తీరం చేరని కెరటం

– తమ్మెర రాధిక

జానకమ్మ జానమ్మ కాబోతోంది. పెండ్లి సూపులైనయి. పిలగాడు నల్లగ బక్కపలచగ ఓ మోస్తరుగా వున్నాడు. ప్యాంటు చొక్కా మీదంగ ఎర్ర తువ్వాల ఏస్కోని వచ్చిండు. పొల్లగాడే! జానకి మేనత్త చిద్రగాళ పైలమ్మ తెచ్చిందీ సంబంధం. ”పిలగాడు ఒక్కడు. ముగ్గురు ఆడిబిల్లలు… పెండ్లీలు గాలె. తల్లి వున్నది. కొద్దిల కోపగొండి, గని అది సుత మంచి సంసారం చేసిందె.” అన్నకు వెలదలే చెప్పింది. పెండ్లి సూపులైనంక బాలమ్మ చాయ్‌ చేసింది. పళ్ళెంల గిలాసలు పెట్కోని ఇయ్యాల్నని జానకమ్మ కోర్కె. అది టీవీలల్ల చేసింది శానామాట్ల. పైలమ్మకు పెత్తనాన్ని ఒదుల్కోవుడు సుతారం నచ్చలే! తనే తలోగ్లాసు ఇచ్చొచ్చి ”నువ్వింగబో” అన్నది. మేనత్త కంఠంలోని అధికారంగా పిల్లని లోపల్కి ఉరికిపిచ్చింది.

బాలయ్యకు యిద్దరు ఆడిపిల్లలే. పోరని కోసం సూద్దమనుకుంటే బాలమ్మ బీమార్తోని శాన్నాల్లు మంచం బట్టింది. రెండెకరాల చెల్కపాటు ఆమెకోసం అమ్ముకున్నడు. మందులు మాకులు దిన్నంక బాగైంది. కూల్నాలికి బోతది. ఆమె డబ్బుల్తోనే సంసారం నడుస్తది. ఎకరం చెల్కల బాలయ్య ఎవుసం చేస్తడు. ఎద్దులు లేవు నాగలి లేదు. తండ్రితోని చెల్కకు పోతది జానకమ్మ. ఆ పిల్లకు భూమంటే చచ్చేంత యిష్టం. ఉన్న ఎకరం భూవిలనే గట్టెంబడి చింతచెట్టుకు చిక్కుడుచెట్టు పారిస్తది. సొరతీగె పారిస్తది. కుండతోని నీల్లు దెచ్చిపోసి, చిక్కుడు పూలని అయ్యకు చూపి ఎగుర్తది. జానకమ్మ చెయ్యి మంచిదని చుట్టుపక్కల పొలాలవాళ్ళు, తమ పనులకు పిలుస్తరు. సెనిక చేలో అడుగుపెట్టిందంటే కూలోళ్ళకు మంచినీళ్ళు అందించుకుంట కాయదెంపేది. నాట్లకు వరిమోసేది. వాళ్ళిచ్చిన తృణమో పణమో తీసుకునేది. ఎదిగిన పైరును రాసుకుపూసుకు తిరుగుతుంటే దానికి యింటికి రాబుద్ది కాకపోయేది. పెండ తట్ట పట్కోని ఊరంత కలె దిరిగి పెండ చెల్కల ఏసొచ్చేది. తెల్సిన వాండ్లింట్ల చేసొచ్చుకుంట నూకలు వడ్లు పెసర నూక ఏదుంటె అది కోళ్ళకు పట్కొచ్చుకునేది. పెరట్ల ఎప్పుడు ఏదో మరమ్మత్తు చేస్తనే వుండేది.

”ఒక్కనాడు తీర్భాటంగ కూకోనియ్యవు బిడ్డా! ఎండ్లనో దాంట్ల పని గెల్కుతనే వుంటవు. సె..సె…” తండ్రి మాటలు లెక్కలేకపోయేడిది. సీమసింత చెట్టు, పచ్చడి మావిడి చెట్టు, తనకోసం బొడ్డుమల్లెచెట్టు. వీటి కోసం రోజూ నీల్లు తెచ్చిపోసేది. గోలాలు నింపుకుంట వాట్ని సాకేది. అత్తమ్మ నాయినతోని పెండ్లికొడుకింట్ల ముచ్చెట చెప్తాంటె అయోమయంగ యిన్కుంట నిలబడ్డది.

”భూవి లేదు. పొల్లగాడు గింతప్పటికెల్లి కూలినాలికి పోయేది. గిప్పుడు వాచ్‌మేన్‌గ కుదురుకున్నడు. వాని తల్లి నాకు దోస్తే.. అయిదారిండ్లల్ల బాసండ్లు తోముతది. ఆడిబిల్లలు కూసునేటోల్లు గారు. బస్తీపోరగాలు జరంగ జాగర్త గుండాలె.” మేనకోడలు మొకంల కల దప్పుడు పైలమ్మ కన్పెట్టింది.

”ఏందే బల్లిలెక్క అట్ల అంట్కపోయినవు?” గదిమాయించింది.

”తెల్వని పోరి…” తల్లి సత్తి చెప్పబోయింది.

”నువ్వూకుండు… గది చెప్పదా? గట్ల మిడిగుడ్లేసుకొని సూస్తె ఏమన్నట్టే? చిన్నత్త కాడ బాగ నేర్చినావ్‌? ఏవన్న నాలిముచ్చోలిగె వుండుడు.”

”భూవి లేనోడ్ని చేస్కోను”. అత్త ఊకోదని ఆ పిల్లకు తెల్సిపోయింది. అసలు విషయం చెప్పాలె.

”భూమి లేనోడ్ని చేస్కోను. భూవి లేకపోతే ఎట్ల బత్కుతరు? ఎంతకని కూల్నాలి చేస్తరు?” జానకమ్మ మాటలకు పైలమ్మ మొటకలిరిచింది. తన చెల్లె సోపతి పట్ట పోరి పాడైందన్నది. అన్నని కోపడ్డది. వదినని మందలించింది. ఇంతకంటే మంచి సంబంధం తేలేరన్నది. భూమి తనది ఎకరం చెల్క వుంది అయి చేసుకుందువులే అన్నది. మొత్తానికి తన పంతం నిల్పుకొని అల్లం బెల్లం అని చెప్పి సంబంధం ఖాయం చేసింది.

పెండ్లి కోసం గులాల్‌ కలర్‌ పట్టుచీర కొంటరని ఆశపడ్డది జానకమ్మ. పైలమ్మ బుగ్గలు నొక్కుకుంది. మిన్ములు అమ్మి సారాకిచ్చిండ్రు. అల్లం ఎల్లిపాయలు రుబ్బిండ్రు. ఆ పిల్ల సాదుకున్న కోళ్ళు పదిదాంక పెండ్లికని పక్కకు బెట్టి, మిగతావమ్మి కూరగాయలు కొన్నరు. జీవితంలో మొదటిసారి అసంతృప్తి అనేది తెల్సిందా పిల్లకు. భూమి లేకపోవుడు, పట్టుచీర తేకపోవుడు. ఈ రెండు సమస్యలు పెండ్లి వరకు ఆమెను పట్టి పీడించినయి.

తండ్రి బిడ్డను దగ్గరికి తీసి పెండ్లి పనిల ఉషారుగా లేని జానకమ్మను చూసి, ”బిడ్డా! భూమి మీదున్న నీ కాయిసు నాకు తెల్సు. మీ మేనత్తది గదే ఊరాయె. దానికి ఆడిబిల్లే నాయె. దాని పెండ్లాయె. దాని భూవి ఎవరు చేసేటోల్లు లేరాయె. నీకు ఓపిక వుంటే గదె చేస్కోని బత్కరాదే. అత్త సుత ఇస్తనంటనే వున్నది గద. ఏవయిన గని జానమ్మా నీకు భూమ్మీద గంత రంది వుండొద్దు. వుంటె చేస్కోవాలె. లేకుంటే మన ఖర్మ గంతేనని ఊకోవాలె. గని రంది బెట్టుకుంటె నువ్వే నారాజైతవు. మంచిది గాదు బిడ్డా. ఎవుసం సంగతి నీకు తెల్సుగదా! పెట్టుబడులు గావాలె. మరి నీ అత్త ఎసుమంటిదో నీకు తెల్వదాయె, మొగడు పెట్టుబడి పెడ్తడో పెట్టడో? ఎందుకంటే ఆడిపొరలు పెండ్లికి వున్నరు. గియ్యన్ని ఆలోసించాలె బిడ్డా! భూవంటె పుణ్యనికున్నదా?” అన్నడు.

తనకిక భూవి లేదన్న నిజాన్ని మూనంగ పుట్టెడు దుఃఖంగా భరించి అంగలార్చింది. ఆమె గుండె కోసుకపోయింది. ఆ విషయాన్ని మర్చేపోయి పనిపాటల్లో పడాలని చేస్తే ప్రతీ ప్రయత్నం కూడా విఫలమైంది. సంతోషంలేదు. కొత్త సంసారం పట్ల ఆసక్తీ లేదు. నాలుగే రోజులు మురిపెం. ఆ తర్వాత అత్త హుకుం జారీ చేసింది. ”నాతోని రా… నేను పన్జేసేకాడ పనిప్పిస్త… నేనింకో చోట చూసుకుంట.”

”పాసి పనికా!!” జానమ్మ నిర్ఘాంతపోయింది.

”ఏందీ పాసి పనంటావ్‌? నువ్వేం మారాణివా? దొరసాని బిడ్డవా? పెండ పిసుక్కునే దానివి, ఎంత టెంపరే?” అత్త మాటలకు అభిమానం పొడుచుకొచ్చింది. దుఃఖంతో విలవిలలాడుతూ, ”అవు… పెండ పిసుక్కునే రైతు బిడ్డనే… ఇల్లిల్లు పంట ఎంగిలి బొచ్చెలు తోమ్తలే… నా భూవిల నేను చేసుకున్న… మంది కొంపల్లల చేస్తలేను…” ఆ రోజే అత్త చేతి తడాఖా చూసింది. చెంపలు వాచిపోయినయి. మొగడొచ్చినంక వీపు విమానం మోత మోగింది. అత్త పట్టుదలేంటో జానమ్మకు తెల్సివచ్చింది. మేనత్తని పిలిపించి చివాట్లు పెట్టించింది. కొట్టుడైంది. మందలించుడైంది. ఇంతటితో వదిలేస్తే, ఆడిపోరల పెండ్లీలు తనొక్కదానితోని కాదు, మగపిల్లగాడు లేంది. జానమ్మని వదలకుంట పన్లోకి తోల్కపోయింది. యిష్టం వున్నా లేకున్నా పాచిపనికి వంగబెట్టంది. తెల్లారుఝామున నాల్గింటికి లేస్తే పదింటి వరకు నాల్గిళ్ళల్ల బాసంళ్ళు తోమి సద్దులు పట్కొస్తరు యిద్దరు. అవి తిని ఇంటిల్లిపాది పన్లల్లకు పోతరు. జీతాలతోని చీట్టీలు కడ్తరు. తిండివరకే జానమ్మకు అధికారం, ఎప్పటికీ పడిగె నీడోలె అత్త నీడ.

పాచిపనికి పోయేటప్పుడు చల్లని నేల కాళ్ళకు తగుల్తుంటే ప్రాణం హాయిగా వుండేది. నేలని తడిమి గుప్పెడు మట్టి చేతిలోకి తీసుకొని మొహానికి దగ్గరగా వుంచుకోని కళ్ళు మూసుకొనేది. ఒకసారని చూసి ఇంటిల్లిపాదీ ఈసడించుకున్నారు. అయినా లెక్క చెయ్యలేదామె. అత్తగారింట్ల రెండు గదులు బండలేసి వున్నయి. ఇంటెన్క కొద్దిజాగ వుంటది. జానమ్మ ఎప్పుడు అక్కడ జాగ ఊడ్సుకొని కూచునేది. మట్టి వాసనకు దాని పరవశం చూస్తే భర్తకు కంపరం ఎత్తేది.

”ఎందుకట్ల జేస్తవే?” యాష్టపడ్డడొకసారి. అతనివైపు జాలిగ చూసింది.

”రోజొక్కపారైనా భూవిని తాకాలన్పిస్తది. ఈ దుబ్బల దొర్లాలన్పిస్తది. దీనోసన జూడు.” యింత మట్టి చేతులోకి తీసుకొని చూపించింది.

”థూ…నీయమ్మ…లం…” అసహ్యంగ బైటకెళ్ళిపోయిండు.

జానమ్మ పెండ్లయి 20 ఏళ్ళయ్యింది. పిల్లలు పుట్టలె. ఆడిబిడ్డల పెండ్లీలు దబదబ చేసింది అత్త. వాండ్లకు పిల్లలు అయ్యిండ్రు. కొడుకుకు మల్ల పెండ్లి జేత్తే మంచిగుంటదని యింట్ల అందరు అనుకున్నరు. కోడల్ని తన దగ్గర వుంచుకుంటే ముసలితనంల అండగ వుంటది. పోరనికి పోండ్లి చేసి బైటికి పంపాలనుకున్నది.

జానమ్మ మరోసారి గుండెకోతకు గురైంది. భర్తకు మళ్ళీ పెళ్ళి చేసుడేందని ఎవర్ని అడిగినా సమాధానం రాలె.

”నువ్వు సంసారం చేసెడిదానవు కాదు. భూవిని కావలించుకోని పండుకో.” ఇంట్ల కారు కూతలు కూసిండ్రు. మేనత్త శిలలెక్క ఉల్కదు పల్కదు. ఓ రోజు అత్త పన్ల నుంచొస్తనే.

”ఓ జానమ్మా! మనం సింగాపూరు టౌన్‌షిప్పుకు పోయిరావాలె. జర మంచిగ తయారుగా.” జానమ్మ ఎలాంటి సమాధానం ఈయలేదు. ఆమె ఆరోగ్యం కూడా ఈ మధ్య దిగజారిపోయింది. ఈ బంధనాల్లోంచి కొద్దిరోజులైనా పుట్టింటికి పోవాలనీ, అక్కడి పొలాల్లో తిరగాలని, ఆమె హృదయం ఆరాటపడుతున్నది. కానీ అక్కడికి రమ్మని ఆదరించే తల్లి తండ్రి లేరు. పెండ్లి చేసిన కొన్నాళ్ళకే బీమారొచ్చి చచ్చిపోయిండ్రు. అయినా ఆమె కోర్కె తీవ్రమయిపోతున్నదే కానీ తగ్గలేదు. అత్తకు చెప్పింది. రెండ్రోజులు పోయెస్తనని. ఆమె బాధ చూస్తే అత్తకు కూడా జాలి కలిగింది. ఒక్కసారిగ కోడల్ని దగ్గరికి తీసుకుంది. ”పోరీ నీ రాత గిట్లయ్యిందేమో. పెండ్లయి ఇన్ని దినాలయినా పోరగాల్లు పుట్టరయిరి. భూమో భూమో అని ఎంపర్లాడితివి. సెంటు జాగలేకపాయె ఎక్కడికి పోతవే? భూమితో నేం జేత్తవు? ఆ ద్యాస మగనీ మీదనన్న లేకపాయె పోదాంలే మావూరికి ఈసారి మీ చిన్నత్త యింటికి కొంచపోత పా… రెండ్రోజులు నీ యిష్టంగ తిరిగొత్తువు.” ఆ కాస్త ఊరడింపుకే పొంగిపోయింది. పెండ్లైందినాలను సంబరంగా వున్నది ఈ క్షణాలే. రోజులు గడిచినకొద్ది అత్త ఇచ్చిన మాట మర్చేపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తంగ వచ్చి సింగపూర్‌ టౌన్‌షిప్‌కు పోదాం రమ్మంటున్నది. బలవంతాన బైలుదేరదీసింది. ఆ యింట్ల ముసిలోళ్ళు వుంటున్నరు. కొడుకు కోడలు అమెరికల వుంటరు. వీళ్ళకు వండి పెట్టుకుంట, ఇంట పనిచెయ్యాలి. ఇంకో యిద్దరు చుట్టాలు కూడ వున్నరు. అత్తాకోడలు వుండనికె రూమిచ్చిండ్రు. వాళ్ళున్నది ఐదో అంతస్తు. అత్తకు నచ్చింది. తనూ తన కోడలు వుంటమన్నది. జానమ్మ ఆఖరి శ్వాసకోశాలు మూసుకుపోతున్న భావం తీవ్రంగా కలచివేసింది. తనుండబోయే చోట నేలలేదు. కేవలం గాల్లో ఆకాశంలో వుండాలి. తను తాకటానికి నేల లేదు. తన కష్టసుఖాలు చెప్పుకోవడానికి నేల లేదు. తన హృదయంలోని శబ్దాలు వినడానికి తల్లిలాంటి నేల లేదు. జానమ్మ జీవితంలో సహభాగం పెళ్ళితో సరిపోయింది. మిగిలిన సగభాగం కొత్తగా నేల లేని భవంతిలోకి అడుగుపెట్టింది. ఆమె అన్నం తినలేదు. ఆలోచనల నుంచి దూరం కాలేదు. చావుకు దగ్గరైంది. యజమాని కొడుకు పండుగకు వస్తున్నట్టు అమెరిక నుంచి ఫోన్‌ రావడంతో ఇంట్లో సందడి ఎక్కువైంది. ఇళ్ళు శుభ్రం చెయ్యడం, కడగడం, తుడవడం జానమ్మ విశ్రాంతి మర్చేపోయింది.

”పండ్ల ఎల్లంగనే మనం మీ వూరు పోదం.” అత్త మాటలకు జానమ్మకు కంటిమీద కునుకులేదు తెల్లవార్లు. ఎవరెవరో జ్ఞాపకం వస్తున్నారు. క్రిందికిపోయి ఒక్కసారి నేలతల్లిని ముద్దాడాలని, కాసేపు తిరగాలని అన్పించినా వెళ్ళే ఓపిక లేక వుండిపోయింది.

”జానమ్మా లెయ్యో! నాల్గయ్యింది… అయ్యగారొచ్చేది ఇయాలె..లె..లె..” చల్లని జానమ్మలో ఏ చలనం లేదు. చావు కబురు యజమానికి తెల్సి ఆగ్రహం, అసహ్యం, కోపం, భయం ఏకకాలంలో ప్రదర్శించాడు. చుట్టపక్కాలని సంప్రదించాడు. ఆమె అత్తని పిలిచి కర్తవ్యం బోధించాడు. క్షణాల్లో ‘స్వర్గరథం’ వచ్చింది. జానమ్మని ఆదరాబాదరా కరెంటుతో దహనం చేసే శ్మశానవాటికకు తీసుకువచ్చారు. మొదటిసారిగా జానమ్మ విషయంలో ఏడ్చింది ఆమె అత్త. పెళ్ళైంది మొదలు ఏనాడూ ఆమె కోర్కెలు తీరింది లేదు. చివరకు చావు కూడా. ఆమె కోరుకున్నట్లు భూమిలో కల్పలేదు. భూమి కోసం అంగలార్చి, ఆ తల్లి ఒడిలో నిద్రించాలని కలలు కన్నది. ఏదీ తీరకుండానే వెళ్ళిపోయింది జానమ్మ.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.