ప్రస్తుతం మీడియాలో హోరెత్తుతున్న కొన్ని కంపెనీల పేర్లు, వాటి నిర్వాకాలు చదువుతుంటే నాలుగేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి.
2008లో అనుకుంటాను నేను చేనేత మహిళలు నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొనడానికి చీరాల వెళ్ళాను. మీటింగ్ తరువాత అక్కడికి దగ్గరలోనే వున్న బీచ్‌ను చూద్దామని ఒక టాక్సీ బుక్ చేసుకుని బయలుదేరాను. టాక్సీ డ్రెవర్ పేరు రమణ అని గుర్తు. మేం బీచ్‌వేపు వెళుతుంటే ఆ దారికటూ ఇటూ పొలాలన్నీ కంచెవేసి వున్నాయి. కనుచూపు మేరంతా పొలాలు పడావు పడి వున్నాయి. ”ఏంటి! ఈ పొలాలన్నీ ఎవరివి కంచె ఎందుకు వేసారు?” అని రమణ నడిగాను. ”ఈ పొలాలన్నీ రైతులవండి. కోస్టల్ కారిడారో ఏంటో…అదేంటో నాకు సరిగ్గా తెలవదండి. అది వస్తుందని ఈ పొలాలన్నీ తీసేసుకున్నారు. అదిగో! అటు చూడండి. అక్కడ మా పొలం కూడా వుంది. మాకు నష్టపరిహారమివ్వరు. అమ్ముకోనియరు!” రమణ చెప్పుకు పోతున్నాడు. ”మీ పొలం ఎవరు తీసుకున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా ! ”అంటే ”ఆ ఇషయాలేవీ నాకు తెల్వదండి. నేను టాక్సీ నడుపుకుంటాను. అయ్యన్నీ మా నాన్న చూసుకుంటాడు. మా చెల్లి పెళ్ళి చేద్దామని మా నాన్న ఎకరం పొలం బేరం కూడా పెట్టాడండి. ఆ టైమ్‌లోనే మా పొలాలు లాక్కున్నారు. మా నాన్న మా చెల్లి పెళ్ళి చెయ్యలేక పోయాడు. మా చెల్లి వొళ్ళు కాల్చుకుని చనిపోయిందండి.” రమణ గొంతులో ఎంతో వేదన. ”అయ్యో! ఎంత ఘోరం జరిగింది.” అన్నాన్నేను ఏమనాలో తెలియక. ”మరేం చేస్తదండి. పెళ్ళి కుదిరింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. పొలం అమ్ముకోడానికి వీల్లేకుండా పోయింది. మా చెల్లి చాలా సున్నితమండి. భరించలేకపోయింది.” అన్నాడు రమణ. మేం మాట్లాడుకుంటుండగానే బీచ్ వచ్చేసింది. నాకు బీచ్‌లో దిగాలన్పించలేదు. సముద్రాన్ని చూస్తే ఉప్పొంగే నా హృదయం ఆ రోజు ఉప్పొంగలేదు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రమణ చెల్లి నా కళ్ళలో నీళ్ళు పెట్టించింది. కను చూపు మేరంతా సంకెళ్ళలో వున్న వేలాది ఎకరాల భూమి కూడా కన్నీళ్ళు పెడుతోందా అన్పించింది నీళ్ళతో నిండిన నా కళ్ళకి. రైతుల స్వేదంతో పులకించే భూమాతను చెరపట్టి, రైతుకు దూరం చేసి నోటికి తిరగని అడ్డమైన కంపెనీలకి ధారాదత్తం చేసిన భూమి ద్రోహులు ఈ రోజు చట్టం ముందు దోషులుగా నిలబడ్డం గొప్ప సంతోషంగానే వున్నా, రమణ కుటుంబంలాంటి లక్షల కుటుంబాల కన్నీళ్ళు, కడగండ్లు తీరుతాయా లేదా? ఇదంతా నాటకమా అనే అనుమానం కూడా మనసులో పొడసూపుతోంది. పోలేపల్లి, కాకినాడ,సోంపేట, అరకు, పాడేరు. గంగవరం లాంటి ఎన్నెన్ని ఊళ్ళు, ఎంతమంది బాధిత ప్రజలు. ”అభివృద్ధి” దొంగజపం చేస్తూ, చటుక్కున చేపను పట్టి గుటుక్కున మింగేసే దొంగ కొంగలా లక్షలాది ఎకరాల సస్యశ్యామలమైన, ఆకుపచ్చటి భూముల్ని బీడు భూముల్ని చేసి నాశనం చేసిన భూబకాసురులు జైళ్ళ పాలయితే వాళ్ళు చేసిన దౌష్ట్యాలూ, దుర్మార్గాలూ, దౌర్జన్యాలు సమసిపోతాయా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?
‘మా ప్రాణం పోయినా మా భూములివ్వమని’ నినదించిన పోలేపల్లి ప్రజల్ని అరబిందో కంపెనీ నిర్వాసితులను చేసే వొదిలింది. ” మా సముద్రం పోనాదండీ” అంటూ గుక్కపట్టి ఏడ్చిన దిబ్బపాలెం, గంగవరం ప్రజల్ని సముద్రంలోకి అడుగుపెట్టకుండా ఇనుపగోడ కట్టింది పోర్ట్. ”జిందాల్‌గాడిని మా భూముల్లో అడుగు పెట్టి చూడమనండ”ి అంటూ సవాలు విసిరిన కాకిదేవుడమ్మ, కాకినాడ సెజ్ మింగేసిన తమ భూముల్లో ఏరువాక మొదలు పెట్టిన కాకినాడ మహిళలు, తుపాకులకు ఎదురు నిలిచి పోరాడిన సోంపేట సాహసస్త్రీలు.
సూట్లు, బూట్లు వేసుకుని, పెద్ద పెద్ద కార్లల్లోంచి దిగుతూ అమాయకపు ముఖాలు పెట్టుకుని చట్టం ముందు దోషులుగా నిలబడిన వాళ్ళందరినీ చూస్తుంటే నాకు మళ్ళీ రమణ చెల్లెలు గుర్తుకొస్తోంది. కాకి దేవుడమ్మ, పోలేపల్లి చుక్కమ్మ, సోంపేట స్త్రీలు పదే పదే గుర్తుకొస్తున్నారు. లక్షలాది నిర్వాసితుల కన్నీళ్ళను తాగి, వారి జీవనాధారమైన భూముల్ని లాక్కున్న ద్రోహుల్ని చూస్తే కడుపులోంచి ఏదో తెలుములకుంటూ బయటకొస్తోంది. బహుశా అది నాలో పేరుకుపోయిన కోపం, ఉద్రేకం, ఉద్వేగం అయ్యుంటుంది. భూమి, పుట్రా కోల్పోని నాకే ఇంత ఉద్రేకం ఎగిసిపడితే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ లక్షలాది నిర్వాసితుల మాటేంటి??? రస్‌ఆలఖైమా, గిల్‌క్రిస్ట్, ఎమ్మార్, వాన్‌పిక్ వీళ్ళందరూ ఎవరసలు? కనీసం స్వదేశం వాళ్ళైనా కాదు. వీళ్ళ లాభాల కోసమా రైతుల భూముల్ని భోంచేసింది?
ఈ సందర్భంగా కాకిదేవుడమ్మ అమాయకంగా అన్న మాటొకటి గుర్తుకొస్తోంది. ” ఆ జిందాల్‌కి నెలకి ఎన్నో కోట్లు జీతమంటకదా! అంత జీతమొచ్చేటోడికి నా భూమే కావలసిసోచ్చిందా? నేను చచ్చినా నా భూమి వొదల్ను” ”శభాష్! దేవుడమ్మా శభాష్! ప్రభుత్వాలు, నానా రకాల కంపెనీలు గుంజుకున్న భూముల్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇపుడు కావలసింది వేలాది దేవుడమ్మలు. లక్షలాది చుక్కమ్మలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
సత్య వతి గారూ,
చదువు కోని వాళ్ళ కంటే చదువుకున్నవాళ్ళే ఎక్కువ దగుల్బాజీలుగా, దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. ఈ దేశం లో
తెల్లకాలరు నేరాలే ఇలాంటి దౌర్భాగ్య స్థితని తీసుకు వచ్చాయి. రాజకీయనాయకులు తాము ప్రజలప్రతినిధులమని చెప్పుకుని రాజ్యాంగేతర శక్తులుగా ఎదిగిపోయి ఐ ఏ ఎస్లూ ఐ పీ ఎస్లూ తో కుమ్మక్కయి దేశాన్ని దోచుకున్నారు. పూర్వం డబ్బుకి కక్కుర్తిపడితే ఇప్పుడు దేశంలోని అన్ని వనరులనీ దోచుకుని పాతరోజుల్లోలా చిన్నచిన్న సామ్రాజ్యాధిపతులుగాఎదుగుతున్నారు. గనఉలుదోచేవాడొకడు, సారా బినామీలతో అమ్మించి నిస్సిగ్గుగా నీతులు వల్లించేవాడొకడు, మొన్నటిదాకా బియ్యం మిల్లులు నడుపుకుని మంత్రి అవగానే పెద్దాయన కనుసన్నలలో మెలిగి వారితోపాటతోతనూ భూమిని కబ్జాచేసి వెలిగిపోయేవాడొకడు… ఇలా ఎంతమందిని గురించి చెప్పడం. వీళ్ళకి దేముడుకూడా బ్రోకరులాగే కనిపిస్తాడు. జేబుదొంగలకీ, వీళ్ళకీ ఒక్కలాంటి శిక్ష ఉండకూడదు. దేశద్రోహులకి విధించే శిక్ష అమలుజరపాలి.
మీ వ్యాసం యువతరాన్ని వాళ్ళహక్కులూ, ఆస్థులూ రక్షించుకునే దిశలో మేలుకొలపాలని ఆశిస్తున్నాను.
బాగా వ్రాసారండి. ఇలాంటి వ్యాసాలు చాళా రావాలి.
ఇలా ఇంకెమైనా వ్రాసారా .. చెపితె నేను కూడా చదువుతాను.
నా కథ ఒకటి ఇమెయిలు లొ పంపిస్తాను. దయచెసి పరిశిలిస్తారా
లక్ష్మి గారూ
ధన్యవాదాలండి.
మీ కధ పమ్పించండి.
భూముల్ని పోగొట్టుకునేవాళ్ళు చిన్న చిన్న ఉద్యమాలు వాళ్ళ శక్తి కొద్దీ చేస్తారు. ప్రభుత్వం వాళ్ళని అణగదొక్కడానికి తన శక్తిని (పోలీసుల్నీ, చట్టాన్నీ) ఉపయోగిస్తుంది. ఉద్యమాలు చేసేవాళ్ళకి మిగతా ప్రజల సహకారం కూడా ఉంటే, ఆ ఉద్యమం ఇంకా శక్తిని సంతరించుకుంటుంది. కానీ కొట్లు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ పనీ, ఆఫీసులకెళ్ళేవాళ్ళు వాళ్ళ పనీ చూసుకుంటూవుంటారు. మహా అయితే, ఆ వార్తల్ని చదివి కొంచెం కన్నీళ్ళు కార్చి ఊరుకుంటారు. అలా కాకుండా బాధితులకి తమ వంతు సహకారం అందిస్తే బాగుంటుంది. – భూషణ్
పాపపు సొమ్ము మూటగట్టుకున్న ఈ నేతలు ఎన్ని కోట్ల నీచపు జన్మలెత్తుతారో కదా…
చాలా బాగుంది