జూపాక సుభద్ర
పోయిన్నెల ఏప్రిల్ (19.4.12 నుండి 22.4.12) నాలుగు రోజులు స్పారో అనే మహిళా ఆర్గనైజేషన్ వివిధ రాష్ట్రాల దళిత కవయిత్రులు/ రచయిత్రులతో పాండిచ్చేరిలో ఒక వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ నుంచి చండాల్, పడాలి గరోడ, మహర్, పరయ, పల్లార్, మాదిగ కులాల రచయిత్రులు,కవయిత్రులు హాజరైనారు.
భారతదేశంలో దళిత మహిళలకు చదువులు, ఉద్యోగాలు, రాజకీయ పార్టీలు, ఎన్‌జివో మీటింగులు, మహిళా కాన్ఫరెన్స్‌లు, రచయిత్రుల మీటింగుల పేరుతో ఒక దగ్గర చేరి కలిసి కలబోసుకునే అవకాశాలు చర్చించుకునే వేదికలు లేవు. కొద్దిమంది దళిత మహిళ లు చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, రచయితలైనా, కవయిత్రులైనా కళాకారులైనా, ఉద్యమాల్లో వున్నా అటు పై కులాల మహిళలు కలుపుకోరు యిటు స్వంత మగవాల్లు చేయందించరు. అఖిల భారతస్థాయి దళిత, మహిళా కాన్ఫరెన్స్‌లల్లో కూడా నిర్ణాయక స్థాయిలో దళిత మహిళలు వుండే ప్రజాస్వామ్యాలు యిప్పటి దాకా చోటు చేసుకోలేదు. దళిత మహిళల జీవితాలు, చరిత్రలు, అనుభవాలు పోరాటాలు వెలుగులోకి రాలేదు. స్పారో సంస్థ యీ దిశగా ప్రయత్నించడం అందుకు వర్క్‌షాపు దళిత కవయిత్రులు/ రచయిత్రలు కోసం ఏర్పాటు చేయడం ఆహ్వానించదగింది. యీ సంస్థవాల్లు దళిత కవయిత్రుల్ని వెతుక్కోవడం చాలా శ్రమపడాల్పి వచ్చిందట. ఎంతో కష్టపడితేగాని ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 20 మందిని మాత్రమే గుర్తించామనీ, ఆయా రాష్ట్రాల్లో పేరున్న ఫెమినిస్టు రచయిత్రలు కూడా దళిత రచయిత్రుల్ని సూచించలేక పోయారని వాపోయారు.(స్పారో లక్ష్మి ఫోన్ చేసి దళిత రచయిత్రుల వివరాలు ఇవ్వమని అడిగినప్పుడు నేనే సుభద్ర, గౌరి, శ్యామల, స్వరూపరాణి తదితరుల పేర్లను, ఫోన్ నెంబర్లను ఇచ్చాను- కె. సత్యవతి)
మొదటి రోజు వివిధ రాష్ట్రాలనుంచి అంటే గుజరాత్‌నుంచి చంద్రబెగ్ శ్రీమాలి, మహారాష్ట్రనుంచి ఊర్మిళాపవార్, డా. జ్యోతిఅలాంజెవర్, తమిళనాడు- అరంగమల్లిక, బామ, కవిన్‌మలార్, సుకీర్తరాణి కర్నాటక – దు. సరస్వతి, ఆంధ్రప్రదేశ్- జూపాక సుభద్ర బెంగాల్- కళ్యాణి ఠాకూర్ చాడల్, స్మృతికాన హవల్దార్, మంజుబాలల పరిచయాలైనయి. సాయంత్రం ప్రముఖ తమిళ రచయిత్రి బామ రాసిన ములగపూడి (కారంపోడి) కథను నాటకంగా రూపొందించిన ప్రదర్శన చూడ్డం జరిగింది. వూరి భూస్వామినికి (దొర్సానికి) దళిత మహిళలకు జరిగిన ఘర్షణలో దొర్సానికి అనుకూలంగా కులసిస్టెమ్స్ ఎంత అనుకూలంగా వుంటాయనీ, దళిత ఆడవాల్ల పట్ల ఎంత కౄరంగా వుంటాయనేది చాలా వాస్తవంగా ‘కాత్తియకారిస్’ అనే నాటక గ్రూపు చాలా గొప్పగా ప్రదర్శించింది. యీ గ్రూపు ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ల శాఖది. యీ గ్రూఫులో చిన్న పిల్లలు. ట్రాన్స్‌జెండర్స్, ఐటి ఫ్రొఫెషనల్స్, జర్నలిస్ట్‌లు సెక్స్‌వర్కర్స్ దాదాపు పాతికమంది కళాకారులు పాల్గొనడం విశేషం.
2వరోజు స్పారో కో ఆర్గినేటర్ సి.ఎస్.లక్ష్మి వర్క్‌షాప్ ప్రారంభిస్తూ ‘మహిళల జీవితాలు, చరిత్రలు, పోరాటాలు ఆత్మగౌరవం కోసం మానవ హోదా కోసం జరిగినవని అర్థం చేసుకుంటే సానుకూల మార్పు సాధ్యమే. జెండర్ కులం ప్రాతిపదికగా తమ ఆర్గనైజేషన్ వారి వారి అనుభవాల్ని జీవితాల్ని, చరిత్రల్ని, కళల్ని పోరాటాల్ని రికార్డు చేస్తుంది. దాంట్లో భాగంగానే యీ దళిత రచయిత్రలు మీటింగ్ నిర్వహణ’ అని వివరించింది.
మీటింగ్ కొచ్చిన ఆరు రాష్ట్రాల దళిత కవయిత్రలు రచయిత్రలు మాత్రమే కాదు వారంతా పత్రికా సంపాదకులుగా పబ్లిషర్సుగా, థియే టర్ ఆర్టిస్టులుగా కళాకారులుగా, జర్నలిస్ట్‌లుగా రాజకీయ నాయకులుగా సామాజిక కార్యకర్తలుగా వివిధ ఉద్యమాల్లో వున్న వాల్లు, వారి సాహిత్యాలు, జీవితాలు, ప్రభావాలు వినిపించడంగా వర్క్‌షాప్ సాగింది.
యిదివరకు స్పారో సంస్థనుంచి ఆధిపత్య కులాల ఫెమినిస్టులతో చాలా వర్క్‌షాపుల పెట్టినామనీ వాల్లందరి జీవితాల్ని, సాహిత్యాల్ని రికార్డు చేశామనీ యిప్పుడు దళిత రచయిత్రులతో వర్క్‌షాప్ చేస్తున్నామని ఆ సంస్థ కో ఆర్డినేటర్ చెప్పారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న రచయిత్రులు తమ జీవితాల్ని, సాహిత్యాల్ని అనుభవాలు చెప్పేక్రమంలో దాదాపు అందరూ ఉద్వేగాలకు లోనయినారు. వాల్ల చదువులు ఎంత అవమానంగా సాగినాయనీ, తల్లుల కష్టాల్ని, పేదరికాన్ని, అంటరానితనాల్ని, దళిత ఆడవాల్లుగా ఎదుర్కొన్న సమస్యల్ని, తిండి, స్నేహితుల్ని, సాహిత్యాల్ని, అనుభవాల్ని అన్నీ కలబోసుకుంటూ మాట్లాడుతూ ఏడుస్తూ, ఏడుస్తూ మాట్లాడిండ్రు. బామ నుంచి సుకీర్తరాణి దాకా అందరూ అదే ఉద్వేగం. యిల్లా మూడు రోజులు సాగిన దుఖ్ఖోద్వేగం నాలుగోరోజు వర్క్‌షాప్‌లో సామూహికంగా గుజరాత్ రుడాలి నుంచి బెంగాల్ చండాల్స్‌దాకా రచయిత్రులంతా పెద్ద పెట్టున బోరున దమ్ము దమ్మార ఏడ్చిండ్రు. నేను ఏ మీటింగులో యింత సామూహిక దుక్కాన్ని పంచుకోలే, అసలు చూడలే.
ఎన్ని తరాల కష్టాలో, ఎంత అణుచుకున్న కన్నీళ్ళో, కట్టలు తెగిన చెరువులైండ్రు. అవి అణచబడిన జాతుల దుక్కాలు, మాతృ స్వామ్యాలు, మానవగౌరవాలు కోల్పోయిన అంటబడని జెండర్ పురా దుక్కాలు. ఎత్తిపోసుకున్న యెతలు.
మొదటిసారిగా భాషాంతరాల్ని అధిగమించి భౌతికంగా సమైక్యమైన సందర్భంలో పెల్లుబుకిన సంఘీభావ సమూహదుక్కాలు. బీల్లు దాటుకొనొచ్చిన గడ్డిపోసలన్నీ మోకుతాడుగా మారే సంఘటిత దుక్కం కూడా పాయలుగా చీలిన ఆ ప్రవాహాల దుక్కసారమంతా ఒక్కటే. ఆ ఉద్వేగాలన్నీ కులజెండర్ శ్రమ సంస్కృతుల సాంస్కృతిక సాధికారమై జంబూ ద్వీపమంతా విస్తరించాలనే కలలతో కలాలతో తిరుగు ప్రమాణం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags