాని మీద చర్చిస్తారు. దీనికో మంచి ఉదాహరణ లక్నోలో గృహహింస మీద తిరగబడిన గ్రామీణ స్త్రీల సంఘం ”గులాబీగ్యాంగ్‌” గురించి రాసిన సంపాదకీయం కరీంనగర్‌లో సంఘాల మహిళల్ని గృహహింసకి వ్యతిరేకంగా పోరాడేలా  కదిలించింది. మైక్రోఫైనాన్స్‌కి వ్యతిరేకంగా నేను రాసిన ”గంగకి వరదొచ్చింది” అనే కథ  భూమికలో ప్రచురించినది కృష్ణాజిల్లాలోని ఇందిరా క్రాంతి పథం స్త్రీలను కదిలించింది. ఆ కథని కాపీలు చేసి పంచారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలున్నాయి.
20. అన్ని స్వచ్ఛంధ సంస్థల్లాగానే భూమికకు విదేశీ నిధులొస్తాయా?
లేదండి. భూమిక పత్రికకు  ఈ ఇరవై  ఏళ్ళల్లో ఎపుడూ విదేశీ నిధులు రాలేదు. భూమిక రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌పేపర్స్‌ కింద రిజిస్టర్‌ అయ్యింది. ఫారిన్‌ ఫండింగ్‌ తీసుకోకూడదు. ఎఫ్‌సిఆర్‌ఐ నిబంధనల ప్రకారం కూడా మ్యాగజైన్సు, పత్రికలు విదేశీ నిధులు తీసుకోకూడదు. భూమిక పత్రిక కేవలం చందాలు, విరాళాలు, ప్రకటనల మీదే ఆధారపడి నడుస్తోంది. విదేశీ నిధులున్నాయనుకోవడం నిజం కాదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. విదేశీ నిధులు తీసుకుంటే ఆర్థికంగా ఇంత గడ్డు స్థితి ఎందుకుంటుంది? మీరే ఆలోచించండి..
విధేయ విద్యార్థినిలాగా ప్రశ్న తర్వాత ప్రశ్నకి సమాధానాలు తడుముకోకుండా చెప్పారు. ఆమె మాట్లాడుతున్నంత సేపూ పట్టుదల, సంకల్పం, దృఢచిత్తం సమానస్థాయిలో కనిపించాయి. భూమిక ఇపుడు ఇరవై ఏళ్ళ బిడ్డ. ఎటు అడుగేయాలో,ఎందుకేయాలో, క్షుణ్ణంగానే తెలుసు. తెలుగు నాట పత్రికలకు చందాలుకట్టి తెప్పించుకుని చదివే తరం అంతరించింది. కాంప్లిమెంటరీ కాపీ పంపినా విప్పిచూడని, విఫులంగా చదివే తీరికలేని పాఠకులున్న తరుణంలో భూమికను మరింత బలోపేతం చేసే దృక్పథం కల వ్యాసాలు, రచనలు రావలసివుంది. భూమిక ఇపుడు తన రూపం, సారం కొంత మార్చుకుని కళాశాలల ప్రాంగణాల్లోకి చేరాల్సి వుంది. గిడసబారిన పాఠకుల చేతుల్లోకంటే అది కొత్త తరం పాఠకుల చేతుల్లో వుండడం అవసరం. ఈ తరం నించి మరికొంత సృజనశీలత కలిగిన వ్యక్తులు రూపుదిద్దుకోవలసివుంది. డిగ్రీ కళాశాల వేదికగా భూమికను విద్యార్థులతో పరిచయం చేసే ఒప్పందం సత్యవతిగారితో కుదుర్చుకుని, ఖమ్మం తిరుగు ప్రయాణమయ్యాను. బస్సులో  ప్రయాణిస్తున్నపుడు భూమిక గురించి అనేక కొత్త ఆలోచనలు, సరికొత్త శీర్షికలు తట్టాయి. మనలో కొంతమందైనా భూమికకు రచనల్లో వెన్నుదున్నగా నిలవాల్సి వుంది. ఒక గర్ల్‌ ఛైల్డ్‌నే కాదు రక్షించుకోవలసింది భూమికలాంటి మహిళల పత్రికను కూడా కాపాడుకోవాలి మరో రెండు దశాబ్దాలపాటు.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.