మూలె విజయలక్ష్మి
పేరు ఏదైతేనేం! ఆంధ్రదేశంలో ప్రాంతం ఏదైతేనేం! వ్యవస్థ ఏదైతేనేం! మహిళలు బసివి, జోగిని, మాతమ్మ పేర్లతో పురుషుని భోగలాలసతకు, మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు బలవుతున్నారు. గ్రామాల్లో కరువు కాటకాలు ఏర్పడినా, రోగం రొష్టు వచ్చినా, మగ బిడ్డలు పుట్టకపోయినా గ్రామదేవతకు ఆడపిల్లను అర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతుంది. ఆరునెలల పసికందు నుండి పదహారేండ్లలోపే ఈ కూపంలోకి నెట్టబడుతున్నారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మాతమ్మ, మరియమ్మ, ఉలగమ్మ, సుంకాలమ్మ దేవతలకు దళిత వెనుకబడిన వర్గాల్లో ఆడపిల్లలను అర్పిస్తున్నారు. దేవతకు అర్పించిన బిడ్డ నిత్య సుమంగళిగా పరిగణింపబడుతుంది. కానీ అవివాహితగా, ఊరుమ్మడి సొత్తుగా జీవితం వెళ్ళమార్చాల్సి వస్తుంది. తెలంగాణాలో జోగినులు శవ యాత్రలో నృత్యం చేస్తారు.
జోగిని చేయడంలో గ్రామ పెద్దల ప్రమేయం ఉంటుంది. జోగినిని చేయాలనుకున్న అమ్మాయికి గ్రామ దేవతతో వివాహం జరిపించటం జోగుపట్టం. గ్రామదేవతకు బదులుగా పోతురాజు తాళికడతాడు. జోగినుల్లో వృద్ధురాలు కూడా మంగళ సూత్రం కట్టవచ్చు. మాతంగి కయితే అమ్మాయి మేనమామ, పెద్దమాదిగ, లేదా పెద్దగొల్ల మంగళ సూత్రధారణ చేస్తారు.
మరో కార్యక్రమం మైలపట్టం. జోగిని జోగుపట్టంలో ఖర్చు భరించిన వ్యక్తి మైలపట్టం నిర్వహిస్తాడు. సాధారణంగా భూస్వాములు, పెత్తందార్లు, అమ్మాయి రజస్వల అయిన తర్వాత మంచి రోజు చూసి అతనితో సమాగమం ఏర్పాటు చేస్తారు. తర్వాత అతనితో ఉండవచ్చు. ఆ రాత్రికే పరిమితమై ఊరుమ్మడి బతుకుకావచ్చు. జోగిని, మాతంగి వంటి దురాచారాలను రూపుమాపడానికి ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నా ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆచారం అమానవీయం, అసాంఘికం, నాగరిక సమాజానికి సిగ్గుచేటు.
తెలుగు కథా సాహిత్యాన్ని అవలోకిస్తే సమాజంలోని ఈ దురాచారాన్ని ఎత్తిచూపించిన కథలు పురిసెడు కూడా లభించవు. నాగప్పగారి సుందర్‌రాజు ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యెద’ (1997) ఐతా చంద్రయ్య కలికి గాంధారి (2001), గోగుశ్యామల రడం (2004), డా|| ముత్యం వెంకన్న దరిలేని బావులు (2006) ఈ జోగిని సమస్యపై దృష్టి పెట్టిన కథలు.
తరతరాలుగా సాగుతున్న జోగిని దురాచారానికి తన బిడ్డ జీవితం బలి కాకూడదని, హత్య చేసి, జైలు పాలయిన ఒక తల్లి గాథ కలికి గాంధారి. ఇది తరతరాలుగ జరుగుతున్న తంతు. ఆ ఆడబిడ్డకు దేవున్తో పెండ్లి, ఆనాటి ఊరుమ్మడి బతుకు. బలమున్న వానిదే పైచేయి. గాంధారి తల్లిది అదే పరిస్థితి. ఆ ఊరి జమిందారు రంగారావుదే ఆమెపై పెత్తనం. వారికి కల్గినబిడ్డ గాంధారిని బడికి పంపించారు. అమ్మ, అమ్మమ్మ అందుకు దొరచేతిలో చావుదెబ్బలు తిని కన్ను మూసింది అమ్మమ్మ. రంగారావు గతించాడు. పద్నాలుగేండ్లకు గాంధారికి పెండ్లి జరిగింది దేవున్తో. జమిందారు కొడుకు ఎల్లారావు తయారయ్యాడు. వావి వరుసలు చెప్పినాచెవికెక్కించుకోలేదు. గాంధారికి బిడ్డ కలిగింది. పిల్ల పేరు మేనక. మేనక పట్నంలో చదివింది. టీచర్ రఘురాం ఆమెను ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానన్నాడు. ఇంటికొచ్చిన మేనకను ఒకరోజు ఎల్లారావు కొడుకు కమలాకర్రావ్ బలాత్కరించబోయాడు. గాంధారి కాళికయింది. కమలాకర్రావ్ గాంధారి చేతిలో హతుడయ్యాడు. ఫలితంగా గాంధారి జైలు పాలయ్యింది. మేనక రఘురాంలు పెళ్ళి చేసుకున్నారు. వారికొక కొడుకు. గాంధారికి శిక్ష ముగిసి విడుదలయ్యే రోజుకు అదే జైలుకు సూపర్నెంటు ఎల్లారావు. భార్య చనిపోయిందని, గాంధారి సమ్మతిస్తే భార్యగా స్వీకరిస్తానని ప్రాధేయ పడతాడు. ”ఇయ్యాల భార్య వంటావు, రేపు జోలె పట్టుకునే జోగిని వంటావు”. ”ఇంకా మనం పశువులోవలె ఉండొద్దు. చూడుదొరా! భారతంలో గాంధారి కండ్లున్నా గుడ్డిదై కొడుకుల్ని చంపుకుంది. కాని… కాని నేను కలియుగములుంటున్నా… కలికి గాంధారిని… నీ కొడుకు చావంగనే నీ వంశం ఖతమైంది. కాని నా మనుమనితో నా వంశం శురువైంది. తెల్సుకో! ”నీ తొవ్వనీది, నా తొవ్వ నాది” ఖాండ్రించి ఉమ్మి గాంధారి గిరుక్కున వెను దిరిగింది.
కన్న బిడ్డను జోగిని చేయడానికి ఇష్టపడక, బిడ్డకు చదువే ముఖ్యమనుకొని ఆస్తిపాస్తులను వదులుకొని ఊరొదిలిన దంపతుల గాథ ‘రడం’.
చంద్రయ్య దళితుడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఆడ బిడ్డను చదివించాలనుకున్నాడు కాని ఆ ఆడబిడ్డను జోగిని చేయాలని పెద్దకులపు పటేళ్లు పట్టుపట్టారు. అంతకు ముందున్న జోగిని వృద్ధాప్యం వల్ల రంగమెక్కి కొలువు చెప్పలేకపోతోంది. ఆమె వుండగానే పద్ధతులన్నీ చెప్పించాలని చదువు ఆపేయమన్నారు.
”రేపటి ఊరడమ్మ పండగకు రంగమెవ్వరెక్కుతరు? పోలపల్లిలో ‘సిడి’ ఎవరు కడ్తరు? మనరార్ల జోగుకిడిసిన లస్మి (లచ్చి) ముసల్దయింది. దానికి కొలుపు జెప్ప నుడుగులు డొల్లకొచ్చినయి. ఊర్ల శానామందికి అమ్మవారు పోసినపుడు ఊరడమ్మకు జీవులను, దున్నపోతులను కోసి పెద్ద పచ్చితునకను జోగిని నోట్ల వేలాడదీసి ఊరుసుట్టు దీపాలంటే ఏడ వషవడ్డది. ఈ ముసల్దాని కాల్లు సుట్టకపోయి వరిబందాలల్ల సుట్టుకోని దిమ్మరపోయి పడ్డది. రంగమెక్కడానికి ముందు దినం నుండే ఉపవాసముండి ఊరడమ్మకాడ కుండమీదెక్కి నిలవడి రంగమెక్కి కొలువు చెప్పాలంటే అట్లట్లనే ఆయె. ఇంగ ‘శిడ’ ఎక్కాలంటే దీనితరమయితదా? యాడయితది. పడుసుపోరీలె ఆగం గాపట్టిరి. ఇదంత గాదురా ఇంకో పిల్లను జోగుకిడ్వాలె.” అన్నారు.
అయినా చలించలేదు చంద్రయ్య. రాత్రికి రాత్రే పట్నంలో హాస్టలులో చేర్చాడు. ఈ సంగతి తెలిసి మండిపడ్డారు పెద్దలు. చచ్చేంత దెబ్బలు కొట్టారు. పెద్దలందరు చేరి జోగిని కిడ్వకపోతే ఊరు విడిచి పెట్టాలని నిర్ణయించారు. అంతేకాదు రెండెకరాల భూమి మీద పటేలు కన్ను పడింది. బిడ్డను జోగినికి విడువాలి లేదంటే భూమిని వదులుకోవాలి చంద్రయ్యది. పంగల నడుమ మేడికాయ పరిస్థితి.
రెక్కలు గట్టిగ ఉన్నన్నాళ్ళు కూలీనాలీ చేసుకొని బిడ్డను చదివించాలని నిర్ణయించుకున్నారు. మడి, మట్టియిల్లు వదిలి కట్టుబట్టలతో పట్నంబాట పట్టినారు. గూడులేని పిట్టలయినారు. ”జోగినిని కానన్నందుకు భూమిని వదులుకున్న నా బాల్యం మా యింటికి, కులానికి, నాకు రడమై నేటికీ సల్పుతుంటది, రడమంటే వ్రణం.
బసివిరాలుగా మార్చే తతంగాన్ని నడిమింటి బోడెక్క బసివిరాలయ్యెద కథలో నాగప్పగారి సుందర్‌రాజు పూసగుచ్చినట్టు వివరించారు. వూరి రైతుల ఒత్తిడి, ఆజ్ఞపై మాదిగ కందారప్ప పదేళ్ళ బిడ్డను బసివిరాలుగా వదిలేందుకు సమ్మతించారు. బసివిరాలు చేయడానికి ఖర్చు రెండువేలు. పెద్దరెడ్డి ఒక వెయ్యి, తక్కినది ఊరందరు కలిసి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది అందరికి పండుగ. అమ్మ కార్యం బోడెక్కకు మాత్రం అంతులేని దు:ఖం. ముహూర్తం ఆరెద్దులకార్తి అయిన మూడు దినాలకు. ఆరోజు బోడెక్కకు గంగస్నానం చేయించారు. పాడుబావిలో దించి పాత బసివి రాళ్ళు కడివెడు నీళ్ళు నెత్తినపోసి, ఇంటికాన్నించి కట్టుకొచ్చిన తెల్లచీర, తెల్లరవిక తీసేసి, వేపాకు మండలతో ఒళ్ళంతా చుట్టారు. కాళ్ళకు, చేతులకు ముఖానికి బుక్కుపిండి పూసి, బొట్టుపెట్టి, జుట్టు విరబోసారు.
”అక్కుల్‌జోవ్…జోక్కుల్‌జోవ్…జోగోజోగో” అంటారని మూడుసార్లు ”జోగులు తట్ట” పట్టుకుని బసివిరాళ్ళు అందరు జోగేసిడిసిరి. బోడెక్క తుక్కు తిరిగి మూడుసార్లు, పడమట తిక్కు మూడు సార్లు, తూర్పు దిక్కు మూడుసార్లు తిరిగి మొత్తము తొమ్మిదిసార్లు జోగేసి… ”దోప్‌ఉదో… ఉదోవ్‌ఉదో…” అంటాని జోగులుతట్లు యడమ బుజంమింద పెట్టుకుని కుడిసేత్తో యపాకు మండ్లు పట్టుకుని బసివిరాళ్ళు అందరు క్యాకులేసిడిసే”.
”తప్పట్లతో బసివి రాళ్ళు ఇతర ఆడోళ్ళు బోడెక్కను నడిపించుకొని వూరేగింపుగా సవురమ్మ గుడికి తెచ్చి అక్కడ మా వూర్లో వులిగిమ్మవ్వగుడి లేదు. అంద్కనే సవురమ్మవ్వ గుడిలోనే వొగుమూలుకి జొండ్లు పోసి, జోండ్లు మింద మరువు పెట్టి మరువు మింద ముంతపెట్టి, ముంతమీద పీసుతీసి ట్యంకాయి పెట్టి దానికి మూడు బండారుతో అడ్డుబొట్లు పెట్టి దానిమింద పూలుదండ యేసి దేవుతిని” చేసారు.
టెంకాయ కొట్టి పూజచేసి దేవరపోతుని, బోడెక్కను గుడిచుట్టూ మూడుసార్లు తిప్పి, గుడిముందు నిలబెట్టారు. దేవరపోతుని ఇరగబట్టుకుని ఒక దెబ్బతో తలారి రామిగిరి తలనరికేసాడు. తర్వాత బోడెక్కను గుళ్ళోకి తీసుకుని పోయి పూజచేసి, జోగుళ్ళు యేసినారు. ”పయ్యంత సుట్టిన యాపాకుమండ్లు ఇప్పి ఆదరాబాదరా పసుపు పచ్చచీర, రెయిక తొడిగిచ్చి ద్యావరుకట్ట ముందు నిలబెట్టిచ్చి కర్నుము సామితో కాలు తొక్కిచ్చి బయినే రామన్నతో దావుర్లు కట్టిపిచ్చిడిసి”.
”బోడెక్క ఇంగా పెద్దమనిషి కూడా అయిలేదు కదమ్మా. ఈపొద్దు బసివిరాలుని ఇడిసేరకదా. ఆ ద్యావుర్లు గట్టిన పూజారాయప్ప. కాలుదొక్కిన కర్నుము సామి, కుంకునుమ గట్టిన గరువయ్య ముగ్గురు ముసలినాబట్లు కలిసి, సామి కార్యుమని ఆ పిల్లని ఈ రాతిగిరికే వొగుడయినంక వొగుడు పక్కులో పొండు బెట్టుకుంటారంట. అన్నిము పున్నిము యెరుగని నడిమింటి బోడెక్కిని బసివిరాల్ని సేసి బజారికి యేసిడిసిరి” అంటూ వాపోయింది ఓ తల్లి.
జోగినులని సమాజం చులకనగా చూడటాన్ని నిరసించి, తమ బతుక్కు, తమ బిడ్డల బతుక్కు భవిష్యత్తు బాగుండాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే స్పృహతో భూమికోసం పోరాడిన జోగినుల కథ ”దరిలేని బావులు”
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ రోడ్డు. రోడ్డుకు ఒక వైపు గ్రామం, మరో వైపు మాదిగోల్ల కాలనీ. అక్కడ రెండు వరుసల్లో పన్నెండు సర్కారు ఇళ్లు. అవి జోగోళ్ల ఆవాసం. ముగ్గురు వెనుకబడిన కులాలు, ఇద్దరు చిందోళ్లు మిగతావాళ్లు మాదిగలు.
ఒక్కో మహిళదీ ఒక్కో గాథ. అన్ని గాథల సారాంశం ఒకటే. చిన్నక్కకు పదిహేనేళ్లకు దేవునితో పెళ్ళయింది. ”చిన్నమ్మకు దేవుడి దగ్గర పట్నాలు కట్టిరి. (పండగ జేసిరి). పోతురాజుతోటి చిన్నక్కకు పెండ్లి చేసిరి. తండ్రి వయసున్న ఊరి ”పెద్దమనిషి” లేపుకునె. ఆ పెద్దమనిషితనం మారినప్పుడల్లా చేతులు మారింది చిన్నక్క దున్నపోతుల మధ్య దుడ్డెచందం అయింది బతుకు”.
ఆమె కూతురు లత. జోగుబిడ్డకు చదువా! అని లోకం మాట్లాడినా చదువుకేసింది. పదకొండు చదువుతుండగా వెలమల అబ్బాయి రాజేశు పెళ్ళాడతానన్నాడు. అందరినీ సమ్మతింపజేసి కార్యం ముగించింది చిన్నక్క. ఏడాదికే బిడ్డతల్లయింది లత ” నీ అవ్వో జోగినీ, నువ్వు పతివ్రతవు తియ్యి. అసలు మీకులమే అంత” అంటూ చెప్పా పెట్టకుండా అవుటాప్ పోవాలనుకున్నాడు రాజేశ్. లత పుట్టిల్లు చేరింది. ఇది చిన్నక్క కథ.
ఎర్రక్క కొడుకును బళ్ళోవేసింది. బడిలో అయ్యవారు ”ఏమిరా ఎప్పుడూ మీ అవ్వనే అస్తది ఫీజుగట్టను, మీ అయ్యలేడా అన్నడట” అందుకు పిల్లలు సార్ ఆనందుకు అయ్యలేడు, వాళ్ళమ్మ జోగిని అన్నారు. దాంతో పిల్లవాడు బడిమానేస్తానని హఠం పట్టాడు. బడికి వెళ్ళి ఏదైనా ఉంటే మమ్ములడగండి. పిల్లలను గాదని అయ్యవారిని గదమాయించింది ఎర్రక్క. ఇది ఎర్రక్క గాథ.
గంగుకు లారీ డ్రైవరుకు ఇద్దరు పిల్లలు కలిగారు. తర్వాత రాక తగ్గిపోయింది. దాంతో రావడం మానేశావు పిల్లలను సాకడమెలాగా అని నిలదీసింది గంగు. ”ఏందేలావు దుంకుతున్నవు. లగ్గం పెండ్లామోలె. ఏం గ్యారంటి ఈల్లు నాకే పుట్టిన్రు… కాయిదమున్నదా పత్రమున్నదా… జోగు దానివి. లావు మాట్లాడ్తవు” అన్నాడు. పోలీసోళ్లదగ్గరకు పోతే ఫో!ఫో! జోగుదానా, ఓడికి కనుక్నున్నవో ఆయన్నంటున్నవు, ఎక్కతక్క మాట్లాడితె లోపటేస్త అన్నారు. కోర్టు కెళదామంటే మాదిగోల్ల దిక్కు ఆడోళ్లదిక్కు, జోగోల్ల దిక్కు అందులో కట్టలు లేనోళ్ల దిక్కు ఎవరు మాట్లాడతారని దిగులు పడుతుంది. ఇది గంగు గాథ. ఇలా ఒక్కొక్కరిది ఒక దీన గాథ.
అయినా అందరూ కష్ట సుఖాలు కలబోసుకుంటారు. ఒకరికి ఒకరు ఆసరా. చిన్నక్క కూతురు సంగతి తెలిసి అందరు ఏకమయ్యారు. జోగోల్ల పెద్ద గూండ్ల నర్సవ్వను కలిశారు. నర్సవ్వ వూరంతా ఇంటికొక బీడీ పంచింది. అలా బీడి పంచటమంటే ఆ బీడీ పంచినోళ్ళ పంచాయితీ తెల్లారి ఉన్నట్లు. అందరూ జోగేళ్లేంది బీడి పంచుడేంది అని నోళ్లు నొక్కుకున్నారు. అందరూ జమ అయినారు. లత భర్త రాజేశు విదేశాలకు వెళ్లటం గూర్చి ఇరుప్రక్కల వాదోపవాదాలు జరిగాయి. డెభ్బై ఏండ్ల మాదిగ లస్మయ్య ఇంత మంది విదేశాలకు పోవడానికి, వారి కష్టనష్టాలకు భూమి లేకపోవటమే కారణమని తేల్చాడు. కుమ్మరి, గౌండ్ల, చాకలి, మంగలి అందరు కష్టాలు వెళ్లబోసుకున్నారు. అందరికి భూమి కావాలి. మరి ఎట్లా? ఉన్నోళ్ల భూమి గుంజుకోవాలని నిర్ణయానికొచ్చారు. దున్నేటోడిదే భూమి అన్నారు. మరి జోగోల్ల సంగతి! జోగోళ్లు అందరూ ముందు కొచ్చారు. ”మాకు మొగోల్లు లేరుగని పిల్లలున్నారు కద. కుటుంబాలున్నయి కదా. మాకు భూములు కావాల” అన్నారు.
జోగోళ్లకు భూమి ఎందుకన్నారు కొందరు. ఏమి ఆడోల్లు దున్నరా… ఆల్లకు ఏపని రాదు? ఏందో ఎకిలి ఎకిలి మాట్లాడుతరు. మాకు కడుపులున్నట్లే చేతులున్నయి. దమ్ముంటే రండ్రి. సూద్దురు ఎట్లు దున్నుతమో… దున్నేటోల్లకే భూమి’ అనుండ్రి. అట్ల ఆడోల్లుగానీ మొగోల్లుగానీ అంటూ అందరితో పాటు మేమూ అంటూ సిద్ధమయ్యారు.
ఈ నాలుగు కథలు పరిశీలిస్తే నడిమింటి బోడెక్క బసివిరాలయ్యెద-దళిత సంస్కృతిలోని పార్శ్వాన్ని బహిర్గతం చేస్తుంది. ఊరి పెద్దల దాష్టీకానికి, పెత్తందారీ తనానికి పసివయసులో జోగిని పేరుతో పసివాడే తతంగాన్ని విస్పష్టం చేశారు రచయిత. ఆ తంతులో పాటించే యావత్తు ఆచారాలను జోగినిగా మార్చబోయే అమ్మాయి అలంకరణ తీరుతెన్నులు, జోగినిని విడిచే పద్ధతి, ఆ తతంగంలో పాల్గొనే పురుషుల పాత్ర, ప్రమేయం, దేవతను నిల్పడం, బలి ఇచ్చే వ్యవహారాన్ని విపులంగా కళ్ళ ముందుంచారు. అంతేకాకుండా అమాయకులైన పసిపాప జీవిత చౌర్యాన్ని, ఆ ఆచారంలోని మౌడ్యాన్ని ఎండగట్టారు. కానీ తల్లిదండ్రులు ”మాకేమో వుండేది వొగితే కదా యాడన్నా బసివిరాల్ని ఇడుసుకుంటే కొండ్లు ముందు వుంటాదని ఆస. నీడపాట్న సుకంగ వుంటాది. ముసులు ముప్పతనానికి మమ్ముల్ని మదసనంగా సూసుకుంటాదని మా అపలాసన” అనుకున్నారు.
బోడెక్క కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నా పట్టించుకునే నాధుడులేడు. పైగా ఊరందరికి అదో వేడుక. ఆనందం. ఒక దురాచారాన్ని సమాజం ముందుకు సవాల్‌గా విసరడంలో రచయిత కృతకృత్యుడయ్యాడు. ఆ ఆచారాన్ని నిరోధించే ప్రతిపాదనలు చేయలేదు. కాని ఒక దురాచారంలోని మౌఢ్యాన్ని, అనాగరికత్వాన్ని, చైతన్య రాహిత్యాన్ని, పురుష స్వామ్య వ్యవస్థలోని భోగలాలసతను గ్రామపెద్దల పెత్తందారీతనాన్ని, పేదరికం ఆసరాగా కొనసాగుతున్న ఆధిపత్యాన్ని, అన్నెంపున్నెం ఎరుగని ఆడబిడ్డల అసహాయత్వాన్ని, ఆచారం పేరుతో జరుగుతున్న దౌర్జన్యాన్ని ప్రస్పుటీకరిస్తూనే పురుషుల అంగలార్చేతనాన్ని, ఆచారంపట్ల విముఖతను రచయిత వ్యక్తీకరించారు. ఈ ఆచారం పట్ల సమాజంలోని స్త్రీల మనోభావాలను వ్యక్తీకరించారు. ఈ దురాచారం వల్ల దళిత బాలికలకు ఆజన్మాంతం కలిగే దుర్భర జీవితం పట్ల రచయిత కంఠస్వరం కథ ఆసాంతం గట్టిగా ప్రశ్నిస్తూనే ఉంది.
కలికి గాంధారి కథలో తల్లిపాత్ర గాంధారి, రడంలో పాప తల్లిదండ్రులు చైతన్య వంతమైన పాత్రలు. గాంధారి తన బిడ్డ రొంపిలో పడకుండా కాపాడడానికి హత్యచేసి జైలుకెళ్లింది. రడంలో ఉన్న ఆస్తిపాస్తులను వదులుకొని బిడ్డ చదువే ముఖ్యమనుకున్నారు. జోగినీ వ్యవస్థను దెబ్బకొట్టారు. ఆవ్యవస్థ తరతరాలుగా కొనసాగాలనుకునే వూరి పెద్దలకు తగిన గుణపాఠం చెప్పారు. దరిలేని బావులు కథలో స్త్రీపాత్రలు తాము జోగినులని, జోగినులకు మానాభిమానాలుండవని అడుగడుగు నానిందలకు గురయి, బాధ పడినా వారి ఆలోచనా ధోరణి మాత్రం అభ్యుదయమైంది. తమలాంటి దుర్భర జీవితం తమ బిడ్డలకు వద్దని కోరుకున్నారు. అందుకోసం తమ శాయశక్తులా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. లత సమస్య విషయంలో మూకుమ్మడిగా ఎదురుతిరిగారు. పంచాయితీ పెద్దలతో మాటకుమాటా సమాధానమిచ్చారు. తమకు అందరిలాగే భూమి పుట్ర ఉంటే, పనీపాటా చేసుకోగల సత్తా, చాకచక్యం ఉందని చాటిచెప్పారు.
బసివి, జోగినీ వ్యవస్థ తరతరాలుగా కొనసాగాలనే తత్త్వం వూరి పెత్తందార్లది. తమతోనే అంతంకావాలనీ, తమ బిడ్డలు వివాహాలు చేసుకొని పిల్లాపాపలతో సుఖసంసారాలు గడపాలనేది జోగినుల అభిలాష, సమాజ నైజాన్ని, జోగినుల పట్ల ఉన్న చులకన భావాన్ని ఎండగట్టి, సంప్రదాయం పేరుతో దళిత, వెనుక బడిన వర్గాల స్త్రీలను లైంగిక దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ, జోగినీ వ్యవస్థ రూపు మాసిపోవాలనీ జోగినులకు అండగా నిలిచింది తెలుగు కథా సాహిత్యం. జోగినీ వ్యవస్థ నిర్మూలనకోసం ప్రభుత్వం కృషిచేస్తున్నా, ఇంకా అక్కడక్కడా కొనసాగడం విచరకరం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags