కొండవీటి సత్యవతి
”భూమి పలికితేే ఆకాశం నమ్మదా?” అంటూ నలభై మంది రచయిత్రుల ముందు కన్నీటి సంద్రాలైన వాకపల్లి అత్యాచార బాధిత మహిళల గుండె ఘోషను విని, విశ్వసించిన మహిళా న్యాయమూర్తికి జేజేలు పలకాల్సిన తరుణమిది.
ఎలాంటి గాయాలు, వీర్యఅవశేషాలు లేవంటూ అబద్ధపు రిపోర్టులిచ్చిన పోలీసుల్ని నమ్మకుండా, ఎలాంటి గాయాలు లేకుండా అత్యాచారం జరగొచ్చు అంటూ కాగ్నిజబుల్‌గా యువ మేజిస్ట్రేట్ కేసును తీసుకోగానే నిందిత పోలీసులు 2008లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టే పొందారు. అప్పటినుండి కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన నిలిచిపోయింది.
నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసు హైకోర్టులో ఫైనల్ హియరింగ్‌కి వచ్చింది.పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిందిత పోలీసుల తరఫు న్యాయ వాది తమ పాత వాదనలే విన్పించినప్పటికీ, గిరిజన మహిళ తరఫున వాదిస్తున్న బొజ్జా తారకంగారు తమ వాదనని బలంగా విన్పిస్తూ బాధిత మహిళల మీద గాయాలే లేవని, వీర్యాల అవశేషాలు లేవని కారణం చూపిస్తూ ప్రాసిక్యూషన్ అవసరం లేదనడం భావ్యం కాదని, నిందితుల్ని ప్రాసిక్యూట్ చెయ్యడానికి ఈ కారణం అడ్డంకి కాదని వాదించారు. కోర్టు బాధిత స్త్రీల స్టేట్‌మెంట్‌ని నిర్ద్వంద్వంగా నమ్మి తీరాలని కూడా వాదించారు.
ఈ వాదనని అంగీకరించిన జస్టిస్ శేషశయనారెడ్డి బాధితులకు అనుకూలంగా స్పందించి తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులైన 21 మంది పోలీసుల్లో 13 మంది మీద కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేపట్టాల్సిందిగా ఆదేశాలు యిచ్చారు న్యాయమూర్తి.
వాకపల్లి గిరిజన మహిళలపట్ల అమానుషంగా వ్యవహరించిన 13 మంది పోలీసులు సామూహిక అత్యాచారం, ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ చట్టం కింద నేరారోపణలతో విచారణని ఎదుర్కొబోతున్నారు.
గిరిజన మహిళలు చేసిన దీర్ఘకాలిక న్యాయపోరాటం, మహిళా, పౌరహక్కుల సంఘాల సంఘీభావం, ”మీ పక్షాన మా అక్షరాలను మోహరిస్తామంటూ” వాకపల్లి మహిళల పక్షాన నిలిచిన నలభైమంది రచయిత్రుల స్పందన వల్ల ఈ రోజు హైకోర్టులో ఈ ఆశావహక నిర్ణయం వెలువడింది. కొద్దిపాటి సాక్ష్యముంటే చాలు ”న్యాయనిర్ణయాలు” (అతిఖిరిబీరిబిజి ఖిలిబీరిరీరిళిదీ ) చెయ్యొచ్చని రుజువు చేసిన పాడేరు మేజిస్ట్రేట్‌కి, హైకోర్టు న్యాయమూర్తికి బాధితుల తరఫున వందనాలు. అభివందనాలు.