శైలజామిత్ర
ఎన్నోసార్లు మరణించాక
ఇక కోలుకోవడానికేం మిగిలింది?
ఇంకెన్నోసార్లు తిరస్కరించాక
ఇక ప్రేమనే పదానికి పుట్టుకేముంది?
జననాలన్నీ చెత్తల్లో చీమలకు
మరణాలన్నీ మురుగు కాలువలకు
గుత్తాగా రాసిచ్చాక
ఇంక మహిళలకు ఉత్సవం ఎక్కడుంది?
గర్భగుడిలోనే ఛిద్రమయ్యాక
స్త్రీ రూపానికి తావేముంది?
కాపలా కుక్క కూడా
మగ పుట్టుకే కావాలనుకునే ధూర్తులలో
మార్పు వస్తుందనే నమ్మకం ఏముంది?
బాల్యం, యౌవనం, ప్రౌఢత్వం, వృద్ధాప్యం
ఏ దశ అయినా, ఏ దిశ అయినా
అర్థరాత్రి మాట దేవుడెరుగు
పట్టపగలైనా రక్షణేముంది?
చెబితే వినిపించుకునే దిక్కేముంది?
ఏకకాలంలో వినిపించుకునే స్వరాలయినా
అంతరాంతరాలలో నమ్మే మనసెక్కడుంది?
సతీసావిత్రి భర్తను కాపాడుకున్నా.
సీత భర్తను అనుసరిస్తూ అడవులకు వెళ్ళినా
భర్త వచ్చేదాకా ఊర్మిళ నిద్రించినా
తరతరాల కథలుగా ఆదర్శం అయ్యారే కానీ
ఆధునికంలో స్త్రీ అర్థంకాని ఒక గాధగానే మిగిలిపోయింది.
స్త్రీ కాలు కదిపితే కందిపోతుందనే మాట కవిత్వమయిందే కానీ
కాళ్ళరిగేలా పనిచేయడమే నేడు జీవన విధానమయింది.
కన్నతల్లయినా, చెల్లయినా,
భార్యయినా, బిడ్డయినా కామాంధుల కడుపులకు
విందుభోజనంగానే మిగిలిపోయింది
ఇక స్త్రీ జనోద్ధరణకు ఏ పాత్ర మిగిలింది?
మనం అనుకుంటాం కానీ
ప్రతి జననమొక పూర్వ జన్మసుకృతమేనని
నేడు స్త్రీకి జననమే ఒక మరణమయింది
వంటింటి కుందేలు కాకున్నా
వందేళ్ళ బానిసగానే మిగిలింది.
పొద్దుపొడుస్తుంది. గాలి వీస్తుంది
పువ్వు పూస్తుంది. పిట్టపాడుతుంది
ఇవన్నీ వాటి స్వ లక్షణాలే అయినా
సలక్షణమయిన జీతం లేని
స్త్రీ జీవితం మాత్రం
అరణ్యరోదనగానే మిగిలింది
కొత్త జననం కోసమే
ప్రతి జీవి పరుగులు తీస్తుంది.
సరికొత్త అడుగులు వేస్తుంది
పిండదశలోనే పిండిపిండి చెయ్యబడేదే
నేడు స్త్రీరూపమయ్యింది.
ఒక చల్లని సాయంవేళ
సముద్రపు అలల మీద పారాడే
గడ్డిపవ్వును చూసినా
వెల్లకిలా పడిన ఆకును చూసినా
స్త్రీ దృశ్యమే కదానిపిస్తుంది.
తెలుసుకుని తరచి చూస్తే
నీకు తెరచి ఉంచిన జీవిత గ్రంథమవుతుంది.
జననమంటే జనవాసం కోసం కాదు
జయించడం కోసం కూడా!
అందుకే నిత్యం జయించాననుకునే పురుషుని పేరు
జనాభాలెక్కల్లో మిగిలిపోయింది!
తరతరాలకు విజయభావుటా రెపరెపల్లో
భరతమాతగా స్త్రీ జనుల గుండెల్లో నిండిపోయింది…!
ఆచార్య విజయశ్రీ కుప్పా
వసంత వయ్యారం
నిన్నటి దాకా చల్లని మంచుపూలరేకుల్ని
చల్లుతున్న ఆకాశాన్ని స్తబ్దుగా చూశాయి వృక్షాలు
మండే ఎండల్లో మాత్రం పచ్చలకిరీటాలు పెట్టుకుని
ఎండగాలికి తళతళా నవ్వుతున్నాయి
”ఇదేమి చిత్రం?” అంటే –
ఇది వసంత జయంతుల వార్షికోత్సవం అన్నాడు
ఋతురాజు
పచ్చదనం మేము సాధించి తెచ్చుకున్నాం అన్నట్లు
ఆకుపచ్చ గాజులేసుకుని అరుణునికి నమస్కరిస్తున్నాయి
ఎర్రని ఎండ తాగిన మోదుగ పువ్వులు
దొండ పండుని దొంతి పెదవిని పలుకరిస్తున్నాయి.
ఎండల్ని వడపొయ్యండి – చల్లని మా పరిమళాల
రెక్కలతో గొడుగులు కుట్టి
తెల్లని ఎండకి పోటీ చెయ్యండి అంటూ
మల్లె తోటలు నిలువెల్లా విరులు పూస్తున్నాయి.
మామిడి చెట్టు మంటగా చూసింది
మాకూ వసంతమొచ్చింది
పచ్చని ఆకుల చాటున పసిపిందెలమై
ఆవకాయ పచ్చడిగా అందర్నీ రుచులూరిస్తాం
మామిడి పళ్లు తియ్యగా నవ్వాయి
పచ్చని పసిడితో రసాలూరిస్తాం!! ‘రసాలం’ మేము
రసరాజమై రాజ భోజనాలమై – మధుర లాలాజలమూరిస్తాం
నిండా ఎండని తాగి, వళ్లు విరపులతో
వయ్యారిస్తున్న వసంత వధూటిని
”అబ్బబ్బ ఎండలు – అమ్మో మంటలు” అంటూనే
అవస్థపడుతూనే ఆహ్వానిద్దాం
వసంతోత్సవాలు ఆనందంగా చేద్దాం
అంతటా చలివేంద్రాలు పెట్టిద్దాం
అందరి గొంతులూ చల్లబరుద్దాం
మొక్కలు నాటుదాం – వాటి గొంతులూ తడుపుదాం
ద్రాక్ష తీగల్ని దయచూడమందాం! పెట్రోేలుతో పోటీ చెయ్యద్దని
కమలాలనీ కర్బూజాలనీ కరుణించమందాం
మీరన్నా మమ్మల్ని బ్రతికించడని
అబ్బా! ఎండలని అనుకోవద్దు
ధరలని చూసి ఎండలు చిన్నబోతున్నాయి.
డా. పి. విజయలక్ష్మి పండిట్
నేను ‘భూమిక’ను..
నేను ‘భూమిక’ను
సాహితీ పుత్రికను
‘స్త్రీవాద’ పత్రికను
తెలుగు సాహిత్య ప్రపంచంలో
1992 లో నా ప్రస్థానానికి శ్రీకారం
నా పుట్టుక ఓ చారిత్రక సంఘటన
అన్వేషి రిసోర్స్ సెంటర్ నా జన్మస్థలం
ఆడ పిండాలవలె
భ్రూణ హత్యకు గురి కాకుండా
ఎన్నో కష్టానష్టాల కోర్చి
అకుంటిత దీక్షతో
నన్ను కాపాడింది
మా అమ్మ సత్యవతి
ఇపుడు నా వయసు
ఇరువయి సంవత్సరాలు
ఈ ఇరువది వసంతాలలో
మహిళాభ్యుదయం,
మహిళల సాధికారతే ధ్యేయంగా
ఎన్నో వ్యాసాలు, కథలు, కవితలు, సమీక్షలు వెలువరించాను
ఓల్గా, సత్యవతి, నిర్మల, శిలాలోలిత, సజయ, లక్ష్మి, భారతి, శైలజ
ఎందరో ‘స్త్రీవాద’ విదుషీమణులు
నన్ను బాల్యం నుండి
పోషించి తీర్చిదిద్దారు…
స్త్రీవాద సాహిత్యాన్ని ప్రచురించి
సమకాలీన స్త్రీలలో పురుషులలో
స్త్రీల సమస్యలు, వాటి పరిష్కారాల పట్ల
చైతన్య పరచి ఆలోచింపచేయడం
సమాజాన్ని, సాహిత్యాన్ని,
స్త్రీల దృక్కోణంలో విశ్లేషించడమే
నా ముఖ్యమైన భూమిక
నా ‘హెల్ప్‌లైన్’
సమస్యల్లో చిక్కుకుని
దారితెన్ను తెలియని ఎందరో
స్త్రీలకు ‘చుక్కాని’
స్త్రీల సమస్యల, పరిష్కారాల అధ్యయనమే ధ్యేయంగా…
స్త్రీలకు స్నేహ హస్తాన్నందించి
ఆదుకోవడమే నా లక్ష్యంగా…
అన్నింటిలో స్త్రీలకు
సగభాగం అన్న నినాదంతో
సాగిపోతున్నాను…
మహిళల జీవితాలలో
వెలుగు నింపే ధ్యేయంతో
నా ఇరువై సంవత్సరాల
ప్రస్థానంలో
నాకు
చేయూతనిచ్చి నడిపిస్తున్న
అందరికీ నా వందనాలు, ధన్యవాదాలు…