హేమావెంక్రటావ్
తూర్పు తీరంపై విరుచుకుపడ్డ సునామీలా మొదలైన ‘కాకినాడ సెజ్’ ఇప్పటికే అనేక గ్రామాల్ని మింగేసింది. ఇళ్లన్నీ కూల్చివేయబడ్డాయి. విలువైన జీడి మామిడి, సరుగుడు తోటలు సమూలంగా నరికివేయబడ్డాయి. పచ్చని పొలాలు బీడుపడిపోయాయి. మొత్తంగా తనకు కావాల్సిందంతా తానే ఉత్పత్తి చేసుకొనే పటిష్టమైన అఖండ వ్యవస్థ కలిగిన పల్లెలు సర్వనాశనం అయ్యాయి. అపురూపమైన మానవ సంబంధాలకు ఆలవాలమైన ప్రశాంత జీవితాన్నే కోల్పోయిన సెజ్ బాధితులు;
ఏప్రిల్ 10న (2012) ”ఎవడు వాడు? ఎచటివాడు? ఇటు వచ్చిన సెజ్ వాడు…” అంటూ అల్లూరి పోరాట స్ఫూర్తిని స్పురణకు తెచ్చారు. వివరాల్లోకి వెళితే, కాకినాడ సెజ్ ప్రతిపాదిత గ్రామాలు గత రెండు మూడు నెలలుగా సెజ్‌కి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ వంటావార్పు, నిరసన కార్యక్రమాలు చేస్తూ వున్నారు. మోసపూరితంగా, బలవంతంగా సెజ్ వారు లాక్కున్న తమ భూముల్లో రైతులు, మహిళలు, పిల్లా పాపలతో ఏప్రిల్ 10న ఎరువాక నిర్వహిస్తుంటే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు దిగబడ్డారు. అప్పటికే అటు ప్రభుత్వం చేత, సెజ్ యాజమాన్యం చేత మోసానికి గురి కాబడ్డ ప్రజలకు పోలీసులను చూసేసరికి అరికాలి మంట నెత్తికెక్కినట్లయ్యింది. ”మా భూములు మేము దున్నుకుంటుంటే అసలు మీరు రావాల్సిన పనేంటి అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు. విషయం తేలేదాకా ఇక్కడ్నించి కదలనివ్వం అంటూ పోలీసు వాహనాల చుట్టూ మంటలతో గిరి గీసి చుట్టుముట్టారు. అంతలోనే అక్కడికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలను కూడా రాళ్ళతో, కర్రలతో తిప్పికొట్టారు. కాకినాడ సెజ్ ప్రతిపాదిత రమణక్కపేట గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా తిరిగి రగిలిన పోరాట జ్వాల ఇది.
ఈ ప్రజా పోరాటాల వేడిని ఓట్లుగా మల్చుకొనే కుట్రలో భాగంగా ఉప ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇస్తామంటున్నారు. కాని మిగులు భూములు, అసైన్డ్ భూములు పేదలకు పంచి, దాని యాజమాన్యం కుటుంబంలోని మహిళలకు ఇవ్వాలని, దానిని అమలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాని కేంద్రంలో ఉన్న పార్టీలైన, రాష్ట్రంలో ఉన్న పార్టీలైన ప్రపంచీకరణలో భాగంగా వస్తున్న సంస్కరణలకు వత్తాసు పలుకుతున్నవారే అన్న విషయాన్ని ప్రజలు ఎలా మర్చిపోతారు.
ఏ రాజకీయ శక్తులైనా, వ్యవస్థలైనా బానిస ఫ్యూడల్ వ్యవస్థలో భూమిని వాడుకున్నారే కాని, ఇంతగా భ్రష్టు పట్టించలేదు. అందుకే సెజ్‌లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్ ఆర్.ఎస్. రావు వివరణ ఈ సందర్భంగా ఎంతో సరియైనది. కమ్యూనిస్టు దేశాలు ఒక అడుగు వెనక్కి వేసిన కాలంలో పెట్టుబడి తనదైన శైలిలో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ కార్యక్రమంలో సెజ్‌లు అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి వున్నాయి. సోషలిస్టు సమాజాలను పునర్మించే కార్యక్రమంలో అంతరాష్ట్రీయ పెట్టుబడి ఎంచుకున్న రూపం సెజ్. ఈ పునర్ నిర్మాణ కార్యక్రమంలో మిగిలిన సమాజం దాని చరిత్రతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆధిపత్యానికి దూరంగా స్వచ్ఛంగా పెరిగినవే ఈ సెజ్‌లు అంటారాయన. నిజానికి ప్రజల ఆకాంక్ష అభివృద్ధి అయితే, పాలక వర్గాల ఆకాంక్ష అభివృద్ధి. పాలకులు పెట్టుబడి ద్వారా వృద్ధిని వ్యవస్థాగత మార్పులు లేకుండా తేవాలని చూస్తుంటే, ప్రజలు వ్యవస్థలో మార్పు ఒక కొత్త నిర్మాణంలోని అభివృద్ధిని చూస్తున్నారు. ఇది పాలకులకు, ప్రజలకు మధ్య వున్న వైరుధ్యం. అభివృద్ధి అనే భావనను నెట్టేసి వృద్ధి అనే భూతాన్ని చూపి, అదే అభివృద్ధిగా చూపిస్తున్నాయి ఈనాటి పాలక వర్గాలు. ఇంకా ముదునూరి భారతిగారి మాటల్లో చెప్పాలంటే ప్రత్యామ్నాయ అవకాశాలు నూతన సమాజంలో సాంకేతిక నైపుణ్యంతో కూడినది కాబట్టి నిర్వాసిత ప్రజలకు స్థానం లేకుండా పోయింది. పాత సమాజం నుండి క్రొత్త సమాజంలోకి నెట్టివేయబడ్డవారికి స్థానం లేక ఒక అడ్డంకిగా మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ పారిశ్రామికీకరణ కాలంలో వృద్ధి సాధ్యపడినా మిగులు మనుషుల సమస్యలు తీరకపోవడం, పేదరికం, నిరుద్యోగంలో ప్రభుత్వ పెట్టుబడిదారి వర్గాల దయాదాక్షిణ్యాల మీద బతికేవారిగా, అడ్డంకిగా చూడడం జరుగుతుంది.
చరిత్రలోకి వెళితే 2008 నుంచి సెజ్ కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటం మార్చి 8 పోరాట స్ఫూర్తితో పెద్ద ఎత్తునే ప్రారంభమయ్యింది. నాయకులపై అనేక కేసులు, అక్రమ అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పటికీ నాయకులు కోర్టుల చుట్టూ తిరగుతూనే వున్నారు. అయితే ఈ పోరాటంలో అత్యధికంగా పాల్గొన్నది స్త్రీలే. పోలీసులు గ్రామాలపై విరుచుకుపడితే, తామే ముందుగా తమ వారిని కాపాడుకోవటంతో పాటు అనేక విషయాలను చర్చించుకునే వారు. ప్రజలు ప్రకృతి వనరులను పోగొట్టుకోవడంతో పాటు దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటారు. వ్యవసాయానికి బదులు పారిశ్రామికీకరణే ప్రత్యామ్నాయంగా వచ్చే సమాజంలో కొత్త నైపుణ్యానికి వుండే జ్ఞానం కొరవడుతుంది. సెజ్ పేరిట జరిగే ఈ భూసేకరణ వల్ల స్త్రీలే ఎక్కువగా నష్టపోతారు. ప్రత్యామ్నాయ సమాజంలో కావాల్సిన నైపుణ్యం లేక వున్న కాస్తంతా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయి గృహపరిధిలోకి నెట్టివేయబడతారు. స్త్రీలకు కుటుంబ వనరులపై ఆధిపత్యం, హక్కు లేకపోయినా, ఓ మేరకు రక్షణ ఫ్యూడల్ వ్యవస్థలో ఉంటుంది. సహజంగా భూమి కోల్పోయినప్పుడు డబ్బు రూపేణా వచ్చే పునరావాసం పురుషుని చేతిలోకి వెళుతుంది. పితృస్వామిక సమాజంలో ఈ మార్పు పురుషుడి పెత్తనానికి లేక వ్యసనాలకు దారి తీసి, స్త్రీకి వున్న కాస్తంత రక్షణ కొరవడి బజారున పడవలసి వస్తుంది. ఉద్యోగం పురుష లక్షణంగా చూసే పితృస్వామిక సమాజంలో స్త్రీలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారు. ఇది కుటుంబ హింసకు దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఈ ఉద్యమంలోకి స్త్రీలు మరింత ఉదృతంగా వస్తున్నారు. కాకినాడ సెజ్ రాములమ్మ పోలేపల్లి చుక్కమ్మ జిందాల్ దేవుడమ్మ, రాయఘడ్ ఉల్కా మహాజన్, మంగుళూరు విద్యానటేషన్ వీళ్లంతా ఈ కోవకే చెందుతారు.
కాని విషాదమేమిటంటే కాకినాడ సెజ్ యాజమాన్యాన్ని ఠారెత్తిచ్చి ప్రతిఘటించిన స్త్రీలు, నాయకత్వ స్థానంలో లేరు. కేవలం ప్రతిఘటన స్వరాలుగా మిగిలిపోయారు. అందుకు కారణం ఇక్కడి సెజ్ నాయకత్వంలో పితృస్వామ్య ధోరణులు బలంగా ఉండడమే. సునామీలా వచ్చి పోలీసులను తరిమివేసిన స్త్రీలు అంతేవేగంగా నిమ్మకుండిపోతున్నారు. గత కొన్ని నెలలుగా వంటా వార్పు వంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా అందులో స్త్రీల భాగస్వామ్యం చెప్పుకోతగ్గదిగా లేదు. అయితే స్త్రీలు, పిల్లలు ముందుంటే పోలీసులు ఏమి చేయరన్న భావంతో కొంత మేరకి స్త్రీలను పిలుస్తున్నారే తప్ప వారిని నాయకత్వ స్థాయిలోకి తీసుకురావాలన్న అభీష్టం ఏమేరా లేదు. కుటుంబాన్ని ఇద్దరు వ్యక్తుల కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాలంతో విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులుగా గుర్తించకపోవడం పెద్ద లోపం. రాష్ట్రంలో సెజ్ ఉద్యమాలకి ఆదర్శంగా నిలిచిన కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటం మరింత పదును పెట్టుకోవడానికి తీసుకోవలసిన అత్యవసర విషయాలలో ఒకటి; స్త్రీల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం, మహిళా సాధికారిత పేరిట ప్రభుత్వం స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి తమ ప్రయోజనాలకు వాడుకుంటుంది. అయినా ‘సోంపేట’ లాంటి ఉద్యమాలలో స్త్రీలు కాల్పుల ఘటన తర్వాత ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ఆ మహిళలు ఉద్యమ శ్రేణులుగా అవతరించిననాడు పోరాటాలకు విజపథమే! ఆ దిశగా కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటం మహిళా సంఘ నిర్మాణ ఏర్పాటుకు ఇతర ప్రజాసంఘాలతో కలిసి ప్రయత్నించాల్సి ఉంది. రాజకీయ దృష్టి, తాత్విక పునాది మరింత పదునెక్కి ప్రజా పోరాటాల్లో పాల్గొంటూ వాటితో నడిచినప్పుడే ఇది సాధ్యమౌతుంది.
దడాలపాలెం-దుగ్గాడ
రెండూ ఊర్ల పేర్లే! అవేే మనుషుల పేర్లుగా ఎలా ఎదిగివచ్చాయో చూద్దాం. మామూలుగా అయితే ఒకే ఇంటిపేరు గలవారందరూ వుండే పేట పేరు అయినా ఊరు పేరు అయినా అదే వుంటుంది. కాని ఒక పిల్లని ‘దుగ్గాడ’ అని పిలుస్తుంటే ఒకింత ఆశ్చర్యపోవడమే గాక మరింతగా ఆలోచనలో పడిపోయాను.
అది కాకినాడ సెజ్ ప్రాంతం. అంటే అది ఏదో విహారప్రదేశం కాదు సుమా! పచ్చని పంట పొలాలలో పెట్టుబడి పెట్టిన చిచ్చు. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) ప్రత్యేక ఆర్థికమండలి. 2005లో పార్లమెంట్ చట్టం కూడా చేసి పారేసింది. నానా దేశాల కంపెనీలు పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులు తమ భూములన్నిటిని నామమాత్రం నష్టపరిహారం తీసుకొని ఏలినవారికి అప్పగించడమే తరువాయి. అయితే అప్పుడు వచ్చింది చిక్కు. కడుపు నిండా తిండిపెట్టే కన్నతల్లిని, పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఉండలేని రైతాంగం తిరగబడింది.
బాలగోపాల్ లాంటి మేధావులు, స్థానిక ప్రగతిశీల శక్తులు వారిని బలపరిచారు. 2007లో అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తితో పెద్దెత్తున మహిళలు సభ జరుపుకొని, సెజ్ నిర్మాణాలపై దాడికి దిగారు. ఆ తర్వాత క్రమము లోసెజ్ వ్యతిరేక పోరాట కమిటి కార్యక్రమాలు కూడా ఊపు అందుకొన్నాయి. అప్పుడు చాలా తెలివిగా సెజ్ యాజమాన్యం భూమి లేని దళిత గ్రామాలపై కన్ను వేసింది. ఐదు దళిత గ్రామాలను మొత్తంగా తుడిచిపెట్టే కుట్ర పన్నింది. దడాలపాలెం కేంద్రంగా దళిత గ్రామాలు ఐక్యపోరాటాలకు సిద్ధమవుతున్న తరుణం. దడాలపాలెం పేరుకే ఊరు, వాస్తవానికి చిన్న పల్లె, పెద్ద కాలనీ. ఒకప్పుడు ఎలా ఉండేదో కాని ఊరు, ఇప్పుడు అన్నీ ఇందిరమ్మ ఇండ్లే. ఓ యాభై గడప దాక ఉంటాయి.
…అందులో ఒకే ఒక్క సర్పంచ్ వడ్డీ నూకరాజు. అతగాడి ఇల్లు ఒకటే పెద్ద డాబా. ఓ ఇరవై ఎకరాల భూమికి అధిపతి అతడు. ఆ ఊరులో చాలామంది ఇంటిపేరు దడాలే. అందరి గుండెల నిండా దడే కాబోలు!
ఆ కాలనీకి ఒక చివర ఉప్మా బడి, అంగన్‌వాడి స్కూల్. ఆ స్కూల్లో పిల్లలకి ఉప్మా పెడతారు కాబట్టి అది ఉప్మా బడి. దాన్ని ఆనుకొనే చిన్న ప్రాథమిక పాఠశాల. వాటికి దగ్గరలోనే ఒక చిన్న చర్చి. ఆ పల్లెకి రెండుపక్కలా రెండు మట్టిరోడ్లు. అవి, రెండు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్రానికి పక్కనే వున్న బీచ్‌రోడ్డుకు కలుస్తాయి. రోజులో ఓ నాలుగు మాట్లు పిఠాపురం, కాకినాడ బస్సులు తిరుగుతాయి ఆ రూట్లో.
ఆ ఇండ్ల చుట్టూ కొబ్బరి చెట్లు కప్పేసి ఉంటాయి. ఆ ఊరి చుట్టూ సరుగుడు, జీడిమామిడి వృక్షాలు, తాడిచెట్లు అడివిలా అలుముకొని ఉంటాయి. ఇసుక నేలలు, నేలబావులు, పచ్చటి ప్రకృతి ప్రశాంతమైన గాలి, పరమళించే వెన్నల. పలకరించే చుక్కల ఆకాశం. దడాలపాలెం గురించి దడ పుట్టేలా చెప్పేసినట్టు ఉన్నాను కదా! సర్లెండి, సర్పంచ్ వడ్డీ నూకరాజు గారి డాబా పైకి వెళదాం సరదాగా! ఇంటి బయట, పొలం నుంచి అలిసిపోయి వచ్చి నూకరాజు నిదురపోతున్నాడు. అతడి భార్య నాగవేణి. అరవై ఏండ్ల నూకరాజుకి ముప్ఫై ఏండ్ల పడుచు భార్య. నలుగురు ఆడపిల్లలు వారికి. ఊరు ఊరంతా నూకరాజుని ‘నాన్న’ అని పిలుస్తారు, ఇంట్లో పిల్లల్లాగే. నిజంగా అతడు ఊరంతటికీ తండ్రిలాంటివాడే. ధర్మ తండ్రి. మాట అంటే మాటే. మాటకోసం, నిజాయితీ కోసం ఇందిరమ్మ కాంగ్రెస్ రాజకీయాలలో, 40 ఎకరాలలోంచి సగం వెళ్ళిపోయిందంట. నూకరాజు, నాగవేణిల కడగొట్టు పిల్ల పేరు విజయలక్ష్మి. ఉప్మా బడికి వెళుతుంది. ఆ పిల్లకి, పక్కింటి పాకలో, తన ఈడే వుండే బెతేన బేబి దడాలపాలెం ఊరు పేరు. దుగ్గాడ ఊరు పేరే. కాని ఇక్కడ ఇప్పుడు అమ్మాయి పేరు. నూకరాజు కూతురు విజయలక్ష్మి కూడా రేపు మూలపేటలోని సెజ్ పునరావాస కాలనీకి వెళ్లిపోవచ్చు. (ఇప్పుడు ఆ పిల్ల అక్కడే వుంటోంది). అప్పుడు విజయలక్ష్మి పేరు ‘దడాల’ అవుతుందా? ఏమో! చెప్పలేము.
మనిషి నామరూపాలు లేకుండా, ఊరులన్నింటిని మింగేస్తూ బకాసురుడిలా సెజ్ రాక్షసంగా విస్తరిస్తుంది. అది నేడు కాకినాడ సెజ్. రేపు కోస్టల్ కారిడార్. దాన్ని మట్టుబెట్టందే మనిషి బ్రతుక్కి విశ్రాంతి లేదు. మనిషి పేరుకి విలువా లేదు. మనిషి చరిత్రకి మనుగడ లేదు. కాకినాడ సెజ్‌కి వ్యతిరేకంగా 16 ఊర్ల ప్రజలు గత ఏడు ఏండ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే వున్నారు. రండి. వారికి అండగా నిలబడదాం. ఇవ్వాళ వారి చరిత్ర మాసిపోవచ్చు! రేపు పొద్దున మన చరిత్ర మీదా దాడి జరగవచ్చు. మొత్తంగా నిరాశ్రయమయ్యే మానవజాతిని, మన తరాన్ని కాపాడుకుందాం. సెజ్‌కి వ్యతిరేకంగా గళం విప్పుదాం. అందరం కలసి పోరాటం చేద్దాం! కడలి అంచున పొంచి ఉన్న సెజ్ ప్రమాదాన్ని ఆదిలోనే తుదముట్టిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags