పదోతరగతి అప్లికేషన్‌లో మొన్న మొన్నటి వరకు తండ్రిపేరు తప్ప తల్లి పేరు వుండేదికాదు. చిత్రంగా పిల్లలు పట్టుపట్టి తల్లిపేరు చేర్పించుకున్నారు. తండ్రి పేరుతో పాటు, తల్లిపేరును అప్లికేషన్‌లో చేర్చారు. పిల్లలకున్న ఈ జెండర్ సెన్సిటివిటి ప్రభుత్వానికి వుండివుంటే ప్రతి దరఖాస్తులోను ఇది ప్రతిబింబించి వుండేది.
పితృస్వామ్యం పచ్చి పచ్చిగా ప్రతి దరఖాస్తులోను కళ్ళురుమి చూస్తుంటుంది. పేరు, భర్తపేరు, అంటుందికాని పేరు, భార్యపేరు అనదు. పెళ్ళి చేసుకొనీ స్త్రీలని తండ్రి పేరు రాయమంటుంది. అంటే స్త్రీల పేరుతో ఎవరో ఒక మగాడి పేరు తోకలా వుండాలని ఈ పితృస్వామ్య పత్రం శాసిస్తుంది. జోగిని, దేవదాసి, సెక్స్‌వృత్తిలో వున్న స్త్రీలను కూడా వారి పిల్లల్ని పాఠశాలల్లో చేర్చేటపుడు తండ్రి పేరు రాయమని పట్టుబడుతుంది. రాయలేని వారిని అవమానపరుస్తుంది. గేలిచేసి గోల చేస్తుంది. జోగిని వ్యవస్థలో మగ్గుతున్న స్త్రీలు ఎంతో పోరాటం చేసి తల్లిపేరు మాత్రమే రాసేలా విజయం సాధించారు.
ఇక ప్రభుత్వ వ్యవహారాల విషయానికొస్తే పిల్లలకు సబంధించి ప్రథమ సంరక్షకుడు పురుషుడు-తండ్రి. పిల్లల్ని నవమాసాలు మోసి, అష్టకష్టాలు పడి పెంచి వాళ్ళ ఆలనా, పాలనా చూసే తల్లి సోదిలోకి కూడా రాదు. కుటుంబాన్ని పట్టించుకున్నా, వదిలేసినా, పోషించినా, పోషించకుండా బలాదూరు తిరిగినా అధికారికంగా ప్రభుత్వ రికార్డులన్నింటా తండ్రే గార్డియన్, సంరక్షకుడు. 1890నాటిలో అంటే శతాబ్దం నాటి చెదలు పట్టిన ”ద గార్డియన్ అండ్ వార్డ్స్ ఏక్ట్స్ 1890 (ఊనీలి స్త్రతిబిజీఖిరిబిదీరీ బిదీఖి గీబిజీఖిరీ జుబీశి 1890) చట్టాన్నే ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేసుకుంటున్న దౌర్భాగ్య స్థితి.
ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకునే పురుషుడు పిల్లల సంరక్షణ (చెయ్యకపోయినా) నాది అంటూ విర్రవీగుతూ స్త్రీని హింసల కొలిమిలో కాలిపోయేలా చెయ్యగలుగుతున్నాడు. లక్షలాది స్త్రీలు పిల్లల కోసం హింసించే భర్తల నుండి, హింసాయుత కాపురాలనుండి బయటపడలేక మౌనంగా వుండిపోతున్నారు.
హమ్మయ్య!! వందేళ్ళ గాఢ నిద్ర నుండి ప్రభుత్వం మేలుకొన్నట్టుగా ఇటీవల ఒక వార్త వెలువడింది. ఆలస్యంగానైనా మేలుకొన్నందుకు అభినందిద్దాం. ప్లానింగ్ కమీషన్ వర్కింగ్ గ్రూప్ కొన్ని విప్లవాత్మకమైన సిఫారసులు చేసింది. తుప్పు పట్టిన గార్డియన్ చట్టాన్ని సవరించాలని సూచించింది. ”సాధారణంగా పిల్లల ఆలనాపాలనా చూసేది తల్లులు. వారిని పెంచి పెద్ద చేసేది తల్లులు. అందువల్ల నిజానికి తల్లులే అన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో ప్రథమ సంరక్షక్షురాలుగా ఉండాలి. కాని పురుషుడికి అధికారం కట్టబెట్టే విధంగా ఇంతకాలం పురుషుడే ప్రథమ సంరక్షకుడుగా గుర్తింపబడుతూ వచ్చాడు. దీనిని మార్చాల్సిన అవసరం వుంది. గార్డియన్ చట్టాన్ని సవరించాల్సిన సమయం వచ్చింది” అంటూ పేర్కొంది వర్కింగ్ గ్రూప్.
అంతేకాదు ఈ వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించిన రికమండేషన్‌ల వెలుగులో అన్ని చట్టాలను సమీక్షించాలని, చట్టాలను మరింత జండర్ స్పృహతో చూడాలని, ప్రస్తుతం అమలులోవున్న అధికారిక పత్రాలన్నింటినీ మార్చి ప్రథమ సంరక్షకురాలిగా తల్లి సంతకాన్ని ప్రపంచమంతా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
”ఈ సిఫార్సులు ఆమోదం పొంది, ఆచరణలోకి వచ్చిననాడు ఏ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థకానీ భర్త పేరు రాయమని, చెప్పమని తల్లిని అడగజాలవు. పితృస్వామ్యపు ఆలోచనల్ని బుర్రల్లో దట్టించుకున్న వారు చేసిన ఈ చట్టాలు స్త్రీల సాధికారతను ప్రశ్నార్థం చేసాయి.” అంటూ వ్యాఖ్యానించారుఈ కమిటీ మెంబరు ఒకరు.
అలాగే హిందూ మైనారిటీ అండ్ గార్డిన్‌షిప్ ఏక్ట్ 1956లోని సెక్షన్ 6ను కూడా సవరించాలని, మైనర్ పిల్లల సంరక్షణ హక్కుల్ని, పిల్లలకు 12 సంవత్సరాలు వచ్చేవరకు తల్లికే దాఖలు పరచాలని కూడా ఈ కమిటీ సిఫారస్ చేసింది. ”చాలా సందర్భాల్లో తండ్రులు తమకున్న పిల్లల కస్టడీ హక్కును అడ్డం పెట్టుకుని భార్య తనకు లొంగి వుండేలా, హింసను ఆమోదించేలా చెయ్యడం మనం చూస్తూనే వున్నాం. ఈ చట్టానికి కూడా సవరణ జరిగినపుడు స్త్రీలు స్వేచ్చగా తమ నిర్ణయాలను తీసుకోగలుగుతారు” అని ఈ కమిటీ అభిప్రాయపడింది.
ప్లానింగ్ కమీషన్ వర్కింగ్ కమిటీ సూచించిన ఈ సిఫారసుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వీటిల్లో వున్న న్యాయబద్ద అంశాలగురించి, సాధ్యాసాధ్యాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని ఆశిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
అవును పితృస్వామ్య భావజాలాన్ని వదిలి, మనం నిదానంగా మాతృస్వామ్యం వైపు అడుగులేస్తున్నాం. అంతే కాదు, పితృస్వామ్యం బాగోదనీ, మాతృస్వామ్యం సహజమనీ నమ్మే స్థితికి నిదానంగా వెలుతున్నాము. ఇది ఏరకంగా ప్రోగ్రెసివ్ స్టెప్పో అర్థం కావడం లేదు. ఇక మీదట తండ్రి అంటే.. పిల్ల తల్లికి భర్త అని పిలుచుకోవాల్సి వస్తుంది అన్నమాట. అసమానత్వం నుండి అసమానత్వములోకి అంటే ఇదే.
ఇలాకాక, తల్లిదండ్రులిద్దరికీ జాయింట్ కష్టడీ వచ్చేలా ఉంటే బావుంటుంది. పిల్లల ఆలనా పాలనా చూసేది తల్లే అనేవారు, వారిద్దరి ఆర్థిక అవసరాలనూ/ రక్షణ అవసరాలనూ చూసేది తండ్రి/భర్తే అని మాత్రం అద్బుతంగా మరిచిపోతున్నారు. ఒకవైపు, పిల్లల పెంపకములో తండ్రుల పాత్ర ఎలా ఉండాలో అద్బుతంగా స్పీచులిస్తారు. పిల్లల పెంపకములో తండ్రి, తల్లికి సహకరించాలని భాధ్యతలు పంచుకోవాలనీ లెక్చర్లిస్తారు. కానీ.. చివరికి మత్రం, తల్లే ప్రధాన సమ్రక్షకురాలు అని తేల్చేస్తారు. ఇదంతా చూస్తుంటే.. తండ్రి పాత్ర ఉండాలి అని చెప్పేది కేవలం, పిల్లల పెంపకములో “తమ పని ని ” కాస్త తగ్గించుకోవడానికే కానీ నిజంగా వారికి తండ్ర్లంటే గౌరవం లేదని స్పష్టంగానే అర్థమవుతోంది.