పూరీ జగన్నాథ్‌ ‘బూతుల బిజినెస్‌మేన్‌’

సామాన్య

ఐ బిలీవ్‌ ఇన్‌ వార్‌, నాట్‌ ఇన్‌ మొరాలిటీ. యుద్ధం చేతగాని వాడే మొరాలిటీ గురించి మాట్లాడు తారు. మన దర్శకులకీ, అందులోనూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టరుగా పేరు గడించిన వారికి సినిమా తీయడానికి స్థిరమైన ఫార్ములా ఒకటి వుంటుంది. ఇటువంటి ఫార్ములా దర్శకుల్లో శంకర్‌ ఒకరు. శంకర్‌ తమిళ దర్శకుడే అయినా డబ్బింగ్‌ సౌకర్యంవల్ల తెలుగువారికి కూడా ఇతని సినిమాలు అందుబాటులోకి వస్తూఉంటాయ్‌. శంకర్‌ ఫార్ములా ”అవినీతిపై యుద్ధం”. ఇతని సినిమాలో అవినీతిని నిరోధించడానికి ఈ కలియుగంలో ఒక పురాణ పురుషుడు మొదలకెత్తుతాడు. ‘న భూతో న భవిష్యతి” అన్న చందాన, అవినీతిని చితకగొట్టి నీతి మొలకని పాతుతాడు. ఒకవైపు అగ్రవర్ణ సానుభూతికొరకు, రిజర్వేషన్‌ వ్యతిరేకతను చెప్తూనే మరో వైపు పెద్దవాళ్ళను కొట్టి పేదవాళ్ళకు పెట్టడమనే ఎమోషన్‌ను పండిస్తూ వుంటాడు. అతను చెప్పే పేదలు అగ్రవర్ణ పేదలు మాత్రమేనని మనం నిస్సంశయంగా అర్థం చేసుకోవాలి. సరే అంతా బాగుంది..అవినీతిని అంతమొందించడానికి వచ్చిన ఆ ‘ఒక్కరు’ అంతరించిన తరువాత ఆ సదరు పేదలగతి ఏమిటి? వారిలో కూడా తిరుగుబాటు ఆలోచనలేమైనా కలిగాయా అనే ప్రశ్నకు అతని సినిమాలో సమాధానాలు వుండవు. ఎందుకంటే అలా ప్రజల్లో చైతన్యం కలిగించే అదే తరహాలో ఇంకో సినిమా తీసేందుకు అతనికి వీలుకాదు కదా అందుకని. దేశంలో ఎంత అవినీతి జరిగిపోతున్నా సరే అ ఒక్కడి కోసం మనం మళ్ళీ శంకర్‌ సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. తప్పదు. శంకర్‌ది, అన్నాహజరేది, ఇంకా హజారే భజన చేసే అనేకులదీ ఒక్కటే సిద్ధాంతం దానిపేరు. ”పైన పటారం, లోన లొటారం సిద్ధాంతం” వీరికి అవినీతికి కానీ రిజర్వేషన్లు కానీ మూలాలుంటాయనీ తెలీదు. పిచ్చి మొలకని తల నరికేస్తే సరిపోదనీ, వేళ్ళతో సహా పీకేయ్యాలని తెలీదు. ఒకవేళ తెలిసినా వాళ్ళకు అంత ఓపిక వుండదు. రేలంగి పాడిన ఆ పాట తెలుసు కదా ”పైన పటారం, లోన లొటారం ఈ జగమంతా డంబాచారం” అని. ఇదంతా అదే వట్టి ”టాకు టీకుల టక్కు టమారం”. శంకర్‌ది ఒక వితండవాదం అయితే, పూరీ జగన్నాథ్‌ది మరొక వితండవాదం. పూరీకి దొంగలు, మాఫియా వీరే జగదోద్ధారకులూ, జగదానాందకారకులు. పాత సినిమాలో కూడా మనకు దొంగ హీరోలుండేవారు. కాని పాపం వాళ్ళు ఎప్పుడెప్పుడు మంచిగా మారి పోదామా అని తహతహలాడే మంచిదొంగలు. ఇప్పటి సినిమాలో వున్న దొంగలకి నీతి గీతి ఏమి లేదు. వాళ్ళు ఉట్టి దొంగలు. టైమ్‌ దొరికినప్పుడు పూరీ సినిమాలో హీరో వేషాలు వేస్తుంటారు. పూరీ తీసిన ”సూపర్‌” సినిమా దీనికి ఒక్క చక్కని ఉదాహరణ. పూరీ సినిమా ఫార్ములా ఇంత వరకే అయితే మనం మరీ అంత బాధపడాల్సిన పని లేక పోను. కాని అతను అక్కడితో ఆగలేదు. తాను నమ్మిన సిద్ధాంతం అతి గొప్పది, సత్యమైనదని భావించి యువతకి సందేశాలిచ్చే స్థాయికి ఎదిగిపోయాడు. ”బిజినెస్‌మెన్‌” అనే అతని కొత్త సినిమా కథ ఇది. అది ముంబాయి రైల్వేస్టేషన్‌. అప్పుడే వచ్చిన రైల్లోనుంచి హీరో సూర్య దిగుతాడు. హీరో ముఖ కవళికలు చూడగానే మనకు లీలగా వీడేదో సైకోలాగున్నాడనిపిస్తుంది. మన అంచనాల్ని నిజం చేస్తూ వుట్టి పుణ్యానికి ఆదరించిన స్నేహితుడిని చెంప పగలేసి,తను ముంబాయికి చిన్నా చితక ఉద్యోగాలు చేసుకొని బతకడానికి రాలేదని ముంబాయిని …(బీప్‌) పోయించడానికి వచ్చానని చిటికనవేలు ఎత్తి చూపిస్తాడు. మనం కళ్ళు మూసి తెరిచేలోగానే మాములు సూర్య, సూర్య భాయిగా మారిపోతాడు. సూర్యభాయిగా మారడానికి అవసరమైతుందని నగర పోలీస్‌ కమీషనర్‌ కూతుర్ని ప్రేమిస్త్తున్నానని చెప్తాడు. కాని మాట మీద నిలకడగా వుండడం వాడికి అలవాటు లేదు కాబట్టి నిజంగానే ప్రేమిస్తాడు. ఆ పోలీస్‌ కమీషనర్‌ కూడా వీడికి తోడుబోయే రకం. కాసేపు వీడిది ”క్రిమినల్‌ మైండ్‌” అని, కాసేపు ‘నీలాంటి వాడు మా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎందుకు లేడా’ అని బాధపడ్తున్నానని, కాసేపు ‘నా కూతుర్ని నీకివ్వడం కలలో కూడా జరగదు’ అని అంతలోనే కూతురి చెయ్యి హీరో చేతిలో పెట్టి ‘నా కూతుర్ని వదలొద్దు’ అనీ గందరగోళపు వ్యవహారాలు చేస్తాడు. హీరోయిన్‌తో ప్రేమ వ్యవహారం ఎక్కడ వేసినది అక్కడే వుంటుంది. కాని మన సూర్యభాయి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్‌ మాఫియా నడిపే స్థాయికి ఎదిగిపోతాడు. చివరికి వాడుకోవడం కోసం ప్రేమించినట్లు నటించినా ప్రియురాలు కోసం తుపాకీతో కాల్చుకుని హాస్పిటల్‌ పాలై ఎలాగో కోలుకోని లేచి మన యువతకి సందేశమియ్యడంతో సినిమా ముగుస్తుంది. చందమామ కథలా కూర్చో పెట్టి చెప్పాడానికి ఇందులో కథంటూ ఏమీ వుండదు. ఒకడు మాఫియా లీడర్‌గా ఎదిగిన క్రమం వుంటుంది. మాఫియా చాలా మంచిదని, దేశాన్ని ఉద్దరించేస్తూందని పోలీసులు కోర్టులు పరిష్కరించలేని గడ్డు విషయాలను కూడా పరిష్కరించేస్తుందని మాఫియాని జస్టిఫై చేయడానికి పనిగట్టుకొని చేసిన ప్రయత్నపు విశ్వరూపం ఇందులో వుంటుంది. కథలు వినడం కళా రూపాలపట్ల ఆసక్తి మానవుని ఆదిమ సహజాతాలు. అందుకే తరతమ భేదం లేకుండా మనుషులు సినిమా అనే కళా రూపాన్ని అంతగా అదరిస్తారు. చూసిన సినిమా ప్రభావం ఎంతో కొంత ప్రజలపై, ముఖ్యంగా యువతపై వుండే తీరుతుంది. అలా వుంటుందని భావించే విడుదలకు ముందే అందులోని రాజ్య,చట్ట వ్యతిరేక అంశాలను, ప్రజలకు కీడు చేస్తాయని భావించిన అంశాలను తొలగించడానికి సెన్సార్‌ అనే ఒక వ్యవస్థను నెలకొల్పడం జరిగింది. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు సెన్సార్‌ బోర్డు అనబడే అటువంటి సిస్టమ్‌ వుండడం నిజమేనా లేక అంతా భ్రాంతియేనా అని పెద్ద సందేహమొచ్చేస్తుంది. సినిమా వొట్టి బూతుల బుంగ, మైండ్‌ దొ..దా, అనే మాట విని విని మనకు తలనొప్పి పుడుతుంది. హీరో మాటిమాటికి చిటికెన వేలు ఎత్తి … పోయించడానికి వచ్చా..పోయించడానికి వచ్చా…. అంటుండాడు. అన్నింటికంటే పరాకాష్ట వెర్రి పూ…అనే మాట. ఆ మాట వినగానే అసలు మనం నాగరీక ప్రపంచంలోనే వున్నామా అని గొప్ప సందేహంలో పడిపోతాం.విపరీతంగా జుగుప్స కలుగుతుంది. పూరీ జగన్నాథ్‌ ఎంత పర్వర్టెడ్‌ అనే చర్చ మనకు అవసరం. కానీ దర్శకునికి మనకు మధ్య వున్న సెన్సార్‌ ఏం చేస్తుంది. పూర్తిగా వినిపించేట్టూ అన్నా అనకపోయినా ఫలానా పాత్ర అనాలనుకున్న బూతు మాట ప్రేక్షకుడికి చేరిపోతున్నపుడు బీప్‌ సౌండ్‌ ఎవరి కంటి తుడుపు కోసం పెట్టినట్లు? ఫలానా మాటో, దృశ్యమో తప్పు అనుకుంటే తొలగించెయ్యాలి.కాదు కరెక్టే అనుకున్నపుడు వుంచాలి. అది ఇది కాకుండా ఈ బీప్‌ సౌండ్‌తో పని కానీచ్చి మధ్యే మార్గం ఏమిటి? దీని అర్ధం ఏటంటే సెన్సార్‌ వాళ్ళు పూరీని అడుక్కున్నారన్నమాట. ”పూరీ.. పూరీ… ఎలాగో చూడవయ్యా ! మమ్మల్ని ఇరుకున పడేయ్యక” అని. అప్పుడు దర్శకుడు వాళ్ళను కరుణించి బీప్‌ సౌండ్‌లను సజెస్ట్‌ చేసి వుంటాడన్నమాట. మరో సన్నివేశంలో హీరో మనకు కడుపులో దేవేసేట్టు మొహం పెట్టి ఇంకో మగపాత్రతో అంటాడు ”లాలూ సాబ్‌..ఐ లవ్‌ యూ…నువ్వంటే నాకు రోకు, మోజు…నేను కూడా నీకు నచ్చితే నన్ను వుంచుకో” అవి ఈ సినిమాలో అనే కాదు ఈ మధ్య కొన్ని సినిమాలో ఇద్దరు మగవాళ్ళ మధ్య శృంగారాన్ని సూచించే అదోలాంటి డైలాగులు పెట్టడం, వెటకారం చేయడం ఎక్కువైంది.’గే’ హక్కుల కార్యకర్తలు ఇటువంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది స్వలింగ సంపర్కమైనా, ద్విలింగమైనా, ఇతరుల మనోభావాలను కించ పరిచే హక్కు ఎవరికీ లేదు. సినిమాలో మరొ ముఖ్యమైన అంశం మాఫియా సమర్థన. మనిషి ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు, అలా ఎందుకు ప్రవర్తించడు అనే ఫ్రాయిడెన్‌ చర్యలు పక్కన పెడితే, మానవునిలోని హింసాత్మక ప్రవృత్తికి పైశాచికాత్వానికి అసలు సిసలు నిదర్శనం మాఫియా. ఎవరైనా మాఫియాని అటువంటి హింసాత్మక ధోరణులను సమర్ధిస్తూన్నరంటే వారిలో కూడా ఆ తరహా పైశాచికత దాగుందని అర్థం. పూరీ ”ఆ మాఫియాను లీగల్‌ చేసేస్తా ”అంటాడు మాఫియాను లీగల్‌ చేయడమంటే హింసను లీగల్‌ చేయడమే కదా. దానికి ”పరాకాష్ట గన్స్‌ డోన్డ్‌ నీడ్‌ అగ్రిమెంట్స్‌” అనే డైలాగ్‌, మాఫియా చేతిలో తుపాకీ అంటే పిచ్చివాడి చేతిలో రాయి. పిచ్చివాడికి నీతి అవినీతిల విచక్షణ లేనట్లే మాఫియాకి అవేమి వుండవు. పిచ్చి వాళ్ళ చేతుల్లో తుపాకులకు తప్పించి ఈ దేశంలో ప్రతి తుపాకికి కొన్ని అగ్రిమెంట్స్‌ వున్నాయి. అతిస్పష్టమైన అగ్రిమెంట్స్‌. పూరీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాఫియా అంటే ఒక వ్యక్తి కాదు. ఒక రంగానికి పరిమితమైనదీ కాదు. అతను తేల్చి పారేసినంత పైపైది కాదు. ఏమైనా ”మీ పోలీసులు కోర్టులు తేల్చని ఎన్నో ప్రాబ్లమ్స్‌ని బయట మాఫియా సెటిల్‌ చేస్తుంది” అని బహిరంగంగా ప్రకటించిన పూరీ సాహసానికి ముచ్చటపడి పోలీసులు, కోర్టులు అతనికి పూలదండలు వేసి సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. పూరీ జగన్నాథ్‌కి అప్పుడప్పుడు మంచి గురించి మాట్లాడాలనే ఫాన్సీ ఒకటుంది. అందుకే తన ధోరణిలో నేరాలు చేసేవాళ్ళందరు. ఆకలి వేసి తిండి లేక అవి చేస్తారని ప్రకటించారు. మరి 2జి స్కామ్‌లు, గనుల స్కాములూ నేరాలు కాదా? వాళ్లక్కూడా ఆకలేసే ఆ నేరాలన్నీ చేసారా? అదే నిజమైతే అది ఎటువంటి ఆకలి? ఆకలేసిన మనుషులందరూ నేరాలు చేయరు. కష్టం చేసుకుని పొట్ట పోసుకుంటారు. ఇది మా కర్మ అని జీవితాలను సాగించేస్తుంటారు . దర్శకుడు చెప్పినట్లు ఆకలేసిన వాళ్ళందరూ నేరాలో విప్లవాలో చేసే పనైతే ఈ మానవ ప్రపంచం ఇంకొకలాగా వుండేది. ఇదంతా ఒక ఎత్తయితే సినీ హీరో సూర్యభాయి యువతకిచ్చే సందేశం ఒక్కటి ఒక ఎత్తు. సినిమాకే మకుటాయమానం ఆ సీన్‌. హీరో స్వయంగా ”నాకేం నీతి నియామాలు లేవు. మానవత్వం లేదు” అని పలు సందర్భాల్లో ప్రకటిస్తుంటాడు. అటువంటి వాడిచేత యువతకి సందేశమిప్పిస్తాడు, దర్శకుడు , ఏమని…?జీవితమనేది ఒక యుద్దం. ”దేవుడు మనల్ని వార్‌ జోన్‌లో పాడేశాడు. ప్రొటెక్ట్‌ యువర్‌ సెల్ఫ్‌ ..నీకేదనిపిస్తే అది చెయ్‌, ఎవడిమాట వినొద్దు. మనిషి మాట అసలు వినొద్దు” అని. మానవ సమాజంలో మనిషిగా పుట్టినవాడు మనిషిమాట వినక పశువుల మాట వినాలా? పూరీ ఎవరి మాటలు విని పెరిగి పెద్దయినాడని మనం అర్థం చేసుకోవాలి? ప్రొటెెక్టు యువర్‌సెల్ఫ్‌ అని మనిషికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తన అస్తిత్వం చుట్టూనే మానవ ప్రపంచం తిరుగుతూ వుంటుంది. యువతకో మరొకరికో సందేశం ఇవ్వగలిగే స్థాయిలో వున్న వ్యక్తి బోధించాల్సింది ఉత్తమ విలువల్ని. ”ఎవరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో వాడికో నిజం ఉండొచ్చు.”కానీ, సర్వాంగీకారం పొందిన సత్యం ఒకటి వుంటుంది. చాలాసార్లు మనం ఆ ఉత్తమ విలువల్ని అనుసరించలేకపోవచ్చు కానీ, ”తా చెడ్డ కోతి మనమెల్లా చెరచినట్లు” అందరినీ చెడమని చెప్పడం సందేశం కాదు. దర్శకుడు అన్నట్టు యుద్ధం చేతకానివాళ్ళు మాత్రమే మొరాలిటీ గురించి మాట్లాడరు. అనేక ఏళ్ల నాగరికత సంస్కృతుల తర్వాత మనుషులం యుద్ధాలు వద్దనుకున్నాం. యుద్ధం ఎక్కడ ఏ రూపంలో జరిగినా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి మనిషి సంక్షేమమూ, వాడు బలహీనుడూ, అంగవికలుడూ అయినా కూడా (పూరీ లైఫ్‌లో ఏ గోలూ లేని వాళ్లు మాత్రం వీలయినంత త్వరగా చచ్చిపోండి అన్నాడు). రాజ్యానికి ముఖ్యుడే అని భావించి ఆ విధమైన హక్కులూ, బలహీనుడ్ని బలవంతుడూ, తెలివైన వాడూ జయించడాలు ఆదిమ యుగపు లక్షణాలు. పూరీ ఆలోచనలు ఆదిమ యుగంలో వున్నాయి. అతను ముందు తనను తాను ప్రక్షాళించుకొని ఆపై యువతకు సందేశమిస్తే బాగుంటుంది. పి.యస్‌. ఈ దర్శకుడు ‘పోకిరి’ అని ఒక సినిమా తీశాడు. అందులో హీరో ‘ఐపిఎస్‌’ ఆఫీసర్‌. ఒక ‘ఐపిఎస్‌’ గురించి కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తూ పోలీస్‌ అకాడమీ ఎక్కడుంటుందనే కనీసపు రీసర్చ్‌ కూడా చేయకుండా హీరో ”ట్రెయిన్డ్‌ ఇన్‌ డెహ్రాడూన్‌” అనేస్తాడు దర్శకుడు. ఇతనిది అంత గొప్ప తెలివి. ఇతని సినిమా చూసి ఎవడ్నో ఒకర్ని ఎన్‌కౌంటర్‌ చెయ్యాల్సిందేనని, ఎన్‌కౌంటర్‌ చేసిన ఒక ‘ఐపియస్‌’. ఆఫీసర్‌ ప్రస్తుతం జైళ్ళో వున్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఇటువంటి అజ్ఞానపు పూరీ మాటలు వింటే యువతకు జైలే గతి. కనుక యువతా తస్మాత్‌ జాగ్రత్త!! (బిళీబిగిబి.లీజిళివీరీచీళిశి.బీళిళీ)

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.