కొండవీటి సత్యవతి
అబ్బూరి ఛాయాదేవిగారు ఏ పని చేసినా ఎంతో కొత్తగా, సృజనాత్మకంగా వుంటుందనడానికి తార్కాణం ఆవిడ ఇటీవల తయారు చేసిన 1948 నుండి 2011 దాకా ఛాయాచిత్ర కథనం. (రాజమండ్రి నుంచి రాజమండ్రిదాకా) నాకు తెలిసినంతవరకు తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఇంతవరకూ ఎవరూ చెయ్యలేదు. ప్రస్తావనలో తానే ఇలా చెప్పారు.
”జీవితం పొడుగునా రకరకాల అనుబంధాలు ఏర్పడిన వ్యక్తులను స్మరించుకుంటూ, పోయిన వారికి స్మృత్యంజలి ఘటిస్తూ, బతికి ఉన్నవారికి కృతజ్ఞతాసుమాలు సమర్పిస్తూ ఆత్మీయతని చూపిస్తూ రూపొందించిన సజీవ సచిత్ర ఆత్మకథ ఇది. ఇది నా ఛాయాచిత్ర కథనం.”
సాధారణంగా ఆత్మకథలు సుదీర్ఘంగా సాగుతూ అక్కడక్కడా కొన్ని ఫోటోలు తళుక్కుమంటుంటాయి. అయితే ఛాయాదేవిగారి పుస్తకంలో మాత్రం – (నిజానికి దీనిని పుస్తకం అనకూడదు. ఛాయాదేవి గారు ఛాయాచిత్ర కథనాన్ని సిడిలో భద్రపరిచారు. కొన్ని కాపీలను కలర్ జిరాక్స్ తీయించి నాలాంటి కొందరు మితృలకు ఇచ్చారు. ఈ పుస్తకాన్ని ఎవరైనా ప్రచురిస్తే చాలా బావుంటుంది. ఈ సి.డి.ని అస్మిత వారి వెబ్‌సైట్‌లో పెడతారని వారి వెబ్‌సౖెెట్ అడ్రస్ యిచ్చారు. ఫోటోలు మాట్లాడతాయి ఫలానా ఫోటో ఎక్కడ, ఎ సందర్భంలో, ఎవరితో దిగారు. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు, వారితో తనకున్న సంబంధబాంధవ్యాలు చెప్పుకుంటూ వెళ్ళతారు.
ఈ పుస్తకంలో మొదటిఫోటో 1948లో వారి అన్నయ్య డా. ఎం.జి. కృష్ణ తీసారు. అప్పటికి ఛాయాదేవి గారి వయస్సు 15 సంవత్సరాలు. ఆ తొలిఫోటో నుంచి మొదలుపెట్టి దాదాపు రెండువందల పేజీలు ఎ4 సైజులో వందలాది ఫోటోలు, వ్యాఖ్యాలు. చివరి ఫోటో 6.8.11 నుండి 8.8.11 రాజమండ్రిలో జరిగిన సాహిత్య అకాడమీ వారు తీసిన ఫోటో. తొలి ఛాయా చిత్రం, తుది ఛాయాచిత్రానికి నడుమ ఛాయాదేవిగారి బంధువులు, మితృలూ, ఆత్మీయులూ, సభలు, సమావేశాలకు చెందిన ఫోటోలు చెప్పే కథల్లో అరవై మూడు సంవత్సరాల సాహిత్య చరిత్ర యిమిడి వుందంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క ఫోటోను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆ ఫోటో తీసిన సందర్భానికి ఎంతో ప్రాముఖ్యత వుంటుంది.”మా పెళ్ళికి ఫోటోలు లేవు. పెద్దగా బాజా భజంత్రీలూ లేవు”అంటూ ఛాయాదేవిగారు 19 పేజీలో ఓ అద్భుతమైన ఫోటో పెట్టారు. ఇంటి బాల్కనీలో అబ్బూరి వరదరాజేశ్వరరావుగారు, ఛాయాదేవిగారు హృద్యంగా నవ్వుతున్న ఫోటో అది. గమ్మత్తేమిటంటే ఈ పుస్తకంలోని దాదాపు ఎనభై శాతం ఫోటోల్లో ఛాయాదేవిగారు సీరియస్‌గా వున్నవే వున్నాయి. పైన నేను పేర్కొన్న ఫోటోలో ఇద్దరూ భలే నవ్వుతుంటారు.
ఛాయాదేవిగారు ఢిల్లీలో వున్నపుడు ఇందిరాగాంధి, నెహ్రూలాంటి రాజకీయ ప్రముఖుల్ని కలసినపుడు తీసిన ఫోటోలు, వారి వివరాలు చదవడానికి చాలా బావున్నాయి. ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకునే ఫోటోలు చూడడం వేరు, అవి చెప్పే కథలు చదవడం వేరు. ఎంతో అపారమైన జ్ఞాపకశక్తి వుంటే తప్ప ఆ పని చేయలేం. ఛాయాదేవిగారు 63 సంవత్సరాల చరిత్రని అవలీలగా ఫోటోలతో చెప్పించారు. తాను ఈ ప్రయత్నం ఎందుకు చేసానో చెబుతూ ” అసలు ఈ పనులన్నీ ఎందుకు పెట్టుకోవడం అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వుంటాను. నేను పోయాక ఈ కాగితాలు, పత్రాలు, ఫోటోలు ఏమైపోతే నాకెందుకు అని వేదాంత ధోరణిలో అనుకోకుండా వాటిని డిటిపి చేయించి, స్కానింగ్ చేయించి, సి.డిల్లో కెక్కించి వెబ్‌సైట్‌లో (ప్రచురించడం మరీ క్లిష్టం, కష్టం కనుక) పెట్టడం దేనికి? నేను పోతే నా రచనలగురించి, ఫోటోల గురించి పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. ఎవరి అభిరుచులూ, ఆసక్తులూ, బాధ్యతలూ వాళ్ళవి. నా పేరు ఇంకా కొనసాగాలన్న తాపత్రయం కన్నా, నాకు ఇంత పేరు రావడానికి వెనుక ఎంతమంది పెద్దల, మిత్రుల, బంధువుల, అబిమానుల ఆదరాభిమానాలు, సహకారాలు ఉన్నాయో తలుచుకుని, నలుగురికీ తెలియచేసే మార్గం ఇదేనని తోచడంవల్ల ఈ కార్యక్రమానికి పూనుకున్నాను” అంటూ వివరించారు.
ఏది ఏమైనా గానీ తెలుగులో ఓ అపూర్వ, నవీన కార్యక్రమానికి ఆద్యురాలుగా నిలిచిన అబ్బూరి ఛాయాదేవిగారు అభినందనీయులు. ఈ పుస్తకం విస్తృతంగా బయటకు వచ్చివుంటే, ఆ పుస్తకాన్ని చూసిన వారందరూ ఖచ్చితంగా తమ ఫోటో ఆల్బమ్‌ల దుమ్ము దులపడం ఖాయం. ఒక్కో ఫోటోని సుదీర్ఘంగా చూస్తూ, ఆ ఫోటో చరిత్రను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఛాయాదేవిగారిని అనుసరించడం జరిగే తీరుతుంది. పుస్తకం మొత్తం చూసాక ఛాయాదేవిగారితో వివిధ సందర్భాలలో వున్న నా ఫోటోలు చూసుకుని చాలా సంతోషపడి ”ఛాయాదేవిగారూ నావి, భూమిక కార్యక్రమాలవీ చాలా ఫోటోలున్నాయి మీ పుస్తకంలో ” ”అంటే భూమికతో నా అనుబంధం అలాంటిది మరి” అన్నారు నవ్వేస్తూ…
ఎంతో శ్రమకోర్చి ఛాయాదేవిగారు తయారు చేసిన ”ఛాయాచిత్ర కథనం” అందరికీ అందుబాటులోకి వస్తే చాలా బావుంటుంది. దానికి ఎవరైనా పూనుకుంటారేమో ఎదురుచూద్దాం. ఇంత చక్కటి ఆలోచన చేసి ఎంతో కష్టపడి ఛాయాచిత్రకథనం రాసి తెలుగువారికి అందుబాటులోకి తెచ్చిన ఛాయాదేవిగారి ప్రయత్నం మరెందరికో స్ఫూర్తి దాయకం కావాలని ఆశిస్తున్నాను.
ఛాయాదేవిగారి ప్రస్తుత చిరునామా: రూమ్‌నెం. 103, సి.ఆర్ ఫౌండేషన్, కొండాపూర్, హైద్రాబాద్ 500 084 ఫోన్: 8179377817
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags