కొండేపూడి నిర్మల
రాజుగారు దిశ మొలతో ఊరేగుతున్నప్పుడు అతన్ని మోస్తున్న బోయీలతో బాటు చుట్టుపక్కల వున్న మనుషులంతా కూడా ఈ వికారాన్ని కళ్ళుపోయేలా చూసి భరించాలి. ఎదురు తిరిగిన వాళ్ళెవరైనా వుంటే వాళ్ళ నోరు నొక్కేసి మన ప్రభువులు నిండుగా వస్త్రాలు కట్టుకున్నట్టు భావించమని చెప్పాలి. రాజభక్తి అంటే అదే కదా.
లేకపోతే ఇద్దరి తలలూ ఎగిరిపోతాయి. ప్రాణభయంతో బాటు, భక్తి భయం కూడా భృత్యుల్ని గోతిలోకి తోస్తుంది. ప్రజాస్వామ్యంలో అయితే విచక్షణా దరిద్రం కూడా తోడవుతుంది. 2002న, గుజరాత్‌లో ముస్లిం ప్రజల మీద జరిగిన ఊచకోతని, ఆ కోతలో ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న బాధితులతోబాటు, ప్రత్యక్షసాక్షులుగా వున్న అన్ని దేశాల ప్రజలూ ఇంకా మర్చిపోకముందే, కారకుడు అయిన నరేంద్రమోడీ చేతులకంటిన రక్తపు మరకలు ఆరిపోయినట్టూ, కొమ్ముల్లోనూ, కోరల్లోనూ దాగిన విషవాయువులు కదిలిపోయినట్టూ ఓవర్ యాక్షన్ చేసేసి, అతడు నిర్దోషి అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకటిస్తే, ఆ వార్తను సోక్రటీసు తాగిన విషంతో పోల్చుకుని జీర్ణించుకోవాలా?.. ప్రభుత్వాలు, యంత్రాంగమూ ఎంత బాగా వివేకం వదులుకుంటే పాలకులకి అంత బాగా గుడ్ గవర్నెన్స్ కుదురుతుంది కాబోలు. గుడ్ గవర్నెన్స్ అంటే మంచి పాలనట కదా, అవును వాడి పాలనలో ఏకపత్నీ వ్రతుడొచ్చి వేలాది హత్యాచారాలు చేసిపోయాడు, వాడి పాలనలో వ్యాస వాల్మీకులు ఖురాన్ చదువుతూ కాలిపోయారు. ప్రతీ ఏడాదీ సీతారామ కళ్యాణాలు చేసే వాడి పాలనలో షాదీ ముబారక్ అని రాసి వున్న పెళ్ళి పందిరి బూడిద కుప్పగా మారిపోయింది. గుడ్ గవర్నెన్స్ కదా మరి…?
దేశమంటే మనుషులు అని చెప్పిన గురజాడ వాక్కు నిజమే అయితే అప్పుడు నెరూడా, పాటియా, బాపూనగర్, చమన్‌పురా, కనీజ్, తకడ్, లింబాడియా గ్రామాలు ఓట్లు దండుకున్న ప్రభుత్వం పుణ్యమా అని మట్టిలో కలిసిపోయాయి. అక్కడ దేశమే లేదు. మట్టే మిగిలింది. ఈ దేశంలో శాంతి యాత్రలు చేసే తీరిక మదర్ థెరీసాకి ఎప్పుడూ వుండదు. తల్లి కడుపు చీల్చి గర్భస్థ పిండాన్ని శూలానికి ఎగరేసిన శిశుపాలుడు చేస్తాడు. ఈ దేశంలో ప్రజలకి యుద్ధం చెయ్యడానికి కాదు, నిశ్శబ్దంగా వుండటానికి వెయ్యి ఏనుగుల శక్తి కావాలి.
గడిచిన పదేళ్ళకాలంలో తను రూపకల్పన చేసిన గుజరాత్ అభివృద్ధి నమూనా మహాత్మాగాంధీ కాలంలో జరిగిన స్వతంత్ర ఉద్యమాన్ని పోలివున్నదట. గుండెలోకి దూసుకుపోయిన తుపాకీ గుండుకి కూడా హేరామ్ అని మాత్రమే స్పందించిన బాపూజీ కనక యిది వింటే చేతిలో వున్న కర్ర తిరగేసి రెండు కాళ్ళూ విరగ్గొడతాడు. అరవై ఏళ్ళ రాజకీయ జీవితానికి బూజు పట్టేలా ఎల్.కె. అద్వానీ గారు కూడా మోడీ వంటి రాజకీయ మేధావి, సమర్ధుడు, న్యాయపక్షపాతిని తన సుదీర్ఘకాలంలో అసలు చూడనే లేదని ప్రకటించాడు. కాబట్టి ఈ తీర్పు ఆయనకి ఆనంద బాష్పాల్ని మోసుకొచ్చిండట.
ఎటొచ్చీ న్యాయం కోసం పదేళ్ళనుంచీ ఎదురుచూపుల నిప్పుల మీద వున్న వాళ్లకి వచ్చినది ఏమిటి..? అరవై పేజీల చారిత్రక అబద్ధమా..? ఈ దెబ్బ దేహానికి తగిలిన, దెబ్బకాదు. నమ్మకాలకీ, విశ్వా సాలకీ, సర్వ మానవ స్పర్శలకీ ఒకేసారి అంటించిన సామూహిక చితి. వేలాడదీసిన ఉరి. ప్రధాన న్యాయస్థానం చేసిన ఒక అడ్డగోలు దగా, దివాళాకోరుతనం, ప్రాణభయంతో రాళ్ళ గుట్టల్లోకి పారిపోయి మూత్రం తాగి బతికిన బాధితులకి, బాధని చూసి తల్లడిల్లినవారికి తీవ్రమైన అసహ్యం కలిగి గొంతులో కాండ్రించి ఆ వేదనని ఎక్కడ ఉమ్మాలో తెలీనితనం….
ఈ తీర్పు గాయాన్ని గాయంతో కెలికినట్టయింది. చితికిన జీవితాన్ని ఇంకోసారి కుళ్ళబొడిచినట్టయింది. యూదుల రక్తంతో హోలీ ఆడిన హిట్లరు జాత్యహంకారం… కనబడుతోంది. సెక్యులరిజం ఒక సిద్ధాంతంగా స్థిరపడిన చోటే జైరామ్ కత్తులు తల్వార్లు గాలికెగురుతుంటే, కత్తి ఎత్తిన తలకీ, దిగిన తలకీ ఒకే సర్కారు రిమోట్ బటన్ నొక్కుతుంటే ఇది అసలు దేశమా..? శ్మశానమా..?
అరవై మంది హిందువులు రైలుతో సహా సజీవదహనం అవడమూ, ఆరువందల మంది ముస్లింలని ఎవరింట్లో వాళ్ళే కుప్పకూలిపోవడమూ రెండింటిలో ఏ ఒక్కటైనా సర్కారు సైగ లేకుండానే జరుగుతుందా? జరిగిందే అనుకో అప్పుడు బాధ్యత వహించాలి కదా. న్యాయమూ చట్టము పనిచెయ్యాలి కదా..? తనే ఎదురు తిరిగి ప్రజల్ని కుళ్ల బొడవడమేమిటి..? అసలు మతమైనా కులమైనా రాజకీయ విషమెక్కించినప్పుడే రంగు మారుతున్నాయని అందరికీ తెలిసిపోయింది.. ఇంతకంటే మోసపోవడానికేమీ లేదు.
ఎవరు మైనార్టీ…? ఎవరు మెజారిటీ? అట్టడుగు వాడికెప్పుడూ అర్థంకాని వివక్షో.. రోటీ కపడా ఔర్ మకాన్ పంచుకుంటూ, మత ప్రమేయమే లేకుండా ప్రేమించుకుంటూ పెద్దల్నెదిరించి పెళ్ళి చేసుకుంటూ, హే రామ్, హే అల్లా అని కన్నబిడ్డలకి పేర్లు పెట్టి పిలుచుకుంటూ కమ్మటి కౌగిలిలా బతుకుతున్న చోట హటాత్తుగా పక్కింటి దేవుడు శత్రువెందుకు అయ్యాడో, తన దేవుడి పటాలెందుకు ముక్కలయ్యాయో ఎలా తెలుస్తుంది?
మోడీని, అతని అతకని చిరునవ్వునీ మోస్తున్న పల్లకీ బోయీలకి తెలుస్తుంది. ఆ కూలీల్లో ప్రపంచ ప్రధాన న్యాయస్థానమూ వుండొచ్చు. అతని నేరాలన్నీ సాక్ష్యాలు లేనందువల్ల చెరిగిపోయాయట. అవును సాక్షుల్ని కొనేస్తే చెరిగిపోతాయి. చంపేస్తే చెరిగిపోతాయి. రక్షిస్తాం ఇటువేపు రండి అని చెప్పి లారీల కెక్కించి నిప్పంటిస్తే కాలిపోతాయి. అధికారం చేతిలో ధిక్కారాలే కాదు, నోరెత్తని దీనులూ బతకలేరు. పొగ సాయంతో తందూరీ పొయ్యిలోంచి పారిపోయొచ్చిన పదహారేళ్ల అమ్మాయి వీపు మీద నల్లని మచ్చ ఒక అబద్దమే అయి వుంటుంది. స్వయంగా చూసివచ్చిన ఇన్ని జతల కళ్ళూ గాజు గుడ్లే అయివుంటాయి. ఆక్రోశించిన అక్షరాలు సిరా ముద్దలే అయివుంటాయి. మంత్రిగారు దిశమొలతో వున్నారు. చీకొట్టకండి. శ్వేత వస్త్రాల్లంటి అరవై అబద్ధాలు న్నాయి. ఆ పేజీల్ని చుట్టబెట్టండి. సుప్రీంకోర్టు అదే చేసింది..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
వ్యవస్థ లొ— మార్పు రావాలి
వార స త్వ రాజకియాలు– ఫ్యామిలి పాలనలు పొవాలి
నిర్మల గారు—భా గ చెప్పారు
—————