పసుపులేటి గీత
‘ప్రతి నీటి బొట్టుకూ చక్కటి జ్ఞాపకశక్తి ఉంటుంది. అందుకే అది తాను ఎక్కడ పుట్టిందో తిరిగి అక్కడికే చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూంటుంది ‘ అంటారు అమెరికన్ నవలా రచయిత టోనీ మారిసన్.
అలా ప్రయత్నించే నీటిబొట్టు దారిని మనిషి గొంతులోకి మళ్ళించడంలో ప్రపంచం విఫలమవుతోంది. ఆ వైఫల్యం తాలుకూ దుష్పలితాలు ఇలా ఉన్నాయి. ప్రపంచంలో యుద్ధాలకంటే, మరే ఇతర హింసల కంటే కూడా మనుషుల్ని అసంఖ్యాకంగా హతమారుస్తున్నది ఏమిటో తెలుసా? నీరు. పరిశుభ్రమైన తాగునీరు కరువై ప్రపంచవ్యాప్తంగా ఏటా 3,575 మిలియన్ల మంది రోగాల బారినపడి మరణిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రపంచంలో 884 మిలియన్ల మందికి పరిశుభ్రమైన తాగునీరు లభించడం లేదు. ఒక నగరంలో నివసించే ధనికులకంటే మురికివాడల్లో నివసించే ప్రజలే ఐదారు రెట్లు ఎక్కువగా తాగునీటి కోసం డబ్బును ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలోని ఏ నగరం దీనికి మినహాయింపు కాదు.
తాగునీటిలో శుభ్రత లోపించినందున వ్యాపించే రోగాల బారిన పడి భూమ్మీద ప్రతి ఇరవై సెకన్లకూ ఒక పసిబిడ్డ కన్నుమూస్తోంది. ‘పానీ పట్టూ’ అంటూ ఆడవాళ్ళని గేలిచేస్తూ మన మీడియా రాసే రాతలు ఎంత హేయమైనవో తెలుసా? కుళాయిల దగ్గర ఆడవాళ్ళు నీటికోసం పరస్పరం తగువులాడితే అదేదో వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట అంటూ మాట్లాడే మన ‘చర్మం బలుపుగాళ్ళు’ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, కుటుంబంలో ప్రతి ఒక్కరి గొంతూ తడపడానికి మహిళలు రోజుకు 200 మిలియన్ల పనిగంటలు ఖర్చు పెడుతున్నారు.
ప్రపంచంలో ఒక వారానికి ముప్ఫెవేల మరణాలు సంభవిస్తే, అందులో తొంభైశాతం అపరిశుభ్రమైన తాగునీటి వల్లే చోటు చేసుకుంటున్నాయి. అపరిశుభ్రమైన తాగునీటివల్ల ప్రబలే అనేక రోగాల్ని నయం చేయగలిగినప్పటికీ, ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరివల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో రోగాలవల్ల ఎదురవుతున్న సమస్యల్లో పదిశాతాన్ని కేవలం పరిశుభ్రమైన తాగునీటితో నివారించవచ్చునని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అత్యంత ప్రమాదకరంగా ప్రభావితం చేసే శక్తి నీరు.ప్రతి నగరంలోనూ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఇదే. ఈ విషయాన్ని బ్యాంకర్లు, ఇతర వాణిజ్య సంస్థల అధినేతలు గుర్తించాల్సి ఉంది. ఆర్థిక పురోభివృద్ధిని ప్రభావితం చేసే ఏకైక ప్రకృతి వనరు నీరు మాత్రమేనన్న నిజాన్ని అందరూ గుర్తెరగాలి’ అంటున్నారు ప్రపంచ ఆర్థిక సమాఖ్య ఉపాధ్యక్షులు మార్గరెట్ కాట్లీ కార్ల్‌సన్.
నలభై ఐదు దేశాల్లో జరిగిన అధ్యయనాల ప్రకారం 76 శాతం కుటుంబాల్లో తాగునీటిని సమకూర్చే బాధ్యతని స్త్రీలు, పిల్లలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వీరు వెచ్చించే పనిగంటల్ని అదనపు ఆదాయాన్ని సమకూర్చే ఇతర పనుల కోసం వెచ్చించవచ్చు. పిల్లలు ఈ పనిగంటల్ని పాఠశాలల్లో చదువును కొనసాగించడానికి వెచ్చించవచ్చు. ప్రపంచంలో ఐదేళ్ళలోపు పిల్లల ప్రాణాల్ని బలితీసుకుంటున్న వ్యాధుల్లో అతిసారం రెండో స్థానంలో ఉంది. ఏటా సంభవించే 1.5 మిలియన్ మరణాల్లో అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు అతిసారానికి బలైపోతున్నారు. మలేరియా, ఎయిడ్స్, మశూచివంటి వ్యాధులన్నీ కలిపిినా సంభవించే మరణాల రేటు, అతిసారం వల్ల సంభవించే మరణాల రేటు కంటే తక్కువగా ఉంది. ఈ అతిసారం అపరిశుభ్రమైన తాగునీరు వల్లే సంక్రమిస్తుందని వేరుగా చెప్పనక్కర్లేదు. తాగునీటి కొరత గురించిఈ ప్రపంచంలో తెలుసుకోవలసిన ఎన్నెన్నో చేదు నిజాలు ఉన్నాయి. ప్రాణాధారమైన తాగునీరు మన నగరపాలక సంస్థల నిర్లక్ష్యంవల్ల డ్రైనీజీల పాలవడాన్ని ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ మనం గమనిస్తుంటాం. ఏ సులభమైన పనిని అయినా ‘మంచనీళ్ళప్రాయం’ అనడం మనకు రివాజు. కానీ ఇవాళ అత్యంత కష్టమైన విషయం ఆ మంచినీళ్ళే కావడం మన దురదృష్టం. ప్రపంచం బొట్టు నీటికోసం ముఖం వాచిపోతున్నా మనం మాత్రం ఇంకా పగిలిన పైపుల్లోంచి రోడ్ల మీదికి ప్రవహిస్తున్న తాగునీటిని దాటుకుంటూ నడిచేస్తుంటాం. కానీ దాటలేని విపత్తును మనకోసం సృష్టిస్తున్న భవిష్యత్తు మీద మనకు ఏమాత్రం అవగాహన లేకపోవడం విషాదకరం. బంగారం ధర పెరుగుతోందని పడుతున్న ఆరాటాన్ని సగం తాగునీటికోసం మళ్ళిస్తే మన భవిష్యత్తు తరాలకు జీవన భద్రతను కల్పించిన వాళ్ళమవుతాం. ఇంతటి మానవాళి జీవితమూ గుక్కెడు తాగునీళ్ళ గుప్పెట్లో ఉన్న విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags