డా. పి. సంజీవమ్మ
(భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ ప్రచురణకు పొందిన వ్యాసం)
1000:914 ఇది 2010 జనాభా గణాంకాల ప్రకారం మనదేశంలో మగ-ఆడ నిష్పత్తి. ప్రకృతి సహజంగా లేదు ఈ నిష్పత్తి. అంటే సెక్స్ రేషియో దిగజారుతుంది. ఆడవాళ్ళ సంఖ్య గణనీయంగ పడిపోతుంది. ఆందోళన కలిగించే విషయం ఇది సమాజానికి. మరీ ముఖ్యంగా ఆరు సంవత్సరాల వయసు పిల్లల్లో ఆడపిల్లల సంఖ్య మరీ దిగజారింది. ఎందుకీ వైపరీత్యం? గర్భస్థ దశలోనే ఆడశిశువుల్ని చంపుకోవటం దీనికి ప్రధాన కారణం. ”ఆడపిల్లల్ని చంపడం ఆపండి” సీరియస్ నినాదం కావాలి. ఈ నినాదంతోనే వుద్యమించాలి.
గర్భస్థ స్త్రీ శిశువుల హత్యల్ని మాన్పటానికి ఆశ్రీఈఊ చట్టం చేయవలసి వచ్చింది. కట్నం కారణంగ మహిళల వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నందువల్ల వరకట్న నిషేధ చట్టం చేయవలసి వచ్చింది. అంటే గర్భంలోకాని, పెళ్ళి తర్వాత కాని ఆడపిల్లకి మృత్యువు పొంచి వుందన్నమాట. ఇంకా చెప్పాలంటే వరకట్న దురాచారానికి భయపడి గర్భస్థ ఆడశిశువుల్ని చంపుకోవటం జరుగుతుంది. ఆడపిల్లలు వద్దనుకోవటానికి ఈనాడు ప్రధాన కారణం వరకట్న సమస్య అనేది వాస్తవం. కష్టపడి కట్నమిచ్చి పెళ్ళి చేసినా ఆడపిల్ల జీవితానికి ఆ తర్వాత గ్యారంటీ లేదు. ఎన్నెన్ని సమస్యలో. ”ఆడదై పుట్టటం కంటె అడవిలో మానై పుట్టటం మేలు” అనేది ఒకప్పటి సామెత. ఈ సామెత వెనుక ఆనాటి సాంఘిక, కుటుంబ వాతావరణం దాగివుంది. విపరీతమైన లింగవివక్ష, పురుష దురహంకార దృష్టిలో ఆడది అంటే ఒకమూల పడి వుండాల్సిన ప్రాణి. అందుకే ఆడజన్మ వద్దనుకున్నారు. కాని ఆనాడు ఆడజన్మను ఆపడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేదు.
కాని ఈనాడు ఈ పరిస్థితి మారింది. స్త్రీల కష్టాలు రకరకాలుగా విజృంభించినాయి. అందువల్ల ఆడపిల్లల పుట్టుకే వద్దు అనే పరిస్థితి వచ్చింది. దీనికి సాంకేతిక పరిజ్ఞానం తోడై ఆడపిల్లల జన్మల్ని అరికట్టకలుగుతున్నారు. సమాజంలో చాలమంది ముఖ్యంగ కట్నబాధితులైన ఆడపిల్లలు తల్లిదండ్రులు ఆడవాళ్ళ సంఖ్య తగ్గితే మరలా కన్యాశుల్క కాలం వస్తుందిలే అని మూర్ఖంగ అమాయకంగ కసిగ ఆలోచన చేస్తూ వుండటం కూడ వాస్తవమే. ఇది పొరపాటు. కన్యాశుల్క కాలంలోనూ నేటి వరశుల్క కాలంలోనూ బాధలు పడుతున్నది ఆడవాళ్ళే. ఈ రెండు దురాచారాలు ఆడపిల్లల పాలిట వురికొయ్యలే. ఇప్పటి జనాభా నిష్పత్తిలో వస్తూన్న తేడా ఆడపిల్ల పాలిట పెద్ద శాపంగ పరిణమించగలదు. వూహించుకుంటే ఆలోచిస్తే కొన్ని విషయాలు చాల భయం కలిగిస్తాయి. ఇప్పుడు ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలు, అప్పుడు సెక్స్‌కోసం జరుగుతాయి. మగపిల్లలు ఆడపిల్లల పాలిట యమకింకరులు అయ్యే ప్రమాదం వుంది. తగినంతమంది ఆడపిల్లలు లేనప్పుడు సమాజంలో తలకిందులు వ్యవహారం సాగుతుంది. ఆడవాళ్ళను లొంగదీసుకోవడానికి విపరీతమై దారుణమైన ప్రయత్నాలు జరుగుతాయి. మగపిల్లలు కుక్కల్లాగ కొట్లాడుకునే పరిస్థితి దాపురించవచ్చు. ఇది ఆడపిల్లలకూ అనర్థదాయకం. అలాంటి సమాజాన్ని వూహించుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది.
ఈనాడు మనం ఆర్థికంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో వున్నా, సాంస్కృతికంగా ఇంకా ఫ్యూడల్ కుళ్ళు వ్యవస్థలోనే దొర్లుతున్నాం. పితృస్వామ్య భావజాలం – పురుషాధిక్య భావం మహిళల్ని రెండవ రకం పేరులుగానే నిలిపింది. చైతన్యవంతులైన మహిళలు, మహిళా సంఘాలు పోరాటాలు చేసి తమ పక్షంలో ఎన్ని చట్టాలు సాధించుకున్నా అవన్నీ ఆచరణలో ఫలితాల్ని ఇవ్వలేకపోతున్నాయి. కారణం పితృస్వామ్య దుష్ట సంస్కృతే. వరకట్న నిషేధ చట్టం, మహిళలకు వారసత్వపు ఆస్తి హక్కు చట్టం, గృహ హింస నిరోధక చట్టం, విడాకుల చట్టం, ఆశ్రీఈఊ చట్టం మొదలైనవి ఆడపిల్లలకు ఆచరణలో ఎక్కువగ వుపయోగపడలేకున్నాయి. ఆస్తులు కట్టబెట్టడానికి ‘వంశోద్ధారకుడు’ కావలసి వస్తున్నాడు కానీ ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వడానికి తల్లిదండ్రులకు మనసు రావటం లేదు. ఎలాగూ కట్నం ఇవ్వక తప్పదు కదా, ఇంకా ఆస్తులెందుకు? అనేది చాలామంది ప్రశ్న. ముసలి తనంలో తమను కొడుకు సంరక్షిస్తాడు అనే ఆశ ఈనాడు అత్యాశగా మారింది చాల మంది తల్లిదండ్రులకు. ఇందుకూ ఎన్నో కారణాలు.
డబ్బు జబ్బు పట్టుకున్న ఈ వ్యవస్థలో ఆస్తులు సంపాదించడానికి పెంచుకోవడానికీ కట్నం ఒక సాధనమై కూర్చుంది. ‘వర దక్షిణ’ పేరుతో మొదలైన ఆచారం, నిర్బంధ కట్న దురాచారంగా ఏకు మేకై కూర్చుంది. కట్నం ఇస్తేనే ఆడపిల్ల పెళ్ళి జరిగేది. ఎంత విడ్డూరంగా మారిన స్థితి! మరింత కట్నం కోసం వేధింపులు హత్యలు మోసపూరితంగ విడాకులు, మరో పెళ్ళి మరో కట్నం అబ్బాయికి. అమ్మాయికి వుండే పిల్లల బాధ్యత ఆర్థికంగా సామాజికంగా భద్రత లేకపోవటం, ఆత్మహత్యలకు దారితీయటం, పెట్టుబడిదారీ వ్యవస్థ క్షీణ విలువలు ఆడపిల్లల వుసురు తీస్తున్నాయి. ఇవన్నీ ఆడపిల్లలు వద్దు అనుకోవటానికి కారణాలు కావా?
మొదటి బిడ్డ మగ పిల్లవాడు పుడితే చాలా సంతోషిస్తారు. ఆడ పిల్ల అయితే ఫరవాలేదు, రెండోసారి మగపిల్లవాడు పుడతాడు లే అనే ఆశ వుంటుంది. ఒక వేళ రెండోసారి కూడ ఆడపిల్ల పుడితే కొంపలు మునిగినట్లు బాధపడుతారు చాలా కుటుంబాల్లో. ఇద్దరూ మగ పిల్లలయితే మహదానంద పడతారు. ఒక ఆడ ఒక మగ అయితే ఫరవాలేదు కట్నం విషయం బ్యాలెన్స్ అవుతుందిలే అనుకుంటారు. చాల మటుకు ఈ కాలంలో చిన్న కుటుంబాలు అన్నీ. రెండోసారి కూడా ఆడపిల్ల అని గర్భ పరీక్షలో తేలినపుడు గర్భ విచ్ఛిత్తికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇద్దరు ఆడపిల్లలుండి, మగ పిల్లవాడి కోసం నాకు తెలిసి పొరుగింటి పురుషుడు బలవంతంగా నాలుగు సార్లు భార్యకు అబార్షన్ చేయించాడు గర్భంలో ఆడపిల్ల వుందని పరీక్ష చేయించి. అమ్మాయి రక్తహీనతతో పుల్ల మాదిరి అయిపోయింది. అయిదవసారి వాడి ‘అదృష్టం పండి’ మగ పిల్లవాడు పుట్టాడు. అయితే మగని కంటే ఆ అమ్మాయి ఎక్కువగ ఆనందించింది – మగపిల్లవాడు పుట్టినందుకు కాదు, అబార్షన్ పీడ వదలినందుకు.
కొన్ని మినహాయింపులతో ఇవన్నీ ఎక్కువగా మధ్యతరగతి కింది మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్నాయి. పై తరగతి వాళ్ళకు కట్నం అనేది సమస్య కాదు, అది వాళ్ళ డాబు దర్పానికి ప్రతీక. బిడ్డల్ని మాత్రం వారు కూడ ఒకరిద్దర్నే కంటారు.
కింది తరగతి – కార్మిక కర్షక కూలీ కుటుంబాలు బిడ్డల విషయంలో ఇంత పట్టుదలతో వుండరు. కాని వాళ్ళకూ కొడుకు మాత్రం తప్పక కావలసిందే. ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురున్నా వారికి సమస్యలేదు. ఇంటి పనికి బయటి పనికీ కూడా వారికి ఆడపిల్లలు బాగా సాయపడతారు. బాల కార్మిక వ్యవస్థ ఈ తరగతి ఆడపిల్లల్ని ఎక్కువగా పీడిస్తున్నది. వీరు ఆడపిల్ల పోషణకి ప్రాధాన్యం ఇవ్వరు. గ్రామీణ ప్రాంతాల్లో కూడ ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతూందని జనాభా గణాంకాల సమాచారం. పట్టణ మధ్యతరగతి, కింది మధ్యతరగతుల్లోనే కాకుండ గ్రామీణ ప్రాంతాల్లో కూడ కట్నం సమస్యగ మారింది.
ఆధునిక సమాజంలో వున్నామనుకోవడమే కానీ, ఆధునిక భావాలు ఎందరికి పట్టుపడినాయి? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల లభించే సుఖాల్ని అయితే అనుభవిస్తున్నాం కానీ, మానసిక పరిణతి జరగలేదు.
మరి ఆడపిల్లలు ఈ విధంగ మాయమౌతూ వుంటే మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? మనం అంటే కేవలం మహిళలం మాత్రమే కాదు. మొత్తం కుటుంబం సమాజం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక వైపు ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందని మనం ఆశ పడుతుంటే, ఈ రేషియో వైపరీత్యం మరోవైపు మన ఆశల్ని నీరు గారుస్తూ వుంది. ఒక వైపు చట్ట సభల్లో 1/3 వంతు రిజర్వేషన్స్ కోసం డిమాండ్ చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం, రాజ్యాంగంలో మాత్రమే కాదు ఆచరణలో స్త్రీ పురుష సమానత్వం కావాలని స్త్రీ వాదులం గట్టిగా వాదిస్తున్నాం, రచనలు చేస్తున్నాం. కొంతంత కాకపోయినా, కొంత ప్రగతిని సాధించాం అనే ఆత్మవిశ్వాసంతో వుద్యమిస్తున్నాం, ఇంటా బయటా కష్టాలు పడుతూనే కుటుంబం కోసం సమాజం కోసం పాటు పడుతున్నాం. విద్యార్థినుల దగ్గర నుంచి ఉద్యోగినుల వరకూ పురుషుల కంటే పై చేయి సాధించాలని ప్రయత్నిస్తున్నాం, ఫలితం సాధిస్తున్నాం.
కాని ఆడపిల్ల అదృశ్యాన్ని అరికట్టలేకపోతున్నాం. వరకట్న నిషేధ చట్టం ఎప్పుడో చేశారు, సవరించారు కూడ. కాని అందులో లొసగులు చాలా వున్నాయి. కట్నం ఇచ్చేవారు పుచ్చుకునేవారూ ఇరువురూ నేరస్థులంటే ఎలా? ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాన్ని మరోసారి పకడ్బందీగా సవరించాలి. మరింత పకడ్బందీగా అమలుపరచాలి. ఇది 1/3 వంతు రిజర్వేషన్స్ సాధించడం కంటే కూడా ముఖ్యం అని నా అభిప్రాయం. కట్నం తీసుకున్న వాళ్ళను శిక్షించండి. ఇచ్చిన వాళ్ళను కూడా అవినీతుల్లోకెల్లా పెద్ద అవినీతి ఈనాడు వరకట్నమే. మీ దగ్గర ఆస్తులుంటే అమ్మాయిలకు ఇవ్వండి. వారి ఆత్మ విశ్వాసాన్ని పెంచండి. అబ్బాయిలకు కట్నం ఇచ్చి వాళ్ళ ఆస్తులు పెంచకండి. కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించనీయండి.
కాళ్ళకూరి నారాయణరావుగారు నూరేళ్ళ క్రితమే ‘వరవిక్రయం’ నాటకం రాశారు. సమాజం కళ్ళు తెరిపించాలని. ఎంతో ప్రాథమిక దశలో వున్న కట్నం సమస్యను ఆనాడే ఎంతో సీరియస్‌గా తీసుకొని నాటకం రాశారు ఆయన. గురజాడ కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజంలో ఆడవాళ్ళు ఈ దురాచారం కారణంగా ఎన్ని అవస్థలు పడ్డారో కళ్ళకు కట్టినట్లుగ చిత్రించారు.
ఈనాడు కట్నం అనే నీచమైన దురాచారాన్ని అవినీతమైనది, దురాచారం అనే స్పృహే లేకుండ పబ్లిక్‌గా డిమాండ్ చేస్తూ రేట్లు పలుకుతూ పెంచుతూ దర్పాన్ని ప్రదర్శిస్తూ ఘనకార్యం చేస్తున్నట్లు గొప్పలు పోతూ మరీ పాటిస్తున్నారు. చట్టం వీళ్ళను ఏమీ చేయటం లేదు, ఏమీ చేయలేదు కూడ. ఏ చట్టం కూడ ఇంత బాహుటంగా నిర్భయంగా ధిక్కరింపబడటం లేదు! కట్నం హత్యలు, కట్నం వేధింపులు లాంటి మాటలు మన భాషలో కొత్తగా చేరాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏడు కోట్ల అరవై లక్షల అవాంఛిత గర్భధారణలు జరుగుతున్నట్లు, దాదాపు అదే సంఖ్యలో అబార్షన్లూ జరుగుతున్నట్లు ఒక సమాచారం. ఇది ఎంత ఆందోళన కలిగించే విషయమో ఆలోచించాలి. అన్ని మతాలు సంప్రదాయాలు పాపపు భావాలు ఈ అనాగరిక చర్యను నిరోధించలేకపోతున్నాయి. అలాగే ఆశ్రీఈఊ చట్టం వచ్చింది కానీ ఏం జరుగుతుంది? గర్భస్థ శిశువు సహజంగా ఆరోగ్యంగా వుందా, తల్లి ఆరోగ్యానికి భంగం లేదు కదా అనేదానికే పరీక్షలు. కాని దీని కంటె ఎక్కువగా పిండం ఆడా? మగా? అని తెలుసుకోవటానికే ఈ పరీక్షలు ఎక్కువగా వుపయోగించుకుంటున్నారు. అవసరమైతే గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని అబార్షన్ అనుమతించాలి. గర్భస్థ పిండం సవ్యంగ లేని సందర్భంలో పరీక్షించి అబార్షన్ చేయవచ్చు. అయితే అబార్షన్ విషయంలో పూర్తి హక్కు గర్భిణీ స్త్రీదే కావాలి. ఆమెకు స్వయం నిర్ణయాధికారం వుండాలి. గర్భం వుంచుకోవడమా తీసేయించుకోవడమా అనేది ఆమె నిర్ణయానికి వదిలేయాలి. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. గర్భంలో ఆడ శిశువు వుందని తెలుస్తూనే, గర్భిణి స్వయంగా అబార్షన్‌కు సిద్ధమౌతుంది. చాల సందర్భాల్లో చూడండి ఆడవాళ్ళే ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారు మరి, అని ఎగతాళి చేసేవారున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మామూలు ఆడవాళ్ళు కుటుంబ ప్రభావానికి, సామాజిక వాతావరణానికి లోబడేవుంటారు అనేది.
|ఆ్పు 312 సెక్షన్ ప్రకారం గర్భ విఛ్ఛిత్తికి దోహదం చేసే వ్యక్తికీ, అందుకుపాల్పడే మహిళకూ 3 నుండి 7 సంవత్సరాల వరకూ శిక్ష వుంది. చట్టం ఎంత కఠినంగా వున్నా గర్భస్రావాలు నిరవధికంగా నిర్భయంగా జరుగుతూనే వున్నాయి. చట్టం ప్రకారం శిక్షలు ఎవరికీి పడుతున్నాయి? లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఎందరు వైద్యులకు శిక్ష పడుతుంది? లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్ల అని తెలుస్తూనే అబార్షన్ అమలు జరిగిపోతుంది. ఆడపిల్ల పుట్టడానికి ఆడదే కారణం (కంటుంది కనుక) అని భావించే మూర్ఖ జనానికి బుద్ధి చెప్పడానికి సైంటిఫిక్‌గా ప్రచారం జరగాలి. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. బిడ్డల పుట్టుకకు దంపతుల ఇద్దరి క్రోమోజోమ్స్ ఎలా కారణం అవుతాయో వివరించే ప్రచారం చేపట్టాలి. ఆడవారిలో ఒఒ క్రోమోజన్స్ వుంటాయి. మగవారిలో ఒఖ క్రోమోజోమ్స్ వుంటాయి. మగవారి ఒ క్రోమోజోమ్ ఆడవారి ఒ క్రోమోజోమ్‌తో కలిస్తే ఆడపిల్ల పడుతుంది. మగవారి ఖ క్రోమోజోన్ ఆడవారి ఒ క్రోమోజోన్‌తో కలిస్తే మగబిడ్డ పుడతాడు. అంటే ఆడ, మగ పుట్టుకను నిర్ణయించేది మగవారిలోని క్రోమోజోన్స్ అనే విషయం అందరికే అర్థమయ్యే విధంగా శాస్త్రీయంగా ప్రచారం జరగాలి.
వరకట్న నిషేధ చట్టం, ఆశ్రీఈఊ చట్టం ఎగతాళికి గురి అయినంతగా మరే ఇతర చట్టమూ కాలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు కళ్ళు తెరచి ఈ చట్టాల వునికిని ప్రయోజనాన్ని కాపాడాలి. పౌరులూ, మేధావులూ, మహిళా సంఘాలు సమాజాన్ని చైతన్య పరచాలి. ఆడపిల్లల జనాభా పెరగాలనే వుద్దేశంతో ప్రభుత్వాలు ఏవేవో పథకాలు అయితే ప్రవేశ పెట్టినాయి కానీ, అవన్నీ కంటితడువు చర్యలుగా తయారైనాయి. అసలు వ్యవస్థలోనే సర్వ అవలక్షణాలు వున్నాయి. ఏ చర్యలు చేపట్టినా పై పై మెరుగులు ప్రచార ఆర్భాటాలతో సరిపోతుంది. అసలు సగభాగం జనాభా వెనుకబడి వుంటే సమాజం దేశం పురోగమించలేవు అనే ఎరుక ఎందుకు లేకుండాపోయింది? వంద సంవత్సరాల క్రితమే గురజాడ చాల సింపుల్‌గా చెప్పాడు ఈ సత్యం. సమాజం అనే రథానికి స్త్రీ పురుషులిరువురూ రెండు చక్రాల్లాంటివారు, ఒక చక్రం దిగబడిపోతే రథం ముందుకు ఎలా పోగలదు అని. స్త్రీలు బాగుపడటం స్త్రీల కోసం మాత్రమే కాదు కదా. వాళ్ళు బాగుపడితే కుటుంబం సమాజం బాగు పడతాయి. చట్ట సభల్లో రిజర్వేషన్స్ కల్పించడానికి ఎన్ని ఏళ్ళ నుండి గింజుకుంటు న్నారు. ప్రజా ప్రతినిధులనిపించుకుంటున్న పురుష పుంగవులు ఏదో ఒక సాకుతో చిల్లు పక్కన పెడుతున్నారు. ఒకప్పుడు బిల్లు ప్రతులను పార్లమెంటులో చించివేశారు కూడ. టి.వి.లో ప్రజలు చూశారు ఆ దృశ్యాల్ని. పురుష దురహంకారం ఎంత వికృతంగా ప్రవర్తించిందో అందరికీ అర్థమై వుంటుంది. ఇప్పుడు ‘ఏకాభిప్రాయ సాధన’ కోసం ప్రాకులాడుతున్నారు. మెజారిటీతో చట్టం చేసే అవకాశం వున్నా వద్దట. పురుషులందరూ అంగీకరించాలా? ఆడవాళ్ళ ఓట్లతో రాజ్యాధికారం పొందుతున్న పార్టీలు నాయకులు ఎంత కాలం ఆడవాళ్ళను మభ్యపెట్టగలరు?
స్త్రీలందరూ విద్యావంతులు కావాలి. ఆర్థిక స్వాతంత్య్రం ఆస్తిహక్కు కలిగి వుండాలి. వుద్యోగాలు చేయాలి – సామాజిక వుత్పత్తిలో పాలుపంచుకోవాలి పురుషులతో దీటుగా. బయటి ప్రపంచంలో తిరగాలి, జ్ఞానం సంపాదించాలి. వ్యక్తిత్వం నిరూపించు కోవాలి. మన విద్యాబుద్ధులు మన సమర్థత మన ఆత్మవిశ్వాసమే మనకు స్వతంత్రంగా ప్రవర్తించే, స్వతంత్రంగా వ్యవహరించే శక్తిని ఇస్తాయి. ఒక వ్యక్తిత్వాన్ని సంతరించి పెడతాయి. అప్పుడే ఆడపిల్ల విలువ తెలుస్తుంది. అప్పుడు ఆడపిల్లలు వద్దు అనుకోరు. కావాలి అంటారు. అప్పుడు ఆడపిల్లలు మాయం కారు.
ఆడవాళ్ళకు ఈ అవకాశాలన్నీ లభించగలిగిన వ్యవస్థ కావాలి. అయితే వ్యవస్థ మార్పు కోసం మనం కాచుకు కూర్చోం. మన ప్రయత్నాలు మనం చేస్తూ వుండాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags