మల్లీశ్వరి
”నేనో అద్భుతమయిన స్త్రీని చూశాను.” ఈ మధ్య కలిసిన మిత్రుడొకరు కళ్ళని మెర్క్యురీ లైట్లలా వెలిగిస్తూ అన్నాడు. యిట్లాంటి సమాజాల్లోనూ అవలీలగా బతికేస్తూ, తన వంతుగా గుప్పెడు మల్లెల పరిమళాల్ని లోకానికి దానం చేసే ప్రతి స్త్రీ అద్భుతమే కదా! యింకా కొత్తగా ఎవరి గురించి చెప్పబోతున్నాడీయన?
మగవాడు మెచ్చిన స్త్రీ అనేసరికి కసింత సందేహం వచ్చినా వెనక్కి నెట్టేసి ”ఎవరామె? చెప్పండి…” ఆసక్తిగా అడిగాను.
ఉత్సాహంగా మొదలు పెట్టాడు. ”గత పదేళ్ళుగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌తో నాకు స్నేహం వుంది. గొప్ప స్కాలర్ అతను. చాలా నేర్చుకున్నాను అతని వద్ద. ఈ మధ్య వ్యక్తిగత పరిచయం కూడా పెరిగి యింటికి కూడా రాకపోకలు పెరిగాయి. ఆయనెంత నిరాడంబరుడో అపుడే అర్థమయింది నాకు. ఆస్తి పాస్తులేం లేవు. యిల్లా… అయ్యవారి నట్టిల్లు… విద్యార్థులూ తన పరిశోధనలు యివే లోకం ఆయనకి. ఆయన భార్యే నేను చూసిన అద్భుతమయిన స్త్రీ.” ఒక్క క్షణం ఆగాడు. నేను మౌనంగా వింటున్నాను.
”వాళ్ళ పెళ్ళయి ముప్ఫయ్యేళ్ళపై మాటే. ఆయనకి రోజూ డ్రింక్ చేసే అలవాటుంది. దాంతో పొద్దున్న లేచేసరికి కడుపులో మంట… హేంగోవర్… అందుమూలంగా ఆమె ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేదంటే, ఆయన నిద్రలేచి తన పనులు చేసుకుని యూనివర్సిటీకి బయల్దేరే సమయానికి రెండు గిన్నెల్లో అన్నం కలిపేది. ఒక గిన్నెలో కూరన్నం, యింకో గిన్నెలో పెరుగన్నం…. ఆయన తన జీర్ణకోశం అనుమతించిన దాన్ని బట్టి ఏదొక గిన్నెలోనిది తిని యింకోటి వదిలేసేవాడు. యిట్లా ముప్ఫయ్యేళ్ళుగా క్రమం తప్పకుండా ఆయన ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధగా వుండేదని రిటైర్మెంట్ ఫంక్షన్లో చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.” నాకు మొదట్లో కలిగిన సందేహాన్ని నిరాశపరచకుండా మైమరపుగా అన్నాడు మిత్రుడు.
ఇదన్నమాట అద్భుతమయిన స్త్రీత్వం అంటే !
”సరే… బానే వుంది, మరి రెండో గిన్నె సంగతేంటి?” అన్నాను.
”రెండో గిన్నె ఏంటి?” అయోమయంగా అన్నాడు.
మీ ప్రొఫెసర్ ముప్ఫయ్యేళ్ళుగా రెండు గిన్నెల్లో ఒకటి ఎంపిక చేసుకుని తిన్నాక, మిగిలిపోయిన రెండవ గిన్నెలో అన్నాన్ని యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎవరు తిని వుంటారో వూహించ గలవా? ఆ రెండో గిన్నె రాజకీయం నీకు అర్థం కాలేదా?” అన్నాను.
మిత్రుడు షాక్ తిన్నట్టు అయిపోయి, అతను కనిపెట్టిన అద్భుతమయిన స్త్రీలో అద్భుతాన్ని నేను పేలప్పిండిలా ఎగరగొట్టేసినందుకు ఉక్రోషపడిపోయి ”ఫెమినిస్టులు యింతే! త్యాగం మంచితనం లాంటి గుణాలకి విలువ యివ్వను. పెడర్థాలు తీస్తారు….” అన్నాడు.
”అవున్లే! మీరిచ్చే బిరుదుల కోసం స్త్రీలు ఏళ్ళకేళ్ళు త్యాగాలు చేసుకుంటూ రావాలి కదా మరి.” అన్నాను. అట్లా ఆ వాదన ఖండాంతరాలు దాటింది.
ఇట్లాంటిదే మరో సంఘటన.
ఇటీవల స్పాట్ వాల్యుయేషన్‌లో యిద్దరు తెలుగు పి.జి. లెక్చరర్ల మధ్య జరిగిన సంభాషణ నాకు కొత్త అవగాహనని కలిగించింది.
”ఒకపుడు గొప్ప గొప్ప బ్రహ్మణ పండితులు, యితర అగ్రవర్ణాల వారూ చదివిన తెలుగు యిపుడు ఎస్.టి, ఎస్.సి, బి.సిలు చదువుతున్నారు. సమాజంలో బాగా మార్పు వచ్చింది. దళితులకి అవకాశాలు పెరిగాయి. యిది చదవొచ్చు, యిది చదవకూడదు అన్న నియంత్రణలేవీ లేవు” అన్నాడు ఒక లెక్చరర్.
అతని పరిశీలన అర్థ సత్యం. చాలా విశ్వవిద్యాలయాల్లో, పి.జి. సెంటర్లలోని తెలుగుశాఖల్లో యిపుడు ఎక్కువ మంది ఎస్.టిలు, తర్వాత స్థానంలో ఎస్.సిలు, కొందరు బి.సిలు, ఒకరో యిద్దరో ఎఫ్.సిలు చేరుతున్నారు. ఆ లెక్చరర్ చెప్పినట్టు నిజంగా సామాజిక న్యాయంలో భాగంగా యిదంతా జరుగుతోందా? దళితులకి అవకాశాలు పెరిగిపోయి గొప్పవారు కాబోతున్నారా? కానేకాదు.
వివక్షరూపం మార్చుకుని ఆర్థిక అంశాలని యిముడ్చుకుంది.
ఒకపుడు గొప్ప గౌరవాన్ని, ఉద్యోగావకాశాలనూ యిచ్చిన తెలుగు చదువు క్రమేణా ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. తెలుగు వెలుగుతున్నపుడు, ముందు వరుసలో అవకాశాలను అంది పుచ్చుకున్న అగ్రవర్ణాల వారు దానికి అవకాశాలు తగ్గడంలో వెలుగులో వున్న చదువుల వైపు తరలి పోయారు.
ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, మిగిలిపోయిన రెండో గిన్నె అవకాశాలను దళితులు వాడుకోవాల్సి వచ్చింది.
ఇప్పటికీ తినే తిండీ, చదివే చదువులో కూడా అడుగు బొడుగు అవకాశాలే స్త్రీలకీ, దళితులకీ దక్కుతుండటం నమ్మలేని ఒక వాస్తవం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Pingback: రెండవ గిన్నె రాజకీయాలు | జాజిమల్లి