చివుకుల శ్రీలక్ష్మి
‘స్వ’రక్షిత
సృష్టిలో సగభాగాన్నీ
ముగ్గురమ్మల మూలపుటమ్మను
శుంభనిశుంభులను ఖండించిన దుర్గను
నదులన్నింటి స్వరూపాన్ని
నగధీర గంభీరను నేను ధరిత్రీమాతను!
అయినా! ఆడపిల్లను!
తొమ్మిది నెలలూ మోసే తల్లి కంటుందో, లేదో?
బుడిబుడి అడుగులు నడుస్తూ
గునగున నట్టింట తిరుగుతున్నా
ఏ కామాంధుడు నా శీలాన్ని దోచి
నా ప్రాణాన్ని గాల్లో కలిపేస్తాడేమో భయం!!
స్కూలుకి వెళ్తున్నా ప్రేమికుడనంటూ
ఏ వేటగాడు కొడవళ్ళతో తిరుగుతున్నాడో భయం!!
కాలేజికి వెళ్తున్నా ప్రేమించమంటూ
ఏ పిచ్చోడో ఆసిడ్ బాటిల్‌తో తిరుగుతున్నాడని భయం!!
ఉద్యోగానికెళ్తున్నా అశ్లీల పదాల్తో
వినీవినబడక గొణిగే పై ఉద్యోగులంటే భయం!!
వివాహబంధంతో రక్షణ కల్పిస్తాడంటే
వాడెన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో తెలీని భయం!
శతాధిక వృద్ధురాలినైనా స్వర్ణంతో పాటూ
శీలాన్ని దోచే దొంగలంటే భయం!
అమ్మాయీ! నీకు చదువుతో పాటు
జీవించే కళనీ నేర్పిస్తాం అంటూ
ప్రోత్సహించే గురువులంటే ఇష్టం!!
నా ప్రమేయం లేకుండా జరిగే తప్పులకు
నన్ను దండించకుండా
అక్కున చేర్చుకునే అమ్మా నాన్నా నాకిష్టం!!
ఎక్కడ ఏ స్త్రీకి అన్యాయం జరిగినా
నేనున్నానంటూ సహాయం చేసే
భూమిక అంటే మరీ మరీ ఇష్టం!!!
గండికోట వారిజ
చేదబావి
ఇంకా జ్ఞాపకమే
తాగునీటికి వచ్చే ఆడవారి మాటలతో
రాగి బిందెలు నన్ను తాకి
నిద్రలేపేవి
గిలక చప్పుళ్ల మధ్య మనసులు విప్పుకుంటూ
ప్రేమలు పంచుకుంటూ
చుట్టూ పశువుల మందతో
ఎప్పుడూ సందడిగా వుండేది..
అత్తారింట కబుర్లు, విసుర్లు
పరిష్కారాలు ఇక్కడే జరిగేవి
సర్దుకుపోవటాలు
సరిదిద్దుకోవటాలు
ఇక్కడే నేర్చుకునే వాళ్లు..
ఒకరి అనుభవాలు
ఒకరికి పాఠాలు అయ్యేవి
బాధనంతా నాదగ్గర చెప్పేసుకుని
భారం దిగిన మనసుతో
కొత్త శక్తిని నింపుకుని వెళ్లేవాళ్లు..
వూర్లో వూపిరి పోసుకున్న ప్రతిబిడ్డకు
తొలిస్నానమైనా,
ఏ ఇంటి ఆడబిడ్డ పెద్దమనిషైనా
పెండ్లి కూతురి తొలి నలుగు స్నానమైనా
శోభనాల స్నానమైనా, సీమంతమైనా
నలుగుపెట్టి మంగళ స్నానాలు
నా దగ్గరే జరిగేవి
ఆ కాలంలో వూర్లో ఆడవాళ్లను
సీరియల్ పెట్టె నేనే!
ఎన్నేసి కథలు, కబుర్లు, నవ్వులు
లాలిపాటలు, జానపదపాటలు
నలుగు పాటలు, పని పాటలు…
ప్రతి రోజూ సందడే… పండగ శోభే..
పెద్ద పండగ వస్తే చాలు
అమ్మగారింటికి వచ్చే ఆడబిడ్డల్లా
వూరిలోని ఆడవారందరూ నా చుట్టూ
ఉత్సవాలు చేసేవారు.
ఉయ్యాల పాటలు పాడి
గంగమ్మతో పాటు నిద్రపుచ్చేవారు.
సారె తీసుకుని చివరి రోజు
తృప్తిగా సంతోషంగా కళ్లనిండా వొచ్చే
నీళ్లు ఒత్తుకుంటూ
‘అమ్మ’ లా చల్లగా దీవించే దాన్ని
పండగకు వచ్చి తిరిగి వెళుతున్న
ఆడబిడ్డల వీడ్కోలులా భారంగా
సూరీడెళ్లిపోయాడు… చీకటి.
ఏమయిందో తెలీదు, నోరు విప్పను
బాధ చెప్పదు.. అమ్మగారింటికొచ్చిన
ఒక ఆడబిడ్డ తిరిగి వెళ్లలేదు
వంటిపైన వాతలు, సిగరెట్‌తో కాల్చిన గాయాలు
కడుపులో అత్తగారింట ఛీత్కరించిన ఆడశిశువు
అమ్మా.. అంటూ నన్ను కౌగిలించుకుంది
భరించలేని బతుకు అర్థమై.. నా గుండె చేరువైంది..
దిక్కులు అరిసేలా ఏడ్చాను- నా పొత్తిళ్లలో
చనిపోయిన చిట్టితల్లిని పెట్టుకుని
ఇక ఏ కన్నీటి కథలూ వినలేక
పాడు పడిపోయాను…
గిలకకు చిలుమెక్కింది
నాలో.. నా చుట్టూ పిచ్చి మొక్కలు
ఎవ్వరూ రారు.. ఏ సందడీ లేదు
ఏ పండగా లేదు.. ఎవరికి వారే
మనసు విప్పి ఒకరితో ఒకరు
మాట్లాడుకోకుండా,
బి.పి., షుగర్‌లు వచ్చాయి మా వూర్లోకి!
పిచ్చిగడ్డి, పాములు, బూజులు వేలాడుతూ
జీవంలేని నా పేరిప్పుడు
చెదబావి.. చావులబావి..
బాధతో చేదెక్కిన నాతీయని నీళ్లు
ఏదో ఒకరోజు మళ్లీ ‘పెద్దల పండగ’ వస్తుందని
ఆశతో చూస్తూ.. !
మార్గరెట్ ఆట్వుడ్
కాలిపోయిన ఇంట్లో…
అనువాదం: కె. సునీతారాణి
కాలిపోయిన ఇంట్లో ఫలహారం తింటున్నా
అయితే…
ఇల్లు లేదు, ఫలహారం లేదు
నేను మాత్రం ఉన్నాను
మెలి తిరిగిన చెమ్చా
వంగిపోయిన గిన్నె
చుట్టూ ఎవ్వరూ లేరు
ఎక్కడికి వెళ్లారు వీళ్ళందరూ?
అన్నయ్య, చెల్లి, అమ్మ, నాన్న?
సముద్రపు ఒడ్డున నడుస్తూ వెళ్ళారేమో
వాళ్ళ బట్టలింకా దండెం మీదే ఉన్నాయి
స్టవ్ మీద మసిబారిన టీ గిన్నె
పక్కన సింక్‌లో
వాళ్ళు వాడిన పాత్రలు
ప్రతి వివరం స్పష్టమే
పింగాణి కప్పు, బుడగల అద్దాలు
ఈ రోజు ప్రశాంతంగా ఉంది, కానీ నిశ్శబ్దంగా ఉంది.
నీలంగా సరస్సు, అడవి గమనిస్తోంది
నల్లటి రొట్టిముక్కలాగా
తూర్పున ఒక మబ్బుతునక మౌనంగా పైకి లేస్తోంది
నూనె బట్టల్లో ముడతలు
అద్దాల్లో బీటలు.. సూర్యుడి ప్రతాపం అది
నా కాళ్ళు చేతులు నాకే కనిపించట్లేదు
మళ్లీ ఇక్కడికి రావడం
చిక్కుముడో, వరమో తెలియట్లేదు
ఎంతో కాలం కిందటే ఈ ఇంట్లో అంతా ముగిసిపోయింది
టీ గిన్నె, అద్దం, చెమ్చా, గిన్నె
నా శరీరం కూడా
అప్పటి నా శరీరం
ఇప్పటి నా శరీరం కూడా
ఇలా ఒంటరిగా, ఆనందంగా, భోజనాల బల్ల దగ్గర
మాడిపోయిన నేల మీద పసిపిల్లల పాదాలు
(న్కానిపిస్తున్నాయి)
కాలిపోతున్న నా బట్టలు, పల్చటి ఆకుపచ్చ నిక్కరు
పసుప్పచ్చ టీ షర్టు
దాదాపు లేదనిపించే బొబ్బలెక్కిన
నా చర్మం మీద బిగుతుగా, మండిపోతూ
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
చివుకుల శ్రీలక్ష్మి గారు!
మీ కవిత ‘స్వ’రక్షిత లొ ఇష్టాల కంటె భయాలగురించి ఎక్కువ చెప్పారు.
జీవించే కళనీ నేర్పిస్తాం అంటూ ప్రోత్సహించే గురువులంటే ఇష్టం అని వ్రాసారు. బాగుంది.
పిల్లలలొ దైర్యాన్ని పెంచవలసిన పెద్దలు భయపడ కూడదు