తమ్మెర రాధిక
ప్రొద్దున్నే ఆటో దిగి లోపలికొస్తున్న మరిది పిల్లల్ని, వాకిలి చిమ్ముతున్న వసుధ చూసింది. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. లోపలికి పోబోతున్న వాళ్ళ మీద చినుకులు పడేట్టు విసురుగా కళ్ళాపి చల్లింది. వాళ్ళను చూసిన ఆమె మనసు భగభగ మండింది.
మళ్ళీ దేనికొచ్చారో దేభ్యాలు! కసిగా పళ్ళు నూరుకుంది. మంచం మీద నుంచి లేస్తున్న నారాయణ లోపలికొస్తున్న పిల్లలిద్దర్నీ చూసి చిరు నవ్వు నవ్వాడు.
”ఏంట్రా ఇంత ప్రొద్దున్నే వచ్చారూ! స్కూల్లేదా?” అడిగాడు నారాయణ.
ఆ మాటకే ఎదురు చూస్తున్న వాళ్ళలా ఒక్కంగలా తాతగారి ఒళ్ళో పడ్డారిద్దరూ, ‘తాతయ్యా’ అంటూ.
అప్పుడు గమనించాడు నారాయణ వాళ్ళని, తలలు రేగి, కళ్ళన్నీ ఉబ్బి మలినమయిన ముఖాలతో వుండటం చూసి,
”ఏమయింది?” యిద్దర్నీ దగ్గరికి పొదుపుకుంటూ అడిగాడు ఆత్రుతగా!
”మరే… నాన్న అమ్మను పట్టుకొని పెద్దగా ఏడుస్తున్నాడు. అమ్మ రాత్రంతా మాకు ఏమీ వండ లేదు. అన్నం కూడా తినలేదు. పొద్దున్నే లేచి చూసినప్పుడు కూడా యిద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. మాకు భయం వేసి స్కూలు ఆటో అంకులు దగ్గరికి పోయి తాతయ్య ఇంటికి తీసుకు పొమ్మంటే ఇక్కడికి తీసుకొచ్చాడు.” గుక్క తిప్పుకోకుండా చెప్పాడు వాసు.
ఆ మాటలకు వాసు నాయనమ్మ కంగారు పడింది.
”ఫోను చేసి కనుక్కోండి… ఒకళ్ళనొకళ్ళు పట్టుకోని ఏడ్చే కష్టం ఏమొచ్చిందట! ఏమన్నయ్యిందో కనుక్కోండి.” అంది.
గుమ్మం బైట వాళ్ళ మాటలు విన్న వసుధ విసురుగా లోని కొచ్చింది.
”మళ్ళీ ఏమవసరం వచ్చిందిట పొద్దు పొద్దున్నే ఇంటి మీదికి తోలారు పిల్లల్ని? కుదురుగా ఎక్కడన్న నాలుగు డబ్బులు వచ్చే పని చేసుకోవడం రాదు ఇంతదాకా కూడా, ఎంత సేపూ ఎవరిమీద పడి తిందామా అనే…” వసుధ మాటలు పట్టించుకోకుండా వామనరావుకు ఫోన్ చేసాడు నారాయణ.
”నీ పిల్లలు ఇక్కడికొచ్చార్రా…” ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు.
”……..”
”వాళ్ళేదో చెప్తున్నారు. మీరిద్దరూ రాత్రి నించీ ఏడుస్తున్నారనీ, రాత్రి వంట కూడా చెయ్యలేదా కోడలు?”
”……..”
”ఏంటి?…. ఏం జరిగిందిరా ఆ ఏడుపేంటి?” కంగారుగా అడుగుతున్న మావగార్ని చూసి-
వసుధ పరుగున పోయి భర్తను లేపుకొచ్చింది.
తండ్రి మొహం వివర్ణమై వుండటం చూసి-
”ఏం జరిగింది నాన్నా? ప్రొద్దున్నే వచ్చారేంటి వీళ్ళు?” పెద్ద కొడుకు చంద్రం తండ్రి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కుంటూ కూర్చుని అడిగాడు.
నారాయణ కళ్ళల్లో ధారాపాతంగా దుముకుతున్నాయి కన్నీళ్ళు. ఆయన మంచం దిగి కొడుక్కి సైగ చేసాడు తనతో బైటికి రమ్మన్నట్టు.
”వాడికి ఎయిడ్స్‌ట!!”
ఆ మాట విని కొయ్యబారిపోయాడు చంద్రం. చాటుగా విన్న వసుధ మాత్రం కాళ్ళ క్రింద నిప్పులు పడ్డట్టు ఎగిరిపడింది.
”అడ్డమయిన తిరుగుళ్ళన్నీ తిరుగుతే రాకేమవుతాయి వెధవ రోగాలన్నీ. కళ్ళ నీళ్ళు తుడుచుకుని తలతిప్పేసుకుంది వరమ్మ, కోడలి మాటలు విననట్టుగా. పిల్లలిద్దర్నీ పంపు దగ్గరికి తీసుకెళ్ళి మొహాలు కడుక్కోమని చెప్పి పాలు వెచ్చబెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది.
నారాయణకు నలుగురు కొడుకులు. అందర్లోకీ చిన్నవాడు వామనరావు. పెద్దవాడు చంద్రం. మిగతా యిద్దరూ ఊళ్ళోనే చెరో చోటా వుంటారు. వామనరావుకు వ్యాపారంలో ఎప్పుడూ పెద్దగా లాభాలంటూ ఏమీ రావు అందుకే ఎప్పుడూ ఏ అన్న దగ్గరికో చేబదుళ్ళంటూ, అప్పులంటూ తిరుగుతూనే వుంటాడు. ఒక్కచోట కుదురుగా ఎన్నడూ వుండి వ్యాపారం చేసే రకం కాకపోవడం మూలాన వదినలందరికీ చులకనే అతనంటే. తల్లీ తండ్రి అందరి దగ్గరా మూడేసి నెల్లు వుంటారు. వామనరావు దగ్గర వున్నప్పుడు ఆ మూడు నెల్లూ వాళ్ళ తిండీ తిప్పలు అన్నీ నారాయణే చూసుకుంటాడు. మిగతా అన్నలకు వాళ్ళ కుటుంబాలకు ఇదంతా చికాకుగా కోపంగా వున్నా బైటికి ఏమీ అనలేని పరిస్థితుల్లో ఇప్పుడీ వార్త శరాఘాతంలా తగిలింది వాళ్ళకు.
పిల్లలు పాలు త్రాగాక, తల్లి తండ్రినీ పిల్లల్ని తీసుకుని తమ్ముడింటికి వెళ్ళడానికి తయ్యారవుతూ భార్యనీ రమ్మన్నాడు చంద్రం. ”ఇంతోటి సంబడానికి ఇంతమందీ ఎందుకులే, మీరంతా వున్నారుగా పరామర్శకు, నేనూ పిల్లలూ సాయంకాలం వస్తాం.” విసురుగా అంది వసుధ. మారు మాట్లాడక వాళ్ళని తీసుకు బైల్దేరాడు.
ముందు గదిలో పడుకున్న తమ్ముడి దగ్గరికెళ్ళి కూర్చుని భుజంమ్మీద చెయ్యివేసి నిమిరాడు చంద్రం చెమ్మగిల్లుతుంటే. వరమ్మ కొడుకు తల కడుపులో పెట్టుకొని ఏడ్చింది. కోడలు రమ అందరినీ చూస్తూ వంటింట గడపలో నిలబడింది తలుపు పట్టుకొని. పిల్లలకేం అర్థంకాక కళవళపడుతున్నారు తాతగారి చెయ్యి పట్టుకొని.
నారాయణ పిల్లల్ని తీసుకొని వంట గదిలోకి వెళ్ళి చూసాడు. వంట చేసిన దాఖలాలు ఏం కనపడక, పిల్లల్ని తీసుకొని హోటలుకు వెళ్ళిపోయాడు.
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చంద్రం మరదలికి ధైర్యం చెప్పాడు.
”చూడమ్మా దుఃఖం పడుతూ కూర్చుంటే లాభం లేదు. దానివల్ల ఆలోచించే శక్తి నశిస్తుంది. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా వుండాలి. ఈ కుటుంబం నిలబడాలంటే నీ వల్లే అవుతుంది. పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళ ముందు జాగ్రర్తగా వుండాలి. అసలు వీడికిలా ఎందుకయ్యిందో అర్థం కావడం లేదు.” అన్నాడు బాధగా.
రమ వంట చేస్తున్నంత సేపూ తమ్ముడితో మాట్లాడుతూ గడిపి, పన్నెండు గంటలకు భోజనం చేసి, తల్లి తండ్రుల్ని అక్కడే వుండమని చెప్పి వెళ్ళిపోయాడు చంద్రం, మళ్ళీ వస్తానని.
బంధువుల్లో, స్నేహితుల్లో తెలిసిపోయింది వామనరావుకు ఎయిడ్స్ వచ్చిందని. రెండు రోజులకు మిగతా యిద్దరన్నలు భార్గవు, బ్రహ్మారావు కుటుంబాలతో సహా ఒచ్చి చూసారు. ఇద్దరూ చెరో రెండు వేలు పిల్లలకిచ్చి అమ్మకివ్వమని చెప్పారు.
”తెలిసిన వాళ్ళు వస్తూ పోతూ వుంటారు… సామాను తెప్పించి వుంచుతే బావుంటుంది… నీక్కూడా ఇబ్బందీ లేకుండా.” అన్నారు వాళ్ళు. రమ పిల్లల్ని పంపించి వాళ్ళ ముందరే నెలసరి సామాను తెప్పించింది. అన్నదమ్ములిద్దరూ టీలు త్రాగి కాస్సేపుండి వెళ్ళిపోయారు.
వసుధ నోటికి హద్దూ అదుపు లేకుండా పోయింది. తెల్సిన వాళ్ళకీ, తెలియని వాళ్ళకీ-
”మా మరిదికి మాయదారి రోగమొచ్చింది. మందులకనీ, మాకులకనీ, మమ్మల్నందరినీ ఎంత నలుచుకు తింటారో… మాయదారి సంత మా కోసమనే పుట్టినట్టున్నారు.” అంటూ చెప్పి మొటికలిరిచేది.
నారాయణ కొన్నాళ్ళు చిన్న కొడుకింట్లోనే వుండటానికి నిశ్చయించుకొని మిగతా వాళ్ళకు చెప్పాడు. కొడుకు గదిలో మంచం వేయించుకొని రాత్రిపూట అక్కడే పడుకునేవాడు వామనరావు కేమయినా అవసరం అయితే సాయానికి.
పగలు తన వ్యాపారం చూసుకున్నాక షాపు కట్టేసి, అట్నుంచటే గ్రంథాలయానికి వెళ్ళి ఎయిడ్స్‌కి సంబంధించిన పుస్తకాలు వెతికి చదివేవాడు. ఆ జబ్బు గురించి తెలిసిన వారి దగ్గర ప్రస్థావించి సమాచారం తెలుసుకునేవాడు. క్రమంగా ఆ జబ్బు మీద అవగాహన పెరిగి స్థిమిత పడ్డాడు.
ఒకసారి వామనరావుతో అన్నాడు. ”నీ రిపోర్టులు తీసుకురా, మన డాక్టర్ రావుగారి దగ్గరికి పోదాం, చూసి ఆయనేమంటాడో” అని.
”ఈ ఎంబీబియస్ డాక్టర్లకేం తెలుస్తుంది నాన్నా! వరంగల్‌లో నేను చూపించుకుంటున్నాను కదా! ఆ మందులే వాడాలి. నువ్వనవసరంగా అందరి దగ్గరకు రమ్మనకు.” అని అరిచాడు కోపంగా.
”అది కాదురా…”
”అమ్మా…. ఆయన్ని కాస్త బైటికి తీసుకుపో, నా ప్రాణాలు తోడెయ్యద్దను.” తండ్రి మాట లెక్కలేనట్టుగా దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు.
నారాయణ కొడుకు మూర్ఖత్వానికి నిస్పృహ చెందాడు. ఇహ లాభం లేదని రమతో పిల్లల గురించి ప్రస్తావించి-
”పిల్లలని మీ యిద్దరికీ దూరంగా హాస్టల్లో వేద్దామనుకుంటున్నాను. వీడి ఆరోగ్యం బాగుపడేవరకు వాళ్ళ చదువులకు ఆటంకం లేకుండా వుంటుంది.” అన్నాడు.
”నా మనసులో కూడా అదే వుంది మావయ్యా! కానీ ఆ ఫీజులు మేం భరాయించలేం.” అంది దిగులుగా రమ.
”ఫరవాలేదు… అవన్నీ నేను చూసుకుంటాను. దాని గురించి ఆలోచించకు, వాడి మూర్ఖత్వంతో అందర్నీ విసిగిస్తున్నాడు, మందులనే జాగ్రత్తగా వాడించు.”అంటూ పిల్లల వ్యవహారం చూడ్డానికి లేచాడు అక్కడినుంచి నారాయణ. అలాగే అన్నట్లు తల ఊపింది రమ.
వామనరావుకు గడ్డం బాగా పెరిగింది. కళ్ళు లోతుకు పోయి వున్నాయి. నారాయణ కొడుకును గమనిస్తూనే వున్నాడు. కొడుకులో ఏ ఏ మార్పులు చోటు చేసుకుంటున్నాయో అనే ఆలోచనలతో రోజూ బజారు నుంచి వస్తూ రకరకాల పండ్లు తెచ్చేవాడు.
రమా, వరమ్మా వాటిని శుభ్రంగా కడిగి రసాలు తీసి వామనరావు కివ్వబోతే తరువాత తాగుతాననే వాడు.
”ఫ్రెష్‌గా వుంది. త్రాగరా” నారాయణ కలుగ చేసుకోబోతే, ”తరువాత త్రాగినా రోగం ఏం మారదు నాన్నా.” అనేవాడు.
”మా ముందర త్రాగరా నాయినా….” వరమ్మ మాటలకు కోపంగా చూసేవాడు.
” అసలు నా మీద మీ నిఘా ఏంటి? ఈ కొద్ది రోజులైనా ప్రశాంతంగా వుండనివ్వరా?” ఆ మాటలకు బాధపడుతూ నారాయణ బైటికి వెళ్తే, ఆ జ్యూస్‌ని గదిలోకి తెమ్మన్నాడు రమని.
పిల్లలు హాస్టల్లో చేరటం మూలాన ఇల్లంతా సందడి లేకుండా బోసి పోయినట్టుగా వుంది. నారాయణ షాపుకు వెళ్ళిపోయిన మధ్యాహ్నం వామనరావు పడుకున్నాక అత్తా కోడళ్ళిద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళుండేవారు.
”వాడికీ జబ్బు ఎప్పటి నించి మొదలై వుంటుందో”. ఒక రోజు కోడలు భోజనం వడ్డిస్తుంటే భోంచేస్తూ అడిగాడు నారాయణ.
”ఏమో మావయ్యగారూ.” అంది రమ భయంగా చూస్తూ.
”ముందుగా ఎలా తెలుస్తుందండీ! పరీక్షలు చేయించుకుంటేనేగా బయట పడిందీ…..” వరమ్మ సమర్థించబోతోంటే, ఆగమన్నట్టు సైగ చేస్తూ-
”అదే నేనూ చెప్పబోతోంది. వాడి విషయంలో ప్రద్దానికి అడ్డం వస్తావెందుకొ!” అంటూ రమ వైపు తల తిప్పి-
”చూడమ్మా నేనో మాట చెప్పనా! తండ్రి లాంటి వాడ్ని వేరేగా అనుకోకు…. నువ్వు కూడా ఓ సారి డాక్టరు దగ్గరికెళ్ళి పరీక్షలు చేయించుకుంటే బావుంటుందనిపిస్తోంది నాకు.” అన్నాడు నారాయణ.
బెదిరిపోయింది రమ. ఏంటీనిలా మాట్లాడుతున్నాడని.
”ఈ జబ్బుకు వైరల్ లోడు పెరగకుండా వుండటం కోసం పుష్టికరమైన ఆహారం తీసుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మందులకూ ఆహారానికీ పరీక్షలకూ చాలా ఖర్చవుతుంది. వీడు చూస్తే మూల పడున్నాడు. ఎందుకైనా మంచిది నువ్వు కూడా పరీక్ష చేయించుకుంటే ఏమీ లేదని తేలితే ఎంతో రిలీఫ్ అవుతాం.” కోడలు మొహంలోకి చూస్తూ అన్నాడు నారాయణ.
”ఆయన్నొక్కసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళమనండి. మందులూ అవి ఏమైనా తెచ్చుకోవాల్సి వుంటే తెద్దాం. అంతేగానీ నన్ను పరీక్షకు వెళ్ళమనకండి, నాకేం కాదని నాకు నమ్మకం వుంది.” అంటూ రమ లేచిపోయిందక్కడినుంచి.
”అమ్మాయన్నట్టు వాడి వ్యవహారం ముందు చూడండి. మందులు ఏం వాడుతున్నాడో లేదో, అసలు తెచ్చుకున్నాడో లేదో ఎవరికీ చెప్పడాయె.” కళ్ళు తుడుచుకుంటున్న వరమ్మనీ, లోపలికి వెళుతున్న కోడలినీ చూస్తుంటే ఆయనకేం అర్థం కాకుండా పోయింది.
వామనరావుని చూడ్డానికి వచ్చిన మిగతా కొడుకులతో అదే చెప్పాడు. రమ కూడా డాక్టరు దగ్గరకు వెళ్ళడం తనకెందుకో మంచిదనిపిస్తోందని. వాళ్ళకు కూడా అనుమానంగానే వుంది రమకు ఈ జబ్బు వచ్చే వుంటుందని. తిండి తినే విషయంలో తమ్ముడి మొండి ప్రవర్తనా రమ మౌనం వాళ్ళని చికాకు పరుస్తూనే వుంది.
ఒక రోజు బాత్రూంకు వెళ్దామని లేచిన వామనరావు క్రింద పడిపోయాడు. అసలారోజు వామనరావు కుటుంబం గురించిన నిర్ణయం తీసుకోవడానికి అందరూ వచ్చి వున్నారు. భార్గవ, చంద్రం యిద్దరూ కల్సి తమ్ముడ్ని లేపి మంచమ్మీద పడుకోబెట్టాక వరండాలోకి వచ్చి నిలబడ్డారు. వాళ్ళల్లో వాళ్ళు కాసేపు తర్జన భర్జన పడ్డాక తండ్రితో అన్నారు. ”నాన్నా నువ్వు వ్యాపారం చేసే షాపు వాడి పిల్లల పేరు మీద రాసెయి. మేం తలా కాస్త వేసుకొని కొంత మొత్తం వాడి భార్య పేరు మీద డిపాజిట్ చేస్తే పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడకుండా వుంటుంది.” కొడుకుల మాటలకు వత్తాసు పలికాడు నారాయణ.
తలా రెండు లక్షలు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేసారు. నారాయణ తను వాళ్ళ సంసారాన్ని ఈదుకొస్తానని చెప్పాడు. అందరి సమక్షంలో కాగితాన్ని రమ కందించాడు చంద్రం. అలా చెయ్యడం వల్ల అందరిలో కూడా ఏదో భారాన్ని దింపుకున్న ఫీలింగ్ ఏర్పడింది.
రెండు మూడు నెల్లయినా ఒక్కనాడూ రిపోర్టులు చూపని కొడుకుని ఏమనాలో అర్థం కావడం లేదు నారాయణకు. అక్కడికీ నోరు విడిచి అడిగాడు రిపోర్టులు అన్నయ్యలు చూస్తారట అని. ఎవరికి చూపించినా మొట్ట మొదటి రిపోర్టే చూపిస్తాడు. ఎయిడ్స్ వున్నట్టుగా వచ్చిన లాబ్ రిపోర్టది. మందులు వాడినాక రిజల్ట్స్ ఎట్లా వున్నాయో తెలిపే ఏ రిపోర్టూ చూపించడు. మందులు వాడుతున్నావా? అంటే విరక్తిగా ఏంటో చెప్తాడు. ఎన్ని రకాలుగా అడిగినా అతన్నించి ఏమీ వివరాలు రాబట్టలేక పోయాడు నారాయణ.
విసుగు పుట్టి తన మంచం కొడుకు గదిలోంచి వరండాలోకి మార్చుకుని భార్యతో సహా అక్కడ పడుకోవడం మొదలు పెట్టాడు. లోపల రమా, వామనరావు పడుకుంటున్నారు.
”అబ్బాయి మళ్ళీ మంచి మందులు వాడుతున్నాడు.. కోడలు మందులు తెప్పించింది.” వరమ్మ భర్త కంచంలో చపాతీలూ కూరా వేస్తూ సంతోషంగా అంది. ఆయన రాత్రిపూట చపాతీలే తింటాడు.
”మనకింకా సంపాయించుకోవడానికీ, సరదాగా గడపడానికీ భగవంతుడు ఆరోగ్యం బాగానే ఇచ్చాడు.” నారాయణ నోటితో అన్నా కళ్ళు ఆమెని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
”అయ్యో దానికీ దీనికీ ఏమిటి సంబంధం?” బుగ్గలు నొక్కుకుంది వరమ్మ.
”ఇంక ఇక్కడ మన అవసరం లేదని నాకు తోస్తోంది. ఆరోగ్యం లేకున్నా కూడదీసుకునే వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. ఉన్న ఆరోగ్యాన్ని రోగాల పాలు చేసుకునే వాళ్ళకు దేవుడే బుద్ధి చెబుతాడు.”
”ఏంటి మీరనేది?” అస్పష్టంగా గొణిగింది వరమ్మ.
”నేనే మన్నానే! రోగాలున్న వాళ్ళు అనుభవిస్తుంటే, అలా పడి వుంటుంటే, వాళ్ళ కళ్ళ ముందు మనం ఆరోగ్యంగా తిరగటానికి నాకు సిగ్గుగా వుంది.” అన్నాడు నారాయణ అదో రకంగా.
”బావుంది…. అది మన చేతుల్లో లేదు గానీ… వుండుంటేనా నాకు ఆ జబ్బు రావాలని కోరుకోక పోదునా?” అంది వరమ్మ.
”ఎయిడ్స్ నీకు రావాలని కోరుకోవడం మటుకు పోయేకాలపు బుద్ధిలే! పరువు తక్కువ కూడా, కాస్త ఆలోచించి మాట్లాడాలి… ఏ వ్యవహారమైనా ఆలోచించి చెయ్యాలి.” కఠినంగా అన్నా అతని కళ్ళు నవ్వుతూనే వున్నాయి.
”అంటే!!” వరమ్మ గొంతులో ఏదో అడ్డు పడ్డట్టైంది.
నారాయణ ముఖంలో అసహ్యం… కోపం స్పష్టంగా కనపడుతున్నది. భార్యని సూటిగా చూసాడు. ఆ కళ్ళల్లోని ప్రశ్నలని తట్టుకోలేక తలొంచుకున్నది వరమ్మ.
”మొన్న నేను కోడల్ని డాక్టరు దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోమని చెప్పగానే ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక రకమైన భయం కన్పించి, ఆశ్చర్యపోయాను. ఆ సంగతి నీతో చెబుదామనుకుని అప్పటికి ఊరుకున్నాను. ఆ రాత్రి నేను బాత్రూంకు వెళ్దామని లేచి వాళ్ళ గది ముందు నుంచి పోతుంటే లోపల్నించి నా పేరు వినిపిస్తే తలుపు దగ్గర ఆగాను. రమ మన వాడితో చెబుతోంది. ‘మీ నాన్నకు నువ్వు, మీ అమ్మా ఆడుతున్న నాటకం తెలిసిపోయిందల్లె వుంది’ అంటోంది. నాటకం ఏంటబ్బా అనుకుంటున్నంతలో తనే మళ్ళీ అంటోంది. ‘మీ నాన్న నన్ను డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోమన్నాడు. నాక్కూడా ఎయిడ్స్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికట. కాలాంతకుడయ్యా మీ నాయన. మన రహస్యం తెలుస్తే అందరూ ఆస్తులు తీసేసుకుంటారు తెల్సా’ అంది.” చెప్తున్న నారాయణ మొహం ఎర్రబడింది. భర్త మాటలకు వరమ్మ కంపించిపోయింది లోలోపల.
”ఇంకా ఏమంటోందో తెల్సా!” వెటకారంగా అడిగాడు.
”ల్యాబ్‌కు పోయి ల్యాబ్ అతనితో గట్టిగా చెప్పి వాడి చేతులు తడిపిరా! లేకుంటే మీ వాళ్ళెవరన్నా పోయి వాణ్ణి వివరాలు అడిగితే గుట్టు బైట పడుతుంది. రాసిచ్చిన ఆస్తులు ఎవరివి వాళ్ళు గుంజుకుంటారు. అంటోంది.” ఆ మాట చెప్పి చపాతీల పళ్ళెం నెట్టేసి మంచంమ్మీంచి లేచాడు నారాయణ, మళ్ళీ తనే-
”ఈ యింట్లో నమ్మకానికి స్థానం లేదు. ఇక్కడుండటం వల్ల నా ఆరోగ్య భాగ్యాలన్నీ తుడిచిపెట్టుకు పోతాయి. నువ్వూ నీ కొడుకూ ఎక్కడుంటారో నీ యిష్టం.” అంటూ సూట్ కేస్ తెరిచి దండెం మ్మీద వున్న బట్టలు లాగి దాంట్లో కనుక్కున్నాడు.
భర్త చేస్తున్న పని చూసి గబుక్కున కాళ్ళమీద పడింది వరమ్మ. ”నన్ను క్షమించండి!” ఆమె కళ్ళ నించి ధారాపాతంగా కన్నీళ్ళు కురుస్తున్నాయి.
నారాయణ కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు.
”నువ్వు చేసిన నేరం సామాన్యమైందా! మిగతా కొడుకుల ముందు కోడళ్ళ ముందు దోషులుగా నిలబడాల్సి వుంటుంది మీరిద్దరు. వాడు దొంగ రోగంతోటి ఎన్నాళ్ళు మంచం మ్మీద పడుంటాడూ! అప్పనంగా వచ్చిన ఆస్తిని ఎన్నాళ్ళు నిలుపుకుంటాడు? వాడి వదినలూ, పిల్లలూ. నిన్నూ వాడ్నీ క్షమిస్తారా మీరాడిన నాటకం తెలుస్తే?” నారాయణ కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రబారాయి.
”మీరు నా తప్పుని అర్థం చేసుకోవాలి. ఇది నేను కావాలని చేసిన తప్పుకాదు. వాడి దీన స్థితికి కుమిలిపోయి నేను మౌనంగా వుండి పోవాల్సి వచ్చింది.” అంది వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ.
”అసలు జరిగింది చెప్తా వినండి, మనవాడు చేసిన అప్పుల వల్ల రోజూ ఇంటి మీదికి అప్పుల వాళ్ళు వస్తున్నట్టు మీకూ తెల్సు! ఒకరోజు ఇంటి మీదికి వచ్చి వాణ్ణి నానా మాటలు అని చెయ్యి చేసుకోవడం చూసి కోడలు రమ పిల్లలిద్దర్నీ తీసుకుని పుట్టింటికి పోయింది కదా మీరు చెప్పినా వినకుండా!
వాడు ఒక్కడు తిండికి అవస్థ పడటం చూసి నేను వాడికి వండి పెట్టడానికి అక్కడున్నాను. అప్పుడెన్ని విధాలనో వాడికి నచ్చ చెప్పేదాన్ని, కుదురుగా వ్యాపారం చేసుకోమనీ, అప్పులు చేసి అందరితో తిట్లు తినవద్దనీ. వాడు కూడా బాధపడేవాడు తను ఏ వ్యాపారం చేసినా కల్సిరావటం లేదనీ, అన్నలతో సమంగా ఎదగలేక పోతున్నాననీ నాతో చెప్పి వాపోయేవాడు.
భార్యా పిల్లలు తనని ఒదిలి పోయాక తనకిక ఆత్మహత్యే శరణ్యమని వాడంటే నేను పిచ్చిదాన్నయిపోయాను. ఎన్ని విధాలనో బ్రతిమిలాడాను. అయినా సరే వాడు అదే ఆలోచనలో వుండేవాడు. ఒకసారి సాయంకాలం ఇంటికొచ్చి-
”అమ్మా రమ అక్కడ పుట్టింట్లోనే వుంటూ ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాను, పిల్లల్ని అక్కడే బళ్ళో వేస్తానని ఫోన్ చేసింది” అంటూ ఏడ్చాడు. అది చూసి నాకేం పాలుపోక ఏం చేద్దామనుకుంటున్నావని వాడ్నే అడిగాను. దాంతో వాడు నా చేతిలో ఒక కాగితం పెట్టి తనకు ఎయిడ్స్ వున్నట్టు నిర్ధారణా పేపర్సవి అన్నాడు. తెలిసిన మెడికల్ ల్యాబ్ వాడి దగ్గర ఆ కాగితాలు తీసుకొచ్చాననీ, అవి ఎవరివో అయితే పేరు మార్పించాననీ, దీని వల్ల అన్నల్లో జాలి పుట్టి కొద్దో గొప్పో ఆస్తీ రాసిస్తే పిల్లలు బ్రతుకుతారని చెప్పి బాధపడ్డాడు. నేను వెనకా ముందూ ఆలోచించ కుండా తలాడించి ఇంత దాకా తెచ్చుకున్నాను.” అంది కుమిలి పోతూ వరమ్మ.
”ఛీ… ఛీ… వీడి కంటే దొంగా.. హంతకుడు నయం.” అసహ్యంతో భార్య చేతుల్ని కాళ్ళతో నెట్టుకుంటూ బైటికొచ్చాడు.
”ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి..”
వెళ్ళబోయే వాడల్లా ఆగి ఏం చెప్తావన్నట్లు చూసాడు.
”జరిగిందంతా నేను నా కొడుకులతో చెప్తాను. రాసిచ్చిన ఆస్తులు వాడికిస్తారా ఇవ్వరా అన్నది వాళ్ళిష్టం. ఒక్కడి కొమ్ముకాసి ఇంతమందికి దూరం కావడం నాకిష్టం లేదు. అందుకే బ్రతికినంత కాలం ఇక నించీ ఏ కొడుకులు దగ్గరా వుండను…” వరమ్మ ఇంకా ఏదో చెప్పబోతుండగానే ఆమె చెయ్యందుకుని దగ్గరగా తీసుకొన్నడు. ఆమె నోటి మీద చెయ్యేసి ఆగమన్నట్లు చెప్తూ-
”అంత స్పీడు నిర్ణయాలు తీసుకోకు. ఇప్పటికే అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అమ్మ కొడుకు ఇంత దూరం తీసుకొచ్చారు. దీనికి పరిష్కారం వాడ్ని బజారు పాలు చెయ్యడం కాదు… వాడ్ని లోకం దృష్టిలో నిందితుడ్ని చేసి నిన్ను నువ్వు క్షమించుకోలేని తాపంలో పడతావు. నువ్వీ విషయం బైటికి చెబితే పిల్లల దృష్టిలో ఎప్పటికీ దోషివే అవుతావు. అది కోలుకోలేని అవమానం. దాన్ని మనమే హాండిల్ చెయ్యాలి. ఇక నుంచీ వాడి పిల్లల బాధ్యత మనం తీసుకుని, వాళ్ళను పెద్ద వాళ్ళని చెయ్యాలి. మూల బడ్డ కంపెనీని తీసుకుని కొత్త వస్తువుల్ని చేసినట్టు….” ఆయన మాటల్ని మధ్యలోనే ఆపు చేస్తూ ”మీ వ్యాపారమే అది కదా!” అంది వరమ్మ తేలిక పడ్డ హృదయంతో.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags